ఆంధ్ర రచయితలు/కథాపీఠము
కథాపీఠము
ఆంధ్రకవిత నన్నయ మొదలు చిన్నయదాక నొకతీరున సాగినది. నడుమ నడుమ గొన్ని మార్పులు కలిగినను అవి యల్పములు. ఈ కవితా నుడి ఇంచుమించు చిన్నయసూరి నాటినుండి వాజ్మయ వాహిని క్రొత్తదారులు తీసినది. ఈత్రోవలెల్ల క్షుణ్ణము చేసిన మహాశయులు వీరేశలింగము పంతులుగారు. కొన్నిటిని మార్గదర్శిత్వమే పంతులుగారిది. నవలలు, వ్యాసరచనలు, కవిజీవితములు, స్వీయచరిత్రములు, కథానికలు, ఖండకావ్యములు, ప్రహసనములు, గ్రంథవిమర్శనములు, నాటికలు, చరిత్ర పరిశోధనము, పత్త్రికాప్రచురణము - ఇత్యాదులు నేటి సారస్వతవృక్షము చేసిన క్రొత్తకొమ్మలు. ఈకొమ్మ లెల్ల ముమ్మరముగా జూచి కాచుచుండుట నేడు పరికించుచున్నాము. పయి పట్టికలోని వన్నియు నపూర్వము లనుకొనముగదా, ప్రకృత కాల పరిస్థితుల ననుసరించి మన కాత్రోవలు కొన్ని కావలసి గట్టిచేసికొంటిమి.
వీనిలో కవిచరిత్ర రచన మొకటి. శ్రీ వీరేశలింగము పంతులుగారు బహు పరిశ్రమకు బాల్పడి ఆంధ్రకవుల చరిత్రలు సంపాదించి వెలువరించిరి. అంతకుమున్ను శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగా రాంగ్లేయుల మార్గము నాశ్రయించి కవి జీవితములు ప్రచురపరిచిరి. గురుజాడ వారి రచనపై వీరేశలింగముగారి కూర్పు సంస్కరణ పూరణములు కలదిగా వెలసినది. కావలి వేంకటరామస్వామి యనునాయన ఆంగ్లభాషలో గొంద రాంధ్రకవులను గూర్చిన చరిత్రలు వ్రాసి 1847 వ యేట బొంబాయిలో వెలువరించినారని మిత్రులు చెప్పుట. బ్రౌనుదొర తన నిఘంటువున బ్రసంగమున గొందరు ప్రాక్తనకవులను గూర్చి యించించుక వ్రాసెను. ఇవి బొత్తిగా చాలనివి. గురుజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితములు 1873 లో మొదలై పదేండ్లకు బూర్ణముగా బయట బడినది. వీరేశలింగము పంతులుగారి కవిచరిత్రము 1865 నాటికి ప్రకటితము. పంతులుగారి కూర్పు తెలుగూ వారికి మేలుబంతి. ఇటీవల నిటీవల విడివిడిగా, విపుల విపులముగా కవి జీవితములు వ్రాయుచున్నారు. విస్మృతాంధ్రకవి చరిత్రములు పెక్కురు బయట బెట్టుచున్నారు. తెలుగులోని కవులు సాగరములోని రత్నములు. అన్వేషించిన కొలదిని వెలువడుచునేయుందురు. మరుగు పడిన కవులను జతపరిచి క్రొత్తపరిశీలనమునుబట్టి సవరింప వలసినవి సవరించి కవిచరిత్రలు సంస్కరణ పూరణములతో పునర్ముద్రణమునకు దెచ్చుట యెంతో మేలిపని. ఎరిగినందాక, పూర్వాంధ్ర కవుల చరిత్రములు పూర్తిగ గ్రహింపబడినగాని, ఆధునిక కవిజీవితములు వ్రాసిన తృప్తి యుండదు. ఈ మహత్తర కార్య నిర్వహణమునకు బూనుకొనుట శ్రీ వీరేశలింగము పంతులుగారి పవిత్రాత్మ తృప్తికి గూడ హేతువు.
రచయితృ శబ్దము కవి, విమర్శక, పరిశోధకాది సర్వసామాన్య రచనకార వాచక మగునని యాలోచించి యిపు డీకూర్పునకు ' ఆంధ్ర రచయితలు ' అను పేరు పెట్టనాయెను. వినుకటివలె గాక, వర్తమాన సారస్వతము వేయిపడగలై విస్తరిల్లిన దనుకొంటిమి. ఒక పద్యకవుల చరిత్రములే సంధానించినచో, యావజ్జివము చరిత్రాన్వేషణము చేసిన పరిశోధకులు - సంపుటముల కొలది విలువగల విమర్శనములు వ్రాసిన పండితులు - మున్నగువారు, చరిత్ర కెక్కక మరుగుపడవలసినదేనా ? ' రచయితలు ' అన్నచో బాధ యుండదు, ఈ యూహతో నీనామకరణపు మార్పు జరిగినది.
ఇపు డీ మొదటిపాలున - నడుమనున్న - అనగా 19వ శతాబ్దికి జెందిన జనన తిథులుగల నూరుగురు రచయితలను గూర్చిన జీవిత కవితా సమీక్ష లున్నవి. లో జన్మించిన పరవస్తు చిన్నయసూరితో నీగ్రంథము మొదలగుటలో సూరి శతాబ్దారంభములోని వాడనుటయే కారణముగాక, నీతిచంద్రిక రచనచే గద్యవాజ్మయమునకు గ్రొత్తవెలుగునిచ్చి కొన్ని క్రొత్తదారులు తీసినవాడగుటయు గారణ మగుచున్నది. సాధారణముగా, కవుల పుట్టుకలనుబట్టికాక, గ్రంథ రచనలను బట్టియే చరిత్రములు సంధానించుట యాచారము. నేను అది పెట్టుకొనక, పుట్టుకలనుబట్టి యీ శతాబ్దిలోని వారని యేరుకొంటిని. జాగ్రత్తగా, చూచినచో మరియొక వందకాదు, కొన్నివందలమంది మహారచయితలు శతకమునకు సంబంధపడినవా రుందురు ; ఉన్నారు. వారి నెల్లరను దేర్చి చేర్చిన గాని యీ కూర్పునకు సమగ్రత సిద్ధించె నన గాదు. కాని, ఇప్పటి కిది నాసేవాలేశము. దైవాదేశ మయిననాడు, ఈ గ్రంథము సుపరిపుష్టము కావచ్చును.
ఇపు డిచట ఆరాధింపబడినవారు గాక, మరియెందరో మహనీయులు తలపున కందినవారి క్షమాభిక్ష నేను వేడవలసియున్నది. ఈ మహనీయులలో గొందరి జనన తిథ్యాదికము తెలియకపోవుట - కొందరి రచనలు నేనిందాక చదువుకొనుటకు ఈడు చాలకపోవుట - కొందరు జీవత్కవులు తమ్ము గూర్చి ప్రకటింపరాదని నాకు శాసించుట - కొందరి విషయమున, రచయితలుగా నందిన కీర్తికంటె, భాషాభివర్ధకులుగా సంపాదించిన యశస్సు హెచ్చుగా నున్నదని సదుద్దేశముతో నుపేక్షించుట - ఇత్యాదు లేవేవో కారణము లీగ్రంథము నింత పరిమితమును జేసివైచినవి. క్రింది రచయితలను, ఈ కూర్పుననే పూజించుకోలేని నా నీరసతకు, సిగ్గిల్లుచున్నాను.
కరాలపాటి రంగయ్య | జూలూరి అప్పయ్య |
శతఘంటము వేంకటరంగశాస్త్రి | అక్కిరాజు ఉమాకాంతము |
చదలువాడ సుందరరామశాస్త్రి | మల్లాది విశ్వనాధశర్మ |
ఆదిపూడి సోమనాథరావు | రాయదుర్గము నరసయ్యశాస్త్రి |
ఆదిపూడి ప్రభాకరరావు | కేతవరపు వేంకటశాస్త్రి |
తురగా వేంకమరాజు | భండారు అచ్చమాంబ |
అమరవాది రామకవి | కాంచనపల్లి కనకమ్మ |
భోగరాజు నారాయణమూర్తి | త్రిపురనేని రామస్వామి చౌదరి |
కొప్పరపు గవులు | మానవల్లి రామకృష్ణకకవి |
శేషాద్రి రమణ కవులు | నాయని సుబ్బారావు |
తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి | అబ్బూరి రామకృష్ణారావు |
కాశీనాధుని నాగేశ్వరరావు | బలిజేపల్లి లక్ష్మీకాంతము |
ముట్నూరి కృష్ణారావు | తాపీ ధర్మారావు |
ఉన్నవ లక్ష్మీనారాయణ |
ఇటు లెన్నో పేరులు స్మరించవచ్చును. రాయలసీమ - నిజాము ప్రాంతీయులలో నెందరో విజ్ఞఉల విషయమున నేను అజ్ఞఉడను. వీరందరను కాలక్రమమున మనము ఒక కూర్పున సమావేశము చేయవలసి యున్నది. ఈ నా రచనలకై యెందరో మిత్రుల సహాయము పడసితిని. వారందరి మేలు మరచి పోజాలను. సామూహికముగా వారికి నా హార్థాభినందనము లిందు మూలముగా మనవి చేసికొనుచున్నాను.
ఒక సంగతి యేమనగా :- కవిబ్రహ్మ ఏటుకూరి వేంకట నరసయ్య గారు పూర్వము జనన్ము కలిగియుండినవా రనుకొని యిందు జేర్చుకొనుటకై, తెనాలి వాస్తవ్యులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎం, ఏ; యల్, యల్, బి) గారిని కవిబ్రహ్మ జీవితాంశములు తెలుపవలసినదిగా గోరి తొందరపెట్టి యుంటిని. దయతో వారు పంపిన విషయములను జూచి నరసయ్యగారు 1911 సం|| జన్మించిరని తెలిసికొంటిని. వారు, మరికొందరు ప్రముఖ రచయితలు రెండవభాగమున రాగలవారు.
మరి, 1911 సం||తో ముగించుటకు బదులు, ఒకయేడు ముందుకు సాగి 1911 సం||లో జననము గల శ్రీతుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి నిందు జేర్చుట, వారిని గూర్చిన వ్రాయనము ద్వితీయ భాగమునకు ' నాంది ' పాఠము కాగలదని యిపు డిక్కడ మనాక్సూచనమునకు -
ఈ రచన యిటు లింతలో వెలుగు చూచుటకు పూజ్యులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఆశీఃప్రోత్సాహములు నేనెపుడును మరవజాలని దోహదము లయినవి. వారికి మనఃపూర్వకమైన ధన్యవాదము లర్పించుచున్నాను.
ఈ గ్రంథము ' సరస్వతీ పవర్ ప్రెస్సు ' అధికారులు, ఉదారులు నగు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావుగారి సౌహార్ధముతో నావిష్కృతమైనది. ప్రత్యేకశ్రద్ధవహించి, ముచ్చటగా నీకూర్పు ముద్రింపించి, ఇంతత్వరలో నా యుద్యమమును లోకమునకు జూపిన శ్రీ నాగేశ్వరరావుగారిని హృదయపుర్వకముగా నభినందించుచు, వారి కితోధిక భోగభాగ్య సంపత్తి ప్రసాదించుటకు జగదీశ్వరు నభ్యర్ధించుచున్నాను.
రాజమహేంద్రవరము
1 సెప్టెంబరు 1950
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి