ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/రంగనాథుఁడు

రంగనాథుఁడు

రంగనాథుఁ డనునతఁడు రామాయణమును ద్విపదకావ్యమునుగా రచియించిన కవి. రంగనాథుడు తన గ్రంథమునం దాంధ్రకవుల నెవ్వరిని నుతింపక పోవుటచేత నీతఁడు నన్నయభట్టారకుని కంటెను బూర్వుఁడని కొందఱు చెప్పుదురు గాని తగిన నిదర్శనములేవియుఁ గానరావు. ద్విపదరామాయణము కృత్యాదిని 'కవిలోక భోజుండు" అని బుద్ధరాజున కొక విశేషణము వాడఁబడినది. భోజరాజ శాలివాహనశకము 1021 -వ సంవత్సరమునందనగా హూణశకము 1068-వ సంవత్సరమునందున్నట్లొొ క శిలాశాసనమువలనఁ దెలియవచ్చుచున్నది. పయి విశేషణమును బట్టి భోజుఁడు కవీంద్రుల నాదరించువాఁడని దేశవిఖ్యాతి చెందిన తరువాతనే యీ గ్రంథము రచియింపఁబడుట స్పష్టము గనుక, కవి యీ రామాయణమును పండ్రెండవ శతాబ్దమునందో తరువాతనో చేసి యుండ వలెను. పదమూడవ శతాబ్దమునందు రచింపఁబడినట్లొక కథవలన నూహింపఁదగి యున్నది. ఆ కధ భాస్కరునిచరిత్రమునందుఁ దెలుపc బడును. ఇది కృష్ణామండలములోని మనుమూరి సంస్థానమునకు ప్రభువయి యుండిన [1] కోన విఠ్ఠలరాజుకొమారుఁడైన బుద్ధరాజు పేరుపెట్టి యీ కవి రచించినను, జనులు బుద్ధరాజరామాయణ మని పిలువక నేటివరకును దీనిని రంగనాథరామాయణమనియే వాడుచున్నారు. కవి బుద్ధరాజున కాశ్రితుఁ డగుటయే కాక బంధువనియుఁ జెప్పుదురు. అయినను దీని వాస్తవమును కనుగొనుట కాధారము లేవియు లేవు. ఒకవేళ రంగనాధుఁ డా రాజు నాస్థానవిద్వాంసుఁడగు బ్రాహ్మణుఁ డైన నై యుండవచ్చును. ఆఱువేల నియోగియైన కోవెల గోపరాజు రంగనాధుని నియోగికవులలోఁజేర్చి యీ క్రిందిపద్యమునఁ జెప్పియున్నాcడు.

     చ. 'అనఘు హుళక్కిభాస్కరు మహామతి శ్రీబిల్లలమఱ్ఱి పెద్దిరా
         జును బినవీరరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమయాజిఁ గే
         తనకవి రంగనాధ నుచితజ్ఞుని నెఱ్ఱన నాచిరాజుసో
         మన నమరేశ్వరుం దలతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్.'

పూర్వలాక్షణికు లందఱును రంగనాధుని లాక్షణికకవినిగా నంగీకరించియున్నారు. ఇప్పడు ముద్రితమైన గ్రంథమునందుఁ గొన్ని ప్రక్షిప్తభాగములు కూడ చేరియున్నందున, అక్కడక్కడఁ గొన్ని వ్యాకరణదోషములు కానవచ్చుచున్నవి. కాని యవి కవివి కావనుట నిశ్చయము. పుస్తకమునం దెక్కడను కవి పేరైనను లేకపోవుటయే కాక కాండముల యంతముల యందుఁగూడ,

     ద్వి. 'అని యాంధ్రభాష భాషాధీశనిభుఁడు
           వినుతకావ్యాగమవిమలమానసుఁడు
           పాలితాచారుఁ డపారథీ శరధి
           భూలోకనిధి కోనబుద్ధభూవిభుఁడు
           తమతండ్రి విఠ్ఠలధరణీశుపేరఁ
           గమనీయగుణ ధైర్యకనకాద్రిపేర
           బని పూని యరిగండభైరవుపేర
           నాచంద్రతారార్కమై యొప్పుమీఱ
           భూచక్రమున నతిపూజ్యమై వెలయు
           నసమాన లలిత శబ్దార్ధసంగతుల
           రసికమై చెలువొందు రామాయణంబు
           పరఁగ నలంకారభావనల్నిండc
           గరమర్థి ... ... కాండంబు సెప్పె.'

అని కోన బుద్ధరాజు రచియించినట్టే వ్రాయబడియున్నది. అయినను బుద్ధరాజు తన్నును, దనకావ్యమును బొగడుకొన్నట్టున్నరీతినిబట్టి చూడఁగా పండితులాత్మస్తుతి పరాయణులు కాఁజాలరు గనుక పుస్తకమును వేఱొకరు రచియించిరనియే యూహింపవలసి యున్నది. రంగనాధరామాయణ మిప్పటి కేడు వందలసంవత్సరముల క్రిందట రచియింపఁబడినది. కొందఱీ కవి కోనబుద్దారెడ్డి కాలములో దూపాడుపరగణాకధికారిగా నుండెననియు, బుద్దారెడ్డి ప్రతావరుద్రునికి లోcబడిన సామంత రా జనియు, చెప్పచున్నారు. ఆ ప్రతాపరుద్రుని గణపతిదేవుని తండ్రి యైనపక్షమున, ఇప్పడు చెప్పిన కాలము సరిగానే యుండును. అట్లుగాక యా ప్రతాపరుద్రుఁడు గణపతిదేవుని మనుమఁ డనెడి పక్షమున, కవి కాలము మఱి యఱువదేండ్లు తరువాత కావలసివచ్చును. అనేక హేతువులనుబట్టి యీ గ్రంథము మొదటి ప్రతాపరుద్రుని కాలములోఁ జేయcబడినదే యైనట్టు నిశ్చయింపఁదగి యున్నది. ఈ మొదటి ప్రతాపరుద్రుఁడు 1200 వ సంవత్సరప్రాంతము వఱకును రాజ్యపాలనము చేసెను. బుద్దా రెడ్డికూతురైన కుప్పమాంబ తన చరమవయస్సులో నావఱకే మృతుఁడైన తన భర్త పేర బూదపూరిలో (శాకాబ్దే వసునందశంకర మితే శ్రీధాతృ సంవత్సరే) శకసంవత్సరము 1198 కి సరియైన క్రీ.శ.1136 ధాతృ సంవత్సరమున లింగ ప్రతిష్ఠ చేసి యనేక భూదానములు చేసి శాసనము వ్రాయించెను. ఈ కుప్పమాంబ కోన బుద్దారెడ్డి కూఁతురని చూపుటకయి యీ శాసనములోని యీ క్రింది శ్లోకము నుదాహరించుచున్నాను.

             'శ్రీగోనవంశ నిజ శేఖరబుద్ధయాఖ్య
              పతీ పవిత్రచరితా భరితా గుణౌఘైః
              శృంగారసారకరణిః కరణీయదక్షా
              కుప్పాంబికాజని చ తస్య సతీ కళత్రమ్.'

రంగనాధరామాయణము రచియింపఁబడిన కాలమున కీమె పుట్టెనో లేదో. ఎట్లయినను రంగనాధరామాయణము 12౩౦-40 వ సంవత్సరప్రాంతముల యందు రచియింపఁబడి యుండును. ఇది తిక్కన యుత్తర రామాయణ రచనమున కిరువది ముప్పదియేండ్ల ముందు. తిక్కనపితామహుఁడైన మంత్రి భాస్కరుఁడు రామాయణమును రచించుటవలనఁ గాకపోయినను రంగనాధుఁడు రామాయణమును రచించుటవలన నైనను సోమయాజి పూర్వరామాయణమును మాని యుత్తరరామాయణమును రచియించి యుండును. రంగనాధుని కవిత్వము మృదుమధుర పదబంధయుత మయి శబ్దార్ధాలంకారసంయుతమయి యన్వయకాఠిన్య విరహితమయి మనోహరముగా నుండును. కవి శైలి తెలియుట కయి కొన్ని పద్యములను వ్రాసి యీతని చరిత్రము నింతటితో ముగించు చున్నాను.

          ద్వి. 'నడురాత్రి యరుదెంచె నరలోకనాధ
                కడు డస్సినాడవు కనుమోడ్తు గాక!
                చలియింపకున్నవి సకలవృక్షములు.
                మెలఁగవు వనభూమి మృగసఘూహములు;
                నెఱి విహంగంబులు నీడము ల్చేరి
                మఱచియున్నవి తమ మంజులధ్వనులు;- బాలకాండము

          ద్వి. కోమలి కేకయకులమునఁ బుట్టి
                యీ మాటలాడ నోరెట్లాడె నీకు ?
                అడవులపాలు కమ్మని రాముఁ ద్రోవ
                నెడపక తొల్లి నీ కేగ్గేమి చేసె
                కౌసల్యకంటె నిన్ ఘనముగాఁ జూచు.
                నీసేవ లొనరించు నీపంపుచేయ;
                నెటువలె బొమ్మంటివే దయమాలి ?- అయోధ్యాకాండము

          ద్వి. వ్రతములఁ గడు డస్సి వనటలఁ గ్రుస్సి
                యతిదుఃఖములఁ గుంది యాత్మలోc గంది
                విపులాశ్రువులఁ దోగి విరహాగ్నిఁ గ్రాఁగి
                కపటవృత్తులఁ జిక్కి- కడముట్ట స్రుక్కి
                జీవంబుపై రోసి చెలువంబుఁ బాసి
                యా విధి మది దూఱి యలసత మీఱి
                చెక్కిటఁ జెయి చేర్చి చింతల కోర్చి
                దిక్కు లేమిఁ దలంచి ధృతి దూర డించి

           యినరశ్మి వాడిన యెలదీగపోలె
           ఘన ధూమయాత్రదీపకళికయుఁబోలె
           జలదమాలికలోని శశికళ వోలెఁ
           బలు మంచుపొదవిన పద్మినివోలెఁ
           జెలగి పిల్లులలోని చిలుకయుఁబోలె
           బులులలో నావునుబోలె దుర్వార
           ఘోరరాక్షస వధూకోటిలో నున్న
           నారీశిరోమణి నలినాయతాక్షి. ---సుందరకాండము.
 
     ద్వి. కృతకృత్యుఁ డగు రాముకీర్తిపుష్పములు
          చతురతమై వెదచల్లినయట్లు
          కర మొప్పఁ జుక్కలు కాన్పించె నంతఁ
          జిరకాలములసీమ శిశువులమామ
          పొలుపొందు కలువలపోరానివిందు
          కలసిన జక్కవకవఁ బాపుమందు
          పాలవెల్లిని ద్రచ్చి పడసిన వెన్న
          శూలియౌదలపువ్వు చుక్కలనవ్వు
          నెరిచకోరములకు నెల నెలపంట
          యురవేది విరహుల నుడికించు మంట
          గగనంబులొడవు దొంగలగుండెదిగులు
          నొగి నబ్ధిఁ బొంగించు నూఱటపట్టి
          హరిహరబ్రహ్మల యానందదృష్టి
          సరసిజరిపుఁడైన చంద్రుడు పొడిచె. ---యుద్ధకాండము.

[ ఈ రంగనాథునిఁ గూర్చియు, ద్విపదరామాయణకర్తృత్వముసుగూర్చియు వాదవివాదములు అభిప్రాయ భేదములును వెలసినవి. రామాయణమున రంగనాధుని పేరు లేకున్నను, అతని పేరనే వాడుకలోనున్నందున నతఁడే రామాయణకర్తయని కొందఱు విమర్శకులు నమ్ముచున్నారు. ఈ రంగ నాధుఁడే చక్రపాణి రంగనాథుఁడు. తొలుత వైష్ణవుఁడు వైష్ణవుఁడుగా నున్నపుడే రామాయణమును రచించెను.

ఇతఁడు వీరశైవుఁడగు పాలకురికి సోమనాథునితో వాదింపఁబోయి--ఆతc డీతనిం జూడ నిష్టపడకపోఁగా, సోమనాథుని కుమారుఁడగు చతుర్ముఖ బసవేశ్వరునితో వాదించి, యోడిపోయి శ్రీశైలమార్గమునఁ బోవుచు, మల్లికార్జునస్వామిని జూడనందున కన్నులు కానరాకుండఁబోయెననియు, నీతడహోబలమునకుఁ బోయి నరసింహదేవుని పార్థింపఁగా నాతఁడు స్వప్నమునఁ గానవచ్చి శివద్వేషము తగదని బోధించెననియు, రంగనాథుఁడు శ్రీశైలమునకుఁ బోయి దేవుని స్తుతింపఁగా నొకకన్ను వచ్చెననియు, సోమనాథుని యనుగ్రహమున రెండవకన్నుకూడ లభించెననియు నొక వదంతి కలదు. ఈ కధ సంగతి యెటులున్నను. ఇతడు సోమనాథ సమకాలికుఁడనియు, నీతఁడే ద్విపదరామాయణకర్తయనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మున్నగువా రభిప్రాయపడినారు. తొలుత వైష్ణవుడై రామాయణమును రచించినను, పిదప శైవుఁడగుటలో విరోధములేదు. తెనాలి రామలింగడు తొలుత శైవుడై పిదప రామకృష్ణుడైన సంగతి యెల్లరకును తెల్లమేకదా ! రంగనాథుఁడు శైవుఁడై పిదప "శివభక్తిదీపిక" యను నొక చిన్నగ్రంధమును, 'నయనగతిరగడ 'లో రచించెనట!

చక్రపాణి రంగనాధుఁడును, రామాయణకర్త యని చెప్పఁబడు రంగనాధుఁడును విభిన్న వ్యక్తులని 'ఆంధ్రకవి తరంగిణి" కారు లభిప్రాయ పడుచున్నారు [మూఁడవ సంపుటము పుటలు 155-156] మఱియు నీ రంగనాధుఁడు 'శ్రీగిరినాథ విక్రమ" మను నాంధ్రకావ్యమును, వీరభద్ర విజయము, శరభలీలా అను కన్నడగ్రంధములను రచించెనని చెప్పుదురని అందే కలదు. [మూఁడవ సంపుటము, పుట 156]

రంగనాథ రామాయణమును గోన బుద్దరాజే తన తండ్రి విఠ్ఠలరాజు పేరిట వ్రాసెననియు, విఠ్ఠలుఁడే పాండురంగఁడు గాన, అతఁడు పాండురంగనాధుఁడు కావచ్చుననియు, ఆ పదమును హ్రస్వ మొనర్చినచో 'రంగ నాధుఁ డగుననియు, అతని పేరిట రచితమైన రామాయణము "రంగనాథ రామాయణ' మయ్యెననియు కొందఱి యభిప్రాయము. ఇది యుక్తిసహము కాదని పెక్కండ్రు తలంచుచున్నారు.

విఠ్ఠలరాజు "రామాయణమును రచింపఁదగినవాఁ డెవ్వడు?" అని ప్రశ్నింపఁగా సభ్యులతని పుత్రుఁడగు బుద్ధరాజే తగినవాఁడని చెప్పినట్లును, పిదప తండ్రి పుత్రుని రామాయణము ను రచింపఁ గోరినట్లును కృత్యాదిని బట్టి తెలియుచున్నది. పుత్రుని శక్తి సామర్థ్యములు తండ్రికిఁ దెలియకుండుట వింతగానే తోఁచును. ఉత్తరకాండమును ద్విపదగా తెలిఁగించిన బుద్ధరాజు పుత్రులు కాచవిఁభుడును. విఠ్ఠలరాజును ఇచ్చిన వంశవృక్షము నకును, రంగనాధ రామాయణము నందలి వంశవృక్షమునకును భేదము కానవచ్చుచున్నది. ఈ విషయమున నింకను పరిశోధన జరుగవలసియున్నది]

  1. [గోన విఠల రాజు కాని కోన విఠలరాజు కాఁడు. కాన 'కోన' అనుచోట్ల నెల్లెడల 'గోన' అనుకొనవలెను]