ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పరీక్షాపూర్వదినములు
తయుఁ జేయకమునుపే, జీవిత ప్రథమ సోపానముననే, నాదేహము వ్యాధిపా లగుచున్నది ! నా విధికృత్యములు నెరవేర్పఁబూనినచో, ఈ దుర్బలశరీరము తుత్తునియ లైపోవునేమో గదా ! పరిశుద్ధవర్తనము వీడకుండ జరుపుకొనునటుల నా కనుగ్రహింపుము !"
26. పరీక్షాపూర్వదినములు
1900 అక్టోబరునెలలో ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోవువారిని నిర్ణయించుటకు జరిగిన కళాశాలాపరీక్షలో, ఇంగ్లీషులో నేను బాగుగ వ్రాసినను, లెక్కలలో గుణములు నాకు కనీస మైనను రా లేదు. బజులుల్లాసాహేబు నాకంటెను తగ్గియుండెను. గణితమున తరగతిలో మే మిరువురము నధమాధములము ! అయినను క్రిందటి సంవత్సరపు పరీక్షలో నాతఁడు నేనును తరగతిలో క్రమముగ ప్రథమ ద్వితీయస్థానములం దుండుటచేతను, ఇప్పటిపరీక్షలోఁ దక్కిన యన్ని పాఠములందు మేము సరిగా నుండుటచేతను, మమ్ముఁగూడ పరీక్ష కంపిరి. అప్పటినుండియు నేను మఱింత శ్రద్ధతోఁ జదువుచుంటిని. నా నిత్యకార్యక్రమము వెనుకటివలెనే జరుగుచుండెను. వ్యాయామము, ప్రాత:స్నానము, ప్రార్థనము, మిత్రులతోడి గోష్ఠి - ఇవి కొన్నిమార్పులతో నిపుడును నా దినచర్యలోని యంతర్భాగములే. పరీక్ష సమీపించినకొలఁది చదువునకు ప్రాముఖ్య మిచ్చితిని.
కాని, నా శరీరారోగ్యము అసంతృప్తికరముగనే యుండెను. నే నెంత జాగ్రత్తతో నుండినను, అనుదినము నేదోబాధ వచ్చి మూలుగుచుందును. తలనొప్పి, నీరసము, అత్యుష్ణము, పైత్యప్రకోపము, మున్నగు బాధలు నాకు సన్నిహితబంధువులె ! వీని పీడఁ బడుచుండు నేనాకాలమున నెట్లు చదువు సాగించికొనుచు, సభల కేగుచు, మిత్రులతో సంభాషణలు సలుపుచునుంటినో యని నా కాశ్చర్యము గలుగుచున్నది !
ఒకానొకనాఁడు ఆత్మపరిశోధనసమయమున నే నిట్లు తలపోసితిని : -
"పరాత్పరా ! సాహసమున ని న్నీరీతిని సంప్రశ్నించుచున్నందుకు నన్ను మన్నింపుము. ఇంత దుర్బలశరీరముతో పాటు నా కిట్టి యున్నతాశయము లిచ్చుటయందు నీయుద్దేశ మేమి? ఈశరీర మనతి కాలములోనే కృశించి నశించిపోవనున్నది. ప్రబలమేధాశక్తికిఁ గాకున్న నపార పరోపకార చింతనమునకుఁ దావలమగు నామనస్సు, దుర్బలశరీరమున కిట్లు బంధింపఁబడి యేమిచేయఁగలదు ? పాపమను పెనురక్కసిచే నావహింపఁబడిన యీహృదయమున కేల యిట్టి పరహితైకబుద్ధియు పరార్థప్రాపకత్వమును ? అకాలమరణమే నీ వాసన్నము చేయ నుద్యమించినచో, వెనువెంటనే నా కది ప్రసాదింపక, జా గేల చెసెదవు?"
ఆసమయమున వీరేశలింగముగారికిని ఏలూరి లక్ష్మీనరసింహము గారికిని జరిగెడి యభియోగముల విచారణ మగుచుండెను. విద్యార్థులమగు మేము తీఱిక సమయములం దావివాదవిషయములు వినుటకు న్యాయసభల కేగుచుండెడివారము. మాలోఁ గొందఱు వాదిపక్షమును, కొందఱు ప్రతివాదిపక్షమును గైకొనుచుండువారు !
13 వ అక్టోబరున గంగరాజు నేనును షికారుపోయి సంస్కారములనుగుఱించి మాటాడుకొంటిమి. తన భవిష్యత్తునుగుఱించి చెప్పుచు నతఁడు, విద్యాపరిపూర్తి యైనపిమ్మట తాను న్యాయవాదియై, దురాచారములు నిరసించి, సంస్కరణపక్ష మవలంబించి, సత్యమతమును జేకొందు నని చెప్పెను. నాసంగతియు నేను బ్రస్తావించితిని - సంస్కరణోద్యమవిజయమునకై నేను జీవితము ధారవోయ నిశ్చయించితి ననియు, నాతో మనసుగలసి పనిచేసెడి నెయ్యునికొఱకు నేను వెదకుచుంటి ననియుఁ జెప్పితిని. అంత, గంగరాజు తను నట్టిచెలికానిగా నేను జేకొనవచ్చు ననియు, వలసినచో నాకుఁ దాను ధనసాహాయ్యమును జేయుచుందు ననియు నుడివెను. తాను బోషింపవలసిన సోదరాదు లెందఱో యున్నను, తాను జేపట్టిన యుద్యమమునకు సంపూర్ణ విజయము చేకూర్చితీరెద నని వక్కాణించెను. నామీఁద గంగరాజునకుఁ గల యనురాగమునకు నా కృతజ్ఞతను దెలిపి, రాఁబోవు వత్సరమున నేను వేఱింటికాఁపురము పెట్టినప్పుడు, నాకు సాయము చేయు వా రొకరైన నుండుటకు సంతసించితిని.
ఆమఱునాఁడు నేను కాంతయ్య కొండయ్యశాస్త్రి లక్ష్మీనారాయణగార్లును గలసి ముచ్చటించుకొనుచు, షికారుపోయితిమి. కాంతయ్యగారు వేదాంతోన్మాదమునకు లోనై నట్లు గానవచ్చెను ! శాస్త్రి లక్ష్మీనారాయణగార్లు మిత్రుఁడు వచించినదాని కెల్ల తాళము వైచుచు, యోగమహిమను గూర్చి తమసుముఖత్వమును దెలిపిరి ! ఆరాత్రి నే నిట్లు తలపోసితిని : - "నా మిత్రులజీవితమువలన మానవహృదయముయొక్క దౌర్బల్యచౌంచల్యములు నే నొకింత గ్రహించితిని. కొమ్మనుండి కొమ్మ కెగురుపక్షివలె నా హృదయము మతము నుండి మతమునకు గంతు లిడకుండును గాక ! నేను నిరతము ఆస్తిక బుద్ధి గలిగి, మానవసేవాతత్పరుఁడనై, వలసినచో నాయాశయములకై యసువుల నర్పింతును గాక !"
22 వ తేదీని వెంకటరావు కుటుంబముతోఁ గాఁపుర ముండుటకు రాజమంద్రి వచ్చెను. మఱునాఁడు రాజమంద్రి పురమందిరప్రవేశ మహోత్సవము జరిగెను. ప్రాత:కాలమున ప్రార్థన జరిగెను. "ప్రార్థనయొక్క యావశ్యకత"ను గుఱించి వీరేశలింగముగారు మంచియుపన్యాసము చేసిరి. సాయంకాలము బహిరంగసభ జరిగెను. పరీక్షాధికారి నాగోజీరావు పంతులుగారు అధ్యక్షత వహించి, సద్భావమున పౌరుల యుపయోగార్ధమై కట్టించిన మందిరమునకు పంతులనభినందించిరి. యం. రంగాచార్యులవారు ఉపన్యాసము చేయుచు, వీరేశలింగముగారు చేసినభాషాసేవ నుగ్గడించుచు, ఆమహామహుఁడు జనుల నైతిక సాంఘిక పరిస్థితులయభ్యున్నతికొఱకై పరోపకారబుద్ధితోఁ గావించిన సత్కార్యముల నాయన ప్రశంసించెను. వాసుదేవశాస్త్రి గారి పద్యము లైనపిమ్మట కాల్పఁబడిన బాణసంచావెలుఁగున నూతన మందిరము సౌందర్యమునఁ జెలువారుచుండెను.
ఆరాత్రి నిద్రపోవుటకు ముందుగ, వీరేశలింగముగారికి కుడి బుజమై నిలిచి, త్యాగబుద్ధితోఁ గార్యసాధనము చేయు పాపయ్యగారినిగుఱించి నే నిట్లు తలపోసితిని : - "ఈపురుషుఁ డెట్టిసహృదయుఁడు, సచ్చారిత్రుఁడు ! తా నెపుడును వెనుకనే నిలిచి యుండఁ గోరెడి యీయన వినమ్రత యెంత శ్లాఘనీయము ! ఈయనకు నాకు నెంత యంతరము గలదు ! మహాగర్వి నైననే నీసత్పురుషుని గోటి నైనను పోలఁగలనా ?"
30 వ తేదీని వీథులలో నొక వింతసాటింపు వింటిని. దొండపూడికి వేలకొలది ప్రజలు వచ్చుచుండుటచేత అక్కడ విశూచి యంకురించె ననియు, జనులు రావల దనియు సర్కారువారు సాటింపు చేయించిరి. ఆగ్రామములో నొకవైద్యునిపే రీమధ్య పైకి వచ్చెను. ఆతఁడు జనుల రోగములను సులభముగ నివారణ చేయుచుండెనని ప్రతీతి గలిగెను. అందువలన నచటికి తండోప తండములుగ రోగులు వచ్చుచుండిరి. రోగి నొకచోట స్నానము చేయించి, "నీ రోగనివారణ మైనది, పో ! ఇది దేవునియాజ్ఞ !" అని వైద్యుఁడు పలుకుచుండునఁట! దీనినిగుఱించి జనులలోఁ గొంత చర్చ జరిగెను.
ఈ వైద్యరహస్యము నా కపుడు తెలిసినది. ఆగ్రామమందలి చెఱువునీటిలో లోహద్రవ్యములు గలసియున్నవి. దీనివలననే జనుల కుపశమనము గలుగు చున్నది గాని, వైద్యునిమహిమమునఁ గాదు! మాతండ్రికిఁగూడ దొండపూడివైద్యుని మహాత్మ్యమును గుఱించి నమ్మకము లేదు.
మఱునాఁడు కాంతయ్యగారితో నేను వాదమునకు డీకొంటిని. అనర్థదాయకమగు దురాచారముల నైన నీయన యిపుడు బాహాటముగ సమర్థించుచుండెను ! వేశ్యజాతివలన హిందూసంఘమునకుఁ గలుగులాభము లీయన పేర్కొనఁజొచ్చెను ! ఇపు డీయన విగ్రహారాధనాతత్పరుఁ డయ్యెను ! అయ్యో, యీతఁడు నేర్చిన తర్కవేదాంతములపర్యవసాన మిదియేనా?
దారిద్ర్యదేవత తాండవ మాడెడి మా సంసార పరిస్థితులఁ దలపోసి, 3 వ నవంబరున నే నిట్లు వెతనొందితిని : - "ఓ దారిద్ర్యమా ! నా బోటియువకులు నిర్మించెడి యాకాశహర్మ్యములను నీ వెట్లు గాల్చి వేయుచున్నావు ! ఉన్నతోద్యమములకును ఉదార భావములకును నీవు ప్రబలవిరోధివి. మాగృహమునుండి ని న్నెటులు తఱిమివేయఁ గలను ? నీ విచట నివాస మేర్పఱుచుకొని, నా విశాలాశయముల యసువులఁ దీసివైచుచున్నావు ! నీప్రేరణకు లోఁబడి, ప్రేమాస్పదమైన యాదర్శములను త్యజింపనా ? నా సౌశీల్యమును నీకు ధారవోసి నా నియమానుసారజీవితమును నీకొఱకు నీటఁగలుపనా ? నే నట్లు చేయను. సర్వసమర్థుఁడును, దయాసముద్రుఁడును నగు దేవదేవుఁడె నాకు శరణ్యము !"
కొలఁదిదినములలో కలకత్తాలోని "సాధారణ బ్రాహ్మసమాజ" ప్రచారకుఁడగు పండిత శివనాథశాస్త్రి యిచ్చటికి రానున్నాఁ డని మా కిపుడు తెలిసెను. ఆరాత్రి నే నింట మాటాడుచు, వీరినిగుఱించి ప్రస్తావించితిని. బ్రాహ్మమతమునుగుఱించి మావాళ్లతో నేను బ్రసంగించితిని. అపుడు మానాయనయు, పెద్దతమ్ముఁడును నన్ను ముట్టడించిరి. "హిందూమతము ఈశ్వరు నొప్పుచుండఁగా, నీ కేల దూరపు బ్రాహ్మమతము గతి యయ్యె ?" నని మాతండ్రి న న్నెత్తిపొడిచెను. ప్రసంగవశమున మాతమ్ముఁడు నాస్తికతను సమర్థించెను ! అలయుచు డయ్యుచు నే నంత నాపక్షమును నిలువఁబెట్టుకొనఁ బ్రయత్నించితిని.
ఆరాత్రి నాప్రార్థనమం దిటు లుండెను : - "ఓ భగవంతుఁడా ! నీ పుత్రకు లెంతటి మూఢత్వమున మునిఁగియున్నారు ! నీభక్తు లెట్లు బద్ధజిహ్వులై వారిమధ్య మసలుచున్నారు ! మతమునకు మానవహృదయమునకు సంబంధము లే దనియు, వర్ణ భేదముల పట్టింపులు, వట్టి బాహ్యపటాటోపములును మాత్రమే మతసార మనియు వా రనుకొనుచున్నారు ! నీ సత్యస్వభావము వా రెప్పటికి గుర్తెఱుఁగఁ గలరు ?"
11 వ నవంబరున నలుగురు స్నేహితులమును షికారుపోయితిమి. మాసంభాషణమునందు, కాంతయ్య లక్ష్మీనారాయణ కొండయ్యశాస్త్రిగార్లు మువ్వురును దివ్యజ్ఞానవిశ్వాసకు లని నా కీనాఁడు స్పష్టపడినది ! కావుననే వా రెపుడును మతో న్మాదమూఢాచారము లను సమర్థించుచు, సంఘసంస్కరణవిముఖు లైయున్నారు. ఇట్టి యసభ్యస్నేహితులసహవాసమున నాయుత్తమాదర్శములు రిత్తవోవునని నేను వెతనొందితిని. !
15 వ తేదీని ఉదయమున పండితశివనాధశాస్త్రిగారు రాజమంద్రి వచ్చిరి. ప్రార్థనసామాజికులము వారికి సుస్వాగత మిచ్చితిమి. ఆయన సాధురూపము మృదువచనములు మాహృదయములనుఁ జూర గొనెను. ఆసాయంకాలమున పండితుఁడు పురమందిరమున "నూతన భారతదేశము, అందలి నూత నాశయములు" అనువిషయమునుగుఱించి యుపన్యాసము చేసెను. వారిప్రసంగమున నవీనభావములు వెల్లివిఱిసి ప్రవహించెను. భావోద్రేకమున నాకును గంగరాజునకు నాతరుణమున చక్షువులనుండి బాష్పజలము స్రవంతియై పాఱెను. సభానంతరమున గంగరాజు నన్నుఁ గౌఁగిలించుకొని, తన యభిప్రాయభేదములను నీటఁగలిపి కార్యసాధనము నాతోఁ గలసివచ్చెదనని చెప్పివేసెను ; మే మిరువురము నానందపరవశుల మైతిమి.
మఱునాఁడు కొందఱు స్నేహితులము శివనాథపండితుని సందర్శించి, పెక్కువిషయములను గుఱించి యాయనతో సంభాషించితిమి. ఆసాయంకాలము బ్రాహ్మసమాజవిధులను గుఱించి శాస్త్రిగా రుపన్యసించిరి. పురమందిర మానాఁడు ప్రేక్షకులతోఁ గిటకిటమను చుండెను. శివనాథపండితుని యుపన్యాస మతితీవ్రముగను చిత్తాకర్షకముగను నుండెను. అప్పుడు ముత్తుస్వామిశాస్త్రి భావోద్రేకపూరితుఁడై పండితునికిఁ బ్రణమిల్లి, తా నీమాఱు బ్రాహ్మమత మవలంబించితి నని చెప్పివేసెను ! నే నింటికి రాఁగానే తండ్రియుఁ దమ్ముఁడును నాతో వాదమునకు దిగి, శివనాధపండితుఁడు వట్టి జడుఁ డనియు మూర్ఖుఁ డనియును బలికి, నా కమిత హృదయవేదనమును గలిగించిరి.
17 వ తేదీని, ప్రాత:స్నానానంతరమున నేను కనకరాజు గంగరాజుగార్లతోఁ గూడి, వీరేశలింగముగారి యింటికి వెళ్లి, వారి మేడగదిలో నున్న శివనాధశాస్త్రిగారిని సందర్శించితిని. సంస్కరణముల ననుష్ఠానమునఁ బెట్టువిషయమున మే మాయన యాలోచన యడిగితిమి. శాస్త్రిగారు తన జీవితమును గుఱించి ప్రస్తావించిరి. దృఢసంకల్పుఁడగు తండ్రివలన తనకుఁ గలిగినయిక్కట్లు, విద్యార్థిదశ యందె తన యుపదేశానుసారముగ నొకవితంతువును బరిణయ మాడిన స్నేహితునికష్టములు, ఆతనికిఁ దోడ్పడుటయందుఁ దాను జూపిన స్వార్థత్యాగము, ప్రథమశాస్త్ర పరీక్షాదినము లందలి తన యధిక పరిశ్రమము, తన యుద్యమవిజయము, ఈశ్వరవిశ్వాసము, మున్నగు స్వవిషయములను శాస్త్రిగారు మాకుఁ బూసగ్రుచ్చినట్లు వినిపించిరి. అంత మాకోరికమీఁదఁ గొన్ని సదుపదేశము లాయన మాకుఁ జేసిరి.
ఆయన సెలవు గైకొని మే మిండ్లకు వెడలిపోయితిమి. అందఱము నమితానంద పరవశుల మైతిమి. నా జీవితమునం దెపుడు నింత సంతోష మనుభవింపలేదని నే ననుకొంటిని. నాగురువు, ప్రవక్త, మార్గదర్శియు శివనాథమహాశయుఁడే యని నేను విశ్వసించితిని. ఇంతకంటె నాకుఁ గావలసినయానంద మేది, భాగ్యవి శేష మేమి ?
అమితభావోద్రేకమున నాఁ డంతయు నే నేదో విచిత్రలోకమున నుండునట్లు తోఁచెను. శివనాథుని సుస్వరూపము నాకనుల యెదుట నృత్యము సలుపుచుండెను ! ఇట్టి మహాత్మునికిఁగల శీల సంపద, దైవభక్తియు నే నెపు డైన ననుభవింతునా ? ఈయనవలె నీశ్వరసంసేవనార్థమై ప్రచారము సలుపుటకు నోఁచుకొందునా యని నన్ను నే సంప్రశ్నించుకొంటిని.
27. పరీక్షలు
23 వ తేదీని వెంకటరావు వ్యాధిగ్రస్తుఁ డయ్యె నని విని యాతనిఁ జూచుటకుఁ బోయితిని. ఆతఁ డిపుడు పడకనుండి లేవనే లేఁడు ? తీవ్ర ధాతుదౌర్బల్యమునఁ బడిపోయియుండెను. ఒక గొప్ప మహమ్మదీయవైద్యుఁడు మం దిచ్చుచుండెను. వ్యాధి నెమ్మదిపడు ననెడి యాశ లేకున్నను శక్తివంచన లేక తాను మం దిచ్చెద ననియు, రోగి దైవముమీఁదనే భారము వేయవలె ననియు, వైద్యుని యభిప్రాయ మని, నామిత్రుఁడు హీనస్వరమునఁ బలికెను. దైవమును నమ్ముకొనినయెడల, అతనికి రోగనివారణ మగు నని దైర్యము చెప్పితిని. కాని, తా నిపుడు సేవించు మందువలెనే నా మాటలును, నెగటు కాఁగా, వెంకటరావు : - "మిత్రుఁడా, న న్నీ సంగతిలో బాధింపకండి. దేవుఁడు గీవుఁడు అనెడి అసత్యానగత్య విషయములన్ని బైటనే పెట్టి, మరీ గదిలోకి రం డని వేడుకుంటున్నాను. నిజమైన యే యిహలోకవిషయమును గురించి యైన నాతో మాటాడ రాదా ? దైవమునుగురించి అప్రస్తుతప్రశంస చేసి, నా మనశ్శాంతికి భంగము కలిగింప వద్దని, నీకు, నీ దైవమునకు నమస్కారాలు చేస్తాను !" అని చెప్పివేసెను.
ఇంతకంటె విషాదకర మైనసంగతి యేది ? ఐనను, మన మేమియుఁ జేయలేని యిట్టివిషయములోనుపేక్షయే యుత్తమముగదా.