ఆత్మచరిత్రము/చతుర్థభాగము : విశ్రాంతిదశ/నూతనపరిస్థితులు
కళాశాల విడిచిన కొన్ని నెలలకు నాకచటినుండి సుమారు 1300 రూపాయిల యుపకారవేతన మీయఁబడెను. రెండుసంవత్సరముల క్రిందటనే "రక్షకనిధి" యాకళాశాలలో నేర్పడుట నాకింత చిన్నమొత్తము లభించుటకు గారణ మయ్యెను.
కొంతకాలమునుండి నాకనులు జబ్బుగ నుండెను. ఎన్ని సారులు సులోచనములు మార్చుకొనినను, నాకు లాభము గలుగ కుండెను. 1929 వ సం. డిశెంబరు తుది దినములలో నేను చెన్నపురి పోయి, వైద్యాధికారి ముత్తయ్యగారికిఁ గనులు చూపించితిని. కనులలో పొరలు పెరుగుచుండె నని యాయన చెప్పి, క్రొత్త సులోచనుము లిచ్చెను.
2. నూతనపరిస్థితులు
మా పెద్దమేనత్త భద్రమ్మగారి మనుమఁడును, మాతమ్ముఁడు వెంకటరామయ్య బావమఱఁదియు, మాకాబాల్యస్నేహితుఁ డును నగు మంత్రిరావు వెంకటరత్నమున కారోగ్యము చెడె నని తెలిసి, నేను 1929 వ సంవత్సరప్రారంభమున భీమవరము వెళ్లి, అచటినుండి తణుకు పోయితిని. మాతమ్ముఁడచటనే కొన్నిదినముల నుండి రోగిని గనిపెట్టుకొని యుండెను. ఆఫిబ్రవరినెలలోనె వెంకటరత్నము చనిపోయెను. పాప మతఁడు తనతోడియల్లుని కుమారుని దత్తత చేసికొని యొక సంవత్సరమైనఁ గాలేదు. మంచిభూవసతియు, ధన గృహాదులును గలవాఁ డయ్యును, వీని ననుభవింపక, నడివయస్సుననె యాతఁడు మృత్యువు వాతఁబడెను ! రాజమంద్రి బోధనాభ్యసనకళాశాల ప్రాఁత విద్యార్థుల సమావేశసమయమున నేనధ్యక్షత వహించితిని. ఆ యేప్రిలు నెలలో వియ్యమ్మగారి భూములవిషయమై మే మిదివఱకు వేసిన వ్యాజ్యెము నరసాపుర న్యాయస్థానమున మా పక్షమయ్యెను. అంతట న్యాయాధిపతి తీర్పునుబట్టి, యా వేసఁగిని రేలంగి వరిహేడుభూములు మేము స్వాధీనపఱుచుకొని, క్రొత్తకవుళ్లికిచ్చితిమి. మాచిన్న నాఁడు మాయనుభవమునుండి తొలఁగిపోయిన భూములు మరల నర్ధశతాబ్దము పిమ్మట నిపుడు మావశమయ్యెను !
29 వ సంవత్సరము వేసంగిని మేము భీమవరములో మా క్రొత్తయింట నివసించితిమి. నా భార్యయు నాచెల్లెలు నంతట గుంటూరు పోయిరి. నేను పొలములపని చూచుకొనుచు భీమవరములోనె యుంటిని. భీమవరముప్రాంతముల భూములకు తఱచుగ పాటిమట్టివేయవలసియుండుటచేత నప్పుడు చాలధనము వెచ్చించి, నేను పాటిపెరడు నొకటి యాగ్రామమునఁ గొంటిని. వేసవి తుదిని నేను మరల గుంటూరువచ్చితిని. ఇంటి మరమ్మతులు చేయించుకొనుచును, విశ్వవిద్యాలయపరీక్షా కార్యములు చేసికొనుచును, నేను కాలముగడిపితిని. తీఱికసమయముల నేను చిన్నకథలు వ్రాయుచుంటిని. మా గుంటూరు గృహమునకు ముందు చప్టానొకటి కట్టించితిని. దీనివలన మాయింటి విరివి, సౌందర్యమును హెచ్చెను. పాదులు మొలకలును బెట్టుటచేత, పెరడు దర్శనీయముగ నుండెను. ఇంటి ముందరిబాట మరమ్మతు చేయించి, దాని కిరు కెలంకులను ముండ్లతీగలు వేయించుటచేత, పశువులు ప్రవేశించుటకుఁ గొంత యాటంకము కలిగెను.
1929 వ సంవత్సరము డిశంబరు నెలలో మా పెదతండ్రి కుమారుఁడు వీరభద్రుని మూఁడవకుమారుఁడు గంగన్న పెండ్లికై యేలూరు వెళ్లితిమి. అచటినుండి మేము వెలిచేరువెళ్లి, మా బావమఱఁది రెండవకుమారుఁడు బుచ్చిరామయ్య వివాహమునకు పడవమీఁద ఆలమూరు వెళ్లితిమి. పెండ్లి లగ్నసమయమునందె యజీర్ణ ప్రకోపముచేత తలతిరిగి నేను క్రిందఁబడిపోయితిని ! ఐన నొక నిముసమునకే నాకు స్పృహవచ్చెను. ఆపెండ్లిలో కొందఱు ప్రాఁత నేస్తుల దర్శనము నాకు సంప్రాప్త మయ్యెను.
1930 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నాకు నెల్లూరు కళాశాలాధ్యక్షులగు శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారినుండి యాహ్వానము వచ్చెను. ఆకళాశాలా విద్యార్థి సంఘమువారి వార్షికసభకు నేనధ్యక్షత వహించితిని. నెల్లూరులోని మిత్రులను తోడి యుపాధ్యాయులను జూచి సంతోషమందితిని.
ఈ సంవత్సరము మార్చిలో మాచెల్లెలి కుమారుఁడు జనార్దనమునకు మాతమ్ముఁడు కృష్ణమూర్తి నాలుగవకొమార్తె మాణిక్యాంబ నిచ్చిపెండ్లిచేసిరి. ఆ సమయముననే కృష్ణమూర్తికుమారుఁడు బాలసూర్యునికి నుపనయనముకూడ జరిగెను.
12 వ యేప్రిలు తేదీని కొల్లూరులో పాఠశాలావిద్యార్థి సంఘమువారి వార్షిక సభకు నన్నగ్రాసనాధిపతిగఁ గోరిరి. విద్యాబోధకుల ముఖ్యవిధులను గుఱించి నేనా సమయమునఁ బ్రసంగించితిని.
శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు గారితో మాటాడుచు, నే నొక మాసపత్రిక ప్రకటింప నుద్దేశించుకొంటినని చెప్పఁగా అట్లు చేయుటకంటె, తమపత్రికలగు భారతి ఆంధ్రపత్రికలలో నే నెన్ని కథావ్యాసములనైన వ్రాయవచ్చునని వారు పలికిరి. అందువలన నే నప్పటినుండి కొన్ని నెలలు ఆంధ్రపత్రికకుఁ గథలు వ్రాయుచువచ్చితిని. 1930. ఎడమనుండి కుడివైపునకు: 1 పంక్తి. రాయసం సుబ్బారాయడు, నరసింహము,
వెంకటశివుడు, వెంకటరామయ్య, మేనల్లుడు రామునితో సూర్యనారాయణ.
2 పంక్తి. లక్ష్మీకాంతము, రత్నమాల వెంకటశివుడులతో సూర్యకాంతము, కనకమ్మ, సీతమ్మ, మాలతి.
ఆ వేసవి ప్రారంభము నుండియె, మరల దేశమున 'సహాయ నిరాకరణోద్యమము' ప్రారంభ మయ్యెను. గాంధీమహాత్ముఁడు దండి యాత్రకు వెళ్లి, 'లవణ సత్యాగ్రహము' నకు దిగుటయె తడవుగా, దేశమందలి ప్రముఖులు మరల కారాగార బంధితులుకాఁ జొచ్చిరి. ముఖ్యపట్టణములలో "శాంతిసైన్యముల" శిబిరము వెలసెను. 29 వ ఏప్రిలున మిత్రులు శ్రీ కొండ వెంకటప్పయ్యగారు రక్షకశాఖవారిచే అమ్మనబ్రోలు గొనిపోఁబడిరి. నేను వెంటనే వారి యల్లునితోఁ గలసి రెయిలెక్కి యాగ్రామమేగి, న్యాయసభలోనికిఁ బోయితిని. అపుడె న్యాయాధికారి వెంకటప్పయ్యగారికొక వత్సరము కఠినశిక్ష నొసఁగిరి. ఒకటి రెండు గంటలు వెంకటప్పయ్యగారితో నేను మాటాడి, గుంటూరు వెడలివచ్చితిని. ఆంధ్రప్రముఖులు శ్రీయుతులు టంగుటూరి ప్రకాశము, నాగేశ్వరరావు, సీతారామశాస్త్రిగార్లు మున్నగువారు సంతోషమునఁ గారాగారముల కేగిరి. మా చెల్లెలు కనకమ్మ నరసాపురములోను, మఱఁదలు శ్యామలాంబ ఏలూరులోను, సత్యాగ్రహసంస్థలో తీవ్రముగఁ బనిచేసిరి. ఆవేసవిలో నేను భీమవరములో నుంటిని. నాభార్య బెంగుళూరున కేగెను.
1930 వేసవిలో మాతమ్ముని కుమాళ్లు ముగ్గురు నపుడు ప్రబలియుండు సత్యాగ్రహమున దిగవలెనని మిక్కిలి ప్రయత్నించిరి. సూర్యనారాయణ భీమవరమునందలి యైచ్ఛికసైనికదళమునకుఁ గొన్ని దినములు కవాదుచెప్పెను. నేనును వెంకటరామయ్యయును వీండ్రను, మాచెల్లెలిని, సత్యాగ్రహముతో జోక్యము కలిగించుకొనవలదని హెచ్చరించితిమి. మా మేనల్లుని పెండ్లినిగుఱించి మా చెల్లెలుచేసిన యప్పు నేనిపుడు తీర్చి వేసితిని. ఇంతలో ధాన్యపుధర యాకస్మికముగ తగ్గిపోవుటచేత, ఆర్థికకష్టములకులో నగు నేను, అనుకొనినట్టుగ వెంటనే మాచెల్లెలి కింకను ధనసాహాయ్యముఁ జేయ లేక పోయితిని.
1930 వేసవి చివరను సూర్యనారాయణయు నేనును మాయత్తవారియూరగు వెలిచేరు పయనమయితిమి. మా మేనమామ వెంకయ్యగా రాక్రిందటిదినమె వేలివెన్నులో నాకస్మికమరణము నొంది రని దారిలో నిడదవోలులో మాకు దు:ఖవార్త తెలియుటచేత, మే మపుడు వేలివెన్నువెళ్లితిమి. మా మేనమామ చిన్న నాఁటి నుండి మా సోదరుల నెంతోప్రేమతోఁజూచి, మా విద్యాభివృద్ధికిఁ దోడుపడిరి. చాలకాలము జీవించి, యిపుడనాయాసమరణమునొందిన వెంకయ్యగారు ధన్యజీవితుఁడు. రెండునెలలక్రిందటనె యీయన తన రెండవకుమారునికి వివాహముచేసిరి. నాయాలోచన ననుసరించి యాయన పెద్దకుమారుఁడు రాజమంద్రిలో రెండుసంవత్సరములు బోధనాభ్యసనము చేసి, యిటీవలనె విద్యాబోధకుఁ డయ్యెను.
మేమంత వెలిచేరు నడిచి వెళ్లితిమి. మాబావమఱఁది కుటుంబమువారినందఱినిజూచి, సూర్యనారాయణునిభార్య మాలతిని మావెంటఁబెట్టుకొని, రాజమంద్రిమీఁదుగ మేము భీమవరము చేరితిమి.
నేను మరల జులై నెలలో గుంటూరు వెడలిపోయితిని. నాభార్య యీ లోపుగ బెంగుళూరునుండి వచ్చెను. ఉన్నవ దంపతులు సత్యాగ్రహమునఁ బాల్గొని కారాగారమున కేగుటచేత, వారుజరుపు "శారదనికేతన" పాలకవర్గములో నే నొకఁడనయితిని. కాని, వారివలె మే మెవరమును పనిచేయఁ జాలకుంటిమి. సెప్టెంబరులో నేనును "శారదానికేతన" పరిపాలకులలో నింకొకరగు మంత్రిప్రెగడ సాంబశివరావు గారును చందాలకై నూజివీడు వెళ్లితిమి. అచ్చటి శ్రీ వల్లూరు రాజాగారు కొంత ధనసాహాయ్యము చేయుదుమని చెప్పిరి. నాప్రాఁత నేస్తులగు మరగంటి కృష్ణమయ్యంగారి యింట మేము బసచేసితిమి. బాల్యస్నేహితులు మద్దిరాల రామారావు గారిని గూడఁ జూచితిమి.
వయోవృద్ధులగు మా పెద్దమేనమామ సుబ్బయ్యగారిని జూచుటకై నేనంత ఏలూరు వెళ్లితిని. తొంబది సంవత్సరముల ప్రాయము గల యాయనను కనులు పొరలు తీయించు కొమ్మని నేను ప్రోత్సహించినందుకు మా మేనత్త నవ్వెను. అంత నొక నెలలోనే యాయన చనిపోయెను. ఆయన కర్మాంతరములకు నేను వెంకటరామయ్యయును ఏలూరు పోయివచ్చితిమి. మా మేనమామలలో సుబ్బయ్యగా రతిశాంతచిత్తులు; ఎంతో యోరిమిగల వారు. ముప్పది సంవత్సరముల వయస్సుననుండునపు డీయన కొకపసిబాలిక నిచ్చి పెండ్లిచేసిరి. శాంతస్వభావమునకును, ఋజువర్తనమునకును ఈయన తార్కాణమని చెప్పవచ్చును. సంతతి విషయమునఁగూడ నీయన మిక్కిలి యదృష్టవంతుఁడు. వీరికి నలుగురు కుమాళ్లును, ముగ్గురు కొమార్తెలును. అందఱును బుద్ధిమంతులు.
ఈ సంవత్సరము అక్టోబరులో మా తమ్ముని కుమారుఁడు నరసింహము బి. యలు. పరీక్షనిచ్చి, చెన్నపురినుండివచ్చి, సతీసుతులతో గుంటూరులో మాయింటఁ గొన్ని రోజులుండి, మా కానందము గలిగించెను. ఆతనిపిల్లవానిని నాపేరుతోనే బిలుచుచుండిరి. వానికి మాతమ్ముని దగ్గఱ వలెనే నాయొద్దను మిక్కిలి చనవు కుదిరెను. వానికి భయము చెప్పుటకై నేను 'బూచి' వానిని బిలిచినపుడు బూచివాని కిచ్చివేసెదనని నన్నే వాఁడు బెదరించుచుండెను !
నరసింహము గుంటూరున నుండుదినములలో నేను నా ప్రాఁత దినచర్యపుస్తకములు తిరుగవేయఁజొచ్చితిని. జీర్ణమైపోవుచుండెడి యాపుస్తకములలోని ముఖ్యాంశములు కొన్ని యొక కాకితమున లిఖియించితిని. నా కళాశాలావిద్యాభ్యాసకాలమున వీరేశలింగము పంతులుగారితో ముఖ్యముగ నేను బ్రొద్దుపుచ్చుచుండుటచేత, ఆ కాలపు దినచర్య పుస్తకములు పంతులుగారిని గూర్చిన సంగతులతో నిండియుండెను. నేనేల యీ సందర్భమున వీరేశలింగముగారి సంగ్రహచరిత్రము వ్రాయఁగూడ దని ప్రశ్నించుకొంటిని. వారిచరిత్ర రచనమునకుఁ గడంగు మని నరసింహము నన్నఁ బ్రోత్సహపఱిచెను.
అది కారణముగ నేను పట్టుదలతో పంతులుగారి చరిత్రము వ్రాయఁజొచ్చితిని. పంతులుగారు నాకు వ్రాసినజాబులు, మేమిరువురమును గలసి ప్రచురించిన 'సత్యసంవర్థని', 'జనానాపత్రిక' ల వెనుకటి సంపుటములును నాయొద్దఁ గలవు. "వీరేశలింగసంస్మృతి" నే నంత వ్రాయఁ దొడంగితిని.
ఇంతలో నపుడె కారాగార విముక్తులయిన శ్రీ నాగేశ్వరరావుగారిని నేను బెజవాడ పోయి యొకనాఁడు చూచి, ప్రసంగ సందర్భమున, నేను వ్రాయుచుండు "వీరేశలింగసస్మృతి"ని వారి "భారతీ" పత్రికాముఖమున మాసమాసమును బ్రకటింతురా యని యడిగితిని. వేఱె పుస్తకరూపముననే దానిని బ్రకటింతు మని వారు ప్రత్యుత్తర మిచ్చిరి. అందువలన వేవేగముగ నాపుస్తకమును వ్రాయఁ బూనితిని. 3. అకాలమరణము
మా తమ్ముఁడు వెంకటరామయ్య కుమాళ్లు ముగ్గురిలోను సూర్యనారాయణ కనిష్ఠుఁడు, మేధావంతుఁడును. అతనికి గొన్ని సంవత్సరములనుండి యేమికారణముచేతనో కాని దేహము పాలిపోవుచువచ్చెను. ఇపుడు 1930 వ అక్టోబరులో చెన్నపురిలో బి. యల్. పరీక్షనిచ్చి, అన్నతోఁ దాను గుంటూరు రాక, సరాసరిగ భీమవరమె వెడలిపోయెను. అతనికి లోకాక తగిలి దేహస్వాస్థ్యము తప్పుచుండెనని మా తమ్ముఁడు వ్రాయుటచేత, నే నా డిసెంబరు తుదిని భీమవరము వెళ్లితిని. వెళ్లిన మఱునాఁడె నేను కుముదవల్లిలో వీరేశలింగవర్థంతి సమయమున నధ్యక్షత వహించితిని. వీరేశలింగము గారివలె మనమును కార్యశూరులమై, దేశోద్ధరణమునకుఁ గండంగవలె నని నేను వక్కాణించితిని.
భీమవరము వైద్యాలయమున సూర్యనారాయణ యపుడు 'కొంకిపురుగు' జబ్బునకు మందు పుచ్చుకొనుచుండెను. ఇంతలో వానికి నంజుగుణముకూడఁ గనఁబడుటచేత, మే మింగ్లీషు చికిత్స మానిపించి, ఆయుర్వేదవైద్యము చేయించితిమి. నరసాపురపు వైద్యులగు రౌతుల గోపాలముగారు భీమవరము వచ్చి చూచి, రోగిని నరసాపురము కొనిరమ్మనిరి. మే మంత జనవరి తుదిని సూర్యనారాయణుని దీసికొని, నరసాపురమున మా తమ్ముఁడు కృష్ణమూర్తి యింటఁ బ్రవేశించితిమి. నా భార్య, సూర్యనారాయణుని యత్తగారును కూడ నరసాపురము వచ్చిరి. చూచుచుండఁగనే యా యువకుని రోగ మతిశయించెను. ఏమంధు కాని వానికి లాభకారి కాలేదు.