ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/సంకుపాల నృసింహకవి
7. సంకుపాల నృసింహకవి
ఇతడు కవికర్ణరసాయన మను మాంధాతృచరిత్రమును రచియించిన మహాకవి. ఈ కవి కృష్ణదేవరాయనికాలమునం దుండె ననుటనుగూర్చి యొకకథ గలదు. దానినిచ్చట సంక్షేపించి చెప్పుచున్నాను. పెద్దన్న మనుచరిత్రమును రచించినతరువాత నృసింహకవి కష్టపడి కవికర్ణరసాయనమును జేసి, దానిని కృష్ణదేవరాయని కంకితము చేయదలచి, విజయనగరమునకువచ్చి తదాస్థానకవియైన పెద్దన్నను దర్శించి, తనగ్రంథము నామూలాగ్రముగా నాతనికి వినిపించి, రాజదర్శనము చేయింపవలెనని వేడెనట! ఆంధ్రకవితాపితామహు డాగ్రంథచమత్కారమున కద్భుతపడి, అట్టిగ్రంథమునకు రాజునకు జూపినయెడల దన మనుచరిత్రముమీది గౌరవము తగ్గుననియెంచి, ఈర్ష్యచేత నాతనికి రాజదర్శనము కానియ్యక "యిదిగో, అదిగో" అనిచిరకాలము గడపి యూరక పంపివేసెనట! అతడు రాజాస్థానమున లాభప్రాప్తి లేకపోగా మీదు మిక్కిలి తనవెంట దెచ్చుకొన్న కాసువీసములను సహితము వ్యయపెట్టుకొని, దినభుక్తి జరగక తనపుస్తకములోని కొన్నిపద్యములను విక్రయింపవలసినవా డయి, తుదకు విసిగి రాజులను దూషించుచు లేచిపోయి తనగ్రంథమును శ్రీరంగనాథున కంకితముచేసి కృతార్థుడయ్యెనట! అప్పుడు విక్రయింపబడిన పద్యములలో నొకటి రెండెట్లో కృష్ణదేవరాయల కూతురైన మోహనాంగిచేతిలో బడెనట! కృష్ణరాయనికి మహావిదుషియైన మోహనాంగి యనుకూతురు గలదనియు, ఆమె యనుపమానసాహిత్యము కలదయి మారీచిపరిణయ మనుశృంగారప్రబంధమును రచియించె ననియు, రామరాజభార్యయనియు కొందఱు వ్రాసియున్నారు. ఆగ్రంథము నాకు లభించినది కాదు. రామరాజు భార్యపేరు తిరుమలాంబ. అయినను తిరుమలాంబకు మోహనాంగి యనునామాంతర ముండిన నుండియుండవచ్చును. ఆచిన్నది యొక్కనాడు తండ్రితో చతురంగ మాడుచు, తనబలములోని బం టొకటి మంత్రియొక్కయు, నేనుగుయొక్కయు పగచేత తొలగవలసి వచ్చినప్పుడు "ఉద్ధతుల మధ్యమున బేద కుండదరమె" యని చదివెనట! అదివిని రాజు పద్యమంతయు జదువుమని పుత్రినడుగగా నామె కవికర్ణరసాయనములోని మూడవయాశ్వాసమునందలి యీపద్యము నిట్లు చదివెనట:-
గీ. ఒత్తుకొనివచ్చుకటికుచోద్వృత్తి జూచి
తరుణితనుమధ్య మెచటికో తలగిపోయె
నుండె నేనియు గనబడ కున్నె యహహ!
యుద్ధతులమధ్యమున బేద కుండ దరమె?
అప్పుడు రాజాపద్యముయొక్క చమత్కృతి కానందించి యెక్కడి దని యడిగి తెలిసికొని పెద్దన్నచేసినమోసము నెఱిగి ఖేదపడెనట!
రాజసంస్థానమునందు దనకు గలిగినయనాదరణచేత కుపితుడయియే నృసింహకవి తనమాంధాతృచరిత్రమునం దీక్రింది రాజదూషణ పద్యమును జొప్పించెనని చెప్పుదురు-
సీ. ఆందోళికలయందు నంతరచరు లైనసవికృతాకృతులపిశాచజనులు
పరకరాళంబులై ప్రార్థింప గనుగోక వాయెత్తకుండుజీవచ్ఛవములు
వాలవీజనముల గ్రాలుచు నీగకు నంటీనిఖరవర్తులాండసములు
వేత్రపరంపరావిలకంటకావృతి జేర బోరానిబర్బూరతరులు
శంఖనాగస్వరస్వరశ్రవణసమద
విస్ఫుటచ్ఛత్రవిస్ఫారితస్ఫటాక
విష్టవిష వైద్యవశవర్తి దుష్టఫణులు
ప్రభుదురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించు. అయినను పయికథ యిటీవలివారిచేత నెవ్వరిచేతనో కల్పింప బడినట్టు తోచుచున్నది. ఆంధ్రకవితాపితామహు డైన యల్లసాని పెద్దన్న యంత యసూయాగ్రస్తు: డగుటకు దగినకారణ మేదియు గానరాదు. కవికర్ణరసాయనము మొత్తముమీద మంచిదే యయినను, పెద్దనార్యకృతమయిన మనుచరిత్రముకంటె నేవిషయమునందును గుణాతిశయము గలదికాదు.
గీ. యతి విటుడుగాకపోవు టెట్లస్మదీయ
కావ్యశృంగారవర్ణ నాకర్ణసమున ?
విటుడు యతిగాకపోరాదు వెస మదీయ
కావ్యవై రాగ్యవర్ణనాకర్ణ నమున.
అని నృసింహకవి తన కవిత్వసామర్థ్యమును గూర్చి గ్రంథాదియందాత్మస్తుతి చేసికొని యున్నాడు. మఱియు దక్కిన కవులవలెగాక కుకవిదూషణయు బెక్కుపద్యములతో జేసియున్నాడు. కాబట్టి యితడు స్వాతిశయభావము గలవా డయినట్టు కనుపట్టు చున్నాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడయినను భట్టపరాశరాచార్యుల శిష్యుడై వైష్ణవమతమునం దధికాభిమానము కలవాడై యుండెను. మాంధాతృచరిత్రము విశేషభాగము దీర్ఘసమాస సంస్కృతపదభూయిష్టముగా నున్నను బహుస్థలములయందు తెలుగుపదములతోను చక్కని లోకోక్తులతోను గూడ గూడియున్నది. చేసినవర్ణనము లనేకములు హృదయాహ్లాదకరములుగా నున్నవి. కవిత్వమునం దక్కడక్కడ గవిత్రయము వారి ప్రయోగములకు విరుద్దములైన ప్రయోగములు కానబడుచున్నవి. ఈకవియొక్క కవననైపుణిని జూపుటకయి కవికర్ణరసాయనములోని కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-
శా. ఏణీలోచన లాత్మన క్త్రరుచిచే నేణాంకసొఎభాగ్య మ
క్షీణప్రౌడి హరింప సౌధపరిసంకీర్ణేంద్రనీలోపల శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుడంబేదయై
ప్రాణాచారము పడ్డయట్ల ప్రతిబింబవ్యాప్తి చూడందగున్- [ఆ.1]
ఉ. గర్భమునిల్చి కుక్షి యధికంబుగ గానగవచ్చి గ్రక్కునన్
దుర్భరతీవ్రవేదనల దూలుచు సోలుచు నేల వ్రాలగా
నర్భకు డొక్క డయ్యినకులాగ్రణిగర్భ మగల్చికొంచు నా
విర్భవ మొందె భూజనులు విస్మయమగ్నులుగాగ నయ్యెడన్- [ఆ.1]
క. కా కేమి తన్ను దిట్టెనె?
కోకిల తన కేమి ధనము కో కొమ్మనెనే?
లోకము పగ యగు బరుసని
వాకున జుట్ట మగు మధురవాక్యమువలనన్- [ఆ.2]
ఉ. ప్రోడవుగాన నీ పలుకు పోలదు కాదనరాదుగాక యీ
వీడినతాపవేదనల వేగెడుచెన్నటిమేన బ్రాణముల్
కూడి వసింపనోర్వ వివిగో చనుచున్నవి యేల వ్రీడయుం
గ్రీడయు నాకు హారమును గీరము జూతము గీతముం జెలీ- [ఆ.3]
మ. పటికి న్నార్చినలీల జందనము బై బైబూయ నంగారక
చ్ఛటలం గాచు తెఱంగునం జిగురుసెజ్జిం బొర్లగా నప్పట
ప్పటికిం జేర గనిల్చిన ట్లొడలిపై బన్నీరు చల్లంగ ను
త్కటమయ్యెం బెనుకాక బంగరుసలాకంబోలు నబ్బాలకున్- [ఆ.3]
గీ. తొట్రుకొను నడ్గులును వెడద్రొక్కుపల్కు
లుల్లముల సి గ్గెఱుంగమియును ఘటించి,
జవ్వనులకును మరల శై శవము దెచ్చె
వారుణియు నెట్టిసిద్ధౌషధీరసంబొ- [ఆ.4]
ఉ. లజ్జకు బాపు శీలము గులంబు వడి న్విడిపించు సూనృతం
బుజ్జనసేయ జేయు మొగమోటమి దూలుచు బాతకంబులన్ మజ్జన మార్చు నార్చు నభిమానము రోతల కియ్యకొల్పు నీ
ముజ్జగ మైన ద్రిప్పు దుదిముట్టదు తా ధనకాంక్ష యేరికిన్- [ఆ.5]
ఉ. ఏకడజొచ్చునో సుకృత మెచ్చటడాగునొ తృప్తి యెప్పుడో
పోకడ శాంతి కెం దడగిపోవునో సౌఖ్యము మాన మేమియౌ
నో కృప యెట్లు మాయ మగునో యశ మేగహనంబుదూఱునో
లోకమునం దెఱుంగ మొకలోభ మెదిర్చినమాత్ర జిత్రమై- [ఆ.5]
ఉ. ఖండసుధాకరాలికలు గాడవిరక్తి దపస్విశిష్యలై
యుండిరి పూవుదప్పుటకు నుల్లము రోసి రతీశు డిక్షుకో
దండము బుష్పబాణములతండము బాఱగవైచి చేతులన్
దండమునుం గమండలువు దాలిచి మస్కరి గాకయుండునే- [ఆ.6]
___________