ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/జక్కయకవి
జక్కయ కవి
జక్కయ్య యనెడి యీ కవి విక్రమార్క చరిత్రమును పద్యకావ్యముగా రచించెమ. ఈతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. ఈతని తండ్రి పేరన్నయామాత్యుఁడు. తాత పె...యామాత్యకవి. ఈ విక్రమార్క చరిత్రము దేవరాయని మంత్రియైన సిద్దన్న కంకితము చేయఁబడెను.సిద్ధవ్న మంత్రి కవినిగూర్చి యీ ప్రకారముగా నన్నట్లు కవి తన గ్రంథమునందుఁ జెప్పియున్నాఁడు:
సీస మాలిక
సంస్కృత ప్రాకృత శౌర సేన్యాదుల
ఘటికలో నొక శతకంబు, జెప్పఁ
బ్రహసన ప్రకరణ భాణాది బహువిధ
రూపంబు యందు రూఢి మెఱయఁ
జక్రచతుర్భద్ర చతురుత్త రాధిక
క్షుద్రకావ్యములు పెక్కులు రచింప
నాంధ్ర కవిత్వంబునంటినఁ బ్రబంధంబు
మేలుగాఁ దద్ జ్ఞులు మెచ్చఁ జెప్ప
నిమ్ముల నే రీతి నే ధాతువుల నేమి
రసమున నైన వర్ణనము చేయ
సరి నేక సంధాద్విసంధాత్రిసంధలఁ
దొడరినఁ బొరిఁబొరిఁ గడమఁ జదువ
నెవ్వఁ డే యవధాన మెఱుఁగు నయ్యవధాన
మున వాని కించుక ముల్లు చూప
వృత్తకందముఁ గందవృత్తంబునుం జతు
ష్కందంబు మొదలుగాఁ గలుగు గర్బ
కాష్యవర్గముఁ జెప్పగాఁ బ్రబంధంబు..
క్రొత్తలు పట్టించుకొని లిఖింపఁ
గా నక్షరచ్యుతకంబు మాత్రాచ్యుత
కంబు బంధచ్యుతకంబు నామ
గోప్యంబులుం గ్రియాగోప్యంబులును భావ
గోప్యంబులును జెప్ప గోష్టియందుఁ
బద్యంబు గీతికార్భటి నొగిఁ జదువంగ
నెల్ల విద్యలనంచు లెఱుఁగ నేర్తు
ననుచు నెల్లూరి తిరుకాళ మనుజవిభుని
సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెఱసి
మహిమ గాంచిన పెద్దయా మాత్యసుకవి
మనుమడవు నీవు నీవంశ మహిమ యొప్పు.
క. ఆడఁడు మయూర రేఖను
గాడంబాఱండు గాణగతి మన మెరియన్
బ్రోడగు పెద్దయ యన్నయ
మాడకు మాడెత్త యతని మాటలు జగతిన్.
క. అని మీ తండ్రి మహత్వము
జన వినుతరస ప్రసంగ సంగత కవితా
ఘనతేజులు కవిరాజులు
గొనియాడుదు రఖిలరాజకుంజరసభలన్
క. చక్కని నీ వైదుష్యము
చక్కన నీ కావ్యరచన చాతుర్యంబున్
జక్కన నీ వాగ్వైఖరి
చక్కన నీ యాశుమహిమ జక్కన సుకవీ !
సీ. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసరణీమై
నధిగత పరమార్ధుడై తనర్చె
నెద్దనపూడి రాజేంద్ర చోడక్షమా
రమణుచే నగ్రహారముగఁ బడసెఁ
గనకదండాందోళి కాచ్చత్ర చామర
ప్రముఖ సామ్రాజ్య చిహ్నముల నొప్పె
సర్వతోముఖముఖ్య సవనక్రియా ప్రౌఢి
నుభయ వంశంబుల నుద్ధరించె
నన్నదానాది దానవిద్యా ఘనుండు
పరమ శైవ సదాచార పారగుండు
హరితవంశాంబునిధి చంద్రుఁ డార్యనుతుఁడు
సుగుణవిభ్రాజి సూరనసోమయాజి.
క. అమ్మహితాత్ముని మనుమఁడు
సమ్మాన దయానిధాన సౌజన్యరమా
సమ్మోదిత బాంధవుఁడై
యిమ్మహిలో సిద్దమంత్రి యెన్నిక కెక్కెన్.
రాజేంద్రచోడుడు 1156-వ సంవత్సరము మొదలుకొని 1163-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. సిద్దమంత్రి కొడుకైన జన్నయమంత్రి 1406 వ సంవత్సరము మొదలుకొని 1422-వ సంవత్స రము వఱకును రాజ్యపరిపాలనము చేసిన దేవరాయని కాలములో నుండెను. తాతకును మనుమనికిని నన్నూట యేబది సంవత్సరములు వ్యత్యాస ముండుట సంభవింపనేరదు గావున నిచ్చట మనుమఁడనగా సంతతివాఁడని యర్ధము చెప్పవలెను. ఆందుచేత సిద్ధనమంత్రి సూరన సోమయాజికి మనుమడు గాక తద్వంశజుఁడయి యుండుట నిశ్చయము.
ఇచ్చట "ఆంధ్రకవితరంగిణి' యందిట్లున్నది.
[వెలనాటి చోడులలో రాజేందచోడ నామధారులు పలువురున్నారు. ఇందు గడపటి యాతడు కులోత్తుంగ రాజేంద్రచోడుడు. ఇతడును మనుమసిద్ధియు సమకాలికులు. ఆతcడే సూరన సోమయాజి కగ్రహారమొసగెనని తలంచితి మేని సూరనసోమయాజి క్రీ. శ.1280 ప్రాంతమున నాతనిచే నగ్రహార మందెననియు నాతని, మునిమనుమడై న జన్నమంత్రి క్రీ.శ.1380 ప్రాంతము నందుండెననియు నిశ్చయింపవచ్చును. ఇందు విరుద్దమేమియు నుండదు. పంతులుగారు చూపిన వ్యత్యాసమునకు దావుండదు. మనుమఁడని వ్రాసిన దానిని వంశీయుడని దలంచ నక్కరయుండదు. (ఆంధ్రకవి తరంగిణి-నాల్గవసంపుటము -పుటలు 219-220)
కృష్ణా ! దేవకీనందనా ! అను మకుటము గల శతకమునకు గర్త సిద్దమంత్రి తండ్రి జన్నయయేయని పలువురి యభిప్రాయము. సిద్దమంత్రి తన వంంశీయుఁడని వెన్నెలకంటి వేంకటాచలకవి కృష్ణ విలాసమున జెప్పి యుండుటచే జన్నయ యింటి పేరును వెన్నెలకంటివారని నిర్ణయింప వచ్చునఁట ! ఇతని కాలము క్రీ. శ. 1360-1420 నడుమనుండవచ్చునట! పయి శతకము తిక్కన సోమయాజి కృతమనునొక ప్రతీతి యున్నది. కాని యది సత్య దూరమని పలువురి యభిప్రాయము.]
జన్నమంత్రియు సిద్ధనమంత్రియు గూడ దేవరాయమహారాజు వద్దమంత్రులుగా నున్నట్లు విక్రమార్కచరిత్రములోని యీ క్రింది పద్యములలోఁ జెప్పఁబడి యున్నది. సీ. విమలవర్తనమున వేదశాస్త్ర, పురాణ
వాక్యార్థ సరణికి వన్నె పెట్టె
పరమహృద్యంబైన పద్యశతంబున
దేవకీతనయు విధేయుఁ జేసె
రసికత్వమున దేవరాయమహారాజ
కరుణాకటాక్ష వీక్షణముఁ గాంచె
కర్ణాటకటకమ్ము కలయంగ మెచ్చంగఁ
గడఁక విద్యాప్రౌఢి ఘనత కెక్కె
గురులఁ బోషించె సత్కవీశ్వరుల మంచె
బ్రజలఁ బాలించె భాగ్యసంపద వహించె
హరిత మునిముఖ్యవంశరత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయ జన్నమంత్రి.
సీ. చిత్ర గుప్తున కై నఁ జింతింప నరుదైన
గణిత విద్యా బ్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
కవిజనంబులు మెచ్చఁగా నొనర్చె
నాణిముత్యములసోయగము మించిన వ్రాలు
వరుసతో నిరుగేల వ్రాయ నేర్చె
నాత్మీయ లిపి యట్టు లన్యదేశంబుల
లిపులను జదువంగ నిపుణుఁడయ్యె
దేవరాయమహారాయధీవిధేయ
మంత్రివల్లభచామనామాత్యదత్త
చామరచ్ఛత్ర భూషాది సకలభాగ్య
చిహ్నముల నొప్పి జన్నయసిద్ధమంత్రి.
తండ్రియు కుమారుఁడును గూడ దేవరాయమహారాజు వద్ద మంత్రులుగా నున్నట్లు చెప్పఁబడినందున, కుమారుఁడయిన సిద్దన్న యాతని రాజ్యములోని కడపటిదశయం దున్నట్టూహింపఁదగి యున్నది. దేవరాయ మహారాయలు క్రీ స్తుశకము 1406 వ సంవత్సరము మొదలుకొని 1422 వ సంవత్సరము వఱకును కర్ణాటక రాజ్యమును పరిపాలనము చేసెను. కాబట్టి సిద్దన్న మంత్రి యీపయి నుండక పోయినను 1422 వ సంవత్స రమువరకు నున్నట్లు నిశ్చయము. అందుచేత విక్రమార్క చరిత్రము 1410 వ సంవత్సరమునకును 1420 వ సంవత్సరమునకును మధ్యకాలము నందు రచియింపఁబడిన దని నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును. విష్ణుపురాణము తెనిగించిన వెన్నెలగంటి సూరన్న తాతయైన సూర్యుఁడీ సిద్దన్న పెద్దతండ్రియైనట్టు విక్రమార్కచరిత్రలోని షష్ట్యంతములలో నొకటయిన యీ క్రింది పద్యమునందుఁ జెప్పఁబడి యున్నది.
ఉ. వెన్నెలగంటి సూర్యుఁడు వివేకగుణాఢ్యుడు వేదశాస్త్రసం
పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
సన్నుతిఁ గన్న సిద్ధనకు సంతతదానకళావినోదికిన్
జక్కనకవి తన విక్రమార్కచరిత్రమునందు భారతమును తెనిఁగించిన కవిత్రయమగు నన్నయ్యభట్టారకుని, తిక్కన సోమయాజిని, ఎఱ్ఱాప్రగడను మాత్రమే యీక్రింది పద్యములతో స్తుతించి యున్నాఁడు.
ఉ. వేయి విధంబులందుఁ బదివేవురు పెద్దలు సుప్రబంధముల్
పాయక చెప్పి రట్లు రసబంధురభావభవాభిరామధౌ
రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రసస్తి కెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్దరనట్టి మహాత్ముఁ గొల్చెదన్.
చ. పరువడి దేవభాషఁగల పంచమవేదము నాంధ్రభాష సు
స్థిరత రచించుచోఁ గృతిపతిత్వముఁ గోరి ప్రసన్నుఁ డైన యా
హరిహరనాధుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు వెవ్వఁ డా
పురుషవరేణ్యుదిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్
ఉ. ఈత్రయిఁ దాఁబ్ర బంధపరమేశ్వరుఁడైవిరచించె శబ్దవై
చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీ నరసింహ రామచా
రిత్రములు బుధవ్రజగరిష్ఠత నెఱ్ఱయ శంభుదాసుఁ డా
చిత్రకవిత్వవాగ్విభవజృంభితు మెచ్చెద భక్తియుక్తితోన్
జక్కన్న లాక్షణికుడైన మంచి కవి. ఈతని కవిత్వము నిర్దుష్టమై మనోహరముగా నుండును.ఈ విక్రమార్క చరిత్రము నందలి కథలు సహిత మద్బుతములుగానే యుండును. కవియొక్క రచనాధోరణి తెలియుట కయి విక్రమార్క చరిత్రములోని కొన్ని పద్యముల నిందుఁ జూపు చున్నాను.
చ. అనవుడు నింతి యీ యెడఁ బ్రయాసపడం బనియేమి? యంచు వే
గన ములు ముంటఁ బుచ్చుటయె కార్యముగాఁ దలపోసి చంద్రగు
ప్తుని దగురీతి వీడుకొని భూపతిపాలికిఁ బోయి పూసగ్రు
చ్చినగతిఁ గార్యనిశ్చయ మశేషము తిన్నగ విన్నవించినన్ ఆ 1
ఉ. ఇమ్మెయి నర్థ మెల్లను వ్యయింపఁ బురిం గలవైశ్యు లందఱున్
నెమ్మిఁ బురందరుం గదిసి నీవు వణిక్కులవ ర్తనంబు స
ర్వమ్మును వమ్మునం గలిపి వాలి విశృంఖలవృత్తి దానధ
ర్మమ్ములు త్యాగభోగములు మానక చేయుట నీతిమార్గమే? ఆ 2
ఉ. రా జవివేకియై నిరపరాధు మహీసురవర్యునిన్ జగ
త్పూజితుఁ బుణ్యవర్తను విధూతనమజ్జనకల్మషున్ వధూ
వ్యాజమునన్ వృధా కుపితుఁఁడై వధియింపఁగఁ బంచె దీని నే
యోజఁ దొలంగఁదోతు గురు నుత్తము నెమ్మెయిఁ గాతదైవమా! ఆ 3
ఉ. చెప్పఁదలంచు సిగ్గు తనుఁ జెప్పఁగనీమిక సంచలించుఁ దాఁ
జెప్పెడు మాట యెవ్వరికిఁ జెప్పకుమీ యనజూచు నంతటం
జెప్పక యుండరాదు మఱి చెప్పఁగరా దని కొంకు నెమ్మెయిం
జెప్పకపోదు పొమ్మనుచుఁ జిత్తము నూల్కోనఁజేసి యిట్లనున్. ఆ. 4
మ. భువనాధీశ్వరుదర్శనోత్సవసుఖంబుం బొంది యానందతాం
డవముం జేసెడుభంగి నా కమలషండం బొప్పె భృంగాంగనా
రవగానంబులతో సరాగదళనేత్ర శ్రీవిలాసంబుతో
నవచిత్రాభినవోర్మిహస్తఘటనా నానావిలాసంబుతోన్. ఆ. 5
చ. కలువల గండుమీలఁ దొలుకాఱు మెఱుంగుల నిండు వెన్నెలన్
వలపులరాజుతూపులను పారిరుహంబుల నొక్కయెత్తనన్
గెలుపు గొనంగఁ జాలు మృగనేత్ర యపాంగనిరీక్షణద్యుతుల్
బలుపుగ ధైర్యమూల మగు పా దగిలింపవె యీశ్వరాదులన్. ఆ. 6
చ. పలుకుల నేర్పునం జెవులపండువు చేసితి వింతసేపు నా
పలుకు శిలాక్షరంబుగ శుభం బది శీఘ్రముగాఁగ నంతయం
దెలియఁగఁ జెప్పు మింక భవదీయ సమాగమనప్రసంగముల్
జలజదళాక్షి! యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్. ఆ. 7
ఉ. ఈ సుకుమారతావిభవ మీ దరహాసముఖారవింద మీ
భాసురమూర్తి యీ లసదపారకృపారపనేత్ర కాంతవి
న్యాసము లెందుఁ గంటిమెప్రియంవదుఁ డీతనియంద కాక? నేఁ
జేసినభాగ్య మెవ్వరును జేయరుపో యిత డేగు దెంచుటన్ ఆ. 8
[శాకుంతల మొకటి సిద్దనప్రెగడ కృతము సంకలన గ్రంథములలో నుదా హరింపఁబడినది. ఈసిద్ధన విక్రమార్క చరిత్ర కృతిపతియే కావచ్చునని కొందఱి యభిప్రాయము.
జక్కనకవి 'పెమ్మయ సింగధీమణి' శతకమును రచించినట్లు "చాటు పద్య మణిమంజరి" వలనఁ దెలియవచ్చుచున్నది. ఈ పెమ్మయ సింగన యెవ్వఁడో తెలియదనియు, నీశతకము జక్కనకృతమగునో కాదో యింకను విమర్శింపవలెననియు 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు ]