ఆత్మచరిత్రము/అనుబంధములు /ఇతరులదృష్టిపథము

అనుబంధము : 2. ఇతరుల దృష్టిపథము

(1)

దేశీయ మహాసభా మందహాసములు: గుంటూరు సూర్యనారాయణ ప్రణీతము. ప్రథమభాగము. పుటలు 48-49. విజయనగరము. 1920.

"నేను విజయనగరము కళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్ష తరగతిలో నుండిన రెండు సంవత్సరములును తరగతిలో నేను వినిన యుపన్యాసములలో రాయసం వెంకటశివుడు గారు చేయుచుండి నవె మిగుల నుపయుక్తము లయినను కాకున్నను, మిగుల హృద్యములుగ నుండెను. * * సామాన్యముగ నేను ఆంగ్లసాహిత్యమున తెలివిగల వాఁడనని యాయన యెఱిఁగియుండినను, నే నాయన కిష్టులలో నొకఁడనుగాను. వారుచేసిన కళాశాలా పరీక్షలలో నొక దానిలోతప్ప నన్నిటిలోను ఆంగ్లమున నా కెక్కువ గుణములు వచ్చెను. ఆయనకు హాస్యరసము మెండుగఁ గలదు. చిక్కులగు సందర్భములం దద్దాని నాయన వినియోగించెడివారు. ఆయన నైసర్గిక నిరాడంబరత్వము, గాంభీర్య రాహిత్యము, శిష్యుల శీల పరిశీలనా విషయమునఁ గల హృదయ వైశాల్యమును విద్యార్థులను రంజింపఁ జేసెను. ఆయన కళాశాలలో మిగుల జనరంజకుఁ డగు నుపన్యాసకుఁడు. మా కోరికమీద సాహితీసంఘ సభల కధ్యక్షత ననేకమాఱులు వహించిరి. శిష్యుల శీలప్రవర్తనముల మీఁద నెంతేని నైతిక శక్తి చూపుచుండువారు. ఇట్టి వారలనుండి సదా సదావేశమును నేను గ్రోలుచుండు వాఁడను. కళాశాలాధ్యాపక కార్యములు చక్కపెట్టు కొనుటయె కాక, మెల్లగను నిరాడంబరముగను ఆయన శిష్యులలో ననేకులను తనచుట్టును జేరఁదీసి, వారికి ప్రార్థన సమాజ విధులను బోధించుచు, ఆదివారమున స్వగృహమున ప్రార్థనలు జరుపుచుండిరి."

(2)

"గుంటూరు కళాశాలా విద్యార్థి" :_ 15 నవంబరు 1919. గోల్డుస్మితుని "పల్లెటూరి యుపాధ్యాయుఁడు". కే. వి. యస్. శాస్త్రి.

"ఇట్టి పల్లెటూరి యుపాధ్యాయుని తా మెచటనైనఁ జూచిరేమో విద్యార్థులు జ్ఙప్తికిఁ దెచ్చుకొన వలెను. అంత, వారి మన:ఫలకమున, పొడుగు పొట్టియును గానట్టియు, లావుసన్నముగానట్టియు, మధ్యస్థమయిన యాకారమొకటి గానవచ్చును. అతని దుస్తులు నిష్ఠాపూర్వకమగు శ్వేతవర్ణముగలవి. అతని శీలము విరుద్ధగుణ సమ్మేళనము. ఆయన హృదయము దయావైశాల్యములు గల యది. కరుణాళువు. సంతోష ముప్పొంగుచుండువాఁడు. అంతులేని యాతని హాస్యరసము పొంగి పొరలుచుండును. ఆతని ప్రేమ గుణమునకు మితిలేదు. మఱ పెఱుఁగని జాగరూకతకును, సునిశితమగు పరిపాలనా శక్తికిని, ఆయన పేరువడసెను. విద్యార్థులకు భయంకరుఁడు. ఆనంద సంధాయకుఁడు కూడను ! దయాక్రూరత్వము లతనిలో మిళిత మయియున్నవి. తీవ్రశిక్షకుఁడయ్యును, ఆతని తరగతి యెపుడును శబ్దయుతముగ నుండును. ఎవనిమీఁదనైన కోపము వచ్చెనా, పండ్లు కొఱుకుచు, "ఎవఁడురా వీఁడు !" అని గర్జించి, మేజా బల్లమీఁద గ్రుద్ది, అపరాధియగు విద్యార్థిని స్తంభింపఁ జేయును. కాని, తోడనే యాయన యిఱుప్రక్కలను ప్రక్కలు బద్దలగునట్టుగ విద్యార్థుల నవ్వు విన నగును. చేత గొడుగైన బెత్తమైన నున్నచో, అది యపు డెగురవలసినదె ! మంచికొ చెడ్డకొ, ఆయనకోపము చివఱవఱకు కొనసాగవలసినదె. కాని స్నేహము ఆయన యనుగ్రహమునకె నీవు పాల్పడినచో, నీ కాతని స్నేహము, తలవని తోడ్పాటును ప్రాప్తింపఁ గలవు.

"ఆయనజ్ఞానము అపారగాంభీర్యము గలది. నిండుకుండ తొణకని రీతిని, యాయన పాండిత్యము ప్రకటనమును కోరదు. వలసినచో, గణగణమని మ్రోగు పెద్ద పదజాల మతని సొమ్మె! ఇవి యనుభవింపనోచుకొననివానికి, బల్లమీఁద పడెడి యాతని పిడికిలి చప్పుడు, అతని యభినయమును గనులు విప్పును ! ఆయనకుఁ గల నటనాసామర్థ్య మపారము. దేవత దయ్యము, సాధుపుంగవుఁడు ఘోర కపటుఁడు, రాజు భిక్షువు, విద్యాధికుఁడు కటికపామరుఁడు, జ్ఞాని పిచ్చివాఁడు, కోప పరితాపానందములు, - ఇవి యన్నియు నొక నోటనే యాయన యద్భుతముగఁ బ్రదర్శింపఁ గలఁడు. ఇపుడైన మాతృకను కళాశాలా విద్యార్థి పోల్పఁగలిగెనా ? లేనిచో, గోల్డుస్మిత్తునే సమాధినుండి గైకొని రావలెను !"

[కళాశాలా పఠన మందిరములో విద్యార్థులు ఉపాధ్యాయులను పరిహసించి వ్రాసెడి వ్రాత పత్రికలున్నవని నాకుఁ దెలిసి, అందు నే నొకనాఁడు పై పత్రికను జూచి యది దీసివైచి, ముందిట్టి పిచ్చివ్రాఁతలు వ్రాయవలదని విద్యార్థి బృందమును వారించితిని. తల్లిని కొట్టరా వసంతమనునట్లు, ఒక సీనియరు విద్యార్థి నన్నా పత్రికలోఁ జిత్రింప యత్నించెను.]