ఆత్మచరిత్రము/అనుబంధములు


ఆత్మచరిత్రము

అనుబంధములు

ఆత్మ చరిత్రము

అనుబంధము 1. పూర్వలేఖలు

(1)

రాజమంద్రి, 18-4-1895

ప్రియసోదరా,

దయగల మీ 16 వ తేదీ యుత్తరమునకు వందనములు. నిజమె, నేనొక పక్షముదినములు జ్వరముతో బాధపడితిని. ఇపుడైనను పూర్తిగా నిమ్మళించలేదు.

ఈ సెలవులలో త్వరలో మీరును నాచెల్లెలుగారును ఇక్కడకు వచ్చెదరని వినుటకు సంతోషము. మీరు. యమ్. యే. కు చదువుచున్నట్టు మీతమ్ముడుకూడా చెప్పినాడు. ఆరోగ్యము సరిగానున్న యెడల మీరు చదువవచ్చును. మీకప్పుడు మేలే కలుగును.

చెల్లెలి అనారోగ్యమును గుఱించి తెలిసి విచారించుచున్నాను. ఆమె యిచటికి వచ్చినపుడు మందిచ్చెదను.

నాయప్పు తీర్చనందుకు విచారింపవద్దు. స్థితిగతులు బాగుపడినప్పుడు మీ రీయవచ్చును.

నాపిల్లల యారోగ్యమును గుఱించిన కుశలప్రశ్నములకు వందనములు. దైవానుగ్రహమువలన వారారోగ్యవంతులుగనే యున్నారు. మీరిచటికి వచ్చినపుడు మంచిపుస్తకములు రెండిచ్చెద మని చెప్పినందుకు వందనములు. వానివల్ల లాభ మందగోరుచున్నాను. * * శ్రీ సుబ్బయ్య పాపయ్యగార్లు ఇక్కడనే యున్నారు.

ప్రేమాన్వితుడు, త. రంగనాయకులు.

(2)

రాజమంద్రి, 16-1-1896

ప్రియసోదరా,

నాసెలవును గుఱించి చిక్కులు వచ్చినవి. ఐనను భయము లేదు. శ్రీ ఇ. నరసింగరావుగా రిపుడు గుంటూరులో లేరు. జబ్బుపడి పాలకొల్లులో నున్నారు. 19 వ ఫిబ్రవరివరకు సెలవు తీసికొన్నారు. అప్పటివఱకు నేను వారియింట్లో నుండవచ్చునని చెప్పుచున్నారు. ఈమధ్యగానే నే నచటికి వెళ్లినట్టయితే, వేరొక యిల్లు మనమే కుదుర్చుకోవచ్చును. బహుశ: నాకు సెలవుదొరకక, ఉద్యోగము పోవునేమో! ఏమైననుసరే, నాఆరోగ్యమునకై నేను గుంటూరు పోవలెను. అది ఆవశ్యకము. నన్నుగుఱించి రాష్ట్రీయవైద్యాధికారితో ఉత్తర ప్రత్యుత్తరములు నడచుచున్నవి.

స. మృత్యుంజయరావు.

(3)

శ్రీరాములు

రాజమంద్రి, 1. అక్టోబరు 1896

చిరంజీవులయిన రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయువులుగాను దీవిస్తిమి. త. అంతాక్షేమం. యీ బ 5 ఆది వారం మీ అప్ప తాళ్లపూడి వెళ్లి కృష్ణయ్యభార్యను తీసుకువచ్చినది. యేలూరుసాహేబు రేయలీ డ్రెస్సరుగారికిన్ని చూపించినాము. మేహజ్వరంచాత రక్తం తక్కువైనదని చెప్పినారు. * * బాలసూర్యోదయం మొదలయినవి యిప్పిస్తే 20 రోజులలో నిమ్మళిస్తుంది. * * నీవు యెప్పుడు వచ్చేదిన్ని వ్రాయించవలెను.

రా. సుబ్బారాయుడు.

(4)

6-4-1901

మహారాజశ్రీ అన్నయ్యగారి సన్నిధికి, చెల్లెలు కనకమ్మ వందనములు. ఇక్కడ అంతా కులాసాగానే ఉన్నారు. మీరు నిన్నటి వరకు ఇక్కడకు వచ్చెద రని తలచితిమి. అట్లు జరిగినదికాదు. చిన్న అమ్మాయి వెనుకటివలె ఏడుపు మొదలైనవి మానుటయేకాక, ఆటలు, నవ్వును ! ఉగ్గు మొదలగు చిన్నచిన్నమాటలను నేర్చి కొంచెము ధృఢపడినది. మీరును వదినగారును త్వరలోనే చూడ ప్రయత్నించెదరని తలచెదను. మీరు ఇక్కడకు వచ్చునప్పుడు, పిల్లకు ఒక కాసు ఒత్తులును, కాళ్లకు పెట్టుటకు గజ్జెలును, మా వదినగారితో చెప్పి చేయించ కోరెదను. తప్పకుండా చేయించకోరెదను. అప్ప ఇప్పుడు బాగానే ఉన్నది. చిత్తగించవలెను.

కనకమ్మ.

(5)

రాజమంద్రి, 3-7-1901

అన్నయ్యకు, ఇక్కడ అంతాక్షేమం. మనతల్లిని చెల్లెలిని 26 వ జూనున వేలివెన్నుతీసికొనివెళ్లి, దిగబెట్టి, 1 వ తేదీకి వచ్చి తిని. వాళ్లను వెంకయ్య మామ 5 తేదీకి తీసుకొనివచ్చును. ఏడు రూపాయిలకుపైగా కరీదు గల పుస్తకములు కావలసి, మద్రాసు వ్రాసితిని. పుస్తకములు వచ్చినవి కాని డబ్బులేదు. ఈరోజుననే నాజీతము పదిరూపాయిలు చెల్లించితిని. కాబట్టి నాపేర ఎనిమిది రూపాయిలు నీవు పంపవలెను. "ఆంధ్రకవులు" 3 వ భాగము నాకు పంపవలెను. * * మన కనకమ్మ అర్తమూరులో నున్నది. మంత్రిరావు వెంకటరత్నము వచ్చినాడు కాని, చెల్లెలిని తీసికొని రాలేదు.

రాయసం సూర్యనారాయణ.

(6)

హిందూ సంఘసంస్కారిణి - బొంబాయి, 5 నవంబరు 1901 : _

ప్రియులగు వెంకటశివుడుగారికి, "ఉపాధ్యాయునివిధుల"ను గూర్చిన మీవ్యాసము పంపినందుకు వందనములు. మీవ్యాసములన్నిటివలెనే యిదియును చక్కనిభావములతోను హితోపదేశములతోను విలసిల్లుచున్నది. అది మీ కోరికచొప్పున మాపత్రికరాబోవు సంచికలలో ప్రచురింపబడును.

"హిందూసంఘ సంస్కారిణి"ని గుఱించిన, మీ యభినందనములకు వందనములు. బొంబాయికి వచ్చినపిమ్మట మాపత్రిక చందాదారు లెక్కువయైరని వినుట మీకు సంతోషదాయకముగ నుండును. మీవంటి విలేఖకుల వ్యాసములుండినచో పత్రిక యింకను వృద్ధినొందును. కావున మీరేమివ్రాసినను సంతోషింతును. చిన్నదని మీరు సందేహవలదు. ఒక పేరా అయినను పంపవచ్చును. వరదాచార్యులుగా రిపు డిక్కడ లే రని చెప్పుటకు చింతిల్లుచున్నాను. క్షయవ్యాధివలన బాధపడుచుండుటచేత, ఇక్కడ వచ్చినవెంటనే ఆయనను బొంబాయివిడిచిపొం డని వైద్యులు చెప్పివేసిరి. కొంతకాల మతడు బళ్లారిలోనుండి, యిపుడు చెన్నపురివెళ్లి పోయెనని వినుచున్నాను. కాబట్టి మామద్రాసు ప్రవాసకులసంఖ్య రెండుక్రింద తగ్గిపోయెను. గంటి లక్ష్మీనరసింహముగారు నేనును మాకార్యాలయమున నొకగదిలో నున్నాము. మీసందేశ మిపుడె యాయనకు దెలిపెదను. ఇంటియొద్దనుండు మిత్రులు మమ్ము మరకు పోవుదురేమోకాని, మేము వారినిమాత్రము మరచిపోవుటకు వీలులేదు.

సుహృదుడు, కె. నటరాజను.

(7)

బండోర, 19 వ తేది నవంబరు, 1901.

ప్రియమైన వెంకట శివుడుగారికి, మీరంపిన వ్యాసములకై వందనములు. ముందునుండి మీకు మాపత్రికప్రతులు రెండేసి పంపెదము. మీమిత్రుల కొకప్రతి మీరు పంపవచ్చును.

సర్కారులనుండి 'వార్తలు వ్యాఖ్యలు' ను క్రమముగా పంపుచుండుడని మిమ్ముకోరుచున్నాను. ఈపత్రిక కని యొక విశేషమయి, దాని యుపయోగమును హెచ్చింపగలవు.

విద్యాబోధకుని గుఱించిన మీవ్యాసము మిగుల చక్కగ నున్నది. శైలి సొగసుగను, నిర్దుష్టముగను నున్నది. వాదన సహేతుకముగ నున్నది. ఎపుడును మీశ్రేయస్సు వినగోరు, మిత్రుడు.

కె. నటరాజను.

(8)

"బ్రహ్మకృపా హి కేవలం"

సికందరాబాదు, 22 వ ఏప్రిలు 1902

ప్రియసహోదరా, అతి బాల్యముననే కాలగతి నొందిన తమ్ముని (సూర్యనారాయణను) గుఱించి, బ్రదికియున్న మనకు వేదనయు, హృదయపరితాపమును ! కొఱగానిదీపమె ప్రమిద యడుగు వఱకును కాలునట్లు కానబడును. కాని, అతనికిమాత్రము అది యింటి దెసకు పయనమె ! మంచి సువాసన లిచ్చు గులాబి, యజమాని పూజకై, కోయబడినట్టులె ! ఇట్టి తలంపునందె యోదార్పుగలదు. లేనిచో, యాలోచన కయోమయమును, భావనకు బాధాకరమును, అన్నిటికి నాటంకమును ! మనము శోకింపకుండ నుండలేము. దైవమును విశ్వసింపక తప్పదు. ఈశ్వరుఁడు మనకు శుభాశయములు పురిగొల్పునుగాక!

మీకు పరీక్షాధికారియుద్యోగము తప్పిపోయినది. దీనికి కారణమగు మీ శరీరాస్వస్థతకుమాత్రమె నావిచారము. బోధించుటయెగాని, పరిశోధించుట మీ విధ్యుక్తముగాదు. దయామయుఁ డగు సర్వేశ్వరుడు మీకు చిరాయు వొసగి, ధర్మపథమున నడిపించుఁగాక !

"సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమయిన బుచ్చయ్య పంతులుగారిని గుఱించిన మీలేఖ మద్రాసు సమాజసభ్యులలో గొందఱికి కష్టముగ నున్నది. కాని, మీవ్రాత సత్యమునుండి దూరస్థము గాదని నానమ్మిక. త్వరలో మీరు ప్రేమాన్వితులగు శ్రీ వీరేశలింగము పంతులుగారి జీవితచరిత్రము ప్రచురింపనున్నారని వినుటకు సంతోషము. నాకు మూఁడుప్రతులు పంపగోరుచున్నాను. ఈవిషయమున మీకు గావలసిన సాయమును సంతోషపూర్వకముగ నేను జేసెదను. అది నాకు విధ్యుక్తము, గౌరవప్రదమును.

చెన్నపురి రాజధానిలోని ఆస్తిక మతప్రచారమునుగూర్చి మద్రాసు బ్రాహ్మసమాజమువారు ప్రచురించిన ప్రణాళికను మీరు చూచియే యుందురు. దానిని గుఱించి మీయభిప్రాయము విపులముగ వినగోరెదను. ఈవిషయమై కొంత పని జరుగవలెనని కోరుచున్నాను.

మీరంపిన 'మనస్తత్వపరిశోధకసంఘము' వారి ప్రచురణము లందుకొన్నాను. జూలైకి ముందుగామాత్రము నా సగము చందా పంపలేననుటకు చింతిల్లుచున్నాను.

మాయమ్మ యధాప్రకారముగనె, మిగుల బలహీనగ మంచము నంటిపట్టుకొనియున్నది. దైవానుగ్రహమువలన మాయమ్మాయి బాగానే యున్నది.

మీసోదరుడు, ర. వెంకటరత్నము.

(9)

రాజ్యలక్ష్మీవిలాసము - పరశువాకము, మద్రాసు, 25. మె. 1902 : _

ప్రియులకు, సంఘ సంస్కరణ మహాసభాధ్యక్షక పదవి వలదని మొదట చెప్పివేసితిని. స్నేహితులు పట్టు పట్టుటచేత, నాకు సందేహము లున్నను తుద కెటులో సమ్మతించితిని. ఇపుడైనను, ఈ గౌరవమునకు నే నర్హుడను గాననియె తలంచుచున్నాను. ఈసభ జయప్రదముగ చేయవలసిన భారమంతయు దేశోద్దారణమును గుఱించి పాటుపడు మీబోటివారలమీదనే యున్నది. ఆ సమయమున మన మిత్రులు పలువురు వచ్చెదరని నమ్మెదను. నా చరిత్రము నాంగ్ల గ్రంథరూపమున మీరు ప్రచురింతురని "సంఘ సంస్కారిణీ పత్రిక"లోప్రకటనయున్నది. మీకు గావలసిన పరికరము లున్నవా ? నేను నా "స్వీయ చరిత్రము"న రెండు ప్రకరణములు వ్రాసితిని. 40 పుటలు అయినవి. అవి మీకు బంపనా ? మీ కళాశాల యెపుడు తీయుదురు ?

మిత్రులు, కం. వీరేశలింగము.

(10)

మద్రాసు, 28. జూలయి, 1903

ప్రియమిత్రులకు, మీరు పంపిన పదిరూపాయిలు చేరినవి. వందనములు. మీ ఆరోగ్యము ససిగా లేనందుకు విచారము. త్వరలో బాగుపడునని తలంచెదను. మీ స్థితిగతులు నాకు బాగా తెలిసియె యున్నవి. నాకు మీరు ధనసాహాయ్యము చేయగలరని నే ననుకొనుట లేదు. ఆ విషయమై నాచేత నైనంత వఱకు నేనె చేసెదను. సహాయకుల కొఱఁతయె నన్ను బాధించుచున్నది. నా తదనంతరము వితంతు శరణాలయ మెట్లు జరుగునా యనియె విచారించుచున్నాను. నా బలహీనతను బట్టి చూడగా, త్వరలోనే నాకు మరణము సంభవించునని తలంపవలసియున్నది. అన్నిటియందును దైవ సహాయమునె నే నాశించుచున్నాను. ఎదురుచూడని దిక్కునుండి యాయనప్రేరణచేతనే కార్యసాధకులును రాగలరు.

సౌ. సీతమ్మగారు రచించిన పుస్తక ప్రతి మీకు అందినదా ? ఆరోగ్యమున కామె యిచటనే యున్నది.

కం. వీరేశలింగము.

(11)

"బ్రహ్మకృపా హి కేవలం."

రాజమంద్రి, 18 వ తేది డిశంబరు 1903

ప్రియసోదరులకు, మీరు 9 వ తేదీని వ్రాసిన ప్రియమగు లేఖ అందినది. నాకథకు రాకపూర్వము, మిమ్మును నేను అభినందింపవలసియున్నది. ఆస్తియంతయు విక్రయించి, ఎంతో శ్రమపడియును, మీరు ఋణవిముక్తులగుట సంతోషదాయకము. ఈసంగతి మీకును, మీ శ్రేయస్సును గోరు మిత్రబృందమునకును మనోధైర్యమును, చిత్తశాంతియును గలిగించుచున్నది. ధనికుఁ డగుట ప్రతివానికిని సాధ్యముగాదు. సామాన్యస్థితిలోనుండి తృప్తినొందుటయె యుత్తమపద్ధతి యని పెద్ద లందురు.

మన్యపుజ్వరముచేతను, అతిదారుణమువలనను దేహమునిండ కురుపులువేసి, ఒక సంవత్సరమునరనుండి నేను బాధపడుచున్నాను. * * ఐదునెలలవఱకును నేను మంచము నంటిపట్టుకొని, నాచేతులతో నేను అన్నముకలిపి తినలేకపోతిని ! నాప్రాణముమీద మావాళ్లు ఆశ వదలివేసిరి * * జ్వరము కురుపులకుతోడు నంజుకూడా అంత కనబడినది. * ఇపు డింట్లో కొంచెము నడువగలను. ఈవైద్యమువలన నా కురుపులు మానినవి. 28 వ తేదీని చెన్నపురిపోయి, రక్తపరీక్ష చేయించుకొనవలె నని యున్నది. ఆరోగ్యమున్న యెడల సంఘసంస్కరణసభకుఁ బోవలెను. సాధ్య మయినచో మీరును రావలెను.

రెబ్బాప్రగడ పాపయ్య.

(12)

పరశువాకము, మద్రాసు, 22 వ తేది ఏప్రిలు 1904

ప్రియస్నేహితులకు, మీ ప్రేమపూర్వకమగు లేఖకును, పంపిన సొమ్మునకును, వందనములు.

1. నాచరిత్రమును గుఱించి: కొలఁదికాలములోనె నాకు మృత్యు వాసన్న మగునని నేను దలంచెదను. లాభకరమని యెంచినచో, మీరు నాజీవితచరిత్రము నామరణానంతరమె, వ్రాయవచ్చును. నేనింకను భూలోకమున చేయవలసిన పని యున్నదని తోఁచినతప్ప, కార్యపూర్తిచేసిన నన్ను దైవమిఁక పరలోకమునకుఁ గొనిపోవచ్చును. నేనింతకాలము జీవింతునని చిన్ననాఁ డనుకొనలేదు. నాకీచిరాయు వొసంగినందు కీశ్వరునికి కృతజ్ఞుఁడను. నేను సందేహించుచున్నను, నా "స్వీయచరిత్రము" ను వ్రాయుఁడని పలువురు నన్ను గోరుచున్నారు. నేను మీకొకసారి వ్రాసినట్టుగా, ఈవిషయమై కృషిచేతునని నేనంటిని. నావాగ్దానము నేను చెల్లించుకొనవలెను. రాబోవు వేసవిసెలవులలో నా సంగ్రహజీవితచరిత్రను వ్రాసి, మీకుఁ బంపెదను. నేను దినచర్యపుస్తకము లుంచలేదు. కాఁబట్టి నేను వ్రాయుదానివలన, మీయుద్యమమునకుఁ గొంతలాభము గలుగవచ్చును. మీ రది చదివినపిమ్మట, మీ కింకను సంగతులు కావలసినచో, అప్పడప్పుడు నాకు వ్రాయుచుండవచ్చును.

2. మీ "జనానాపత్రిక"ను గుఱించి: వలసినచో, నాముద్రాలయమున దాని నచ్చొత్తించి, అచ్చుచిత్తులు దిద్దిపెట్టెదను. చందా దారులకుఁగూడ పంపెదను. మీరే పత్రికాధిపత్యము వహింపవలెను. తీఱికయు, ఆరోగ్యము నున్నచో, అప్పుడప్పుడు నేనొకింత వ్రాయుచుందును. కాని యిది వాగ్దానముగా గైకొనగూడదు.

3. సారస్వతపత్రిక నొకటి నెలకొల్పవలెనను మీ సంకల్పము యోగ్యమయినదె. కాని, యిపుడు 3-4 పత్రిక లటువంటివి గలవు. మీ ప్రయత్నము నెగ్గవలె ననినచో, అనేకవిషయములను గుఱించి స్వతంత్రములు నుపయుక్తములునగు వ్యాసములు ప్రచురించి, ప్రాచుర్యమున నున్న పత్రికలను మించవలెను. పత్రిక కే పేరైనను సరే. దానికి "చింతామణి" అను పేరైన పెట్టవచ్చును. దానిలోని వ్యాసమలె యుద్బోధకములు జనరంజకములుగను నుండవలెను. ప్రస్తుతము నా కారోగ్యముగనే యున్నది కాని, ముందెటులుండునో తెలియదు. ఈ సంవత్సరాంతమునకు నాయప్పులన్నియు తీర్చివేయఁగోరుచున్నాను. అపుడు నేను ఉద్యోగవిరామము చేసి, ఆంధ్ర వాఙ్మయాభివృద్ధికిఁ దోడ్పడవలెను. అపుడు మీరొక్కరుగాని, మనము ఉభయులము గాని, స్థాపించు పత్రికకు సరిగా నెల కొకటి రెండు వ్యాసములు నేను వ్రాయవాంఛించెదను. ప్రస్తుత మని యన్నియు వట్టి కోరికలె! సఫలము కావచ్చును, కాక పోవచ్చును. ఆంగ్లమున నున్న "ఉత్తమరచయితలతోడి స్వల్పకాలక్షేపము" వంటి పుస్తకములు తెలుఁగులో కూడ నుండవలెను. తీఱిక యున్నప్పుడు దీనిని గుఱించి యాలోచింతము. మీకు ఱొమ్ముదగ్గఱ బాధగా నున్నందుకు విచారము. శీఘ్రమె మీకు బాధాశమనము గలుగవలెనని కోరెదను. దైవమీకోరికను సఫలము చేయుగాక!

కం. వీరేశలింగము.

(13)

"బ్రహ్మకృపా హి కేవలం"

సికిందరాబాదు, 24-8-04

ప్రియసోదరా, "పెద్దగురువు" (వీరేశలింగముపంతులు)కూడ, దరఖాస్తు చేయు మని నాకు వ్రాసిరి. కావున, ఇష్ట మంతగలేకయె, ముఖ్యముగ మిమ్మును వారిని సంతృప్తి పఱచుటకె, ఇపుడె నేను దరఖాస్తు నంపుచున్నాను. * *

మిత్రుఁడు ర. వెంకటరత్నము.

(14)

రాజమంద్రి, 3 వ తేది, సెప్టెంబరు 1904

  • ప్రియమిత్రమా, నేను కాకినాడవెళ్లి, మన మిత్రుని (వెంకటరత్నమునాయుడుగారిని) గుఱించి శాయశక్తుల ప్రయత్నించితిని. నేనచటికిఁబోయిన పిమ్మట జరిగిన పాలకవర్గసభలో, సభికులలో ననేకులు మన స్నేహితుని కాయుద్యోగ మిప్పించుటకు సుముఖులుగ నున్నట్టు గానబడిరి. * * కాని, మమ నేస్తునికి విరోధముగగూడ చాలపని జరుగుచున్నది. తుదకు జయ మెటులుండునో తెలియదు. పరాజితులమె యైనచో, అది మనలోపముచేతకాదు.

కం. వీరేశలింగము.

(15)

రాజమంద్రి, 12 వ సెప్టెంబరు 1904

  • * ప్రియమిత్రులకు, నేను చెన్న పురికి పోవులోపలగా మీరొకసారి యిచటికి రావలయును. ఇక్కడ "స్త్రీపార్థనాసమాజము" బాగుగ పని చేయుచున్నది. సగటున 50 మంది స్త్రీలు సభకు వచ్చు చున్నారు. క్రొత్తగా కట్టబడిన సమాజమందిరము మీ రనుకొనునంత చిన్నదికాదు. అది రెండస్తుల చక్కనిమేడ. పై యంతస్తున సుమారు నూఱు స్త్రీలు కూర్చుండవచ్చును. ప్రారంభోత్సవదినమున నిన్నూఱునకు పైగా స్త్రీజనము వచ్చిరి. ఇచట నాభావికార్యక్రమము నేర్పఱుచుకొనుచున్నాను. దైవాను గ్రహమువలన నాకృషి యిచట నుపయుక్తముగ నుండునని యాశించెదను.

కం. వీరేశలింగము.

(16)

సికిందరాబాదు, 29 వ అక్టోబరు 1904

ప్రియసోదరులకు, ఈశ్వరానుగ్రహమున, మీ యీ సోదరుడు కాకినాడవారి కంగీకృత మయ్యెనని రహస్యతంత్రీవార్తలు చెప్పుచున్నవి. ఈ మేలునకు దైవనామము కీర్తింపబడుగాక ! ఇది యింకయు రహస్య వార్తయె.

సుహృదుడు, ర. వెంకటరత్నము.

(17)

రాజమంద్రి, 20 వ మార్చి, 1905

ప్రియమిత్రులకు, "జనానాపత్రికా" వ్యవహారములను గుఱించిన మీ జాబులకు ప్రత్యుత్తర మీయకుండుటకు మిగుల చింతిల్లుచున్నాను. ఈ యశ్రద్ధకు నేను నిందాపాత్రుఁడను. జరిగినదానికి క్షమింప వేడెదను. రెండునెలల పత్రికలు నొకమాఱుగా ముద్రించు నుద్దేశముతో రెండుసారులు నేను "చింతామణీ" కార్యస్థానమునకు బోయితిని, అరడజనుసారులు గుమాస్తా నంపితిని. ముద్రిత మయిన కొన్నికాకితములు కనబడుట లేదనియు, వానికై వెదకెద మనియు, అచ్చువేయువారు చెప్పుచువచ్చిరేగాని, ఫలితము లేదయ్యెను మద్రాసులో పత్రిక నచ్చొత్తించుడని మీ కంతట వ్రాయనెంచితిని. కాని, యింతలో నేను రోగపీడితుఁడనయితిని. నిస్సత్తువయు కీళ్ల పోటులును నన్ను బాధించెను. అప్పుడు మీ యుత్తరము నా కందినది. రోజుకు రోజు నా జబ్బు ముదిరెను. నా వ్యాధి ప్రబలమై, ఒక పక్షమువఱకును నేను మంచము దిగలేదు. నా తుదిదినము లివియె యని నే దలంచితిని. నాలుగైదు రోజులనుండి మాత్రము తోటలో నిటునటు తిరుగ గలుగు చున్నాను. ఇంకను బలహీనముగ నున్నను, దైవకృపవలన చాల నయముగ నున్నది. కడచిన ఆదివారమున "ప్రార్థన మందిరము"న కృతజ్ఞతాపూర్వకప్రార్థనము నేను జరిపితిని. వ్యాధిప్రథమావస్థలో నేను బ్రాహ్మమతానుష్ఠానము గైకొంటిని.

  • * క్రొత్తచందాదారులపట్టికయు సొమ్మును త్వరలో మీకు బంపెదను. నా యీగొప్పతప్పును సైరింపవలెను.

కం. వీరేశలింగము.

(18)

రాజమంద్రి, 20 వ తేది మే, 1905

ప్రియమిత్రులకు, మీజాబులకును, పంపిన సొమ్మునకును వందనములు. * * శ్రీ పి. రామచంద్రరావుగారు, వారి సతీమణి లక్ష్మీకాంతమ్మగారును నన్నుజూడవచ్చి, నాతోనే యున్నారు. వారు నాయాతిథ్యమున నున్న పుడు, వారి నొంటరిగ వదలి నేనెక్కడ యస్తికలు సమాధిలో నిక్షేపించు కర్మకాండను జరిపెదము. మీ రాసమయమునకు రావలయును. నా దేహమున ససిగా లేదు. అందుచేత ఏప్రిలు మొదటిభాగముననే నేను బెంగుళూరు పోయెదను.

కం. వీరేశలింగము.

(22)

రాజమంద్రి, 19-3-1911

ప్రియస్నేహితా, మీప్రేమపూర్వక మగు లేఖ నందుకొన్నాను. మీ రంపిన విరాళ మందినదని నేను వ్రాయలేదా ? పొరపాటు క్షమింపవలెను. నా "స్వీయచరిత్రము"ను గుఱించి మీకుఁగల సదభిప్రాయమునకు వందనములు. మీ పూర్వగురుమిత్రుని యెడగల యభిమానమె దీనికి గొంత కారణమయి యుండవచ్చును.

రాబోవు నెలలో నరసాపురమున జరుగు కృష్ణా - గుంటూరు మండల సంఘ సంస్కరణ సభకు మీ రధ్యక్షులుగ నెన్నుకొనబడినందుకు సంతోషించు చున్నాను.

  • * 24 వ తేదీ శుక్రవారమునాఁడు బెంగుళూరు పోవుచున్నాను. మార్గమధ్యమున మద్రాసులో శ్రీ గోటేటి కనకరాజుగారి యింట రెండు మూఁడు దినము లాతిధ్య మనుభవింతును.

కం. వీరేశలింగము.

(23)

భీమవరము. 1-9-17

అన్నయ్యకు, పనితొందరచేత, ఇదివఱకే వ్రాయలేకపోయితిని. గతించినదానికి వగచిన లాభములేదు. లోకములో జీవితము గడుపవచ్చును గాని, లోకవిషయములమీఁది మోహమునబడియుండ రాదు. మనవిధ్యుక్తముల నెఱవేర్చి, ఫలసిద్ధి దేవునికే వదలివేయవలెను. అశాశ్వతమగు ప్రాపంచిక విషయములను బట్టుకొని ప్రాకులాడక, జ్ఞానియంతచ్ఛక్షువునువిప్పి, పరమాత్మునే సందర్శింప గోరుచుండును. * * * కావున, మనపిల్లవాని (అబ్బావుని) యకాలమరణమును మఱపుతెచ్చుకొని నీవు చిత్తశాంతితో నుండవలయును. * * *

రాయసం వెంకటరామయ్య.

(24)

భీమవరము, 4-3-31

అన్నయ్యకు, మీలేఖకు వెంటనే ప్రత్యుత్తర మీయజాలనందుకు క్షమింపవలెను.

మన కీమధ్యగలిగిన విపత్తును (మూడవ కుమారుడు సూర్యనారాయణుని మరణమును) గుర్తించలేనట్టుగ మొదటిదినములలో నాబుద్ధిని మాంద్యము గ్రమ్మివేసెను ! ఆమాంద్యము విడిపోయినకొలఁది నాకిపుడు నాదురవస్థ స్ఫుటముగ గోచరించుచున్నది. జీవితము దుర్భరముగ నున్నది. చనిపోయిన ప్రియపుత్రునికిఁ జేయవలసిన విధులు చేయక, వానిని మృత్యుదేవత కొప్పగించితినని పొక్కుచున్నాను. ఇంక పాపిష్ఠిధనార్జనముచేయుట సిగ్గులచేటని నేను మొగము చాటువేసి, యిల్లువిడువకున్నాను. నిండుజవ్వనమున నుండు నా ముద్దుల బాలకునిమీఁదికి విధినాధునికి చేతు లెట్లువచ్చెనో ! నాయేఘోర పాపమునకు దైవ మీశిక్షనంపెనోగదా! ఆపసివాని నగుమోము మరల నాకనులపండువు కాగలదా ?

మీరు వదెనయు, తమ్ముఁడు మఱదలును, ఇతరులును, ఆయర్భకుని గుఱించి యెంత శ్రమనొందిరి ! అన్నియు వృథయైపోయినవి. నేనెంత దురదృష్టవంతుఁడను !

అయ్యో, పాపము, మాలతి (కోడలు) సంగతియేమి? పలుమాఱు ఆమెనుగుఱించి నేను పలవించుచున్నాను ! నావలెనే యామెయు దురదృష్టవంతురాలయ్యెను. నిరపరాధినియగు ఆబాలప్రార్థనలనైన పరమాత్ముఁ డాలకింపలేదే !

రా. వెంకటరామయ్య.

(25)

వెల్లూరు చెఱసాల, 19-8-32

మిత్రవర్యా, నమస్కారములు. * * ఇక్కడ వర్షములు కొద్దికొద్దిగ అప్పుడప్పుడు కురియుచున్నవి. సౌఖ్యముగను ఆరోగ్యముగను నున్నది. కాలము చక్కగనే గడచిపోవుచున్నది. ఏదియైన వ్రాయుటకు తగినంత యుత్సాహముగాని శక్తిగాని నాకు కనుబడుటలేదు. ఏదియో చదువుచు కాలక్షేపము చేయుచున్నాను. ఇచ్చట అందఱును గ్రంథకాలక్షేపము చేయుచున్నారు. కొందరు గ్రంథరచనలును చేయుచున్నారు. ఇదియంతయు నొక్క విద్యార్థి కూటమువలె నున్నది. గొప్పవిద్యార్థి వసతిగృహమని చెప్పవచ్చును. అందరును చాలవఱకు కాలమేమియు వ్యర్థముచేయక, యేదియోనొక పరిశ్రమ చేయుచునే యున్నారు.

కొండ వెంకటప్పయ్య.

అనుబంధము : 2. ఇతరుల దృష్టిపథము

(1)

దేశీయ మహాసభా మందహాసములు: గుంటూరు సూర్యనారాయణ ప్రణీతము. ప్రథమభాగము. పుటలు 48-49. విజయనగరము. 1920.

"నేను విజయనగరము కళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్ష తరగతిలో నుండిన రెండు సంవత్సరములును తరగతిలో నేను వినిన యుపన్యాసములలో రాయసం వెంకటశివుడు గారు చేయుచుండి నవె మిగుల నుపయుక్తము లయినను కాకున్నను, మిగుల హృద్యములుగ నుండెను. * * సామాన్యముగ నేను ఆంగ్లసాహిత్యమున తెలివిగల వాఁడనని యాయన యెఱిఁగియుండినను, నే నాయన కిష్టులలో నొకఁడనుగాను. వారుచేసిన కళాశాలా పరీక్షలలో నొక దానిలోతప్ప నన్నిటిలోను ఆంగ్లమున నా కెక్కువ గుణములు వచ్చెను. ఆయనకు హాస్యరసము మెండుగఁ గలదు. చిక్కులగు సందర్భములం దద్దాని నాయన వినియోగించెడివారు. ఆయన నైసర్గిక నిరాడంబరత్వము, గాంభీర్య రాహిత్యము, శిష్యుల శీల పరిశీలనా విషయమునఁ గల హృదయ వైశాల్యమును విద్యార్థులను రంజింపఁ జేసెను. ఆయన కళాశాలలో మిగుల జనరంజకుఁ డగు నుపన్యాసకుఁడు. మా కోరికమీద సాహితీసంఘ సభల కధ్యక్షత ననేకమాఱులు వహించిరి. శిష్యుల శీలప్రవర్తనముల మీఁద నెంతేని నైతిక శక్తి చూపుచుండువారు. ఇట్టి వారలనుండి సదా సదావేశమును నేను గ్రోలుచుండు వాఁడను. కళాశాలాధ్యాపక కార్యములు చక్కపెట్టు కొనుటయె కాక, మెల్లగను నిరాడంబరముగను ఆయన