ఆంధ్ర రచయితలు/సమర్పణావతారిక

సమర్పణావతారిక

ఇది పదియేండ్లనాడె రచియించుతలంపులు లేతవంపుగా
బొదలి, సరస్వతీకరుణ పొంగులుదేరగ, పేరు నాదిగా
గదలిన ' ఆంధ్రి ' నొక్కొకటిగా బ్రకటించుచు వచ్చినాడ; నీ
బ్రదుకున కాయదృష్టమును బట్టకపోయె నొకింత కాలమున్.
అది మూడేడుల ముచ్చటై నడచిపో - నల్లల్లనన్ సాహితీ
హృదయస్పందము గుర్తులందుకొని ' ఆంధ్రీ ' పత్త్రికారత్న మ
భ్యుదయ చ్ఛాయల కెక్కుకాలమున నయ్యో ! పాపినై యాపికొ
న్న దరిద్రుండను; నిద్రలో గలవరింతల్ నేటి నాయూహముల్.

నాట ననిచిన యీ కూర్పు నేటి కిటులు
పెనిచి, మాతల్లి నెత్తిపెంచిన జనకుడు
రాజయోగి: శ్రీ ఆకొండి రామమూర్తి
శాస్త్రి కుడుగరలిడుదు బుష్పసరభరము.
ఇచ్చుటయు, వారు మేమును బుచ్చుకొనుట
మూడు తరముల యాచారముగ రహించు;
నిపుడు మాయdi పయిచేయి; యిచ్చువాడ
నేను; నాకృతికి బ్రహిగ్రహిత తాత.
' పోల్వరము ' వెళ్లి వచ్చునప్పుడదియేమొ !
వెక్కసం బౌను, అమ్మమ్మ వెర్రిప్రేమ;
ఆమె కనులు కృపాఝరు; లామె వోయు
దీవనలు లేక రాలేను రేవుదాటి.

మువ్వపుమోసులై యమృతమానసులై కనటింతలేని లే
నవ్వులరాసులై మెరసినార లఖండరసస్వరూపు; లా

మువ్వురు మేనమామలయుపోలిక నాయెడ గూడి వచ్చినం
బువ్వులబాట లంచనడపుల్ గద ! మత్కవితా చిరంటికిన్.

పొరలున్ - పోరులు లేక భావములు పూవుల్ తావులైహత్తు మూ
వురు మేనత్తల కూర్మిలో గరంగిపోవు న్నామన; స్సంతలో
బిరుసుల్వోవును బెద్దయల్లుదనపుంబింకమ్ము; నా కంతలో
భరమైపోవును వారివారి యమృత స్వాదూర్తి మర్యాదలున్.

వేడ్క దాతయ్య కూర్చున్న వీధియరగు
పండ్ల బరువున నొరగు కల్పద్రుమంబు
చేరి మామయ్య లొదుగు దక్షిణపువైపు
పోకంరాకులు, తములపుటాకు దోపు.

విందులకో మందులకో
యెందులకో పేరుచెప్పి యేతెంచు హితుల్
బందుగులు నిత్యమును బది
మందిగదా, వారి సదన మాధురి యదిరా !

మఱియొక ముచ్చట - అచ్చట
బఱిచిన భోజనపు బంక్తి పరికింపవలెన్
వరికళ్ళము చేరిన పా
పురముల వలె వచ్చి మెసవి పోదురు నిసువుల్.

కొడుకులు మన్మలుం జిఱుత కుఱ్ఱలు బందువు, లల్లువారు, పే
ర్వడిన కవుల్ ప్రియాతిథులు పర్విన చుక్కలబంతిలోన జం
ద్రుడు వలె "గందమక్షతలతో" గళతో-నభిరామమూర్తి యే
ర్పడ నమృతన్నపుం జవులు పట్టును తాతయ, యెట్టి ధన్యుడో !

ఎనుబది యేండ్లకున్ దరికి నొక్కి తొనంకిసవాడు తాత - జ
వ్వనముననుండి పెంపుగనువాడగు నీమనుమండుకూడ - ని

ల్వని యది నిశ్చయం; బిక నిలాస్థలి నీయుభయైక నిష్ఠ బం
ధన బరమార్థ మీకృతిగదా, యొకకొంతకు గొంత నిల్చినన్.

ఏమో ! యీ కృతి యంతశాశ్వతమటోయీ ! యందురా, కాదుకా
నీ, మాధుర్యధురీణ కావ్యరచనా నిత్సోత్సవ శ్రీ కళా
ధామల్ నూర్వురు పెంచు నీయమృతగాథా జ్యోతు లీనాటితో
నే, మిన్నందియు నట్టి "మందకొడు" లౌనే, యెట్టు లూహించినన్.

' ఇది యి ' ట్లని పేర్కొనగా
గుదురని యొక కదలి పోని గూఢాశయ మె
య్యదియో నను గదలించెడి-
నదిగో, మాతామహార్పణాభిలషితమై.

అంబరములు తొడవు లగ్రహారమ్ములు
సంచకార మభిలషించలేదు ;
వ్రాయ దోచి వ్రాసి - బ్రహ్మార్పణైకతా
త్పర్య మదర సుకృతి తాత కిడెద.


సమర్పణము

తాతయ్యా, కొనుమయ్య, యీ చిఱుతపొత్తం బుత్తమ శ్లోక గా
థా తాత్పర్య ననాధమై యలరి యంధ్రక్షోణి రాణించు ! నీ
కేతత్ స్వీకృతి దొడ్డగా; దయిన - దౌహిత్రుండనై పూజ్యపూ
జాతంత్రంబున నప్పులోగు నను విశ్వాసంబుతో నిచ్చెదన్.

సాగిన జీవితంబు, చెయిచాపని భావము, కీర్తిలిప్సకున్
లోగమి - రాగ నిస్పృహత - లోకము దాటినచూపు - నిన్నిటం

దాగిన కోవిదుండనగు త్వత్కవితా గజగర్భ పద్ధతిం
దోగినవాడ ; నీ నినువు దోయిట బోయుము పండుదీవనల్.

అరయిక చేసికో నొకటి యాత్మకు దోచెను నాకు ; అమ్మతో
సరణముగా గవిత్వధన మంపితి వింపిత ; మట్లు పిత్ర్యమై
సిరి నను సంక్రమించుటను జేసి భవస్కృతముం గృతజ్ఞతా
భర హృదయంబునం దలపు నాఱగ జెప్పెద ధన్యవాదముల్.

పసినాటం దనతండ్రి బాసి పసవింపందీసి - మానాన్న కా
రనుతో పాటుగ " వైద్యలక్షి " నిడి తౌరా ! నాటి నీ ప్రేమపుం
బస నీనా డొక భౌమనందన ననీ ప్రాగ్భారమై మాడు పం
గన మింపారెడి నన్నచో నతిశయోక్తం బౌనొ లోకానకున్.

తిరుపతి కవీశ్వరులు ' దేవి చరిత ' రచన
బసదనాన నర్ధానన మొసగి రనగ -
నీకవిత్వాధికృతులు గణింప దరమె !
నీకు నాయిచ్చుకాన్క యుల్లాకుతుంక.

ఇలువేల్పై కరుణించి పూటపడి నీ
          కేలోటునున్ రాని య
యట్టులు దీవించెడి ' కామవల్లి ' కృప గ
         ట్టుల్ దాటి నామీద, పొం
గులుగట్టన్ మఱియెన్ని కట్టుదునొ, ని
        గ్గుల్ దేఱు నేతాదృ గు
జ్జ్వల బంధంబులు, భావబంధుర కృతుల్
         భాషా విభూ షోన్నతుల్.

రాజమహేంద్రవరము వికృతి శ్రావణి

-సత్యనారాయణశాస్త్రి