ఆంధ్ర వీరులు - రెండవ భాగము/వేమారెడ్డి

బంచములకంటె నితరాగ్రవర్ణులే విశేషించి పూజించుచున్నారు. దేశభక్తి, బలపరాక్రమములు, పితృభక్తి, ధర్మనిష్ఠ, సేవాదీక్ష లోనగు మానవ ధర్మములను నిర్వహించుటలో నసమానుడగుకన్నమనేని యాదర్శములు ఆంధ్రలోకమునకు మార్గదర్శక మగుగాక!

[ఆంధ్రమంత్రులు అను గ్రంథమునందలి బ్రహ్మనాయని చరిత్రము, ఆంధ్రవీరులు మొదటిభాగమునందలి బాలచంద్రుడుఅను వీరులచరిత్రము బఠించినచో గన్నమనేని చరిత్రమునందు సూచింపబడిన ప్రధానకధాంశములు ద్యోతకమగును.]

________

వేమారెడ్డి

ఆంధ్ర రాజులలో రెడ్డివారు ప్రధమగణ్యులు. స్థానాం -- ములం దుంటచే వీరు జాతిసాంకర్యములు కలుగకుండుటకు దమశాఖను బెక్కుఉపశాఖలుగా విభజించి యందుండి గుంపులని చిన్నతెగల విడదీసి సంబంధ బాంధవ్యములు జరుపుకొనుచున్నారు. వీరలు చిరకాలమునుండి ఆంధ్రదేశమునందు నివసించి కాకతీయ సామ్రాజ్యము మహోన్నత దశయందున్నపుడె స్వతంత్రరాజులుగ సేనాధీశ్వరులుగా నుండి క్రమ ముగా బ్రత్యేకరాజ్యములను స్థాపించిరి. వారిలో వేమా రెడ్డి గణనీయుడు.

వేమారెడ్డివంశమునందు దొంతిఅల్లాడరెడ్డి మూలపురుషుడని స్థానికచరిత్రములందు గలదు. ఇప్పటిచరిత్ర కారులదృష్టిలోని కీతడు రాకపోవుటచే నీపేరుగలవాడు లేడను చున్నారు. చరిత్రాంశములతో నేకీభవించు స్థానికచరిత్రములకు బ్రాముఖ్యమీయక తప్పదుగాన గూటస్ధుడుగా దలంపబడు నీవీరుని చరిత్రము నెఱుంగుదము. దొంతి అల్లాడ రెడ్డి పంటరెడ్డి కులములో జనించినవాడు. నిజాము రాష్ట్రమునందలి చెదలువాడలో నీతడు వ్యవసాయము చేసికొని జీవించుచుండెను. ఒకనా డీరైతు భూమిదున్నుచుండగా లంకెలబిందెలు బంగారు నాణెములతో నిండినవి దొరకెను. గ్రామవాసులంద ఱాధనము హరింపవలయునని యత్నించు చుండుటచే రాజధానిగా నుండు అనుమకొండకుజేరి యచటనొక సువర్ణ వీరరాఘవ విగ్రహము చేయించి పూజించు చుండెను. అచ్చటగూడ గొన్నియపాయములు కలుగుచుండుటచే అల్లాడరెడ్డి ధనవస్తువాహనాదులతో కొండపల్లి సీమకువచ్చి కవులూరునందును ధరణికోటయందును బ్రాసాదములు గట్టించి సుఖముగా నుండెను. కొంతకాలమునకు దురదృష్టమున ఓరుగల్లు రాజ్యమును బరిపాలించు ప్రతాపరుద్ర చక్రవర్తిని తురకలు బంధించి డిల్లీనగరమునకు గొంపోయిరి. సామంత రాజులు, సేనానాయకులు స్వతంత్రసంస్థానములు స్థాపించిరి. అపుడు రాజప్రతినిధిగానుండి నూతనరాజ్యములు స్థాపించినవారిలో ప్రోలయరెడ్డి యొకడు. ఈయన తరువాత రాజ్యమునకు వచ్చి ఆంధ్రదేశమున నసమానకీర్తి గడించిన మహావీరుడే మనకధానాయకుడును శూరచూడామణియు నగు వేమారెడ్డి భూపాలుడు.

వేమారెడ్డి పూర్వులు సంపదలతో దులదూగుచు దుర్గములు కట్టుటకు ధనము నార్జించిన విషయము దెలుపు నొక చిత్రకధవాడుకలో నున్నది. కథయొక్క సత్యాసత్యము లెటులున్నను వినుట కుత్సాహకరముగా నుంటచే నిట నుదాహరించుచున్నారము. దొంతి అల్లాడరెడ్డి కవులూరిలోనుండి అతిధిపూజాతత్పరుడై ప్రఖ్యాతుడై యుండునపుడు ఆయన యింటికి అకాలమున నొక వైశ్యుడువచ్చెను. అల్లారెడ్డి అతిధిపూజా తత్పరుడుగాన ఆగతుడగు వైశ్యుని మిగుల నాదరించి ఆహారముచేసికొనుటకు వలయుపాత్రముల వస్తువుల నొసంగగా నావైశ్యుడు తనయొద్దనున్న పసరుబరిణెగల గుడ్డల మూటను చిలుకకొయ్యకు దగిలించి వంటపని మీదబోయెను. కొంతసేపటికి పసరు తొణికిపడుటచే గ్రిందనున్నయినుపములుకు లన్నియు బంగారయ్యెను. అల్లాడరెడ్డి చూచి మిగుల నాశ్చర్యమునొంది మూటలోనేమి గలదో చూడ బసరుండెను. దానిని ఏలోహముమీద బోసినను బంగారముగా మాఱుచుండెను. వర్తకున కీపసరు చిక్కనీయక హరించి దీనిసహాయమున ధనము విశేషముగా నార్జించి రాజ్యము స్థాపింపనెంచి పసరుబరిణెమూటను దనగృహములో దాచి పసరుమూట తొలుత వర్తకుడుంచిన గృహమునకు అల్లాడరెడ్డి నిప్పుపెట్టెను. గృహము కాలిపోవుట చూచి వైశ్యుడు పరుగెత్తుకొనువచ్చి తాను సేకరించిన పసరుమూటగూడ నందేకాలిపోవుచున్నదని తలంచి వింధ్యాద్రికేగి మహాయోగుల నాశ్రయించి తానార్ఝించిన దివ్యరసము తగులబడిపోవు చున్నందులకు విచారపడి తానును అగ్నిహోత్రమునంబడి మరణించెను. గతమునకు అల్లాడరెడ్డి వగచి నిదురింప రాత్రి వేళవర్తకుడు కలలోనికివచ్చి "రెడ్డిదొరా! నీకు లభించిన పరుసవేదితో ధనమునార్జించి దేవళములు కోటలుగట్టి పరోపకారివై జీవింపుముగాని యందొక కాసునేని స్వయముగా నుపయోగించు కొనకుము. చిరకాలము పెద్దలసేవించి వడసిన స్పర్శ వేది అదృష్టవంతుడవగుటచే సులభముగా నీకు లభించినది. నాపేరు వేమన్న. నేనింత మహోపకారము నీకు గావించితినిగాన నీసంతతి కంతకు నా వేమనామము పెట్టుము." అనిచెప్పెను. అల్లాడరెడ్డి అందుల కియ్యకొని యాధనమును గోటలు, పేటలు గట్టించి ప్రజోపయోగముగా వినియోగించెను. ఈ కథ కొండవీడు, కొండపల్లి, ధరణికోట ప్రాంతములలో వాడుకగానున్నది. ఈకధకును వేమారెడ్డినామమునకును గల సంబంధ మెంతవఱకు సత్యమో తెలుప వీలుకాకున్నది.

వేమారెడ్డి క్రీ.శ. 1320 మొదలు 1349 వఱకు రాజ్యము పాలించెను. చరిత్రవిదులు తలంచుచున్నారు. ప్రతాపరుద్ర చక్రవర్తి తురకరాజులతో బోరాడి స్వాతంత్ర్యము నిలుపుకొను సమయమున దేశము చాలవఱకు బరాధీనము కాసాగెను. అపుడు వేమారెడ్డి కొన్నిదుర్గముల లోబఱచికొని పాలింపదొడగెను. ఇంతలో గాకతీయరాజ్య మస్తమించుటతో వేమారెడ్డి మిగుల స్వతంత్రుడయ్యెను. పిదప వేమారెడ్డి ఆంధ్రదేశమును తురకల హస్తగతము గాకుండ గాపాడెను. తురకలు హరించిన దేవబ్రాహ్మణ వృత్తులు తిరుగసాధించి తానుస్వయముగా పూర్వగృహీతలకు ధారపోసి వైదికమతమును నిలువ బెట్టెను. ఓరుగల్లు మొదలుకొని కొండపల్లి వఱకుగల దేశమును వెలమవా రాక్రమించుకొనిరి. రాచవారు తిరుగబడి వెలమవారి స్వతంత్రమును బడగొట్ట యత్నించుచుండిరి. ఈ యంత:కలహములను గుర్తించి తురుష్కులు దండయాత్రలు గావించుచు ఓరుగల్లు ప్రాంతములను గొల్లగొట్టుటచూచి ధరణికోట ప్రాంతములందు దన ప్రతినిధులను నిలిపి విరోధులెవరును గృష్ణదాటి రాకుండను దేశమునందు నెట్టి యశాంతి పొడసూపనట్లు వేమారెడ్డి మిగుల జాగ్రత్తగా గట్టుబాటులు చేసెను. క్రమముగా రాచ వారు రాజ్యసంపదల గోలుపోయి పద్మనాయకులధాటికోర్వజాలక యితర ప్రాంతములకు వలసబోయిరి. పద్మనాయకులన బడు వెలమవీరులు ఓరుగల్లు మొదలుకొని కృష్ణవరకు బాలించుచు దరుణముగనిపెట్టి రెడ్డిరాజ్యమును గూడగబళింపవలెనని పలుమాఱు ప్రయత్నించి సరిహద్దులలో భయంకర సంగ్రామము లొనరించి విఫలప్రయత్నులై వెనుకకు మఱలిరి. నాటనుండి రెడ్డివారికి వెలమవారికి జిరకాలము తగవులు, సంగరములు జరుగుచు వచ్చెను. వేమారెడ్డి తన రాజ్యమునం దంతటను రాజప్రతినిధులుగా దన సోదరులను అగ్రజులను, జ్ఞాతులను, మాతామహ కుటుంబమువారిని నుంచి తాను అద్దంకి రాజథానిగా జేసికొని నెల్లూరుమొదలు గోదావరీ మండలమువఱకు బరిపాలించెను. కర్నూలు మండలము గొంత బాగమును, కృష్ణా గుంటూరు మండలములు పూర్తిగను, నెల్లూరి మండలములో జాలభాగమును, గోదావరీ మండలములోని తూర్పు భాగమును వేమారెడ్డి పాలించెనని విశ్వసింపవచ్చును. ఈయన మన్నెరాజులను గూడ గెలిచితినని చెప్పుకొనుటచే గటకమువఱకు దండయాత్రల కేగె ననియు నాప్రాంతము లచిరకాలమునకె పరహస్త గతమై యుండుననియు దలంచవచ్చును. వేమ భూపాలు డార్యధర్మములను నెలకొల్పుటలోను బునరుద్దరించుటయందును మిగుల బేరెన్నిక గాంచెను. ప్రతాపరుద్రదేవుని ధర్మములు ఖిలమై యవన పరిపాలనమున విచ్ఛిన్నముకాగా వేమారెడ్డి తాను ప్రభుత్వమునకువచ్చి పునరుద్ధరించినటుల అమరావతిశాసనమునందు జెప్పుకొనినాడు.

వేమారెడ్డి గతించినను అతనివంశము నశించినను నేటివఱకు నాతని ధర్మములు శాశ్వతముగా నున్నవి. వేమవరము అను పేరుతో నెన్నియో గ్రామములుకట్టించి వేదవేదాంగ విదులగు బ్రాహ్మణులకు దానముచేసి వైదికమతమును నిలువబెట్టెను. నూటయెనిమిది దేవాలయములు కట్టించి యందీశ్వర ప్రతిష్ఠగావించి, నటులకు గాయకులకు భజనపరులకు అర్చకులకు బుష్కలముగా వృత్తుల నొసంగెను. దుర్గమముగా నున్న శ్రీశైలమునకును అహోబిలమునకును మెట్లుకట్టించి యాత్రికుల కెంతయో సౌకర్యము కలుగజేసెను. విరోధులను రాజ్యపు సరిహద్దులలో నేని అడుగిడ నీయకుండ జాగ్రత్తచేసి ప్రఖ్యాతి నొందెను.

వేమారెడ్డియొద్ద రాజ్యాంగ విదుడును బరిపాలనా కౌశలుడును ధర్మపరాయణుడును నగు కాశ్యపగోత్ర సంజాతుడైన రామాప్రగడయు నతని యనంతర మాతని మనుమడగు మల్లినాథుడును మంత్రులుగానుండి రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి గొనివచ్చిరి. సేనానాయకులుగా సహోదరులగు అన్నారెడ్డియు, మల్లారెడ్డియు, గుమారుడగు అనపోతా రెడ్డియు, మేనమామ కుమారుడగు నూకారెడ్డియునుండి రాజ్యాభి వృద్ధికి సహకారులైరి. వీరిలో మల్లసేనాని విద్యాప్రియుడు. ఎఱ్ఱాప్రగడ మహాకవి నీ మల్లసేనాని తొలుత దన యాస్థానము నందు గవిగా నుంచికొని గౌరవించి చిరకాలము పోషించి పిదప వేమభూపాలకుని ప్రాపకమునందు జేర్చెను. సముద్రతీరమునందున్న కురుమలూరునం దీమల్లారెడ్డి నివసించి ద్వీపాంతరముల నుండి పడవలపైవచ్చు విదేశవస్తువులకు సుంకములు నిర్ణయించుచు నుండెను. ఈయన కవితాభిమానము గలవాడు గాన మిగుల బ్రశంసాపాత్రుడు. వేమారెడ్డి రాజ్యము పాలించు సమయమున మోటుపల్లి గొప్ప రేవుపట్టణముగా నుండెను. కాకతీయరాజు లచట శుల్కాధికారి నుంచి దిగుమతి సరకులకు బన్నులువిధించి శాసనశిలలను బ్రాతించిరి. వేమారెడ్డి యాజ్ఞను బురస్కరించుకొని సోదరుడగు మల్లారెడ్డి అపరిమిత పరివారసహితుడై విరోధిహస్తగతమై యున్న మోటుపల్లిని జయించెను. అది మొదలు రెడ్డిసామ్రాజ్యమునకు సుంకముల వలన మితిలేని యాదాయము వచ్చుచుండెను. నూకారెడ్డి ధరణికోట ప్రాంతములనుండి వెలమవీరులగు అనపోతానాయకుడు, మాదానాయకుడు ముందునకు రాకుండ బలుమాఱు నిలువరించెను. కటకాధీశ్వరుడగు గజపతిని కృష్ణ కావలనే యెదిరించి వెనుకకు బాఱదోలెను. వేమారెడ్డి శివభక్తుడైనను వైషమ్యభావమును విడచి శివకేశవ దేవాలయములు ప్రతిష్ఠించుటయే గాక యన్నింటికి సమానముగా వృత్తుల నొసంగెను. అవచిదేవయసెట్టియను కోటీశ్వరుడగు వైశ్యుడు వేమారెడ్డికి సహకారిగను మిత్రుడుగా నుండి వలయు సమయముల నెంతయేని ధనసహాయము గావించుచుండెను. అవచిదేవుడు శివపూజా విధానమునందును అతిధిపూజా తత్పరత యందును దానధర్మ విధానమ లందును నిరుపమానుడై కీర్తిగడించెను.

వేమారెడ్డి విద్యాతపో వృద్ధులగు బ్రాహ్మణులకు బెక్కు లగ్రహారముల నొసంగెను. దేవాలయములు, తటాకములు ప్రతిష్టించి పరోపకారబుద్ధి ప్రకటించెను. చలివెందరలు, సత్రములు, తోటలు నెలకొల్పి సప్తసంతానముల బూర్తిచేసెను. ధర్మశాస్త్రములందు జెప్పబడిన సమస్తధర్మములు యధాశాస్త్రీయముగా గావించెను. తనయెడ భక్తిగలవాడై రాజ్యక్షేమమునకై పాటుబడుచున్న సోదరుడగు మల్లారెడ్డికి బుణ్యము కలుగునటుల అమరేశ్వరస్వామి దేవాలయ శిఖరముపై గనక కలశములను బ్రతిష్ఠించెను. వేమారెడ్డి పరిపాలనమం దెట్టి దండయాత్రలుగాని సంగరములుగాని లేకపోవుటచే ప్రజలు సుఖముగానుండిరి. సుంకములు, పన్నులు మిగుల స్వల్పముగ నుంటచే వ్యాపారము, వ్యవసాయము మిక్కిలి యభివృద్ధిలోనికి వచ్చెను.

వేమారెడ్డి కవితాగౌరవము గలవాడు. పలువురు కవులీనృపాలు నాశ్రయించి పద్యములు రచించి సత్కారముల నొందిరి. ఈయన రాజకీయ వ్యవహారములు ముగించికొన్న పిదప విశ్రాంతి కాలమునంతయు బండితులతో విద్యావినోదము లొనరించుచు గడపుచుండువాడు. రాజ్యమునందలి ప్రసిద్ధవిద్వాంసు లందఱు ఆస్థానమున కేతెంచి సాహిత్యవినోద ప్రసంగములతో గాలముగడుపు చుండువారు. ఆంధ్రకవులలో ప్రసిద్ధుడగు ఎఱ్ఱాప్రగడ మహాకవి వేమభూపాలుని యాస్థానమునందుండి తొలుత రామాయణము పద్యకావ్యముగా వ్రాసి యంకితము గావించెను. ఆ మహాకావ్యమునందలి పద్యములు కొన్ని లక్షణగ్రంథములందు మాత్రము కనుపించుచున్నవి. ఇపు డా గ్రంథరాజమెందును గోచరింపదనుట సంతాపకరము. ఎఱ్ఱాప్రగడగ్రంథములలో సమగ్రమైనది ఆంధ్రమహాభారతముతో అన్నివిధముల సమానముగా దులదూగ దగినది హరివంశము. ఇట్టి యుత్తమకావ్యమును ఎఱ్ఱాప్రగడ రచించి వేమభూపాలుని కంకితముగావించి యసమానకీర్తి కల్పించెను. ఎఱ్ఱాప్రగడవంటి మహాకవిచే నంకితము నొందగల్గిన వేమారెడ్డి సుకృతము ప్రశంసాపాత్రము. తనజీవితము వైదికధర్మ సంరక్షణము కొఱకును ధనమునంతయు రాజ్యస్థాపనము, చిత్రకళాపోషణము లోనగు సత్కార్యములకును, అవకాశము విశ్రాంతి ధర్మశాస్త్రాధ్యయనాదికములకు నుపయోగము, ఆంధ్రదేశ చరిత్రమునందు బ్రథమగణ్యుడైన వేమభూపాలుని చరిత్రము చాలవఱకు మఱపునకు వచ్చుచున్నదని తెలు పుటకు బరితాపము కలుచున్నది. చిరకాలము వేమారెడ్డి బాహుదర్పమున మొక్కవోని పరాక్రమమున రాజ్యమును బరిపాలించి తన జ్యేష్ఠపుత్రుడును ధర్మవిదగ్రగణ్యుడునగు అనపోతారెడ్డికి రాజ్యభారమునర్పించి కీర్తికాంతను భూలోకమున శాశ్వతముగా నెలకొల్పి స్వర్గలోక మలంకరించెను.

________

హరిహరరాయలు - బుక్కరాయలు

ఆనెగొంది రాజధానిగా జేసికొని ఆంధ్రకర్ణాట దేశములను బాలించుచున్న జంబుకేశ్వరరాయలు డిల్లినుండివచ్చిన మహమ్మదీయ సైన్యముతో జిరకాలము పోరాడి వీరమరణమొందెను. రాజ్యాంగవిదుడగు మహమ్మదీయనృపుడు తన కెంతకును రాజ్యము స్వాధీనము గాకపోవుటచే బ్రజావిశ్వాసపాత్రుడగు హరియప్ప వడయరు అనుమంత్రిని రాజుగజేసి సుంకములు సకాలమున జెల్లించు కట్టుబాటులొనర్చి తన రాజ్యమునకు వెడలి పోయెను.

కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నమై ప్రతాపరుద్ర చక్రవర్తి బంధీకృతుడుగ డిల్లికి యవనులచే గొనిపోవ బడిన పిమ్మట మరల స్వతంత్రరాజ్యస్థాపనమున కవకాశములు కలుగకపోయెను. యవనులధాటి కాగజాలక ప్రజలు సుభిక్ష