ఆంధ్ర వీరులు - రెండవ భాగము/కన్నమదాసుడు

చున్నారు. ప్రతాపరుద్రనామమె యీయనకు లేనపుడు రుద్రదేవుడని వ్యవహరింపక ప్రతాపరుద్రుడనుట యుక్తముగ లేదని మేము రుద్రదేవుడనియే వ్యవహరించితిమి.

_______


కన్నమదాసుడు.

పలనాడు రాజ్యము పాలించు నరసింగరాజు, నలగామరాజు అను రాజులయొద్ద నాయకురాలను రెడ్డియువతి మంత్రి పదవియందు బ్రవేశించి యంతకుముందు మంత్రిగానున్న రేచెర్లగోత్రుడును వెలమ వీరుడునగు శీలము బ్రహ్మనాయని వెడలనడిపించెను. బ్రహ్మనాయడు బాలమలిదేవాది రాజకుమారులను వెంటబెట్టుకొని గురుజాలకు గొంచెము దూరమునందున్న యడవిప్రదేశము తెగనఱకి మాచర్లయను నగరము కట్టించి యందుండెను. బ్రహ్మనాయకుడు పేరునకు మంత్రియైనను రాజ్యచక్రము తానే త్రిప్పుచుండెను. పలనాటి సీమలో బ్రహ్మనాయని దేవునిగా భావించుచుండిరి. ఒక పంచమకాంత చిరకాలము సంతానము లేక పరితపించి బ్రహ్మనాయకుని యనుగ్రహమువలన గొడుకు జనించెనేని ఆయన పాదములచెంతనే పడవేయుదునని మ్రొక్కుకొనెను. దైవవశమున బంచమాంగన నవమాసములు నిండినవెనుక నొక బాలుని గనెను. బాలుని జూడగనే ప్రేమకలిగి బ్రహ్మనాయని కొసంగుదునని మ్రొక్కుకొన్నసంగతి మఱచి తానె పెంచుచుండెను. బాలునకు గొన్నాళ్లకు గొప్ప వ్యాధివచ్చెను. స్వప్నమున నొకపురుషుడు కనిపించి నీవాడినమాట తప్పుటచే గుమారునకు రోగమువచ్చినది. నీమాట చెల్లించుకొందువేని కుమారుడు చిరంజీవి కాగలడని చెప్పెను. పంచమాంగనకు వెంటనే బ్రహ్మనాయని పాదములయందు బడ వేయుదునన్న మాట జ్ఞాపకమునకు వచ్చి ఆరోగ్యము కలుగ గానే వాగ్దానము నెఱవేర్చుకొందునని మ్రొక్కుకొనగా బాలునకు దినక్రమమున ఆరోగ్యము కలిగెను. పంచమకాంత ఒక శుభముహూర్తమున బాలుని గొనిపోయి బ్రహ్మనాయని పాదములముందుంచి యిటుల విన్నవించెను. "మహారాజా! నీవరప్రభావమున నాకీకుమారుడు జనించినాడు. బాలుడు జనించినచో నీపాదములమీద వేయుదునని మొక్కుకొని మఱచితిని. అందుచే దీరని వ్యాధులవలన నిన్న మొన్నటివరకు నవిసినాడు. నావాగ్దానము నెరవేర్ప నుంటిననిమ్రొక్కుకొనగా బ్రతికినాడు. నేనుకన్నంతమాత్రమున దల్లినికాను. నీధర్మపత్నియగు ఐతమ్మయే యీబాలునకు దల్లి. మీరే తండ్రి. బాలునిపోషించు భారముమీది" ఇట్లువిన్నవింపగనే నాయ డానందమొంది బాలుని గై కొని శిరముమూర్కొని పెంచుకొనుమని ధర్మపత్ని కొసంగెను. ఆయమయు బంచమ బాలుడని కొంచెమేని సంశయింపక దాదులచే బాలిప్పించుచు బెంచుచుండెను. సంతానములేదను కొఱతను దిగనాడి యాపుణ్యదంపతు లాబాలకునితో గాలయాపనము జేయుచు నొక శుభలగ్నమున నాతనికి కన్నమదాసుడని నామకరణము గావించిరి. కొంతకాలమునకు గన్నమదాసుడు పెద్దవాడై పాఠాలలకేగి సమస్తవిద్యల నభ్యసించిన పిదప గరిడీ సాము వ్యాయమములు గూడ నేర్చుకొని జెట్టియయ్యెను. వర్ణాశ్రమ ధర్మములకు మిగుల బట్టుగల యాకాలమున బ్రహ్మనాయకుడు పంచముని జేరదీసెనని నిందింపసాగిరి. కొందఱు కన్నమనాయనియెడ నకారణద్వేషము ప్రకటించుచుండిరి. ఎందఱెన్ని విధముల నాందోళన పడుచున్నను పుణ్యదంపతులగు ఐతమ్మయు, బ్రహ్మనాయకుడు మాత్రము పుణ్యభావముతో నాబాలుని జూచుచుండిరి. కొంతకాలమునకు ఐతమ్మ గర్భవతియయ్యెను. బ్రహ్మనాయని యానందమునకు మేరయేలేదు. సంతోష సూచకముగా మాచెర్ల చెన్నకేశవున కెన్నియో ఉత్సవములు, వేడుకలు చేయించి నాయడు మహావైభవముగా సీమంతోత్సవము జరిపించెను. శుభముహూర్తమున ఐతమ్మకు జక్కనికుమారుడు జన్మించెను. బాలచంద్రునివలె బ్రకాశించు నాకుమారరత్నమునకు బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని నామకరణము గావించి శాస్త్రపారంగతులగు బ్రాహ్మణోత్తముల రావించి బాలుని జనన తిధి నక్షత్రత్రాదులను దెలిపి జాతకము వ్రాయుడని కోరెను. నాయకురాలివంపున వచ్చిన వంచకబ్రాహ్మణుడు తన విద్యాప్రకటనము గావించి బ్రహ్మనాయుని లోగొని జాతకమువ్రాయుదునని చెప్పి సెలవొంది కొన్నిదినములకు సభచేయించి అందుజాతకపత్రికను బఠించెను. 'బాలచంద్రుడు మిగుల దుర్మార్గుడగును. వాని జన్మనక్షత్రము చెడ్డదగుటచే దనవారికి బెరవారికిగూడ నిత డకాలమృత్యువై సర్వకుటుంబములు రూపు మాపగలడు. బాలకునివలని యపాయము తొలగింపవలయుననిన దెగటార్చుట తప్ప వేఱుకర్తవ్యములే'దని కపటజ్యోతిష్కుడు చెప్పెను. సభ్యులు, రాజబంధువు లొకరి మొగము లొకరు చూచుకొని బ్రహ్మనాయకుని కేమియు జెప్పజాలక మిన్నకుండిరి. ఇదియంతయు బ్రహ్మనాయడు కనిపెట్టి పుత్రప్రేమను దిగనాడి సభ్యులందఱి నడిగి యనుమతి దెలిసికొని బాలునిజంపుటకే నిశ్చయించుకొనెను. అంతలో నొక వృద్ధుడు లేచి 'బ్రహ్మనాయకా! బాలునిజేతిమీద జంపుటయన్న సామాన్యకార్యమా? ఎవరికి జేయాడును? సముద్రమున బాఱవేసిన వాడె చచ్చును. అదియె కర్తవ్య'మని తెలిపెను. బ్రహ్మనాయడు పెచ్చుపెరుగుశోకము నాపుకొని తన యభిమానపుత్రుడగు కన్నమనాయకుని బిలువనంపించి ఐతమ్మకడ జనుబాలుద్రావుచున్న యేపాపము నెఱుంగని బాలచంద్రుని దెప్పించి యీబాలకుని సముద్రములో బడవేసి రమ్మని యిచ్చెను. కన్నమనీడు చాలవిచారపడి బ్రహ్మనాయకుని మాటకు బదులుచెప్పజాలక సభ్యులే నివారింతు రేమోయని వారల విచారకరములు, ప్రార్థనాపూర్వకములగు చూపులతో జూచెను. సభ్యులందఱును బ్రహ్మనాయకునియాజ్ఞను సత్వరముగా నెరవేర్పుమని కన్నమనాయకుని బ్రోత్సహించిరి. బ్రహ్మనాయకుడు తొందరపెట్టెను. కన్నమనాయకుడు 'కనులుదెఱువని పసికందును అన్యాయముగా జంపవలసి వచ్చినదే! ఈపసిపాపని కాపాడ జాలని నాబ్రదుకు గాల్పనా? నే నస్వతంత్రుడను. జనకుడగు బ్రహ్మనాయకుని ఆజ్ఞకు వ్యతిరేకము జరుపదగదు. అనుకొనుచు బ్రహ్మనాయకుని కనుసన్నల ననుసరించి సముద్రతీరమునకుబోవ చందవోలునకు బ్రయాణమయ్యెను. రాజమందిరమునందును పట్టణమునందును బ్రహ్మనాయకుని గృహంబునను నాడు విచారమునకు మేరలేకుండెను. కన్నమనాయకుడు మండువేసంగిలో బాలునొక తొట్టెలోనుంచికొని పైనిగుడ్డలుకప్పి త్రోవకడ్డమగు ప్రతిగ్రామము నందును, బాలిప్పించుచు గొంతసేపటికి జందవోలు చేరెను. ఆకాలమున గల నగరరాజములలో చందవోలు ప్రఖ్యాతమైనది. చుట్టును బ్రాకారములు, కోటలు కలవు. క్రొత్తవాడెవ్వడు నగరమున నడుగుబెట్ట వీలులేక పోవుటచే గన్నమనాయడు బాలకునెటులో నగరముబయటనుండి సముద్రతీరమునకు జేర్చెను. జాముప్రొద్దు పోయెను. అంధకారము నలుదిక్కుల బాగుగా నావరించి యుండెను. బాలుడు ఆకలిగొని యేడ్చుచుండెను. చేతులార పసిపాపని సముద్రములో బాఱవేయ జాలక కన్నమ నాయకుడు మైమఱచి యెలుగెత్తి యేడువసాగెను. దిక్కులేని సముద్రప్రాంతమున వారల నోదార్చువా రెవరు? కన్నమనాయ డిటుల నేడ్చుచుండగా జెంత నెవరో "ఎవరునీవు? ఈయర్థరాత్రమున నిర్జనప్రదేశమందు విలపించుటకు గారణమే"మని యడిగిరి. వారిరువురు నీక్రిందివిధముగా జీకటిలోనే సంభాషించుకొనిరి.

"ఎవడవు నీవు? ఇచటికేల వచ్చినాడవు?"

"నేనెవడనో నీకు జెప్పవలసిన యవసరములేదు. ఊరక ప్రసంగింపక నీవు వచ్చినత్రోవను బొమ్ము! నీకిచట నేమిపని?"

"నేనెవడనో నీకుదెలుపువఱకు నీవృత్తాంతము తెలుపవుకాబోలును. జాగ్రత్తగా నొడలెఱింగి నీ కులశీలముల దెలుపుము, లేదా నిన్నుఖండింపక మానను."

"సంగరమునకు దొరకొన్నచో నన్ను నీవు ఖండింతువని యెటుల జెప్పగలవు? విజయము బలాబలములపై నాధారపడి యుండును. ఒకవేళ నీవే గతింతువేమో!"

"మితిమీఱి భాషించుచున్నాడవు. నీవు దొంగవాడవు కానోపుదువు. కాదేని నీవృత్తాంతము మరుగుపఱుపవలసినపని యేముండును? నగలకొఱ కీబాలకుని జంపుచుంటివి కాబోలు"

"నిన్నుమాత్రము చంపక విడుతునా" చీకటిలోనున్న నూతనపురుషుడు హుంకరించుచు నొఱలోని కత్తిపెరికి కన్నమనాయుని మీదికి వచ్చెను. కన్నమనాయడు కరవాలము దీసికొని నూతనునిపైకి బోయెను. ఇరువురు చాలసేపు భయంకరముగా యుద్ధముగావించిరి. ఇరువురకు దేహమంతయు రక్తమయమయ్యెను. నూతను డాపరానికోపముతో "ఈవ్రేటునకు నీతల తెగ గొట్టనేని నేను బ్రహ్మనాయని తమ్ముడనుగాను" అనిపలికెను. కన్నమనాయ డులికిపడి కత్తినేలపై బడవేసి నూతన పురుషుని పాదములపై బడి, అయ్యా మీరింతకుముందు బ్రహ్మనాయకుని బేర్కొంటిరి. మీ నామధేయమేమి? నేను బ్రహ్మనాయకుని యభిమాన పుత్రుడను. మీవృత్తాంతము వినుటకు నిరీక్షించుచున్నాను" అని పలికెను. నూతనుడు తాను శీలము బ్రహ్మనాయకుని సోదరుడనియు జందవోలు పాలించు రాజులయొద్ద సేనానాయకుడుగ నుండెననియు దనపేరు పేరినీడనియు దెలిపెను. నూతనుని కన్నమనాయడు కౌగిలించుకొని 'తెలియక సంగరమునకు కొరకొంటిని క్షమింపు'మని వేడుకొనెను. పేరినీడు కన్నమనాయనివృత్తాంతము, బాలచంద్రుని సముద్రములో వేయవలసిన పరిస్థితులు దెలిసికొని పరితపించెను. పేరినీడు కన్నమదాసునితో 'బాలకు నన్యాయముగా సముద్రములో వేయుటకంటె బాపము వేఱొండులేదు. నాకొసంగినచో బెంచుకొందును' అనెను. బాలచంద్రుని గన్నమనాయడు పేరినీని కిచ్చి సెలవు పుచ్చుకొని బ్రహ్మనాయకునితో విధ్యుక్తధర్మము నెఱవేర్చితినని విజ్ఞాపనము జేసికొనెను. బ్రహ్మనాయడు, ఆతని పత్నియుగొంచెముసేపు దు:ఖించి క్రమముగా విచారము మఱచిరి. కొన్నిసంవత్సరములు జరిగినమీదట పేర్నీడు బాలచంద్రుని తన వెంటగొని బ్రహ్మనాయకుని కప్పగించి సుగుణరత్నాకరుడగు కుమారుని జంపుదురా? కన్నమనాయనిదయచే నీశిశువు బ్రదికినాడు. లేకున్న మనవంశము నశింపవలసినదే గదాయని నిష్ఠురములాడెను. ఐతాంబయు బ్రహ్మనాయడును దనకుమారుడు మఱల వచ్చినందులకు బ్రహ్మానందము నొంది యింతటియదృష్టము కలుగజేసిన కన్నమ నేడు ప్రశంసాపాత్రుడని యాతని వేయినోళ్ళ గొనియాడిరి. నాడు మొదలు కన్నమనీడు బాలచంద్రునిపై దన పంచ ప్రాణములుంచి యతనిశ్రేయస్సే తనదిగా భావించి తానెఱింగిన విద్యలన్నియు నాతనికి నేర్పుచు వెంటనిడుకొని త్రిప్పుకొనుచుండెను. బాలుని విద్యావివేకములకు గన్నమనేని సోదరప్రేమకు బ్రజలందరు. సంతసించిరి.

కొంతకాలము గడచినమీదట నాయకురాలు మాచెర్ల వైభవము చారులవలన నాలించి యెటులేని బ్రహ్మనాయకుని, రాజకుటుంబమును బరాభవింప దలంచి పలువురు దొంగలను బిలువనంపి వారి నందఱను మాచర్లలోని రాజమందిరము, బ్రహ్మనాయకుని గృహము దోచిరండని పంపెను. దొంగలు సకాలమునకు జంద్రవంకనదీతీరమున జేరి భోజనాదు లొనరించి దొంగతనమునకు సమయ మరయుచుండిరి. బురుజు పై నెక్కి బ్రహ్మనాయకుడుగాంచ బలువురు నూతనులుకనిపించుటచే ననుమానించి అభిమాన పుత్త్రరత్నమగు కన్నమనాయని పిలిచి దొంగలేయైనచో దగినబుద్ధిచెప్పి రమ్మని పంపెను. కన్నమనాయడు పరివార సహితుడై చంద్రవంక నదీతీరమున నున్న కంచె చెంతనిలచి యాలింపగా బ్రసంగముల వలన వచ్చినవారు దొంగలనియు నాయకురాలిచే బంపబడి మాచర్లదోచుటకు వచ్చిరనియు దెలియవచ్చెను. వెంటనే కన్నమనాయడు పరివారముతో ముందునకు దుమికి ఏప్రయత్నములు లేక యిష్టగోష్ఠిసలుపుచున్న దొంగలనందఱ బంధించి వారియొద్ద గల యాయుధము లన్నింటిని రాచనగరునకు బంపి గోనెల దెప్పించి వానినిండ నిసుకనించి దొంగల నెత్తిపై బెట్టించి గురుజాలకు నడిపించి అందఱ నొక దొడ్డిలోనికిందోలి తాను ద్వారము గాచియుండెను. కన్నమనాయడు ------ బంపబడిన చోరులను బరాభవించినందులకు నాయకురాలు కోపించి తూలనాడెను. కన్నమనాయడు నాయకు రాలు యొక్క దురంతము గురిజాల వాసులందఱకు దేటతెల్ల మగునట్లు నాయకురాలి నిందావచనము లన్నింటికి బ్రత్యుత్తరము నొసంగి గృహాభిముఖుడయ్యెను. ఎంతకును కన్నమనాయకుడు రాకపోవుటచే బ్రహ్మనాయకుడు తెల్లవారి విచా రింపగా గురిజాల కేగినటుల దెలియవచ్చెను. మధ్యాహ్నమైనను కన్నమనాయడు గురిజాలనుండిగూడ రాకపోవుటకు జాలచింతించి బ్రహ్మనాయడు స్వయముగా గురుజాలకు బయనమయ్యెను. కన్నమనాయడు తప్పక సురక్షితముగా రాగలడు. మీరు గురుజాలకు బోవలదని నాయనితో భటులు, ఆప్తులుచెప్పిరిగాని ఆతడు వినక బయలుదేరెను. కన్నమనాయడు గావించిన పరాభవము తలంచికొని నాయకురాలు ప్రతిక్రియకొఱకు వెదకుసరికి బ్రహ్మనాయకుడు గురిజాల చేరి తనకుమారుడు సురక్షితముగా జోరులను వంచించిన విషయము విని చాలసంతసించెను. నాయకురాలు గురిజాల నడివీధిలో కోడి పందెములు, పొట్టేళ్ళ పందెములు, పికిలిపిట్టల పందెములు. కౌజు పందెములు, పెట్టి యెటులో బ్రహ్మనాయకు నొప్పించి యందు దానెగెలిచెను. ఓడినవారు ఏడుసంవత్సరములు అరణ్యభూములలో నివసించి పిదప రాజ్యము బొందునటుల గట్టడి చేసికొనుటచే బ్రహ్మనాయకుడు పరివారముతో నడవులపాలై నియతకాల మెంతో శ్రమమీద జరిపి తన రాజ్యము తనకు వశముచేయుమని రాజకుమారుల పక్షమున నలగామ రాజాదులకు వర్తమాన మంపెను. కన్నమనాయడు రాయబారములతో గార్యమెన్నటికేని యనుకూలింపదనియు ఏడు సంవత్సరములనుండి రాజ్యమును జూరగొన్న విరోధులు మాటలతో దిరుగ రాజ్యము నొసంగ రనియు సంగరమున కాయితమగుట యుక్తమనియు బ్రహ్మనాయకునితో విన్నవించెను. బాలచంద్రుడు గూడ సంగరము చేయుటయందు దనకుగల యుత్సాహము సూచించెను. బ్రహ్మనాయకుడు కొమ్మరాజు పుత్రుడును ప్రతిపక్షరాజగు నరసింగరాజున కల్లుడునగు అలరాజును సంధివిషయమై ప్రసంగించుటకు గురిజాలకు వృద్ధబంధుజనానుమతంబున బంపెను. సంధిప్రయత్నము వ్యతిరేకమైనచో సంగరమునకేని సిద్ధముగా నుండవలయునని బ్రహ్మనాయడు బంధువులకు ఆప్తులకు ముందుగ దెలిపి యుద్ధపరికరములను జాగ్రత్త పఱచు చుండెను.

బ్రహ్మనాయని పక్షమువారికిని నాయకురాలిపక్షమువారికిని సంధికుదురకపోయెను. సవతితల్లికుమారులగు బాలమలి దేవాదులకు రాజ్యములో భాగమునీయమని నలగామరాజు ఖండితముగా దెలిపెను. రాయబారమునకు నేగిన అలరాజును నిర్దయగా వధించిరి. ఏడుసంవత్సరములు అజ్ఞాతవాసముజేసి వచ్చిరని గూడ సవతితల్లి కుమారులపై నలగామరాజునకు నరసింగరాజునకు నాయకురాలికి గరుణరాదయ్యెను. సంగరమునకు గారముపూడిచెంత నాగులేటితీరమున గల విశాలప్రదేశమును నెలవుచేసికొని యుభయపక్షములవారు చాల భయంకరముగా బోరాడిరి. కన్నమనాయడు డీసమయమున సంగరవిధమును బ్రహ్మనాయని కెఱుగ జేయుచు నుండెను. శత్రు పక్షము విస్తారముగ నుంటచే బ్రహ్మనాయడు కన్నమనాయకుని బ్రోత్సహించి విజయము గలుగువఱకు సంగరము గావింపుమని వీర తాంబూలము నొసంగెను. కన్నమనాయడు భైరవఖడ్గముబట్టుకొని యుద్థరంగమున కుఱికి శత్రువుల నందఱను అరటిచెట్టులను నఱకినటుల నఱుకుచుండెను. వీరు లెవరును కన్నమనాయని నెదిరింపజాలరైరి. రణరంగము క్షణముసేపులో రక్తప్రవాహములతో నిండిపోయెను. ఎక్కడజూచిన తానయై కన్నమనాయడు బ్రహ్మనాయకుని యాన శిరసావహించి శత్రుబలమునంతయు నిరపశేషముగావించెను. ఉభయపక్షములందును బేరుగల వీరులందఱు మరణించిరి. ఏకపుత్రుడగు బాలచంద్రుడు గూడ మరణించెనని బ్రహ్మనాయకు డించుక విచారపడి మఱల ధైర్యము కొని కర్తవ్యము యోచించుసరికి కన్నమనాయడువచ్చి నాయకురాలు దక్కమిగిలిన శత్రుబలమంతయు నాశనమయ్యెనని విన్నవించెను. బ్రహ్మనాయుడు కన్నమనాయని గౌగిలించికొని 'కుమారా! నాఋణముతీర్చికొంటివి. నీకదనప్రశస్తి లోకమునంతయునచ్చెరువు పెట్టినది. మనము ప్రపంచములోనికివచ్చి పుణ్యమో పాపమో గడించితిమి. ఆప్తులందఱు మరణించిరి. నాయకురాలొకతె జీవించి యేమి ప్రతిఘటింప గలదు? కావున మనమిక నూర్ధ్వలోకముచేర నదను సమీపించినది. సంగరమునకు ముందు మన కులకాంతల నందఱను మేడపిలో నుంచివచ్చితిమి. వారలనందఱను ఇచ్చ టికి గొనిరమ్ము, విశ్వాసపాత్రుడవు నీవు పోయినగాని వారురారు. తత్క్షణమ కొనిర'మ్మని చెప్పెను. కన్నమనాయడు ఆనవాలుగా బ్రహ్మనాయకుని ఖడ్గము దీసికొని మేడిపికిబోయి యటనున్న కాంతాసమూహమునకు సంగరక్రమము నంతయు నివేదించి బ్రహ్మనాయకుని యాజ్ఞదెలిపెను. రాజపత్నులు, కులకాంతలు, తమ బంధుబృందము మరణించి నందులకు జాలసేపు దు:ఖించి బ్రహ్మనాయని సన్నిధికి బ్రయాణమైరి. బ్రహ్మనాయడు గతించిన వీరుల యస్థికలు దీసికొని సమీపమునందున్న గుత్తికొండ బిలములోని ప్రవాహము నందు గలుపబోవుచు గులకాంతల నందఱను వెంటగొని యందుబ్రవేశించి యొక్కొక్కరి పేరుతో దిలోదకము లొసంగుచుండెను. బ్రహ్మనాయడు సకుటుంబముగా బిలములోనికి బోయి యున్నాడుగావున నీసమయము బిలద్వారము మూసితిమేని యాతడు మడియగలడని తలంచి నాయకురాలు కొందఱు భటులను ద్వారము మూయబంపెను. కన్నమనాయకుడా సంగతిగ్రహించి ద్వారము మూయుచున్న వంచకులనందఱను ఖండించి వారలను బ్రోత్సహించిన నాయకురాలినిబట్టి తెచ్చెను. బ్రహ్మనాయడు వీరులందఱకు ఉత్తరక్రియలాచరించినంతనె వీరకాంతలందఱు సహగమనము సలిపి పుణ్యలోకములు బడసిరి. నాయకురాలు బ్రహ్మనాయని పాదములకు నమస్కరించి యెఱుంగక కావించిన సాహసమునకు మన్నింపు మని ప్రార్థించెను. దయాస్వభావుడగు బ్రహ్మనాయకుడు నాయకురాలికి బూజాకుసుమములు, తీర్థము నొసంగి యాదరించి బిలమునందలి ప్రవాహమునందు జొచ్చి యదృశ్యమయ్యెను. కన్నమనీడు బ్రహ్మనాయనికి భక్తివిశ్వాసములతో దర్పణాదు లొసంగి తానును బ్రవాహమున జొచ్చి యంతర్హితుండయ్యెను.

కన్నమనేడు ఆకాలమున మిగుల హీనముగా భావింపబడు పంచమకులమందు బుట్టినను బుద్ధివిశేషమునను ధర్మాచరణమునందును భూతదయయందును అగ్రవర్ణులకంటె యోగ్యుడని ప్రశంసింప దగినవాడు. ఈతడు పిత్రాజ్ఞానిర్వహణమునందు శ్రీరామచంద్రునకు, సోదరవాత్సల్యమునందు ధర్మరాజునకు, బరాక్రమమునందు గర్ణునకు సమానుడు. దీనత్రాణ పరాయణుడును సర్వభూత ప్రియుడునగు బ్రహ్మనాయని క్రమశిక్షవలననే కన్నమనాయడు విఖ్యాతినందెను. అగ్రవర్ణులమని చెప్పుకొను వీరపురుషులు సంస్కర్తలై బ్రహ్మనాయనివలె బంచముల బ్రేమించి యుచితవిద్యా వివేకమునుప్రసాదించి ముందునకు గొనితెచ్చినచో నాడుమొదలు నేటివరకు నెందరు కన్నమనాయనివంటి వీరచూడామణులు, దేశభక్తు లుదయించువారోగదా! పలనాటి యుద్ధములో గతించిన వీరులతోబాటు కన్ననాయనికి గూడ వీరపూజ నాటినుండి నేటివరకు జరుగుచున్నది. కన్నమనాయని నేటికిని బంచములకంటె నితరాగ్రవర్ణులే విశేషించి పూజించుచున్నారు. దేశభక్తి, బలపరాక్రమములు, పితృభక్తి, ధర్మనిష్ఠ, సేవాదీక్ష లోనగు మానవ ధర్మములను నిర్వహించుటలో నసమానుడగుకన్నమనేని యాదర్శములు ఆంధ్రలోకమునకు మార్గదర్శక మగుగాక!

[ఆంధ్రమంత్రులు అను గ్రంథమునందలి బ్రహ్మనాయని చరిత్రము, ఆంధ్రవీరులు మొదటిభాగమునందలి బాలచంద్రుడుఅను వీరులచరిత్రము బఠించినచో గన్నమనేని చరిత్రమునందు సూచింపబడిన ప్రధానకధాంశములు ద్యోతకమగును.]

________

వేమారెడ్డి

ఆంధ్ర రాజులలో రెడ్డివారు ప్రధమగణ్యులు. స్థానాం -- ములం దుంటచే వీరు జాతిసాంకర్యములు కలుగకుండుటకు దమశాఖను బెక్కుఉపశాఖలుగా విభజించి యందుండి గుంపులని చిన్నతెగల విడదీసి సంబంధ బాంధవ్యములు జరుపుకొనుచున్నారు. వీరలు చిరకాలమునుండి ఆంధ్రదేశమునందు నివసించి కాకతీయ సామ్రాజ్యము మహోన్నత దశయందున్నపుడె స్వతంత్రరాజులుగ సేనాధీశ్వరులుగా నుండి క్రమ