ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఆరవ ప్రకరణము

ఆఱవ ప్రకరణము

బుద్ధునికాలము.

(క్రీ.పూ.557 మొదలుకొని 477 వఱకు.)

క్రీస్తు పుట్టుటకు మున్నారవ శతాబ్దమున భరతఖండమునకు శిరోభూషణముగానుండిన మగధ రాజ్యమును శిశునాగవంశజుడయిన యజాతశత్రువు పరిపాలించుచుండెననియు శిశునాగ వంశజులనార్యులయిన నాగకులులుగాని యార్యులుగారనియు పూర్వప్రకరణమున జెప్పియుంటిమి. ఈతని కాలమున రాజగృహమనియెడి పట్టణము మగధదేశమునకు రాజధానిగనుండెను. ఈ యజాతశత్రుని తండ్రియగు బింబిసారుని కాలమున గౌతమబుద్ధుడు జనించెను. మహాత్ముడును విరాగియునైన యితడాకాలమునందలి మతసంస్కర్తలలోనే గాక భరతఖండమున నేటివరకు జనించిన మతసంస్కర్తలందఱిలోను నగ్రగణ్యుడనుటకు సందియములేదు.తత్వవిచారము జనసామాన్యమునకు బోధపడనందున నీతివర్తనమే యందఱికి ముఖ్యమనియు, పరిశుద్ధములయిన మనోవాక్కాయకర్మములు నిర్వాణమునకు ముఖ్యసాధనములనియు, పరోపకారమును భూతదయయు ధర్మముయొక్క ముఖ్యాంగములనియు, ఇవి జాతి భేదములేక యందఱకును సాధ్యములనియు, బ్రాహ్మణునికాధిక్యమును శూద్రునికి నీచత్వమును లేక సత్ర్పవర్తన గలవారెల్లరును బూజనీయులేయనియు, ధర్మనీతితత్త్వమును బోధించెను. ఈ బుద్ధధర్మము బహుశీఘ్రకాలములోనే దేశదేశముల వ్యాపించెను. భగవంతుడనార్య జాతుల నుద్ధరించుటకై ఈ రూపమున నవతరించెనని ప్రజలు విశ్వసించి బుద్ధుని మతము నవలంబించుచుండిరి. ఈ బుద్ధధర్మమార్యులకంటెను అనార్యులచే నెక్కుడుగ నాదరింపబడుచువచ్చెను. ఈ బుద్ధభగవానుడు క్రీ.పూ.557వ సంవత్సరమున జనించి యెనుబది సంవత్సరములు జీవింపగలిగి 477వ సంవత్సరమున నిర్వాణముజెందెను. ఈ కాలమున మన యాంధ్రదేశ మనార్యులయిన నాగరాజుల వశమునందుండెను. వీరలార్యులవలెనంతగా నాగరికులు గాకపోయినను గొంతవఱకు నాగరికత నహించినవారగుట వలన నార్యులరాకకు బూర్వమె దండకారణ్యమున రాజ్యమును స్థాపింపగలిగిరి. ఆర్యులీకాలముననే యనార్యాంధ్రదేశమున బ్రవేశించి తమ నాగరికత ననార్యాంధ్రులకు జవిచూపుచుండిరి. అయిన నార్యావర్తమునందువలె నీయనార్యాంధ్రులార్యమతమును సంపూర్ణముగ నవలంబించి యుండలేదు. అప్పుడీ దేశమాంధ్రదేశమని యార్యులచేతను; మంజీరదేశమనియు, వజ్రభూమియనియు బౌద్ధులచేతను; నాగులదేశమని యనార్యులచేతను బిలువబడుచుండెను. ఆ కాలమునందనార్యాంధ్రులు బౌద్ధమతమును సంపూర్ణముగ నవలంబించినవారు గాకపోయినను బుద్ధభగవానునియెడ భక్తివిశ్వాసములను గలిగియుండిరి. అనార్యాంధ్రులయిన నాగరాజులకు నార్యమతముకంటెను బౌద్ధమతమునందు బ్రేమయెక్కుడుగనుండుచు వచ్చెను. ఈ దేశమును బాలించెడి నాగరాజొకడు గౌతమబుద్ధుని సందర్శించెనని బౌద్ధుల గాథలయందు దెల్పబడుటయే యీ యంశము ధ్రువపడుచున్నది. ఆ కాలమునందు నీయాంధ్రదేశమును బాలించెడి నాగరాజులకును నాగద్వీపమును బాలించెడి నాగరాజులకును విశేషమైత్రి గలిగియుండెను. రాక్షస నివాసభూమిగ నుండిన లంకాద్వీప మాకాలమున నాగద్వీపమనియు, రత్నద్వీపమనియు బిలువబడుచుండెను. అదియె యిటీవల సింహళద్వీపమని గూడ పిలువంబడుచుండెను. ఈ నాగద్వీపమునకు నాగనివాసభూమియైన యీ మంజీరదేశమునకును సముద్ర మార్గమున వర్తకవ్యాపారము విశేషముగ జరుగుచుండెను. ఆ కాలమునందు కృష్ణానదీ ముఖద్వారమునందొక ముఖ్యమయిన రేవు పట్టణమున్నట్లుగా నా కాలపు జర్యలను దెలిపెడి బౌద్ధుల గాథలవలన దేటపడుచున్నది. ఇప్పుడు మహానదికిని గోదావరికి నడుమనుండు నాంధ్రదేశ భాగమాకాలమున గళింగదేశముగా వ్యవహరింపబడుచుండెను. ఆ కాలమునందు నెల్లూరు గుత్తి, కడప, కందవోలు మండలములును కృష్ణానదికి దిగువనుండు దేశమును కృష్ణాగోదావరుల నడుమనుండు దేశమును వజ్రభూమిగా (Diamond fields) వ్యవహారమునందుండెను. ఆ కాలమునందు నాంధ్రదేశమునందలి జనులును, కళిం గ దేశమునందలి జనులును నొక్క తెగలోనివారుగ గన్పట్టుచున్నారు. కళింగదేశమునందు ప్రసిద్ధములయిన రెండు రేవుపట్టణములు గలవని చీనా బర్మాదేశస్థులు వ్రాసిన చరిత్రము వలన దెలియుచున్నది. మఱియు ఉత్తర పినాకినీ నదీ ముఖద్వారమున నొక రేవుపట్టణముండినట్లుగ బౌద్ధుల గాథలయందు దెల్పబడియున్నది. బుద్ధుని శిష్యుడగు పూర్ణుడను బ్రాహ్మణుని సోదరుడొకడు మూడు వందల జనులతో సూర్పరాక పట్టణమునుండి (పశ్చిమతీరమునందలి కొంకణదేశము లోనిది) యోడనెక్కి లంకాద్వీపమును జుట్టివచ్చి పై జెప్పిన ఉత్తర పినాకినీ ముఖద్వారమునందలి రేవుపట్టణము కడ దిగెనని బౌద్ధులగాథలవలన దెలియుచున్నది. బుద్ధుని కాలమునందాంధ్రదేశమిట్టి నారగికతా చిహ్నములను వహించియుండినను దేశము విశేషభాగమరణ్యభూమిగానే యుండెనని చెప్పవలసియున్నది. ఇంతకన్న బుద్ధునికాలమునందాంధ్రదేశమును గూర్చిన చారిత్రము సవిస్తరముగా దెలియరాదు.

బోధయనాపస్తంబుల కాలము

(క్రీ.పూ. 477 మొదలుకొని 323 వఱకు)

సూత్రమనగా విశేషార్థమును సంక్షేపముగా జెప్పెడి చిన్నవాక్యము. ఈ కల్పసూత్రములు శ్రౌతసూత్రములనియును, గృహ్యసూత్రములనియును, ధర్మసూత్రములనియును మూడు విధములుగానున్నవి. ఒక్కొక్క వేదమునకు బ్రాహ్మణములు పెక్కులున్నట్లుగానొక్కొక్క వేదమునకు సూత్రములుగూడ పెక్కులుగలవు. ఆర్యులొకదేశమునుండి మఱియొక దేశమునకు బోవుచువచ్చిన కొలది నాయా దేశస్థితులనుబట్టి యార్యాచారములుగూడ మాఱుచువచ్చెను. ఇందువలన భిన్నసూత్రములును భిన్నశాఖలును గలిగెను. యజ్ఞయాగాదిక శ్రౌతకర్మలజేయు విధానము శ్రౌతసూత్రములయందును గృహస్థులాచరింపవలసిన షోడశకర్మాదులను జేయవలసిన విధానము గృహ్యసూత్రములయందును వ్యవహారధర్మాచరణ విధానము ధర్మసూత్రములయందును జెప్పబడినవి. ప్రాచీనసూత్రకారులలో బోధాయనాపస్తంబు లిరువురును దక్షిణాపథములోనివారుగ గన్పట్టుచున్నారు. వారిలో ముఖ్యముగా నాపస్తంబుడాంధ్రదేశములోని వాడగుట చేత గాబోలు నాంధ్రదేశములోనివారికి నాపస్తంబ సూత్రములు విశేషగౌరవనీయములు. ఈ యాంధ్ర దేశములోని నియోగివైదిక బ్రాహ్మణులలో మూడువంతులాపస్తంబసూత్రులుగానున్నారు. ఇతడాంధ్రదేశములోని వాడనుటకు లేశమాత్రమును సందియములేదు. ఇతడు బోధాయనునకు దరువాతికాలమున నున్నవాడు. ఆపస్తంబ ధర్మసూత్రములను జక్కగా బరిశోధించి ఆంగ్లభాషలోనికి భాషాంతరీకరించిన డాక్టరు బూలరుదొరగారీ సూత్రకారుడాంధ్రదేశములోనివాడనియు, క్రీస్తునకు బూర్వము నాలుగువశతాబ్దమునగాని, యైదవ శతాబ్దమునగాని యుండియుండుననియు వ్రాసియున్నారు. [1] బోధాయనునికాలమున సందిగ్దములుగను అపరిశుద్ధములుగ నుండిన ధర్మశాస్త్రవిషయముల బెక్కింటిని ఆపస్తంబుడు సంస్కరించి విస్పష్టముగదెలియజెప్పెను. ఆపస్తంబునకు బూర్వమార్యసంఘమునందలి యాచారములంతగా నియమబద్ధములుగాక యుండెను. సంఘసాంకర్యమున కవకాశమిచ్చి యుండెను. అట్టి సాంకర్యమును విరోధించు నిబంధనల నాపస్తంబుడు విరచించెను. అవంతి, (మాళవము), అంగము (తూర్పుబేహారము), మాగధము (దక్షిణ బేహారము), సౌరాష్ట్రము (గుజరాత్), దక్షిణాపథము (డెక్కన్), ఉపవ్రీతము, సింధు, సౌవీరము (దక్షిణపంజాబు లేక పాంచాలము), దేశములలోని జనులు సంకరులనియును, పంజాబులోని ఆరట్టులను, సౌవీరులను, దక్షిణాపథములోని కారక్షరులను, ఉత్తరబంగాళములోని పుండ్రులను, తూర్పు బంగాళములోని వంగీయులను, ఉత్కలదేశములోని కాళింగులను సందర్శించినవాడు పునస్తోమమను యజ్ఞమును చేయవలయునని బోధాయనుడు వచించెను.

బోధాయనాపస్తంబుల కాలమునాటి కార్యులు పెక్కండ్రు దక్షిణాపథమునకు వచ్చి యాంధ్రదేశమున నివాసము లేర్పఱచుకొనుచుండిరి. అప్పటికీ యార్యబ్రాహ్మణులు పృథివ్యాపస్తేజోవాయురాకాశములను బూజించుటను విడిచిపెట్టి యుండలేదు. వీరిలో గొందఱు వైదికకాలమునందువలె ద్రేతా గ్నులను దమతమగృహములలో నెలకొల్పుచునేయుండిరి. వీరలు యజ్ఞయాగాదికర్మల నాచరించుటయం దత్యంతోత్సాహాభి నివేశముల జూపుచుండిరి. మంత్రవిధుల ప్రకారము హయమేధములను గోమేధములను జేయుచుండిరి. ఈ పశుహింసా కృత్యమంతయు బరమరహస్యముగా విశాలమయిన గృహావరణములలోనే జరుపబడుచు వాని మాంసమును బ్రాహ్మణులు భక్షించుచుండిరి. వేదవేత్తలయిన యధ్వర్యులచేత నీ యజ్ఞములు నెఱవేర్పబడుచుండినవి. యజ్ఞాచరణకాలమున ననార్యుల వలన నేయాపత్తును గలుగకుండ రాజరక్షణము గలిగియుండిరి. అయినను బ్రాహ్మణులు వేదములన్యులకు బోధపడకుండ బరమ గోప్యముగా నుంచుకొనుచువచ్చిరి. ఆ హేతువుచేత వేదములలో జెప్పబడిన పృథివ్యాపస్తేజోవాయురాకాశముల పూజ అనార్యజాతులచే నంగీకరింపబడకయుండెను. అప్పటికే యార్యులలో నౌత్తరాహులకును దాక్షిణాత్యులకు నాచారబేధము లేర్పడినవి. ఆర్య మతము నందు బ్రవేశపెట్టబడనివారితో గలిసి భుజించుటకు, భార్యతో గూడ గలిసి భుజించుటయు, చప్పని అన్నము (చల్ది) భుజించుటయు, మేనమామయొక్కయు, మేనత్తయ్కొయు కూతురిని బెండ్లాడుటయు దక్షిణమున మాత్రమే తప్పని యాచారములుగనుండెను. గొఱ్ఱె మొదలగు కొన్ని జంతువుల రోమములతో (బొచ్చు) వ్యాపారము చేయుటయు, బెల్లపుసారాయి త్రాగుటయు, పై దౌడలను క్రింది దౌడలను పల్లుగలిగిన జంతువులను మాత్రమె విక్రయించుటకు, ఆయుధవ్యాపారమవలంబించుటయు నావికాయాత్ర చేయుటయు నుత్తరమున మాత్రమె దప్పని యాచారములుగ నుండెను. ఔత్తరాహులు దాక్షిణాత్యుల యాచారములనుగాని దాక్షిణాత్యులౌత్తరాహుల యాచారములను గాని యవలంబించుట పాపముచేయుటగా శాసింపబడుచుండెను. ఏ దేశముననేది యాచారముగానుండెనో అయ్యది యా దేశ విధులనతిక్రమింపరాదు. అయినను గౌతముడు దీనినంగీకరింపలేదు. ఆపస్తంబునికి బూర్వమునందుండిన బోధాయనాది సూత్రకారులు శాస్త్రీయ సంతానమునకును అశాస్త్రీయ సంతానమునకును భేదమునెంచక ద్వాదశవిధ పుత్రులను నంగీకరించి జ్యేష్ఠపుత్రునకు జ్యేష్ఠభాగమును విధించియుండగా నాపస్తంబుడు దానినాక్షేపించి అశాస్త్రీయసంతానమునకు శాస్త్రీయ సంతా నముతో సమానముగా భాగమిచ్చుట కూడదనియును, జ్యేష్ఠునకు దక్కిన వారికంటె నధిక భాగమీయరాదనియును జెప్పియున్నాడు. మఱియు నీతనికి బూర్వమునందు నౌరసకుమారునితో సమానముగా క్షేత్రజునకు (స్వభార్యయందితరునకు జనించినవాడు); గూఢజునకును (తన కుటుంబములోని స్త్రీకి జనియించియు నెవ్వనికి జనించెనో తెలియబడక యుండువాడు); కానీనునకును (పెండ్లికాకపూర్వము కన్యకు జనించినవాడు); సహోఢునుకును (తెలిసియో తెలియకయో గర్భవతిగా నున్న దానిని వివాహము చేసికొన్నప్పుడా గర్భవతియైన పెండ్లికూతునకు జనించినవాడు) యౌరస పుత్రునితో సమానముగానెంచి భాగమిచ్చు నాచారమున్నప్పుడప్పటి యార్యసంఘము పరిశుద్ధముగా నున్నదని యెవ్వరు చెప్పగలరు? బ్రాహ్మణునకు శూద్రస్త్రీయందు జనించినవాడు నిషాదుడనిచెప్పినను వానిని గూడ నౌరసకుమారునితోబాటు చూచుచుండిరి. ఈ సంకరసంతానమాపస్తంబునిచే నంగీకరింపబడలేదు. మఱియును నాకాలమునందాచరణలోనున్న నియోగమును (భర్త సమ్మతినిబడసి సంతానము కొఱకు నన్యపురుషునితో గలియుట) గూడనీతడంగీకరింపలేదు. వివాహప్రతిజ్ఞను ధిక్కరించి వివాహబంధమును ద్రెంచిస్వేచ్ఛగా వర్తించు భర్తగాని, భార్యగాని నరకమునకు బోవుదురని యాపస్తంబుడు కంఠోక్తిగజెప్పెను. ఈ రీతిగా నాపస్తంబుడెన్నియో సంస్కరణములను గావించెనుగాని యనాంధ్రజాతుల బాధించెడి క్రూరములయిన నిబంధనల నెన్నిటినోగల్పించెను. శూద్రుడు వేదము పఠించినయెడల నాలుక కోయవలసినదనియు, వేదము విన్నయెడల సీసము కరిగించి చెవిలోబోయవలసినదనియు, వాడు వేదము జ్ఞాపకముంచుకొన్న యెడల వాని దేహమును రెండు తునకలు చేయవలసినదనియు ననేక సూత్రకారులు శాసించిరి. దీనింబట్టి యాకాలమున ననార్యజాతులయం దెట్టి కరుణాళుత్వము జూపగలిగియుండిరో విస్పష్టముగ దెలియకపోదు.

ఈ సూత్రకారుల యభిప్రాయము లనార్యుల విషయమున నెంత క్రూరములుగా గన్పట్టినను ఆ కాలమునందు మన యాంధ్రదేశమునగాని దక్షిణాపథ దేశములలో మఱియెచ్చటగాని యీ యార్యుల ప్రభావమంతగా విజృం భించియుండలేదు. సాంకర్యమును నిరోధించు నిబంధనలు వీరి సూత్రములలోనే యుండెను గాని యాచరణమునకు దేబడి సాంకర్యమును నిలుపునట్లు చేయబడలేదు. దీనికిగారణమార్యులల్ప సంఖ్యాకులులుగను, అనార్యులు బహుసంఖ్యాకులులుగ నుండుటయు, ప్రభుత్వాధికారము జాలవఱకు మిశ్రజాతుల వశమునందుండటయేగాని వేఱొండుగాదు. ఆర్యసంఘమనార్య సంఘముల వాతబడి హతమునొందకుండ గాపాడినది యీ మిశ్రజాతి సంఘమెగాని మఱియొకటిగాదు.

అనార్యాంధ్రుల మతము.

ఆ కాలమునందలి యనార్యాంధ్రుల మతము శ్రేష్ఠమైనది కాదు. అనార్యాంధ్రులలో వేఱ్వేఱు తెగల వారు వేఱ్వేఱు మతములను గలిగియుండిరి. లేశమాత్రమును నాగరికత లేక మృగప్రాయులుగ నుండినవారాదిమ నివాసులు. వారికి గొలుచుటకు దేవతలు లేదు. వీరు దయ్యములను పిశాచములను నమ్మి వానింగొలుచుచుండిరి. ఆర్యులు వీరిని రాక్షసులుగను పిశాచులుగను జూచుచుండిరి. మొదట వీరిని జయించినవారు నాగులు, ఆదిమనివాసులకంటె వీరు కొంచెము నాగరికత గలవారయినను వీరి మతము మాత్రము శ్రేష్ఠమైనదికాదు. వీరు వృక్షములను, సర్పములను బూజించుటయేగాక తాము వీరాగ్రేసరులగుటచేత వీరత్వమునకు బ్రసిద్ధిగాంచిన "కాళి” యను భయంకరమైన దేవతలను బూజించుచుండిరి. ఆమెకు దున్నపోతులను బలిపెట్టుచుండిరి. కాళియొక్క విగ్రహము మిక్కిలి భయంకరముగా శృంగారింపబడుచుండెను. ప్రకాశమానమైన యొక చిన్న త్రాచుపాముయొక్క చర్మముతో గప్పబడి యల్లిక వేయబడిన వెండ్రుక జడ శిరస్సుపైన గిరీటమువలె గట్టబడుచుండెను. అడవి పందియొక్క వంకర కోఱను చందురు వంక వలె (అర్థచంద్రాకృతిగ) నుండునట్లు తలకట్టునకు గట్టబడుచుండెను. పెద్దపులి దంతములతో గూర్పబడిన సరము కంఠమునందలంకరింపబడుచుండెను. వ్యాఘ్రచర్మము వస్త్రమువలె నడుమునకు జుట్టుబడుచుండెను. వంచబడిన బలమైన విల్లొకటి చేత నుంచబడుచుండెను. చిలువలు పలువలు గలిగిన దుప్పికొమ్ములతో పొడవుగల మగకణితిమీద నెక్కింపబడు చుండెను. ఇట్టి విగ్రహమునెదుట డోళ్ళు మ్రోగుచుండగా బూరలూదబడుచుండగా భయంకరులయిన నాగులు కాళికి దున్నపోతులను బలిపెట్టుచుండిరి. దున్నపోతులు నఱుకబడి రక్తము స్రవించుచుండగా గురువురాలు (గణాచారిణి) సివమెత్తగా లేచి వణుకుచు వికృతముగా నాట్యమాడుచు కాళి పూనినయట్లుగా "మీరు మీ దేవతకు బలియొసంగరేని ఆమె మీ విల్లులకు జయముకలుగునట్లు దీవెనలీయదు” అని హెచ్చరించును. ఈ కాళిపూజ మొదట అనార్యులయిన నాగులలో జనించి కాలక్రమమున నార్యులచేగూడ నిటీవల నాచరింపబడుచుండెను. ఇది అనార్యాచారముగాని యార్యాచారముగాదని స్పష్టముగ జెప్పవచ్చును. ఈ కాళిపూజను మాత్రమెగాక నాగులును తదితరులును ఱాళ్ళను, బుగ్గలను (చెలమల) గూడ పూజించుచుండిరి. చెవిటివారును, మూగవారును, గూనుకల వారును, కుష్ఠురోగులును మహిమగల బుగ్గలలో మునింగి యాఱాళ్ళ చుట్టును దిరిగి పూజించినయెడల స్వస్థులగుదురని విశ్వసించుచుండిరి.

ఆంధ్రరాజ్య స్థాపనము.

ఆర్యుల నార్యాంధ్రదేశమునకు వచ్చి యించుమించుగా రెండు శతాబ్దములకాలము వారి నడుమ నివసించియుండుటచేత స్వభావసిద్ధముగా నేర్పడిన సమ్మేళన సాంకర్యము వలన మిశ్రజాతియొకటిజనించి నానాటనభివృద్ధి కాజొచ్చెను. మేమిదివఱకీ చరిత్రమున నుదాహరించిన యార్యాంధ్రసంఘమె యీ మిశ్రజాతిగనున్నది. ఈ యార్యాంధ్రు లనార్యాంధ్రులకంటె నెక్కుడు నాగరికతయు, విజ్ఞానమును, పరాక్రమమును గలిగినవారయి యుండుటచేత దేశమున వీరి యధికారములు నాగాంధ్రులనుండి గైకొనబడినవి. కావున క్రీస్తు శకమునకు బూర్వము నాలుగవ శతాబ్దమునందే యాంధ్రరాజ్యము స్థాపింపబడినదని స్పష్టముగా జెప్పవచ్చును. లేనియెడల నాలుగవ శతాబ్ద ప్రారంభమున మగధ రాజ్యాధిపత్యమును వహించిన చంద్రగుప్త చక్రవర్తి యాస్థానమునందుండిన యవన దేశపు రాయబారియగు మేగాస్తనీసనువాడీ యాంధ్ర రాజ్యమును ప్రశంసింపవలసిన పనియె లేకయుండును. అతడీ యాంధ్రజాతి మిక్కిలి పరాక్రమముగల జాతియనియు, చంద్రగుప్తుని మగధ రాజ్యము తప్ప యాంధ్రరాజ్యమను మించిన రాజ్యము మఱియొకటి లేదనియు, ఆంధ్రరాజ్యమునందప్పుడు ముప్పది దుర్గములును లక్ష కాల్బలమును, రెండువేల యాశ్వికసైన్యములు సహస్ర దంతావళములు నుండెననియు నుడివియున్నాడు. [2]

ఆంధ్రవిష్ణువు.

మౌర్యవంశ స్థాపకుడయిన చంద్రగుప్తునికి బూర్వముననే యీయాంధ్ర రాజ్యముండెనని మేగాస్తనీసు వాక్యమువలన ధ్రువపడుచున్నది గాని యీ రాజ్యమును మొదట స్థాపించిన పరాక్రమశాలి నామము మాత్రము చరిత్రమునందు గానరాకయున్నది. అయిననొక గాథ పురాణాదులయందు బేర్కొనబడుటయేగాక నేటికిని జనపరంపరచే వాడుకొనంబడుచు సుప్రసిద్ధి వ్యాప్తిగాంచియున్నది. కాకులమునందు రాజ్యపరిపాలనము సేయుచుండిన సుచంద్రుడనువాని కుమారుడు "ఆంధ్రవిష్ణువు" అనువాడు నిశంభుడను దానవునితో బదమూడు మహాయుగములు యుద్ధముచేసి వానిని హతముగావించి శ్రీశైలము; భీమేశ్వరము, కాలేశ్వరముల నడుమ బ్రాకారములు నిర్మించి కోటగట్టి యాత్ర క్షేత్రములను త్రిద్వారములుగజేసి త్రిశూలధారియైన యీశ్వరునిగాపువెట్టి ఋషులతోగూడ గోదావరీ తీరమునందు నివసించెననియు అప్పటినుండియు నీదేశము త్రిలింగదేశమని వ్యవహరింపబడుచున్నదనియు జెప్పెడి గాథ మూలమున నేసత్యమును లేక కల్పింపబడినదని మా యభిప్రాయముగాదు. ఈ గాథలో బేర్కొనబడిన కాకులము కృష్ణా మండలములో మచిలీపట్టణమునకు బడమట 19మైళ్ళ దూరమున గృష్ణవేణీ తటముననుండిన శ్రీకా కులమేగాని వేఱొండుగాదు. [3] సుచంద్రుడను నార్యాంధ్రుడొకడు కాకులమును రాజధానిగ జేసికొని పరిపాలనము చేసియుండవచ్చును. ఈ సుచంద్రుడనువాడు జైనమతావలంబకుడై యుండవలయును. ఆంధ్రవిష్ణువీతని కుమారుడు. ఇతడు బహుపరాక్రమశాలియై నిశంభుడను నాగాంధ్రుని జయించి యాంధ్రరాజ్యమును స్థాపించి విజృంభింపజేసి మిక్కిలి ప్రఖ్యాతికెక్కి యుండును. బహుకాలమీతని నామమును గీర్తిని ప్రజలు జ్ఞాపకముంచుకొనియుందురు. ఇటీవల శైవమతము ప్రబలి బౌద్ధక్షేత్రములుగానుండిన శ్రీశైలము, భీమేశ్వరము, కాలేశ్వరములను త్రిక్షేత్రములును శైవక్షేత్రములయిన తరువాత, ఈ దేశమునకు త్రిలింగమను నామము వ్యవహారములోనికి వచ్చిన తరువాత, సుప్రసిద్ధి గాంచిన యీ యాంధ్రవిష్ణువునకు శైవులయిన రాజులును, పండితులును పైగాథను ముడిపెట్టియుందురు గాని, మనము వివేకదృష్టితో నీ గాథలోని సంగతి సందర్భములను జక్కగ బరిశీలించితిమేని నీతడే తప్పక యాంధ్రరాజ్య సంస్థాపకుడై యుండునని తెలిసికొనగలుగుదుము. ఈ యాంధ్రరాజుల పాలనమునందు శ్రీకాకుళమే రాజధానిగా నుండెను. ఆ కాలమునందలి శ్రీకాకులము కృష్ణానది వెల్లువలచే గొట్టుకొనిపోవుటచేత నేడు గానరాకున్నయది. [4] ఆ ప్రదేశమునకు జెంతను నా పేరితో మఱియొక గ్రామము వెలిసినది. అయినను ఆంధ్రవిష్ణువును మాత్రము మఱువక తరువాత వారాతని దైవమునుగా భావించి దేవాలయమును గట్టి యాతనింబూజించుచున్నారు. శ్రీకాకులాంధ్ర దేవుడీ యాంధ్రవిష్ణువేగాని మఱియొక విష్ణువుగాడు. మధుసూదనదేవుడైన యీ యాంధ్రవిష్ణువునే సందర్శించుటకై పదునాఱవ శతాబ్దారంభమునందు నాంధ్రభోజుడు మూరురాయరగండడు విజయనగరాధీశ్వరుండు విద్యాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి పూర్వదిగ్విజయ యాత్రకాలమున వచ్చి కానుకలర్పించి పోయి తన విష్ణుచిత్తీయమునందభవర్ణించి యున్నాడు. పూర్వకాలమున జైనులో, బౌద్ధులో పరిపాలనము చేసిరని తెలుపు చిహ్నములిప్పటికి నా సమీప ప్రాంతభూములయందు గానవచ్చుచున్నవి. ఈ మొదటి యాంధ్రరాజులు రెండు శతాబ్దములు పరిపాలనము చేసినట్లుగ గన్పట్టుచున్నను ఆంధ్ర జాతీయులయిన శాలివాహన వంశజులు రాజ్యాధిపత్యము వహించు వఱకు వీరి చారిత్రము గాని, నామములు గాని దెలియరాకున్నవి.

శైవమత వ్యాపనము.

ఈ కాలమునందే యాంధ్రరాజ్యమున శైవమతము ప్రవేశించి వ్యాపించినట్లుగ గాన్పించుచున్నది. ఈ శైవమతము మొదట యక్షులలో (తమిళజాతులలో) వ్యాపించి వారి మూలమున నాంధ్రదేశమున వ్యాపించినది. ఈమతమనార్యులనుండి వచ్చినది కాని కొందఱు తలంచునట్లార్యులనుండి వచ్చినది కాదని తోచుచున్నది. మొట్టమొదటశైవమత మెట్లుత్పత్తి గాంచినదియు దెలిసికొనుట చదువరుల కావశ్యకమనుటకు సందియము లేదు. అదియునుంగాక యీ విషయము మనోహరముగా నుండక మానదు. హిమవత్పర్వతమున కుత్తరమునందలి యున్నత భూములనుండి యక్షులు కొంతకాలమునివసించియుండి మఱి కొంతకాలమైన తరువాత నచ్చటి రేవుపట్టణమగు తామ్రలిప్తి నగరమునుండి సింహళమునకును సింహళమునుండి దక్షిణాపథముయొక్కదక్షిణపు కొనకువచ్చి కాలక్రమము నచ్చట పాండ్య చోళచేరరాజ్యములుస్థాపించిరనియు ఈయక్షులే తామ్రలిప్తి నుండి (Tamalittis) వచ్చిన వారగుటచేతతమిళు (Tamils) లనబడుచున్నారని నాలుగవ ప్రకరణమున వ్రాసినవిషయములను మా చదువరులవగాహనము చేసికొనియే యుందురు. ఈ యక్షులలో బై తరగతులవారికి శివుడు ప్రధాన దైవతముగా నుండెను. శివుడు స్ఫురద్రూప మును దాల్చి రాగివర్ణపు వెండ్రుకలతోడి జటాజూటము కలవాడై పులితోలుగప్పుకొని శూలపాణియై, వృషభవాహనారూఢుడై, త్రినేత్రములను గలిగి సంచరించునని యక్షులభివర్ణించి యుండిరి. త్రినేత్రములు దక్కతక్కిన రూపమంతయు హిమవత్పర్వత ప్రాంతభూమిని నివసించు నాదిమనివాసుని రూపమును బోలియుండుననుటకు లేశమాత్రమును సంశయములేదు. ఆయున్నత భూములందుండు పార్వతీయులు స్ఫురద్రూపులుగాను రాగివర్ణపు వెండ్రుకలు గలవారుగను ఎద్దులనెక్కి సంచరించువారుగ నుందురు. హిమాలయపర్వతమునందుత్తర భాగమును గంగాసింధు బ్రహ్మపుత్రానదుల జన్మస్థానమునకు సామీప్యముననుండి వెండికొండవలె మంచుగడ్డలతో బేర్చబడియున్న కైలాసశిఖరమీతని నివాసముగనుండెను. స్వర్గభూమియందుండెడి దేవతలకు (the inhabitants of the highest table land of the earth, ie., Tibet. భూమండలమునందలి యున్నతభూములలో నున్నతమైనది అనగా త్రివిష్టప్రదేశము -Tibet)బాధ కలుగజేయుచుండిన యసురుల సంహరించి వారి త్రిపురములను భస్మముచేసి త్రిపురాసుర సంహారకుడని బిరుదుగాంచుట యీతడు చేసిన ఘనకార్యములలో నొక్కటిగానున్నది. ఈతడు హిమవంతుని కూతురగు పార్వతిని వివాహము చేసికొనియెను. యక్షులలో వీరులకును వేటకాండ్రకును, "మురుగ" యను మఱియొక దేవత (స్కందుడు లేక కుమారస్వామి) కలడు. స్కందునకాఱు మొగములును, పండ్రెండు చేతులును గలవు. ఈ దేవుని దేవాలయములరణ్యముల నడుమను, పర్వతముల శిఖరముల మీదను సాధారణముగా నిర్మింపబడుచుండెను. ఈ దేవతకు బలులర్పింపబడునప్పుడొక పాకవేయబడి పూలసరములతో నలంకరింపబడును. అచ్చట వేటకాండ్రయొక్క గురువు మంత్రోచ్చారణ సలుపుచు, పుష్పములను, అక్షతలను వెదజల్లుచు నొక యెద్దును బలియిచ్చును. ఆ యెద్దు రక్తములో వేడియన్నము గలిపి తప్పెటలును డోళ్ళును మ్రోగుచుండగా చేగంటలు వాయించుచుండగా, కొమ్ములూదుచుండగా ఆ ప్రసాదమును దేవునకు నైవేద్యమిడును. తరువాత వారందఱు నచ్చట కొంతసేపు సివములాడి మఱిపోవుదురు. దీనినంతయును విచారించి చూడగ నితడు కల్పిత పురుషుడని చెప్పరాదు. ఈ దేవునికారోపింపబడు గాథలనన్నిటిని పరిశోధించి చూచిన యెడల నీతడొక శూరాగ్రేసరుడయిన రాజనియు, మరణానంతర మొక దేవుడుగా భావింపబడి శూరులచే గొలువబడుచుండెనని తేటపడకమానదు. ఇతడు గంగానది పుట్టినచోట సారవనమునందు జనించి యార్గురుతల్లులచే బెంపబడియెననియు జెప్పుదురు. అసురులతో బోరాడునపు డితడు దేవతలకు సేనాధిపతిగనుండెను.

ఆ కాలమున బ్రాహ్మణార్యుల మతమును, వారి నిత్యనైమిత్తిక కామ్యకర్మలును అనార్యులచే నేవగింపబడుచుండినయవి. వారి గ్రంథవిజ్ఞానమును వీరికి లభింపకపోయెను. తుదకు బ్రాహ్మణార్యులే యనార్యులను వశపఱచుకొనుటకై యనార్యుల దేవతలను గ్రహించి యాదరించి పూజింపసాగిరి. నాగుల దేవతయగు కాళిని శివుని భార్యయగు పార్వతియొక్క యంశమనిరి. వేటకాండ్ర దేవతయగు "మురుగ"ను స్కందకుమారుడనియు షణ్ముఖుడనియు, కుమారస్వామియనియు, పేరుపెట్టి శివునికుమారునిజేసిరి. దేశవీరులయిన బలరామకృష్ణులు గొల్లవాండ్రచే బూజింపబడుచుండిరి. వీరిని విష్ణుని యవతారములని గ్రహించిరి. అనార్యులను సంతోషపెట్టుటకై మొదటనార్యులీ దేవతలకు దేవాలయములు గట్టి ముఖ్యముగా నా కాలమున శివుని, షణ్ముఖుని, బలరామకృష్ణులను బూజింపసాగిరి. ఆ కాలమునందలి ప్రధాన దైవతములలో శివుడే ప్రధాన దేవుడుగా నుండెను. [5] ఈ శైవమత మార్యజాతులలోగంటె ననార్యజాతులలో సంపూర్ణముగా వ్యాపించియుండెను. ఆంధ్రరాజ్యమునకు సింహళమునకును యక్షరాజ్యములగు పాండ్య చోళ చేర రాజ్యములకును వర్తకవ్యాపా రమధికమై రాకపోకలు గలిగిన తరువాత నీ శైవమత మాంధ్రులలో గూడ వ్యాపించెను.

మౌర్యుల కాలము.

(క్రీ.పూ.321 మొదలుకొని క్రీ.పూ.184 వఱకు)

క్రీస్తునకు బూర్వము నాలుగవ శతాబ్ద ప్రారంభమున యవనులీ భరతఖండముపై దండెత్తి వచ్చి పాంచాలము నాక్రమించుకొని మూడుసంవత్సరములు పాలించిన తరువాత చంద్రగుప్తుడను మౌర్యుడొకడు యవనులను బాఱద్రోలి చాణక్యుడను బ్రాహ్మణమంత్రి సహాయమున మగధ రాజ్యమును బాలించుచుండిన నందుని, వాని పుత్రులను జంపి తాను సింహాసనమెక్కి హిమాలయ వింధ్యములకు నడుమనుండు యావద్దేశమునేకచ్ఛత్రముగ నేలెను. ఈతని యాస్తానమునందే యుండిన మేగాస్తనీసను యవన రాయబారి యాంధ్రరాజ్యమును గూర్చి ప్రశంసించినవాడు గాని యాకాలమున నీయాంధ్రరాజ్యము చంద్రగుప్తునికి లోబడియుండెనో లేక స్వతంత్రత వహించియుండెనో దెల్పినవాడుకాడు. చంద్రగుప్తుని కుమారుడగు బిందుసారుని కాలమునందయినను ఆంధ్రరాజ్యము మగధరాజ్యమునకు సామంతరాజ్యముగ నుండెనేమో స్పష్టముగా బోధపడదు. కుంతలదేశమును మౌర్యులు పరిపాలనము చేసినట్లు మైసూరుమండలములోని పండ్రెడవ శతాబ్దము నాటి శాసన మొక దానివలన గన్పట్టుచున్నదని రైసుదొరగారు వ్రాసియున్నారు గాని [6] యా మౌర్యులకును ఈ మౌర్యులకును నెట్టి సంబంధముగలదో స్పష్టముగా బోధపడదు. బిందుసారుడు కుంతలము వఱకు జయించిన యెడల నాంధ్రరాజ్యమీతని కాలమున మగధ రాజ్యమునకు సామంత రాజ్యముగ జేయబడియుండవలయును. ఇతడు యుద్ధము చేసి యాంధ్రదేశమును జయించినట్లెక్కడను గానరాదు. ఈతని శాసనములయిన నీదేశమున నెక్కడను గానరావు. వీనికొమారుడశోకవర్థనుని కాలమునందు నాంధ్రరాజ్యము వానికి లోబడియుండినట్లు గన్పట్టుచున్నది గాని యతడైనను యుద్ధము చేసి జయించినట్టు గన్పట్టదు. ఈ యశోకవర్ధన చక్రవర్తి ప్రేరే పణముచేతనే యాంధ్రులు బౌద్ధమతమవలంబించిరని యతడు వ్రాయించిన పదమూడవ శిలాశాసనము వలన గన్పట్టుచున్నదని మూడవ ప్రకరణమునందే యా శాసనములోని వాక్యములను దెలిపియుంటిమి. ఆంధ్రరాజ్యమీచక్రవర్తి కాలమున నిప్పటి బ్రిటీషు ప్రభుత్వమునకు లోబడియున్న హైదరాబాదు, మైసూరు, బరోడా రాజ్యముల వలెనొక సంరక్షక రాజ్యముగ నుండియుండవలయును. [7] ఇప్పటి యాంధ్ర దేశభాగమగు కళింగము (గోదావరి, విశాఖపట్టణము, గంజాము జిల్లాలు) పై దండెత్తి వచ్చి స్వాధీనము చేసికొని యుద్ధమునందు లక్షమంది కాళింగులు మడియుటయును, ప్రజలకు గలిగిన సంక్షోభమును గన్నులార గాంచి పశ్చాత్తప్తుడై యంతటినుండి యుద్ధముల మానివేసి బుద్ధ ధర్మమునవలంబించి బోధకుల నానాదేశములకు బంపించి బౌద్ధమతమును నానాముఖముల విస్తరింపజేసిన వాడశోకుడు. వీని మరణానంతర మాంధ్రులు స్వతంత్రులయి పరిపాలనము చేసినట్లుగ గన్పట్టుచున్నది. అశోకవర్ధనుని తరువాత పాలించిన మౌర్యవంశపు రాజులలో నశోకుని మనమడు దశరథుడను వాడు తక్క తక్కినవారెల్లరును నట్టి బలహీనులగుటవలన సామంతులుగనున్న వారనేకులు స్వతంత్రులయిరి.
ఆంధ్రరాజ్యమును స్వతంత్రత వహించుటయె గాక భరతఖండము యొక్క మధ్యభాగమునంతయు నాక్రమించుకొని తన యధికారమును నలుప్రక్కల విజృంభింపజేయుచుండెను. మౌర్యవంశపు రాజులలో గడపటివాడయిన బృహద్రథుని కాలమున వాని సైన్యాధిపతియు, శుంగవంశ సంజాతుడునగు పుష్యమిత్రుడను వాడు వానిం జంపి క్రీ.పూ.184వ సంవత్సరమున రాజ్యమాక్రమించుకొనెను. ఇతడు బహుపరాక్రమవంతుడై యశ్వమేధాది యాగముల బెక్కింటిని జేసెనుగాని యాంధ్రులును కాళింగులు నీతనికి లోబడియున్నట్లు గానరాదు.

ఖారవేలుని శాసనము.

పుష్యమిత్రుడు బౌద్ధుడు కాకపోవుట వలన రాజ్యమునకు వచ్చిన వెంటనే బౌద్ధమతస్థులను బాధింపనారంభించెను. ఇతడశ్వమేధాది యాగములలెక్కింటినాచరించి బ్రాహ్మణుల నాదరించుచు వచ్చెను. వీని కాలమున ననగా క్రీ.పూ.158వ సంవత్సరమున కళింగ దేశమును బాలించెడి జైనరాజగు ఖారవేలుడు మాగధముపై దండెత్తి వచ్చి మగధ రాజగు పుష్యమిత్రునికి గర్వభంగము గావించెను. ఈ యుద్ధమునందు శాతకర్ణియను నాంధ్రరాజొకడు బహుసేనలను బంపి ఖారవేలునకు దోడ్పడినటుల నుత్కలదేశములోని కటకమునకు దక్షిణమున 19మైళ్ళ దూరముననుండు నుదయగిరిపైన హాతిగంఫా గుహలోని యొక శిలపై మౌర్యరాజకాలము 165వ సంవత్సరమున ఖారవేలునిచే వ్రాయించబడిన శాసనమునందు బేర్కొనబడినది. [8] మొదటి మౌర్యరాజగు చంద్రగుప్తుడు 321వ సంవత్సరమున రాజ్యాభిషేకముబొందినవాడు గావున ఖారవేలుని శాసనము క్రీ.పూ.157వ సంవత్సరమున వ్రాయబడియుండును. కనుక నా కాలమున నాంధ్ర రాజ్యము మగధ రాజ్యమునకు లోబడియుండి లేవనియు స్వతంత్రతను గాంచి యున్నదనియు, మీదు మిక్కిలి మగధ రాజ్యమునకు ప్రత్యర్థిగ నున్నదనియు గూడ స్పష్టమగుచున్నది.

ఆంధ్రులు మగధ రాజ్యమును జయించుట.

శ్రీముఖుడను [9]నాంధ్రభృత్యవంశపు రాజొకడు మగధ రాజ్యమును బాలించెడి సుశర్మయను కాణ్వవంశ జాతీయుని సంహరించి తద్రాజ్యము స్వాధీనము జేసికొనియెనని వాయుమత్స్యవిష్ణుభాగవతాది పురాణములలో జెప్పబడియెను. శాతకర్ణియను నాంధ్రరాజు పుష్యమిత్రునితో ఖారవేలునకైన యుద్ధమునందు ఖారవేలుని పక్షమునుండి యుద్ధము చేసిననాడు మొదలుకొని శ్రీముఖుడను నాంధ్రరాజు మగధదేశమును బాలించెడి కాణ్వవంశజుడగు సుశర్మను జంపి మగధ రాజ్యము నాక్రమించుకొను నాటివఱకు నాంధ్రులను, నాంధ్రరాజులను గూర్చి చరిత్రాంశము లేవియు వినరావు.

పురాణములలోని రాజవంశములు.

మగధ రాజ్యమును శిశునాగవంశమునకు దరువాత మౌర్యులు పదిమంది నూట ముప్పది యేడు సంవత్సరములు పరిపాలింతురనియు, వారి తరువాత శుంగవంశజులు పదుండ్రు నూట పండ్రెండు సంవత్సరములు పరిపాలింతురనియు, తరువాత కాణ్వవంశీయులు రాజులై నలుబడియైదు సంవత్సరములు మాత్రమె పాలింతురనియు, వారి వెనుక నాంధ్రరాజులు రాజ్యమాక్రమించుకొని నాలుగు వందల యేబది యారు సంవత్సరముల వఱకు బరిపాలన సేయుదురనియును పై జెప్పిన పురాణములలో వ్రాయబడియుండెను. కాబట్టి చంద్రగుప్తుడు 321వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినవాడు కావున మౌర్యులాకాలము మొదలుకొని 137 సంవత్సరముల కాలమనగా 184వ సంవత్సరము వఱకును బరిపాలన చేసియుందురు తరువాత రాజ్యమునకు శుంగవంశజులు 184వ సంవత్సరము మొదలుకొని 112 సంవత్సరములనగా 72వ సంవత్సరము వరకును బరిపాలనము జేసియుందురు. వారి వెనుక వచ్చిన కాణ్వులు నలువురును నలువది యైదు సంవత్సరములనగా 27వ సంవత్సరము వఱకును బరిపాలించియుందురు. అటుపిమ్మట నాంధ్రభృత్యవంశ మారంభమైయుండును. ఆంధ్రభృత్యులనగా నొకప్పుడు భృత్యులుగానుండి యాంధ్రులనియర్థము. ఈ పురాణములో నీ రాజవంశములు పేర్కొనబడుటయే గాక యా వంశములలోని రాజుల నామములును వారలు పరిపాలనము చేసిన సంవత్సరములునుగూడ పేర్కొనబడియున్నవి. కాణ్వాయనీయులను పదభ్రష్టులను జేసిన యాంధ్రుడు సింధుకుడని వాయు పురాణమును, శ్రీప్రకుడని విష్ణుపురాణమును, శ్రీశుకుడని మత్స్యపురాణమును పేరు చెప్పక వృషలుండని మాత్రము భాగవతపురాణమును బేర్కొనుచున్నవి. ఆంధ్రభృత్యవంశములోని రెండవవాడు కృష్ణుడని పురాణములన్నియు బేర్కొనుచున్నవి. శ్రీశాతకర్ణిని వాయువిష్ణుపురాణములు మూడవవాని గజెప్పియుండ భాగవత పురాణము శాతకర్ణియను పేరు మార్చి శాంతకర్ణుడని పేర్కొనుచున్నది. మత్స్యపురాణము కృష్ణునికి శాతకర్ణికి నడుమ మఱిముగ్గురు రాజులు నెక్కువగా బేర్కొనుచున్నది.
ఇంతియగాక విష్ణుపురాణము మత్స్యపురాణములోని శాతకర్ణికనుగుణముగానుండు మఱియొక శాతకర్ణిని పేర్కొనుచున్నది. వాయుపురాణము ప్రకారము గోతమిపుత్రుడు పదమూడవ రాజకుమారుడుగను, భాగవతా పురాణము ప్రకారము పదునేనవ వాడుగను, విష్ణుపురాణము ప్రకారము పదునేడవ వాడుగను, మత్స్యపురాణము ప్రకార మిరువది రెండవ వాడుగ నుండెను. విష్ణుభాగవతమత్స్య పురాణముల ప్రకారము పులోమదుడు గోతమిపుత్రుని తరువాతి వాడుగ నుండెను. వాయుపురాణము వీని పేరు పూర్తిగ విడిచిపెట్టుచున్నది. విష్ణుమత్స్యపురాణముల ప్రకారము వాని వెనుక వచ్చినవాడు శివశ్రీయను వాడైయున్నను భాగవతపురాణము వేదశ్రీయను వాడని పేర్కొనుచున్నది. వాయుపురాణము వీని పేరెత్తక మౌనము వహించినది. శివశ్రీ తరువాత వచ్చినవాడు శివస్కందుడని యొక్క వాయుపురాణము తక్క తక్కినవన్నియు నంగీకరించినవి. వీని తరువాత వచ్చిన యజ్ఞశ్రీయనువానిని పురాణములన్నియు నొప్పుకొనుచున్నవి గాని వాయుపురాణము వానిని గోతమిపుత్రునికి వెనుకబేర్కొనుచున్నది.

ఆంధ్రభృత్య వంశమే శాతవాహన వంశము.

పురాణములలో బేర్కొనబడిన యాంధ్రభృత్యరాజులలోని కొందఱి శాసనములు దక్షిణాపథమున గానవచ్చుచున్నవి. శాసనములు మాత్రమెగాక వేనవేలు నాణెములు కూడ గానంబడినవి. అయ్యవి నాసిక, జనగడ, కార్లి, ఠాణా మొదలగు మహారాష్ట్ర స్థలములయందును, ధరణికోట, జగ్గయ్యపేట, గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాల, చినగంజాము మొదలగు నాంధ్రదేశములోని స్థలములయందును విశేషముగా గానవచ్చినవి. పురాణములలో బైన బేర్కొనబడిన కృష్ణుడు, శాతకర్ణి, పులమాయి, గోతమిపుత్రుడు , శివశ్రీ, యజ్ఞశ్రీ మొదలగు నాంధ్ర రాజులీ శాసనమునలోను నాణెములలోను బే ర్కొనబడుటచేతను, శాసనములలో దాము శాతవాహన వంశజులమని పేర్కొనుటచేతను, వారి ముఖ్య రాజధాని యాంధ్రదేశములోని ధాన్యకటకనగరమగుటచేతను, పురాణములలోని యాంధ్రభృత్యవంశమును శాసనములలోని శాతవాహన వంశమును నొక్కటియేయని నిస్సంశయముగా జెప్పవచ్చును. ఆంధ్రభృత్యవంశమనియెడు నీ శాతవాహన వంశమునకు శాతవాహనుడు వంశకర్తయని చెప్పకయ చెప్పుచున్నది.

శాతవాహనుడే శాలివాహనుడు.

శాతవాహనునే ప్రాకృతభాషలో శాలివాహనుడందురు. ఈ శాతవాహనుని చరిత్రము పురాణములలోగాని శాసనాదులలోగాని యెచ్చటను గానరాదు. ఈతనిం గూర్చిన విశ్వాసపాత్రమయిన చరిత్రమింతవఱకును గాన్పింపలేదుగాని యీతని పేరిట నద్భుతములయిన గాథలు మాత్రము వేనవేలు దేశమునకొక విధముగా బహుదేశములయందు భరతఖండమునంతట వ్యాపించియున్నవి. ఆ గాథలు శాతవాహనుని కాలమును నిర్ణయించుటకెంత మాత్రమును బనికిరావు. కేవలము కల్పితములయిన గాథలనేకములు వీరాగ్రగణ్యుడైన శాతవాహనుని మెడకు ముడివెట్టబడినవి. ఈతనియొక్క ప్రఖ్యాతినిబట్టి యిటీవలి రాజులెందఱో యీ శాతవాహనునితో దమకేమియు సంబంధము లేకపోయినను తామీతని సంతతివారమని గొప్పగా జెప్పుకొనుచుండిరి. ఇతడాంధ్రజాతీయుడని యాంధ్రదేశమును బాలించిన యాంధ్రభృత్యవంశమనియెడు శాతవాహన వంశమునకు మూలపురుషుడని ఆంధ్రమహారాష్ట్రదేశములలోని శాసనాదుల వలనను పురాణాదుల వలనను స్పష్టముగా దెలియుచుండగా దదితర దేశరాజన్యులకెట్లు వంశకర్తయయ్యెనో దెలియరాకున్నయది. ఇతడు కుమ్మరవాడని చెప్పెడి కథలును, మాళవ దేశాధిపతియైన విక్రమార్కుని నీతడు పంపెనని చెప్పెడి కథలును గల్పితములుగాని సత్యములు గావనియును, అవి యెట్లు గల్పింపబడినవియును ఈ చరిత్రమును సాంతముగ జదివి యవగాహము జేసికొనువారికి బోధపడకమానవు. ఇతని చరిత్రము మనకు స్పష్టముగ దెలియకపోయినను మగధరాజ్యమును పుష్యమిత్రుడాక్రమించుటకు బూర్వముననే యీ వీరవరాగ్రగణ్యుడాంధ్ర రాజ్యా ధిపత్యము వహించి పశ్చిమోత్తర భాగమున బహుదేశములనుజయించి యాంధ్రరాజ్యమును నానాముఖముల విస్తరింపజేసి రాజధానిని శ్రీకాకులమునుండి విజయవాటికకు (Bezawada) బడమట 17మైళ్ళ దూరమున గృష్ణానదికి దక్షిణమునుండు ధాన్యకటకమునకు మార్చుటయేగాక మహారాష్ట్రదేశము నందలి గోదావరి తీరముననుండెడి ప్రతిష్ఠానపురమును యువరాజులకునికిపట్టుగ జేసినట్లు గన్పట్టుచున్నది. అట్టి యీ యాంధ్రవీరునిగూర్చి బహుదేశములలో వ్యాపించిన కల్పితకథలకెల్లను మూలకారణము కథాసరిత్సాగరము నందలి మహాగాథయె గాని వేఱొండుగాదని తోచుచున్నది. కశ్మీర దేశపు రాజయిన యనంతుని పట్టమహిషియగు సూర్యవతీదేవి చిత్తవినోదార్థము నానాకథామృతమయమైన యీ బృహత్కథాసార సంగ్రహమును బ్రాహ్మణోత్తముడయిన రామదేవుని కుమారుడు సోమదేవుడనువాడు కథాసరిత్సాగరమను నీ యుద్గ్రంథమును సంస్కృతభాషలో విరచించెను. [10] ఈ కథాసరిత్సాగరమును రచించిన సోమదేవుడును సంస్కృతభాషలో బృహత్కథను రచించిన క్షేమేంద్రుడును పైశాచీభాషలో వ్రాయబడిన మొదటి బృహత్కథనుండి తమ కథల సంగ్రహించితిమని చెప్పుకొనియున్నారు.

బృహత్కథ.

ఈ బృహత్కథను మొట్టమొదట శివుడు పార్వతికింజెప్పెను. అట్లు చెప్పుచుండగా శివుని ప్రమథగణములలోని వాడగు పుష్పదంతుడు వినెను. ఈ సంగతి పార్వతి తెలిసికొని భూమిమీద మనుష్యుడవై పుట్టుమని పుష్పదంతుని శపించెను. పుష్పదంతుడే వరరుచియను బ్రాహ్మణుడై పుట్టి మగధ దేశమును బాలించెడు యోగనందునకు మంత్రియయ్యెను. ఈ వరరుచియె కాత్యాయనుడను పేరిట బరగుచుండెను. ఇతడు వింధ్యారణ్యమునందలి కా రణభూతియను పిశాచరాజునకు బృహత్కథను వినుపించి శాపవిముక్తుడయ్యెను. ఈ బృహత్కథ లక్షలక్షపరిమితిగల యేడు మహాకథలను గలిగియున్నదట! పుష్పదంతుని మిత్రుడగు మాల్యవంతుడు శాపవశముచేత గుణాఢ్యుడుగా జనించి శాతవాహన మహారాజునకు మంత్రియయ్యెను. వరరుచి కాణభూతికి బృహత్కథను జెప్పిన సంగతివిని గుణాఢ్యుడు వింధ్యారణ్యమునకు బోయి తనకాకథ చెప్పి శాపవిముక్తుని చేయవలయునని కాణభూతినడిగెను. గుణాఢ్యునివంటి పండితుడు తనకు దర్శనిమిచ్చినందుకు సంతసించి కాణభూతి వాని జన్మవృత్తాంతమును దెలుపవలసినదని యడిగెను. గుణాఢ్యపండితుడిటు చెప్పెను.

గుణాఢ్య పండితుని చరిత్రము.

ప్రతిష్ఠానమునందు సుప్రతిష్ఠమను పట్టణమున సోమశర్మయను బ్రాహ్మణోత్తముడు గలడు. వానికి వత్సుడనియు గుల్మకుడనియు నిరువురు పుత్రులును శ్రుతార్థయను నొక పుత్రికయునుగలరు. కాలక్రమమున నా బ్రాహ్మణుడుభార్యతోగూడ పరలోకగతుడయ్యెను. అతనిగొమారులు చెల్లెలిని సంరక్షించుకొనుచు కాలము గడుపుచుండిరి. ఆమెకాకస్మికముగా గర్భముగలిగెను. అన్యపురుషులెవ్వరునచ్చట లేమింజేసి వత్సగుల్మకులలో నొకరిమీద నొకరికి ననుమానము గలిగియుండగా గనిపెట్టి సోదరులను సమీపించి శ్రుతార్థ "అన్నలారా, నా విషయమై మీకు పాపశంకవలదు; నాగరాజు వాసుకి తమ్మునికి కీర్తిసేనుడని కుమారుడు గలడు; అతడొకనాడు నేను స్నానముకు బోవుచుండగా చూచి మదన పరవశుడైతన కులగోత్రములు తెలిపి గాంధర్వవిధిచేత నన్ను వివాహమాడెనుకనుక నాకీ గర్భము కలిగినది" అని చెప్పెను. అందునకేమి దృష్టాంతమని సోదరులు ప్రశ్నించిరి. అంతనామె యేకాంతమున నాగకుమారుని తలచుకొనెను. అతడును వచ్చి వారలతో మీ చెల్లెలు పూర్వజన్మముననొక యప్సరస; శాపవశముననిట్టి జన్మమెత్తినది; మీరును శాపము చేత భూలోకమున జనించితిరి; ఈమెకు పుత్రుడు గలుగును; అంతటితో మీ మువ్వురకు శాపవిముక్తి కలుగును, అని చెప్పిపోయెను. పిమ్మట కొన్ని దినములకు నామెకు పుత్రుడుగలిగెను. ఆ వెంటనే ఆకాశవాణి "వీడొక ప్రమథునియవతారము, బ్రాహ్మణుడు; వీని పేరు గుణాఢ్యుడు"అని పలికెను. నేనే ఆ గుణాఢ్యుడను. పిమ్మట కొంతకాలమునకు నా తల్లియు మామలును శాపవిముక్తులై దేహత్యాగము చేసిరి. తరువాత నేను బాల్యావస్థలోనుండియు ధైర్యము తెచ్చుకొని విద్యార్థినై దక్షిణాపథమునకు పోయి క్రమముగానచ్చట సర్వవిద్యలను నేచ్చుకొని ప్రసిద్ధిగాంచి స్వదేశమునకు వచ్చితిని. ఒకనాడు నేను దేవేంద్రభవనము వంటిదైన రాజభవనమునకు పోయితిని. శిష్యులచేత ముందు వర్తమానము పంపి యనుజ్ఞబడసి లోపలికిబోయి ఆస్థానమునందు దేవతలచేత నింద్రుడునుంబోలె శర్వవర్మాదులచే పరివృతుడై రత్నసింహాసనాసీనుడైయున్న సాతవాహన[11]మహారాజును దర్శించితిని. వానినాశీర్వదించి యుచితాసనమున గూరుచుంటిని. అర్హవిధానమున రాజును నన్ను గౌరవించెను. అప్పుడు శర్వవర్మాదులు సాతవాహనునితో "దేవా! ఈతడు సకలవిద్యా విశారదుడు; లోకమంతట ప్రసిద్ధికెక్కినవాడు, అందుచేతనే యీ మహాత్మునికి గుణాఢ్యుడను పేరు సార్థకమైనది" అని విన్నవించి నన్ను పొగడిరి. అంతట సాతవాహనుడు ప్రీతుడై అప్పుడే నన్ను సత్కరించి మంత్రినిగా నియమించెను. అది మొదలుకొని నేను రాచకార్యములు విచారించుచు శిష్యులకు పాఠములు చెప్పుచు వివాహము చేసికొని సుఖముగానుంటిని. అని చెప్పగా కాణభూతి సాతవాహనుని కాపేరెట్లు గలిగెనో చెప్పుమనియడిగెను. గుణాఢ్యుడిట్లు చెప్పదొడంగెను.

సాతవాహనుని వృత్తాంతము.

దీపకర్ణియను రాజు దక్షిణాపథమును బాలించుచుండెను. వానికి ప్రాణప్రియయైశక్తిమతియని భార్యయుండెను. ఆమె యొకరాత్రి సుఖశయ్యను నిద్రించియుండగా పాము కఱచెను. అందుచేత నామె మరణమునొందెను. అంతట దీపకర్ణి శోకముచేత నపుత్రకుడయ్యును బ్రహ్మచర్యవ్రత మవలంబిం చెను. ఒకనాడు దీపకర్ణి మహారాజు తన వెనుక రాజ్యమేలుటకు తగిన పుత్రుడు లేకపోయెనుగదాయని విచారించుచు నిద్రపోవగా స్వప్నములో నీశ్వరుడు ప్రత్యక్షమై "ఓరాజా! నీవు వేటకుబోయినప్పుడా యడవిలో సింహము మీద సవారిచేయుచు నొక బాలుడు కన్పడును; వానినింటికి దెచ్చికొనుము. వాడే నీకు పుత్రుడగును"యని చెప్పి యదృశ్యుడయ్యెను. అంతట రాజు మేల్కొని యా స్వప్నమును స్మరించుకొనుచు నమితానందమును బొందుచుండెను. ఒకనాడు రాజు మృగయావినోదార్థము మహారణ్యమునందు విహరించుచుండగా మధ్యాహ్నకాలమునందు సింహారూఢుడై బాలసూర్యునిబోలె బ్రకాశించుచున్న యొక బాలుడు నొక తామరకొలనుయొడ్డున జూచెను. వానింజూచినతోడనే రాజునకు స్వప్నము సంగతి జ్ఞప్తికివచ్చెను. సింహము బాలుని దించి నీళ్ళు త్రాగుటకై సరస్సులోనికి బోవుచుండగా దీపకర్ణి యొక బాణమును ప్రయోగించి సింహమునుబడవైచెను. వెంటనే సింహము మనుష్యుడయ్యెను. (?) అంతటా మనుష్యుడు "రాజా; నేను కుబేరుని మిత్రుడను, యక్షుడను; నా పేరు సాతుడు; నేను పూర్వము గంగలో స్నానము చేయుచుండిన యొక ముని కన్యకను జూచి మదనబాణములకు గురియై యామెను గాంధర్వవిధి చేత వివాహమాడితిని; మా దాంపత్యమునుజూచి మునులోర్వజాలక సింహములగుదురుగాక యని శపింపగా మేమిరువురమును సింహదంపతులుగా జనించినారము; కాలక్రమమున నా భార్య గర్భిణియై యీ పుత్రుని కని కాలధర్మము నొందినది; నేనే వీని నితర సింహికల పాలతో బెంచితిని; నీ బాణము తగులగానే నా శాపము తీఱినది; ఈ మహాసత్త్వుని నీకిచ్చెదను; వీనిని పుత్రునిగా గ్రహింపుము; ఈ ప్రకారమే జరుగునని ఆర్యఋషులు విధించియున్నారు" అని చెప్పి సాతుడంతర్హితుడయ్యెను. దీపకర్ణి యీ బాలుని నింటికి గొనివచ్చి సాతుడతనికి వాహనమైనందున సాతవాహనుడని పేరుపెట్టి కాలక్రమమున బట్టాభిషిక్తుని జేసి తపస్సుకై యరణ్యమునకు బోయెను. అది మొదలుకొని సాతవాహనుడు భూమినేలుచున్నాడు.

రాణి శాతవాహనుని మూర్ఖుడని యవమానించుట.

సాతవాహనుడొకనాడు దేవీకృతోద్యానమునకు రాణులతోగూడపోయి యచ్చట నందనవనమునందు కొంతసేపు విహరించి జలక్రీడార్థమై పద్మసరస్సులో బ్రవేశించెను. ఇట్లు రాజును రాణులును పద్మసరోవరము సొచ్చి యిచ్ఛావిలాసముగా నొండొరులమీద నీళ్ళు చల్లుకొనుచుండగా శిరీష కుసుమ సుకుమారాంగియగు నొక దేవి జలక్రీడచే బడలినదై తనపై రాజు నీళ్ళు జల్లుచుండ నోపలేక సంస్కృతభాషలో "రాజన్ మాం మోదకైస్తాడయ" అని వేడికొనెను. దానిని విని వెంటనే రాజు విస్తారముగా మోదకములు (మిఠాయి) తెప్పించెను; అంతట రాణి నవ్వి, "రాజా నీళ్ళలో మోదకముల ప్రసక్తియేమి? మా ఉదకై తాడయ"అనగా "నీళ్ళతో గొట్టకుము" అనిగదా వేడితిని. మాశబ్దోదక శబ్దముల సంధినిగూడ నెఱుంగకున్నాడవు; నీవేమి యింత మూర్ఖుండవుగానున్నాడవు" అని శబ్దశాస్త్రమునందు నిపుణురాలయిన యా రాణి పలికిన పలుకులను విని పరిజనులందఱును పక్కున నవ్వసాగిరి. అంతట సాతవాహనుడు మనస్సులో మిగుల లజ్జాక్రాంతుడై జలక్రీడను వెంటనే మాని యుత్సాహములేక తన బ్రతుకునకు విసుగుకొనుచు తన మందిరమునకు బోయెను. అతడు చింతాసక్తుడై భోజనముకూడ వర్జించి యెవరేమియడిగినను పటమునందలి బొమ్మవలె మాఱుమాటలేకయుండెను. పాండిత్యమో మరణమో రెంటిలో నొక్కటియె శరణమని పాన్పునంబడి పరితపించుచుండెను. రాజుయొక్క దురవస్థను గాంచి పరిజనులందఱును దిగులుపడియుండిరి. తరువాత నేనును శర్వవర్మయున క్రమముగానంతయు దెలిసికొని రాజహంసుడను రాజరక్షభటవర్గములోని వానినొకని బిలిచి రాజట్లుండుటకు గారణమేమియని యడిగితిమి. "ఏలినవారికింత మనోవ్యథ మున్నెన్నడిట్లు కలిగియుండలేదు; విష్ణుశక్తి కూతురు తన యల్పపాండిత్య గర్వము చేత నేలినవారిని నవమానించినదని తక్కిన రాణులు చెప్పినారు" అని చెప్పెను. ఈ మాటకు మేము మిక్కిలి చింతించితిమి. నేను శర్వవర్మతో నిట్లంటిని "రాజునకు వ్యాధియైన వైద్యులువచ్చి యుందురు; మనోవ్యాధియేని అందులకు కారణమగుపించదు; రాజ్యము నిష్కంటకముగానున్నది; శత్రువనుమాటయే లేదు; ప్రజలందఱు ననురక్తులైయున్నారు; ఎందును ఏ లోపమును గానరాదు; ఆకస్మికముగా నితనికింత ఖేదమేల కలిగినది" మహామతియైన శర్వవర్మ నా మాటలకిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "మిత్రుడా! నేను తెలిసికొంటిని; తాను మూర్ఖుడైనందులకు రాజు దుఃఖించుచున్నాడు; ఇతడు తాను మూర్ఖుడనని తెలిసికొని తనకెన్నడయిన పాండిత్యమబ్బునాయని సార్వకాలము నపేక్షించుచుండును. ఆ మూర్ఖతకై రాణి యవమానపఱచెనని యిప్పుడేగదా విన్నారము". ఇట్లొకరితోనొకర మాలోచించుకొని యింటికిబోయి మఱునాడు ప్రాతఃకాలమున రాజనగరుకు పోయితిమి. ఎవ్వరును లోనికిరాగూడదని యాజ్ఞయైయున్నను ఏదో యుపాయముపన్ని మేమిరువురమును లోపల బ్రవేశించితిమి. నేను రాజు దగ్గఱకు బోయి కూరుచుండి "దేవా! ఏలయిట్లు నిష్కారణము ఖేదపడుచున్నాడవు"అని యడిగితిని గాని అతడు యధాప్రకారము ప్రత్యుత్తరము చెప్పక మౌనము వహించియుండెను. అంతట శర్వవర్మ "దేవా! ఎట్లయినను నాకు విద్య లభించునాయని నీవు పూర్వము నన్నడిగియుంటివి; అందు నిమిత్తమై నేను స్వప్నమాణవకుని చేసితిని; స్వప్నములో నాకాశమునుండి యొక కమలము రాలినది. దానిని దివ్యకొమారుడొకడు వికసిల్లజేసెను. అంతనాకమలమునుండి తెల్లని వలిష్ఠము దాల్చిన యొక దివ్యస్త్రీ బయలువెడలి వెంటనే నీ నోట ప్రవేశించినది. ఇట్లు కలగని మేలుకొంటిని; ఆమె సాక్షాత్తు సరస్వతియె నిస్సంశయముగా నీ నోట ప్రవేశించినది" అని యిట్లద్భుతవాక్యమును పలికెను. ఈ చల్లని పలుకులు చెవినిబడిన తోడనే సాతవాహనుండు మౌనము విడిచి సాభిప్రాయముగా "అయ్యా! శ్రద్ధతో చదువు చెప్పిన యెడల పురుషునికి పాండిత్య మెంత కాలమునకు గలుగునో చెప్పుము; విద్యలేక యీ నా సిరి శోభింపకయున్నది; కొయ్యకు తొడవులంబోలె మూర్ఖునికి నైశ్వర్యములెందుకు?" అని పలికెను. అంతట నేనును "లోకములో సర్వ విద్యలకును ముఖ్యమయిన వ్యాకరణమును పండ్రెండు సంవత్సరములలో మనుష్యులు గ్రహింతురు; ఓ దేవా! నేనా వ్యాకరణమును నీకాఱు సంవత్సరములలో నేర్పెదను" అని పలికితిని. శర్వవర్మ నా పలుకులను విని యీర్ష్యచేత "సుఖార్హుడయిన ప్రభువింతకాలమెట్లు విద్యాభ్యాస క్లేశముననుభవింపగలడు? ఓ మహాప్రభూ! నేను నిన్నాఱుమాసములలో పండితునిగా నొనర్చెదను" అని గరువముతో బలికెను. ఈ యసంభావ్యవచనమును విన్నతోడనే నాకు రోషమువచ్చి ఇట్లు ప్రతిజ్ఞ చేసితిని.

గుణాఢ్య శర్వవర్మలు ప్రతిజ్ఞ చేయుట.

"ఆఱుమాసములలో నీవే గనుక ప్రభువునకు పాండిత్యము గలుగజేయుదువేని నేను మనుష్య వ్యవహారములో నుండెడు సంస్కృత, ప్రాకృత దేశ భాషల మూడింటిని త్యజించినాడనని తెలిసికొనుము" ఈనా ప్రతిజ్ఞ విని శర్వవర్మ "నేను గనుక నా మాట ప్రకారము చేయలేకపోతినా ద్వాదశవత్సరములు నీ పాదరక్షలను నెత్తిమీద పెట్టుకొని మోసెదను" అని ప్రతి ప్రతిజ్ఞచేసెను. ఇట్లురివురము ప్రతిజ్ఞలు చేసి మా యిండ్లకు బోయితిమి. మా ప్రతిజ్ఞల మూలమున స్వల్పకాలములో దన కోరిక సిద్ధించునని రాజు తలంచి యూఱడిల్లియుండెను.

శర్వవర్మ సాతవాహనుని విద్వాంసుని జేయుట.

అటు తరువాత శర్వవర్మ తానుజేసిన యసాధ్య ప్రతిజ్ఞను దలంచుకొని దిగులుపడి పశ్చాత్తాపము పొంది తన కడగండ్లను పెండ్లాముతో జెప్పుకొని విచారింపసాగెను. ఆమెయు మిక్కిలి చింతించి "నాథా! మనము చింతించిన ప్రయోజనము లేదు; ఈ యపాయమునుండి మనల దప్పింప నొక్క కుమారస్వామి దక్క వేఱెవ్వరును లేరు" అని చెప్పెను. అంతట శర్వవర్మయు నదే నిశ్చయము చేసి కుమారస్వామిగుడికి బోయి వాయుమాత్రభక్షకుడై మౌనముదాల్చి దృఢనిశ్చయముతో తపస్సుచేసి యా దేవుని మెప్పించెను. అంతట కుమారదేవుడు వానికి ప్రసన్నుడై కోరిన వరంబులొసంగి యంతర్హితుడయ్యెను. శర్వవర్మయు కుమారస్వామి వరముచేత సిద్ధిమంతుడై వచ్చి తలంపు మాత్రముచేతనే సాతవాహనుని విద్యావిశారదుని గావించెను. పరమేశ్వరుని యనుగ్రహమునుండిన నేయసాధ్య కార్యము సిద్ధింపనేరదని ప్రజలు తమలోదాము చెప్పుకొనుచు రాజునకుం గలిగిన యాయద్భుత విద్యాలాభమును విని రాష్ట్రమంతటను మహోత్సవములు చేసిరి. ఇంటింటిమీద వుత్సవంపు జెండాలను వాయుదేవుడు నృత్య మాడించుచుండెను. రాజును శర్వవర్మను గురువుగా భావించి నమస్కరించి రాజార్హములయిన మణికనక వస్త్రాద్యలంకారములతో బూజించి నర్మదాతీరమందలి భరుకచ్చన దేశమునకు (Broach) రాజును చేసెను. సాతవాహనుడు తనకు విద్య లభించుటకు హేతువయిన రాణిని విష్ణుశక్తికూతురిని స్వయముగా పట్టాభిషేకము చేసి పెదరాణులపైన పట్టపుదేవిని గావించెను."ఓ కాణభూతీ! ఇది సాతవాహనుని వృత్తాంతము. హరప్రోక్తమయిన బృహత్కథను నింక నాకుజెప్పుము. మనమిద్దఱమును శాపమోక్షమును పొందుదముగాక" అని గుణాఢ్యుడడిగెను.ఇట్లు గుణాఢ్యుడడుగగా దివ్యమయిన యా మహాకథను ఏడు కథలుగా కాణభూతి తన భాషలోనే చెప్పెను. ఆ గుణాఢ్య పండితుడు మహారణ్యములో సిరా లేకపోవుటచేత విద్యధరులు దానిని హరింపకుందురుగాక యని తన రక్తముతోనే ఏడు సంవత్సరములో ఏడు లక్షల గ్రంథముగా విరచించెను. గుణాఢ్యుడు రచియించిన యా మహాకథను చూచి కాణభూతి శాపవిముక్తుడై దివ్యగతిని పొందెను. వానితోనున్న పిశాచములితరములయినవి సహితమాదివ్యకథను విని స్వర్గమునకు బోయినవి.

బృహత్కథను భూమిపై వ్యాపింపజేయబూనుట.

ఈ బృహత్కథను భూలోకములో స్థాపింపదలంచి శిష్యుల ప్రోత్సాహముచేత గుణాఢ్యుడు రసికుడయిన సాతవాహనుడొక్కడే యీ కావ్యమును గైకొనదగినవాడని తన శిష్యులయిన గుణదేవ నందిదేవుల కాపుస్తకము నిచ్చి సాతవాహనునొద్దకు బంపించెను. వారును సాతవాహన మహారాజును దర్శించి గుణాఢ్యుడు రచించిన బృహత్కథయనెడి గ్రంథమిదియని యాతనికి నివేదించిరి. వారు పిశాచ రూపులుగను గ్రంథము యొక్క భాష పిశాచభాషగను గన్పట్టుటచేత నసూయతగాంచి "ఏడు లక్షలు పరిమితి; భాష నీరసమైన పైశాచి; సిరా రక్తము, సీ! ఇదియేమి పాడుకథ!" యని పలికెను. అంత నా శిష్యులు జరిగిన మర్యాద చాలుననుకొని యా పొత్తమును గైకొనివచ్చినవారు వచ్చినట్లే పోయి జరిగినది జరిగినట్లు తమ గురువర్యునకు దెలిపిరి. తనకు జరిగిన యవమానమునకు గుణాఢ్య పండితుడు మిక్కిలి ఖేదపడియెను.

గుణాఢ్యుడు బృహత్కథను తగలంబెట్టుట.

తరువాత గుణాఢ్యుడు కొంతదూరమున నుండిన యొక పర్వతమునకు శిష్యవర్గముతో బోయి యేకాంతమైన రమ్యప్రదేశమునందు నగ్నికుండమును గావించి కూర్చుండి తన శిష్యులు కన్నీళ్లతో వీక్షించుచుండగా ఒక్కొక్క యాకుగా చదివి మృగములకును పక్షులకును వినిపించి తన శిష్యులకొఱకు ప్రియమైన లక్షగ్రంథాత్మకమయిన నరవాహన దత్తచరిత్రమను కథనుదక్క తక్కిన యాఱు కథలను ఆయగ్ని గుండములో బడవైచి కాల్చివేసెను. అట్లు చదువుచు కాల్చివేయుచుండ సొరంగ వరాహమహిషాది సకల జంతువులు మేతలు మాని కన్నీళ్లు విడుచుచు నిటునటు చలింపక యేకాగ్రముగా వినుచుండినవి.

గుణాఢ్యుడు బృహత్కథను సాతవాహనునకిచ్చుట.

ఇంతలో సాతవాహనుడు స్వస్థుడయ్యెను. అందులకు కారణము నరమాంస భుజనమని వైద్యులు చెప్పిరి. అంతట రాజు వంటవాండ్రను బిలుపించి యదలింపగా వారలు తమకట్టి మాంసమును వేటకాండ్రు తెచ్చియిచ్చిరని పలికిరి. వేటకాండ్రను బిలుపించి యడుగగా "మహాప్రభూ! ఇక్కడ యా పర్వతములో నొక్క బ్రాహ్మణుడొక్కొక్క పత్రమును చదివి నిప్పులో వేయుచుండుటచేత నక్కడకు వచ్చిన సకలప్రాణులును మేతలుమాని వినుచున్నవిగాని యవతలికిపోవు; అందుచేత నాకలివలన వాని మాంసమెండిపోయియున్నది" అని మొఱలెత్తి విన్నవించుకొనిరి. వారి మాటలను విని యతడచ్చెరువు నొంది కుతూహలముచేత స్వయముగా గుణాఢ్యుడున్న చోటికిపోయి శమింపగా మిగిలిన శాపాగ్ని థూమికల చేతనుంబోలె నరణ్యావాసమువలననైన జటలచేత నంతట సమాకీర్ణుడై సభాష్పములైన మృగముల మధ్యనున్న వానిని గుణాఢ్య మహాకవిని చూచి నమస్కరించి యా వృత్తాంతమునంతయు బ్రశ్నించి పుష్పదంతుని శాపము మొదలుకొని కథావతారమునంతయు భూతభాషలో జెప్పగా వాని వలన నంతయు దెలిసికొనియెను. గుణాఢ్యుని ప్రమథావతారమని శాతవాహనుడు తెలిసికొని వాని పాదములకు మ్రొక్కి హరముఖోద్గతమైన యా దివ్యకథనంతయు దనకు దయచేయుమని వేడికొనెను. అంతట గుణాఢ్యుడు "ఓ రాజా ఆఱు లక్షల గ్రంథమయిన యారుకథలను కాల్చివేసితిని; ఇది లక్ష గ్రంథము; ఆ కథలలో నిదియొక్కటియే మిగిలియున్నది; పుచ్చుకొమ్ము; నా శిష్యులు నీతోకూడా వచ్చి దానిని వివరించి చెప్పగలరు" అని చెప్పి రాజును వీడ్కొని యోగమహిమచేత దేహమును వదలి గుణాఢ్య పండితుడు శాపవిముక్తుడై తన దివ్యపదమును బొందెను. అట్లు గుణాఢ్యుడొసంగిన దానిని బృహత్కథయను పేరిటి యానరవాహన దత్తచరిత్రమును గ్రహించి రాజు తన పట్టణముచేరి గుణాఢ్యుని శిష్యులయిన గుణదేవ నందిదేవులను మణికనక వస్తువాహనాదులతో బూజించెను. ఆ శిష్యులతో గూడ యా కథను విభజించి యా భూతభాషలోనే కథావతారమును దెలుపుటకై యీ కథాపీఠమును రచియించెను. [12] ఈ బృహత్కథను సుబంధకవి వాసవదత్తలోను, బాణకవి కాదంబరిలోను, దండిమహాకవి కావ్యదర్శనము నందును బ్రశంసించియున్నారు. కాళిదాసు కూడ మేఘసందేశములో నిందలికథందడవియున్నాడు. మఱియు నాగానందప్రియదర్శికా రత్నావళీ ముద్రారాక్షసాది నాటకములకును, కాదంబర్యాధికథలకును, ఈ కథయె మూలముగానున్నది.

ఈ గాథయొక్క ప్రయోజనము.

కొండొక ప్రయోజనమాసించి కథాసరిత్సాగరమున దెలుపంబడి మనోహరముగా నుండిన పై గాథను సంగ్రహముగా దెలిపియుంటిమి. ఈ గాథ కాలనిర్ణయమున కెంతమాత్రమును దోడ్పడకున్నను ఆ కాలమునందలి ప్రజలమత విశ్వాసములను సాంఘీకస్థితిని దెలుపుటకు మాత్రము చాలియున్నది. ఆ కాలమునందు శైవమతమంకురించి ప్రజలలో వ్యాపించుచున్నది. స్వప్నములయందును జన్మాంతరములయందును, దేవతలయుందును మూఢవిశ్వాసము మెండుగా గలదు. గుణాఢ్యునియొక్కయు, సాతవాహనునియొక్కయు జన్మాదిక వృత్తాంతమునుబట్టి ఆర్యులుకనార్యులకు సంబంధ బాంధవ్యములు వెలయుచున్నవనియు సంకరసంతానము వర్థిల్లుచున్నదనియు బోధపడకమానదు. గుణాఢ్యుడు బ్రాహ్మణ స్త్రీకిని నాగకుమారునకును జనించియు శూద్రుడుగాగాని చండాలుడుగాగాని పరిగణింపబడక తన విద్యాప్రభావముచేత బ్రాహ్మణుగానే పరిగణింపబడుచుండెను. ఇట్లే యార్యబ్రాహ్మణ సంతతి యంతయు సాంకర్యమునుజెందుచుండెను. ఆంధ్రులుకూడ మిశ్రజాతివారని సాతవాహనుని జన్మాదికమును దెలుపగాథయెవేనోళ్ల జాటుచున్నది. మఱియు నొక్కవిశేషముగలదు. సాతవాహనుడు తొలుత విద్యావిహీనుడైయుండి విద్యావతియైన పట్టమహిషి చేత నధిక్షేపింపబడి సిగ్గుజెంది విద్యావంతుడగుటకు బ్రయత్నించి గుణాఢ్యశర్వవర్మల కృషిచేత బండితుడై విద్యావతియైన పట్టమహిషి పట్ల కృతజ్ఞతను జూపి యాదరించిన విధమెంత మోదావరాముగా నున్నది! ఈ విషయమొక్కటియే స్త్రీవిద్యయొక్క ప్రభావమును వేనోళ్లజాటుచున్నది. మనయాంధ్రదేశములో బ్రాచీనకాలమున స్త్రీవిద్యమిక్కిలి గౌరవింప బడుచుండెననుట సాతవాహనుని చరిత్రమే ప్రబలసాక్ష్యముగానున్నది. అనార్యులయిన జనసామాన్యముయొక్క భాషను వృద్ధిపొందింపబూని ప్రయత్నించిన విధమును ఆ కాలమునందలి రాజులును మంత్రులును జనసామాన్యభాషను నాదరింపుచు గ్రంథములు వ్రాయుచు వ్రాయించి వ్రాసినవారిని సత్కరించు చుండినట్లును, ఆర్యులా భాషయందును తద్భాషాగ్రంథములయందును అసూయతగలిగి యుండినట్లును బృహత్కథ వృత్తాంతమునుబట్టి మనకు సులభముగా బోధపడుచున్నది. ఈ మొదటి శాతవాహనునకును పురాణములలో బేర్కొనబడిన శ్రీముఖశాతవాహనుకును నడుమ ఖారవేలునకు దోడ్పడి మగధరాజగు పుష్యమిత్రునితో యుద్ధముచేసిన శాతకర్ణియను వాని పేరు దక్కమఱియొక యాంధ్రరాజుపేరు వినంబడకయున్నది. దక్షిణాపథము నేలినవాడును ఈ మొదటి శాతవాహనుని తండ్రియును అగు దీపకర్ణి మహారాజు ఆంధ్రవిష్ణు వంశోద్భవుడైయుండవలయును. అయినింకను విచారింపవలయును. ఇంక శాతివాహన (శాలివాహన) వంశజూలయిన యాంధ్రరాజుల చరిత్రమునకు బోవుదము.



  1. See the introduction to the Sacred Laws, VolII of the Sacred Books of the East edited by F.Max Muller.
  2. Next come the Andrae a still more powerful race which possesses numerous villages and thirty towns defended by walls and towers, and which supplies its king with an army of 100000 infantry, 2000 cavalry and 1000 elephants. Mc.Crindle's Magesthenes p.138.
  3. Dr.Burgess, "The Stupas of Amaravaty and Jaggayyapeta," A.S.S.T., p.3 referring to Wilson, Mackenzie Mss, Vol I intron p.c.xvi.
    The Godavary District Gazetteer ch.2., p.18,-
    Mr.A.D.Campbell's Telugu Grammar, intro. p.ii
    Mr. V.A.Smith's Early History of India, p.195.
  4. The site of the ancient town (N.lat. 20.28; E.long. 85.55) has been cut away by the river (Rea proc. Govt. Madras, Public, No. 423, dated June 19, 1892.)
  5. శైవమతమును గూర్చిన పై యంశములు క్రీస్తు శకము రెండవ శతాబ్దారంభమునను మధ్యమునను రచింపబడిన చీలప్పదికారము, తిరుమురుక్కరుపడై యను తమిళకావ్యములయందు జెప్పబడినవిగాని నా స్వకపోల కల్పితములు గావు.
    See "The Tamils:Eighteen Hundred Years Ago" by Mr.V.Kanakasabhai. pp.227-233.
  6. Mr. V.A.Smith's Early History of India, p.139.
  7. Ind. Ant. Vol xx. 247. Mr.V.A.Smith's Early History of India, p.151. The Godavary Dist. Gazetteer, p.17
  8. Hathigumpha inser in Actes, Sixieme congre's or. tome iii, p.174, Leide 1885.
  9. శ్రీముఖుని పేరు పురాణములలో దప్పుగాబేర్కొనబడినది.
  10. దీనినే చెన్నపురి క్రిస్టియన్ కాలేజిలో సంస్కృత ప్రధానోపాధ్యాయులుగానుండిన బ్రహ్మశ్రీవేదము వేంకటరాయశాస్త్రి గారాంధ్రములోనికి జక్కని శైలిని భాషాంతరీకరించినారు.
  11. శాతవాహనుడని శాసనములలో వ్రాయబడియుండగా సాతవాహనుడని కథాసరిత్సాగరమున వ్రాయబడినది.
  12. కథా సరిత్సాగరము కథాపీఠ లంబకమును చూడుడు.