ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/విన్నకోట పెద్దన్న

విన్నకోట పెద్దన్న యనెడి కవి కావ్యాలంకారచూడామణి యను లక్షణ గ్రంథమును రచియిం చీనవాఁడు. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు; గోవిందరాజపుత్రుఁడు; కౌశిక గోత్రుఁడు. ఈతని వాసస్థానము రాజమహేంద్రవరము. కావ్యాలంకారచూడామణిలో నితఁడు పురవర్ణనమున కుదాహరణముగా రాజమహేంద్రవరము నిట్లు వర్ణించియున్నాఁడు.

              సీ. గంభీరపరిఘ నాగస్త్రీల కశ్రాంత
                                కేళీ విహారదీర్ఘిక యనంగ
                  నుత్తాలసాల మన్యుల కుబ్బి దివిఁ బ్రాఁకఁ
                                జేసినదీర్ఘ నిశ్రేణి యనఁగఁ
                  జతురచాతుర్వర్థ్యసంఘ మర్థులపాలి
                                రాజితకల్పకారామ మనఁగఁ
                  భ్రాంతసుస్థిత యైనభవజూటవాహిని
                                భుక్తిముక్తి ప్రదస్పూర్తి యనఁగ

                  నెప్పుడును నొప్పురాజమహేంద్రవరము
                  ధరణిఁ గల్పించె నేరాజు తనదుపేర
                  నట్టిరాజమహేంద్రునియనుఁగుమనుమc
                  డెసఁగు జాళుక్యవిశ్వనరేశ్వరుండు.

[రాజమహేంద్రవరము నీకవి వర్ణించుటం బట్టి యీతని నివాసము రాజ మహేంద్రవరమనియు, విశ్వేశ్వరుఁడు రాజమహేంద్ర పురాధీశ్వరుఁ డనియు తోఁచవచ్చును. విశ్వేశ్వరుఁడు చాళుక్య వంశీయుఁడుగాని రాజమహేంద్రుని పౌత్రుఁడుగాని కాడు.]

ఇతడు తాను రచియించిన యలంకారశాస్త్రమును రాజమహేంద్ర పురాధీశ్వరుఁడును చళుక్యవంశసంభవుఁడును నయిన విశ్వేశ్వరమహారాజున కంకితము చేసెను. విశ్వేశ్వరుని కాలమును సరిగా నిర్ణయించుట కాధారము దొరక లేదు గాని యీతఁడు పదునాలవ శతాబ్దారంభమున నున్న ట్లూహించుట కవకాశము కలిగియున్నది. విశ్వేశ్వరరాజు విశాఖపట్టణమండలములోవి సర్వసిద్ధి కీశాన్యమూలను మూఁడుక్రోసులదూరములో నున్న పంచధారల వద్ద ధర్మలింగేశ్వరస్వామి కొక మండపమును కట్టించినాఁడు. ధర్మలింగేశ్వర స్వామివారి యాలయములోని శిలాశాసనములో మండపము కట్టిన సంవత్సరము తెలుపఁబడకపోయినను, ఆతని వంశవృక్ష మీ ప్రకారముగా లిఖింపఁ బడినది. భీమేశ్వరుని కొడుకు విమలాదిత్యుఁడు, విమలాదిత్యునిపుత్రుఁడు రాజనరేంద్రుఁడు, రాజనరేంద్రుని సుతుఁడు కులోత్తుంగచోళుఁడు, కులోత్తుంగచోళుని తనయుఁడు విమలాదిత్యుఁడు, విమలాదిత్యుని యాత్మజుఁడు మల్లప్ప దేవుఁడు, మల్లప్ప దేవుని సూనుఁ డుపేంద్రుఁడు, ఉపేంద్రుని నందనుఁడు కొప్పభూపుఁడు, కొప్పభూపనితనూజుఁడు మనమోపేంద్రుఁడు, మనమోపేంద్రుని కుమారుఁడు విశ్వేశ్వరభూపుఁడు.

దీనినిబట్టిచూడఁగా విశ్వేశ్వరరాజు రాజనరేంద్రున కేడవ మనుమcడైనట్టు తెలియవచ్చుచున్నది, రాజనరేంద్రుఁడు 1064 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు మనకుఁ దెలియును. తక్కిన విశ్వేశ్వరుని పూర్వు లాఱుగురును ఒక్కొక్కరు నలువదేసి సంవత్సరములు రాజ్యముచేసిరనుకొన్నను విశ్వేశ్వరునికాలము (పదుమూడువందల నాలుగు) 1304 వ సంవత్సరమకంటెఁ దరువాత నారంభము కాదు. కావ్యాలంకారచూడామణి యం దీ రాజవంశము పూర్ణముగా తెలుపఁబడకపోయినను, తెలుపబడి నంతవఱకు పయి వంశవృక్షముతో నేకీభవించుననుట నా పుస్తకములోని యీ క్రింది పద్యమువలనఁ దెలిసికోవచ్చును.

            సీ. శ్రీకంఠచూడాగ్రశృంగారకరణ మే
                          రాజున కన్వయారంభగురుఁడు
                చాళుక్యవంశభూషణము శ్రీవిష్ణువ
                          ర్ధనుఁ డే మహీశుతాతలకుఁ దాత
                భృతకుమారారామభీముండు చాళుక్య
                         భీముఁ డే నృపకళాబ్దికి విధుండు

        రాజమహేంద్రవరస్థాత రాజన
                  రేంద్రుఁ డెక్కువతాత యే విభునకు

          నంధ్రదళదానవోపేంద్రుఁ డగునుపేంద్ర
          ధరణి వల్లభుఁ డే రాజుతండ్రి తాత
          ఘనుఁ డుపేంద్రాఖ్యుఁ డెవ్వని కన్నతండ్రి
          యతఁడు విశ్వేశ్వరుఁడు లక్కమాంబసుతుఁడు

విశ్వేశ్వరరాజుకుమారుఁడయిన యుపేంద్రుని పుత్రుఁడు నృసింహభూపుడు శాలివాహనశకము 1325 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తుశకము 1403 వ సంవత్సరము సందు పంచతీర్ధము నందలి ధర్మలింగేశ్వరస్వామి గుడికి గోపురము కట్టించిన ట్లొక శిలాశాసనమం దా దేవాలయములో వ్రాయఁబడి యున్నది. తాతకును, మనుమనికిని డెబ్బది సంవత్సరముల వ్యత్యాస ముండవచ్చును, గనుక నృసింహ భూపతితాత యైన విశ్వేశ్వర భూపుఁ డించుమించుగా 13౩౦ వ సంవత్సరమువఱకు నుండి యుండును. కాబట్టి యీ విశ్వభూపుని యాస్థానకవి యైన విన్నకోట పెద్దన్న యిప్పటి కయిదువందలయేఁబది సంవత్సరముల క్రిందట ననఁగా నెఱ్ఱాప్రెగడకంటె కొంచెము ముందుగానో యాతనికాలములోనో యున్నాఁడని నిశ్చయింప వలసి యున్నది. (ఈ “ఆంధ్రకవులచరిత్రము"లోని కాలనిర్ణయము సరిగా లేదని శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు విభవ సం. భాద్రపదమాస'భారతి' యందు తెలుపుచు విన్నకోట పెద్దన్నను గూర్చి యిూ క్రింది విధముగా వివరించినారు.

"శాసనమునుబట్టి విమలాదిత్యుని కొడుకు రాజనరేంద్రుఁడు, అతనికొడుకు కులో త్తుంగచోడకేసరి. ఆతని వంశమున విమలాదిత్యునికొడుకు మల్లపదేవుఁడు, ఆతనిపుత్రుఁ డుపేంద్రుఁడు, ఉపేంద్రునికొడుకు మల్లప దేవుఁడు (2). ఆతనికుమారుఁడుపేంద్రుడు (3), ఆతనికుమారుఁడు కొప్పభూపతి, కొప్పభూపతిపుత్రుఁడుపేంద్రుఁడు (4), అతని పుత్రుఁడు మనుమోపేంద్రుఁడు, మనుమోపేంద్రునికొడుకు విశ్వేశ్వరభూపతి అని తేలుచున్నది.

శాసనమున విశ్వేశ్వరభూపతి మండపమును కట్టించిన సంవత్సరముకూడ నిట్లు తెలుపcబడినది.

        "శాకాబ్దే నవబాహు రామ శశి సం
                  ఖ్యాతే శుచౌ భాసితే
        సప్తమ్యా మినవారభాజి మహితః
                  సంస్థాపితో మండప8,
        కల్యాణాలోత్సవసిద్దయే సవిభవ8
                 శ్రీపంచధారాపురీ
        ధర్మేశస్యచళుక్య విశ్వధరణీ
                 భర్తా విచిత్రాస్పదమ్"

ఇందువలన విశ్వేశ్వరభూపతి మండపమును కట్టించినది నవ-బాహు-రామశశి సంఖ్య ఆనఁగా 1329 శ. సం. అని తేలుచున్నది. కావున విశ్వేశ్వర భూపతి శక సం.1329 అనఁగా క్రీ. శ 1407 ప్రాంతమువాఁడు. క్రీ.శ.1304 నకు వంద సంవత్సరముల తరువాతివాఁడు. ఈ శాసనముననే విశ్వేశ్వర భూపతి సర్వసిద్ధివద్ద చిత్రభాను సంవత్సరమునకు సరియయిన శకవర్షము 1424 ప్రాంతమున శత్రువుల నోడించెనని క్రింది శ్లోకమున శ్లేషింపఁబడినది.

                   'గతిబాహు శక్తి భూమితి
                             మవిగణయత్పర్వ సిద్దిపదభగ్నం
                    సతిచిత్రభానుసాక్షిణి
                             ధరణి వరాహా దధావ దాంధ్రబలమ్ ?

గతి, బాహు, శక్తి, క్షమలకు సరియైన శకవర్షము 1324. ఈ శ్లోకమునకు సరియైన తెల గుసేతయే పెద్దన కావ్యాలంకారచూడామణి యేడవయుల్లాసమున.

      "చతురుపాయ-బాహు-శక్తి- క్షమావళి
       బాఱవిడిచి చిత్రభాను సాక్షిఁ
       బాఱె సర్వసిద్ధిపదమేది ధరణీవ
       వారాహమునకు నోడి రాచకదుపు ?"

సర్వసిద్ధిపదమేది-అనుచో పథమేది-అనియుండుట లెస్స.

అనియుండుటచేత శాసనరచయితకూడఁ బెద్దనయే యయు యుండును
కావ్యాలంకార చూడామణి నాతఁడు శా. స. 1324 న చిత్రభాను సంవత్సరము నకుఁ దరువాత రచియించి యుండును.]

ఈ కవి గ్రంథములోని రెండు పద్యములను మాత్ర మిప్పు డుదాహరించి యీతనిచరిత్రము నింతటితో విరమించెదను.

   ఉ. వేడుక విశ్వనాథపృథివీవరసుందరు బిట్టు చూచి తో
      డ్తోడన సిగ్గు డగ్గఱుడుఁ దొంగలిఱెప్పలకప్పులోనఁ జి
      ట్టాడెడు చూడ్కు లొప్పెఁగుసుమాయుధతూణముఖంబునందు మా
      టాడెడు పువ్వు(దూపులన నంగనకుం దరళంపుఁజాయలన్.

  శా. శ్రీనిండారఁగ లోకరక్షకొఱకై సిద్దించుటంజేసి ల
      క్ష్మీనాధుం డగు నయ్యుపేంద్రుఁ డిపు డేచెంగాన నీ నూతన
      క్ష్మానాధుం డగు విశ్వనాథునకు శృంగారాధినాధత్వ మి
      ట్లీనోపుం బ్రణుతింప నంచుఁ గవు లుత్ప్రేక్షింతు రెల్లప్పుడున్.

ఈ విన్నకోట పెద్దన ప్రద్యుమ్నచరిత్రమును రచించెనని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వ్రాసి, కుమారసంభవము టిప్పణములో నీ క్రింది సద్యముల నుదాహరించిరి.

    సీ. మించిన గతులు సాధించి యింద్రునికి మా
                        ర్కొనియున్న కాల్గలకొండ లనఁగఁ
         జేతనత్వంబులు చేకొని రవికిఁ గొ
                        మ్ములు చూపు చీకటిమొన లనంగఁ
         జే కల్గి యలుల కనేకదానము లిడ
                        మెలఁగుతమాలభూమిజము లనఁగఁ
         జిత్రవధోద్దతసిద్దులై గాడ్పుతో
                        మోహరించిన కారుమొగుళు లనఁగఁ

         నెల్ల చందంబులను గడు నెసఁకమెసcగి
         పొగడు నెగడును బడసి యప్పురిఁ జరించు
         తమ్ముఁ జూచిన మెఱయుఁ బుణ్యమ్మునొసఁగఁ
         దావలం బై న భద్రదంతావళములు.

     సీ. గజయాన మెలఁగినగతి యైనఁ బైఁ బడ
                 గద్దించి తర్కించి కలత నొందు
        మానిని యల్లినమాడ్కిఁ దోఁచినఁ దేర్ప
                నూకించు భావించి యొత్తలించుఁ
        జపలాక్షి కెమ్మోవి చవిగొన్నయట్లైనఁ
                జెమరించి చర్చించి చిన్నఁబోవు
        మదవతికౌగిలి గదిసినయట్లైనఁ
                బులకించి తేఱి సంచలత నొందుఁ

        దన్ను మెఱసిన కోర్కులు తగులు కొలుపు
        నోలిఁ దనలోన నలి నరపాలసుతుఁడు
        మాన మూటూడ గంభీరమహిమ సడల
        లజ్జ గడివోవ దైర్యంబు లావు దిగగ.

పెద్దన ప్రద్యుమ్నచరిత్రములోని యేదో యుదాహరణగ్రంథమునం దుదాహరింపఁబడిన యీ పద్యములను జూచి పెద్దన విన్నకోట పెద్దన యని కవిగారు భ్రమపడిరేమో ! ప్రద్యుమ్నచరిత్రము పొన్నాడ పెద్దిరాజు దని యా గ్రంథములోని రెండు పద్యము లీ క్రిందివి రెండు చోట్ల నాంధ్ర సాహిత్యపరిషత్తువారియొద్ద నున్న యుదాహరణ పుస్తకములో నుదాహరింపఁబడినవి.

          గీ. రాయుచున్న ఘనపయోధరములఁ గలిగి
             నడుము లొకకొంత బయలయి బెడఁగు మిగిలి
             చూడ నొప్పారురేఖల సొంపు మెఱసి
             కోటకొమ్మ లమరు వీటికొమ్మలట్ల.

          క. పురగోపురశిఖరంబులఁ
             గర మరుదై పద్మరాగకలశము లమరున్
             జరమాచరమాద్రులపై
             సరిపున్నమఁ దోఁచు సూర్యచంద్రులభంగిన్