ఆంధ్ర రచయితలు/కొక్కొండ వేంకటరత్న శర్మ

కొక్కొండ వేంకటరత్న శర్మ

1842 - 1915

నియోగిశాఖీయులు. జన్మస్థానము: వినుకొండ. నివాసము: చెన్నపట్టనము. రాజమహేంద్రవరము. జననము: 14-3-1842 సం|| నిర్యాణము: 1915. కవికర్తృకకృతులు: పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నృసింహము, ధనంజయవిజయ వ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహాత్మ్యము, కోరుకొండ మహాత్మ్యము, గోదావరి వర్ణనము, గోవిందమంజరి, దీక్షితచరిత్రము, యుగరాజు పర్యటనము, పోయం ఆఫ్ ది ప్రిన్స్ ఆఫ్ వేల్సు-విజిట్ టు ఇండియా - ఇత్యాదులు.

వేంకటరత్నశర్మగారు "మహామహోపాధ్యాయు" లని కొనియాడ బడిన పండితులు. చిత్తూరు మండలములోని 'తిరువల' గ్రామమున వెలసిన శ్రీ తనుమధ్యా బిల్వ నాథేశ్వరులభక్తులు వీరు. తత్కరుణాకటాక్ష సంప్రాప్త కవితావిద్యా ప్రవీణులు. గుంటూరిలో విద్యాభ్యాసము చేసిరి. చెన్నపురి రాష్ట్రీయకళాశాలలో బండితపద మధిష్ఠించిరి. రాజమహేంద్రవర రాజకీయ శాస్త్రకళాశాలయందు బ్రధానాంధ్రపండితులై ముప్పదియేం డ్లుద్యోగించిరి. కవిబ్రహ్మయనియు, అక్షరసంఖ్యాచార్యులనియు వీరి బిరుదములు. మహామహోపాధ్యాయ మహాబిరుదమందిన తెలుగువారిలో వీరు తొలివారు. "ఆంధ్రభాషాసంజీవిని" వీరు నడపిన తెలుగు పత్రిక. ప్రసిద్దిగాంచిన నాటి పత్రికలలో నిది యొకటి. అముద్రిత గ్రంథచింతామణి. కళావతి. వివేకవర్థని. శశిరేఖ మున్నగుపత్రికలు మహోత్తమ రచయితల సంపాద కత్వమున వెలువడుచుండిన దివసము లవి. నాడు 'ఆంధ్రభాషా సంజీవనీ' యన్వర్దనామముతో వెలసినది. వేంకటరత్నము పంతులుగారికి ధర్మవరము రామకృష్ణమాచార్యులు, రాయదుర్గము నరసయ్య శాస్తి, కొమాందుర అనంతచార్యులు మున్నగు పండితకవుల చెలిమి చేకూరినది. ఈయన "ఆంధ్ర ప్రసన్న రాఘవము" ను వేదము వేంకటరాయశాస్త్రి యీ---------విమర్శించెను. నాటి విమర్శనములు స్మరణయోగ్యములు కావు. అందు తిట్టులు శాపములు కుప్పనగూరలు. విమర్శనమున సారము లేకపోలేదు. కాని వ్యక్తి దూషణములు పెచ్చుపెరిగినవి. కొక్కొండపండితుని ప్రసన్న రాఘవమును గూర్చి వేంకటరాయశాస్త్రిగా రిట్లనుచున్నారు.

"ఛందోవ్యాకరణలంకారముల కిది వేరువురుపు...రసము నున్న...పూర్వులు చెప్పినపాకము లిందులేవు......కదనము పెద్ద యక్షరముల వ్రాత కుదరకముందే వ్రాసిన జిలుగుగొలుసు ఎట్లుండునో అట్లున్నది. పాదపూరణమువలన పద్యార్థము ప్రాయికముగా నభేద్యత్వముం బొరసియుండును. పాదపూరణ ప్రయోగమందును, అదియేని చక్కగా చేతగానియందును నంతటికవి మఱి లేడు. అలంకార శాస్త్రమున జెప్పిన దోషములలో నిందు లేనిదిలేదు. అందులేనివి యిందెన్ని యేని గలవు...........తప్పుగణములు తప్పుసంధులు అద్యంత

............... ................ ................... ............... ................. ......................( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) పూండ్ల రామకృష్ణయ్య పండితుడు వేంకటరత్నము పంతులుగారి బిల్వేశ్వరీయాది కృతులు విమర్శించివైచెను. ఆయీ విషయములకు నముద్రిత గ్రంథచింతామణి యరయనగును. వేంకటరత్నకవి కవిత సంస్కృతసమాస నిబిడము. ఈయనకు సంస్కృతభాషా పాండిత్యము తక్కువయనియు దెలుగున గట్టిశక్తి కలదనియు విమర్శకు లనిరి. అదిమనము సహింపరాని మాట. వీరు వెండి, బంగారము మున్నగు క్రొత్తరకపు వృత్తములు కల్పించి తమ ప్రబంధములలో జేర్చిరి.


సీ. చిటిపొటి కొంపలు చిన్నవి పెద్దవి
          యిండ్లు మిద్దెలు దారి కిరుగెలకుల
నారు పోసినయట్లు నారక యెన్నేని
          పూర్వాచరణముల పోల్కి దనర
మరికొన్ని సుగృహహర్మ్యములు సూత్నాచార
          ముల యట్లు పై పయి మురుపుసూప
జైత్యద్రుమంబుచే సత్రంబులుగ వార
          మున కొకనంతయె యొనర విపణి


గా నధిత్యకనృహరి నికాయమె ఘన
రాజమందిరముగ గడు రాజిలంగ
జానపద జన సహజమెయైన బౌర
కోవిదావాసము నగు గోర్కొండపురము.
                                     [కుమార నృసింహము]


వీరేశలింగముపంతులుగారును వీరును పరస్పర గ్రంథ విమర్శనములు గావించుకొనిరి. ఆ గ్రంథవిమర్శనములు క్రమముగా వ్యక్తిదూషణములకు జేరి విసుగుపుట్టించినవి. అయినను భాషాజిజ్ఞానువుల కా విమర్శనములు కొంత యుపయోగపడిన ననవచ్చును. వేంకటరత్నము పంతులుగారు 'ఆంధ్రభాషాసంజీవినీ' పత్రిక కనుబంధముగా హాస్యసంజీవిని ప్రకటించిరి. వీరేశలింగము పంతులుగారును 'వివేకవర్ధని' ప్రక్క హాస్యవర్ధిని వెలువరించిరి. ఇవి యన్యోన్యవివాదములతో జాలకాలము చెలరేగినవి. ప్రసిద్ధపండితు డన్న వా డల్ల వేంకటరత్నము పంతులుగారి గ్రంథములు విమర్శించెను. దీనికి గారణము; ఆయన సంస్కృతాంధ్రములం దసమానపండితుడై మహామహోపాధ్యాయుడను నగ్గలపు బిరుద మా మా డాంధ్రులలో నందుకొనుటయే యనవలయును.


'పలుకు దయ్యమా, ఇది పాయసమమ్మా! బమ్మదయ్యపుటిల్లాలా! ఇది పానకమమ్మా! త్రాగుమమ్మా! అను రీతిని మాటాడు గ్రాంథిక భాషాస్వరూపు డీయన. ఇంటిలో భార్యకడను, బజారులో దుకాణము కడను వీరు గ్రాంథికసంభాషణము గావించెడివారు. అంత పట్టుదల. అఱవము, కన్నడము నెఱుగుదురు. వీరు రచించిన బిల్వేశ్వరీయమున కఱవమున మాతృక యున్నదట. 'గీతమహాసటము' అను పేరితో జయదేవుని గీతగోవిందమువంటి కృతిని వీరు సంస్కృతమున సంతరించిరి. విద్యావినోదము పనప్పాకము అనంతాచార్యులుగారు పంతులుగారిని "ఆంధ్రా జాన్సన్" అని పిలుచుచుండువారు. ఇట్టికవి తెలుగువారికి సదా స్మరణీయుడుగదా!


                              ________