ఆంధ్ర రచయితలు/మండపాక పార్వతీశ్వరశాస్త్రి

మండపాక పార్వతీశ్వరశాస్త్రి

1833 - 1897

వెలనాటివైదిక బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు. పారాశరగోత్రుడు. తల్లి జోగమ్మ. తండ్రి కామకవి. జన్మస్థానము విశాఖపట్టన మండలములోని పాలతేరు (బొబ్బిలి సమీపము) జననము క్రీ|| శ|| 1833 సం|| జూన్ 30 తేదీ. నిర్యాణము 1897 సం|| జూన్ 30 తేదీ. విరచిత్ర గ్రంథములు: ఏకప్రాస శతకములు: 1. బ్రహ్మేశ శతకము 2. చిత్త్రిశతి 3. వేంకటశైలనాయద్విశతి 4. విశ్వనాయక శతకము 5. విశ్వనాథస్వామి శతకము 6. కాశీ విశ్వనాథ శతకము 7. పార్థివలింగ శతకము 8. పరమశివ శతకము 9. సూర్యనారాయణ శతకము 10. బాల శశాంకమౌళి శతకము 11. చంద్రఖండ కలాప శతకము 12. కలిపురుష శతకము 13. ఈశ్వర శతకము.

శతకములు (13)

1. సీతారామ ద్వ్యర్థిశతకము 2. శ్రీజనార్దన శతకము 3. కాశి కా విశ్వనాథ సీసపద్య శతకము 4. పరమాత్మ శతకము 5. పార్వతీశ్వర శతకము 6. కాశీవిశ్వనాథ ప్రభూశతకము 7. సుర్యనారాయణ శతకము 8. వేంకటరమణ శతకము 9. వరాహ నరసింహ శతకము 10. జగద్రక్షక శతకము 11. రమానాయక శతకము 12. ఆంజనేయ శతకము 13. రామ రక్షాశతకము 14. గోపాలకృష్ణ శతకము 15. బాలకృష్ణ శతకము 16. రఘుపతి శతకము 17. జగన్నాయక శతకము 18. రామలింగేశ్వర శతకము 19. సర్వకామదా శతకము 20. గణపతి శతకము 21. హరి శతకము 22 హరిహరేశ్వర శతకము 23. మాలికా కృతులు, దండకములు మరికొన్ని కలవు.

కావ్యములు.

1. శ్రీ రాధాకృష్ణ సంవాదము 2. బొబ్బిలి మహారాజ వంశావళి 3. ఉమా సంహిత 4. కాంచీ మహత్త్వము 5. అమరుకము 6. అక్షరమాలి కాఖ్య నిఘంటువు.

గద్యకావ్యములు.

1. యాత్రాచరిత్ర 2. గురుచిత్రకథ 3. లఘుచిత్రకథ 4. శ్రీ బొబ్బిలి మహారాజ వంశావళి.

సంస్కృత కృతులు:- 1. గుణశ్లోకాది చిత్రరచన 2.కవితా వినోద కోశము 3.సీతా నేతృస్తుతి 4. కాశీశ్వరాష్టకము 5. మంగశాష్టక చతుష్టయము 6. శ్రీ వేంకటగిరి ప్రభు ద్వ్యర్థిశ్లోక కదంబము ఇత్యాదికము.

పార్వతీశ్వరశాస్త్రిగా రభిన వాంధ్రకవితా పితామహుడని పేరు చెందిన పండితుడు. ఈయనకు బ్రబంధకవిత్వమందును శతక కవిత్వమందును బెద్దమమకారము. శతకకవులలో నీయన కున్నది యుత్తమస్థానము. వీరు వ్రాసినశతకములు శతసంఖ్యగలవి. సత్యవోలు భగవత్కవి మున్నగు వారు శతకశతము రచించినట్లు తెలియుచున్నది. తెలుగు వాజ్మయమున శతకములకు గొప్ప విలువయున్నది. అది యిప్పుడిప్పుడీ యిరువదవ శతాబ్దినుండి యించుక సన్నగిల్లుచున్నది. నేడును 'కాళహస్తీశ్వర' ప్రభృతి శతకములను గౌరవముతో జూచు చున్నవారు చాలమందియున్నారు. పార్వతీశ్వరకవి 19 వ శతాబ్దిలో బ్రసిద్ధుడగు శతకకవి. కేవలము శతక కవియేకాదు. ఆశుకవి, ప్రబంధకవి కూడను. వీరినిగూర్చి చెప్పవలసిన విశేషములు చాలగలవు.

ఈయన పితామహుడు పేరయసూరి. ఇందుమతీపరిణయము, నిర్దుష్ట నిరోష్ఠ్యదాశరథీశతకము, లక్ష్మీనృసింహమూర్తిస్తుతి కృతులు రచించిన వారు వీరే. పార్వతీశ్వరశాస్త్రిగారితండ్రి కామకవి బ్రహ్మోత్తరఖండము, కార్తికమాసవ్రతమహాత్మ్యము, బలరామక్షేత్రమహత్త్వము, జానకీరామ శతకము, సూర్యనారాయణ రామప్రభుశతకములు రచించిన విద్వత్కవి. పార్వతీశ్వరకవి యన్నగారు రామస్వామిశాస్త్రి వేదాంతకృతి కదంబము, గంగాలహరి, గంగాస్తవము వ్రాసిరి. పార్వతీశ్వరశాస్త్రిగారు తండ్రిగారి సన్నిధని మొదట జదువుకొనిరి. తరువాత తాతా సూర్యనారాయణశాస్త్రిగారి కడ బఠించిరి. శ్రీ త్రైవదేంద్రస్వామివారి యనుగ్రహమున నుపనిష త్పాఠము చేసిరి. స్వయంకృషిచే బలమైన పాండిత్యము సంస్కృతాంధ్రములలో సంపాదించిరి. కవిత్వము సహజముగ నున్నదే. ఈ సహజకవితాధార కాయసాధారణపాండిత్యము తోడైనది. పండ్రెండవ యేటనే వాటముగ గవిత వ్రాయ నారంభించి "కవితా లతాంకురము" పంతముపట్టి గంటలో జెప్పెను. చిన్న నాటనే వేంకటగిరి మున్నగు సంస్థానముల కేగి కవితాప్రదర్శనమున సత్కరింపబడెను. బొబ్బిలి సంస్థానమున విద్వత్కవిగా గుదిరెను. ఆయాసంస్థానరంగములలో నీయన కనబఱిచిన కవితాచతురత వేనోళ్ళ మెచ్చుకోలుబడసినది. పార్వతీశ్వరకవి తత్తజ్జీవిత విశేషములు 'ఆత్మచర్య' యను సీసపద్యములలో వ్రాసికొనెను. ఇది యొకటి చదువుడు:


మఱియు సద్ధాతలో వఱపు పట్టగజూచి

గుఱుతు తప్పక వానకురియునట్లు

మంచిపద్యములు గావించి తెండని రంగ

రాయవిభుం డాదరమున బల్క

నీమీద భారంబు నేనుంచి యమృత బీ

జాక్షరఘటిత పద్యంబు లైదు

పంచరత్నము లన బచరించి నవరత్న

పద్యయుక్తముగ దత్ప్రభున కొసగ


గాకతాళీయసయమున గాలివాన

కురియ జేసితి వది మాంపగోరి మాంపి

కౌర! యతివృష్ట కష్టహరాష్టకమున

హరిహరేశ్వరదేవ! మహానుభావ!


ఇచట రంగరాయవిభుడన బొబ్బిలి ప్రభువు వేంకటశ్వేరాచలపతి రంగారావు బహద్దరువారు. ఈకవి యిట్టి సిద్ద వాక్కనుటకు సందేహింప బనిలేదు. బొబ్బిలిలో నితడు 1876 లో బ్రవేశించి 1897 వఱకు సంస్థానకవిగా నుండెను. అదియే వీరి జాతకమున ఘనదశ. అంతకుమున్ను శ్రీవిజయనగర మహారాజు దర్శనమునకు బోయి 1867 లో నచట గవితాప్రతిభా ప్రకటనము చేసెను. వారి యాష్టానకవితాస్థానమున నుండుటకు యోగము పట్టలేదు. ఆయన బొబ్బిలిసంస్థానకవి కావలసియుండెను. ఆనందగజపతిదర్శనము చేసి పార్వతీశ్వరకవి యమూల్య పద్యములు చదివెను. అం దిది యొకటి.


అప్ప్రదుడగు మేఘుడు బలి

కుప్రదుడగు ఖేచరుండగు ననుప్రదుడ

క్షిప్రదుడగు నర్కుడు నం

దప్రదునకు సాటియనగ దగునే వీరిన్.


విజయనగరములోని యాస్థానపండితుడు ముడుంబ నరసింహాచార్యకవి "అన్నుపతాళజాల కహహా! యని తల్లడమందె నెంతయున్" అను సమస్యనిచ్చి "వెన్నెల గాయ గాయజుడు వేమఱమై విరిగోల లేయలే" యని పూర్వార్థము వెనుక నేను పూరించితినని తక్కిన చరణములు శాస్త్రులుగారు చెప్పవలయుననిరట. అప్పుడది యాశువులో ననుప్రాసము వచ్చునట్లు వీ రిట్లు పూరించిరి.


క్రొన్నన గోయ గోయనుచు గోయిల కన్నెఱ జేయ జేయటుల్ కిన్నెర బాయ బాయసము కీల్కొని పొంగిన చాయ చాయలన్


1865 లో వావిలివలస జమీందారగు ఇనుగంటి సీతా రామస్వామిగారి దర్శనమున కీ కవి వెళ్ళినపుడు వసుచరిత్రలోని పద్యమునిచ్చి సంస్కృతీకరింపుమనిరి. తెలుగును సంస్కృతములోనికి నింతమాధురీధుర్యముగా మార్చిన-మార్చగల కవులు తక్కువ.


అతవ్వంగి యనంగఝూంకరణవ జ్జ్యాముక్త చూతాస్త్ర ని ర్ఘాతం బోర్వక తమ్ములంచు దటినీ గర్భైక పంజాత కం జాతవ్రాతము మాటుచెంద పది యేచన్ సాగె మున్ముందుగా జ్ఞాతిశ్చే దనలేన కి మ్మనెడి వాచారూడి సత్యమ్ముగాన్ సాసహ్యస్మరఝంక్రియాశ్రయ గుణోన్ముక్తామ్రబాణక్షతిం తన్వీ సారసజాతి రి త్యపధృతా పద్మాటనీ మాశ్రితా సాసింధూదరసంభ వాసి పురత స్సద్బాధనే చోద్యతా జ్ఞాతి శ్చేదనలేన కిన్వితి వచ స్సత్యం తథాస్యా త్తథా. కవి యీవిషయ 'మాత్మచర్య' లో నిటు వివరించుకొనెను.


సుతనిరామయతకై సూర్యనారాయణ స్వామిని గని హర్ష వల్లినుండి వావిలివలసకు వచ్చి యిన్గంటి సీ తా రామవిభు గాంచి తత్ప్రతిజ్ఞ నణచి యా 'తన్వంగి'యనెడు వసుచరిత్ర లోని పద్యమునకు శ్లోకరచన ప్రతిన నిన్నటయేబదియారు పద్యముల్ గలుగుషోడశవిధ కందరచన తత్కవులకన్న నెక్కుడుధార గర్శ వింతయగునట్టి యాశుకవిత్వరచన నాకు గల్గించి చెలగించినాడ వౌర! హరిహరేశ్వరదేవ! మహానుభావ!


ఆ వావిలివలస ప్రభువులే యిన్నూటయేబదియాఱువిధములుగ జదువ దగిన కందము వ్రాయుడని పార్వతీశ్వరశాస్త్రిగారి నడుగ నాయన యాశువుగ నిట్లు చెప్పిరి.


శ్రీవామ | దేవ | పావన

భావా | భావంగ | మాగ్ర్య | పండిత | భావా

శ్రీవాసు | దేవ | బహ్యమ

భావా | భావా | భవజ క | పాలిత | భావా

నీకగునే దేకగతిన్

సాకర్యమును నుంకొ షట్పందాక

........ శారద్విశతి ...... 

.......యందు ..... ...... గందస్ములింకున్. ఆశుధారాపరీక్షలో నీకవి మొదటితరగతిని నెగ్గినాడు. చతుర్విధ కవిత్వములందు నీకవి కడుదిట్ట. ఒకశివరాత్రి యుపవసించి లింగోద్భవకాలమున మొదలిడి తెల్లవాఱుసరికి బార్వతీశ్వర శతకము రచించిన యాశుకవివరు డీయన. రెం డేకప్రాసశతకములు మూన్నాళ్ళలో రచించి చూపిన శీఘ్రకవితాచతురుడు. యమకముగ బద్యములల్లుట, ద్విత్రిచతుష్ప్రాసములతో గవితవ్రాయుట యీకవికి వేడుక.


వీరి రాధాకృష్ణసంవాదము కృష్ణాభ్యుదయము అమరకము, తెలుగునాట బ్రచారమున నున్నవి. వెనుకటివారిలో, తాళ్ళపాక తిరు వేంగళప్ప అమరుకాంధ్రీకర్తలయం దగ్రణ్యుడు. అధునాతనులలో నమరుకము నాంధ్రీకరించినవా రయిదాఱుగురు కలరు. వానిలోనెల్ల వీరి తెలిగింపు చాల గొప్పగా నున్నది. రాధాకృష్ణ సంవాదములోని యీ క్రిందిపద్యము వీరి తాతతండ్రుల విశిష్టత కొక గుఱుతు.


సీ. శ్రీమీఱ నుభయభాషా ముఖ్య సత్కృతుల్

తజ్‌జ్ఞలెన్నగ మదంకితములు చేసి

యశముగాంచిన పేరయ మనీషిమణికి బౌ

త్రత్వంబు గార్తికవ్రతమహత్త్వ

శివమహత్త్వాద్యనేకవిధ ప్రబంధంబు

లొనరించి సత్కవి వినుతి గనిన

పారాశరసగోత్ర పావనుండగు మండ

పాక కామేశ్వర పండితునకు


మహిత పుత్రత్వమును గాంచి బహువిచిత్ర

చిత్త్రిశతి ముఖ్య సత్కృతుల్ చెప్పి మెప్పు

పడసితివి గద కులకీర్తి వర్థిలంగ

సరసగుణసాంద్ర! పార్వతీశ్వరకవీంద్ర!


పార్వతీశ్వరశాస్త్రిగారి-మనుమలు పార్వతీశ్వరశాస్త్రిగారును భాషోపాసకులై తాతగారిని మఱుగున బడిన కవితారహస్యములు కొన్ని భారతి కందించిరి. అముద్రితగ్రంథచింతామణి పార్వతీశ్వరశాస్త్రి ప్రతిభకు నికషము. తత్పత్రికాధిపతులు పూండ్ల రామకృష్ణయ్యగారు వీరి చరిత మామూలాగ్రముగ వ్రాసిరి. అది పార్వతీశ్వరశాస్త్రి 'ఆత్మచర్య' యనదగు "హరిహరేశ్వర శతకము" నకు బీఠికగా వెలసియున్నది. పార్వతీశ్వరశాస్త్రిగారికిని, మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారికి నీపత్రికాద్వారమున బెక్కునాళ్ళు భాషావిషయక వివాద మాపాదిల్లినది.


పార్వతీశ్వరశాస్త్రిగారు మహాభక్తులు. కడకాలమున "మృత్యుంజయునకు నమస్కరింతు దరింతున్" అను మకుటముతో బద్యములు చెప్పుచు ముప్పదియైదు పద్యములు పూర్తి చేసి జీవము విడిచిరి. వీరు జీవించిన యెనుబది రెండేండ్లలో శతాధికములగు కృతులు విరచించిరి. తుదకు మిగిలిన కృతులు కూడ నెనుబదిరెండే. 19 వ శతాబ్దిలో నిట్టి యాశుకవి లేడనుటకు సందేహములేదు. పార్వతీశ్వరశాస్త్రిగారి శతక కవిత యిటులుండుననుట కొకపద్యము మూదలించి యిక విరమించెదను.


ఆక్షుల్ నిన్గనునట్లు హస్తములు నిన్నర్చుంచున ట్లాత్మ ని

న్న క్షీణంబుగ వమ్మునట్లు చెవి ని న్నాలించున ట్లాస్యమున్

దీక్ష న్నిన్గొనియాడునట్లు కరుణ న్వీక్షించి రక్షింపుమీ

సాక్షాన్మంగళ సంఘసంఘటన తృష్ఠా ! బాలకృష్ణా ! హరీ !

                           _________