ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పాలకురికి సోమనాథుఁడు

పాలకురికి సోమనాథుఁడు


పాల్కురికి సోమనాథకవి తాను భృంగిరిటగోత్రుఁడును, గురులింగపుత్రుడును [1] అయినట్లు 'అనుభవసారము'లో నీ క్రింది పద్యమునఁ జెప్పుకొన్నాఁడు.

         క. 'భృంగిరిటగోత్రుఁడను గురు
             లింగతనూజుఁడ శివకులీనుఁడ దుర్వ్యా
             సంగవివర్జితచరితుఁడ
             జంగమలింగ ప్రసాదసత్రాణుండన్.'

ఈ కవి ప్రతాపరుద్రుని కాలమునం దుండెను. ఈ కవికాలమునం దుండిన ప్రతాపరుద్రుఁడు కీ శ.1295-వ సంవత్సరము మొదలుకొని 1321 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసిన ద్వితీయ ప్రతాపరుద్రుఁడు గాక 1140 సంవత్సరము మొదలుకొని 1196 వ సంవత్సరమువఱకును భూపరిపాలన మొనర్చిన ప్రథమప్రతాపరుద్రుఁడయి యున్నాఁడు. ఈ కవి సంస్కృతాంధ్ర గ్రంథములను మాత్రమే గాక విశేషముగా కన్నడగ్రంథములను గూడ రచించెను.1222 వ సంవత్సరమునం దుండిన కన్నడ కవి యగు సోమరాజు తన యుద్భటకావ్యములో "సముదంచద్వృషభస్తవామరమహీజారామనం సోమనం" అని పాల్కురికి సోమనాథుని పూర్వకవినిగా స్తుతించి యుండుట చేతను, 1168 వ సంవత్సరమునందు మృతి నొందిన బసవనకు సోమన శిష్యపుత్రుఁ డగుటచేతను, ఈ నడిమి కాలమునం దుండిన పాల్కురికి సోమనాధుఁడు బసవనకు తరువాత ముప్పదేండ్ల కనఁగా 1195 వ సంవత్సరప్రాంతమునందుండినట్టు చెప్పవచ్చునని కర్ణాటక కవి చరిత్రము చెప్పుచున్నది. 1196 వ సంవత్సరము వఱకును మహీపాలనము చేసి పరలోకగతుఁడై న ప్రతాపరుద్రునికాలములో నుండి యాతనిచేత నగ్రహారములు మొదలైనవి బహుమతులుగాఁ బడసెనుగనుకను, తన కాలములోనే తన శిష్యపుత్రులు కూడ నుండవచ్చును గనుకను, సోమనాధుని మఱికొంతవెనుకకు జరపి 1180 వ సంవత్సర ప్రాంతములం దుండెనని నేను చెప్పుచున్నాను.

        శ్లో.'గురులింగార్యస్య దయాహస్త గర్భసముద్భవః |
            బసవేస్య తనయః బసవేశ్వర గోత్రకః ||
            బసవేశ భుజిష్యాత్మభవో బసనకింకరః |
            శ్రీమత్పాల్కుర్కిసోమేశనామాహం సర్వవిత్తమః||
            పండితారాధ్యచరితాలంకృతాం కృషి మారధే|
            తత శ్శ్రుణు నతామాత్యసూరనామాత్య శేఖర||

అని పండితారాధ్యచరిత్రమునందు సోమనాధుఁడు తన్నుఁ గూర్చి చెప్పుకొని యున్నాఁడు. దీనినిబట్టి సోమనాధుఁడు లింగార్యుని ఛాత్రుడయినట్టును; బసవేశునిపుత్రుఁడయినట్టును గనఁబడుచున్నాఁడు. మనలో గురువులును జనకులుగానే భావింపఁబడుదురు గనుక ననుభవసారమనం దా యర్ధముననే చెప్పఁబడెనేమో ! భారతమునందలి యీ పద్యార్థమును జూడుఁడు.

                             మధ్యాక్కర

           "తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
            యును ననఁగ నింతులకు మువ్వు రొగి నయిరి గురువు:
            లనఘ ! యువనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
            ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబు గుర వు లైరి."

కాcబట్టి యితనికాల మిప్పటి కేడువందల యిరువది సంవత్సరము లని చెప్పవచ్చును. ఈతడు వీరశైవుఁడు; శైవమతగ్రంధముల ననేకములను రచియించెను. ఈ సోమనాథకవి రచియించిన తెనుఁగు గ్రంథములలో ద్విపదరూపమున నున్న పండితారాధ్యచరితమును, బసవపురాణమును ప్రధానములు వీనిలో బండితారాధ్యచరితమును శ్రీనాధుఁడును, బసవపురాణమును పిడుపర్తి సోమనార్యుఁడుసు. పద్యకావ్యమునుగాఁ జేసిరి.

ఒకనాఁడు ప్రతాపరుద్రుఁ డోరుగల్లుపురమున శివాలయమునకుఁ బోయినప్పుడు శైవులు మండపముమీదఁ గూరుచుండి పాల్కురికి సోమనారాధ్య కృత మయిన బసవపురాణమును వినుచుండిరి. వారిని జూచి రా "జది యే'మని యడుగఁగా వెంట నున్న ధూర్త బ్రాహ్మణుఁ డొకఁడు 'మొన్న నీ నడుమను పాల్కురికి సోమపతితుఁడు మధ్యవళ్ళు పెట్టి యల్లిన యప్రమాణ బసవద్విపద పురాణ పఠన" మని పలికెను. అందుమీఁద శివ భక్తులు పోయి పొరుగూర నున్న సోమనారాధ్యున కా వృత్తాంతమును దెలుపఁగాఁ బ్రతివాదులను జయించుటకయి బయలుదేఱి యతఁ డోరుగల్లు పురమునకు శిష్యబృందముతో వచ్చెను. అతనిరాక యెఱిఁగి యేకశిలా నగరమునందలి బ్రాహ్మణధూర్తులాతని నవమానించుటకయి యా యూరనుండు మత్తులయిన మొండివాండ్రు మొదలయినవారికి విభూతిరుద్రాక్షాదులు పెట్టి శిష్యబృందమును వలె వారి కెదురుగాఁ బంపిరి. [2] తరువాత సోమనార్యుఁ డా పురిఁ బ్రవేశించి ప్రతిపక్షులతో వాదించి గెలిచి రాజానుగ్రహము సంపాదించి కొంతకాల మా యూర నుండి, ప్రతాపరుద్రుని మంత్రియు, సోమనార్యుని శిష్యుఁడు నగు [3] నిందుటూరి యన్నయా మాత్యునిసాహాయ్యమున దొంకిపర్తి మొదలయిన కొన్ని గ్రామములను బడసి శిష్యుల కిచ్చి, తానాపట్టణము విడిచి కలికె మను గ్రామమునకుఁ బోయి యచ్చట శివసాయుజ్యమును పొందెను. ఈ యంశములు కొండవీటి చరిత్రము వలనను, బసవపురాణ పద్యకావ్యపీఠికయందలి యీ క్రింది పద్యాదుల వలనను దెలిసికోవచ్చును.

       సీ. ఒకనాఁడు శివభక్తు లోరుగంటను స్వయం
                       భూదేవు మండపమున వసించి

          బసవపురాణంబు పాటించి వినువేళ
                     హరునిఁ గొల్వఁ బ్రతాపుఁ డచటి కేఁగి
          'యా సంభ్రమం బేమి" యనుడు భక్తులు బస
                     వనిపురాణం బర్థి వినెద రనిన
           విన నా పురాణంబువిధ మెట్లోకో యన్న
                     ధూర్తవిప్రుఁ డొకండు భర్తఁ జేరి

           'పాలకురికి సోమపతితుఁ డీ నడుమను
            పెనఁచె మధ్యవళ్ళు పెట్టి ద్విపద
            య ప్రమాణ మిది యనాద్యంబు పద' మన్న
            నరిగె రాజు భక్తు లది యెఱింగి.

             * * * * * *

        ఉ. వారలు వచ్చురాక పరవాదు లెఱింగియు నేవ పుట్ట నా
            యూర వసించు మ్రుక్కడుల నున్మదవృత్తుల మొండివారలన్
            జేరఁగఁ బిల్చి చంద్రధరచిహ్నిత దేహులఁ జేసి యందఱన్
            బోరన మీ రెదుర్కొనఁగఁ బొండని పంచిన దుండగంబున్.'

పాల్కురికి సోమనార్యుఁడు బసవపురాణము, పండితారాధ్యచరితము, అనుభవసారము, చతుర్వేదసారసూక్తులు, సోమనాథభాష్యము, రుద్రధాష్యము, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురురగడ, చెన్నమల్లుసీసములు, నమస్కారగద్యము, వృషాధిప శతకము మొదలయిన గ్రంథములు రచియించినట్టు బసవపురాణపద్యకావ్యమునం దీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

         సీ. బసవపురాణంబు పండితారాధ్యుల
                   చరితంబు ననుభవసార మును జ
             తుర్వేదసారసోక్తులు సోమనాథ భా
                   ష్యంబు శ్రీరుద్ర భాష్యంబు బసవ

         రగడ గంగోత్పత్తిరగడ శ్రీ బసవాఢ్య
                        రగడయు సద్గురురగడ చెన్న
            మల్లు సీసములునమస్కారగద్య వృ
                        షాధిపశతకంబు నక్షరాంక

            గద్యపద్యము ల్పంచ ప్రకారగద్య
            యష్టకము పంచకము నుదాహరణయుగ్మ
            మాది యగు కృతు ల్భక్తిహితార్థబుద్ధిఁ
            జెప్పె నవి భక్తసభలలోఁ జెల్లుచుండు.

ఈ కవిగ్రంధములలో బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవ సారము తెలుగు, అన్యవాదకోలాహలము, బసవనపంచగద్య, సోమనాథ భాష్యము, సంస్కృతము; తక్కినవి కన్నడము [4] సోమనాథకృత మయిన బసవద్విపదను పద్యకావ్యమును గా రచింపు మని పిడుపర్తి సోమనాథకవితో నాతని తండ్రి బసవన్న చెప్ప సందర్భమున నిట్లనెను.

          సీ. విరచించె జైమిని వేదపాదస్తవం
                       బొకపాదమునను వేదోక్తి నిలిపి
             హరభక్తి వైదికం బనిశ్రుతు లిడి చెప్పెఁ
                       బ్రతిభ సోమేశు డారాధ్యచరిత
             సరవి శ్రీనాధుఁ డాచరిత పద్యప్రబం
                       ధము చేసె ద్విపదలు తఱచు నిలిపి
             యాతండు పద్యకావ్యము చేసె నైషధ
                       మంచితహర్షవాక్యములఁ బెట్టి
 
             సోమగురువాక్యములఁ బెట్టి భీమసుకవి
             గరిమ బసవపురాణంబు గణనఁజేసె
             గానఁ బూర్వకావ్యము చేరుగతి రచించు
             వారి కాదికావ్యోక్తులు వచ్చి నెగడు.'

ఈ భీమకవిచేసిన బసవపురాణము కన్నడభాషలో, పాల్కురికి సోమనాథ విరచిత మయిన యనుభవసారమునుండి కొన్ని పద్యములఁ జూపి,తత్కృతములయిన బసవపురాణ పండితారాధ్యచరితములనుండి శైలిని సూచించు చిన్నభాగముల నుదాహరించి, యిూ కవిచరితమును ముగించు చున్నాను.

                             అనుభవసారము

       చ. 'ముదము వహింప హేతువులుముప్పదియై మది నొప్పుఁ బెంపు నన్
            మృదుమధురోక్తు లింపడర మెచ్చులు దీటుకొనంగ నర్ధసం
            పద దళుకొత్త సాంగముగఁ బామరు లుల్లము పల్లవింప న
            ట్లెదురుభజింప భక్తి వలదే శివభక్తి కథాప్రసంగతిన్.

       చ. అవిరళలింగపూజయు, నిరంతర సద్గురుభక్తియున్
            సవినయజంగమార్చనయు సత్యము శౌచము సచ్చరిత్రమున్

         దవిలి ప్రసాద సేవయును దా నొడఁగూర్పక వట్టిమాటలం
          దవునే యుదాత్తభక్తి సుగుణాకర ! శ్రీకర ! దోషి భీకరా !

      శా. దానానేకమహాతపోనిచయసద్దర్మౌఘతీర్ణాభిల
         స్థానస్తోమజపవ్రత ప్రణుతయజ్ఞవ్రాతమంత్రోక్తని
         త్యానుష్ఠఠానవితానమున్ సలుపు పుణ్యం బంతయుం గూడ నా
         ర్యానాథాంఘ్రులఁ బూన్చు పుష్పజసహస్రాంశంబునుఁబోలునే."

              ద్వి. అనుచు నవ్వించుచు నవిరళభక్తి
                   జనితసుఖామృత వనధిఁ దేలుచును
                   బసవండు జంగమ ప్రకరంబుఁ దాను
                   నసలారనోలగంబై యుండె నంత
                   పెద్దలఱేడు, పెన్నుద్దుల మొదలు,
                   బుద్ధుల ప్రోక, విబుధనిధానంబు,
                   అమితవచోరాశి, సుమనోనురాగుఁ,
                   డమలినచిత్రుఁ, డుద్యద్గుణాన్వితుఁడు,
                   సకలవీణాప్రవీణకలావిదుండు,
                   అకలంక నాదవిద్యాపండితుండు. &c , బసవపురాణము


              ద్వి. వేదవేదాంతాది వివిధ పురాణ
                   వాదిత కేవలభ క్త వర్ధనుఁడు
                   పండితనతపాదపద్ముండు సుకవి
                   మండలవిబుధసమాజపూజితుcడు
                   ఆరూఢకీ ర్తికుండగు కోటిపల్లె
                   యారాధ్యులందు లోకారాధ్యమూర్తి
                   యసమతదీయలోకారాధ్యశిష్య
                   విసరాగ్రగణ్యుండు వీర వ్రతుండు
                   చనును 'రుద్రా నాత్ర సంశయ' యనఁగ
                   జనియించినట్టి సాక్షాద్రుద్రమూర్తి &c , పండితారాధ్య చరిత్ర.

వివాదాస్పదములైన కవి చరిత్రములలో సోమనాధుని చరిత్ర మొకటి. ఇతని జన్మస్థానమునుగూర్చియు, కులగోత్రములనుగూర్చియు, కాలమును గూర్చియు విభిన్నాభిప్రాయములు కలిగి వాదోపవాదములు ప్రబలినవి. ఈవిషయములంగూర్చి ప్రత్యేక గ్రంథములే వెలువడినవి. వాని సారాంశము మాత్ర మిచట తెలుపcబడును.

సోమనాధుని నివాసము తెలంగాణాలయందలి 'పాల్కుఱికి" యని పెక్కురు విమర్శకు లభిప్రాయపడియున్నారు. "పండితారాధ్యచరిత్ర"ను పరిష్కరించి, విపుల విమర్శనమును వ్రాసిన శ్రీ చిలుకూరి నారాయణరావుగారు మైసూరు రాష్ట్రములో తుమకూరు పరిసరముననున్న "హాల్కురికి' యే సోమనాధుని జన్మస్థానమని తెలిపిరి. *ఆంధ్రకవితరంగిణి" కారులు శ్రీ నారాయణరావుగారితో నేకీభవించిరి "తెనుగు కవుల చరిత్ర"లో తెలంగాణాలో నేఁడు కానవచ్చు 'పాలకుర్తి' యే సోమనాధుని నివాసమగు 'పాల్కుఱికి' యని వివరింపఁబడి యున్నది.

సోమనాధుడు, తాను 'భృంగిరిటి" గోత్రుఁడనని చెప్పి యుండెనే కాని కుల గోత్రములను వివరింపలేదు కావున నీతఁడు బ్రాహ్మణేతరుఁడై న జంగముఁడని శ్రీబండారు తమ్మయ్యగారు వాదించుచున్నారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు మున్నగు వారీతఁడు బాహ్మణుఁడని నిరూపించి యున్నారు, పరంపరాయాతమగు జనశ్రుతినిబట్టి యీతఁడు కౌండిన్య గోత్రజుఁడని తెలియుచున్నదని శ్రీ వేంకటరావుగారు "తెనుఁగు కవుల చరిత్ర" లో (పుట 324) వివరించిరి "కులగోత్రముల ప్రసక్తి లేని వీరమాహేశ్వరాచారము స్వీకరించిన వెనుక, సోమనాధుఁడు తత్సంప్రదాయము ననుసరించి తా నీశ్వర కులజుఁడననియు, భక్తి గోత్రుఁడననియు, పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులనియు చెప్పుకొన్నాడు." అని వేంకటరావుగారి యభిప్రాయము. దీనినే పెక్కురు విమర్శకులు సమ్మతించుచున్నారు

సోమనాధుఁడు తాను గురులింగ తనూజుఁడనని యనుభవసారమునఁ జెప్పి యున్నను-- తన తల్లిదండ్రులు రామవిష్ణుదేవుడు, శ్రయాదేవియని బసవ పురాణమునఁ జెప్పుటవలన, గురులింగార్యుఁ డీతని దీక్షాగురువనియు, అందు వలననే ఆతనిని జనకునిగా భావించెననియుఁ జెప్పవలసి యున్నది.

ఇతని కాలమునుగూర్చియు నభిప్రాయభేదము లున్నవి. బసవపురాణమును తొలుత పరిష్కరించి, విపుల విమర్శన వ్రాసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సోమనాధుఁడు క్రీ. శ. 1180 నాఁటికే సుప్రసిద్ధుఁ డగుటచే బసవ పురాణ మా ప్రాంతముననే రచియింపఁబడి యుండుననియు తెల్పియున్నారు. శ్రీ బండారు తమ్మయ్యగారు క్రీ శ. 1160-120 మధ్యకాలమున నీత డుండెనని నిశ్చయించిరి. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు క్రీ.శ. l190-1260,70 ల మధ్యకాలమున నీతcడుండెనని నిర్ణయించిరి. బసవపురాణ రచనాకాలము క్రీ శ 1178 అని శ్రీ దేవరపల్లి వేంకట కృష్ణారెడ్డిగారు తమ 'నన్నెచోడకవి చరిత్ర' లోఁ దెల్పి యున్నారు ఈ కాల మించుమించుగా ఓరుగంటిని పాలించిన కాకతిప్రోలరాజు పుత్రుఁడు మొదటి ప్రతాపరుద్రుని కాలమునకు సరిపోవును. సోమనాధుఁడు ఆ ప్రభువర్యుని సభలోనే ప్రతివాదులను వాదమున నోడించి వీరశైవ మతమును స్థాపించి యున్నాడని పలువురి యభిప్రాయము.

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు శాసన ప్రమాణములు నాధారముగాc గొని బసవపురాణ, పండితారాధ్య చరిత్రములు క్రీ.శ. 1290-1320 ల నడిమికాలమున రచింపఁబడినవనియు, సోమనాథుని కాలమదియే యనియు దెల్పియున్నారు. ఇయ్యది రుద్రమదేవి మనుమఁడగు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమునకు సరిపడును. శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారు, శ్రీ చిలుకూరి నారాయణరావుగారు, శ్రీ సోమశేఖరశర్మగారి వాదమునే సమర్ధించిరి. 'ఆంధ్రకవితరంగిణి' కారులను, శతక వాజ్మయ సర్వస్వము ను రచించిన శ్రీ వేదము-వేంకట కృష్ణశర్మగారును పయి వాదమునె యనుసరించిరి.

  1. సోమనాథుని తండ్రి విష్ణురామదేవుఁడు; తల్లి శ్రియాదేవి. ఈ సంగతి 'బసవపురాణము' బట్టి తెలియుచున్నది. లింగార్యుడీతని గురువు. తండ్రికాఁడు.
  2. [ సోమనాథుని మహత్తువలన అవి యధార్థములే యయి, ఆ వేషధారులా పిదప సోమనాథునికి శిష్యులైరcట!]
  3. [ఇతఁడిందులూరి, అన్నయమంత్రి]
  4. [ సోమనాథుఁడు 10 తెలుఁగు గ్రంథములను, 10 సంస్కృతగ్రంథములను, 4 కన్నడ గ్రంథము లను రచించెనని ఆంధ్రకవి తరంగిణిలోఁ గలదు. ఆంధ్ర గ్రంథములు . బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము, మల్లమ దేవీ పురాణము, సోమనాథ స్తవము, అనుభవసారము, చెన్నమల్ల సీసములు, వృషాధిప శతకము, చతుర్వేదసారము, బసవోదాహరణము, బసవరగడ సంస్కృత గ్రంథములు - సోమనాథ భాష్యము, రుద్ర భాష్యము ; వృషభాష్టకము, బసవోదాహరణము , అష్ణోత్తర శతనామగద్యము , నమస్కార గద్యము, పంచప్రకార గద్యము, అక్షరాంక గద్యము. కన్నడ గ్రంథములు - బసవరగడ, బసవాఢ్యరగడ, సద్గురురగడ గంగోత్పత్తి రగడ–ఇయ్యవి తెనుఁగుకృతులో, కర్ణాటకృతులో చెప్పఁ జాలమని శ్రీ బండారు తమ్మయ్య గారు వ్రాసిరి. రగడలు తెలుఁగు సంప్రదాయమునకు సంబంధించినవను నాశయమున, శ్రీ తిమ్మయ్య"గా రట్లనియుండ వచ్చును. అక్షరాంక గద్యనే కాక, అక్షరాంక పద్యములనుగూడ సోమనాథుడు వ్రాసెననియు 'శీల సంపాదనము', శివగణ సహస్రనామము నను "రెండు కన్నడ కృతులను కూడ ఈతcడు రచించెననియు, శ్రీ వేంకటరావు గారు తమ 'తెనుఁగు కవుల చరిత్ర' లో వ్రాసియున్నారు. ఈ రచనలలో మొదటిది 'అనుభవసారమ'నియు అది నన్నయభట్టు కవితా సంప్రదాయముల ననుసరించినదనియు, శైవకవితా సంప్రదాయము లందు లేవనియు తెల్పుచు శ్రీ వేంకటరావుగారు తర్వాతి రచనలను క్రమముగా నిట్లు నిరూపించిరి_ బసవపురాణము. వృషాధిప శతకము, గద్య కృతులు, పద్య స్తుతులు, చతుర్వేద సారము, భాష్య గ్రంథములు, సంస్కృత స్తుతులు, పండితారాధ్య చరిత్రము,