ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునాఱవ ప్రకరణము

పదునాఱవ ప్రకరణము.

ఆంధ్రచోడులు.

ఏడవశతాబ్ద ప్రారంభమున హౌనుత్సాంగు హిందూదేశంబునందలి బౌద్ధాశ్రమములను జూడవచ్చి దక్షిణ యాత్రచేయునపు డాంధ్రదేశమునకు వచ్చి యచ్చటి బౌద్ధక్షేత్రములను సందర్శించి పిమ్మట ధాన్యకటకమునకు నైఋతి దిక్కుననుండు చుళియ (Chu li-ya) దేశమునకు వెళ్లెనని చెప్పబడియెను. చుళియ చోళకు నామంబగుటజేసి కావేరితీరమునందున్న చోళదేశమిచ్చటికెట్లువచ్చెనని చరిత్రకారు లాశ్చర్యపడుచుండిరి. హౌనుత్సాంగు పరదేశీయుడగుటవలన దెలియక యేదోతప్పుగ వ్రాసెనని యూహించిరి కాని యా కాలమునం దాంధ్రదేశము జోడులమని చెప్పుకొను నొక తెగవారు పరిపాలనము చేయుచుండినది యెవ్వరికి దెలియకపోయెను. హౌనుత్సాంగు చూడవచ్చిన కాలమనగా క్రీ.శ. 640 దవ సంవత్సరమున నీ యాంధ్రదేశములోని యీ చోళరాజ్యము నాలుగైదువందల మైళ్లవిస్తీర్ణము మాత్రము గలిగియుండెను. రెండు మైళ్లుమాత్రమే పరివర్తనము గల యొక చిన్న పట్టణము రాజధానిగనుండెను. దేశమంతయు ననారోగ్యకరంబులగు నడవులతోడను, సారహీనములయిన భూములతోడను, క్రూరకృత్యములచే భయంకరులై మోటుగనుండు ప్రజలతోడను గూడియుండెను. ఎక్కడచూచినను దారిదొంగల గుంపులతో గూడియుండెను. బౌద్ధాశ్రమములు కొన్ని మాత్రమె యుండినవిగాని యవియు శిథిలములై యుండినవి. వానివలెనె యిందునివసించు సన్న్యాసులు గూడ నపరిశుద్ధులుగ నుండిరి. దేశమునందంతటను జైనమతము ప్రచారమునందుండెను. అచ్చటచ్చట బ్రాహ్మణాలయము లత్యల్పసంఖ్యగలవి మాత్రముండినవి. ఈ రాజ్యము ధాన్యకటకమునకు (అమరా వతి ధరణికోట) రెండువందల మైళ్లకు లోపుగనుండి దూరమున మాత్రముండెను. కాబట్టి యీరాజ్యము కడపమండలము లోనిదని చెప్పవచ్చును. హౌనుత్సాంగు వర్ణించిన లక్షణములన్నియు గడపమండలమునకు వర్తించుచున్నవి. క్రీ.శ. 1800 సంవత్సరమున బ్రిటీషువారీమండలమును స్వాధీనము జేసికొను పర్యంతము దారిదోపిడి కాండ్రగుంపులచే నిండియుండి ఘోరకృత్యములకాటపట్టయి యుండెను. ఈదేశమును వర్ణించిన యాత్రికుడు చోళదేశమనిపేర్కొనియెనే గాని రాజ్యపాలనము చేయుచుండిన రాజనైన నుదాహరించినవాడు కాడు. ఈచోళరాజు స్వతంత్రుడో లేకకాంచీపురాధీశ్వరుడయిన నరసింహవర్మయను పల్లవరాజునకు లోబడినవాడో హౌనుత్సాంగు దెలిపియుండిన వాడుకాడు. ఇటీవలనా ప్రాంతముల గనుగొనంబడిన కొన్ని పురాతన శిలాశాసనమును బట్టి హౌనుత్సాంగు చెప్పిన చోళరాజ్యము స్థిరపడుచున్నది. ఎనిమిదవశతాబ్దమునకు బూర్వమునందు వాడుకలోనుండి లిపులను గలిగియుండిన యీచోళరాజుల శాసనములు సంశయములన న్నిటిని నివారించుచున్నవి. 1903-4 వ సంవత్సరములో నీ రాజులయొక్క శిలాశాసనముల లాఱును మఱియొక తామ్రశాసనమును గన్పట్టబడినవి. ఈ తామ్రశాసనములో మొదటకరికాలచోళుడనురాజు పేర్కొనబడియెను. ఇతడు కావేరి నదియొక్క వెల్లువలు దేశమున బొర్లి పాఱకుండ గట్లు పోయించెననియు, పాండ్యచోళచేర రాజ్యములయొక్క యాధిపత్యమును వహించెననియును జెప్పబడియుండెను. వీనివంశమందు సంజవర్మ(?)వుండెను. ఇతడు కాశ్యపగోత్రుడు వీనికి సింహవిష్ణువు, సుందరానందుడు, ధనుంజయవర్మయను మూవురు పుత్రులుండిరి. ధనుంజయవర్మకు చోళమహారాజు వానికి ననిరాముడు, వానికి మహేంద్రవిక్రమవర్మ వానికి ముదితశిలాక్షరుడు కలిగెను. ఇతడు పాండ్యచోళ కేరళరాజ్యముల కధిపతియని చెప్పబడియెను. వీనికి గుణముదితుడు సోర్ముఖరాముడు జనించిరి. సోర్ముఖరామునకు [1] పురుష శార్దూలుడు వానికి పుణ్యకుమారుడు జనించిరి. ఈ పోర్ముఖరామపుణ్యకుమారుడు కోఠి కుల్దరాజుయొక్క కోరికనువిశ్వసించి తనపరిపాలనకాలములో నైదవసంవత్సరమున హిరణ్యరాష్ట్ర మండలములో సుప్రయోగనదియొక్క దక్షిణపుటొడ్డుననున్న బిరిపాఱు (విరిపాడు) గ్రామములో గొంతభూదానము చేసెను. (ఇయ్యది పల్లవయువ మహారాజు విష్ణుగోపని యఱవపల్లి శాసనమునగూడ నుదహరింపబడినది). ఈ పుణ్యకుమారుని పూర్వికులయిన నందివర్మ సింహవిష్ణువుల నామములన పల్లవరాజులచేగూడ వహింపబడియెను మఱియును సుందరానందుడు నవరాముడు చోళనాయకుడయిన శ్రీకంఠుని పూర్వులుగా నుదాహరింపబడిరి.[2]

శిలాశాసనములలో నొకటి పోర్ముఖరామ పుణ్యకుమారునకును, (no.384 of 1904) మూడు చోళమహారాజునకును (ns.405 406,408 of 1904)ఒకటి విక్రమాదిత్యచోళమహారాజునకును (no.400 of 1904) మరియొకటి శక్తివర్మ విక్రమాదిత్యుని కుమారుడగు చోళమహారాజాధిరాజసత్యాదిత్యునకును(No.393 of 1904) సంబంధించినవిగనున్నవి. ఇవన్నియును గడపమండలములోని ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలలో గానుపించినవి గావున వీరి రాజ్యముగూడ నచ్చటిదేయైయుండునని యూహింపబడుచున్నది. ఈ శాసనములలో నుదాహరింపబడిన రాజులలో చోళమహారాజు సూర్యకులడనియు, కాశ్యపగోత్రుడనియు, కరికాలచోడవంశజుడనియు బేర్కొనబడియుండెను. వీరు వహించిన బిరుదునామములంజూడ స్వతంత్రులుగ గన్పట్టుచున్నారు. వీరి శిలాశాసనములు గాని తామ్రశాసనములు గాని వీరేకాలమున నున్నదియు దెలుపుచుండలేదు. వీరిశాసనములలోని లిపిని బట్టిచూడగ 8దవ శతాబ్దమునకు బూర్వమున నున్నవారని తేటపడుచున్నది. ఇంతియగాక 1904దవ సంవత్సరములో కడపమండలములోని పెద్దముడియ (ముదివేము) మనుగ్రామంబున చోళమహారాజు పాలనములోని శాసన మొకటి గానిపించినది. (No. 352of 1905) చిప్పిలి గ్రామమున గన్పట్టడిన శాసనములో (No.299ofi905) పుణ్యకుమారునిపేరు గానంబడుచున్నది. అత్యనచోళుని శాసనమొకటి గానిపించుచున్నదిగాని (No. 350ofl905)యితడు పశ్చిమచాళుక్యరాజగు నాఱవవిక్రమాదిత్యునికి లోబడిన మండలేశ్వరుడుగాని స్వతంత్రుడుగాడు. అయిన నీతడు పైచోడవంశములోని వాడుగానుండెను. 1907 వ సంవత్సరములోనీచోడులశాసనములు మఱిమూడుగన్పెట్టబడినవి. ఒకటి ముట్టుకూరులోను, ఒకటి ప్రొద్దుటూరులోను మఱియొకటి నల్లచెఱువుపల్లెలోను గనుగొనబడినవి. ఈ గ్రామములన్నియు గడప మండలములోనివే. మొదటిరెండును చోళమహారాజు కాలములోనివి. ఎలచోళ మహారాజుల ముత్తరాజును నిరువురు మూడవశాసనమునం బేర్కొనబడియుండిరి. శ్రీకంఠుని తామ్రశాసనములో ఎలచోళుడు శ్రీకంఠుని పూర్వికులలోని వాడుగా నుదాహారింపబడియుండెను. హేమవతి, నిడుగల్లు ప్రాంతదేశమును బాలించెడు చోళరాజులను గొందఱిని రైసుదొరగారు తుముకూరు శాసనముల సంపుటములో నుదాహరించియున్నారు.[3] వీరిలో ధనుంజయ యెల చోళరాజు గాంగూల పల్లవరాజునకు లోబడిన మండలేశ్వరుడిగ నుండి అల్వాడిదేశమును, చోళికముత్తరాజు కండకోటను పాలించుచుండిరి. వీరలు క్రీ.శ.750దవ సంవత్సరములో నున్నారని రైసుదొరగారు కాలనిర్ణయము చేసియున్నారు.

కడప మండలములోని చోడులు 7000 లుగ్రామములు గలిగిన రేనాడును బాలించుచు దాము కరికాల చోడవంశజులమని చెప్పుకొనియున్నారు. హేమవతి నిడుగల్లుచోడులట్టి ‌‌విషయముల నేమియు జెప్పుకొని యుండలేదు.

రేనాటిచోడులు ద్రావిడచోడులుగారు.

ఈ రేనాటి చోడులు ద్రావిడభాషా వాజ్మయములో వర్ణింపబడిన కరికాలచోడుని వంశములోని వారమని తమశాసనములలో గొప్పగా జెప్పుకొని యున్నను తక్కిన రాజవంశముల వారివలెనె వీరును పోకలుపోయియుందురు. గాని నిజముగా నీచోడులకు నాచోడులకు సంబంధమేమియును గానరాదు. వీరు కరికాల చోడవంశజులమని చెప్పుకొన్నంత మాత్రముచేత నాచోడులిచ్చటికివచ్చి పరిపాలించినవారని భ్రమింపరాదు. విక్రమసింహపురమనియెడు నెల్లూరును బాలించిన మనుమసిద్ధిరాజును వానిపూర్వీకులనుగూడ తాము కరికాలచోడవంశజులమని చెప్పుకొనియుండిరి. ఇట్లనేకులు తాముకరికాలచోడవంశజులమని చెప్పుకొనియున్నను వీరెవ్వరును పెట్టుచోడలెగాని పుట్టుచోడులుగారు. ముఖ్యముగా విచారింపవలసినది మఱియొక్కటికలదు. వస్తర(బస్తరు) రాజ్యములోని చక్రకోట్యమును బాలించు సింధువంశజుడయిన ధారావర్షునికి లోబడిన సామంతుడిగనుండి వానికి మంత్రిగను సైన్యాధిపతిగనుండిన చంద్రాదిత్యుడను నాతడు తానుకరికాల చోడవంశజుడ ననియు కాశ్యపగోత్రుడననియు జెప్పుకొనియుండుటచేత నతడీ చోడవంశములోని వాడుగ గుర్తింపబడియెను. వీనిశాసనములపై సింహలాంఛనముగలదు. శాసనపరిశోధకులు వీనిశాసనములం బరిశీలించి రేనాటి చోడులు వ్యాఘ్రలాంఛనముగలవారని వారికిని తంజాపురి తిరుచునాపల్లి చోళులకును సంబంధము గలదని యభిప్రాయబడిన తమమొదటి యభిప్రాయమును మార్చుకొని రేనాటిరెడ్లుగూడ సింహలాంఛనముగలవారేయనియు గాబట్టి రేనాటిచోడులు వేఱనియు, తంజాపురి చోడులు వేఱనియు నభిప్రాయబడియున్నారు. కనుక రేనాటిచోడులను మేమాంధ్రచోడలునుగానే పరిగణించుచున్నారము. తక్కినచోడులనుగూర్చి ద్వితీయసంపుటమునందు వివరముగా వ్రాయదలచి చోడులచరిత్రమిచ్చట ముగించినారము. వీరినిగూర్చిన చరిత్రము పరిశోధనలవలన భావికాలమున దెలిసికొనవలసినదేగాని యింతవఱకు మనకేమియును దెలియరాకున్నయది.

మహాబాణవంశము.

దక్షిణాపథ దేశమును బాలించిన భూపతులలో సూర్యకులులమని కొందఱును చంద్రకులులమని కొందఱును, బ్రహ్మకులులమని కొందఱును, కార్తవీ ర్యకులమని కొందరును పెక్కండ్రు పెక్కురీతులుగా వమవంశోత్పకులను గూర్చి చెప్పికొనిరే గాని యీ మహాబాణులవలె రాక్షసుల సంతతివారమని వారెవ్వరును చెప్పుకొని యుండలేదు. వీరలు తాముదాన నాగ్రణియగు బలిచక్రవర్తి యొక్క కొడుకైన మహాబాణుని వంశము లోని వారమని చెప్పికొనియుండిరి. మాచదువరులు భాగవత విష్ణుపురాణములోని బలిచక్రవర్తియొక్కయు బాణాసురుని యొక్కయు కథలను చదివియు వినియునుందురు. వామనమూర్తియైవచ్చిన విష్ణువుకు భూవలయమంతయు ధారపోసి సర్వస్వమును గోల్పోయి పాతాళమున కనగ ద్రొక్కబడిన వాడు బలి చక్రవర్తి. శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడు తనకూతురైన యుషాకన్యతో నంతపుర మందిరమున నుండుటగాంచి మహోదగ్రుడై యనిరుద్ధుని బట్టిబంధించి యాకారణమున శివకేశవులకు బోరాటము పెట్టి తుదకు శ్రీకృష్ణునిచే ముప్పుగాంచినవాడు బాణాసురుడు. వానివంశమున జన్మించిన జనించితిమని చెప్పుకున్నవారే ఈ మహాబాణులు. వీరు శైవమతావలంబకులు నల్లని టెక్కెము గలవారు. వృషభలాంఛనులు. నండీశ్వరుని భక్తులు. వీనికి మొదట మైసూరురాజ్యములోనున్న కోలారుమండలము లోని అవణ్యనగరము (Avani) రాజధానిగానున్నట్లు గంపట్టెడివి. తరువాత నుత్తరార్కాడు మండలములోని తిరువళ్ళము రాజధానిగ నుండెను.

ఇది పాలేఱున కుపశాఖయగు నీవానదియొక్క పడమటి యొడ్డున నున్నది. అనేక శాసనములందు తిరువళ్ళము బాణాపురమని పేర్కొనబడియున్నది. ఈ మండలము పేర బాణప్పాడి (మహాబాణదేశము) అని పిలువబడుచుండెను. బాణపురముకు సమీపమునందొక పాలెము బాణసముద్రమని పిలువబడుచుండెను. మరియొక గ్రామము బాణుల కాలము నుండి బాణవరమను పేర బరగుచు షోళింఘురునకు (చోళింగవరము) (Railway Station) సమీపమున నున్నది. బాణాపురమనియెడి యీతిరువళ్ళము చోడుల శాసనములయందు తికాలివళ్ళమని గూడ పేర్కొనబడినది. అప్పుడది జయకొండ ళచోమండలములోని భాగమగు పాడువూరు కొట్టములో జేరియుండెను. ఈ పాడువూరు కొట్ట మొకప్పుడు త్యాగాభరణ వలవాడను పేరనొప్పియుండెను. కొన్ని శాసన ములలో తిరువళ్ళము పేరంబాణ ప్పాడిలోని మీయాఱునాడు లోనిదనియు, మరికొన్ని శాసనములలో కరై బలినాడు లోనిదనియు బేర్కొనబడియుండినదిగాని అది యెక్కడుండెనో దెలియరాదు. కొందరు చరిత్రకారులు రాయవేలూరునకు దక్షిణభాగమున నున్న పడైవీడు పరివీరపురమని చెప్పుచున్నారుగాని యింకను స్థిరపడి యుండలేదు. ఈమహాబాణుల రాజ్యమాంధ్రపథమునకు (నడుగావళికి) బడమటయున్నదని కొన్ని శాసనములు దెలుపుచున్నవి. ఆంధ్రమండలములోని 12000 గ్రామములు వీరిరాజ్యములో జేరియుండినవి. ఈ బాణరాజులు స్వతంత్రులుగాక పల్లవరాజులకు గొంగపల్లవ రాజులకు లోబడిన మాండలికులై ప్రఖ్యాతిగాంచినవారుగా గన్పట్టుచున్నారు. విద్యానాథపండితుడు బాణవంశమునుగూర్చి ప్రతాప రుద్రీయమునందు ప్రశంసించియున్నాడు. 1903 వ సంవత్సరమున బ్రకటింపబడిన బాణుల శాసనమున లైదింటిలోనూ మూడు (NOs 226, 228, of 229 1903) పల్లవులు గొంగపల్లవులు బాణులకు ప్రభువులని పేర్కొనియున్నవిగాని రెండుశాసనములు మాత్రమట్లు పేర్కొనియున్నవిగాని రెండుశాసనములు మాత్రమట్లు పేర్కొనియుండలేదు. ఆ రెండును విజయాదిత్య బాణరాయని కాలములోనివై శక సంవత్సరములు 820,821వ సరియైయిన క్రీస్తుశకము 827-828దవ సంవత్సరములలో వ్రాయబడినవిగా నున్నవి. [4] ఈ రెండింటిలోనూ మొదటిది విజయాదిత్యుని బాణవిద్యాధరుని కొడుకని నుడువుచున్నది. గాంగపల్లవుడగు నృపతుంగని శాసనములో (NO 228 of 1903) నుదహరింపబడిన బాణవిద్యాధరుడు నితడు నొక్కడే యని చెప్పవచ్చును. ఈనృపతుంగ మహారాజు తొమ్మిదవ డతాబ్ధములోని కడపటికాలము నందుండినవాడు. గొంగపల్లవరాజగు దంతవిక్రమవర్మకు మాండలిక సామంతుడైన విజయాదిత్యుని కన్నను పల్లవరాజగు నంది పోతవర్మ కాలములో నాంద్రపథమునకు బడమట బరిపాలనము సేయుచుండిన విక్రమాదిత్యుడు పూర్వుడై యుండును. ఈవిక్రమాదిత్యుడు గాంగపల్లవుడగు విజ యనంది విక్రమవర్మ పరిపాలనముయొక్క 17 వ సంవత్సరములో వ్రాయబడిన తిరువళ్లము శాసనములో నుదాహరింపబడిన విక్రమాదిత్యునకంటెభిన్నడనియె భావింపవలయును. [5]

వధూవల్లభ మల్లదేవ నందివిక్రమవర్మముడయనూరు శాసనములో దానాంధ్రమండలములోని 12000 గ్రామముల కధిపతినని చెప్పికొనియున్న విషయము నిదివఱకు తెలిపియుంటిమి. 1906 వ సంవత్సరములో పుంగనూరు జమిందారిలో 8 శాసనము లీబాణమాండలిక రాజులకు సంబంధించినవి ప్రతులెత్తబడినవి. వానిలో నాలుగు(Nos 543, 555, 570,584 of 1906) మహాబలి బాణరాజుకాలములోనివిగ నున్నవి. వీనిలో మొదటిది శూరమతివద్దనుజరిగిన యుద్ధమును బ్రశంసిచుచున్నది. పెర్మనాడి రాజుకొఱకు మహాబలి బాణరాజు వైదుంబరాజగు గండత్రినేత్రునితో గలిసి నలంబరాజును రాచమల్లుని మయిందాడిని నెదుర్కొని ఘోరయుద్ధము చేసెను. కోలారుమండలములోని బంగవాడి శిలాశాసనముగూడ పై యుద్ధమును ప్రశంసించుచున్నది. గాంగపల్లవరాజయిన విజయవిక్రమ నరసింహవర్మ కాలములోని యొకశాసనముగూడ శూరమతి యుద్ధమును గూర్చి ప్రశంశించియున్నది. పైశాసనములలో నుదాహరింపబడిన రాచమల్లుడు గాంగవంశజుడయినయెడల నతడు సత్యకుమారకొంగునివర్మ పెర్మనాడి రాజమల్లుడై యుండవలయును. అతడే యని నిశ్చయమైనయెడల నతడు రాజ్యము చేసిన కడపటికాలము క్రీ.శ.870-1 సంవత్సరమగుచున్నది. [6] [7] కాబట్టి మహాబలిబాణరాజుయొక్క కాలమించు మించుగా దొమ్మిదవశతాబ్ద మధ్యమయి యుండునని చెప్పవచ్చును.

తక్కినశాసనములు నాలుగును మహాహాబలిబాణరాజవిక్రమాదిత్య బాణకందర్పజయమేరుని యొక్కయు(No of 569of 1906) మహాబలిబాణరాజబాణవిధ్యాధరునియొక్కయు, (571 of 1606) మహాబలిబాణరాజవిజయాదిత్యవర చూడామణి ప్రభుమేరునియొక్కయు(No. 542 of 1906) కాలములోనివైయున్నవి. వీనిలోగడపటిది కాడువత్తిముత్తరాజు కోయటారుపైబడి దోపిడి గావించుటను ప్రశంసించి బాణరాజు వడుగావళి (ఆంధ్రపథము) లోని 12000 గ్రామములను మన్నెలో 200 గ్రామములను బరిపాలించుచుండెనని దెలుపుచున్నది. కడపటిచోడుల శాసనములలో పేరంబాణప్పాడి దేశము (బాణదేశము) పడమటపుంగనూరువఱకును వ్యాపించియుండెను. కాబట్టి పాలేఱునదికి నుత్తరముననున్న యిప్పటి యుత్తరార్కాడు మండలమంతయు బాణరాజ్యములోనిదని చెప్పుటకెంతమాత్రమును సందియములేదు. క్రీ.శ892-93 సంవత్సరప్రాంతమున నలంబరాజగు మహేంద్రాధిరాజనలంబుడు బాణవంశమును నిర్మూలమును చేసితినని గొప్పగా జెప్పుకొనియుండెను. క్రీ.శ 902 మొదలుకొని 948 వఱకు బరిపాలనము చేసిన తంజాపురచోళరాజగు మొదటిపరాంతకుండిరువురు బాణరాజులను నిర్మూలము చేసి వారలదేశమును గాంగుడైన రెండవ పృధ్వీపతికి బహుమానము జేసెను. [8]

పృథివేంద్రవర్మకు లోబడియుండిన అలగమయ్యయను బాణరాజొకసామాన్యప్రభువై యుండెను. ఇట్లు చోళరాజగు పరాంతకునిచే బదభ్రష్టులైన కతంబున బాణులలో నొకకుటుంబము వారాంధ్రదేశములో నుత్తరభాగమునకు వచ్చినట్లుగాన్పించుచున్నది. బాణవంశజుడగు శూరబలిరాజు యొక్క పండ్రెండవ శతాబ్దములోని శాసనమొకటి గుంటూరు మండలములో కొణిదెన గ్రామములో గానంబడుచున్నది. [9]

వైదుంబ వంశము.

వైదుంబులు తొమ్మిదవ పదవశతాబ్దములలో రాష్ట్రకూటులకును[10] నలం బులకును చోడులకును లోబడినవారలై యాంధ్రకర్ణాటకదేశములలోని కొంతభాగమును బరిపాలించినవారుగా నుండరి. వీరిశాసనములు కడపమండలములోను మైసూరు రాజ్యములోని కోలారు మండలములోను గానుపించుచున్నవి. కడపమండలములోని యొక శాసనము గండత్రినేత్రుడను వైదుంబరాజుకాలములోనిదైయుండెను. ఈ గండత్రినేత్రుడను వైదుంబరాజు మహాబలిబాణరాజుతో గలిసి సుప్రయోగనదీతటంబుననుండిన శూరమతి యను ప్రదేశమున నలంబాధిరాజుదాడిగతోడను రాచమల్లునితోను యుద్ధముజేసెను. ఈవిషయమునే యీ గండత్రినేత్రుని కాలములోనిదగు మదనపల్లిశాసనమువలనగూడ స్పష్టపడుచున్నది. రైసుగారు తమకోలారుశాసనముల సంపుటములో వైదుంబరాజులవి రెండు శాసనముల నుదాహరించియున్నారు. వానిలో నొకటి గండత్రినేత్రునికాలములోనిదైయున్నది. ఈ గండత్రినేత్రుడును కడపశాసనములో నుదాహరింపబడిన గండత్రినేత్రుడును నొక్కడేగాని భిన్నులుగారు. ఈ శాసనములు రెండును క్రీ.శ.900 సంవత్సరములోనివిగా రైసుగారు నిర్ణయించియున్నారు. [11] విక్రమాదిత్యుడను వైదుంబరాజు రాష్ట్రకూటరాజయినమూడవకృష్ణునకు సామంతమాండలికుడుగ నుండి మాలాడు, బాణగొప్పాడి, సింగపురనాడు, వెంకుండ్రకొట్టము మొదలగువాని బరిపాలించుచున్నట్లొకశాసనమున దెలుపబడినది.

తిరుకోయిలూరునకు సమీపముననుండు కీలూరుశాసనములు మూడరాష్ట్రకూటరాజగు మూడవకృష్ణునకు లోబడిన సామంతమాండలికుడును వైదుంబుడునగు చందయ తిరువయ్యయనువాని బేర్కొనుచున్నవి. [12] ఈ శాసనములు మూడును క్రీ.శ. 960దవ సంవత్సరమునకును 964వ సంవత్సరమునకును నడుమ వ్రాయబడినవిగ నున్నవి. ఆఱువేల గ్రామములను గలిగియుండిన గంగవాడి దేశమును బాలించుచుండి నలంబరాజగు దిలీపయ్యకులోబడిన సామంతమాండలికుడుగ నుండిన వైదుంబవిక్రమాదిత్య తిరువయ్యయనువాని పేరు నుదా హరించి యితడు క్రీ.శ.961-66 ప్రాంతములనున్నవాడని రైసుగారు దెలుపుచున్నారు. ఈ విక్రమాదిత్య తిరువయ్య 950దవ సంవత్సరమున నొక చెఱువును బాగుపఱిపించి యున్నవాడు గావున నితడును కీలూరుశాసనములలో నుదాహరింపబడిన చందయతిరువయ్యయు నొక్కడేయై యుందురని యూహింపవచ్చును. విక్రమాదిత్యుడను పేరు చందయయొక్క బిరుదునామమై యుండవచ్చును. విక్రమాదిత్య తిరువయ్య తనకొడుకునకు చంద్రశేఖరుడని పేరు పెట్టియుండుటచేత దండ్రిపేరు కొడుకునకు బెట్టినట్లుగ నూహింపదగియున్నది. ఈ పైనిజెప్పిన యూహలు సరియైనవేని రాష్ట్రకూటరాజగు మూడవకృష్ణుడు తిక్కోల యుద్ధమయినతరువాత తొండైమండలములోని యొక భాగమును బరిపాలించుటకై యీ వైదుంబ విక్రమాదిత్యుని నియోగించియుండునని తలంపవచ్చును. ఇందుచేతనే మొట్టమొదట నాంధ్రకర్ణాటకదేశములలో రాజ్యపాలనము చేయుచుండిన వైదుంబులు తొండైమండలములో స్థిరపడి తరువాత నచ్చటనే చోడరాజులగు మొదటరాజరాజునకును, మొదటిరాజేంద్రునకును లోబడిన సామంతమాండలికులుగనుండి పరిపాలనము జేయు గారణమైనట్టు గన్పట్టుచున్నది.[13] మదనపల్లి, పెదతిప్పసముద్రము శాసనములలో నుదాహరింపబడిన గండత్రినేత్రుడే వైదుంబులలో స్వతంత్రుడైన కడపటివాడుగానుండెను. వానికి బిమ్మట వైదుంబులు చోడరాజగు మొదటిపరాంతకునిచే జయింపబడిరి .[14] [15] కళింగదేశమును బాలించుచుండిన గాంగవంశజుడగు మూడవ వజ్రహస్తుని పట్టమహిషియుగు వినయమహాదేవి యీవైదుంబ రాజవంశములోనిదేయని తెలియుచున్నది.[16]

నలంబరాజవంశము.

ఈనలంబులు త్రినయనపల్లవుని వంశములోని వారమనియు, ఈశ్వరవంశజులమనియు జెప్పుకొని యున్నారని వీరిచరిత్రమును గొంతపల్లవులంగూర్చి వ్రాయబడిన ప్రకరణమున దెలిసియున్నారము. వీరిరాజ్య మనగా నలంబవాడి రాజ్యము బల్లారి, కడప, కందవోలు, మైసూరు మండలములలో జేరియున్నది. వీరికి బల్లారి మండలములోని ఉత్సంగిదుర్గము రాజధానిగనుండెను.ఈ నలంబవాడి రాజ్యము క్రీ.శ. 7వశతాబ్దము మొదలుకొని 10శతాబ్దమువఱకు వర్థిల్లినది గాని యీ రాజులచరిత్రమంతయెక్కువగా దెలియరాదు. వీరు రాష్ట్రకూటులకులోబడిన సామంతులనితోచుచున్నది. ఆంధ్రచోడులకును నలంబులకును, వైదుంబులకును బూర్వము నలంబవాడ, మహారాజవాడి రేనాడు దేశములను బరిపాలించినవారి చరిత్రమును సంగ్రహముగా దెలిసికొనవలసియున్నది. ఈ మూడుభూభాగములిప్పుడు అనంతపురము, కడప,కర్నూలు, బల్లారి జిల్లాలని పిలువంబడుచున్నవి. ఈ మండలములుగల ప్రదేశమంతయును తొమ్మిదవ పదవశతాబ్దములలో నాంధ్రచోడులు, నలంబులు, వైదుంబులు బరిపాలించిరి. వీరికి బూర్వమీ ప్రదేశముల నెవ్వరెవ్వరు పాలించిరో కొంచెముగా దెలిసికొనవలసియున్నది. ఈ దేశమంతయు గ్రీస్తుశకము రెండవశతాబ్దంతమువఱకు నాంధ్రభృత్యుల పరిపాలనమునందుండెను. ఇదంతయు గర్ణాటముగనుండెను. ఈ గర్ణాటమును శాలివాహనవంశజుండును నాంధ్రుడు నగుహారితపుత్రశాతకర్ణి రాజప్రతినిధిగనుండి పరిపాలనముచేసెను. వీని శాసనములు మైసూరురాజ్యములో షిమొగ మండలములోని షికార్పూరు తాలూకాలో స్థానకుందూరుకడనున్నవి. [17] ఆంధ్రచక్రవర్తియైన గోతమిపుత్రశాతకర్ణికుమారుడయిన పులమాయి యొక్క నాణెములు మైసూరుమండలములోని చిత్రదుర్గముకడగానిపించినవి. ఆంధ్రరాజులయిన శాతకర్ణులచే జయింపబడి పరిపాలింపబడినదగుటచేతనే యీ భాగమున కంతకును గర్ణాటమనుపేరువచ్చినది. ఆంధ్రులకు దరువాత నీ [18] దేశము కదంబుల వశమయ్యెను, ఈ ప్రాచీనకదంబులు జైనమతావలంబకులు. ఉత్తరకర్ణాటములోని వనవాసిగాక ఇప్పటి బల్లారి మండలములో హర్పనహళ్లి తాలూకాలోనున్న ఉత్సంగి దుర్గమొక ప్రధానపట్టణముగానుండెను. దీనికి నాలుగుమైళ్లదూరమున మైసూరు సరిహద్దులోనున్న అనాజియను ప్రదేశమున నాలుగవశతాబ్దములోని దై కదంబులకును కాంచీపురపల్లవులకును జరిగినయుద్ధమును దెలిపెడిశాసనమొకటి గానిపించినది. [19] హిరాహడగల్గియును ప్రదేశమున శివస్కందవర్మయను పల్లవుని శాసనమొకటి గన్పట్టుటచేత నాకాలమునందతడీ ప్రదేశమును జయించి పరిపాలించెనని చెప్పదగును. ఆఱవశతాబ్దమునందు చాళుక్యులీదేశమునకు బ్రభువులయిరి. రెండవపులకేశివల్లభుని శాసనమొకటి బల్లారి మండలములోని కురుగోడు గ్రామముకడనున్నది. చాళుక్యలీప్రదేశమును జయించినపుడు కదంబులకులోబడి యీదేశములో గొంతభాగమును బరిపాలించుచుండిన నలరాజులను కీర్తివర్మ మహారాజునాశముజేసెను. తరువాత మొదటివిక్రమాదిత్యుడు అనంతపురమండలములో మడకశిరతాలూకాలో నున్న రత్నగిరి గ్రామములోని కొంతభూమి నొకబ్రాహ్మణునకు దానముచేసి శాసనము వ్రాయించెను. ఆ శాసనములో నీ ప్రదేశము నలవాడివిషయములోనిదని పేర్కొనబడియుండెను. చాళుక్యులు మొట్టమొదట జైనమతావలంబకులుగ నుండిరి. తరువాత పౌరాణిక మతమవలంబించిరి. క్రీ.శ.757 వ సంవత్సరప్రాంతమున రాష్ట్రకూటులు చాళుక్యులు సామంతులయిరి. ఈ చాళుక్యులలో నొక కొందఱు బల్లారిమండలములోని కొగలినాడు (హడగల్లి హర్పనహల్లితాలూకాలు) పాలించుచుండిరి. ఆ కాలమునందే కొంతభాగము నలంబులనియెడు పల్లవులవశమయ్యెను. దీనినే నలంబపాడియని పిలిచిరని పైనిజెప్పియుంటిమి. ఈ నలంబులు రాష్ట్రకూటులకు లోబడియుండిరి. ఆంధ్రచోడులాఱవశతాబ్దమునుండి స్వతంత్రులై పదవశతాబ్దమువఱకును బాలించిరిగాని కడపటిభాగమునందు రాష్ట్రకూటులకు లోబడిన సామంతమాండలికులుగ నున్నట్లే గన్పట్టుచున్నది. వైదుంబరాజులును గొంతకాలము రాష్ట్రకూటులకును దరువాత చోడులకును లో బడియుండిరి. బాణరాజులు గాంగపల్లవులకు లోబడియుండిరి. మైసూరులోని తలకాడు రాజధానిగ గాంగవాడి దేశమును బరిపాలనము సేయుచుండిన మారసింహుడను పశ్చిమగాంగరాజు నలంబకులమును నిర్మూలముజేసి నలంబకులాంతకుడని పేరు పొందెనట.[20] ఈ పశ్చిమ గాంగులుకూడ నాకాలమున రాష్ట్రకూటులకు లోబడినవారుగానేయుండిరి. పదవశతాబ్దాంతమునందు రాష్ట్రకూటులనుజయించి త్రైలోక్యమల్లుడనుపశ్చిమచాళుక్యుడు మరల దేశమును కైవసము జేసికొనియెను. చోడులు పశ్చిమగాంగులను జయించి వారియధికారమును నిర్మూలము జేసిరి.

తరువాత రెండుశతాబ్దములకాలము పశ్చిమచాళుక్యులకునుచోడులకువశమై యుభయపక్షముల వారికిని రణరంగభూమియై యెప్పుచుండెను.

విష్ణుకుండినవంశము.

విష్ణుకుండినులమని చెప్పుకొనిన రాజులశాసనములు రెండుమూడు మాత్రము గానంబడుచుండినవిగాని వీరియుదంతమేమో యెచ్చటినుండివచ్చినవారో యేకాలమునందున్నవారో స్పష్టముగా దెలియరాదు. పూర్వచాళుక్యులు వేంగికళింగదేశములను జయించుటకు బూర్వమీ విష్ణుకుండినులు కళింగదేశములో నేభాగముననో పరిపాలనము సేయుచుండినవారని తోచుచున్నది. ఈ విష్ణుకుండిన వంశమునకు మూలపురుషుడు మాధవవర్మయని పేర్కొనబడియెను. ఈ విష్ణుకుండిన మహారాజగు మాధ్వవర్మకును వాకటకరాణికిని జనించినవాడు విక్రమేంద్రవర్మ. వాకటకులు చేదిదేశమును(Central provinces) బరిపాలించుచుండిన యొక తెగరాజులుగనుండిరి. వీరిలో బ్రవరసేనుడు ప్రఖ్యాతుడు. విష్ణుకుండినడయిన మాధవవర్మయు బహుప్రసిద్ధిగలవాడుగ గన్పట్టుచున్నాడు. ఇతడశ్వమేధాదియాగములను మాత్రమేగాక పురుషమేధములనుగూడ జేసినట్టుగ జెప్పబడియెను. తండ్రి విష్ణుకుండినవంశములోని వాడును తల్లి వాకటక వంశములోనిదియు నగుటచేత విక్రమేంద్రవర్మ యుభయకులాభరణుడని పిలువంబడియెను. విష్ణుకుండినులలో విక్రమేంద్రవర్మ యను పేరు వహించినవారిలో నితడే మొదటివాడు. ఇంద్రవర్మయనియెడి యింద్రభట్టారకుడు వీనికొడుకు. పైజెప్పిన శాసనములలో రెండు వీనివిగానున్నవి, ఇయ్యవి విజయనగరమునకు సమీపమునందుండిన యొక పండిత కుటుంబమువారినుండి గైకొనబడినవి గనుక పరిశుద్ధమైనవిగానున్నవి. [21]

ఈ యింద్రభట్టారకుడు నిర్వక్రపరాక్రముండయిన మహాయోధుడని యభివర్ణింపబడియుండెను. విష్ణుకుండినులు సింహముద్రికయును సింహధ్వజమును గలవారుగనుండిరి. శ్రీపర్వతేశ్వరపాదారాధభక్తులమని విష్ణుకుండినులు చెప్పుకొనిరి. శ్రీపర్వతము శ్రీశైలమేయనియు, వీరలు శైవ మతావలంబకులనియును డాక్టరు కీల్ హారన్ గారు నుడువుచున్నారు. ఇంతియగాక విష్ణుకుండినుల శాసనములు వ్రాసినవారియొక్క స్వభాష తెలుగగుటంజేసియు శ్రీపర్వతేశ్వరుని పాదారాధకులమని చెప్పుకొనియుండుంజేసియు విష్ణుకుండిశబ్దము వినుకొండ శబ్దమూలమున ధ్వనించుచుండుటంజేసియు, విష్ణుకుండినులకు మొదట గుంటూరు మండలములోని వినుకొండ రాజధానిగనుండెనని తాము ధృఢముగా విశ్వసించుచున్నామని కీల్ హారన్ గారు నుడువుచున్నారుగాని యింకను విచారణీయము. ఇంద్రభట్టారకుడనియెడి యీ యింద్రవర్మ తనపరిపాలనముయొక్క 27 వ సంవత్సరమున పూ (కి) రాష్ట్రములోని పేరువాటక (పేరువాడ) మనుగ్రామమును దానముచేసియుండెను. ఈ పూ (కి) రాష్ట్రము కుబ్జవిష్ణువర్ధన మహారాజుయొక్క చీపురుపల్లి శాసనమునగూడ నుదాహరింపబడినది గనుక నిది విశాఖపట్టణమండలములోనిదిగాని యన్యముగాదు. కాబట్టి వీరిరాజ్యము మొదట విశాఖపట్టణమండలములోనిదై యుండవలయును గాని గుంటూరు మండలములోనిదిగాదు. ఇంద్రవర్మ తననివాసపురము పురణిసంగమని తెలిపియుండెను. ఇది యెక్కడిదో గుర్తింపనలవిగాకయున్నది. ఇంకను మఱొకచిక్కు గన్పట్టుచున్నది. ప్రభాకరమహారాజుకుమారుడగు పృధ్వీమూలునియొక్క గోదావరిశాసనము లో ఇంద్రభట్టారకుని పదభ్రష్టుని జేయుటకై అధిరాజేంద్రవర్మ కొందఱు రాజులను గూర్చుకొని తాను నాయకుడుగా నేర్పడి కుట్రచేయ బ్రయత్నించెనని చెప్పబడియుండెను.

కుబ్జవిష్ణువర్థన మహారాజుయొక్క ద్వితీయపుత్రుడున జయసింహవల్లభమహారాజుయొక్క తమ్ముడును నైన ఇంద్రభట్టారకుడు క్రీ.శ. 663 వసంవత్సరమున రాజ్యమునకు వచ్చి 6 మాసములు మాత్రము పరిపాలనముచేసెను. డాక్టరుప్లీటు గారు పృధ్వీమూలుని శాసనములో బేర్కొనబడిన యింద్రభట్టారకుడితడేయనియు, అధిరాజేంద్రవర్మ గంగవంశజుడై కళింగనగరము రాజధానిగా గళింగదేశము నేలిన యింద్రవర్మ మహారాజనియు, వీరికి జరిగిన యుద్ధములో ఇంద్రభట్టారకుడు మరణమునొంది యుండవచ్చుననియు, ఆకారణముచేత నతనిపరిపాలనమాఱుమాసములలోనే ముగిసిపోయినదనియు డాక్టరు ప్లీటుగారు వ్రాసియున్నారు. అట్లూహించుట కొక కారణమునుగూడ నుడివియున్నారు. ఇంద్రభట్టారకుని కుముదము సప్రతీకముపై నధిష్టించియుండిన యొకానొకయింద్రాధిరాజుచే గొట్టబడెనని చెప్పబడియుండుటజేసియు, నైరుతిదిక్కునందలి యేనుగునకు కుముదమనియు ఈ శాన్యదిక్కునందలి యేనుగునకు సుప్రతీకమనియు, నామములుండుటంజేసియు, చాళుక్యులు నైఋతిదిక్కునందలివారును, గాంగులీశాన్యదిక్కునందలివారు నగుటంజేసియు డాక్టరు ప్లీటుగారు ఇంద్రభట్టారకుడు చాళుక్యరాజనియు, అధిరాజేంద్రవర్మ కళింగనగరాధిపతియనియు గుర్తించుచున్నారు. డాక్టరు కీల్ హారన్ గారీవాదమునే గైకొనియింద్రభట్టారకుడు విష్ణుకుండినుడయిన యింద్రభట్టారకవర్మ మహారాజేయని సిద్దాంతము చేసియున్నారు. ఎందుకన విష్ణుకుండినుడయిన యింద్రభట్టారకుడు తనయేనుగులబలముచే నితరచతుర్దంతములను జయించినవాడని తనశాసనమునందు గొనియాడంబడియుండెను. ప్రాక్దిశాధిపతియగు నింద్రునియైరావతమునకు చతుర్దంతములేక చవుదంతియను నామముగలదు. సామాన్యముగానీనామమె తూర్పు దిక్కునందలి యేనుగులకన్నిటికిని వర్తించును. గనుక నీచతుర్దంతముల కధిపతియైన కళింగనగరాధీశ్వరుడయిన అధిరాజేంద్రవర్మను జయించినవాడీ విష్ణు కుండినడయినయింద్రభట్టారకుడేయని చెప్పుచున్నారు. ఇందేదిసత్యమో యేదియసత్యమో నిర్ధారణ చేయజాలకున్నారము. ఈయింద్రభట్టారకవర్మ కొడుకు విక్రమేంద్రవర్మ, ఇతడీ పేరుగలవారిలో రెండవవాడు. ఈ రెండవ విక్రమేంద్రవర్మశాసనమొకటి గోదావరిమండలములోని తునిజమిందారిలోనున్న చిక్కుళ్లయను గ్రామమునందుదొరకినది.[22] వీనిశాసనము లెందులూరు (దెందులూరు) నుండి ప్రకటింపబడినది. ఈ దెందులూరు గ్రామమిప్పటి యేలూరుపట్టణమునకు మూడు మైళ్లదూరముననున్నది. ఇది పూర్వము వేంగిపురములోని యొక భాగముగానుండెను. ఇతడును తనతండ్రివలెనె శ్రీపర్వతేశ్వరపాదారాధకుడనని చెప్పుకొనియుండెను. తనపరిపాలనము యొక్క పదవసంవత్సరమున గ్రీష్మ ఋతువులోని యెనిమిదవ పక్షమున పంచమీతిధియందు నేత్రపాటివిషయములో గృష్ణానదీతటంబున రావిరేవ గ్రామమునకు నాగ్నేయమూలనున్న రేగొండ్రగ్రామమును సోమగిరీశ్వరనాథుని దేవాలయమునకు ధారపోసెను. విక్రమేంద్రవర్మకు దెందులూరు రాజధానియని చెప్పియుండుటయు, కృష్ణానదీతటంబుననుండిన గ్రామమును దానము జేయుటయుజూడగ గోదావరికృష్ణానదులకు నడుమనుండిన వేంగిదేశమున కధిపతియని స్పష్టపడుచున్నది. చాళుక్యులు 7వశతాబ్దము మొదలుకొని యాప్రదేశమును జయించి పరిపాలించుచుండినవారని మన మెఱుంగుదుము. కాబట్టి విష్ణుకుండినులంతకు బూర్వమీదేశమును బరిపాలించుచుండిన వారయియుండకతప్పదు. అట్లు కాదేని విక్రమేంద్రవర్మ చాళుక్యులలోబడిన యొకమాండలికుడెయుండవలయును. భావిపరిశోధనముల వలనంగాని నిజము దేటపడదు.

కళింగముయొక్క పూర్వచరిత్రము.

గాంగులనుగూర్చి తెలుపుటకుముందు పూర్వచరిత్రమునుగూర్చి కొంచెము చెప్పవలయును. భరతఖండమునంగల దేశములలో నెల్లగళింగదేశము బహుపురాతన ప్రసిద్ధిగలదిగ గన్పట్టుచున్నది. బ్రాహ్మణుల వాజ్మయము నందును బౌద్ధులవాజ్మయమునందును కళింగదేశము ప్రశంసింపబడినది. రామా యణ మహాభారతములు కళింగదేశమును బేర్కొనియున్నవి. పాణిని తనవ్యాకరణ సూత్రములయందు గళింగము నుదాహరించియున్నాడు. రఘువంశాదికావ్యాములలో గళింగ మభివర్ణింపబడినది. కళింగాంధ్రములు రెండును నేడు గలిసియున్నను పురాతనకాలమున వేఱ్వేఱుగనుండినవి. అయిన నన్యోన్యమైత్రియు అన్యోన్యసంబంధ బాంధవ్యములను గలిగి సఱలుచుండినవి(?). దక్షిణాపథమునకువచ్చుటకు ముందార్యులీదేశమునకు వచ్చియుండిరి కాని యాకళింగార్యులను భ్రష్టులనుగా భావించియుండిరి. కళింగదేశము బుద్ధునికాలమునందే బుద్ధధర్మమును స్వీకరించి బుద్ధునికడుగులు మడుగులొగ్గుచుండినట్లుగ గన్పట్టుచున్నది. ఆర్యులాంధ్ర ద్రావిడమహారాష్ట్ర దేశములవలెనె కళింగదేశమును భ్రష్టమైనదిగాను మ్లేచ్ఛదేశముగాను భావించుచుండిరి. సుప్రసిద్ధమైన మహేంద్రపర్వత మీదేశముననున్నది. ఈ దేశము దంతావళములకు బ్రసిద్ధికెక్కియున్నది. పూర్వకాలంబున కళింగదేశము ప్రసిద్ధములయిన రేవుపట్టణమును గలిగి యుండుటచేత దీనికిని విదేశములకును వర్తకవ్యాపారములు విరివిగా జరుగుచుండెను. కళింగరాజులకును సింహళరాజులకును సంబంధ బాంధవ్యములు నన్యోన్యమైత్రియుగలవని బౌద్ధులచరిత్రములు వేనోళ్లఘోషించుచున్నవి. కాబట్టి కళింగదేశము యొక్క ప్రాచీనస్థితి ప్రఖ్యాతమైనదనుటకు సందియములేదు.

అడవియేనుగులను మచ్చికచేసికొనుటయందును తత్వశాస్త్రపఠనమునందును కాళింగులు బహునిపుణులనియును నాగరికులనియును క్రీ.పూ.302 వ సంవత్సరప్రాంతమున మౌర్యచక్రవర్తియగు చంద్రగుప్తుని యాస్థానమందుండిన మేగస్తానీసను యవనరాయబారి వ్రాసియున్నాడు మఱియు నఱువదివేల కాల్బలమును, ఒక వేయి యాశ్వికబలమును ఏనూఱులు దంతావళములు రాజనకు రక్షకసైన్యముగ నుండెననియుంజెప్పియున్నాడు. క్రీ.పూ.260 దవసంవత్సరమున చంద్రగుప్తుని మనుమడగు అశోకవర్థనమహాచక్రవర్తి కళింగదేశముపై దండెత్తివచ్చి కళింగమునుజయించెను. కాళింగులు వెనుదీయక మహాపౌరుషముతో నెదుర్కొని వానితో యుద్ధముజేసి లక్షలకొలది రణభూమి కి బ్రాణములర్పించుకొనిరి. లక్షలకొలది కాళింగులు మాగధులచేబట్టువడి క్రూరసంహారమునంతయు గన్నులారజూచిన యీమహాచక్రవర్తి తరువాత తలపోసికొని నిరపరాధులను నాగరికులనయిన సాధుజనులకు నిష్కారణముగా విపత్తు ఘటింపజేసితినిగదాయని పశ్చాతప్తుడై మిక్కిలి దుఃఖించి "అహింసాపరమోధర్మ" మను బుద్ధుని వాక్యమును జ్ఞప్తికిదెచ్చుకొని యా బుద్ధధర్మము నవలంబించి బౌద్ధుడై తరువాత బౌద్ధమతమును ప్రపంచమునందంతట బ్రకటింపజేసెను. క్రీస్తునకు బూర్వము రెండవశతాబ్దమధ్యమున ఖారవేలుడను కళింగరాజు శాతకర్ణియను నాంధ్రరాజుతోడ్పాటుతో మగధరాజగు పుష్యమిత్రుని నోడించి యుత్కలములోని ఖండగిరియందు శాసనమువ్రాయించెను. ప్లీని మొదలగు చరిత్రకారులుగూడ కళింగమును బ్రశంసించియున్నారు. తరువాత నీకళింగమాంధ్రచక్రవర్తుల రాజ్యమునకు వశమయ్యెను. ఆంధ్రులకు బిమ్మట పల్లవుల పాలబడియెని తోచుచున్నది. క్రీస్తుశకము నాలుగవశతాబ్దమధ్యమున గుప్తచక్రవర్తియగు సముద్రగుప్తుడు కళింగముపై దండెత్తి వచ్చినపుడు కళింగము పెక్కుభాగములుగ విడిపోయి పెక్కండ్రురాజులచే బాలింపబడుచుండెను. కొత్తూరుదుర్గమును స్వామిదత్తుడును ఈరందపళ్లను (ఈ రధవిషయము) దమనుండును బాలించుచుండిరి. (ఇవి రెండును గంజాముజిల్లాలోనివి.) దేవరాష్ట్రమును కుబేరుడును అవముక్తసీమను నీలరాజును బాలించుచుండిరి. (ఇవిరెండును విశాఖపట్టణమండలములోనివి.) షిష్టపురము మహేంద్రవర్మ పరిపాలించుచండెను. (ఇది గోదావరిమండలములోనిది) కాబట్టి యివన్నియును గళింగములోనివి. మఱియును బల్లవులలో చండవర్మ నందప్రభంజనవర్మయను రాజులీ కళింగదేశమును బాలించిరని పల్లవులనుగూర్చిన ప్రకరణమునం దెలిపియుంటిమి. ఏడవశతాబ్దమున గళింగము గాంగులవశమయ్యెనని గన్పట్టుచున్నది. అయినను పుళిందులీదేశమును గొంతకాలము బాలించినట్లు గాన్పించుచున్నది.

పుళిందులపాలనము.

మాధవవర్మ.

కళింగదేశనివాసియగు పుళిందసేనుడనువాడు బహుపరాక్రమ వంతు డయ్యును స్వప్రయోజనపరుడుగాక దేశమును బాలించుటకుం దగినప్రభువునను గ్రహింపుమని బ్రహ్మను గూర్చి తపస్సుచేసెను. బ్రహ్మ వాని తపస్సునకు మెచ్చి శైలోద్భవుని బుట్టించెను. ఇతడు శైలములోనుండి పుట్టినవాడు గనుక వీనికి శైలోద్భవుడని పేరు పెట్టెను. ఈశైలోద్భవుడు కళింగము బాలించెను. వీనికి రణభీతుడు పుట్టెను. రణభీతునకు సైన్యభీతుడు పుట్టెను. సైన్యభీతునకు మాధవవర్మ జనించెను. ఈ రాజేంద్ర మాధవేంద్రుడు శివభక్తుడు, ఇతడు హరితగోత్రుడును తైత్తరీయశాఖా బ్రాహ్మణుడును వామనభట్టుమనుమడును ఆదిత్యదేవుని కుమారుడునగు భట్టవామనునకు గుడ్డవిషయములోని వ్యూపినగ్రామమును సూర్యగ్రహణసమయమున దానము చేసెను. ఈ మాధవవర్మ నివాసము కయింగోడయనునది. కుండభోగికుమారుడగు ఉపేంద్రసింహునిచే నీశాసనము వ్రాయబడినది. మాధవవర్మ యేకాలమునందలివాడోవీనియుదంతమేమో యింతకన్న మనకేమియును దెలియరాకయున్నది.

హౌనుత్సాంగు.

ఏడవశతాబ్దమధ్యమునందు హౌనుత్సాంగు కళింగమును జూడవచ్చి యప్పటదేశస్థితి యిట్లు దెలిపియున్నాడు.

ప్రాచీనకళింగము యొక్క రాజధాని నగరము 5మైళ్ల వైశాల్యముగలిగియున్నది. భూమి సారవంతమై క్రమముగా వ్యవసాయము చేయబడుచున్నది గాని యేనుగులతో గూడిన యడవులనేకములుగలవు. జనులు మోటుగనగారికులుగ నుండి భయంకరముగనున్నను మాట దప్పనివారుగను విశ్వాసపాత్రులుగనుండిరి. పూర్వకాలమునందు కళింగ మొండొరుల బుజములు రాపాడునంతటి జనసమ్మర్ధము గలిగి యుండెను. అప్పటికి గళింగదేశముయొక్క పూర్వవైభవమంతయుబోయినది.

కళింగగాంగవంశము.

ఏడవశతాబ్దమునందే కళింగదేశము గాంగులవశమయ్యెను. బ్రహ్మయెక్క నాల్గవతరము వానికి గంగాదేవి యనుగ్రహించినందున నొక్కకుమారుడు గలిగెను. వాని సంతతివారు గాంగులయిరి. వీరు మొదట మైసూరు రాజ్యములోని తలకాడు రాజధానిగ గంగవాడి దేశమును బాలించుచుండిరి. తరువాత వారిలో నొకశాఖ వారు కళింగదేశమునకు వచ్చిన మహేంద్రగిరిని జయించి యీ దేశము నాక్రమించుకొని పరిపాలింపసాగిరి. ఈకాలమునందే దక్షిణ కళింగమును కుబ్జవిష్ణువర్ధనుడు జయించెను. తరువాత నాభాగము పూర్వచా‌ళుక్యులచే బరిపాలింపబడుచుండెనని విశాఖపట్టణమండలములోని చాళుక్యుల శాసనములే వేనోళ్లఘోషించుచున్నవి. కనుక గాంగులు కళింగదేశముయొక్క యుత్తరభాగమును మాత్రమే పరిపాలింపుచుండిరి. అన్యోన్యసంబంధమేమియు గానరాకయుండిన మొదటి గాంగులయొక్క నామములును వారి దానశాసనములను గంజాము, విశాఖపట్టణ మండలములో బెక్కుతావుల గానంబడుచున్నవి. ఇంద్రవర్మ, దేవేంద్రవర్మ, అనంతవర్మ, గుణార్ధవర్మ మొదలగు వారి శాసనములనేకములు గానంబడుచున్నవి. వీరలు మహేంద్రగిరిపైనుండు గోకర్ణస్వామి పాదారాధకులుగనుండిరి.

కళింగనగరము.

కళింగనగరము వీరికి రాజధానీనగరముగనుండెను. కొందఱు తలంచునట్లు గంజాము మండలములో సముద్రతీరమునందుండిన కళింగపట్టణము కళింగ నగరముగాదు. ఈ కళింగనగరము పర్లాకిమిడికి నిరువది మైళ్లదూరమున వంశధారయొడ్డుననున్నది. అదియిప్పుడు ముఖలింగమను పుణ్యక్షేత్రముగానున్నది. ఇక్కడ మధుకేశ్వరాలయము, అణ్యాంక భీమేశ్వరాలయము, సోమేశ్వరాలయములను మూడు ప్రసిద్ధములయిన శివాలయములున్నవి. ఈశివాలయములను గాంగులయొక్క శాసనములనేకములుగలవు. ఈ క్షేత్రమునకు దక్షిణమున రెండు మైళ్లదూరమున నగరికటకమను గ్రామముగలదు. ఈ గ్రామములనడుమశాసనలంగలిగియుండిన ఱాతిపలక లనేకములుగలవు. శిథిలమయిపోయిన పురాతనభవనములయొక్క చిహ్నములిప్పటికిని గానంబడుచున్నవి. అచ్చటి శివాలయములలోని శాసనములలో నాపట్టణము కళింగనగరమనియె పేర్కొనంబడియున్నది.

వీరసింహ గాంగుని వంశము.

గంగవాడిదేశమును బాలించు వీరసింహుని కొడుకు కామార్ణవుడను వాడు గంగవాడి దేశమును తన పినతండ్రికె విడిచిపెట్టి ఏడవశతాబ్ద ప్రారంభమున దనసోదరులతో భూమిని జయించుటకై బయలుదేరి మహేంద్రగిరికి వచ్చి యచ్చటి గోకర్ణస్వామిని గొల్చి వాని యనుగ్రహముచే రాజచిహ్నములనన్నిటినిబడసి పర్వతముదిగి యుధిష్టరునిం బోలె దన నల్వురు తమ్ములతోడను కళింగమును బాలించు బలాదిత్యుని పైదాడి వెడలి వానినోడించి కళింగము నాక్రమించుకొని తనతరువాత పెద్ద తమ్ముడు పట్టాభిషిక్తుడు గావలయునని నిశ్చయించి మూడవతమ్ముడయిన గుణార్ణవునకు అంబవాడివిషయమును నాలుగవవాడయిన మారసింహునకు చోడమండలమును కడపటివాడయిన వజ్రహస్తునకు కంటకవర్తనిదేశము నొసంగి తనమెడలోని హారమును దానార్ణవుని కంఠము నలంకరించెను. ఇందు బేర్కొనబడిన విషయములన్నియు గంజాము మండలములోనివే అంబవల్లి(అంబవాడి) (చోడ) గ్రామము లిప్పటికిని పర్లాకిమిడి జమిందారిలోనున్నవి గనుక అంబవాడి విషయమును, చోడమండలము నచ్చటివేయని చెప్పవచ్చును. కామార్ణవుడు 35 సంవత్సరములు పరిపాలనము చేసినతరువాత దానార్ణవుడు నలువది సంవత్సరములును వాని కొడుకు కామార్ణవుడు 50 సంవత్సరములను వానికొడుకు వజ్రహస్తుడు 15 సంవత్సరములను, వాని సోదరుడు కామార్ణవుడు19 సంవత్సరములను, వానికొడుకు రణార్ణవుడు 5 సంవత్సరములను, వానికొడుకు వజ్రహస్తుడు 15 సంవత్సరములను, వాని సోదరుడు కామార్ణవుడు 19 సంవత్సరములను, వానికొడుకు గుణార్ణవుడు 27సంవత్సరములును, వానికొడుకు బితాంకుశుడు 15 సంవత్సరములను, వానితమ్ముడు కవిగాలాంకుశుడు 12 సంవత్సరములను, వాని తమ్ముడు గుండమరాజు 7 సంవత్సరములను, వాని తమ్ముడు కామార్ణవుడు 25 సంవత్సరములను, వానికొడుకు వజ్రహస్తుడు 35 సంవత్సరములును, వానికొడుకు మధుకామార్ణవుడు తనయన్నలయిన కామార్ణవగుండమరాజులు 5 సంవత్సరములు పాలించిన తరువాత19సంవత్సరములును, వానికొడుకు [23] వజ్రహస్తు డు క్రీ.శ 1038వసంవత్సరము మే నెల మూడవతేదీని పట్టాభిషిక్తుడై 1070-1071 వ సంవత్సరము వరకు పరిపాలనము చేసెను.పర్లాకిమిడి, నడగాము మొదలగు ప్రదేశములందు వీనిదానశాసనములనేకములు గానుపించినవి. వీనితరువాత రాజరాజనువాడు 1070-1071న వచ్చి 8 సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసెను. ఇతడు రాజరాజనరేంద్రుని మనుమరాలును, కులోత్తుంగచోడ దేవుని కూతురునునగు రాజసుందరిని వివాహమాడెను, ఈ రాజరాజునకు రాజసుందరికి జనించినవాడె అనంతవర్మ చోడగంగదే‌వుడు. ఇతడు 1078వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి 72 సంవత్సరములనగా 1151వ సంవత్సరమువరకు బరిపాలన చేసెను. గాంగుల పరిపాలనము వీనికాలమున మహోన్నత దశకు వచ్చెను. ఇతడు తనరాజ్యమును గంగానదివరకు వ్యాపింపజేసెను. గంగానది మొదలుకొని గోదావరినది వరకు గల దేశములో జరిగిన యుద్ధములలో నెల్లను విజయముగాంచుచువచ్చెను. వీని శాసనములనేకములు గంజాము, విశాఖపట్టణమండలములలో గాన్పించుచున్నవి. పూరిపట్టణములోని ప్రసిద్ధమైన జగన్నాధస్వామి యాలయము నితడే గట్టించెనని చెప్పుచున్నారు. వీనితరువాతి వారంత ప్రసిద్ధికివచ్చినవారు కారు. వారితరులకు సామంతులై యుండిరి. వారి చరిత్రము రెండవభాగమున సందర్భము కలిగిన తావున దెలుపబడును. వీరచరిత్రము విశేషపరిశోధనము జేయవలసి యున్నదిగావున నెక్కువగ వ్రాయసాహసింప జాలకపోతిమి.

  1. No519, Public 18th July 1905 (Rehort on Epiguply)
  2. 1.Ep. lnd- vol VI.p. 123 note.
  3. Vol Vii, Introduction,p. 7
  4. No. 678, 679, Public 12th August 1904
  5. South Indian Inscriptions, Vol III, no 43
  6. Ind Ant Vol XV.p. 175
  7. Ep. lnd. Vol VI p. 59
  8. Annual Report on Epigraphy for 1900-01, para. 11
  9. Annual South Indian Inscriptions Vol. Report II, pp. 387, 388
  10. Annual Report on Epigraphy for 1899-00 paragraph 85.
  11. Ep. Car. Vol. X- introduction p.XXII
  12. Annual Report; on Epigraphy for1904-05, para 28.
  13. Ep.car. vol intro. p. XX.
  14. South Indian Inscriptions vol. III. pp. 104. 107.
  15. Ibid, vol II. p379.
  16. Ind. Ant. vol XVIII. pp. 164 and 175 and Ep. bidIV. p. 186.
  17. ఈ చరిత్రములోని 225 దవపొరట చూడుడు.
  18. Mysore,II. 428; Mysore. II.51
  19. Mysore. I of 499.
  20. Mysore, I, 307.
  21. ఇయ్యవి బ్రహ్మశ్రీ గురుజాడ అప్పారావు పంతులుగారివలన సంగ్రహింపబడి దొరదినమువారి పరిశోధనాధికారికి బంపబడినవి,
    Annnul Report on Epigraphy 1909 para 62
  22. Ep. Ind vol. IV. pp. 193, 194,195.
  23. lnd.ant. vol XIII. p 170