ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఐదవ ప్రకరణము

ఐదవ ప్రకరణము.

నాగులు-నాగకులులు.

ప్రాథమికా ర్యులు సింధునదిని దాటి వచ్చి యామహానదికి దూర్పుపక్కను సరస్వతీ దృషద్వతీ నదులకు మధ్యను స్థిరవాసములేర్పరచుకొనిన తరువాత వేయేండ్లకు బిమ్మట నార్యులలో మరియొక శాఖవారు. బయలుదేరి గంగాతీరముకు వచ్చి, కురుపాంచాల దేశములందు వసించియుండిన కాలమున, హిమాలయ పర్వతము మొదలుకొని వింధ్యపర్వతము వరకును గలదేశము నంతను నాగులనియెడి యొకజాతి వారు పరిపాలనము చేయుచుండినవారని మనకావ్యపురాణేతిహాస గ్రంధముల వలనను, బౌద్ధమతస్థుల గ్రంధములవలనను గానంబడుచున్నది గాని, మనదేశచరిత్రములను వ్రాసిన పాశ్చాత్యులేమి, హైందవ చరిత్రకారులేమి తామువ్రాసినగ్రంధములయందు నీ నాగుల చరిత్రమును విశదీకరింపక యేమి కారణముచేతనో విస్మరించియున్నవారు. నాచుచేగప్పబడిన శుద్ధజలమువలెనే వీరి చరిత్రమంతయు బురాణగాథలచే గప్పబడి చరిత్రకారుల నేత్రములగు గోచరముగాకయుండెను. ప్రాధమికార్యులు దస్యులతో బోరాడినట్లుగ ౠగ్వేదా దులయందు దరచుగా గానబడుచుండినను తరువాత వచ్చినయార్యులు లీనాగులతోడను నాగకులులతోడను బోరాడినట్లుగ మహాభారతాది గ్రంధములయందు గానంబడుచున్నది. ఆంధ్రులు దండకారణ్యమునం దాంధ్ర రాజ్యమును స్థాపించి పరిపాలనము చేసి వాసికెక్కుటకు బూర్వమీనాగులీ దండకారణ్యమునాక్రమించి కిరాతజాతులవలనన్నిటిని జయించి రాజ్యమును స్థాపించి పరిపాలనము చేసినట్లుగా గాన్పించుచున్నది. మన పురాణములయం దభివర్ణింపంబడిన నాగలోకమనునది యీ నాగులదేశమెగాని పాతాళముగాదు. మన పురాణ గాథలలో నభివర్ణింపబడిన నాగకన్య లీనాగజాతి కన్యలేగాని యన్యులుకారు. నగమనగా గొండ. నాగమ నగా బాము. నగములో నుండి పుట్టినది నాగము. ఈ నాగులనియెడి జాతి వారు నాగములను పూజించువారగుట చేతనో నాగమును ధ్వజమునందుంచెడు నాగధ్వజులగుట చేతనో, లేక నగములయందు సంచరించెడు జాతి వారగుట చేతనో, మరియేమి కారణముచేతనో యీజాతివారికి నాగులనియెడు పేరు వచ్చినది. మన పూర్వగ్రంధము లీనాగులకథలతో నిండియున్నవి. ఈ నాగుల యనార్యాచారములనే పెక్కింటినిప్పటికిని మనవా రవలంబించి యె యున్నారు. ఈనాగులు పాములను బూజించువారగుటచేతనే నేటికిని మన వారు పాములను బూచించుచున్నారు. ఈ నాగులు వృక్షములను బూజించు వారు కనుకనే మనవారు నేటికినీ వృక్షములను పూజించుచున్నారు. పూర్వకాలము నందీదేశము నాగులకు లోబడి నాగులచే పరిపాలించబడి నాగసంప్రదాయలనే యవలంబించి నాగుల అనార్యాచారములలో మునిగి యుండినదగుట చేతనే కాబోలు మనదేశమునం దెచ్చట విన్నను నాగశబ్ధమే వినంబడుచున్నది. మనదేశమునందు నాగూరు, నాగవరము, నాగపురము, నాగపట్టణము, నాగేశ్వరము, నాగులపాడు, నాగమూడి, నాగరము, మొదలగు గ్రామనామములు వినంబడుచున్నవి. ఇంతియగాక నాగి, నాగడు, నాగులు, నాగయ్య, నాగన్న, నాగప్ప, నాగిరెడ్డి, నాగినీడు, నాగరాజు, నాగవర్మ, నాగలింగము, నాగరత్నము, నాగోజీరావు, నాగేశ్వరరావు అను నామములు మనుష్యులలో వినబడుచున్నవి. మరియును మనదేశమునందు నాగములను బూజించుటకు కార్తిక శుద్ధ చవితి "నాగులచవితి" యను పేరుతో బర్వదినముగా నొప్పుచున్నది. ఈ పర్వదినము బ్రాహ్మణులకంటెను బ్రాహ్మణేతరులచే మిక్కిలి భక్తి పూర్వకముగా బూజింపబడుచున్నది. పూర్వకాలమునందలి అనార్యులీ నాగములగొల్చెడి నాగులను సాధారణముగా గౌరవముతో జూచెడివారుగారు. ఆకారణముచేతనే గాబోలు నెవ్వడైనను ఒకానొకప్పుడేదియైన నొక తెలివి తక్కువ పని చేసినప్పుడు గాని హానికరమైన పని చేసినప్పుడు గాని మనవారు "ఓరినాగులూ, ఓసి నాగమ్మ" యని నిందాగర్భముగం బలుకు చుండుటను నేడును మనము చూచుచున్నాము. మనదేశమునందు కార్తికకు ద్ధచతుర్థి (నాగులచవితి) వలెనె మహారాష్ట్రాది దేశములందు నాగపంచమియను పేరను కార్తీకశుద్ధపంచమి పర్వదినముగా బరిగణింపబడుచున్నది. దీనినంతయును బరికించిచూడగా నీయాచారములన్నియు నాగులనుబట్టి మనకు సంక్రమించినవిగాని యివి నిజముగా నార్యాచారములుగావు. ఈ యనార్యాచారములు విశేషముగా దక్షిణాపథమునందే గానంబడుచున్నవిగాని యుత్తర హిందూస్థానమునందు గానంబడకుండుటకు గారణము దక్షిణాపథవాసులు సంపూర్ణముగా నార్యాచారములకుదలయొగ్గి వానిలో మునింగిపోయిన వారు గాకుండుటయె గాని వేఱొండుగారణము గానరాదని చెప్పవచ్చును.

నాగోత్పత్తి కథనము.

మహాభారతమునందు నుపోద్ఘాతము ముగింపబడిన వెనుక నీనాగులచరిత్ర మొదట చెప్పబడినది. కశ్యపుడను నార్యునకు కద్రువ, వినతయను నిరువురు భార్యలుగలరు. వీరిరువును తోబుట్టువులు. వీరికింగల యభిమతంబుల చొప్పున గద్రువకు సహస్రనాగములు జనించినవి. వినతకు గరుడుండు జనించెను. కద్రువకు జనించిన సహస్రనాగములకు బుట్టిన సంతతియే లోకమునందలి నాగకులముగానున్నది. ఈ నాగులలో బ్రముఖముగా నుండినవారు శేషుడు, వాసుకి, ఇరావంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, ఐలుడు, ఇలాపాత్రుడు, నీలుడు, అనీలుడు, నహుషుడు మొదలగువారు. (అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు వీరినే అష్టనాగములని మన గ్రంథములు పేర్కొనుచున్నవి.) కద్రువ వినతకు జేసిన యపకారమునుబట్టి వినతకు బుట్టిన గరుత్మంతుడు నాగకులమునకెల్లను వైరియయ్యెను. 'దీనికిదోడు మాతృశాపముగూడ నాగులకు సంభవించెను. ఈ నాగులచరిత్రము మహాభారతమునందు నివురుగప్పిన నిప్పువలెనున్నది. గులకఱాళ్ళలో మాటుపడియుండిన రత్నమువలె బ్రకాశింపకయున్నది. ఈ గులకరాళ్ళను దొలగించిన నాగులచరిత్రమనియెడి రత్నము శోభింపకమానదు. ఈ నివురును దొలగించిన నాగులచరిత్రమనియెడి నిప్పు తేజోవంతముగ గన్పట్టక మానదు. ప్రాథమికార్యులు సూర్యకులులును బరిశుద్ధులునై యుండిరి. వీరి తరువాత వేయేండ్లకు వచ్చినవారు చంద్రకులులు. వీరు సూర్యకులులవలె నంతగా బరిశుద్ధులుగారు. అన్యజాతిరక్త మీచంద్రకులుల నాడులయందు బ్రవహింపుచుండెను. ఈ రెండవతెగవారు పాంచాలముగుండపోయి గంగా యమునాదులకు నడుమనుండెడి హస్తినాపురమునందు వసించియుండిరి. వీరలే భారతవీరులనిపించుకొనిన యుధిష్ఠిరాదులుగా నుండిరి. వీరు క్రీస్తుశకమునకు బూర్వము పదమూడవ శతాబ్ద ప్రాంతమున హస్తినాపురము నందుండిరి. అచ్చటనున్న కాలమున వీరి కుటుంబము వృద్ధియై హస్తినాపురము చాలక మఱియొక పురము కావలసివచ్చెను.

ఖాండవవన దహనము.

ఇప్పుడు ఢిల్లీ నగరముండిన ప్రదేశ మాకాలమున ఖాండవవనముగానుండి నాగులచే నాక్రమింపబడియుండెను. వారలను జయించిన గాని వనము స్వాధీనముగాదు. అయ్యది స్వాధీనమైన వెనుకగాని యరణ్యమును ఛేదించి పురమును గట్టుట సాధ్యముగాదు. అప్పుడర్జునుడు కృష్ణుని సహాయముతో ఖాండవవనమును దహించి నాగులం దఱిమివేసెను. బౌద్ధుల దేవతయగు నింద్రుడు నాగులను సంరక్షించెను. ఆర్యుల వైదిక దేవుడగు నగ్ని వనమునంతయును దహించి నాగరాజయిన తక్షకుని దక్క తక్కిన నాగకులమును నిర్మూలము చేసెనని చెప్పబడియెను. ఈ ప్రదేశమునందే పాండవులు ఇంద్రప్రస్థమను పురమును నిర్మించిరి.

అర్జునుడు నాగకన్యల వివాహమాడుట.

ఈ ఖాండవవన దహనానంతరము నార్యులకును నాగులకును మైత్రికలిగి యున్నటులనే చెప్పబడియెను. అర్జునుడు సమయ భంగ కారణమున దీర్థయాత్రకు బయలువెడలినప్పుడు నాగకన్యయగు నులూపిని వివాహమాడినట్లుగ జెప్పబడియుండెను, మఱియు మణిపురాధీశ్వరుండును నాగరాజును నగు చిత్రవాహనునియొక్క కూతురు చిత్రాంగదయను నామెనుగూడ వివాహమైనట్టుగ జెప్పబడినది. అర్జునుని వలన నులూపికి జనించిన వాడు ఇరావంతుడను పేరుగలవాడు. ఇతడు భారతయుద్ధములో జనిపోయెను. అర్జునుని వలన జిత్రాంగదకు జనించినవాడు బబ్రువాహనుడను పేరుగలవాడు. ఇతడు బహు పరాక్రమవంతుడై భారత యుద్ధానంతరము ధర్మజుడు చేయబూనిన యశ్వమేధ యాగమును నిర్విఘ్నముగా నెఱవేర్ప బూని యర్జునుడు సవనాశ్వముతో బబ్రువాహనుని దేశమునకు వచ్చినప్పుడా సవనాశ్వమును బట్టుకుని తండ్రితో నత్యద్భుతముగ బోరి యోడించెను గాని తరువాత నులూపి మొదలగు వారిచే బ్రబోధితుడై యర్జుననుకు సహాయము చేసెను. ఈ కథలను బట్టి కొంతకాలము వఱకు నార్యులును నాగులును స్నేహభావముతోనే గడుపుచుండిరని తేటపడుచున్నది. పాండవులకు దరువాత సింహాసనమునకు వచ్చిన పరిక్షిత్తుకాలమున నార్యులకు నాగులకు వైరము పొసంగినది. అందులకు కారణమీ క్రింది విషయముగ గన్పట్టుచున్నది.

పరీక్షిత్తు తక్షకునిచే చంపబడుట.

అర్జునుని మనుమడైన పరీక్షిన్నరేంద్రుడు రాజ్యపాలనము చేయుకాలమునందొకనాడు మృగయావినోదార్థము నరణ్యమునకుంజని యా ఖేటఖేలనమున నలసి వచ్చుచుండగా మార్గమధ్యమున నొక్క ఋషి తపస్సు చేసికొనుచు నడిగినప్పుడు దాహమునైన దీర్పక మాటాడకపోవుటయె గాక కన్నులనైన దెఱచి చూడకపోయెను. అంతట నా రాజకుంజరు డాగ్రహించి యొక నాగమునుజంపి వాని మెడపై వైచిపోయెను. తరువాత నా సంయమివరేణ్యుని కుమారుడీ వృత్తాంతమునంతయు దెలిసికొని సర్పద్రష్టుడై చనిపోవునుగాక యని యారాజును శపించి వానిని జంప నాగరాజయున తక్షకుని బ్రేరేపించెను. ఆ శాపకారణమున నేడవనాడే తక్షకునిచే గఱవబడి పరీక్షిత్తు మృతినొందెనని చెప్పబడియెను. నాగరాజయిన తక్షకుడు తక్షశిలానగరమున కధిపతిగ నుండెనని గ్రంథములయందు బేర్కొనబడుచు వచ్చెను.

జనమేజయుడు సర్పయాగము చేయుట.

తక్షకుడు తన తండ్రిని జంపినందున కాగ్రహోదగ్రుడై జనమేజయ మహారాజు నాగకులమునంతయు సంహరించుటకై యార్యఋషులనందఱిని బ్రేరేపించి సర్పయాగమును జేయసమకట్టెను. ఆ మహాయాగమునందు నాగులనేకులు పశువులుగ బట్టుకొనబడి సంహరింపబడిరి. నాగకులమంతయు నిర్మూలమగు కాలము వచ్చెను. అప్పుడు వాసుకి తోబుట్టువు కొడుకగు అస్తికుడను బ్రాహ్మణుని మూలమున తక్షకుడు మరణింపక జీవింపగలిగెను. ఈ యస్తికుడు నాగకులుడయినను అనార్యాచారములను వదలిపెట్టి యార్యాచారములనవలంబించి యార్యుడైనవాడు. ఇట్లే నాగకులు లనేకు లార్యాచారము నవలంబించి యార్యులలో గలిసిపోయెదమని వాగ్దత్తము చేయుటచేతనైన నేమి మఱియేమి కారణముచేతనైననేమి యా సర్పయాగము నిలిచిపోయినది. నాడు మొదలుకొని మరల నాలుగు శతాబ్దముల కనగా క్రీస్తు శకమునకు బూర్వము 691వ సంవత్సరము వరకు వీరల చరిత్రము వినరాక యుండెను. అప్పటికి నాగవంశజులయిన రాజులు మగధరాజ్యాధిపత్యమును వహించిరి. ఈ నాగవంశమె శిశునాగవంశమను పేరుతో మాగధమును బాలించినట్లు చరిత్రము లుద్ఘోషించుచున్నవి. ఈ శిశునాగవంశములో నాఱవవాడైన యజాతశత్రుని కాలముననే బుద్ధుడు జనించి యనార్యజాతుల కన్నిటికి బురోవృద్ధి కారకుడయ్యెను.

శిశునాగవంశము.

శిశునాగుడనువాడే శిశునాగవంశమునకు మూలపురుషుడు. ఈ శిశునాగుని జన్మమును గూర్చి బౌద్ధు లొక వింతకథను గల్పించియున్నారు. లిచ్ఛవి రాజులయొక్క యుంపుడుకత్తెలలో నొక్కతె యొక్క శిశువును గాంచెను. ఆ శిశువు స్వరూపమేర్పడక పూర్వమె ప్రసవించుటచేత నమ్మాంస పిండమునొక తట్టలో నుంచబడి రాత్రివేళ నొక పేడకుప్పలో వేయబడెనట. నగర పాలకుడయిన యొక నాగరాజు దానింగనిపెట్టి చుట్టును జుట్టుకొని తన పడగతో బొదుగుచుండెను. దానిని ప్రజలు చూచి చుట్టును మూగికొని "స్సు స్సు" యని చప్పట్లు చఱచి కేకలు వేయగా నాగరాజదృశ్యుడయ్యెను. అంతట వారలాతట్టను బరీక్షింపగా నొక పురుష శిశువుండెనట! ఆ కారణమున నాతడు శిశునాగుడని పేరుపెట్టబడెయనట! కొంతకాలమున కాతడు మగధ సింహాసనమధిష్ఠించెను! ఈ వంశమునందు గడపటి వారయిన తొమ్మండుగురు నందులతోగూడ చంద్రగుప్తుడు సింహాసనము బాలించిన రాజులెల్లరును నాగులే కాని యార్య క్షత్రియులు కారు. వీరందఱును సర్పములను బూజించెడి వారులుగాని యార్యమతస్థులు గారు. ఆ కారణముచేత బ్రాహ్మణులయిన యార్యులు వీరిపట్ల ప్రబల ద్వేషము గలిగియుండిరి. బౌద్ధమతస్థులు వీరిని ప్రేమింపకుండిరి. వీరుభయులచేతను గూడ గౌరవింపబడక నీచముగా జూడబడుచుండిరి.

మఱికొన్ని గాథలు.

సుగ్రీవుడు సీతను వెదకుటకై వానరులను బంపుచు భోగవతీపురమును వర్ణించెను. ఈ భోగవతీపురమును దక్షిణాపథమునందున్నది. అనగా దండకారణ్యములో తూర్పు భాగముననో పశ్చిమభాగముననో యుండియుండును. శ్రీకృష్ణుడు కాళీయుడను నాగరాజును మర్ధించి కాళిందీకన్యల వివాహమాడినట్లుగా విష్ణుపురాణాదుల వలన గవ్వముగను వాసుకుని త్రాడుగ జేసికొని క్షీరసాగరమును మధించినట్లుగా భాగవతాది పురాణములయందు జెప్పబడినది. దేవతలు దానవులను మోసముచేసి వాసుకియను నాగరాజుయొక్క సహాయముతో దేశమునో దుర్గమునో యొకదాని బడసి యుందురని [1] యూహింపవచ్చును. ఇట్లు నాగులను గూర్చిన లెక్కలేని గాథలు మన పురాణ గ్రంథములయందు వెదజల్లబడియున్నవి. ఒక్క పురాణాది పూర్వగ్రంథములయందు మాత్రమేగాక ఇటీవలి చారిత్రములయందును కావ్యాదులయందును గూడ నాగులయొక్కయు నాగరాజులయొక్కయు జరిత్రములభివర్ణింపబడియున్నవి.

చరిత్రాంశములు.

క్రీస్తు శకము నాలుగవ శతాబ్దమధ్యమున సముద్రగుప్తుడను గుప్తచక్రవర్తి దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలుదేఱి గణపతి నాగడను నొక నాగరాజును జయించినట్లుగ జెప్పబడియెను. సింహళ ద్వీపమునందలి నాగులను బుద్ధుడేవిధముగా దన మతములోనికి జేర్చుకొనియెనో మవ్విధమునంతయు బౌద్ధచరిత్ర గ్రంథములగు మహావంశము, రత్నాకరి, రాజావళి మొదలగు గ్రంథములయందు వివరముగ వ్రాయబడియుండెను. సిద్ధార్థుడు బౌద్ధుడైన పిమ్మట నైదవయేట మహోదరుడు, చూలోదరుడను నాగులిరువురు వజ్ర సింహాసనమునకై పోరాడుచుండుటనుగాంచి నాగులయందలి ప్రేమచేత నాగద్వీపమునకు జూడబోయెను. అకాలమునందు పంచశత యోజనములు విస్తీర్ణము గలిగి చుట్టును సముద్రముచే జుట్టుకొనబడియున్న నాగద్వీపమును మహోదరుడను నాగరాజు పరిపాలమును సేయుచుండెను. వాని తోబుట్టువు కందమాదనమను కొండను నేలెడి నాగరాజునకీయబడి వివాహము చేయబడియెను. ఆ దంపతులకు జనించిన కుమారుడొకడు వజ్రసింహాసనము దనకు రావలయునని తగవు పెట్టెను. ఈ మహాత్ముడు వారలకు సంధిచేయుటకై ప్రయత్నించి మంచి హితోపదేశమును గావించెను. వారలా సింహాసనమును బుద్ధునికర్పించి వాని కూడిగము జేయబూనిరి. బుద్ధుడా సింహాసనమున గూరుచుండి ధర్మము నుపదేశించి యెనుబది కోట్ల నాగులను బౌద్ధమతావలంబకులనుగా జేసెను.

మహోదరుని మేనమామయును కళ్యాణిపురాధీశ్వరుడును నగు నాగరాజును గూడ తన మతములోనికి జేర్చుకొని కొంత కాలమునకు వారలను విడిచిపెట్టిపోవుచు వజ్రసింహాసనమా నాగరాజునకిచ్చి రాజాయతనవృక్ష మచ్చటనాటి వారలనుద్దేశించి "యోనాగరాజులారా! పవిత్రమైన నాయీ వృక్షమును బూజింపుడు; నా ప్రియులారా! మీకిది సౌఖ్యమును మనశ్శాంతిని కలుగజేయును" అని పలికి వెడలిపోయెను. క్రీస్తు శకము రెండవ శతాబ్దమున సింహళ ద్వీపమును బాలించిన మల్లనాగడు, చండనాగడు, కూడనాగడు, శ్రీనాగడు అను వారలు నాగరాజులుగా గన్పట్టుచున్నారు. ప్రప్రథమమున చోళదేశమునకు రాజధానిగ నుండిన కావీరి పద్దినము (కావేరి పట్టణము) సనాతనకాలమునందు నాగులకు నివాసమై నాగవాటికి ముఖ్యపట్టణమై యుండెనని చిల్లప్పదిక్కారమను తమిళ కావ్యమునందు వర్ణింపబడియెను. పురాతన తమిళ కావ్యములయందు నాగుల చరిత్రము విశేషముగా నభివర్ణింపబడియున్నది. కిల్లిసలివానడు చోళరాజు నాగజాతి కన్యను వివాహమాడియుండగా నొక కవి మణిమేకలై (మణిమేఖల) యను తమిళ కావ్యమునందా వివాహమును బూసగ్రుచ్చినయట్లుగా వివరించి వర్ణించి యున్నాడు. ద్రావిడదేశమునందలి మరపలు, అయినారులు, ఒలియారులు, ఒనియారులు, అఱవలారులు, పరదనారులు మొదలగు తెగలవారెల్లరును నాగజాతులవారనియె చెప్పబడుచున్నారు. పదునొకండవ శతాబ్దమునందు ఒలియర్లను నాగజాతివారు పరాక్రమవంతులుగనున్నట్లొక శాసనము వలన గన్పట్లుచున్నది. కరికాల చోడుడను రాజు వీరలను జయించెనని యొక తమిళ కావ్యమునందు జెప్పబడినది. పదునొకండవ శతాబ్దమునందు కొప్పరకేసరి వర్మయను చోళరాజు కొప్పయను ప్రదేశమున, బశ్చిమ చాళుక్య రాజగు నావాసమల్లుని నోడించి మామళ్ళపురము (మహాబలిపురము) లోని వరాహస్వామి దేవాలయమునకు గొంత భూదానము చేసి శాసనము వ్రాయించెను. ఆ శాసనములో రాజకీయోద్యోగస్థులు కూడ కొందఱు చేవ్రాళ్ళు చేసియుండిరి. దానిలో "ఒలినాగన్ మదైయాన్ ఆలగీయ చోళ, అనువరడ్డు మువెందవేలన్, ఒలినాగన్ చంద్రశేఖరన్, ఒలినాగన్ నారాయనన్, ఇందు పరనాన్ సంగనాగన్, ఉచనకిలవాన్ ముగలినాగన్" అను నాగనాయకులు గూడ చేవ్రాళ్ళు చేసియుండిరి. పదునొకండవ శతాబ్దమునందు ఒలినాగులు మాత్రమే గాక సంగనాగులు, ముగలినాగులు మొదలగు తెగల నాగు లుగూడ గలరని తెలియుచున్నది. [2][3]ఇంతియగాక నెల్లూరు మండలములోని దర్శి వంశపు రాజులు కూడ నాగజాతి వారని తెలియుచున్నది. పదునేనవ శతాబ్ద ప్రారంభమున దర్శి పట్టణపు రాజగు ఆసనదేవమహారాజు తన తల్లి ఆర్యమదేవి పేరిట నొక చెఱువు త్రవ్వించి శాలివాహన శకము 1357వ సంవత్సరముననగా క్రీస్తు శకము 1435-36వ సంవత్సరమున నొక శాసనము వ్రాయించెను.

దానిలో గొంకరాజు మొదలుకొని తన వంశమును వర్ణించుకొనియుండెను. ఆ శాసనమునందు గొంకరాజును ఫణీంద్రవంశజుడనియు, నాగవంశోద్భవుడనియు నభివర్ణించెను. ఈ గొంకరాజు యొక్క మనుమడయిన నాగరాజును కాకతీయ గణపతి రాజులకు సామంతుడుగనుండిన నాగదేవుడును నిరువురు నొక్కరేయై యుందురేమో యింకను విచారింపవలసియున్నది. ఈ పైన వ్రాసిన యంశములనుబట్టి నాగులనియెడి యొక జాతివారు పూర్వకాలమున నుండిరనియు, ఒకప్పుడు వారలీ భరతఖండమునంతయు నాక్రమించి పాలించి యుండిరనియు దేటపడకమానదు. ఇంకను వారలకును నాంధ్ర దేశమునకునుగల సంబంధమును దెలిపెడి గాథలను దెలిసికొన్నచో నాగులను గూర్చి యభిప్రాయము మఱికొంత బలపడకమానదు.

బౌద్ధులగాథలు.

సింహళ ద్వీపమునందును సయాము దేశమునందును జెప్పుకొనబడు బౌద్ధుల గాథలలో నాంధ్రదేశము నాగులదేశముగా జెప్పుకొనబడినట్లుగా గన్పట్టుచున్నది. గంగానదీ ముఖద్వారమునకును సింహళద్వీపమునకును నడుమ నాగులచే నివసింపబడు దేశము కలదు. ఈ నాగులు బుద్ధునియొక్క బొమికల ను రెండు ద్రోణములను సంపాదించి వానిని వజ్రాలదిన్నెకడ (Diamonds Sands)బాతిపెట్టి పైననందమైనట్టియు, అమూల్యమైనట్టియు స్తూపమునొకదానిని నిర్మించిరని చెప్పబడినది. ఈ బొమికెల భాగము మొట్టమొదట కపిలవస్తు నగర సమీపమునందలి రామగ్రామములోనిది. రామగ్రామములోని స్తూపము వఱదకు గొట్టుకొని పోబడినప్పుడీ బొమికెల పెట్టె గంగానదిలోబడి కొట్టుకొనిపోయి సముద్రములోబడగా నాగులు దానిని బట్టుకొని మంజీరికాయను తమ దేశమునకు గొనిపోయిరి. ఈ మంజీరికాదేశము [4] కళింగదేశమునకు రాజధానియగు దంతపురమునకు దక్షిణముననున్నది. ఎందుకన రాజపుత్రుడగు దంతకుమారుడును రాజపుత్రికయగు హేమవలయు బుద్ధుని దంతముతో నోడనెక్కి దంతపురమునుండి సింహళద్వీపమునకు బాఱిపోవునపుడు వజ్రాలదిన్నె (Diamonds Sands)కడ నోడ మెట్టజిక్కెనని చెప్పబడినది. ధరణికోటకు నుత్తరమున వజ్రములకు బురాతనకాలము నుండి ప్రసిద్ధి వహించినదగుటచే వజ్రాలదిన్నె (Diamonds Sands) యనునది యా ప్రదేశమె యగుననియూహింపబడుచున్నది. [5]ఈ దంతపుర కథనము క్రీస్తు శకము నాలుగవ శతాబ్ద ప్రారంభమున జరిగి యుండెనని సయాము దేశ గ్రంథమువలన గన్పట్టుచున్నది గాని మహావంశమునందు క్రీస్తునకు బూర్వము నూటయేబది యేండ్ల కిందట జరిగినట్లుగ జెప్పబడున్నుది. తరువాత సింహళరాజు మంజీరికా దేశమునకు బోయి యా బొమికెల పెట్టెను దెమ్మని పరిశుద్ధుడైన మతాచార్యునినొక్కనిబంపెను. ఇయ్యది నాగులకంతగా నిష్టములేకపోయినను నత్యద్భుతముగా నది యెట్లో యా మతాచార్యుని వశమయ్యెను. ఈ నాగరాజునకు సింహళరాజు మిత్రుడగుటవలన సింహళరాజు నాగరాజునకు కొన్ని బొమికలనిచ్చి సంతోషపెట్టెను.

బుద్ధుని దంతకథనము.

బుద్ధుని దంతమును గూర్చి కథలు పెక్కులుగలవుగాని వానిలో రెండు కథలు ముఖ్యములయినవిగా గన్పట్టుచున్నవి. [6]అందు మొదటిగాథ యిట్లు చెప్పబడుచున్నది. బుద్ధుని యెడమ పార్శ్వమునందలి దంతము కళింగదేశమునకు రాజధానికయగు దంతపురమునందు (బహుశః) నిప్పటి జగన్నాధాలయ మనబడు ప్రదేశమున నెనిమిది వందల సంవత్సరముల వఱకు సురక్షితముగ నుంచబడియెను. క్రీస్తు శకము నాలుగవ శతాబ్ద ప్రారంభమునందు గుహాశివుడను రాజు తానప్పటివఱకు నవలంబించియుండిన బ్రాహ్మణ మతమును విడిచిపెట్టి బౌద్ధమతము నవలంబించెను. క్రొత్తమతమవలంబించిన పట్టుదలచేత నాతడు తన్నాశ్రయించుకొనియున్న బ్రాహ్మణులను దొలగించి వారలను బాధపెట్టనారంభించెను. వారలు పాటలీపుత్రమునకు బోయి రాజాధిరాజగు పాండు [7]నకు జెప్పి మొఱవెట్టుకొనగా నాతడు గుహాశివుని దంతముతో గూడ దన కొల్వుకూటమునకు రావలసినదిగా నుత్తరువు చేసెను. ఆ యుత్తరపు ప్రకారము వచ్చిన మీదట దంతమును సర్వవిధముల భగ్నము చేయుటకు బ్రయత్నము జరుపబడి తుదకు దంతమునకే విజయము కలిగెను. అంతటా పాండురాజు దంతమాహాత్మ్యమునకచ్చెరువంది తుట్టతుదకు దానే బుద్ధధర్మమవలంబించెను. ఇదంతయు జరుగుచుండగా క్షీరధరుడను నుత్తరదేశపురాజొకడామహిమ గల దంతమును బడయుటకై పాటలీపుత్రముపై దండెత్తి వచ్చెనుగాని యచ్చట జరిగిన యుద్ధములో నాతడు మృతిచెందెను. అంతట గుహాశివుడు దంతముతో దన రాజధానికి మరలివచ్చెను. కొంతకాలమునకు క్షీరధరుని సోదరపుత్రులు మఱికొందఱు రాజులను దోడుచేసుకొని గుహాశివునిపై దాడివెడలివచ్చిరి. వారల నెదుర్కొనుట సాధ్యముగాక గుహాశివుడాత్మరక్షణమునకై చూచుకొనసాగెను. యుద్ధము చేయుటకు ముందు తన కొమార్తెయగు హేమాచలను, ఉజ్జయినీ పురాధీశ్వరుని కుమారుడును తన కల్లుడునగు దంతకుమారుని నుభయులను రప్పించి తానోడిపోయిన యెడల నా దంతమును దీసికొని తప్పించుకొనిపోయి సముద్ర మార్గమున సింహళ ద్వీపమునకు బోయి యా ద్వీపమునేలుచుండి యా దంతమును గొనవలయునని కోరికగలిగియుండిన మహాసేనునకు నిచ్చివేయవలసినదని చెప్పెను. అట్లు దంతపురము శత్రువుల వశమగుటకు పూర్వమే దంతకుమారుడును, హేమాచలయు నా దంతమును నిసుకలో బూడ్చిపెట్టి పట్టణము విడిచి పాఱిపోయి తరువాత మరలివచ్చి హేమాచల యాదంతమును వేణియందు దాచుకొని భర్తతోగూడ తామ్రలిప్తినగరమునకు బోయి యచ్చట నా రాజదంపతులిరువురు నోడనెక్కి సింహళ ద్వీపమునకు బ్రయాణము జేసిరి. ఓడనెక్కిన ప్రదేశమునకు సింహళమునకు నడుమ వజ్రాలదిన్నె (Diamonds Sands) సమీపమున వారెక్కిన యోడ మెట్టయెక్కెను. ఈ వజ్రాలదిన్నె (Diamonds Sands) నడుమనున్నదని చెప్పటచేతను, తీరమునకు సమీపముగా వజ్రములుండు ప్రదేశమిదియే యగుటచేతను,ఇంతియగాక నాగరాజునకు నివాసమని తరువాయి కథవలన బోధపడుచుండుటచేతను కృష్ణానదీతటమె (ధాన్యకటక ప్రదేశ తీరమె) యోడ మెట్టపట్టిన స్థలమని డాక్టరు ఫెర్గూసనుగారు దృఢముగా విశ్వసించుచున్నారు. [8]రాజకుమారికయగు హేమాచల నిద్రబోవుచుండగా నాగరాజు దంతమును తస్కరించెనుగాని హిమాలయమునుండి వచ్చిన యొక దేవతయొక్క మాంత్రికశక్తిచేత నాగరాజు దానిని మరల నా రాజదంపతులకే యీయవలసిన వాడయ్యెను. ఆ రాజదంపతులు తరువాత నోడనెక్కి సింహళమునకు బోయిరి. ఇది క్రీ.శ.312వ సంవత్సరమున జరిగినది. వీరు సింహళము జేరునప్పటికి దొమ్మిది సంవత్సరములకు బూర్వమె మహాసేనుడు మృతినొందియుండెను. అయినప్పుడు రాజ్యము చేయుచుండిన మేఘవర్ణుడు వారలను సగౌరముగా నాదరించి యా దంతముపైన నిటుకతోను సున్నముతోను నొక చైత్యమును నిర్మించి మహోత్సవమును సలిపెను. [9]మూడు సంవత్సరములు గడిచిన తరువాత నా లంకాధిపతి నాడు మొదలుకొని యేడు సంవత్సరములలో వజ్రాలదిన్నె మీద (Diamonds Sands)ధర్మాశోకుడను రాజు దేవాలయమును నిర్మించునని పూర్వమొక జ్యోస్యుడు చెప్పినదానింజూచెను. మఱియును బుద్ధుని బొమికలు రెండు ద్రోణములింకను నాగరాజు దేశములో దాచబడియున్నవను సంగతిని జ్ఞప్తికి దెచ్చుకొనియెను. వానిందెచ్చుటకై పరిశుద్ధవర్తనముగల యొక గురువునంపెను. నాగరాజు సోదరుడొకడు బొమికల పెట్టెను సంగ్రమించికొని మేరుపర్వతమునకు బాఱిపోయెనుగాని బొమికలు వానినుండి గైకొనబడి మరల దీసికొని రాబడినవి. అంతట నాగరాజు మనోహరయౌవనాంగుడై సింహళమునకు వచ్చి మేఘవర్ణునికి బ్రత్యక్షముకాగా నాతడు కొన్ని బొమికల నాగరాజునకొసంగెను. తక్కిన బొమికల నొక్క సువర్ణపాత్రమునందుంచి, ఒక మూరెడు పొడవును జేనెడు వెడల్పునుగల యొక బంగారుపడవను నిర్మించి యా సువర్ణపాత్రమునందుంచెను. అటు పిమ్మట నేడుమూళ్ళ దూలము వెడల్పు మాత్రమె గలిగియుండు కొయ్యపడవ నొకదానినిర్మించి యా బంగారుపడవనందుంచి కొందఱు రాయబారులతో దంతకుమారుని హేమాచలను వారి కోరికను మన్నించి వారి దేశమునకు బంపించెను. వీరు బయలుదేఱి యైదుమాసములకు వజ్రాలదిన్నె (Diamonds Sands)జేరి యచ్చట దిగి బొమికలుండు ప్రదేశమును దేవాలయము జూచుకొని మరల బడవనెక్కి మూడుమా సములకు దంతపురమునకుబోయిరి. దంతపురమునందు మేఘవర్ణుని రాయబారులర్హవిధానమున సన్మానింపబడిరి. మూడవ గాథ మఱియొక్కటి కలదు. కర్నలు లోగారది మఱియొక్క రాజునుగూర్చినదనియు వేఱు విషయములను గూర్చినదనియు దలంచుచుండిరిగాని కథాసందర్భమునుబట్టి యొక్కని గూర్చియె యని గన్పట్టుచున్నది. ధర్మాశోకుడను రాజు మిక్కిలి న్యాయబుద్ధితో నరవాడిదేశమును (అవంతికావలయును) బాలించుచుండి క్షామోపద్రవమువలన ముప్పదియొక్క వేలమంది దార్ఢ్యవంతులయిన మనుజులతో దక్షిణ దిశకు నేడునెలలు ప్రయాణముచేసి తుదకు జలమును మత్స్యములును సమృద్ధిగానున్న దేశమునకు వచ్చిరి. మఱుచటినాటి వేకువను నశ్వారూఢుడై రాజు వజ్రాలదిన్నె (Diamonds Sands)బ్రవేశించి యచ్చట నాగరాజును గలిసికొనియెను. ఆ ప్రదేశమునందొక చైత్యమును నిర్మించి యొక నగరమును గట్టించెను. ధర్మాశోకుడు నెమ్మదిగ నిచ్చటనేడేండ్లు రాజ్యపాలనము చేసెనుగాని బుద్ధుని బొమికలు దొరకనందున సౌఖ్యములేనివాడై వానింగనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానము చేసెదని ప్రకటించెను గాని యేమియు ప్రయోజనకారి గాకపోయెను. ఇంతలో రోమురాజు పుత్రుడు కాకభాషియను వాడొకడు తక్షశిలా నగరమునకు వర్తకమునకై యోడనెక్కి యైదువందల పరివారముతో వచ్చుచు దుపానుపట్టియు దైవానుగ్రహమువలన నపాయమునుండి విడివడి తుదకు గష్టముతో వజ్రాలదిన్నె సమీపమునకు వచ్చి జనులుండెడు సూచనలు గనిపెట్టి చూడవలెనను తలంపుతో నచ్చట నోడ నిలిపి లంగరు దించెను.

గాథల సారాంశము.

నాలుగవ శతాబ్ద ప్రారంభమున బుద్ధుని దంతమునుగూర్చి యిండియాలో బుట్టిన కల్లోలములను దెలిపెడి బౌద్ధుల గాథల నిట్టివెన్నియైనం దెలుపవచ్చును. బౌద్ధుల గాథలు (Diamonds Sands) వజ్రాలదిన్నెలను గూర్చి ముచ్చటించుచున్నవి. కృష్ణాతీరమునందు దేవాలయము గట్టబడుచుండెను. నిశ్చ యముగా నాగరాజచ్చట నివసించియుండెను. ఎన్ని విధములచేత జూచినను ఆ ప్రదేశమిప్పటి యమరావతి ధరణికోట గావలయునుగాని మఱియొక ప్రదేశము కాజాలదు. వీనినన్నిటినిబట్టి చూడగా నా గాథలలో నుదాహరించబడిన కట్టడము "అమరావతి స్తూపము" అని నిశ్చయముగా జెప్పవచ్చును. అమరావతీ స్తూపమును మనము చక్కగా బరిశోధించితిమేని అందు చిత్రింపబడిన చిత్రపుబొమ్మలను జూచితిమేని నాగులు నాగరాజులెట్లు ప్రదర్శింపబడిరో, ఈ పై గాథలలోని వృత్తాంతముల జిత్తరవుల మూలమునకెట్లు దెలుపబడియెనో మనకు గోచరము గాకమానదు. వానిబట్టియే పూర్వమీ ప్రదేశము నాగులకాటపట్టయి నాగరాజులచే బరిపాలింపబడెనని స్పష్టముగ జెప్పవచ్చును. ఇద్దఱు మనుష్యులు బుద్ధుని బొమికలు పట్టుకొని పడవటాపు మీద నిలుచుండి యొడ్డునకు వచ్చుచుండగా నాగరాజొకడు వారలకు స్వాగతమీయ వచ్చుచున్నట్లును నొక చిత్తరవు చిత్రింపబడియున్నది. ఇంకను నాగరాజులకును రాజకుమారితో నుండిన రాజుకొమారునకును కలిగిన సమావేశములను దెలిపెడు రీతులుగల చిత్తరవులనేకములు చిత్రింపబడియున్నవి. అమరావతి ధరణికోట (ధాన్యకటకము) నాగరాజునకు రాజధానిగ నుండెనని యీ చిత్తరువులు ముఖ్యముగా దెలుపుచున్నవి. ఈ చిత్తరువులలోని నాగరాజుల కేడేసి పడగలుగల పాములు శిరమునకు వెనుకప్రక్క నుండియున్నవి. ఇట్లే రాణులకు మూడేసి పడగలుగల పాములుండియున్నవి. ఇతర నాగులకు నొక్కపడగ మాత్రమెగల పాములుండియున్నవి. వీనినంతయునుబట్టి చూడగ బౌద్ధమతమునకు బూర్వము మన దేశమున సర్పపూజ విశేషముగనున్నట్లు గన్పట్లుచున్నది.

నాగులే ద్రావిడులు.

ద్రావిడులాసియా ఖండ మధ్యమునుండి యార్యులకంటె బూర్వమెన్నడో యీ దేశమునకు బశ్చిమోత్తర మార్గమునవచ్చి దక్షిణాపథముయొక్క దక్షిణపు గొన వఱకు బోయిరనియు, ఆర్యులు రాకపూర్వమె కొంతవఱకు నాగరికత గలిగి యున్నారనియు జెప్పబడుటయెగాని వారి చరిత్ర మిట్టిదని చె ప్పు వారెవ్వరును గానరాకపోయినకతమున వారి చారిత్ర మింతవఱకు దేటపడక యంధకారముననే పడియున్నది. ఎవ్వరిని ద్రావిడులని చరిత్రకారులుద్ఘోషించుచున్నారో వారి పూర్వులే నాగులు. పూర్వము వారికి నాగులనియె పేరుగలిగియుండెను గాని ద్రావిడులని పేరు గలిగి యున్నట్లు గన్పట్టదు. ద్రావిడులను పేరిటీవలి సంస్కృత గ్రంథకారులు స్మృతికర్తలు మొదలగు వారిచే బెట్టబడినది గాని యనాది సిద్ధమైనది కాదని తోచుచున్నది. నాగులే ద్రావిడులనియెడు మాయభిప్రాయము సరియైనదయిన యెడల దక్షిణాపథ వాసులను ద్రావిడులనుటకు మేమంగీకరింతుము. అట్లుగాక ద్రావిడులు వేఱుగా నున్నవారని సిద్ధాంత మేర్పడిన యెడల నిప్పటి యఱవము, మళయాళము, తెలుగు, కన్నడము మొదలగు భాషలు మాటలాడువారు కేవలము ద్రావిడులుగారని చెప్పగలుగుదుము. ఈ నాగులు కొంతవఱకు నాగరికత గల వారుగా నున్నారుగాని కేవలము నాగరికులని చెప్పరాదు. వీరెచ్చటనుండి వచ్చిరని చెప్పినను వీరి మొదటి నివాసము తక్షశిలానగర ప్రాంతదేశమని మేము నిశ్చయించుచున్నారము. అచ్చటనుండియె వీరలు హిందూదేశము నలుప్రక్కలకుబోయి యరణ్యభూములాక్రమించి జనాకీర్ణములయిన దేశములుగా జేసిరని మా యభిప్రాయము. ఈ విషయమున జాలవఱకు డాక్టరు ఫెర్గూసను గారి యభిప్రాయములో నేకీభవించుచున్నారము.

ఆంధ్రులకు నాగులకు గల సంబంధము.

ఆంధ్రదేశము నాగనివాసమని బౌద్ధుల గాథలవనను, అమరావతీ స్తూపములోని నాగుల యొక్కయు, నాగరాజుల యొక్కయు జిత్తరువుల వలనను మఱికొన్ని చరిత్రాంశముల వలనను, ఆర్యులకు బూర్వమీ దేశమున నివసించుచుండి పాలించినవారు నాగులని స్పష్టపడినందున మొదటి యాంధ్రులు నాగులనియే దోచుచున్నది. మేము పూర్వప్రకరణము నందు జెప్పినట్లుగ ననార్యాంధ్రులు తప్పక నాగులనియె మా యభిప్రాయము. ఆర్యులు కొంతరు నాగులపక్షమవలంబించి నాగుల మతమునే కొంతవఱకు స్వీకరించి యార్యాచారముల గొంతవరకు నాగులచే నవలంబింప జేసిన వా రార్యాంధ్రులు. ఆకారణము చేతనే యైతరేయ బ్రాహ్మణమునందాంధ్రులు కిరాత జాతులతో జేర్పబడియున్నారు. అటు పిమ్మట నాగరాజులు కొందఱుత్తర దేశమున నార్యులతో బోరాడి దక్షిణమునకు వచ్చి దండకారణ్య ప్రదేశమున సురక్షితములయిన స్థానములనేర్పఱచుకొని తమ రాజ్యమును విస్తరింప జేసియుందురు. వీరినే మన్వాది స్మృతికర్తలు యవనులు, చీనులు, పహ్లవులు, కిరాతులు మొదలగు వారితో జేర్చి తఱమబడిన క్షత్రియు (ద్రావిడులు)లని పేర్కొని యుందురు. ఈ యభిప్రాయమే సరియైనదైనపక్షమున నాంధ్రులను ద్రావిడులనుట యొప్పును. కాబట్టి మొదట దండకారణ్యమును బ్రవేశించినవారాంధ్ర ద్రావిడులనుటకు సందియము లేదు. వీరలిప్పటికి రెండు వేల యేనూఱు సంవత్సరముల నాడాంధ్ర రాజ్యమును స్థాపించిరనుటకు సంకోచింప నక్కరలేదు.

బౌద్ధులు నాగులపటములిట్లు వ్రాసియుండిరి కాని యివి నిజముగా నాగులరూపములు కావు

  1. Turnour's introduction to the Mahavanso, XXXViii, See also Bigandet, Life of Goudamn, p362 et. Seq.
  2. Madras journal of Literature and Science, Vol Xiii part
  3. Collection of Nellore Inscriptions II (Darsi Dynasty) by Mr Butterworth and Venugopala Chetty 3. Vols
  4. ఈ మంజీరికా దేశము మంజీర దేశమని బౌద్ధుల చేతను, ఆంధ్రదేశమని యార్యులచేతను ఆ కాలమున బిలువబడుచువచ్చెను. మంజీరయను పేరుగల యుపనది యొక్కటి గోదావరిలో గలియుచున్నది.
  5. Major General. A.Cummingham's Ancient Geography of India p.534
  6. The first is contained in Daladavamsa partially translated by the Honourable G.Turnour and published in the Journal of Asiatic Society of Bengal Vol.VI. p. 856 et. Seq; the other is abstracted by Colonal Low from the Siamese phra Pal'hom, and published in the Same Journal Vol.XVII. part II. p.82, et, seq.
  7. ఇతడే గోతమిపుత్త్ర శ్రీ శాతకర్ణి కావచ్చునని డాక్టరు ఫెర్గూసనుగారు తలంచుచున్నారు గాని వారి యభిప్రాయము సరియైనది కాదని తోచుచున్నది.
  8. Dr.Ferguson's Tree & Serpent worship; p.157.9.
  9. Colnol Low p.86