ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/చిమ్మపూడి అమరేశ్వరుఁడు
ఇతఁడు సుప్రసిద్ధుఁడైన యాంధ్రమహాకవి. ఈ కవినిగూర్చి యిరువది యేండ్ల క్రిందట నా యాంధ్రకవులచరిత్రములో నిట్లు వ్రాసితిని. అమరేశ్వరుని గొప్పకవినిగా పూర్వకవులనేకులు స్తుతించి యున్నారు. ఈతఁడు చేసిన గ్రంథము లేవియో తెలియరావు గాని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహమునందుఁ జిమ్మపూడి యమరేశ్వరుని విక్రమ సేనములోని దని యిూ క్రిందిపద్యము నుదాహరించి యున్నాఁడు.
ఆ. సీర నగ్గి యునికి యారయ విస్మయం
బనుచు బాడబాగ్నికడలి యప్పు
రంబుఁ జొచ్చె నొక్కొ, రత్నాకరమమణు
లనఁగ జెలువ మమరు నాపణములు
ఈ కవిని ప్రశంసించిన పూర్యకవుల పుస్తకములలోని ఫద్యములఁ గొన్నిటి నిం దుదాహరించుచున్నాను.
ఉ. నన్నయభట్టఁ దిక్కకవినాయకు భాస్క_రు రంగనాథుఁ బే
రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱనమంత్రి నాదిగాc
జన్న కవీంద్రుల న్నవరసన్పుటవాణు లనంగ ధాత్రిలో
నున్న కవీంద్రులం దలఁతు నుల్ల మెలర్సఁగ వాగ్విభూతికిన్
[అనంతామాత్యుఁడు]
ఉ. నన్నయభట్టు దిక్కకవి నాచన సోముని భీమనార్యుఁ బే
రెన్నికc జిమ్మపూడి యమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్
సన్నుతి చేసి వాక్యసరసత్వము వీనుల కింపుమీఱ న
త్యున్నతిగా నొనర్తు నెఱయోధులు మేలనఁ గావ్య మిమ్ములన్.
[ప్రౌఢకవి మల్లన]
చ. అలఘుని శబ్దశాసనపదాంకితుc దిక్కనసోమయాజి ని
శ్చలమతి శంభుదాసు బుధసన్నుతు నాచన సోమనార్యుఁ జె
న్నలరిన చిమ్మపూడి యమరాధిపు భాస్కరు రంగనాధునిం
దలఁతు నపూర్వదివ్యకవితామహనీయసమగ్రచిత్తులన్.
[నూతనకవి సూరన్న]
ఉ. ఇద్ధగుణుం బ్రబంధపరమేశ్వరు నెఱ్ఱనప్రెగ్గడన్ మనః
పద్దతి నిల్పి సూక్తిరుచిభాస్కరుఁ డైన హుళక్కిభాస్కరున్
బుద్ధి ఘటించి సంతతము పూని భజించి వచః ప్రసాదసం
సిద్ధునిఁ జిమ్మపూడి కులశేఖరు నయ్యమరేశసత్కవిన్. [1]
[అంగర నృసింహకవి]
ఇట్లు పదునేనవ శతాబ్దారంభమునుండియు నున్న మహాకవీశ్వరు లీతనిని సత్కవీంద్రునినిగాఁ బొగడుచు వచ్చుటచేత జిమ్మపూడి యమరేశ్వరుఁడు పదునాల్గవ శతాబ్దారంభమునం చనఁగా నెఱ్ఱాప్రెగడ కాలమునందో, కొంచె మీవలనో యున్నట్టు నిశ్చయింపవచ్పును. విక్రమసేనమును సంపాదింప వలెనని నేను జిరకాలమునుండి కృషి చేయుచుంటిని. గాని నా కృషి యింతవఱకును సఫలమయినది కాదు. ఇట్లుండఁగా 1909 వ సంవత్సరము ఏప్రిల్ నెలలో నా మిత్రులయిన మానవల్లి రామకృష్ణకవిగారు తాము ప్రకటించిన క్రీడాభిరామముయొక్క యాచ్ఛాదనపత్రముపైని చిమ్మపూడి యమరేశ్వరుని విక్రమసేన మచ్చులో నున్నదని ప్రచురించుట జూచి యా మహాగ్రంథము శీఘ్రకాలములోనే నా కరస్థము కాగలదు గదా యని యపరిమితానందము నొందితిని. వా రా సంవత్సరమునందే డిసెంబరునెలలో ప్రకటించిన నన్నెచోడుని కుమారసంభవ ప్రథమభాగాచ్చాదనపత్రముమీద సహితము విక్రమసేన మచ్చులో నున్నట్టే ముద్రింపఁ బడినది. ఆ పుస్తకమును సంపాదించుటకయి నేను బహలేఖలను వ్రాసితిని గాని నేను త్వరపడిన కొలఁదిని పుస్తకప్రకటన మాలస్యము కాఁజొచ్చెను. అందుచేత నేను ముద్రితప్రతిని శీఘ్రముగాఁ బొందఁగాంతు నన్నయాశను విడిచిపెట్టి నా కవిచరిత్రమున కనుకూలముగా నుండుట కయి విక్రమసేనము యెుక్కయవతారికను గ్రంథములోని కొన్ని పద్యములను వ్రాసి పంపవలసిన దని కవిగారిని వేఁడితిని. కవిగారు తమయొద్ద నున్న పుస్తకములో నవతారికభాగము లేదనియుఁ గొన్ని పద్యములను వ్రాసి పంపెద మనియు నాకుఁ బ్రత్యుత్తర మిచ్చిరి. శ్రీరామకృష్ణకవిగారీ సంవత్సరము మెయి నెల 10 వ తేదిని చెన్నపురిలో "అపూర్వ వాఙ్మయ పరిశోధనము" ను గూర్చి యొనర్చిన యపన్యాసములో జగ్గన్న ప్రబంధ రత్నాకరములో నుదాహరింపఁబడిన గ్రంధముల బేర్కొనుచు వానిలో విక్రమసేన మొకటిగాఁ జెప్పి, వానిలోఁ గొన్నిటిలోఁ గొన్నిభాగములు మాత్రమే తమకు లభించిన వని చెప్పుటచేత విక్రమ సేనముయొక్క యవతారిక మాత్రమే కాక గ్రంథమంతయు వారికి లభింపలేదనియుc, బ్రబంధ రత్నాకరములో నుదాహరింపఁబడిన పద్యములు మాత్రమే వారికి లభించి యుండుననియు నే నూహించుచున్నాను. నా యూహ సత్యము కాకపోవచ్చును. గ్రంథావతారిక గాక తక్కిన పుస్తకభాగ మంతయు వారియొద్ద నుండినపక్షమునఁ జిరకాలమిత్రులయిన కవిగారు నా ప్రార్ధనము చెల్లింపకుండి యుండరు. విక్రమ సేనములోని పద్యములు ముప్పదికంటె నెక్కువగా నాంద్రసాహిత్యపరిషద్గ్రంథాలయమువారి యుదాహరణపుస్తకములో నియ్యబడినవి. ఆం దుదాహరింపఁబడిన పద్యములను గొన్నిటి నిందు క్రిందఁ బొందుపఱుచు చున్నాను.
సీ. సారధి శతవృద్దు చక్రంబు లొనఁగూడి
జరగవు రథమున సంఘటించి
యుదకంబు సోఁకున కోర్వనియరదంబు
చేతికి బిరుసైన రాతివిల్లు
సీ. గరితాఁకు కోర్వక గడగడ వడఁకుచు
మువ్వంకఁ బోయెడిఁ జివ్వనారి
మేపు నీరును లేక మెదలాడనోపక
వర్ణ హీనము లైన వారువములు
ఇట్టి సాధనములు నీకు నెట్టలొదవె
త్రిపురముల నెట్లు గెలిచితి దేవదేవ!
యనుచు నగజాతచెలు లాడ నలరు శివుఁడు
చిత్త మిగురొత్త మమ్ము రక్షించుఁ గాత !
సీ. భట్టనారాయణభాషా మహాదేవి
లబ్ధవర్ణుల కర్థలబ్ధిఁ జేయు
బాణవాగ్బామినీ ప్రసవమంజరి విశా
రదుల కలంకారరమను జేయు
రాజశేఖరభారతీజహ్నుకన్యక
సుకవీంద్రులకు భావశుద్ధిఁ జేయు
మాఘవాణీశీతమారుతగతి సార
మతులకు రోమోద్గమంబుఁ జేయు
నని యెఱింగి వారియడుగుల దలఁచి న
మస్కరించి దండి మా మురారి
వామనుని గుణాఢ్యు క్షేమేంద్రు నిల నలం
కారవిదులఁ దలచి గారవమున.
సీ. ప్రత్యగ్రరచనాతిభాసుర ప్రాసాద
నిర్జితగోత్రావనీధరంబు
ప్రాకారశిఖరాగ్రబంధురమణిగణ
ద్విగుణిత తారకావిభ్రమంబు
పరిఘాజలాంతర ప్రతిబింబితద్రుమ
స్మారితపాతాళభూరుహంబు
వరపుష్ప సౌరభావర్ణితమధుపశూ
న్యీకృతాశావారణేంద్రగండ
మప్సరన్ స్పృహణీయలీలాతిశయవి
లాసినీజననేత్రివిలాసజనిత
కుసుమశరబాణవైహర్త్య మసదృశార్ధ
నిర్జితాలక యుజ్జయినీపురంబు.
గీ . ఇఱ్ఱి పాపయి ల్కుందేలు మఱ్ఱి యనుచు
జనులు కనుకని పల్కెడు చందమామ
నడిమిమచ్చకు నెఱిఁగి పేరిడఁగ నేర్తు
రప్పురమున మేడలపయి నాడు సతులు.
సీ. చూపులకట్టు పూఁదూపులచేబట్టు
నబలలచూడ్కుల యాయుధములు
తాయంబునకుఁ గండుఁ గోయిలఁ గూయించు
బాలలపలుకులు మూలమంత్ర
మెదిరికిఁ దేఁటుల నెడయాట లాడించు
నబలలయలకల యాప్తబలము
సవరణలకుఁ జంద్రుఁ జాలించు మగువల
మొగముల సేనకుఁ దగిన మొగము
భావభవునకు నటుగాక బలమే బలము
గాఁగఁ దిరిగెనె పెట్లచే గాసిఁబడఁడె
యనఁగ సౌందర్యసంపద లభినవముగ
వఱలుదురు తత్పురంబున వారసతులు.
క. తరుణ వయస్కుల యౌవన
పరిపాకుల వృద్దజనుల భటులను నిజసో
దరులను గురులను గాఁ జూ
తురు పరమపతివ్రతాసతులు పుణ్యవతుల్.
ఉ. పూవులప్రోవులై చిలుకబోదలు కోయిలపిండు మందలై
తావుల క్రోవులై యలివితానముగానము తానకంబులై
కావను బండఁజాలుటఁ ద్రికాలముఁ గల్గ వరంబుఁ గన్నయ
ట్లై వనరాజి పొల్పగుఁ బురాంతిక భూములఁ నెల్లఁ జూడఁగన్.
చ. మరలఁగఁబోదు రిండ్లకును మా పవునంతకుఁ జేలలోపలం
దిరిగి యొకింతవంత వడ దేఱెడుమోములఁ జెన్ను సేయుచుం
బిరిగొని క్రాలు దృగ్రుచుల పెల్లునఁ జీఁకటి నెల్లఁ బాచినం
దెరువరు లర్థిఁ గూడఁ బఱతేరఁగఁ బామరభామినీజనుల్.
శా. దానానేకపబృంహితస్వనము గంధర్వావళీ హేషిత
ధ్వానంబున్ మృదు వేదనాదమును గాంతానూపురారావమున్
గానానూనరవంబుఁ దూర్యబహుశంఖస్ఫారశబ్దంబుఁ బె
ల్లైనీరాకరఘోషమో యనంగ నిత్యంబుం జెలంగుం బురిన్.
గీ. నూఱుక్రతువులు చేయని పాఱుటిల్లు
కోటిపడగలు లేని కిరాటగృహము
జాతిరత్నంబు గాని పాషాణ కులము
వెదకి చూపిన వీటఁ బన్నిదము గలదు.
మ. కులశై_లంబులలో సువర్ణగిరి, దిక్కుంభీంద్రవర్గంబులో
బలభిన్నాగము, లోకపాలకులలో బర్టన్యుఁ, డుగ్రోరగం
బులలో శేషుఁడు, బెంపుగన్నకరణిం బూజ్యాధిపశ్రేణిలో
వెలసెన్ విక్రమసేనభూవిభుఁడు దోర్వీర్యప్రకాశోన్నతిన్.
చ. అదె కై లాసము దిగ్విలాసము విహాయశ్చారిణీసమ్మ ద
పదవిన్యాస ముదగ్రభాసము మరుద్భామాసదాధ్యాస మ
భ్యుదయన్యాస మసన్నిరాసము మయూరోదారనిధ్వానబి
భ్యదహివ్రాతకృత ప్రవాసము తినేత్రావాస ముర్వీశ్వరా!
సీ. అరుణపుష్పావళి నగ్నిగా సంధించి
యలుల నల్లెలుగాఁగ నా వహించి
దందడి వీతెంచు దక్షిణపవనంబు
భస్త్రానిలంబుగాఁ బరిఢవించి
చిలుకలుఁ బికములుఁ జేదోడు సేయఁగ
మాధవుఁ డనెడి కమ్మరి కడంగి
యంగజుం డను పతియానతిఁ బనిపూని
మొగడల న్ములుకులమొనలు చఱచు
కొలిమి యొక్కొ యనఁగ గురియు పరాగంబు
విస్పులింగములుగ విరహు లులుక
నేచి పూచి యున్న యీ యశోకమహీరు
హంబుఁ గంటె మాళవాధినాధ !
శా. ముత్తా కే కుజము ల్పడల్చె మొగడ ల్మున్నే మహీజంబులం
దొత్తెం బువ్వులు నిండఁగాఁ బెరిఁగె నే యుర్వీజముల్ పూపలన్
మొత్తంబై విలసిల్లె నే ధరణిజంబుల్ కాయలం బండులన్
జిత్తానందముఁ జేర్చె నే క్షితిజము ల్చెల్వొందఁగాఁ జెప్పుమా.
సీ. పాంధులహృదయముల్ పల్లటంబులు సేయ
దర్పకుపనిచినదం డనంగ
విరహిమృగంబుల మరిగింపఁ దివిరెడు
కాయసంభవుని మొక్కల మనంగఁ
గడు సల్గి చైత్రునగారంబు ముద్రింప
మనసిజుపనిచినయనుఁగు లనఁగ
సహచరుం డగు గంధవహుఁ గానఁగా మీన
కేతను పంచినమాత లనఁగ
నభినవాకారసాందర్యసుభగలీల
లతిశయంబుగ మెలఁగుచు నసమబాణు
పుష్పలావికాజనములు పోలె నెఱసి
కోమలాంగులు పువ్వులు గోసి రెలమి.
సీ. దక్షిణపవనంబు తమ గంధమును బూని
మలయాచలముమీఁది మరులు మాన
తివిచి పట్టినలత చివుళుల చాయకుఁ
గరతలంబులకాంతి వరము లొసఁగ
కుసుమము ల్గోయుచో గోళ్ళ మెఱుంగులు
తనిమొగ్గలకు గవిసెన లొనర్ప
పిలువంగఁ జెలఁగెడు పలుకులు రాజకీ
రములకు నొజ్జతనములు సేయఁ
గురులు నలలపిండు బెరయఁగ వనమయూ
రములగతులతోడ గమనలీల
ననఁగి పెనఁగి ప్రీతి వనకేళి సలిపిరి
వనజముఖులు వేడ్క పనుపు చేయ
మ. పరపై యొప్పెసలారు మానికపుసోపానంబులం బ్రజ్వల
ద్వరవజ్రోపలసై కతంబులను సౌవర్ణారవిందంబులన్
హరినీలాసితవారిజంబులను జక్రాంగాదివాఃపక్షివి
స్పురణం గల్గు సరోవరంబు గనియెన్ భూవల్లభుం డయ్యెడన్.
క. మొగములు విరిదమ్ములఁ గుచ
యుగములు కోకములఁ జూడ్కు లుత్పలముల మం
దగతులు హంసలఁ దోల న
రుగుగతిఁ జొచ్చిరి సతుల్ సరోవర మెలమిన్.
గీ. బలిమి రాహు సుధాంశుబింబంబు వెఱచి
పాఱ గడుడాసి వెనుకొనుపగిది నొక్క
యెడ సఖులఁ గూడి చెలరేఁగి యీఁదుచోట
నీలవేణియు మొగమును నెలఁత కొప్పె.
సీ. కలయంగ నలఁదిన కస్తూరి పెల్లుగ
జలమున కెల్లను గలుగఁజేసి
కుచమండలంబుల కుంకుమచర్చల
నీరెల్ల జేవురునీరు చేసి
తనులిప్తసురభిచందనకర్దమంబున
వారి నెల్లఁ బునుఁగువండు చేసి
మూలల నవపుష్పమాలికావితతుల
వన మెల్లఁ దెట్టువ గొనఁగఁజేసి
యలక లలికవీధి నంటఁ గన్గవలఁ గెం
పెలయఁ గామచిహ్నలెల్లఁ జెలయ
నెలరువాత లమర జలకేళి చాలించి
కొలను వెడలి రింతు లలపగతుల.
గీ. కమలినీకాంత యెంతయుఁ గంది వంద
వారుణీసక్తుఁడై వసువ్యయము చేసి
యరిగినట్లు సరాగియై యంబరంబు
దొఱఁగి పశ్చిమ జలధిలో నుఱికెఁ దరణి
గీ. వామనానేకపము చక్రవాళకుధర
ధాతుతటము గోరాడుచో దరులు విఱిగి
గూలుటయు మింటి కెగసిన ధూళి వోలెఁ
బర్వె నెఱసంజ పడమరఁ బట్టుకొనుచు
సీ. ధర వియోగుల నెల్లఁ బరిమార్పఁ బూని హృ
ద్భవుఁడు గట్టిన వీరవట్ట మనఁగ
విరహులపై దండు వెడలుచో మదనున
కెత్తిన కెంజివురెల్లి యనఁగ
నలిఁ బ్రోషితులమీఁద గొలిపెడు మరుకరి
ఘసృణపంకాంకిత కుంభ మనఁగ
జొత్తిల్ల బధికులనెత్తుట దోఁగిన
శంబరద్విషు చేతి చక్ర మనగఁ
దూర్పుకొండతుట్టతుదిమ్రాకునను వ్రేలు
గొమ్మవలుదపూవుగొలక వోలెఁ
గందు బెరసి రాగకొంతి దలిర్పంగ
మవ్వ మొప్పఁ జందమామ వొడిచె.
చ. ఆలరులపాన్పులం దలిరుటాకులసెజ్జల హర్మ్యవేదికా
తలములC దీవెయిండ్ల సికతాశయనంబుల ము న్వియు క్తిమై
నలదురి వందుకందువుల నప్పటి కప్పటి కింపుఁ బెంపఁ గో
ర్కులు తనివారి వేడ్కపడఁ గూడిరి వేడుకతోడ దంపతుల్.
చ. పలుచని చంద్రికారసము ప్రన్ననినున్నని తేటక్రొమ్మెఱుం
గులతుదలం దలిర్చునెలగొమ్మలకాంతి పసిండినిగ్గుతోఁ
గలిపి యలంతివన్నె యిడి కాయజునిల్పిన రత్నపుత్రికన్
నలువ సజీవిఁ జేసెనొకొ నాఁ దగు నాతివిభూతిచూడ్కికిన్.
చ. చనువున రెండు వక్త్రములు చన్నులపాల్గడువంగ నొక్కమో
ము నగఁగఁ నొక్కయాననము ముద్దు నటింపఁగ నొక్కయాస్య ము
గ్గనఁగ విదేమి పల్క దని యాలపనంబునఁ జెక్కిలించును
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు నీవుతన్
క. హరగిరి సురగిరి రోహణ
గిరు లీనినకొదమ లనఁగ గృహములు పురి న
చ్చెరు వగు నకుప్యరత్న
స్పురణల విలసిల్లి తగినపొడవులతోడన్.
పయి పద్యములంబట్టి చూడఁగా విక్రమసేనము మాళవదేశము నందలి యుజ్ఞయినీనగరమున కధిపతి యయిన విక్రమసేనునికథయై సమస్తవర్ణనలతోను నిండి యున్న శృంగారకావ్య మయినట్టు కనుపట్టుచున్నది.
- ↑ [వినుకొండ వల్లభరాయకృతిగా శ్రీనాథుcడు రచించినదని చెప్పఁబడుచున్న క్రీడాభిరామమున చిమ్మపూడి అమరాధిపుని ప్రశంసకలదు. కాన నితఁడు 13 వ శతాబ్దిమధ్యమున నుండియుండ వచ్చును.]