ఆత్మచరిత్రము/చతుర్థభాగము : విశ్రాంతిదశ/తొలిదినములు

ఆత్మచరిత్రము

చతుర్థభాగము : విశ్రాంతిదశ

1. తొలిదినములు

నేను విశ్రాంతి గైకొనుటకుఁ గొంత ముందుగా శ్రీమతి కమలాభాయి ఛట్టోపాధ్యాయగారు నెల్లూరుపురమునకు విచ్చేసిరి. ఆమె మామేడమీఁదనే విడిసియుండిరి. ఆమె యుపన్యాసము వినుటకుఁ గళాశాలాభవనమునఁ గూడిన మహాసభకు నే నగ్రాసనాధిపతిని. కమలాభాయి తీవ్రమగు వక్త్రియని నే నాసమయమున గ్రహించితిని.

మేము గుంటూరు ప్రవేశించిన దినములలోనె బెజవాడలో నతివైభవమున శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి భవనమున వారి ప్రియపుత్రిక వివాహమహోత్సవము జరిగెను. నా కాహ్వానము వచ్చుటచేత, అచటి కొకనాఁడు పోయి, విందారగించి, పంతులుగారి నభినందించి వచ్చితిని. దినమున కెన్నిసారులో బంతులు తీర్చి వారిపెండ్లిపందిరిలో నతిధులు భుజించుచువచ్చిరి. నాతోఁ గూర్చుండువారె వేయిమంది యుందురు. మా కాసమయమున వడ్డింపఁబడిన పిండివంటలకు మితిలేదు. సాయంకాలము సంగీత సభలు జరిగెను. నాగేశ్వరరావుగారి పేరు దేశమున వితరణమునకుఁ బర్యాయపద మయ్యెను. ఆ వేసంగిని మేము భీమవరమున మా తమ్ముని యింటఁ గడపితిమి. అపుడు గుంటూరులో కొన్ని మహాసభలు జరిగెను. గ్రంథాలయసభకు శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగా రధ్యక్షులు. పంచమోద్యమమును గూర్చిన మహాసభకు నే నధ్యక్షుఁడను. సభలు ముగిసిన పిదప భానుమూర్తిగారితోఁ గలసి ఏలూరుమార్గమున నేను భీమవరము వచ్చితిని.

1928 వ సంవత్సరము వేసవిని మా తమ్ముని పుత్రులలో నరసింహము సూర్యనారాయణలు బి. యె. పరీక్షలోను, సుబ్బారాయఁడు ఇంటరుమీడియెటు పరీక్షయందును గృతార్థులయిరి. మొదటి యిరువురును బి. యలు. నకును, మూఁడవవాఁడు బి. యె. పరీక్షకును జదువ నిశ్చితమగుటచేత, వారిని మద్రాసుకొనిపోయి, కళాశాలలలోఁ జేర్పింపుఁడని మాతమ్ముఁడు నన్నుఁగోరెను. మేమంతబయలుదేఱితిమి. రెయిలులో మేనల్లుఁడు జనార్దనము మమ్ముఁగలసెను. వానికిని వెలిచేటి నరసింహమునకును యల్. యం. పి. తరగతిలో నాప్రయత్నముచేఁ బ్రవేశము దొరకుటచేత, అతఁడును మాతోనే మద్రాసు బయలుదేఱెను. రెయిలులో స్నేహితు లనేకులు గానవచ్చిరి.

చెన్నపురి లాయోలాకళాశాలలో సుబ్బారాయని, న్యాయశాస్త్ర కళాశాలలో వాని సోదరులను, రాయపురము వైద్యాలయమున జనార్దనమును బ్రవేశపెట్టి, లాయోలాకళాశాల కంటియుండు భోజనవసతిగృహమున తమ్ముని కుమారులు మువ్వురకు బోజనవసతిని గలిగించి, నేను నెల్లూరు వెడలివచ్చితిని.

బంధువులగు పోడూరు వెంకయ్యగా రిపుడు నెల్లూరులో జడ్జికోర్టు శిరస్తాదారు. వారియింట నే నిపుడు బసచేసితిని. కళాశాలాధి కారులు నాకపుడు విందొనర్చిరి. విద్యార్థులు వినతిపత్రము సమర్పించిరి. నే నంత గుంటూరునకు బయలుదేఱఁగా, రెయిలులో సుబ్బారాయఁడు నా కగఁబడెను. అతనికి లాయొలా కళాశాలలోఁ జదువును, వాని సోదరుల కందలి వసతిగృహమున భోజనాదికమును సరిపడకపోవుటచేత, మువ్వురు నాచోటు విడిచిపెట్టిరి. సోదరు లిద్దఱు వేఱు బసలోనికిఁ బోఁగా, సుబ్బారాయఁడు తనకుఁ బ్రియమగు రాజమంద్రి కళాశాలలోనే జదువ నిశ్చయించి యిపుడు ప్రయాణమయ్యెను. గుంటూరులో మే మొకనాఁ డాఁగితిమి. అతనిని రాజమంద్రి యంపి, నేను భీమవరము వచ్చితిని.

భీమవరములోఁ గొన్ని దినములకు వెంకటరామయ్య కొమార్తె సీతమ్మ సుఖప్రసవమై మగపిల్లవానిని గనెను. పాప మీమెకదివఱకుఁ గలిగిన యిద్దఱు పిల్ల లును కొంతకాలముక్రిందట చనిపోయిరి. కొన్ని దినము లచట మేము నిలిచి, పిమ్మట గుంటూరు వెడలివచ్చితిమి.

కళాశాలలోనియుద్యోగమును నే నింతటినుండి విరమించుకొనినను, పిమ్మట రెండువత్సరములవఱకును నేను ఇంటరుమీడియెటు పరీక్షాధికారిగనే యుంటిని. అందుచేత నాచేతికిఁ గొంతపనియును, జేబులో కొంత డబ్బును గనఁబడుచుండెను.

ఉద్యోగవిరామము చేసినను, నా కొక్కొకపుడు మనశ్శాంతి యంతగలేకుండెను. నేను గుంటూరులోఁ గట్టించిన "శాంతినిలయ"మను ధర్మాలయము అన్ని విధములగు సభలకు నుపయోగింపవలె నని నేను నిశ్చయించుటచేత, గుంటూరుప్రార్థనసమాజమువా రలుకఁజెంది, అందు తమ సభలు జరుపమని సమ్మెకట్టిరి ! "శాంతినిలయమం"తఁ గొంతకాల మూరకయె యుండెను. వార్తాపత్రికలు పెట్టి యందుఁ జదువుకొనుచుందు మని యొక సమాజమువా రనుటచేత, వారి కందుఁ బ్రవేశము గలిగించితిని. కాని, కొంతకాలమున కాసంస్థనిలిచి పోయెను. గుంటూరు "యువజనసాహితీసంఘము" వా రంత "శాంతి నిలయము"లోఁ దమ పుస్తకభాండాగారమును బెట్టుకొనుటకు నే నంగీకరించితిని. నేను నెల్లూరున నుండు చివరకాలమంతయు నేతత్సమాజమువారె "శాంతినిలయము" నుపయోగించుచు వచ్చిరి.

నే నిపుడు విశ్రాంతి గైకొనుటకై గుంటూరు వచ్చి చూచునపుడు, "శాంతినిలయమును" ఏతత్సమాజమువారు వాడుకొనక, ఎపుడును తాళము వేసియె యుంచుచు వచ్చిరి ! స్థలము విశాలమైనను, అందుఁ గట్టఁబడిన యిల్లు చిన్న దగుటచేత, అది యే పెద్దసభలకును బనికిరానట్టు నాకిపుడు స్పష్టమయ్యెను. ఇపు డది పెంపుచేయుటకు నాయొద్ద ధనములేదు. ఎందునకును కొఱగాని యిట్టి ధర్మశాల నుంచుటకంటె, దీనిని విక్రయించి యాధనమును "ఆంధ్రవిశ్వవిద్యాలయము" వారి కొసంగినచో, దానిమీఁద వచ్చువడ్డీతో వారు పేదవిద్యార్థులకు సంవత్సరవేతనము లిచ్చుచు, ధర్మము నిట్లు శాశ్వతసంస్థగ నడుపఁ గలరని మిత్రులు కొండ వెంకటప్పయ్యగారు నేనును దలంచితిమి. ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులతో నేనీ విషయమున నుత్తరప్రత్యుత్తరములు సాగించితిని.

ఈ సంగతి నేను "యువజనసాహితీసంఘము" వారి యుద్యోగులు కొందఱితోఁ జెప్పి వేసి, మందిరమును త్వరలో ఖాళీ చేయుఁడని కోరితిని. వారికిఁ దమ సంస్థను నడపుకొనుటయం దాసక్తి లేదుగాని, నా సంకల్పమునకు విఘాతము గలిగించుటకు వలయు శక్తి యుక్తులుమాత్రము లేకపోలేదు ! నా సొంతయుపయోగమునకై నే నీ మందిర మమ్మివేయ నెంచితినని వారు ప్రతీతి కలిగించి, ఎటులైన నీ ధర్మమును దమపురమునకె దక్కునట్లు చేయఁగోరి, వా రెంతకాలమునకును మందిరమును ఖాళీ చేయకుండిరి ! నేను మందిరమునకు ధర్మకర్తనని యొప్పుకొనినచోఁ దాము వెడలిపోయెదమని వా రిపుడు వర్తమానమంపిరి ! నే నేమిచేయుదును? వారిమీఁద నే నిపు డభియోగము తెచ్చుట కొకవేయిరూపాయిలు కావలయునని న్యాయవాదులు చెప్పిరి ! కావున నెటులైన వారి నచటినుండి యంపి వేసి, "శాంతినిలయమును" పురధర్మకార్యములకు బాహాటముగ వినియోగింపఁగోరి, నేను వారికోరికచొప్పుననే చేసితిని. 18-1-29 వ తేదీని "శాంతినిలయము"ను గూర్చి నే నొక దస్తావేజు వ్రాసి రిజిష్టరి చేయించితిని. నా జీవితకాలమున నే నొక్కఁడను, పిమ్మట పురప్రముఖులలో మువ్వురును, దానికి ధర్మకర్తలుగ నుందురనియు, ఆ గృహము నిరర్థకమగునపుడు దాని నమ్మివైచి, ఆధనముతో నీ ధర్మమును బోలిన వేఱేదైన ధర్మమును జరుపవలెననియును నేను విధించితిని. అంత "సాహితీసంఘము" వారు తమ సామానుల నచటినుండి తీసికొనిపోయిరి. కొలఁదికాలమునకె యీ సంఘ మంతరించెను ! అప్పటినుండియు మందిరము నా యధీనమందె యున్నది. బహిరంగసభలు, ముఖ్యముగ స్త్రీల సమావేశములు నచట బాహాటముగ జరుపవచ్చును.

1928 డిశెంబరులో నేను వెంకటరామయ్యయును నెల్లూరు వెళ్లి, ప్రసవమై వ్యాధిగ్రస్తయైన యాతని పెద్దకోడలు సూర్యకాంతమ్మను జూచి వచ్చితిమి. ఆమెకుఁ ద్వరలోనె దేహస్వాస్థ్యము గలిగెను. అపుడు జనించిన యర్భకుని సంరక్షణమును గుఱించి వెంకయ్యగారును, వారి సతీమణియును మిగుల పాటుపడిరి. కళాశాల విడిచిన కొన్ని నెలలకు నాకచటినుండి సుమారు 1300 రూపాయిల యుపకారవేతన మీయఁబడెను. రెండుసంవత్సరముల క్రిందటనే "రక్షకనిధి" యాకళాశాలలో నేర్పడుట నాకింత చిన్నమొత్తము లభించుటకు గారణ మయ్యెను.

కొంతకాలమునుండి నాకనులు జబ్బుగ నుండెను. ఎన్ని సారులు సులోచనములు మార్చుకొనినను, నాకు లాభము గలుగ కుండెను. 1929 వ సం. డిశెంబరు తుది దినములలో నేను చెన్నపురి పోయి, వైద్యాధికారి ముత్తయ్యగారికిఁ గనులు చూపించితిని. కనులలో పొరలు పెరుగుచుండె నని యాయన చెప్పి, క్రొత్త సులోచనుము లిచ్చెను.

2. నూతనపరిస్థితులు

మా పెద్దమేనత్త భద్రమ్మగారి మనుమఁడును, మాతమ్ముఁడు వెంకటరామయ్య బావమఱఁదియు, మాకాబాల్యస్నేహితుఁ డును నగు మంత్రిరావు వెంకటరత్నమున కారోగ్యము చెడె నని తెలిసి, నేను 1929 వ సంవత్సరప్రారంభమున భీమవరము వెళ్లి, అచటినుండి తణుకు పోయితిని. మాతమ్ముఁడచటనే కొన్నిదినముల నుండి రోగిని గనిపెట్టుకొని యుండెను. ఆఫిబ్రవరినెలలోనె వెంకటరత్నము చనిపోయెను. పాప మతఁడు తనతోడియల్లుని కుమారుని దత్తత చేసికొని యొక సంవత్సరమైనఁ గాలేదు. మంచిభూవసతియు, ధన గృహాదులును గలవాఁ డయ్యును, వీని ననుభవింపక, నడివయస్సుననె యాతఁడు మృత్యువు వాతఁబడెను !