ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/వేములవాడ భీమకవి

[1] భీమకవి యొక్క వాసస్థానము గోదావరిమండలములోని దాక్షారామమునకు సమీపమున నున్న వేములవాడ యను గ్రామము. [2] ఇతని జన్మమును గుఱించి విచిత్రమైన కథ యొకటి చెప్పుచున్నారు. వేములవాడ గ్రామము వందు సోమన యను నియోగిబ్రాహ్మణుఁ డొకఁ డుండెను. ఆతనిమరణానంతర మతనిభార్య నిరుపేదరాలైనను విద్యావతి యగుటచే ధనికుల యిండ్లలో పాటలను, పద్యములును చెప్పి జీవనము చేయుచుండెను. ఆమె శివరాత్రి పుణ్యకాలమునందు తనయూరిస్త్రీలతోఁ గలిసి దాక్షారామమునకు యాత్రపోయి వా రందఱును తమకు సంతానముఁ గలిగింపవలె నని భీమేశ్వరస్వామికి మొక్కుకొనుచుండగా, తన కిఁక సంతానము. గలుగబోదన్ననమ్మకముతో పరిహాసార్థముగా తనకు కొడుకు పుట్టినయెడల తానును స్వామికి పుట్టెడు నీటితో దీపారాధనము చేయించెదనని మొక్కుకొనెను. ఆమె మాటల కప్పు డచ్చట నున్న స్త్రీ లందఱును నవ్విరి. ఆమె యిల్లు చేరిన తరువాత కొంతకాలమునకు దైవ మామె కోరికను సఫలముచేసెనో యన్నట్లా వితంతువున కెట్లో విధివశముచేత గర్భము నిలిచెమ ! తాను భక్తితో మొక్కుకొన్నందున శ్రీభీమేశ్వర స్వామియే చూలు కలిగించెనని యామె యెంత చెప్పినను నమ్మక, ఆమె నా యూరివా రందఱును జాతినుండి బహిష్కరించి తమఇండ్లకు రానీ కుండిరి. ఆమె కటుపిమ్మట పురుషశిశువు కలుగఁగా మిక్కిలి ప్రేమతో బెంచుచు, ఆతనికి భీమేశ్వరస్వామి పేరు పెట్టి, తానే యాతనికి చిన్నప్పటి నుండియు విద్య చెప్పచుండెను. ఈ భీమన తాను పిల్లవాండ్రతో నాడు కొనఁ బోయినప్పడు వా రతనిని "విధవకొడుకా !" యని పిలుచుచు పరిహసించుచు రాగా కొంత జ్ఞానము వచ్చినవాఁ డగుటచేత మనస్సులో వేదన పొంది తల్లి వలన తన జన్మవృత్తాంతమును దెలిసికొని, తక్టణ మా గ్రామము విడిచి పోయి దాక్షారామము చేరి భీమేశ్వరస్వామి యాలయములో లింగమును కౌగిలించుకొని వదలక కూరుచుండెనఁట ! అంతట స్వామి కా చిన్నవానియం దనుగ్రహము వచ్చి నీ 'వాడినదెల్ల నాటయు, పాడినదెల్ల పాటయు నగు"నని వరమిచ్చి పంపెనఁట ! ఆ బాలుఁడు మరల స్వగ్రామమునకు వచ్చినతరువాత నొకయింట బ్రాహ్మణసమారాధనము జరుగునప్పుడచ్చటికిఁబోఁగా బ్రాహ్మణు "లీ ముండకొడుకును లోపలికి రానియ్యఁ గూడ"దని తలుపులు లోపల గడియ వేసిరcట ! ఆంతట వడ్డనలయి లోపల భోజనము లారంభముకాఁఁగా, భీమన తలుపుల సందునుండి చూచి "మీ అప్పములు కప్పలుగాను; మీ యన్నము సున్నముగాను" అని శపించెనట ! ఆ శాపాక్షరములు సత్యము లయి వి స్తళ్ళలోని యన్నము సున్నమయి, అప్పములు కప్ప లయి దుముక లాడసాఁగెనఁట ! ఆప్పడు బ్రాహ్మణులందఱును భయపడి యది భీమనమహత్త్వ మని తెలిసికొని తలుపు తీసి, సున్నమును కప్పలను యథాపూర్వకముగా చేసినపక్షమున నాతనిని పంక్తిభోజనమునకు రానిచ్చెద మని చెప్పఁగా నతఁడు 'సున్న మన్నమును, కప్పలప్పములును కావలె" నన్న యుత్తరక్షణమునకే యవి యట్లయ్యెనఁట! నాఁటినుండియు బ్రాహ్మణు లాతఁడు వరప్రసాది యని తెలిసికొని, ఆతని కుపనయనాది సంస్కారములు చేయించి బహిష్కారము దీసివేసి, అతనిని పంక్తిభోజనములకు రానిచ్చుచు గౌరవింపుచుండిరి.

భీమకవి సంస్కృతమున రచియించినట్లు చెప్పఁబడెడు జ్యోతిష గ్రంథమును దెనిఁగించిన యెుకానొక కవి యించుమించుగా నీ కథనే తన గ్రంథావతారికయం దీ క్రింది సీసమాలికలోఁ జెప్పియున్నాఁడు.

           సీ. శ్రీకరంబై ధరఁ జెలుపు గాంచినయట్టి
                            భీమపురంబునఁ బ్రేమమీఱ

        భీమేశ్వరుండును బ్రియముతో భక్తుల
                    కోర్కు లొసంగుచుఁ గొమరు మిగుల
        నొకనాఁడు తత్పురియువతులు కొందఱు
                    భక్తి భీమేశ్వరుభవనమునకుఁ
        బోయి పుత్రుల వేఁడ ముగ్ధత్వమున నొక్క
                    విధవ కుమారుని వేడ్కఁ గోర
        నాలేమముగ్ధత కపహసించుచు నల
                    భీమేశ్వరుఁడు పుత్రుఁ బ్రీతి నొసఁగె
        నా కాంత గర్భిణియై కాంచెఁ దనయుని
                    గలియుగాదిని బ్రేమ కడలుకొనఁగఁ
        బ్రభవవర్షంబున శ్రావణమాసంబు
                    శుక్లపక్షంబున శోభనంబు
        మీఱఁ బంచమి శుక్రవారంబునను హస్త
                    యందుఁ గన్యాలగ్నమCదు వెలయ,
        వెలిపెట్టి రక్కాంత విధవ పుత్త్రునిఁ గాంచె
                    నని నింద మెడఁగట్టి యఖిలజనులు
        నంతఁ దత్తనయుండు నై దేండ్ల బాలుడై
                    పురి బాలకులతోడఁ బొసఁగనాడ
        జను లెల్ల గోళకుండని నిందఁజేసిన
                    రోషించి యాతండు దూషిత యని
        రా యెత్తి తల్లిపై నేయఁబోయిన నది
                    భీమేశ్వరుఁడు తండ్రి వేయు మనిన
        వెసc జని యాతని వ్రేయ నుంకించిన
                    భీమేశ్వరుఁడు దయ పెద్ద గలిగి
       ప్రత్యక్షమయి, వత్స! రమ్మని తగc జీఱి
                   పశుపక్షిమృగములఁ బ్రాణికోట్లఁ
       .....................................
                    .......................

               గలిగించు శక్తియుఁ గరమొప్ప జనులకు
                            బిడ్డల నాయువు c బెంపుఁ దనర
                సంపద లొసగెడి సామర్ధ్యమును మఱి
                            కానిది యౌనని యైనదెల్లఁ
                గాదని యట్టుల కావించు బలమును
                            మును రాc గలుగునదియును దెలుపఁగఁ
                బ్రావీణ్యమును నిచ్చి ప్రబలుము నీ వని
                            వరమిచ్చెఁ బదియాఱు వర్షములకు
                నాతనికి సహాయయై సరస్వతియును
                            .............................

                 నతఁ డెట్లుచెప్పిన నట్ల చేయుచునుండె
                              సరిలేని కీర్తిచే జగతి వెలసి
 
              గీ. యతఁడు చెప్పిన శాస్త్రమం దధికభక్తి
                 కలిగి నిజమని తలఁచినఁ గల్గు శుభము:
                 కోర్కులెల్లను ఫలియించు గురుతరముగ
                 సకలజనులకుఁ దప్పదు జగతిలోన

నాఁటనుండియు నీతఁడు కవిత్వము చెప్పికొనియే జీవనము చేయుచుండెను. తిట్టుకవిత్వమునం దీతఁడు ప్రసిద్ధుఁడు. అందుచేతనే యీతని నుద్దండకవి యనియు, కవిరాక్షసుఁ డనియు, జనులు వాడుకొనుచు వచ్చినట్టు కనుపట్టు చున్నది. ఇతఁడు గాక కవిరాక్షసుఁ డనెడు కవి వేఱొకఁడున్నాఁడు.

భీమకవి తన్ను గూర్చి చెప్పకొను కధ లనేకము లున్నవి. ఈతఁడు రాజ సభలకుఁ బోయినప్పడు , తాను దాక్షారామ భీమేశ్వరుని పుత్రుఁడ ననియే చెప్పుకొనుచు వచ్చినట్లీ క్రిందిపద్యము వలనఁ దెలియవచ్చుచున్నది.

            మ. 'ఘనుఁడన్ వేములవాడ వంశజుఁడ దాక్షారామభీమేశనం
                 దనుఁడన్ దివ్యవిషామృతప్రతిజనానాకావ్యధుర్యుండ భీ
                 మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ ! కస్తూరికా
                 ఘనసారాదిసుగంధవస్తువులు వేగం దెచ్చి లాలింపరా '

ఈ పద్యమునందలి తెలుంగాధీశ యనుదానిని వెలుంగాధీశయని దిద్ది దానికి విమలాదిత్యుఁ డని యర్థము చెప్పుటకంటె సాహసకార్యముండదు. తెలుంగాధీశుఁ డనఁగా తెలుఁగురాయcడు. రామవిలాసములో

       క. ఆ మాచనృపతిసుతుఁడు మ
          హామహుఁ డెఱపోతనక్షమాధీశ్వరుఁ డా
          శ్రీమంతుసుతులు జగదభి
          రాములు శ్రీ తెలుఁగురాయ రామనరేంద్రుల్.[3]

అని గుడిమెట్టరాజగు నెఱపోతరాజు కొడుకు తెలుఁగురాయఁ డొకఁడు చెప్పఁబడి యున్నాఁడు. ఈతెలుఁగురాయcడు పదమూడవ శతాబ్ది మధ్యమునం దుండినవాఁడు. కవి యూ తెలుఁగురాయనిఁ గూర్చియే యీ పద్యమును జెప్పినయెడల, ఇతఁడు తిక్కనకాలములోనో, తిక్కనకు గొంచె మీవలావలలనో యుండి యుండును. తిక్కన యీతన గ్రంథములలో బేర్కొనకుండుట కూడ నితఁడు తిక్కనకు పూర్వపువాఁడు కాఁడని తెలుపుచున్నది. పదమూడవ శతాబ్ది మధ్యమున నున్న యీ తెలుఁగురాయఁడు గాక కవులకు కస్తూరికాదానము చేయుటయందుఁ బ్రసిద్ధుఁ డయిన వేఱొక తెలుఁగురాయఁడు సాంపరాయని పుత్రుఁడు పదునాల్గవ శతాబ్దోత్తరార్ధమున నుండెను. భీమన కస్తూరిని వేఁడినది యీ తెలుఁగురాయనినే యయి యుండును. "తెలుంగాధీశ' యన్న ప్రయోగము వ్యాకరణ దుష్ట మగుటచేత నది 'కళింగాధీశ' యని యుండవలెనని యొకరు వ్రాయు చున్నారు. సంజ్ఞలయందును, బిరుదములయందును మనము వ్యాకరణ దోషములను బాటింపరాదు. కస్తూరికాదానమునకుఁ బ్రసిద్దికెక్కినవాఁడు తెలుఁగురాయఁడు కాని కళింగాధీశుఁడు కాఁడు. ఈ తెలుఁగురాయనినే కస్తూరి వేఁడెడి యీ క్రింది పద్యములో నీతనిఁ గూర్చి శ్రీనాధుఁడును *తెలుంగాధీశ" యనియే ప్రయోగించియున్నాఁడు.

         శా. "అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
              భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
              దాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
              వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్."

ఈ తెలుఁగురాయఁడు మరణము నొందుటచేతఁ గస్తూరికాదానము చేయువారు లేరని శ్రీనాథుఁడీ సీసపద్యపాదమున విలపించియున్నాఁడు.

             'రంభఁ గూడెఁ దెలుంగురాయరాహుత్తుండు
              కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు'

విమలాదిత్యునితండ్రి యైన దాననృపాలుఁడు మూఁడు సంవత్సరములు రాజ్యము చేసిన తరువాత కళింగు లాతనిని రాజ్యపదభ్రష్టునిఁ జేసి రాజ్యమును తా మాక్రమించుకొనిరి. ఆ కాలములో భీమకవి యున్నట్టును, అప్పుడు రాజ్యపాలనము చేయుచున్న కళింగగంగును తిట్టినట్టును కొందఱు చెప్పుచున్నారు. ఈ కవి యొకనాఁడు రాజసందర్శనార్థమయి పోఁగా రాజ కళింగగంగు కార్యభారములో మునిఁగియుండి యసమయమగుటచే కోపపడి "యిప్పడు సందడిగానున్నది. సందడి తీఱిినతరువాత రమ్ము" అని కేక వేసెనట ! అందుమీఁద భీమన యాగ్రహపడి

          ఉ. వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
              సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొమ్మనెన్
              మోమును జూడ దోష మిఁక ముప్పది రెండు దినంబులావలన్
              జామున కర్ధమం దతినిసంపద శత్రులఁ జేరుఁగావుతన్.

అను పద్యమును జెప్పెనఁట ! ఈ వాక్యము శాపమయి తగులఁగా శత్రు రాజు లాతనిరాజ్య మాక్రమించుకొని యాతనిని వెడలగొట్టిరcట ! తరువాత నతఁడు శత్రుభీతిచేత మాఱువేషముతో నూరూరఁ దిరుగుచు నొకనాఁటిరాత్రి చీఁకటిలో భీమకవి యింటిముందరి పాఁతర గోతిలో కాలుజాఱి పడి, అంత బ్రతుకు బ్రతికిన మహారాజున కిప్పు డొక్కకాలి దివ్వటి యైన లేకపోయెనే యని ఖేదపడెను అప్పడు పాదప్రక్షాళణమున కయి వెలుపలికి వచ్చిన భీమకవి యా మాటలు విని 'నీ వెవ్వఁడ ?' వని యడుగఁగా "నేను వేములవాడభీమకవి చేసిన జోగి " నని యాతఁడు ప్రత్యుత్తరము చెప్పెను, అందుమీఁద కవి కరుణించి

       ఉ. 'వేయి గజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
            రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
            రాయకళింగ గంగ కవిరాజు భయంకర మూర్తి చూడఁ దాఁ
            బోయిన మీనమాసమునఁ బున్నమ బోయిన షష్ఠినాఁటికిన్.'

అను పద్యమును మరలఁ జెప్పి యాశీర్వదించెను. ఈ యాశీర్వచన ప్రభావముచేత నాతఁడు భాగవతులలోఁ గలసి సజ్జనగరమునకుఁ బోయి. అక్కడి రాజు తన శత్రువు నవమానించుటకయి "రాజకళింగ గంగు వేషము వేసెదరా ?" యని భాగవతుల నడుగఁగ, వారి నొప్పుకొండని చెప్పి రాత్రి వేళ తానా వేషము వేసికొని, వేషమునిమిత్తమని తనఖడ్గమును, గుఱ్ఱమును రాజువలనఁ బడసి యశ్వారోహణము చేసి యాటనెపమున నిజముగా రాజకళింగ గంగే వచ్చెనని జను లాశ్చర్యపడ రాజును సమీపించి తన చేతిఖడ్గధారతో నాతని శిరస్సు ఖండించి తానా సింహాసన మెక్కి కూరుచుండెను. ఈ వార్తయే నిశ్చయ మయి యా రాజు చాళుక్యరాజులు రాజ్య పదభ్రష్టులైన కాలపువాఁడే యైన పక్షమున, విమలాదిత్యుC డేడు సంవత్సరములును, విమలాదిత్యునిజ్యేష్టభ్రాత యైన శక్తివర్మ పండ్రెండు సంవత్సరములును మరల స్వరాజ్యమును గెలుచుకొన్న తరువాత పాలనము చేసినందున భీమకవి రాజనరేంద్రుని రాజ్యకాలారంభమునందును, తత్పూర్వ మిరువది ముప్పది సంవత్సరముల వఱకును, ఉండినట్లెంచవలసి వచ్చును. అయినను, ఆ కాలమునందు కళింగదేశము నేలిన ప్రభువులలో గంగను పేరు గలవాఁ డెవ్వఁడు నున్నట్లు కనబడఁడు. కాబట్టి భీమకవి నన్నయభట్టునకుఁ బూర్వుఁడు కాఁడనుట నిశ్చయము.

ఎనిమిదవ శతాబ్దారంభము మొదలుకొని పండ్రెండవ శతాబ్దారంభము వఱకును పాలకులుగా నున్న కళింగరాజులలో 'గంగ' నామము గలవాడొక్కఁడు మాత్రమే కనఁబడుచున్నాఁడు. అతఁడు శాలివాహనశకము 999 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తు శకము గిది 1077 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చెను. ఈతనితల్లి చోడ దేశపురాజు (రాజనరేంద్రుని కొడుకగు కులో త్తుంగచోడ దేవుని ) కూఁతురయినందున, ఇతఁడు చోడ గంగయనియుఁ బిలువఁబడుచు వచ్చెను. నన్నయభట్టునకుఁ దరువాత కళింగ రాజ్య మేలిన 'గంగ' నామము గలవారిలో మొదటివానికాలమునందు భీమన యుండె ననెడు పక్షమున , పయి పద్యమునం దుదాహరింపఁబడిన రాజకళింగగంగితఁడే యనవలసివచ్చును. అప్పు డీతని తండ్రి పేరు రాజరాజగుటచేత, ఆ పేరును సూచించు నిమిత్తమే కళింగ గంగునకుఁ బూర్వము రాజశబ్దము చేర్పఁబడినట్లుసు జెప్పవలసి వచ్చును. ఈ కళింగ గంగు శాలివాహనశకము 1031 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తు శకము 1119 వ సంవత్సరపు నందు తామర శుంఠి యను గ్రామమును మాధవశర్మ యను బ్రాహ్మణు కిచ్చినట్లొక దాన శాసనమునం దున్నది. ఈ శాసనము విశాఖపట్టణమఁ లకరగ్రాహిచేఁ పంపఁబడి చెన్నపురి చిత్ర వస్తు పదర్శనశాలయం దుంచ బడి యున్నది. ఈ కళింగ గంగున కనంత వర్మదేవుఁడని నామాంతరము కలదు. ఈ శాసనములోఁ జెప్పఁబడిన వంశానుక్రమమునుబట్టి కళింగగంగుని తండ్రి రాజరాజు (ఇతఁడే కులోత్తంగ చోడ దేవుని కూఁతు రగు రాజ సుందరిని వివాహ మాడినవాఁడు) రాజరాజు తండ్రి ; ఇతఁడు ముప్పదినంవత్సరములు రాజ్యపాలనము చేసెను. వజ్రహస్తునితండ్రి కామార్ణవుఁడు; ఇతడు తన యన్నలలో నొకడు రెండు సంవత్సరములును, ఒకఁడు మూడు సంవత్సరములును ప్రభుత్వము చేసినతరువాత పందొమ్మిది సంవత్సరములు రాజ్యపాలన చేసెను. కామార్ణవుని తండ్రి వజ్రహస్తుడు; ఇతఁడు ముప్పదియైదు సంవత్సరములు రాజ్యమేలెను. వజ్రహస్తునితండ్రి కామార్ణవుఁడు; ఇతఁడు తన యన్నలును, అన్నకొడుకు ముప్పదియేడేండ్ల రాజ్యము చేసిన తరువాత రాజయి యిరువదియైదు సంవత్సరములు ప్రజాపాలనము చేసెను. కామార్ణవుని తండ్రి గుణార్ణవుడు; ఇఁత డిరువదియేడు సంవత్సరములు భూమియేలెను. గుణార్ణవునితండ్రి కామార్ణవుఁడు. ఇతడన్నయైన వజ్రహస్తుడు 15 సంవత్సరములు దేశ మేలినతరువాత ప్రభుత్వమువకు వచ్చి పందొమ్మిదేండ్లు నేల యేలెను.కామార్ణవుని తండ్రి ( ? ) రణార్డవుఁడు; ఇతఁడైదు సంపత్సరములు భూపరిపాలనము చేసెను. రణార్ణవునితండ్రి కామార్ణవుడు; ఇతఁ డేఁబదియేండ్లు ప్రభుత్వము చేసెను. కామార్ణవుని తండ్రి దానార్ణవుఁడు. ఇతఁడు నలువది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతనిరాజ్యకాలము 830 వ సంవత్సర పాంత మయినది. ఈ కాలము మొదలుకొని 1077 వ సంవత్సరము వఱకును కళింగరాజ్య మేలినవారిలో గంగను పేరు గలవాఁడు లేనందున, భీమకవికాలములో నుండిన కళింగగం గింతకుఁ బూర్వపువాఁడు కాఁడని నిశ్చయింపక తప్పదు. ఈతని కాలము లోనే భీమకవి యుండిన పక్షమున, అతఁడు పండ్రెండవ శతాబ్దారంభమున నున్నట్లు తెలుసు గదా? ఈ కాలము సాహిణిమారఁడు మొదలైన వారి కాలముతో సరిపోకున్నది. అందుచేత భీమకవి యీతనికాలములోనివాఁడు కాఁడనియు, తరువాత నున్న వేఱొక కళింగగంగు కాలములో నుండి యుండుననియు ఎంచవలసి యున్నది.

ఇయ్యెడ శ్రీ జయంతి-రామయ్య పంతులుగారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు ప్రకటించిన కవిజనాశ్రయ పీఠికలో క్రింది విషయమును వ్రాసియున్నారు.

".......... ఈ పద్యములలో 'గళింగ గంగు' రాయకళింగగంగునని పేర్కొన బడిన రాజెవ్వడో నిర్ణయింపవలయును. 999 వ శతాబ్దము మొదలు రమారమి యఱువది సంవత్సరములు కళింగదేశము ననంతవర్మయను నామాంతరముగల చోడకళింగ గంగ దేవుడు పాలించినట్టు శాసనముల వలన దెలియుచున్నది...........ఈ కాలమునందే రాజరాజచోడగంగను రాజు వేంగీదేశమును బాలించుచుండెను. ఈతఁడు రాజరాజ సరేంద్రుని పౌత్రుఁడు. కాంచీపురము రాజధానిగా వేంగీచోళ దేశముల నేకచ్ఛత్రముగా నేలిన కులోత్తుంగ చోళుని యగ్రపుత్రుండు. తండ్రి యాజ్ఞానుసారముగ వేంగి దేశమును బాలించెను......... ప్రస్తుత విచారమునకు భీమకవి కాశ్రయుండైన రాజు వీరిరువురిలో నెవ్వఁడైన నొక్కటియే ! కాని, కళిగ గంగును సంజ్ఞ యనంతవర్మ చోడగంగ దేవునికే యన్వర్థమగును...... భీమకవి యీతని రాజ్యకాలము పూర్వ భాగములో నుండె ననిన 924 శకా బ్దమున పట్టాభిషికుడైన రాజరాజునాస్థానకవియగు నన్నయభట్ట నకు రమారమి 100 సంవత్సరముల తరువాతివాడగును. భీమకవి యనంతవర్మ రాజ్యావసానదశయం దుండెననుకొన్నచో మఱి ముప్పది, నలువది సంవత్స రముల తరువాతి వాడగును. కాని శ్రీరామమూర్తిగా రనుకొన్నట్లు నన్నయభట్టుకంటె బ్రాచీనుడుకాడు. వీరేశలింగము పంతులుగా రెంచినట్లు 14 వ శతాబ్దము వాఁడగను."[4]

పయియంశములను బట్టి శ్రీరామయ్యపంతులుగారు రాయ కళింగ గంగును రాజరాజ చోడ గంగును విభిన్న వ్యక్తులని తలంచినట్లును, ఇరువురు నభిన్నులని శ్రీ వీరేశలింగము పంతులుగారు తలంచినట్లును తెలియుచున్నది. మఱియు రాజరాజ చోడగంగు రాజరాజ నరేంద్రుని దౌహిత్రుడని శ్రీ వీరేశలింగము పంతులుగారు తలంచినట్లు తెలియుచున్నది.

             సీ. వచియింతు వేములవాడ భీమన భంగి
                               నుద్దండలీల నొక్కొక్కమాటు
                 భాషింతు నన్నయభట్టుమార్గంబున
                               నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
                 వాక్రుత్తు తిక్కయజ్వప్రపకారము రసా
                               భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
                 పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిరేవ
                               సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు

                 నైషధాది మహాప్రబంధములు పెక్కు
                 చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
                 యిపుడు చెప్పఁదొడంగిన యీప్రబంధ
                 మంకితము సేయు వీరభద్రయ్యపేర.

అను పద్యములో శ్రీనాధుఁడు చెప్పిన కవుల వరుసనుబట్టి భీమకవి నన్నయ భట్టారకునికి పూర్వుడేమో యని భ్రమ కలుగుచున్నది. కాని యీ కవి పండ్రెండవ శతాబ్దమధ్యమునకు లోపల లేన ట్లింతకంటెఁ ప్రబలము లయిన నిదర్శనములు కానవచ్చుచున్నవి. రాజనరేందుని యనంతరమునఁ చోళులు వేంగిదేశము నాక్రమించుకొన్న తరువాత పండ్రెండవ శతాబ్దమధ్యమునఁ దెనుఁగుదేశములోఁ గొంత భాగము రాజ్యము చేయుచుండిన చళుక్య వంశజుఁడగు చొక్కరాజకాలమునందు భీమకవి యున్నట్లు కొందఱు చెప్పుచున్నారు. ఒకనాఁడు చొక్కరాజుద్యానవనములో మల్లెసాల స్తంభముమీదఁ గాలు చాఁచుకొని కూరుచుండి యచ్చట నున్న భీమకవినిజూచి

      శా. 'ఆనీతాభ్యుపదానళృంఖలపదాభ్యాలంబితస్తంభమా!
           నేనే వేములవాడ భీమకవినేనిం జిత్రకూటంబు లో
           భూనవ్యాపితపల్లవోద్భవమహాపష్పోపగుచ్చంబులన్
           నానాపక్వఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్"

అంతట నా పందిరిగుంజ కొమ్మలతోను పత్రములతోను చిగుళ్ళతోను పుష్పములతోను ఫలములతోను పూర్వ మరణ్యములో నున్నట్లు మహా వృక్షమై యా రాజకాలు దానిలోపల చిక్కుపడిపోయెనcట! అక్కడ నున్నవా రందరు నా కవిశక్తి కత్యాశ్చర్యమగ్నమానసులయిరcట! అప్పుడు రాజు తనకాలూడఁదీసికొనలేక మరల నావృక్షమును పందిరికంబమునుగాఁ జేయవలయునని భీమకవినివి ప్రార్ధింపగా నతఁడు

      ఉ. శంభువర ప్రసాదకవిసంఘవరేణ్యుఁడ నైన నావచో
          గుంభన చేయ నెంతొ యనుకూలత నొంది తనూనభావనన్
          గుంభినిఁ జొక్కనామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్
          స్తంభమురీతి నీతనువుఁ దాలిచి యెప్పటియట్ల యుండుమా."

అను పద్యమును జెప్పి, వృక్షమును మరల యధాపూర్వకముగా పందిరి స్తంభమునుగా మార్చివేసెనఁట ! భాస్కరరామాయణమును కృతినందిన సాహిణిమారఁ డీతని కాలములోనివాఁ డగుటచే భీమకవి పండ్రెండవ శతాబ్దాంతమునను మధ్యమునను జీవించి యుండలేదనియు చొక్క నృపాలుఁడు పండ్రెండవ శతాబ్దమధ్యమునఁగాని యంతమునఁగాని యుండినవాఁడు కాcడనియు, స్థాపించుచున్నది. అప్పకవీయమునం దుదాహరింపబడిన యీ క్రింది భీమకవి చాటుధారాపద్యమువలన మారఁడు చొక్క నృపాలుని కాలములోనివాఁ డగుట తేటపడుచున్నది.

    ఉ. చక్కఁదనంబుదీవి యగు సాహిణి మారఁడు మారుకైవడిన్
        బొక్కి బడంగలండు చలము న్బలముంగల యా చళుక్యపుం
        జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కుల మంటలురాలఁజూచినన్
        మిక్కిలి రాజశేఖరునిమీఁదికి చచ్చిన రిత్తవోవునే

ఈ సాహిణిమారcడును, హుళక్కి భాస్కరుడును గణపతిదేవునిమనుమc డై న ప్రతాపరుద్రునికాలములో నుండినట్లు సోమదేవరాజీయమునఁ జెప్పఁబడియున్నది. ప్రతాపరుద్రునికాలములో నున్న సాహిణిమారఁడు పదుమూడవ శతాబ్దాంతమునను పదునాల్గవ శతాబ్దాదియందును నుండవలసి యున్నందున, చొక్కనృపాలుఁడును, భీమకవియుఁ గూడఁ పదునాల్గవ శతాబ్దాదియందుండినవారని నిశ్చయింపవలసియున్నది చొక్కనృపాల, సాహిణి మారుల విషయమున 'ఆంధ్రకవి తరంగిణి"లో క్రింది రీతిని గలదు. '(ఈ చక్కదనంబురీవ) యగు పద్యము వేములవాడ భీమకవి రచించెనని యనుట కప్పకవి వ్రాఁత తప్ప మఱియొక యాధారము లేదు. ఇది భీమకవికృతమని మనము నమ్మితిమేని భీమకవికాలములోనే యిరువురు చొక్కనృపాలురుండుట యసంభవము కావున, నీ పద్యములో జెప్పబడిన చొక్క_నృపాలుఁడును పై పద్యములకు (ఆనీతాభ్యుపదాన-శంభువరప్రసాద అను వానికి) సంబంధించిన చొక్కనృపాలుఁడును, ఒక్కడే యనుటకు సంశయింపనక్కరలేదు. ........... పశ్చిమ చాళుక్యులలోఁగాని, తూర్పు చాళుక్యులలోఁగాని నేనెcఱిగి యున్నంతవరకు చొక్కనృపాల నామధారు లెవ్వరునులేరు. కాని నెల్లూరు మండలములోని గూడూరు తాలూకాలో రెడ్డిపాలెమునకు "శివారు" గా నున్న పాండురంగము నందలి పాండురంగాలయములో నున్న శాసనములలో నొకదానియందు “చొక్క నాయనారని", నామాంతరముగల కులోత్తుంగ చోళుని పేరితో నొక శాసనమున్నది. (నె శా. సం. 446 వ పుట సంఖ్య 96) ఈ శాసనము పూర్తిగాఁ బ్రకటింపబడక పోవుటచే నీ కులోత్తంగ చోళుఁడెవ్వఁడో పూర్తిగాఁ బ్రకటింపఁబడకపోవుటచే నీకులోత్తుంగ చోళుఁడెవ్వడో, ఈతనికాల మెద్దియో తెలిసికొనుట కవకాశము లేకపోయినది. కులోత్తంగ చోళులు మువ్వురున్నారు. మొదటి యాతడు శా. శ.991-1030 మధ్యను, 'రెండవయాతడు 1054-1068 నడుమను, మూడవవాడు 1100-1188 మధ్యను రాజ్యము చేసినవారు. చొక్క నృపాలకు నకు వైరియని పై పద్యములోఁ జెప్పఁబడిన సాహిణి మారడు ప్రతాపరుద్రుని సేనాధిపతి యని చెప్పఁబడినట్టి సాహిణి మారఁడని యెంచితిమేని యాతఁడు పైని చెప్పిన మువ్వురుకు లోత్తంగ రాజుల కాలములోను లేక వారిలో మూఁడవయాతనికిఁ బిమ్మట దాదాపు ఎనుబది సంవత్సరములలో నున్నవాడు, కావున యీ పద్య మర్థము లేని దగుచున్నది. (చూ. ఆంధ్రకవి తరంగిణి, భా. 1 పుటలు, 244-245)

ఇంతేగాక నన్నయభట్టారకుని చరిత్రములో జూపినట్లు భీమకవి తన కవి జనాశ్రయఛందస్సులోఁ గావ్యాలంకారచూడామణిలోని పద్యము నుదాహరించుట భీమకవి తప్పక పదునాల్గవశతాబ్దాదియం దున్నవాఁ డన్న యీ సిద్ధాంతమును స్థాపించుచున్నది. భీమన దేశసంచారము వెడలినప్పుడు తనగుఱ్ఱము గుడిమెట్టలోని పోతరాజు పొలములోఁ బడఁగా రాజు దానిని కట్టిపెట్టించి విడువకున్నమీఁదట భీమన యాతనిని తిట్టిన పద్యమని యొకటి చదువుదురు. ఆ పద్యము రెల్లూరి తిరుమలయ్య చెప్పినట్లు కవి చెప్పుచున్నాఁడు కాని యీ ప్రాంతములయం దది భీమకవికథగా నే చిరకాలమునుండి పరంపరగా వచ్చుచున్నది. గుడిమెట్ట పాలించినది చాగి (సాగి) పోతరాజు గానీ శ్రీపతిరాజు పోతరాజు కాఁడు. ఈ పోతరాజు పెద్దాపుర సంస్థానాధిపతులగు వత్సవాయవారికి మూలపురుషుఁడు. గుడిమెట్ట యను గ్రామము కృష్ణా మండలములోని నందిగామకు నైఋతిమూలను నాలుగు క్రోశముల దూరమున నున్నది. ఇది పూర్వము చోళవంశపు రాజులలో నొక తెగవారికి రాజధానిగా నుండెను. ఆ కాలమునందు గుడిమెట్టకు రాజు గా నుండిన త్యాగిపోతరాజు బాహ్మణులకును, దేవాలయములకును బహుమాన్యము లిచ్చెను. త్యాగిపోతరాజు శాలివాహనశకము 1121 అనఁగా హూణ శకము 1199 వ సంవత్సరమున (విజయవాడ) బెజవాడలోని మల్లేశ్వరస్వామికి భూమి యిచ్చినట్టు కనకదుర్గగుడి స్తంభములలో నొకదాని మీఁద వ్రాయఁబడియున్నది. ఈ కాలమునం దీయనపేరు గల శిలాశాసనము లనేకములు కానవచ్చుచున్నవి. అందు 1212 సంవత్సరములో నొకటి యనుమంచిపల్లెలోను, ఇంకొకటి నడికూడిలోను, 1213లో నొకటి బెజవాడలోను, మఱిి యొకటి గుడిమెట్టలోను, 1230 లో మూడు నవాబుపేటలోను, బహుశాసనము లున్నవి. గుడిమెట్టలోని యొకదానిలో పోతరాజు రాజేంద్రచోడుని కొడుకైనట్టున్నది. పోతరాజు త్యాగశీలుఁడని విని భీమకవి యక్కడికి పోయినప్పడు రా జాతనిగుఱ్ఱమును కట్టిపెట్టించి విడువకపోగా,

        చ. హయమది సీత పోతపసుధాధిపుఁ డారయ రావణుండు ని
            శ్చయముగ నేను రాఘవుఁడ ! [5]సహ్యజ వారిధి మారుఁ డంజనా
            ప్రియతనయుండు [6]లచ్చన విభీషణుఁ డా గుడిమెట్ట లంక నా
            జయమునుఁ బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుఁడీ

అను పద్యమును జెప్పి రాజును శిక్షించె నని పెద్దలు చెప్పెదరు. ఈ పోతరాజు పదుమూడవ శతాబ్దాదియందుండినవాఁ డగుటచేత పదునాల్గవ శతాబ్దాదియందుండిన భీమకవి యీతనికాలమునందుండి యీ పద్యమును జెప్పుట సంభవింపనేరదు. గుడిమెట్ట నేలినది, శ్రీపతిరాజు పోతరాజు గాక సాగి పోతరాజే యయినను, అప్పకవి చెప్పినట్లీ పద్యము రెల్లూరి తిరుమలయ్య చేసినదే యయి యుండవచ్చును. మఱియొక పోతరాజవిషయమయి తురగా రామకవి చెప్పిగ పద్యమును, కథయును గూడ నీ ప్రాంతముల యందు వాడుకొనుచున్నారు. తురగారామకవి యాచనార్ధము లేటవరపు పోతరాజనింటికి పోఁగా నతఁడు కవి కేమయిన నియ్యవలసివచ్చు నని యింటనుండియు భార్యచేతఁ దన భ ర్త యింట లేఁడనిపించెనట! ఆ జాడ కవి కనిపెట్టి యాతనిభార్యను జూచి కోపముతో

         క. కూటికిఁ గాకులు కూసెడు
            నేటావల మూఁక గూడియేడువఁదొడఁగెన్
            గాటికిఁగఱ్ఱలు చేరెను
            లేటవరపుపోతరాజు లేఁడా లేఁడా ?

అని రెట్టించి యడిగి తనదారిని బోయెనఁట ! భార్య యీ సంగతి మగనితోఁ జెప్పవలెనని లోపలికిఁ బోఁగా భర్త మంచముమీఁద చచ్చిపడి యుండెనట! అంతట బంధువు లందఱును దుఃఖించి దహాన సంస్కారము నిమిత్తమయి శవమును శ్మశానమునకుఁ దీసికొనిపోవుచుండఁగా వెంట నున్న యాతనిభార్య తనకెదురయిన కవికాళ్ళమీఁదఁ బడి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకోగా నతఁడు
      
         క. నాఁటి రఘురాము తమ్ముఁడు
            పాటిగ? సంజీవిచేత బ్రతికినరీతిన్
            గాటికిఁ బో నీ కేటికి
            లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మా !

ఆని చెప్పి యాతనిని బ్రతికించెనఁట! తురగా రామకవియు నించుమించుగా భీమకవి వంటివాఁడే.

భీమకవి పదునాల్గవ శతాబ్దాది నుండియున్నట్టు పయి నిదర్శనము లన్నిటివలనను స్పష్టమగుచున్నది. ఇప్పు డేర్పడిన యీ కవికాలమును బట్టి చూడఁగా

         గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
            నట్టి రాఘవపాండవీయంబు నడఁచె
            ఛందము నడంప నీ ఫక్కి- సంగ్రహించె
            ననుచు భీమన యెంతయు నడఁచె దాని. [ పీఠిక - 44 ప.]

అని యప్పకవి చెప్పిన వాక్యము నిరాధార మయినట్టు స్పష్టమగుచున్నది. కవుల కాల భేదముమాట యటుండనిచ్చినను, నన్నయభట్టు భారతమును దెలిఁగింప నారంభించుటచేతఁ దా నావఱకు రచించిన రాఘవపాండవీయ మడఁగెననియు, నాంధ్రశబ్దచింతామణిని జేయుటచేతఁ దన ఛందస్సును నడఁగిపోవు ననియు భీమన తలఁచె ననుట యుక్తివిరహితమైన వెఱ్ఱిమాట యగుట యించుక యాలోచించినవారి కెవ్వరికిని దోcచకపోదు. భారతరాఘవార్ధములు గల ద్వ్యర్థికావ్యమం దొకయర్థము గల భారతమును రచించుటచే నెట్లు నశించును? పై పద్యమునందలి యుత్తరార్ధములోని యుక్తి యీ యుక్తిని సహితము మించి యున్నది ఛందము నడఁచుటకcట! వ్యాకరణ మును సంగ్రహించెనఁట ! "పృష్ణతాడనా ద్దంతభంగ" యన్నట్లు వ్యాకరణము రచించుటచేత ఛందస్సెట్లు నశించును? వ్యాకరణము శబ్దలక్షణము; ఛందస్సు పద్యలక్షణము. ఆంధ్రశబ్దచింతామణి వలన భీమన తన ఛందస్సడుగంటు నని తలచుకొనుట కా యాంధ్రశబ్దచింతామణిలో రెండు శ్లోకములు దక్కఛందోవిషయ మేమియు లేనేలేదు. ఆంధ్రశబ్దచింతామణిని

         క. “ఆదిcని భీమకవీంద్రుడు
             గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున; నా
             మీఁదట రాజనరేంద్ర
             క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్." [పీఠిక -51 ప]

అను తన యద్బుతకల్పన కాధారముగా నుండుటకయు యీ గాధను బుద్దిమంతుఁడైన యప్పకవియే కల్పించి యుండును గాని యాంధ్రశబ్దచింతామణిని నన్నయ రచించియు భీమన చించియు నుండరు. భీమన చాటుధార యని యప్పకవీయములో

         చ. 'గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్
              హరునయనాగ్ని కొల్మి యురగాధిపకోఱలు పట్టుకార్లు ది
              క్కరటిశిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వై రివీరసం
              హరణగుణాభిరాముఁ డగు మైలమభీమనఖడ్గసృష్టికిన్."

అను పద్య మదాహరింపఁబడి యున్నది ఈ మైలముఖీమన శాలివాహన శకము 925 వ సంవత్సరపున నుండె నని యొకచోటను, శాలివాహన శకము 935 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1053 వ సంవత్సరమునం దుండెనని యొకచోటను జెప్పఁబడి, మైలముభీమనకాలములో నుండినవాఁ డయినందున భీమకవి పదునొకండవ శతాబ్దములోని వాఁడయి నట్టు కవి జీవితములలో వ్రాయcబడియున్నది. [7] ఒకవేళ మైలము భీమన్న యందుఁ జెప్పఁబడిన కాలములోనే యుండినను పై పద్యమువలన వేములవాడ భీమకవి యాతనికాలమునందే యుండినవాc డయినట్టు నిశ్చయముగా జెప్ప వలనుపడదు. మైలమభీమన సంతతివారి కోరికప్రకారమైవను భీమకవి యూ పద్యమును జెప్పి యుండవచ్చును. ఈవఱకిం దుదాహరింపఁబడిన పద్యములే కాక స్వవాదోపబలార్ధముగాఁ గవి జీవితములలో నుదాహరింపఁబడిన యీ క్రిందిపద్యమును భీమకవి మైలముభీమన కాలమని చెప్పఁబడెడు కాలములో నుండె ననుట నబద్ధము చేయుచున్నది

            సీ. గడియలోపలఁ దాడి కడఁగి ముత్తవియఁగాఁ
                                     దిట్టిన మేధావి భట్టుకంటె
                 రెండు గడెల బ్రహ్మాదండిముండ్లన్నియు
                                     డుల్ల దిట్టిన కవిమల్లుకంటె
                 మూడు గడియలకు మొనసి యత్తినగండి
                                     పగలఁ దిట్టిన కవి..నుకంటె
                 నరజాములోపలఁ జెఱువునీళ్ళిం కంగఁ
                                     దిట్టిన బడబాగ్నిభట్టుకంటె

                 నుగ్రకోపి నేను నోపదు శపియింపఁ
                 గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
                 వట్టిమ్రానఁ జిగురు పుట్టింప గిట్టింప
                 బిరుద వేములాడభీమకవిని.

ఇందలి "వేములాడ' యన్న ప్రయోగము మాత్రమేకాక, ఈ పద్యము నందు బేర్కొనఁబడిన కవులును. నీ పద్యము భీమన చెప్పినది కాదని ఘోషించుచున్నారు. ఈ పద్యములోఁ బ్రథమపాదమున మేథావి భట్టు తాళవృక్షమును ముత్తునియలుగాఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది

          క. సాళువ పెదతిమ్మమహీ
             పాలవరుఁడు వీఁడె వచ్చెఁ బద్యము వ్రాయన్

          గేలను లే దా కొక్కటి
           తాళము ముత్తునియ లగుచు ధరపైc బడుమా !

ఇందుc జెప్పఁబడిన సాళువ పెద్దతిమ్మరాజు పదునేనవ శతాబ్దములోని వాఁ డగుటచే భీమకవి యీతనికిఁ దరువాతివాఁ డయి యుండడు. ద్వితీయ పాదమున ప్రౌఢకవి మల్లన బ్రహ్మదండిముండ్లు చాలఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది

        క. గుడి యన్న నృపతిఁ బొడఁగన
           నడవంగాఁ గొcడపల్లి నగరిపడమటన్
           గుడి యెడమ మడమఁ గాడిన
           చెడుముండులని బ్రహ్మదండిచెట్టున డుల్లున్.

ఈ ప్రౌఢకవి మల్లన పదునేనవ శతాబ్దాంతమునం దుండినవాఁ డగుటచేత నీతనికిఁ దరువాత భీమకవి యుండి యుండఁడు. తృతీయపాదమంందలి కవి భానుఁ డెవ్వఁడో తెలియ రాలేదు. చతుర్థపాదమున బడబానల భట్టు తెలుగురాయఁడు కట్టించిన చెఱువునీ ళ్లింకఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది.

        క. బడబానల భట్టారకు
           కుడిచేయుంగరము రవికి గొబ్పున నర్ఘ్యం
           బిడు వేళ నూది నీలో
           బడియెఁ దటా కంబ నీటిఁ బాయుము వేగన్.

తెలుఁగురాయనికాలము ముందే చెప్పఁబడినందున నాతనికి దరువాతనున్న బడబానల భట్టుకాలమునకుఁ దరువాతను భీమకవి యుండియుండడు. అప్పకవీయములో నుదాహరింపఁబడిన పై పద్యముల నన్నిటిని జదివి నడుమను గొంత తన కవిత్వము పెట్టి వ్యాకరణజ్ఞానము చాలని యిటీవలి మహాకవి యెవ్వఁడో భీమకవి పేరు పెట్టి యూ పద్యము నల్లి యుండును. ఒకవేళ భీమకవి మైలముభీమనకాలములోనే యుండినను, ఆ భీమన పదునొకండవశతాబ్దములోవాఁడు గాక, యాతని సంతతి వాడయిన మఱిియొక మైలముభీమన కావచ్చును. శ్రీనాథకవికృతమయిన

         శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
             భిక్షాదాన ము చేయూరా సుకవిరాబ్బృందారకశ్రేణికిన్
             దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
             వక్షౌజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్,"

అను పద్యములో నతనికాలమునం దొక తెలుఁగురాయఁ డున్నట్లు చెప్పబడెను. రామవిలాసములో రామరాజపుత్రుఁ డగు మఱియొక తెనుగు రాయఁఁడీ క్రిందిపద్యములో వర్ణింపఁబడినాఁడు

        మ. అచలాధీశ్వరధీరు రేకపలిదుర్గాధ్యక్షు విద్వేషిరా
            ట్పచయోద్వేలబలావలేపతిమిరప్రద్యోతనున్ విక్రమా
            ర్కచరిత్రోత్తమకావ్యనాయకుని వేడ్కం బ్రస్తుతింపదగున్
            సుచరిత్రాఢ్యుని వత్సవాయతెలుఁగున్ క్షోణీశచూడామణిన్.

ఇరుపురును కస్తూరికే ప్రసిద్దు లయినట్టు చెప్పఁబడినను, పదునాల్గవ శతాబ్దాదిని భీమకవికాలములో నుండిన తెలుంగాధీశుఁడును పదునెదవశతాబ్దాదిని శ్రీనాధునికాలములో నూఱు సంవత్సరములకుఁ దరువాత నుండిన తెలుంగాధీశుcడును. ఏకపురుషుడుఁగా గాక వేఱువేఱు పురుషులయి యుండవలెను. ఈ ప్రకారముగానే మైలముభీమన లనేకులుండవచ్చును. ఇది గాక కవి జీవితములోనే రణతిక్కన రణనిహతుఁడయినప్పుడు భీమకవి రణ తిక్కనిభార్యను "దీర్ఘసుమంగళీభవ" యని దీవించి

          క. గుణములనిధాన మగు
             మన రణతిక్కఁడు తాఁ గళేబరంబును శిరమున్
             గణఁక మెయిఁ గలయ బ్రతుకును
             బ్రణుతాఖిల వైరి మకుటభాసితపదుఁడై'.

అను పద్యము చెప్పి మొండెమును శిరస్సును నేకముగాఁ గూర్చి బ్రతికించె నన్నకథ డ్వాత్రింశన్మంత్రులచరిత్రమునుండి గ్రహింపఁబడి, దానినిగూర్చి [8]"యీ కథ కేవలకల్పితమని చెప్పుట కాధారము లేవియుఁ గానరావు" అని వ్రాయబడినది. భీమకవి రణతిక్కన కాలములోనే యున్న పక్షమున, ఈ వఱకుఁ జేయఁబడిన తిక్కనకాల నిర్ణయమునుబట్టి భీమన పదుమూడవ శతాబ్దమధ్యమునకుఁ బూర్వపు వాఁడనియే యేర్పడును. ఆ ద్వాత్రింశన్మంత్రుల చరిత్రములోని రణతిక్కన తల్లి పేరు మైలమ్మ యనియు పెంపుడు తల్లి పేరు పోలమ్మ యనియు వ్రాయఁబడుటయే కాక "గరళపు ముద్ద" అను పద్యము భీమకవి తిక్కనఖడ్గమును బ్రశంసించుచుఁ జెప్పిన ట్లీ విధముగా నుదాహరింపCబడినది.

         చ. గరళపుముద్ద లోహ మవగాభి మహాశనికోట్లు సమ్మెటల్
             హరునయనాగ్ని కొల్మియు గాధీపుకోఱయు పట్టుకార్లు ది
             క్కరటిశిరంబు దాయి లయనాడు కమ్మరి వైరివీరసం
             హరణగుణాభిరాముఁడగు వైులమతిక్కనిఖఢ సృష్టికిన్.

 ఇది యెవ్వరినిగూర్చి చెప్పఁబడిన పద్యమో బుద్ధిమంతు లూహించు కొందురుగాక. భీమకవిని గూర్చి నన్నయ చెప్పిన దనెడు

         చ. "మతిఁ బ్రభ నీగిఁ బేర్మి సితమానము పెంపున భీమునిన్ బృహ
              స్పతి రవి గర్ణు నర్జనుఁ గపర్ది సుయోధను పోల్పఁబూన నా
              మతకరిఁ దీక్ష్ణు దుష్కులు నమానుషు భిక్షు ఖలాత్కు నెంచ వా
              క్పతిపు శశిన్ గొమరుసామిని మేరువు నబ్ధిబోల్చెదన్."

అను పద్యమును మఱి యెవ్వరిచేతనో యెవ్వరినిగూర్చియో చేయఁబడి నదయి యుండును.

భీమకవి రాఘవపాండవీయమును రచించెనని పెద్దలనుకొనుటయే గాని గ్రంథము పింగళి సూరన్న నాఁటికే నామమాత్రావశేష మయినది. ఇప్పుడీతఁడు చేసిన ఛందస్సు మాత్ర మొకటి వాడుకలో నున్నది, దానికి కవిజనాశ్రయ మని పేరు. ఇతఁడు తన ఛందస్సును రేచన్న యను కోమటి కంకితము చేసి యున్నాడు. రేచన్న యేకాలపువాడో తెలిసినది కాదు. అయినను గవిజనాశ్రయములో దిన్నకోట పెద్దన కృత మయిన కావ్యాలంకారచూడా మణిలోని పద్యము లదాహరింపఁ బడి యుండుటచేత నతఁడు పదునాల్గవ శతాబ్దాదియం దున్న ట్లెంచవలసి యున్నది. ఇతఁడు జ్యోతిషపటలములు వ్రాసెననియు, వానియందిప్పు డున్న వారును, మున్ను చన్నవారును ముందు పుట్టఁబోవువారును నడుగఁబోయెడు సమస్తప్రశ్నల కుత్తరములు గలవనియు కొందఱు చెప్పుదురు. కాని యవి యన్నియు జనులను మోసము చేయుటకయి వంచకులు పన్నిన తంత్రములే కాని మఱి యేవియుఁ గావు.[9] ఈ మహాకవి యొకనాడు తన తల్లి,బ్రాహ్మణులకు నేయి వడ్డించు చుండగా నేతిచెంబుమసి కడుపుమీద నంటుకొన్నప్పుడు 'అమ్మా నీకడుపు మసి యయినది" అని చెప్పచు, కడుపు మసియయ్యేననుట కొడుకు చచ్చెనని యర్ధ మగుటచేత నా మాట తగిలి యా క్షణముననే మృతుడయ్యెనని చెప్పచున్నారు. మణికొందఱు వెనుకఁజెప్పిన "వేయి గజంబులుండ" నను పద్యములో 'దా బోయిన మీనమాసమున బున్నమ పోయిన షష్టినాటికిన్" అను వాక్యము తగిలి విధివశము చేత తల్లిని నీ కడుపు మసి యయ్యేననె నని చెప్పుదురు. ఈయన కవిత్వశైలి తెలియుట కయి కొన్ని పద్యములిం దుదాహరింపఁబడు చున్నవి.

        ఉ. నవ్యవిలాస రమ్యనలినం బని బాలముఖాబ్జసౌరభా
           భివ్యసనంబునం బరగు భృంగకులోత్తమ తద్వియోగతా
           పవ్యధ బ్రాణి నిల్వదు కృపాగుణ మేర్పడఁ బ్రాహ్మణో న హం
           తవ్యఁ యనంగ నొప్పు వచనస్థితి కుంద కెఱుంగ జేయుమా.
                                                           చాటుధార

       చ. బిసరుహ గర్బవ్రాఁతయును విష్ణుని చక్రము వజ్ర వజ్రమున్
           దెసలను రామబాణము యుధిష్టిరు కోపము మౌని శాపమున్
           మసకపుఁబాముకాటును గుమారుని శక్తియు గాలదండమున్
           బశుపతికంటమంటలును బండిత వాక్యము రిత్తవోవునే -
                                                            చాటుధార

       ఉ. మానుగ విశ్రమాక్షరసమంచితమై స్వరమూcదినం డదీ
           యానుగుణాక్షరంబు గొని యైనను జెప్పఁగ నొప్పు నీ క్రియన్

         భానుసహస్రభాసి వృషభాధిపుఁడన్నటు లర్ధయుక్తమై
         పూనినచో నఖండవళి పొల్పగు నాదికవి ప్రణీతమై.
                                                       [కవిజనాశ్రయము]

      ఉ. వారక వారకామినుల వర్తుల చారుకుచోపగూహముల్
          కోరక కోరకోల్ల సిత కుంజములం జిగురాకుపానుపుల్
          చేరక చారు కేరళ కళింగ కుళింగనరేంద్రమందిర
          ద్వారవిహారులై సిరుల నందక నందకపాణిఁ గొల్వరే.

అప్పకవీయమునం దుదాహరింపఁబడిన యీ కడపటి పద్యమును రంగరాట్ఛందమునం దుదాహరింపఁబడిన మొదటి పద్యమును భీమన వగువో కావో విచారింపవలసి యున్నది. భీమన విరచిత శతకంధర రామాయణము లోని వని యీ క్రింది పద్యము లొకలక్షణ గ్రంధములో నుదాహరింపబడినవి -

      క. భువిఁబుట్టి పీcచమడcచెను
         దివిజారాతుల దినేశదీప్తు లడర రా
         ఘవుడనుచు మునులు పొగడిరి
         దివిని దివౌకసులు మిగుల దీవించి రొగిన్

     ఉ. కలగకుడీ నభశ్చరులు కంపముఁ జెందకుఁడెప్డుఁగిన్నరుల్
         తలఁకకు డచ్చరల్ మునులు తత్తఱ మొందకుఁడేను వచ్చి మీ
         యలజడు లెల్లఁబాపి మిము నందఱ గాచెద నంతవట్టుమీ
         గలిబిలి మాని యుండుఁడని కైటభమర్దనుఁడోలిఁబల్కినన్.

భీమన నృసింహపురాణములోని వని యీ క్రింది పద్యము లొక లక్షణ గ్రంధమునుండి రామకృష్ణకవిగారి చేతను తన్మిత్రులు ప్రభాకర శాస్త్రి గారిచేతను వరుసగా నుదాహరింపఁబడినవి.

     ఉ. వాండిమి నల్లసిద్ధిజనవల్లభుఁడోర్చిన రాజు భీతుఁడై
         యాండ్రను గానకుండ వృషభాంకము బెట్టికొనంగఁ జూచితో

             నేండిది యేమి నీవనుచు నెచ్చెలులెల్లహసింప నంతలో
             మూండవకంటితోడిదొర మూర్తి వహించిన మొక్కి రంగనల్

          క. ఈ క్షితికి వచ్చి వేగమ
             దాక్షారామమున వారతరుణులనృత్యం
             వీక్షించి యంతకంటెను
             దక్షిణమున నేర్చి రంభ తగ వేర్పడగన్.

ఈ పుస్తకములను జూచి పరీక్షించిఁ గాని యివి యీకవి వగునో కావో యీ కవి యేకాలమువాడో నిర్ణయించుట కనుకూలపడవు. ఇందుదాహరింపబడిన నల్లసిద్ధి పండ్రెండు పదమూడవ శతాబ్దములలోనివాడు. ఈ నడుమ నాంధ్రసాహిత్య పరిషన్మం డలివారు ప్రచురింపఁబూనుకొన్న కవిజనాశ్రయము ముద్రిత ప్రతి యొకటి నేను జూడఁదటస్థించినది. దాని పీఠిక యింకను ముద్రింపఁబడకపోయినను తత్పుస్తకసంపాదకు లగు జయంతి రామయ్య పంతులుగారి దయవలన నేను దానిని జదువఁగలిగితిని. దానియందు వారు భీమకవికాలవిషయమున నేను వ్రాసిన దానిని ఖండించి యాతని కాలము పండ్రెండవ శతాబ్దమనియు, అతడు నన్నయ భట్టారకునకును తిక్కన సోమయాజులకును నడిమి కాలములందుండువాఁ డనియు, నిర్ధారణము చేయఁబ్రయత్నించిరి. దానిని సావధానముగాc జదివి యాలోచించిన మీఁదటఁ గూడ నా యభిప్రాయము మాఱినది కాదు. ఇప్పడు కవిజనాశ్రయము భీమకవిరచితము కానే కాదని నాకు తోచుచున్నది. పుస్తకమునందెక్కడను భీమకవివిరచిత మని చెప్పఁబడక పోపటమేకాక

          క. "అనవద్యకావ్యలక్షణ
              మొనరంగాఁ గవిజనాశ్రయుడు మల్లియరే
              చన సుకవి కవిజనాశ్రయ
              మను ఛందము దెనుఁగుబాస నరుదుగఁ జెప్పెన్"

అను పద్యమునందు మల్లయరేచఁడు దానిని రచియించినట్టు స్పష్టముగాc జెప్పఁబడి యున్నది. భీమకవివిరచితమని యూహించుటకుఁగల యాధారములు ప్రక్షిప్తము లని రామయ్యపంతులుగారు విడిచిపెట్టినవియు, గొన్ని

వ్రాతప్రతులలోఁ బయి పద్యమునకుఁ బూర్వమునం దుండిననియు నైన వీక్రింది పద్యములు

          "క. పరఁగిన విమలయశోభా
              సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
              పరిణతుఁ డయ్యెను భూసుర
              వరుఁడు ప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుఁడై.

           క. అసమానదానరవితన
              యసమానోన్నతుఁడు యాచకాభరణుఁడు ప్రా
              ణసమానమిత్రుఁ డీ కృతి కి
              సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్.

ఈ పద్యములయందైనను గ్రంథమును భీమన చేసినట్టు చెప్పఁబడలేదు.
భీమన యను భూసురుని యగ్రపుత్రుఁ డెవ్వఁడో గ్రంథరచనయందు శ్రావకాభరణాంకుఁ డైన రేచనకు సహాయఁ డయినట్టున్నది. భీమన కొడుకయిన బ్రాహ్మణుఁ డెవ్వఁడో కవిజనాశ్రయమును తాను జేసి ధనస్వీకారము చేసి మహా ధనికుఁడైన జైనకోమటి రేచన్న చేసినట్టయినను జెప్పియుండును, లేదా, పయి పద్యములయం దున్నట్టుగా గ్రంథ రచనమునందు మల్లియ రేచన్నకు తోడుపడి యయిన నుండవలెను, వేఱొకచోట నేను భీమనాగ్రసుతు డనగా భీమనయే యని సాధింపఁ జేసిన యర్థము తప్ప భీమతనూజుఁ డని యింకొకచోటఁ బుస్తకమునందే యంత్యప్రాసమున కుదాహరణముగాఁ జెప్పఁబడిన యీ క్రిందిపద్యమునందున్నది.

          క. 'జననుతభీమతనూజా !
              సునయార్పిత విభవ తేజ సుభగమనోజా!
              వినుత విశిష్ట సమాజా
              యన నంత్యప్రాసమగు నహర్పతితేజా"

ప్రక్షిప్తమని విడిచిపెట్ట బడిన యింకొక పద్యమును రామయ్యపంతులుగారు తమ పీఠికయందీ క్రిందిదాని నుదాహరించియున్నారు.

            క. వేములవాడను వెలసిన
               భీమేశ్వరుకరుణ గల్గు భీమసుకవినేఁ
               గోమటిరేచనమీఁదను
               నీ మహిఁ గవు లెన్న ఛంద మెలమి రచింతున్

ఈ పద్యము నిటీవలివా రెవ్వరో చేసి కవిజనాశ్రయమునఁ జేర్చి రనుటకు సందేహము లేదు. ఇట్లు కవిజనాశ్రయమును రేచన రచియించెనా ? భీమన రచియించెనా ? యని సందేహపడుచుండcగా నీ నడుమను పులిమీద పుట్ర వచ్చినట్టుగా వీ రిరువురును గారు-కవిజనాశ్రయమును రచించివాcడు గోకర్ణుఁడని యొక కొత్తసిద్ధాంతము వచ్చినది. దీనిని మొట్టమొదట బైలు దేఱఁదీసినవారు శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు. ఈ కవిగారాంధ్రరాజ కవులను శీర్షికతో 1910 వ సంవత్సరపు ఆంధ్రపత్రిక యుగాదిసంచికలో వ్రాసి దానిలో గోకర్ణుని గూర్చి యిట్లు చెప్పియున్నారు.

"ఇతడు (గోకర్జుఁడు) సూర్యవంశపు క్షత్రియుఁడు........ప్రస్తుతము నైజామురాజ్యమున వనపర్తి సంస్థానమునకు సమీపమున శిధిలమయియున్న వర్ధమానపురమున కధీశ్వరుండు. ఇతనితండ్రి భీమన, గురువు వాగీంద్రచూడామణి [10] యను జైనసమయాచార్యుఁడు. ఇతడే భీమకవికిఁ గర్తృత్వ మారోపింపబడిన కవిజనాశ్రయ మను ఛందో గ్రంధమును రచించి జగదేకమల్లునకు సేనాపతియగు రేచభూపున కంకితము చేసెను. ఈ రేచనికిఁ గవిజనాశ్రయుఁ డనియు గోకర్ణునకు శ్రావకాభరణాంకుఁ డనియు బిరుదములు గలవు. దీనిలో నాలుగాశ్వాసములును, జైనకార్య ధర్మముల ననుసరించి వాగ్దేవతాస్తుతితో, బ్రారంభింపఁబడినవి......... వేములవాడ భీమకవి రచించినది నృసింహపురాణము గాని కవిజనాశ్రయము కాదు. సంయుక్తయతిలక్షణమున, "భాస్కరకులవిలసితవార్ధిచంద్ర గోకర్ణనృపా" యనుటయే చాలినంత నిదర్శనము. [11] ఇప్పడు ముద్రింపబడిన కవిజనాశ్రయమునందు సంయుక్తయతిలక్షణమున "స్మరసన్నిభసుభగమూర్తి మల్లియరే చా" అని యున్నది. గాని భాస్కరకులవిలసితవార్ధిచంద్ర గోకర్ణీనృపా" యని లేదు. పూర్ణమైన పద్యమిది

          క. వరకృతులకు సంయుక్తా
             క్షరములలో నెద్ది యైనఁ జను వడి యిడఁగా
             గురుబుధజనవరదాయక
             స్మరసన్నిభసుభగమూర్తి మల్లియరేచా.

ఇది రకారప్రాసములో నున్నది; రామకృష్ణకవిగా రుదాహరించినది లకార ప్రాసములో నున్నది. రామకృష్ణకవిగారు నూతనముగాఁ జేసిన యీ సిద్ధాంతమును చదివి 1912 వ సంవత్సరమునఁ బ్రకటింపఁబడిన తమ యాంధ్రులచరిత్రము ద్వితీయభాగములో చిలుకూరి వీరభద్రరావుగారు గోకర్ణునిగూర్చి యిట్లు వ్రాసిరి —

"భీమన సోదరుఁడైన గోకర్ణణుఁడు వాగీంద్రచూడామణి యను జైన సమయాచార్యుని శిష్యుఁడు వర్ధమానపురాధీశ్వరుఁడు. ఇతఁడు భీమకవికిఁ గర్తృత్వ మారోపింపఁబడిన కవిజనాశ్రయ మను ఛందోగ్రంథమును రచించి కల్యాణపురాధీశ్వరుండైన చాళుక్య జగదేక మల్లనకు సేనాపతి యగు రేచభూపాలున కంకితము చేసెను. ఈ రేచనికిఁ గవిజనాశ్రయుఁ డనీయు గోకర్ణనుకు శ్రావకాభరణాంఁడు డనియు బిరుదనామములు గలవు, కవిజనాశ్రయములో నాలుగాశ్వాసములును జైనకావ్యధర్మముల ననుసరించి వాగ్దేవతాస్తుతితోఁ బ్రారంభింపఁబడినవి. వేములవాడ భీమకవి రచించినది నృసింహపురాణముగాని కవిజనాశ్రయము కాదు.

వీరిరువురును గోకర్జుఁడు రచించిన గోకర్ణఛందస్సని వేఱొక ఛందస్సుండఁగా గోకర్ణుఁ డింకొక పేరు పెట్టి యింకొక ఛందస్సును రచించుట యావశ్యకము కా దనియు, రేచన్న భూపాలుఁడు గాక కోమటి యని "వణిగ్వంశచూడామణీ! బంధుచింతామణీ! శిష్టరక్షామణీ ! సుందరీవశ్యవిద్యామణీ! రేచనా! కావ్యసంసూచనా! యని కవిజనాశ్రయములోనే చెప్పఁ ఇడిన దనియు నాలోచింప రైరి. కవిజనాశ్రయము గోకర్ణవిరచితము కాకపోవుట నిశ్చయము. తరువాత వీరభద్రరావుగారు తమ యాంధ్రుల చరిత్రములో భీమకవినిగూర్చి యిట్లు వ్రాసిరి.

"కవిజనాశ్రయము రచించినది గోకర్జనృపాలుఁడుగాని యితఁడు గాఁడు. భీమకవి నివాసస్థలము గోదావరి మండలములో గోదావరి తీరమున నున్న వేములవాడ యను పుణ్యక్షేత్రము."

ఈ వేములవాడ వీరభద్రరావుగారు చెప్పినట్లు గోదావరీ మండలములోని దైనను గావచ్చును. రామయ్యపంతులుగారు చెప్పినట్టు గోలకొండదేశము లోనిదైనను గావచ్చును గాని కవిజనాశ్రయమును రచించినది వేములవాడ భీమకవి మాత్రము కాడు. కవి నివాసమైన వేములవాడ గోదావరి మండలములోని దనియే నా నమ్మకము. గోలకొండ మండలములోని వేములవాడయే దాక్షారామమని యచ్చటి స్థలపురాణములలో నుండుట భీమకవి యచ్చటివాఁడని నిరూపించుట కయి చేయcబడిన నూతనాద్భుత కల్పనమయి యుండును. కవిజనాశ్రయకాలమును నిర్ణయింపవలె నన్నచో గ్రంధకర్త యైన రేచన్నకాలమునో యతనిగురువైన వాగీంద్ర చూడామణికాలమునో సప్రమాణముగా నిరూపింపవలెను. అంతేకాని భీమకవివని చెప్పఁబడెడు చాటుధారలనుబట్టియా పని సాధ్యము కాదు. ఈ చాటుపద్యములలో నొకదానినిబట్టి పండ్రెండవ శతాబ్దమును, ఇంకొక దానిని బట్టి పదుమూడవ శతాబ్దమును వేఱొకదానినిబట్టి పదునాల్గవ శతాబ్దమును, మఱియొక దానిని బట్టి పదునాఱవ శతాబ్దమును నగుచున్నది • పరస్పర విరుద్ధకాలములను దెలిపెడి యీ చాటువులలో దేనిని నమ్మి కళింగగంగుని కాలమువాఁడనికాని, పోతరాజు కాలమువాఁ డనికాని, సాహిణి మారనికాలమువాఁ డనికాని, బడబానల భట్టారకాదుల యీవలికాలమువాఁడని కాని, నిర్ణయింప వచ్చును? కవికాలమును నిర్ణయింపవలె నన్నచో నున్నయెడల నిర్వివాదముగా కవిదని యొప్పుకొన్న గ్రంథమును బట్టి నిశ్చయింపవలెను. ఏదోమంచి గ్రంథమును జేయక నాలుగు చాటుధారాపద్యముల నల్లినమాత్రముచేత నాతని నెవ్వరును మహాకవినిగా భావించి స్తుతించియుండరు పదునేడవ శతాబ్దాది నుండియుఁ గవులనేకులు తమ గ్రంథాదిని భీమకవిని పూర్వకవి స్తుతిలోఁజేర్చి యున్నారు. అందుచేత వారికి బూర్వమునం దీతఁడేదో గొప్ప గ్రంధమును జేసి యుండవలెను. పదునాల్గవ శతాబ్దాంతమువఱకును నున్న తిక్కన, యెఱ్ఱాప్రెగడ, రంగనాధుcడు, భాస్కరుఁడు, కేతన, మారన, మంచన, జక్కన, విన్నకోట పెద్దన్న, మడికిసింగన్న మొదలైనవారెవ్వరును భీమకవిని బేర్కొనకయుండుట చేత నాతడు పదునాల్గవ శతాబ్దమునకు బూర్వపువాఁడు కాడని యూహింపఁదగి యున్నది. ఈతనిని మొట్టమొదట బేర్కొన్నవాఁడు శ్రీనాథుఁడు. అనంతామాత్యుఁడు తన భోజరాజీయములో నీ క్రింది పద్యమున భాస్కరుని, రంగనాధుని, అమరేశ్వరుని బేర్కొనియు భీమకవి పేరు చెప్పలేదు

     ఉ. నన్నయ్య భట్టఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాథుఁచే
         రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱన మంత్రి నాదిగా
         జన్న కవీంద్రులన్నవరసస్పుట వాణు లనంగ ధాత్రిలో
         నున్న కవీంద్రులం దలఁతు నుల్లమెలర్పఁగ వాగ్విభూతికిన్!

శ్రీనాథుని తరువాత పౌఢకవి మల్లన్న తన రుక్మాంగద చరిత్రము నందు భీమకవి నీక్రింది పద్యమున స్తుతించియున్నాఁడు

     ఉ. నన్నయభట్టఁ దిక్కకవి నాచనసోముని భీమనార్యుఁబే
         రెన్నికc జిమ్మపూడి యమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్
         సన్నుతిచేసి వాక్యసరసత్వము వీనుల కింపుమీఱ న
         త్యున్నతిగా నొనర్తు నెఱయోధులు మేలనఁ గావ్య మిమ్ములన్.

ఇందఱుకవుల పొగడ్త కర్హమయిన భీమనచే రచియింపఁబడిన యుద్గ్రంథమేదియోనా కింత వరకుఁ దెలియరాకున్నది. నృసింహపురాణమని యొకరును, శతకంధరరామాయణ మని యొకరును, భీమకవి కృతములని చెప్పిరి కాని యట్టి వైష్ణవ గ్రంథములను వీరశైవుడును శివపుత్రుఁడు నైన భీమకవి రచియించి యుండునని గ్రంథములను జూచి తృప్తినొందు వఱకును నేను విశ్వసింపఁజాలను. నేను చూచినంతవఱకు భీమకవివిరచిత కృతినిగూర్చి నాకొక్క యాధారము కనcబడుచున్నది. కృష్ణదేవరాయనికిఁ గొంచెము ముందున్నవాఁడయి 1510 వ సంవత్సరప్రాంతమునందు బసవ పురాణమును పద్యకావ్యమునుగా రచించిన పిడుప ర్తి సోమనాథకవి భీమకవి బసవపురాణమును రచియించె నని తన గ్రంధముయొక్క- ప్రథమాశ్వాసములో నీ క్రిందిపద్యమునందుఁ జెప్పియున్నాఁడు.

         సీ. విరచించె జైమిని వేదపాద స్తవం
                          బొకపాదమునను వేదో క్తి నిలిపి
            హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పెఁ
                          ప్రతిభ సోమేశుఁ డారాధ్యచరిత
            సరవి శ్రీనాధుఁ డా చరిత పద్యప్రబం
                          ధము చేసె ద్విపదలు తఱచు నిలిపి
            యాతండు పద్యకావ్యము చేసె నైషధ
                          మంచితహర్షవాక్యములఁ బెట్టి

            సోమగురువాక్యములఁ బెట్టి భీమసుకవి
            గరిమ బసవపురాణంబు గణనఁ జేసె
            గానఁ బూర్వకావ్యము వేఱుగతి రచించు
            వారి కాది కావ్యోక్తులు వచ్చి నెగడు.

ఈ కవి శ్రీనాధునికిఁ దరువాత నేఁబది యఱువది సంవత్సరములకే యున్న వాc డగుటచేత నాకాలపు సంగతులను చక్కఁగా నెఱిఁగినవాఁడు. పాల్కురికి సోమనారాధ్యుఁడు తెలుఁగున రచించిన ద్విపదకావ్యముల రెంటిలో పండితారాధ్యచరితము నక్కడక్కడ ద్విపద లుంచుచు శ్రీనాధుఁడు పద్యకావ్యమునుగాఁ జేసె ననియు, బసవపురాణమును భీమకవి పద్యకావ్యమునుగాc జేసె ననియు కవి చెప్పుచున్నాడు. తనకుఁ బూర్వ మునందే భీమకవి బసవపురాణమును పద్యకావ్యమునుగాఁ జేసి యుండిన యెడలఁ దాను మరల బసవపురాణమునే పద్యకావ్యమునుగా రచింపవలసిన యావశ్యక మేమి వచ్చినది? ఏమియు రాలేదు, మహాకవియైన భీమన కంటెఁ దానెక్కువ ప్రౌఢముగాను మనోహరముగాను రచియింపఁగలుగుదు నన్న నమ్మకముచేతనా? కాదు. అందుచేత భీమకవి బసవపురాణమును పద్యకావ్యమునుగాఁ రచించినది తెలుఁగుభాషలోc గాదనియు, వేఱొకభాషలో ననియు నిందువలనఁ దేలుచున్నది. కవి శ్రీనాథుఁ డారాధ్యచరిత్రమును పద్యకావ్యముగాఁ జేసెనని చెప్పి దాని క్రిందనే సందర్భమంతగా కనcబడని నైషధభాషాంతరీకరణకథనము నుగ్గడించుట భీమకవిది భాషాంతర మనియు, నైషధమునందు వలెనే ప్రతిభాషాంతరీకృత గ్రంథమునందును మూలగ్రంథవాక్యములు కొన్ని పడుట యనివార్య మనియు చూపుటకొఱకయి యున్నది. ఆ కాలమునందు భీమకవి తన భాషాంతర మునందు మూలగ్రంథవాక్యములనే కొన్నిటిని బెట్టెనని జనులు నిందిం చుటవలన నిట్లు వ్రాయవలసి వచ్చియుండును. భీమకవిది భాషాంతరమైనచో నది యే భాష వైష్ణవమత గ్రంథములు సాధారణముగా నఱవములో నుండునట్లే శైవమతగ్రంథములు కన్నడములో నుండును గానఁ గర్ణాటక భాష యని వేఱుగఁ జెప్ప వలసిన పని లేదు. ఆ కాలమునందలి తెలుఁగు పండితుల కందరికికి సంస్కృత కర్ణాటకభాషలు సాధారణముగా వచ్చుచుండును. అందుచేత తెనుఁగును సహితము కర్ణాటకమనుచుండుట యప్పు డప్పుడు కలదు, శ్రీనాథుఁడు భీమఖండములో నేమనెనో చూడుడు.

      తే. "ప్రౌఢి బరికింప సంస్కృతభాష యండ్రు
           పలుకునుడికారమున నాంధ్రభాష యందు
           రెవ్వ రేమన్న నండ్రుగా కేలకొఱత
           నాకవిత్వంబు నిజము కర్ణాటభాష[12]

భీమకవి పాల్కురికి సోమనాధ కవికృతమైన ద్విపద తెనుగుబసవపురాణమును గర్ణాటకభాషలో భామినీషట్పది పద్యములలో నెనిమిదాశ్వాసముల మహాకావ్యమునుగాఁ జేసెను. ఈ కవి యారాధ్య బ్రాహ్మణcడనియు, బసవపురాణము భీమకవీశ్వరరగడ యను పుస్తకములను రచించె ననియు ఈతనిని సుమారు 1385 వ సంవత్సరప్రాతమునందున్న పద్మణాంకుడు, 1585 వ సంవత్సరప్రాంతమునందున్న విరూపాక్షపండితుఁడు మొదలైన వీరశైవకవులు నుతించియుండిరనియు, కర్ణాటకకవిచరితము చెప్పుచున్నది, ఆరాధ్యబ్రాహ్మణు లాంధ్రులలో తప్ప నితరులలో లేరు. భీమకవి తాను శివకవిదేవపుత్రుఁడ ననియు, ఉభయ కవిత్వసమర్ధుఁడననియు, బసవపురాణములో నీ క్రిందిపద్యమునఁ జెప్పుకొనియున్నాఁడు.

          "విమల సద్గురుసేవెయలి జం!
           గమభజనెయలి లింగనిష్ఠా
           సమతెయలి తనుమనధనంగళ నిత్తభవభక్తి ||
           సమయవార్డి వివర్ధనోళ్వజ
           హిమగు శివకవి దేవనాత్మజ
           సుమతి భీమ నుభయ కవిత్వసమర్థను సురువడె"

భీమకవి తన బసవపురాణము శాలివాహనశకము 1291 కి సరియైన సౌమ్యసంవత్సర శ్రావణబహుళ దశమీ గురువారము ముగించితి నని పుస్తకాంతమున నీ క్రిందిపద్యములోఁ జెప్పికొనెను.

           కోవిదరు కేళొళ్ళి తెన లుడు
           దేవనిధినయనేందు [13] సంఖెగ
           ళోవి శకవరుషం గళాగలు సౌమ్య వత్సరద
           శ్రావణ బహుళపక్షదశమీ

         జీవవార దొళాది వృషభం
         ద్రావతారద బసవచరితె సమాప్తి యాయిత్తు ||
 
దీనిని బట్టి భీమకవి శకసంవత్సరము 1291 కి సరియైన క్రీస్తుశకము 1369వ సంవత్సరమున బసవపురాణమును రచించి ముగించెనని తెలియవచ్చుచున్నది గాన నితడు 1340-50 వ సంవత్సరప్రాంతమున నుండి యుండి యున్నవాడని నిస్సందేహముగా సిద్ధాంత మగుచున్నది. బసవపురాణమునందుఁ గవియే శివలెంక మంచన పండితుడును, గుర మల్లికార్డున పండితుడను ప్రసాదించిన 'యుద్దండమతి" తో గృతి చేసెదనని చెప్పుకొనియుండుట చేతను, యీతనిది యుద్దండలలిత ధారాళకవిత్వమని యితరులు పొ గడి యుండుటచేతను,

        'వచియింతు వేములవాడ భీమన భంగి
         నుద్దండలీల నొక్కొక్క మాటు'

అని శ్రీనాధుఁ డీతనికవిత్వమును శ్లాఘించుట వింతకాదు. భీమకవి కవిత్వముయొక్క యుద్దండలీల కొంత తెలియుటకును, అతడు పాల్కురికి సోమనాధుని బసవపురాణము భాషాంతరీకరించె నని తేటపడుటకును, పయిపద్యము క్రింది రెండు పద్యములను గూడ నిందుదాహరించుచున్నాను-

              ప్రతిపక్ష సజ్జన
        పక్ష సాక్షాదుక్షరాజస
        దృక్ష.........మభక్షితక్ష్వేడ ||
       త్రక్ష గణ. సమక్ష కరుణా!
       వీక్షణ జగద్రక్షణ గుణవి!
       చక్షణ బసవసూక్ష్మఅక్షయ రక్షి సెంమువను ||1||
       ఇదుసకళ మహేశ్వరామళ
       పద పయోజ పరాగనుదష

           ట్పదియెనిపాల్కురికె సోమేశ్వరనకారుణ్య
            ఒదవిదఖిళా ప్రపూరిత
            హృదయ భీమకవి ప్రణీతా
            భ్యుదయ బసవపురాణకథెయొళు అష్టమాశ్వాస.

[భీమకవి కన్నడ బసవపురాణమును గురించి " ఆంధ్రకవితరంగిణి" లో నిట్లు వ్రాయఁబడినది "కన్నడ బసవపురాణకర్త వేములవాడ భీమకవి యని నిస్సంశయముగాఁ జెప్పుటకు వీలు లేదని తోచుచున్నది, గ్రంథాదిని గ్రంథాంతమునను భీమకవి యని మాత్రమే చెప్పబడినది. వేములవాడ భిమకవి యని యెచ్చటను జెప్పియుండలేదు. ఈ కవి తండ్రి శివకవి దేవుఁడు.........కన్నడ బసవపురాణ కర్త తండ్రి శివ దేవుఁడని చెప్పినచో, ఈ కధకుఁ గొంత సరిపోయి యుండును. మధ్యఁకవి శబ్దము నుపయోగించి యుండుటచే నీభీమకవి తండ్రి కవిత్వముఁ జెప్పఁగలవాఁడయి యుండినట్లుతోఁచుచున్నది.

'పై పద్యమును (విరచించెజైమిని-అను పద్యమును) పిడుపర్తి సోమనాధ కవి, భీమకవి భాషాంతరీకరణమును సమర్ధించుటకై వ్రాసినాడనుట కంటె తన గ్రంధమునందు పాల్కురికి సోమనాధుని మూలకావ్యము నందలి వాక్యములు వచ్చిపడినను, చదువరులు తనయందు గ్రంథచౌర్యము నారోపింపకుండుటకై వ్రాసియుండెనని భావించుట సమంజస మని నాయభిప్రాయము. [పుట 224. అధస్సూచిక]

'శ్రీ వీరేశలింగము పంతులుగారు, వేములవాడ భీమకవిని, కన్నడ బసవపురాణకృతి కర్తయగు భీమకవిగా నిరూపించుట యాధారరహితమై యున్నది.' అని "తెనుఁగు కవుల చరిత్ర" లో గలదు. భీమకవి గ్రంథములనుగూర్చి ప్రస్తావించుచు "తెనుగు కవుల చరిత్ర" లో "ఈతని కృతులలో రామగోపాలచరితమను ద్వ్యర్థికావ్యము నేఁడును మఱిియొక కవికృతిగా లభ్యమగు చున్నది" అని చెప్పబడినది. [పుట 288]

హరవిలాసము” భీమన కృతియైనట్లు తెల్పుచు కస్తూరి రంగకవి తన "ఆనందరంగడాట్ఛం దము' ననొక పద్యము నుదాహరించి యున్నాడు. ఈ భీమన వేములవాడ భీమకవి యని చెప్పటకుఁ దగిన యాధారములు లేవు.

"భీమన ఛందము" లోనివని రంగరాట్ఛందమున రెండు పద్యము లీయబడినవి. అవి కవి జనాశ్రయములోఁ గానరాకున్నవి. ఛందస్సును రచించిన భీమన యొకఁడుండెనెమో?]

  1. [ఇతని చరిత్ర తిక్కనచరిత్రకు ముందు రావలసినది.]
  2. [భీమకవి నివాసము నిజాము రాష్ట్రములోని వేములవాడ యనియు, అచటి రాజేశ్వరుఁడే భీమేశ్వరుఁడనియు శ్రీ జయంతి రామయ్యపంతులుగా రభిప్రాయపడి యున్నారు. గోదావరి మండలములోని వేములనాడయే భీమకవి నివాసమని 'ఆంధ్ర కవితరంగిణి'లోఁ జెప్పఁబడినది. (పు. 217)]
  3. [ఇయ్యది పెద్దాపుర ప్రభువులు వత్సవాయివారి యాస్థానములోనుండిన
    ఏనుఁగు లక్ష్మణకవి విరచితము.]
  4. ఇట్లభిప్రాయ పడినవారు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులు గారు.
  5. జాహ్నవి పాఠాంతరము
  6. సింగన పాఠాంతరము
  7. కవిజీవితములు
  8. కవిజీవితములు పుట 28
  9. భీమకవీయ ప్రశ్నలక్షణము " కవిజీవితము, లలో పుటలు (22-26) నీయబడినది. ఇది భీమకవి కృతమైనట్లాధారములు లేవు."
  10. ఇతడు వాదీంద్రచూడామణి కాని వాగీంద్ర చూడామణి కాఁడు
  11. గోకర్ణుండు వ్రాసిన ఛందస్సు కవిజనాశ్రయము కాదు, అది వేఱు
  12. [తనది కర్ణాటభాషయని యనుట యితరుల నాక్షేపించుటకై మాత్రమని యనుకొనవలెను. తనది కర్ణాట భాష యనుటకుఁ గాదు, లేదా విననింపైన భాష యని యైనను దాని కర్థము చెప్పవచ్చును.]
  13. [ఉడుమ దేవ (చంద్ర) = 1; నిధి = 9, నయన=12; ఇందు=1; అనcగా "అంకానాం వామతో గతి" యను న్యాయమును బట్టి 1291.]