ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మడికి సింగన్న
మడికి సింగన్న
సింగన యనెడి యీ కవి నియోగి బ్రాహ్మణుఁడు; భారద్వాజగోత్రుఁడు: గుంటూరివిభుఁడును తిక్కనసోమయాజికుమారుఁడు నయిన కొమ్మనకు దౌహిత్రుని పుత్రుఁ డయిన ట్లీతఁడు రచియించిన వాసిష్ఠ రామాయణములోని యీ క్రింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.
సీ. అతడు తిక్కన సోమయాజుల పుత్రుఁడై
కొమరారు గుంటూరి కొమ్మవిభుని
పుత్రిఁజిట్టాంబిక బుధలోకకల్పక
వల్లి వివాహమై వైభవమున
భూసార మగు కోటభూమిఁ గృష్ణానది
దక్షిణతటమున ధన్యలీల
నలరు రావెల యను నగ్రహారము తన
కేకభోగంబుగా నేలుచుండి
యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న
గోపినాధు ప్రతిష్టయుఁ గోరిచేసి
యఖిల విభవంబులందును నతిశయిల్లె
మనుజమందారుc డల్లాడమంత్రి విభుఁడు.
క. అయ్యువతీరమణులకును
నయ్యల మంత్రీంద్రుఁడుదితుఁడై ధరణిలో
నెయ్యెడనర్థార్థులు మా
యయ్యయని పొగడఁగ నెగడె నౌదార్యమునన్
సీ. ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి
పుత్రి సింగాంబికc బుణ్యసాధ్వి
వెలయ వివాహమై వేఁగి దేశంబులో
నేపారు రాజమహేంద్ర పురికి
నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు[1]
మంత్రియై రాజ్యసంపదలఁ బొదలి
యొప్పారు గౌతమియుత్తర తటమున
మహనీయ మగు పెద్దమడికి యందు
స్థిరతరారామతతులు సుక్షేత్రములును
బెక్కు లార్జించి సితకీర్తిఁ బెంపు మిగిలి
యఖిల జగదన్నదాత నా నవనిఁ బరఁగె
మధురగుణధుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.
చ. ఒనరఁగఁ దద్వధూవరు లహోబల దేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నబ్పయాంకు బుధసన్నుతిపాత్రువి నారయాహ్వయున్
గని నరసింహనామములు గారవ మారఁగఁ బెట్టి రందఱున్.
క. వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనా చతురమతిని సింగాహ్వయుఁడన్
పై పద్యములవలన నీ కవి తిక్కనసోమయాజుల మనుమరాలి మనుమఁ డగుటయే కాక గోదావరిమండలములోని పెద్దమడికినివాసుఁడని కూడ స్పష్టమగుచున్నది. ఈ కవి తన పద్మపురాణమునకుఁ గృతినాయకునిగాఁ జేసిన కందనమంత్రి కాకతీయ గణపతికాలములో నున్న గన్నయమంత్రి మనమని మనునుఁ దౌట కూడ కవికాలమును నిర్ణయించుట కనుకూల పడుచున్నది. గన్నయమంత్రి పుత్రుఁడు మల్లన్న. మల్లన్నపుత్రుఁడు గణపతి ద్వితీయపత్రుఁడబ్పయామాత్యుఁడు. అబ్బయామాత్యుని తృతీయపుత్రుడు కందనమంత్రి, కందనమంత్రి తాతతాత యైన గన్నయమంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండిన ట్లతనిఁగూర్చిన పద్మ పురాణములోని యీ క్రింది పద్యమువలన దెలియుచున్నది.
చ. "పరువడిఁ గాకతీయ గణపక్షితినాయకునొద్ద మాన్యుఁడై
ధరణిఁ బ్రశస్తుఁడె నెగడి దానము లెల్లను జేసి భక్తిపెం
పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపన్
దిరమగుచున్నలక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వ మేర్పడన్
కాకతీయ గణపతిరాజు 1200 వ సంవత్సరము మొదలుకొని 1260 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినవాఁ డగుటచేత నాతనికి మాన్యుఁడై యుండిన గన్నయ మంత్రి 1260 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవచ్చును. ఈతని సంతతి వారికి తర మొకటికి నలుబదేసి సంవత్సరములు వయోవ్యత్యాసము నేర్పఱచినచో గన్నయ మంత్రిపుత్రుఁడైన మల్లన 1300-వ సంవత్సరప్రాంతమునం దుండును.మల్లన కొడుకైన గణపతి 1340 వ సంవత్సర ప్రాంతమునందుండును. గణపతి కుమారుఁ డైన యబ్బయ 1380-వ సంవత్సరము ప్రాంతమునందుండును. అబ్బయామాత్యుని నందనుఁడును పద్మపురాణకృతి పతియు నైన కందన మంత్రి 1420 వ సంవత్సరప్రాంతమునం దుండును. మడికిసింగనార్యుఁడు తాను పద్మపురాణమును ముగించిన సంవత్సర మిదియే యని పుస్తకాంతమునందీ పద్యమునఁ జెప్పెను.
మంగళమహాశ్రీవృత్తము
ఆకరయుగానల మృగాంకశకవత్సరములై పరఁగు శార్వరీని బుణ్య
ప్రాకటిత మార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
శ్రీకరముగా మడికిసింగన తెనుంగున రచించెఁ దగ బద్మసుపురాణం
బాకమలమిత్రశిశిరాంశువుగఁ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ
సీ. 'స్వామిభక్తుఁడు కార్యచతురుండు బహుకళా
వేది నీతిజ్ఞుడు విప్రహితుఁడు
సరససల్లాపుఁడు సప్తాంగరక్షణ
క్షముఁడు భావజ్ఞుడు సర్వసులభుఁ
డరిమంత్రభేదనపరుఁడు ధర్మాత్ముడు
సుందరాకారుండు సుజనవినుతుఁ
డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
సద్గుణాధారుండు సౌమ్యమూర్తి
సతతగురుదేవతాపరిచారరతుఁడు
గుణసముద్రుండు కాశ్యపగోత్రజనితుఁ
డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్ల
మదనసదృశుండు కందనమంత్రివరుఁడు.
సీ. ఈ ధర్మచారిత్రు నే ధాత్రిపతి యేలు
నాధాత్రిపతి యేలు నఖిల జగము
నీ కామినీకాము నే కామినులు చూడు
రా కామినులు చూడ రన్య పురుషు
నీ యర్కసుతతుల్య నే యర్ధి గొనియాడు
నా యర్థి యొరు వేఁఁడ నాససేయఁ
డీ మంత్రికులచంద్రు నే మంత్రి పురణించు
నా మంత్రి విముఖాత్ముఁ డఖిలమునకు
ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
ముల నుతింపస నొప్పు ముజ్జగములఁ
దారహారహీరధవళాంశుసమకీర్తి
కలితుఁ డౌబళార్యకందవిభుఁడు.
కృతిపతికాలము తెలిసినప్పు డాతనియేలికయైన ముప్పధరణీపాలుని కాల మిదియే యని వేఱుగఁ జెప్పవలసిన పనియే లేదు. ఈ ముప్పరాజు రామగిరిపట్టణము రాజధానిగా గోదావరికి దక్షిణమునందున్న సబ్బినాటి రాజ్యమును పాలించినవాఁడు. ఈ కవి యెఱ్ఱాప్రెగడకు మిక్కిలి తరువాతివాఁ డయినసు ప్రబంధపరమేశ్వరు నేల స్తుతింపలేదో తెలియదు. ఒక్క పద్మపురాణమునందు మాత్రమే కాక వాసిష్ఠ రామాయణము నందును
గీ. "వ్యాసవాల్మీకిశుకకాళిదాసబాణ
హర్షణాదుల నాఢ్యుల నాత్మ నిలిపి
సకలభాషారసజ్ఞుల సముల నన్న
పార్యతిక్కకవీంద్రుల నభినుతింతు.
అని తెలుఁగు కవులలో నన్నయతిక్కనలను మాత్రమే నుతించెను. వాసిష్ట రామాయణము పద్మపురాణమునకుఁ దరువాతరచియింపఁ బడిన దగుటచేత నది 1420 తరువాతఁ జేయఁబడినది. ఈ రెండు కావ్యములకును నడుమ సింగన్న భాగవతదశమస్కంధమును గూడఁ దెనిగించి కందనామాత్యునకే యంకిత మొనరించెను. సింగనకృత భాగవతదశమస్కంధము నాకు లభింపలేదు. [2] [కందనమంత్రి రాజనీతిజ్ఞుడే గాక కవి యని కూడఁ దెలియుచున్నది. మడికి సింగన్నయే యితని "తారావళి" నుండి నాలుగు పద్యములను తన 'సకలనీతిసమ్మతము" నందు ఉదాహరించి యున్నాడు] అటుతరువాత నీ కవి సకల నీతిసమ్మత మను రాజనీతి గ్రంథమును సమకూర్చెనని రామకృష్ణకవిగారు చెప్పచున్నారు. [3]వీని నన్నిటిని విచారించి చూడగా మడికి సింగన్న 14౩౦ వ సంవత్సరమువఱకైన జీవించియుండును. ఈ కడపటి గ్రంథము పే రుదాహరింపలేదు గాని "పద్మపురాణోత్తర ఖండంబును భాగవత దశమస్కంధంబును దెనుంగున రచియించి" యని తక్కిన రెండు కావ్యముల పేరులను సింగన్న వాసిష్ఠరామాయణములో నుదాహరించెను. ఇతఁడు పద్మపురాణ దశమస్కంధములను నరాంకిత మొనర్చినను వాసిష్ఠరామాయణమును మాత్ర మట్లుచేయక శ్రీమదహాలోబలస్వామి కంకిత మొనర్చెను. వాసిష్ఠరామాయణములో నితడు మొట్టమొదట తెలుఁగు పద్యమును చేయక యాదిమకవీశ్వరాచారానుసారముగా నీ శ్లోకమును వేసెను.
"శ్రీమద్దివ్యమునీంద్ర చిత్ర నిలయం సీతామనో నాయకం
వల్మీకోద్భవవాక్పయోధి శశినం స్మేరాననం చిన్మయం
నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణసంధాయినం
శాంతం నిత్య మనామయం శివకరం శ్రీరామచంద్రం భజే."
ఈ యాచారమును పూర్వకవులు కొందఱు కొన్ని పుస్తకములలో ననుసరించుచు వచ్చినను నిటీవలివారు పూర్ణముగా విడిచిపెట్టినారు. గణపతిదేవుని యాస్థానమున నుండిన కృతిపతిపూర్వుడైన గన్నయ మంత్రికాలమునుండి తరమునకు నలువదేసి సంవత్సరముల చొప్పున వేసి కృతిపతియైన కందనమంత్రి కాలమును 1420 వ సంవత్సరమునకు దింపినట్లే కృతికర్త యైన సింగన యుండిన 1420-వ సంవత్సరము మొదలుకొని తరమునకు నలువదేసి సంవత్సరముల చొప్పునవేసి కృతికర్త వంశమును గణపతిదేవుని కాలములో నుండిన తిక్కన వఱకును పైకెక్కించుచు వచ్చినచో నించుమించుగా నదియు సరిపోవును. కవిసింగన్న 1420 వ సంవత్సర ప్రాంతమునం దుండినచో నాతనితండ్రి యయ్యలుమంత్రి 380 సంవత్సరప్రాంతమున నుండును;1380 వ సంవత్సర ప్రాంతమునం దుండిన యయ్యలు మంత్రితల్లి చిట్టాంబిక 1340 వ సంవత్సర ప్రాంతమందుండును; చిట్టాంబిక తండ్రి కొమ్మన 1300-వ సంవత్సర ప్రాంతమందుండును; కొమ్మన జనకుఁడు తిక్కన సోమయాజి 1260 వ సంవత్సర ప్రాంతములం దుండును. తండ్రి యైన యయ్యలుమంత్రి ని మంత్రిగాఁ గై కొన్న తొయ్యేటి యనపోత భూపాలుఁడు 1260-వ సంవత్సరము మొదలుకొని 1325-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెనట! ఇవి శకసంవత్సరము లేమో. సింగకవి పద్మపురాణమునందీక్రింది పద్యముచేత నన్నయ్యతిక్కనలను మాత్రమే స్తుతించి యున్నాఁడు
ఉ. భారత వేదవాక్యరసభావము లజ్ఞు రెఱుంగ లేక
నిస్సారమనస్కులై తిరుగుచందముఁ జూచి తెనుంగుబాసఁ బెం
పార రచించి యందఱ గృతార్థులఁ జేసిన పుణ్యమూర్తులన్
సారమతి న్భజింతు ననిశంబును నన్నయ తిక్కనార్యులన్
ఈ కవి భాగవతదశమస్కంధమును, పద్మపురాణోత్తరభాగమును, వాసిష్ఠ రామాయణమును, తెనిఁగించెను. నన్నయాదులకవనమందువలెనే దీర్ఘ సమాసములు లేక యీతని కవిత్వము సలక్షణ మైనదిగా నున్నది.
క. ఆ పరమేశ్వరమకుట
వ్యాపితగంగా ప్రవాహవరకవితాస
ల్లాపుఁడగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తి గలదె శ్రీమంతునకున్
అను పద్మపురాణములోని పద్యమువలనను,
చ. కదిసిన నోరవోవుచును గబ్బవుదొంతుల సత్పదార్థముల్
కదుకుచు నెట్టివారిఁ బొడగన్నను గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి ససహ్యమౌ శునకమార్గమునం జరియించు నోయస
త్పదకవులార! మత్కవితc దప్పులు పట్టక యూరకుండుడీ.
1. పద్మపురాణము:-
ఉ. వేణివిలోలనీలజలవేణి విశాలపవిత్రసైకత
శ్రోణి మరాళచక్రకులసుస్వరవాణి సరోరుహోల్లస
త్పాణి సభక్తి మజ్జనవిధా, విశారదనాకలోకని
శ్రేణి మహాఘశాత్రవవిశిక్షణ శాతకృపాణి యెల్లెడన్.
ఉ. ఆ తరుణీలలామకుఁ బ్రియoబుగవే చని కాంచెనా జగ
త్పూతము నక్షయార్తి పరి.. తివిధానసమర్థసత్పల
వ్రాతము నవ్యపుష్పమకరందవిలోలుపమత్తషట్పదో
పేతము దత్తనిర్ణరసమీహిత జాతముఁ బారిజాతమున్
2. వాసిష్ఠరామాయణము
శా. ఆ రాజన్యు లుదగ్రు లుగ్రగతి నన్యోన్యప్రహారార్ధులై
వీరానీకము పిచ్చలింపఁగ భుజావీర్యం బవార్యంబుగాc
గ్రూరాస్త్రంబుల నొండొరుం బొదివి దిక్కుల్ వ్రయ్యఁబెల్లార్చుచు
న్బోరాడంగ విదూరుc డీలె నపుడా భూమీశుచే భూవరా !
చ. విను మునినాధ! తొల్లి పదివేవురు విష్ణుల లక్ష రుద్రులన్
వనజభవాష్టకోటుల నవారణ మ్రింగినవాఁడ నాకు నీ
యనిమిషనాయకుల్ త్చ....... వారలనెన్ననేల? పెం
పున మిముబోటి విప్రు లొ..భోజనమాత్రమె నాకుఁ జూడఁగన్
- ↑ [ఈ అనపోత భూపాలుఁడు కొంతకాల వెూరుగల్లు రాజ్యమును పాలించిన కాపయ నాయకునికిఁ చిన తండ్రి కుమారుఁడఁట. గోదావరినది కుత్తరమున నున్న గోదావరి మండల ప్రదేశమును పాలించుటకై శాపయనాయకుఁడీతనిని నియమించెనఁట. వీరు క్రీ.శ. 1370 వఱకును జీవించియున్నట్టు తెలియుచున్నదట.]
- ↑ [ఇది ద్విపద కావ్యము అముద్రితము]
- ↑ [ఈ గ్రంధమును శ్రీరామకృష్ణ కవిగారే ప్రకటించియున్నారు.]