ఆంధ్రుల చరిత్రము - ద్వితీయ భాగము/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము.

తెలుగు చోడులు.

ఎనిమిదవ శతాబ్దములో రేనాటిని బరిపాలించిన ప్రాచీనాంధ్రచోడులయొక్కయు, మొదటి కులోత్తుంగ చోడ చక్రవర్తికి ప్రతినిధులుగానుండి వేగిదేశమును బరిపాఆలించిన వెలనాటి చోడుల యొక్కయు, జరిత్రమును సంగ్రహముగా నాంధ్రులచరిత్రములోని ప్రథమ భాగమున దెలిపియున్నాడను. చాళుక్యచోడ చక్రవర్తులకును, కాకతీయ చక్రవర్తులకును లోబడిన సామంతులుగనుండి, తెలుగుదేశములోని పొత్తపినాడు, పాకనాడు, కమ్మనాడు మొదలగు నాడులను బరిపాలించి విఖ్యాతిగాంచిన మరికొన్ని చోడవంశములును గలవు. ఆ చోడవంశములయొక్క చరిత్రమునే సంగ్రహముగ నీ ప్రకరణమున వివరించుచున్నాడను. ఇదివరకు దెలిసికొనబడిన చోడవంశములోని యుపశాఖలన్నియును ద్రావిడభాషా సారస్వతములోని గాథలలో బేర్కొనబడిన కరికాల చోళుని వంశమునుండి యుత్పత్తి గాంచినట్లుగ జెప్పబడియున్నవి. వెలనాటి చోడులు తాము కరికాల వంశజులమని చెప్పుకొనలేదుగాని, రేనాటి చోడులు మాత్రము తాము కరికాల వంశజులమనియు, కాశ్యప గోత్రులమనియు జెప్పుకొనియున్నారు. ఆ రేనాటి చోడులకును, ఈ ప్రకరణమునందు దెలిపెడి పై మూడునాడుల చోడులకును, కొంతవరకెద్దియో సంబంధముండియుండ వలయును. తంజాపురి చోడులతో దమకు సంబంధము గలదని యెవ్వరును జెప్పుకొనిలేదు.

కరికాలచోళుడు.

తాము సూర్యవంశజులమనియు, కరికాలచోడుని సంతతి వారమనియు, జెప్పుకొని యుండుట చేత కరికాలుడెవ్వడో మనము తెలిసికొన వలసియున్నది. ఇతడు ద్రావిడభాషాసారస్వతములోని గాథలలో నుదాహరింపబడినవాడు. ఇతడు కావేరినది కానకట్ట కట్టించి గట్లుపోయించెననియు, నితనితండ్రి జటచోడుడనియు, అతడయోధ్యను బాలించెననియు, దెలుగుచోడుల శాసనములందభివర్ణింపబడియెను. చాళుక్యవంశమునకు మూలపురుషుడయిన విజయాదిత్యుడయోధ్యను బాలించుచుండి దక్షిణాపథము నేలుచుండిన త్రిలోచనపల్లవునితో బోరాడినట్లుగ దూర్పుచాళుక్య చక్రవర్తుల శాసనములందు జెప్పబడినట్లుగనే, అయోధ్యను బరిపాలించుచుండిన జటచోడుని కుమారుడు కరికాలచోడుడు కాంచీపురము నేలుచుండిన త్రిలోచనపల్లవునితో బోరాడి కాంచీపురమును బరిపాలించినట్లు తెలుగు చోడులయొక్క కొన్ని శాసనములవలన దెలియుచున్నది. దీనింబట్టి చూడగా, చోడులు చాళుక్యుల గాథలను జూచి తమ గాథలను గల్పించినట్లు కన్పట్టుచున్నది. కరికాలునకు మహిమానుడను కుమారుడును, ఆతనికి గరికాలుడు, తొండమానుడు, దాసవర్మయను మూవురు కుమారులును గలరనియు శాసనములందు గన్పట్టుచున్నది. కరికాలుని వంశమున దెలుగు బిజ్జన జనించెను. ఇతని వంశమునుండి రెండుశాఖలుద్భవించినవి. దాసవర్మనుండి యొకశాఖ పుట్టెను.[1]

కొణిదెన చోడులు.

కరికాల వంశమున జనించిన దాసవర్మ మొదట పాకనాటి రాష్ట్రమును జయించి పొత్తపి పట్టణమును రాజధానిగ జేసికొని పరిపాలించెనని చెప్పబడియున్నది. పొత్తపియనునది కడప మండలమునందలి పుల్లంపేట తాలూకాలోని టంగుటూరునకు సమీపమునందున్న పోతపి యను గ్రామమే గాని వేరొండుగాదు. [2] ఈ పొత్తపి రాజధానిగా గల పొత్తపినాడును బరిపా లించిన చోడులను గూర్చి మరియొక తావున దెలిపెదను. ఈ పొత్తపి శబ్దము పెక్కండ్రు చోడరాజులయొక్క బిరుదనామములతో బొందుపరుపబడియున్నది. ఒకానొకప్పుడు ఈ రాజులకు పాకనాటిలోని కందుకూరు రాజధానిగనుండుచువచ్చెనని పెద్ద చెరుకూరు శాసనమువలన దెలియుచున్నది. దీనికిబూర్వము స్కందపురమని పేరుగలదు. ఈ రాజులయొక్క ప్రాచీన చరిత్రము దెలియలేదు. ఈ పొత్తపినాటిని బరిపాలించిన దాసవర్మ సంతతివారు కమ్మనాటిని జయించి కొట్యదొనను రాజధానిగా జేసికొని బరిపాలనము చేసిరి. ఈ కొట్యదొనపట్టణము ఇపుడు గుంటూరు మండలములోని నరసారావుపేటకు సామీప్యమున కొణిదెన యను పేరితో బరగుచున్నది. ఈ చారిత్రము కొణిదెన శాసనములంబట్టి దెలియుచున్నది గాని, పొత్తపినాటిలోని వారు కమ్మనాటిలోనికెట్లు వచ్చిరో స్పష్టముగా దెలిసికొనుటకాధారము లేదు. చాళుక్య చోడ చక్రవర్తి యగు మొదటి కులోత్తుంగుని పాలనావసానకాలమున నిదివరకెన్నడును దెలుపబడని కొంత కల్లోలము వేగిదేశమున సంభవించినట్లుగ గానంబడుచున్నది. కులోత్తుంగుని పరిపాలన కాలమున వేగి దేశమును బాలించెడి రాజప్రతినిధులు వెంటవెంటనే మారుచుండుటయు, కులోత్తుంగుడు వెలనాటి చోడుని దత్తకునిగ స్వీకరించుటయు, మొదలగువానియొక్క పూర్వోత్తర సందర్భములు విస్పష్టములు గాకయున్నవి. ఎనిమిదవ శతాబ్దములో రేనాటిని పాలించిన చోడులు మూడుశతాబ్దములూరును బేరును లేకయుండి, వేగిదేశమున గల్లోలము కలిగినప్పుడు సమయమును గనుపెట్టి కమ్మనాటిలో రాజ్యమును స్థాపించియుండవచ్చును. ఈ తెలుగుచోడుల శాసనములు కమ్మనాటిలో గానవచ్చుచున్నవి.

బల్లయచోడదేవ మహారాజు.

శ్రీమన్మహామండలేశ్వర బల్లయచోడదేవ మహారాజుయొక్క క్రీ.శ.1106_7వ సంవత్సరములోని శాసనము ప్రాచీనమైనదిగ గన్పట్టు చున్నది. ఇతడు కమ్మనాటికి ముఖ్యపట్టణమగు కొట్యదొన అను కొట్టిదొన (కొణిదెన) యందు బల్లీశ్వరాలయమను పేరుతో నొక శివాలయమును గట్టించెను. దాని చిహ్నములిప్పుడు గానరావు. ఒరయూరుపురవరాధీశ్వరులమనియు, టేంకణాదిత్యులమనియు, బిరుదనామములను వహించుట కొణిదెన చోడులకు నాచారమైయుండెను. ఒరయూరు కావేరీతీరముననున్నది. ఇది పూర్వము ప్రాచీన చోళమండలమునకు రాజధానిగనుండెను. ఈ చోడబల్లి కుమారసంభవమను మహాకావ్యమును రచించిన నన్నెచోడుని తండ్రియైనటుల గుమారసంభవములోని ఈ క్రింది పద్యమువలన దేటపడుచున్నది.

"చ. అదినరపాలమౌళిదళితాంఘ్రియుగండయి పాకనాటియం
దిరువది యొక్క వేయిటి కధీశుడు నా జనుచోడబల్లికిం
జిరతర కీర్తికగ్ర మహిషీ తిలకం బన హైహయాన్వయాం
బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీసతికిం దనూజుడన్."

ఆ కాలమునందు కమ్మనాడు పాకనాటిలోని యొక భాగముగానుండెను. పాకనాడు జయంకొండ చోళవలనాడులో నంతర్భాగమై యిరువది యొక్క వేల గ్రామములు గలిగియుండెను. శ్రీమన్మహామండలేశ్వరుండైన బల్లయచోడ మహారాజు కొట్యదొన రాజధానిగా బైజెప్పిన యిరువదియొక్క వేలుగల పాకనాటిని బరిపాలించుచుండెను. బల్లయచోడుని కొడుకు కామచోడుడని శాసనములలో చెప్పబడియుండుటచేత, నీ చోడబల్లి నన్నె చోడదేవుని తండ్రి కాడని సందేహింపవలసి వచ్చుచున్నది. అయినను నన్నెచోడుడు చోడబల్లి కగ్రమహిషియైన శ్రీపతికి దనూజుడనని పై పద్యములో జెప్పుకొనియుండుట చేత చోడబల్లికి బెక్కండ్రు భార్యలు గలరనియు, నన్నెచోడుడు పెద్దభార్య కొడుకనియు, కామచోడుడు మరియొక భార్యయొక్క తనయుడనియు, మనమూహింపవచ్చును. కమ్మనాటిలో నంతర్భాగమైయుండిన దర్శిసీమలోని మన్నేపల్లి గ్రామములో చోడబల్లియొక్క రెండు శాసనములు గానిపించుచున్నవి. "శ్లో. శ్రీమత్పోత్తపి నన్నెచోడతనయః శ్రీవేఙ్కభూపాలకః
తత్పుత్త్రోరిపదాచలా పహపవిః కామాక్షితీనాయకః
సూనుః సూర్యకులాన్వయామ్బుధిశశీ శ్రీబల్లిభూపాలకః
గౌరీనాథ పదాబ్జ వన్దిత గుణః సౌజన్య రత్నాకరః"

అను శ్లోకమాశాసనముల మొదట వ్రాయబడియున్నది. దీనింబట్టి పొత్తపి నన్నెచోడునకు వేంకభూపాలుడును, వానికి కామాక్షితి నాయకుడును, వానికి బల్లిభూపాలకుడును జనించినట్లుగా దెలియుచున్నది. ఇందొకటి శా.శ.1067వ సంవత్సరముకు సరియైన క్రీ.శ.1145_46వ సంవత్సరమునను, మరియొకటి శాశ.1088వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1166_67వ సంవత్సరమునను, శ్రీమన్మహామండలేశ్వర బల్లిచోడ మహారాజుచే వ్రాయింపబడినవి. ఈ శాసనములలో నన్నెచోడుడు చోడబల్లికి బ్రపితామహుడై యుండగా, కొణిదెన శాసనములలో నన్నెచోడుడు చోడబల్లికి మునిమనుమడైయున్నట్లుగా జెప్పబడియున్నది. మన్నేపల్లి శసనములలోని చోడులును, కొణిదెన శాసనములలోని చోడులు నొక వంశములోని వారై యొక్క ప్రదేశమునే పరిపాలించుచున్న వారనుటకు ననేక నిదర్శనములు గానంబడుచున్నవి. కొణిదెన శాసనములలో మొదట గన్పట్టెడి "స్వస్తిచరణ సరోరుహ విహిత విలోచన ప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీ తీరకరికాల కులరత్న ప్రదీపాహిత కుమారాంకుశ"యనెడి సంస్కృత వాక్యము, మన్నేపల్లి శాసనములందును గానంబడుచున్నది. మన్నేపల్లి శాసనములలోని వంశమును చోడబల్లికి బూర్వమందును, కొణిదెన శాసనములలోని వంశమును బరమందును బెట్టి వంశమును సమన్వయింప బ్రయత్నించుటకైన నా శాసనములలో నుదాహరింపబడిన సంవత్సరములు బాధించుచున్నవి. ఆ సంవత్సరములు సరియైనవి కావని సహేతుకముగ ఋజువు చేసిన గాని సమన్వయము సాధ్యము గాదు.

[3]

నన్నెచోడ కవిరాజశిఖామణి.

ఇతడు కుమారసంభవమను ప్రౌఢకావ్యమును రచించిన కవిరాజశిఖామణి. ఇతడు తన కుమారసంభవములో దన తల్లిదండ్రులనుగూర్చి చెప్పిన పద్యమును మీదనుదాహరించి యున్నాడను. మరియు నితడు సగరసుతులను, భగీరథుని, రాఘవుని, కరికాలచోడుని సూర్యవంశాధిపతులుగా బేర్కొని వారి కెనవచ్చు సుశ్లాఘధనులనని యీ క్రింది సీసపద్యములో జెప్పికొనియున్నాడు.

"సీ. కుతలంబునడుకొన గొలగొండగా నిల్పి
శరనిధిగ్రొచ్చిరి సగరసుతులు,
మిన్నులపై బారుచున్న యే రిల దెచ్చి
వారాశినించె భగీరథండు,
గోత్రాచలములెత్తికొని వచ్చి కడచన్న
రత్నాకరముగట్టె రాఘవుండు,
జలధి మహీపతి మొలనూలుగాజుట్టి
పాలించె గరి గరికాలచోడు,
వరుసనిట్లు సూర్యవంశాధిపతులంబు
నిధయ మేరగాగ నిఖిలజగము
నేలిచనినవారి కెనవచ్చు సుశ్లాఘ
ధనుడ నన్నెచోడ జనవిభుండ."

ఈ నన్నెచోడునిగూర్చి కుమారసంభవములోని పీఠికయందిట్లు వ్రాయబడియున్నది. [4] “ఇతడు కావేరీ తీరమున నొరయూరనుపురము రాజధానిగా జోళమండలమునేలినవాడు. ఇతనికి దిగ్విజయమునుబట్టి టేంకణాదిత్యుడనియు, గవిత్వకౌశలమువలన గవిరాజశిఖామణియనియు, బిరుదములు గలిగెను. ఇతడు క్రీ.శ.940వ సంవత్సరమున బాశ్చాత్యచాళుక్యులతో నెదిర్చి రణరంగమున నిహతుడయ్యెను.”

ఈ పైనిజెప్పబడిన నన్నెచోడుని కాలమును స్థలమును సరియైనవి కావని చరిత్రపరిశోధనము వలన దెలియుచున్నది. ఆ కాలమున నొరయూరు రాజధానిగ జోళమండలమును బరిపాలించుచున్నవాడు మొదటి పరాంతకుని కుమారుడగు రాజాదిత్యుడేగాని నన్నెచోడుడుగాడు. [5]

ఈ రాజాదిత్యుడు రాష్ట్రకూటరాజయిన మూడవ కృష్ణరాజుతో తక్కోలమను ప్రదేశమున యుద్ధముచేసి రణనిహతుడయ్యెను. కాబట్టి నన్నెచోడుడాకాలమున నొరయూరును బరిపాలించుచున్న వాడను మాట నిరాధారమైనది. నన్నెచోడ నామము గలవారు పెక్కండ్రు పాకనాటి కమ్మనాటి తెలుగుచోడులలో గాన్పించుచుండుటచేతను, తన గ్రంథమునందు నన్నెచోడుడు పాకనాటి పేరు నుదాహరించి యుండుటచేతను, శ్రీశైలమునందుండెడు తన గురువయిన మల్లికార్జునయోగి నభివర్ణించి తన కావ్యమునంకితము చేసియుండుటచేతను, తప్పక నన్నెచోడుడు తెలుగుచోడులలోని వాడు గాని యన్యుడు గాడని స్పష్టమగుచున్నది. ఇంతియుగాక, పాకనాటికధీశుడైన చోడబల్లియొక్కయు, శ్రీసతియొక్కయు దనూజుడనని చెప్పికొనియుండుటచేత నితడు తప్పక కొణిదెనచోడవంశములోని వాడని చెప్పవలయును. పొత్తపినాటిని, పాకనాటిని, కమ్మనాటిని,బరిపాలించిన తెలుగుచోడులెల్లరు నొరయూరు పురవరాధీశ్వరులమని తమ శాసనములందు బేర్కొనియున్నారు. “అవశ్యంపితురాచార”మ్మనునటుల బెద్దలయాచారాము నవలంబించి ఘనతకొఱకు నొరయూరు పురవరాధీశ్వరులమను బిరుదమును వాడుకొనుచుండిరే కాని, వారెన్నడు నొరయూరును బాలించినవారు కాకపోవుటమాత్రమేగాక, కన్నులతో జూచినవారుగా గూడనుండరు. కావున నన్నెచోడుడు తన కుమారసంభవములో, __

“క. కలుపొన్నవిరుల బెరుగం
గలుకోడిరవంబుదిశల గలయగ జెలగన్
బొలుచు నొరయూరికధిపతి
నలఘు పరాక్రముడ డెంకణాదిత్యుండన్.“

అని చెప్పికొన్నది పితరులయాచారమునుబట్టిగాని నిజముగ నొరయూరును బరిపాలించుచున్న హేతువుచేత నని యెంతమాత్రమును దలపరాదు. ఇంకనా కాలముననీతడు పాకనాటిని గాని, కమ్మనాటినిగాని, బరిపాలించుచున్న వాడేమో కొంచెము విచారించిచూతము. ఆ కాలమున రెండవ చాళుక్య భీమవిష్ణువర్ధన మహారాజువేంగీదేశమునుబరిపాలించుచుండెను. ఇతడు క్రీ.శ.934 మొదలు క్రీ.శ.945 వరకు రాజ్యపరిపాలనముచేసెను. ఇతనికొడుకు అమ్మరాజ విజయాదిత్యుడు క్రీ.శ.945వ సంవత్సరము డిసెంబరు నెల 5వ తేదీకి సరియైన శా.శ.867వ సంవత్సరము మార్గశీర్ష బహుళ త్రయోదశీ శుక్రవారమునాడు పట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు తన సైన్యాధ్యక్షుడైన దుర్గరాజు చేత కమ్మనాటిలో ధర్మపురికి సామీప్యమున నిర్మింపబడిన కటకాభరణమనియెడి దేవాలయమునకు క్రీ.శ.945వ సంవత్సరమున మల్లిపూడి యను గ్రామమును దానముచేసియుండెను. ఈగ్రామమిప్పుడు పేరుమాసియున్నను, శాసనములోనుండి పొలిమేర గ్రామములు వంగవోలు తాలూకాలో గానిపించుచున్నవి. ఇంతియగాక, గుంటూరు మండలములోని కారెంచేడు గ్రామవాసి యగు మాసన్నయను బ్రాహ్మణునకు సైన్యాధ్యక్షుడైన దుర్గరాజుయొక్క ప్రేరణచేత అన్మనంగనూరు, అందెకి గ్రామములలో భూదానములను జేసి యుండెను. కాబట్టి యా కాలమున నాదేశమును బరిపాలించుచుండినవారు రెండవ చాళుక్యభీమ విష్ణువర్ధనుడును, అతని చిన్నకొడుకగు అమ్మరాజవిజయాదిత్యుడును అగు పూర్వచాళుక్యులని పై శాసనములనుబట్టి స్పష్టమగుచున్నది.[6] మరియు నా శాసనములలో అమ్మరాజవిజయాదిత్యుని తండ్రియగు రెండవ చాళుక్య భీమ విష్ణువర్ధనుడు తన దాయాదులయిన యుద్ధమల్లుడు, రాజమార్తాండుడు, కంఠికివిజయాదిత్యుడు మొదలగు వారితో యుద్ధముచేసి రాజమార్తాండుని సంహరించి తక్కినవారిని దేశమునుండి తరుమగొట్టెనని చెప్పబడినది. పై నుదాహరింపబడిన వారిలో కంఠికివిజయాదిత్యుడే బేటవిజయాదిత్యుడనువాడు. ఈ బేటవిజయాదిత్యుడు తన తండ్రియైన అమ్మరాజ విష్ణువర్ధనునకు వెనుక క్రీ.శ.915వ సంవత్సరమున రాజ్యభారమును వహించియు, యుద్ధమల్లునికొడుకయిన తాళరాజుచే బదభ్రష్టుడయ్యెను. ఇతని కొడుకు సత్యాశ్రయుడు. ఇతడు చక్రవర్తి పదము బడయకపోయినను, మహామండలేశ్వరుడుగనుండి వేంగీదేశములో గొంతభగమును బరిపాలించుచుండెను. క్రీ.శ.925_40 సంవత్సరముల ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభవకావ్యమున నీ క్రింది పద్యములో బేర్కొనియున్నాడు.

“క. మును మార్గకవితలోకం
బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జన సత్యాశ్రయుని దొట్టి చాళుక్యనృపుల్.“

దీనింబట్టి నన్నయభట్టారకునకు నూరేండ్లకుబూర్వమే యాంధ్రకవితాసతి వర్ధిల్లుచున్నదని స్పష్టమగుచున్నది. ఈ పై పద్యమునందుజెప్ప బడిన సత్యాశ్రయునకు దరువాతనే నన్నెచోడుడున్నవాడని నిస్సంశయముగా జెప్పవచ్చును. అమ్మరాజవిజయాదిత్యుడు క్రీ.శ.970వ సంవత్సరమువరకు బరిపాలించిన తరువాత నతని సవతియన్నయు రెండవ చాళుక్యభీముని జ్యేష్ఠపుత్త్రుడునగు దానార్ణవుడు 970వ సంవత్సరమున రాజ్యభారమును వహించి 973వరకు మూడు సంవత్సరములు రాజ్యపరిపాలనముచేసెను. తరువాత వేంగీదేశమరాజకమైనట్టు అనేక శాసనములవలన దెలియుచున్నది. దీనికి పూర్వచాళుక్య రాజకుటుంబములో సంభవించిన పరస్పర కలహములు గొంతవరకు గారణములుగానున్నను, వేరొక గొప్పకార ణముగూడ గానంబడుచున్నది. దక్షిణహిందూస్థానమునందు వేంగిరాజ్యమునకు బడమర రెండు శతాబ్దములనుండి వర్ధిల్లుచుండిన రాష్ట్రకూటసామ్రాజ్యము నిర్మూలము గావింపబడి మరల బశ్చిమచాళుక్య సామ్రాజ్యము నెలకొల్పబడియెను. రాష్ట్రకూటచక్రవర్తియైన రెండవ కర్కలుని జయించి, పశ్చిమచాళుక్య వంశమున జనించిన యొకానొక విక్రమాదిత్యుని కొడుకగు తైలపదేవుడు క్రీ.శ.973వ సంవత్సరమున సింహాసనమెక్కి, అదివరకు రాష్ట్రకూటచక్రవర్తులకు లోబడియుండిన మహామండలేశ్వరులయిన రాజులను వశపరచుకొనుటకు బ్రారంభించెను. ఆ కాలమునందు రాష్ట్రకూటులకు సామంతులుగనుండిన వైదంబులు, బాణులు, నలంబులు, చోడులు మొదలగువారాధిపత్యములక తమలో దాము పోరాడుచు, గొందరు శములను విడిచి వేంగీదేశములోని దక్షిణభూములాక్రమించుకొనసాగిరి. మహాబలివంశమునందు జనించిన అగ్గపరాజను బాణుడు అన్నగూరి అగస్తేశ్వర భట్టారకునకు పదియవ శతాబ్ద మధ్యమున భూదానము చేసినటుల దెలిపెడి శాసనమొకటి కమ్మనాటిలోని పొదిలి సీమలో జేరిన సన్నమూరు గ్రామమున గన్పట్టుటచేత నా ప్రాంతము బాణులస్వాధీనమాయెనని యూహింపవచ్చును. ఆ శాసనమునందాతడు పరివీపురాధిపతియని చెప్పబడినది. రాయవేలూరునకు దక్షిణభాగమునందుండు 'పడైవీడు' అనునదే పరివీపురమని కొందరిచే నిర్ధారింపబడినది. ఈ బాణరాజులు మొదట గాంగపల్లవులకును; పిమ్మట ద్రావిడచోడులకును, అటుపిమ్మట రాష్ట్రకూటులకును సామంతులుగనుండినటుల దోచుచున్నది. ఏది యెటులున్నను బాణులు, వైదుంబులు, రాష్ట్రకూటులు, పశ్చిమచాళుక్యులు, పల్లవులు, తెలుగుచోడులు, మొదలగువారు వేంగీదేశముయొక్క దక్షిణభాగమును, పూర్వచాళుక్య రాజకుమారులు వేంగీదేశముయొక్క యుత్తరభాగమును కల్లోల పెట్టుచుండుటచేతను, దానార్ణవుని కాలమున వేంగీదేశము అరాజకముగానుండెననుట కెంతమాత్రమును సందియము లేదు.

క్రీ.శ.985వ సంవత్సరమున రాజారాజరాజకేసరివర్మ చోడసామ్రాజ్యమునకభిషిక్తుడై, వేంగీదేశమరాజకముగనుండుటయు తత్కారణమున దనరాజ్యముయొక్క, యుత్తరభాగమున నల్లరులు రేగుటయుగాంచి, యుపేక్షించినచో దన సామ్రాజ్యమునకు భంగము సంభవించునని యూహించి క్రీ.శ.999వ సంవత్సరమున బహుసైన్యములంగూర్చుకొని వేంగిదేశమునపై దండెత్తి వచ్చి కలహకారులనెల్ల నడంచి దానార్ణవుని జ్యేష్ఠపుత్త్రుడగు శక్తివర్మను వేంగీరాజ్యమునకభిషిక్తుని గావించి, పిమ్మట స్వదేశమునకు వెడలిపోయెను. నాటినుండియు జోడులకును బూర్వచాళుక్యులకును మైత్రియొప్పుచుండెను. శక్తివర్మకు తరువాత వేంగీదేశమును బరిపాలించిన విమలాదిత్యుడును, రాజరాజనరేంద్రుడును,చోడ చక్రవర్తుల పుత్రికలనే వివాహమాడినవారగుటచేత రాజనరేంద్రుని పుత్త్రుడగు మొదటి కులోత్తుంగుని కాలమున రెండురాజ్యములైక్యమగుట సంభవించెను. రాజనరేంద్రుని మరణానంతరమున వీరరాజేంద్ర చోడచక్రవర్తి వేంగీకళింగ దేశములపై దండెత్తివచ్చిచాళుక్యసైన్యాధిపతులగు జననాథుని , రాజమయ్యను, ముప్పరాజును, విజయవాటిక (బెజవాడ) యొద్ద నెదుర్కొని యుద్ధముచేసి జయించి రాజనరేంద్రుని తమ్ముడగు విజయాదిత్యుని వేంగీ రాజ్యమునకభిషిక్తుని గావించెను. కాని క్రీ.శ.1070వ సంవత్సరమున కులోత్తుంగచోడుడు చోడసామ్రాజ్యమునకభిషిక్తుడై పినతండ్రి యగు విజయాదిత్యుని క్షమించి యాతని వేంగీదేశమునకు రాజప్రతినిధిగ నియమించెను. ఆ కాలముననే కాబోలు గరికాలచోడవంశజుడును, తెలుగుచోడుడునైన దాసవర్మ పాకనాటిని జయించి పొత్తపి రాజధానిగ బాకనాటిని బాలించుచుండెను. ఈ దాసవర్మ సంతతివారే తరువాతి కమ్మనాటిలోని కొట్యదొనను (కొణిదెన) రాజధానిగ జేసికొనిరి. మొదటివారు స్వతంత్రులుగనున్నను, తరువాతి వారు కులోత్తుంగచోడునికి సామంతులుగనుండిరి. ఈ వంశములోని వాడే యగు చోడబల్లి క్రీ.శ.1106వ సంవత్సర ప్రాంతముననున్నట్లు దెలియుచున్నది. కాబట్టి మన కుమారసంభవ కావ్యమును రచించిన నన్నెచోడకవి యితని కుమారుడేయైనయెడల బండ్రెండవ శతాబ్దారంభమునందనగా నన్నయభట్టారకునకు నరువది డెబ్బది సంవత్సరములకు దరువాతి వాడుగా నుండవలయును. ఇది వాస్తవముగాక యితడు పైని నేనుదాహరించిన చోడబల్లయ మహారాజునకు ముత్తాతయగు పొత్తపి నన్నెచోడుడే యైనపక్షమున నన్నయభట్టారకునితో సమకాలికుడైయుండవలయును.

మల్లికార్జునయోగి.

నన్నెచోడకవి తన కుమారసంభవమును మల్లికార్జునయోగి కంకితము చేయుచున్నాడనని యీ క్రిందిపద్యములో జెప్పియున్నాడు.

“ఉ. పూనిమహాగ్రహారపుర వుత్త్రసమున్నతి దేవతాలయో
ద్యానతటాక సత్కృతినిధానములాశశి తారకంబు సు
స్థానములై మహింబరగు జంగమ మల్లయపేర సప్తసం
తానములొప్ప సల్పుదుముదంబునదత్ప్రభునాజ్ఞ పెంపునన్.”

మల్లికార్జునయోగియే తనకు గవిత్వమును బ్రసాదించినవాడని యీ క్రింది పద్యములో మనోహరముగా జెప్పియున్నాడు.

“సీ. శరధినీరులు పయోధరములు కొనివచ్చి
కురిసి వారధియందు గూర్చునట్ల,
చేనబండిన విత్తు చేనికి ఫలకాంక్ష
బేర్మి గ్రమ్మర వెదవెట్టునట్ల,
రోహిణాచలపతి కూహించి వరరత్న
సంచయంబున విభూషించునట్ల,
తీర్థాళి కర్థి దత్తీర్థోదకంబుల
నెసకంబుగా నర్ఘ్యమిచ్చినట్ల,
నింగిముట్టియున్న జంగమమల్లయ
వరమునందు గనిన వస్తుకవిత
దగిలి వారియంద నెగడింతు రవికి దీ
పమున నర్చ లిచ్చుపగిది వోలె.“

ఈ మహాకవి యాశ్వాసాద్యంత పద్యములలో గృతిపతి యగు మల్లికార్జునయోగికిని శివునకు నభేదము గల్పించి యభివర్ణించి యపూర్వంబైన గురుభక్తిని వెల్లడించియున్నాడు.

శివయోగియైన యీ మల్లికార్జున దేవుడు బసవేశ్వరుని తండ్రియని చెప్పబడిన మండంగి మాదిరాజు కాలమున శ్రీశైలమున నివసించియుండెనని బసవపురాణాదులవలనం దెలియుచున్నది. ఇతనింగూర్చి బసవపురాణము 19, 20 అధ్యాయములలో వ్రాయబడియున్నది. వీరశైవమతోద్ధారకుడయిన బసవేశ్వరుని తండ్రియగు మండంగి మాదిరాజు ఇతనితో బ్రసంగించినటుల బసవపురాణమునం బేర్కొనబడినవి. అందితడు యోగియగుటకు బూర్వము మల్లరాజ ధరణీ వల్లభుడుగ నున్నటుల వర్ణింపబడి యున్నది. ఈ జంగమ మల్లికార్జున దేవుని బ్రహ్మర్షియనియు, భూసురకులతిలకుడనియు, నన్నెచోడుడభినందించియుండుటచేత నితడు బ్రాహ్మణుడని స్పష్టమగుచున్నది. బసవపురాణమునందు జెప్పినది వాస్తవమగునేని యితడు మొదట సైన్యాధిపతిగనో మంత్రిగనో యుండి తరువాత సన్న్యసించియుండిన నైయోగికారాధ్య బ్రాహ్మణుడై యుండవలయును. ఇతరాధారములేవియును లేక కేవలము బసవపురాణములోని వాక్యముల నమ్ముటకు సాధ్యముకాదు. ఏలయన, బండ్రెడవ శతాబ్దమధ్యమునందు జరిగిన వృత్తాంతము పదునాల్గవ శతాబ్ద ప్రారంభమున రచింపబడియుండుటచే నిందలి విషయములనేకములు సత్యములయి చరిత్రాంశములుగ నుండజాలవు. కుమారసంభవ పీఠికయందు "ఇతని గురువును కృతికర్తయునగు మల్లికార్జునఋషి ద్రవిడమండలమున శైవసమయాచార్య త్రయములో మేలిమిగన్న మాణిక్యవాచకునితో వాదించినట్లు తెలియుచున్న”దని వ్రాయబడియున్న విషయము సత్యమగునేని మాణిక్యవాచకుడు వరగుణ పాండ్యభూమండలాధిపతితో సమకాలికుడు కావున, మన నన్నెచోడుడును మల్లికార్జునయోగియు దొమ్మిదవ శతాబ్ద మధ్యముననున్నవారనియూహింపవలసివచ్చును. ఇది విశ్వసింపదగినదిగా గన్పట్టదు. అయినననేక హేతువుల చేత నితడు క్రీ.శ.1120_40 సంవత్సరముల మధ్యనున్నవాడని చెప్పవచ్చును. ఈ కుమారసంభవకావ్యమును బఠించితిమేని తప్పక యిది నన్నయభట్టారకునికి బూర్వమున రచింపబడిన కావ్యమని బోధపడగలదు. ఇతరములయిన ప్రమాణములు గాన్పించువరకు నన్నెచోడకవి నన్నయభట్టునకు నరువది డెబ్బది సంవత్సరములకు తరువాత నున్నవాడనియే నిశ్చయింతము. నన్నెచోడుడు పాశ్చాత్యచాళుక్యులతో యుద్ధముచేసి రణనిహతుడయ్యెనని పీఠికయందు వ్రాసినది నిక్కమగునేని నేను చెప్పినకాలము తప్పక సరిపోవును. ఆ కాలమునందు కమ్మనాటికి బైనున్న పల్నాడు మొదలగు వానిని పశ్చిమచాళుక్యులకు గప్పముగట్టుచు సైన్యాధిపతులుగనున్న హైహయవంశజులు పరిపాలనము సేయుచుండిరి. వారలతోడనైన యుద్ధమున నీతడు మరణమునొంది యుండవచ్చును. ఇతడు యుద్ధములో జనిపోవుటకు గారణము కృతి ముఖంబున మగణము తరువాత రగణము నిలుపుటయే యని అథర్వణాచార్యుడు తన ఛందస్సునందీ క్రిందిపద్యమున దెలిపియున్నాడు.

“మగణమ్ము గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
బగు నిక్కమండ్రు, మడియడె
యగునని యిడి తొల్లి టెంకణాదిత్యుడనిన్“

ఇది కారణమైనను గాకపోయినను ఇతడు యుద్ధములో మరణముగాంచెననుమాట వాస్తవమనుటకు సందియములేదు. ఇతడొకప్పుడు రాజ్యముచేసెనని చెప్పుదురు. అందుచేతనే కాబోలు దన కుమారసంభవమున నీ కవి :

“క. పురుషుడు పురుషున కని న
స్థిర జీవిత లోభయుతమతిని వినమితుడై,
స్మరకలహకుపిత బ్రాణే
శ్వరి నాయుధ సమితి దెలచువాడటు మీదన్.“

“ఉ. మంచిగ బ్రీతిబాయక సమస్తజనంబులు దన్నుగొల్వజీ
వించిన ధన్యుడౌ మహిమ వీడిన జీవము మేననిల్ప నా
సించి విభుండు దానొకట సేవకుడై మనుకంటె ముందరా
ర్జించిన కీర్తి నిల్వ గతిసేకురగా ననిచావు సేగియే.“

అని వ్రాసికొనియున్నాడు. ఇతడు రచించిన కుమారసంభవము పదిరెండాశ్వాసముల గ్రంథము. ఇది కాళిదాసు కావ్యమునకు దెలుగుకాదని చెప్పబడినది. దీనిలో గణపతిజననము, సతీదహనము, మదనదహనము, పార్వతీ వివాహము, కుమారోదయము, తారకాసురయుద్ధము, తరాజయమును వర్ణింపబడినవి. ఈ కవిరాజశిఖామణి కావ్యములో వర్ణనలత్యద్భుతములై నూతనములై యున్నవనియు, ఏతత్కృతి చాల బ్రాచీనమైనను సకలకావ్య లక్షణములకు బుట్టినిల్లగుటచేత నప్పుడు మెరుగిచ్చితీర్చిన చిత్రమువలె మనోరంజకముగా నున్నదనియు, రాజ కవులలోను గవిరాజులలోను నిట్టివాడు లేడనుటయంత యతిశయోక్తిగాదనియు దద్గ్రంథమును సంపాదించి ప్రక టించిన బ్రహ్మశ్రీ రామకృష్ణయ్య ఎం.ఏ., గారి యభినుతోక్తులొప్పిదములనుటకు సందియము లేదు. [7]

కామచోడదేవ మహారాజు.

ఇతని పేరిటనే కొట్యదొనయందు కామేశ్వరాలయము నిర్మింపబడినది గాని యదియు నిపుడు గానబడదు. ఇతడు శా.శ.1059వ సంవత్సరముకు సరియైన క్రీ.శ.1137వ సంవత్సరమున కొట్యదొనలోని బల్లీశ్వరాలయమునకు భూదానము చేసినట్లుగ నా పట్టణములోని శంకరస్వామి యాలయమండపము మీది యొక స్తంభముపై దానశాసనము గాన్పట్టుచున్నది. శా.శ.1085వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1161వ సంవత్సరమున శ్రీయదేవి పై దేవాలయమునకు భూదానము చేసినట్లుగ గన్పట్టుచున్న శాసనములో శ్రీయదేవి కామచోడమహారాజుయొక్క పట్టమహషియని చెప్పబడియున్నది. ఆ సంవత్సరముననే చేయబడిన మరియొక భూదానశాసనములో శ్రీయదేవి బల్లయచోడ దేవమహారాజునకు గోడలని చెప్పబడి


[8] యున్నది. వీనింబట్టి బల్లయచోడదేవమహారాజునకు బుత్త్రుడని స్పష్టపడుచున్నది. ఈ కామచోడదేవ మహారాజునకు భీమన ప్రెగ్గడగనున్నట్లొక శిలాశాసనమువలనను, గుండయ దంనాయకుని పుత్త్రుడు రామన్నదండనాయకుడు సైన్యాధ్యక్షుడుగనున్నట్లు మరియొక శాసనమువలనను, శ్రీధరభట్టు పురోహితుడుగనున్నట్లు వేరొక శిలాశాసనమువలనను దెలియవచ్చుచున్నది. ఇతనికొడుకు త్రిభువనమల్ల దేవుడు.

త్రిభువనమల్ల దేవచోడమహారాజు.

ఈతడు శా.శ.1070వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1148వ సంవత్సరమున దన తండ్రి పొత్తపి కామచోడదేవమహారాజునకును, తల్లి శ్రీయదేవికిని, పుణ్యము కలుగుటకొరకు కొట్యదొనలోని భీమేశ్వరాలయమునకు భూదానము చేసియుండెను. ఈ భీమేశ్వరాలయమును ఇతని సేవకులలోనొకరు గట్టించిరని మరియొక శిలాశాసనమువలన గన్పట్టుచున్నది. శంకరమహాదేవాలయములోని మరియొక శిలాశాసనమునుబట్టి శ్రీయదేవి, పొత్తపి కామచోడదేవుడు, నీతనికి తల్లిదండ్రులని యుదాహరింపబడియున్నది.. కాబట్టి ఈతడు బల్లయచోడదేవ మహారాజునకు మనుమడ గుచున్నాడు. ఈతడు కొట్యదొనలోని కొండపై త్రిభువనమల్ల శ్రీకేశవదేవాలయమును నిర్మించెను. ఆ దేవాలయములోని శాసనములలో నాకొండకు "అభినవరైవతకాద్రి"యను పేరు గలిగినట్లుగా చెప్పబడినది. కమ్మనాటిని బరిపాలించిన కొణిదెన చోడులలో నీ త్రిభువనమల్ల చోడదేవుడు మిక్కిలి పరాక్రమవంతుడుగ గన్పట్టుచున్నాడు. ఇతని పట్టమహిషి మాబలమహాదేవి. కేతనయనునాతడీతనికి బ్రెగ్గడగనుండెనని యొక శిలాశాసనమువలన దెలియవచ్చుచున్నది. ఇతని శాసనములు కమ్మనాటిలోని వంగవోలు సీమలోని దర్శిసీమలోను గానవచ్చుచున్నవి. ఇతని పరిపాలనము క్రీ.శ.1154_55వ సంవత్సరమువరకు జరుగుచుండెనని శాసనములవలన దెలియుచున్నది. ఇత నికి నన్నెచోడుడు, కన్నరదేవచోడుడు, శ్రీచోడదేవుడు నను ముగ్గురుకొడుకులుగలరు.

నన్నెచోడమహారాజు.

ఈ నన్నెచోడమహారాజు తన తండ్రియైన త్రిభువనమల్లదేవ చోడమహారాజునకును, తల్లియైన మాబలమహాదేవికిని, పుణ్యముకలుగుటకొరకు అభినవరైవతకాద్రిపైనున్న కేశవస్వామి యాలయమునకు శా.శ.1070వ సంవత్సరము అనగా క్రీ.శ.1148వ సంవత్సరమున భూదానముచేసెను. క్రీ.శ.1151వ సంవత్సరమున మరల నాదేవునికి మరియొక భూదానము చేసెను. బొప్పూడిగ్రామములోని శివాలయమునకు సమీపమున నున్న స్తంభముపై నన్నెచోడునియొక్కయు, నతని యిర్వురుసోదరులయొక్కయు, నామములను దెలిపెడి శాసనము మరియొకటికలదు. ఈ శాసనము క్రీ.శ.1157వ సంవత్సరములోనిది. ఈ శాసనము శిథిలమయినదిగనున్నది. ఈ నన్నెచోడునకు అన్న మంత్రి మహాప్రధానిగనుండెనని యొకటిరెండు శాసనములవలన దెలియుచున్నది. కాబట్టి యీ నన్నెచోడుడు క్రీ.శ.1160వ సంవత్సరకాలముననున్నవాడని స్పష్టముగ తెలియుచున్నది.


సామంతమండలేశ్వరులు.

ఈ కొణిదెన చోడులలో ప్రాచీనులు చోడచక్రవర్తియగు కులోత్తుంగ రాజేంద్రచోడునకు సామంతులుగనున్నను, జాలవరకు స్వతంత్రపరిపాలనమునే చేయుచుండిరి గాని, తరువాతివారు రాను రాను స్వాతంత్ర్యమును గోల్పోయి చోడచక్రవర్తులకు ప్రతినిధులుగా నున్న మహామండలేశ్వరులయిన వెలనాటి చోడులకు లోబడి పరిపాలనము చేయవలసిన వారయిరి. కడపటివారు, కాకతీయ చక్రవర్తుల యధికారము విజృంభించిన తరువాత తమకుంగల యల్పస్వాతంత్ర్యమును గూడ గోల్పోయి కేవలము సేవకులై వారలను గొలువ వలసిన వారలైరి. ఈ సామంత చోడులు శైవమతావలంబకులుగనుండిరని వేరుగ నొక్కి చెప్పనక్కరలేదు. వీరు దేశాభిమానము, భాషాభిమానము, దేవతాభక్తి గల వారలు. కమ్మనాటిలో పెక్క శివాలయములు నిర్మించిరి. ఈ శివాలయములకు బెక్కు భూదానములను గావించిరి. వీరు కీర్తినారాయణులనియు, టెంకణాదిత్యులనియు, జగనొబ్బగండలనియు, ఒరయూరుపురవరాధీశ్వరులనియు, బిరుదములను వహించుచు వచ్చిరి. ఈ కొట్టిదొన చోడులలో గడపటివారి చరిత్రము కాకతీయుల గూర్చిన ప్రకరణములో వివరింపబడును.

నెల్లూరు తెలుగుచోడులు.

కొంతకాలము చాళుక్యచోడచక్రవర్తులకును మరికొంత కాలము కాకతీయాంధ్ర చక్రవర్తులకును లోబడి నెల్లూరు మొదలుకొని ద్రావిడదేశమునందలి కాంచీపురము వరకును గల దేశమును బరిపాలించి మండలేశ్వరులని ప్రసిద్ధిగాంచిన విక్రమసింహపురి తెలుగుచోడులను గూర్చిన చరిత్రమును సంగ్రహముగా వివరింతును. ఇప్పటి నెల్లూరు, పూర్వమీ చోడుల పరిపాలన కాలమున విక్రమసింహపురమని పేర్కొనబడుచుండెను. ఈ తెలుగుచోడులు తాము సూర్యవంశజులనియు, కశ్యపగోత్రులనియు, కరికాలాన్వయులనియు, తమ శాసనములయందు జెప్పుకొని యుండిరని యిదివరకే చెప్పియుంటిని. ఈ చోడవంశము నభివర్ణించుచు తిక్కనసోమాయజి తన నిర్వచనోత్తర రామాయణమున పై సంగతినే ఈ క్రింది పద్యములో దెలిపియున్నాడు.


“ఉ. అంబుజనాభు నాభినుదయం బయి వేధ మరీచిగాంచె, లో
కంబులకెల్ల బూజ్యుడగుకశ్యపుడాతనికిన్ జనించె, వి
శ్వంబు వెలుంగజేయగ దివాకరుడమ్ముని కుద్భవించె, వా
నిం బొగడం జతుశ్శ్రుతులు నేరకయున్నవి నాకు శక్యమే.“


ఇంతియగాక కరికాలుడు త్రిలోచనపల్లవుని జయించె ననియు, కావేరినది కానకట్ట కట్టించెననియు గూడ నీ క్రింది పద్యములో సూచించియున్నాడు.

“శా. చేసేతంబృథివీశులందుకొన గాశీసింధుతోయంబులన్
జేసెన్ మజ్జన, ముంగుటంబున హరించెం బల్లవోర్వీశును
ల్లాసం బొందంగ, ఫాలలోచనము, లీలంగట్టె గావేరి, హే
లాసాధ్యాఖిలదిఙ్ముఖుండు కలికాలక్ష్మావిభుండల్పుడే.“

ఇతని వంశమునందు మధురాంతక పొత్తపి చోడుడును, తెలుంగు బిజ్జనయు జనించిరి. వీరిలో మొదటివానిని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణమునం బేర్కొనియుండలేదు. ఈ చోడభూమీశుడు మధురాపట్టణమును జయించుటచేతను, ఆంధ్రదేశమున బొత్తపి యను పట్టణమును నిర్మించుటచేతను, మధురాంతకపొత్తపి చోడుడని వ్యవహరింపబడియెనట. విక్రమసింహపురి చోడులలో బెక్కండ్రు మధురాంతక పొత్తపి చోడుడనుటను బిరుదనామముగా దమనామములకు ముందు జేర్చుకొని శాసనములలో వ్రాయుచుండిరి. కవిబ్రహ్మయగు తిక్కనసోమాయజి మధురాంతకపొత్తపి చోడుని బ్రశంసించకపోయినను బిజ్జనను మాత్రము,

“చ. పురుషపరాక్రముం డగుచు బల్లవువీట నుదగ్రులైనప
న్నిరువుర నాతనింగలయ నెన్ని యనర్గళమత్సరంబు మై
మురరిపు సన్నిభుండు పదుమువ్వురగం డడగంగబెట్టె దా
బిరుదు వెలుంగ బిజ్జడరిభీకర భూరిభుజాలంబునన్.“

అని యభివర్ణించియున్నాడు. ఈ బిజ్జన ఉజ్యపురియందు, శిఖరమున గరుడ విగ్రహము గలిగియుండునట్టి విజయస్తంభము నొకదానినిర్మించెనని చెప్పంబడియెను.

[9] మధురాంతక పొత్తపి చోడుడును, తెలుగు బిజ్జనయు నున్న కాలము మనకు దెలియరాదు. బిజ్జన మొదటివాని వంశమున జనించెనని శాసనములలో చెప్పబడియుండుటం జేసి యా యిరువురకు నడుమగల కాలము దీర్ఘమైయుండవలయును. ఈ నెల్లూరు తెలుగుచోడులను గూర్చిన చరిత్రమును దెలిసికొనుటకు బూర్వమీదేశభాగము (నెల్లూరునకు దక్షిణభాగము) యొక్క పూర్వచరిత్రమును గొంత దెలిసికొనవలయును.

నెల్లూరు పూర్వచరిత్రము.

తొమ్మిదవ శతాబ్దాంతమున దక్షిణ హిందూస్థానమున బాండ్యుల బలపరాక్రమములు క్రమక్రమముగా క్షీణించుచుండినవి. ఆదిత్యచోడుడు గాంగపల్లవ రాజయిన అపరాజితుని నోడించి వాని రాజ్యమాక్రమించుకొన్నందునను, [10]మొదటి పరాంతకుని శాసనములు నెల్లూరు సరిహద్దునకు విశేషదూరముగాని కాళహస్తికి సామీప్యమున గనిపట్టబడినందునను, చోడులు తమ రాజ్యమును నెల్లూరు మండలములోని దక్షిణ భాగమునకు వ్యాపింపజేసి వేంగీదేశపాలకులగు తూర్పుచాళుక్యులకు బొరుగువారయిరని యూహింపవచ్చును. చోడుడైన మొదటి పరాంతకుడు గాంగపల్లవులకు సామంతులయిన బాణులను జయించినట్లుగ జెప్పుకొనియెను. బాణరాజుల శాసనములు గొన్ని కాళహస్తికి సామీప్యముననున్న గుడిమల్లము కడ గానిపించినవి. [11]ఈ భాగము పేరంబాణప్పాడియను పేరంబరగుచుండెను. పదియవ శతాబ్ద మధ్యమున రాష్ట్రకూటులు చోడరాజ్యములో నొక కొంతభాగము నాక్రమించుకొనుటచేత కొంతకాలము చోడుల ప్రభ కొంచెము తగ్గినంతమాత్రమున చో డుల యధికారము నెల్లూరు మండలములోని దిగువభాగమునకు వ్యాపించుటకభ్యంతరము గలిగినదని యెంతమాత్రమును దలంపరాదు. కాబట్టి నెల్లూరు మండలములోని యుత్తర భాగము వేంగీదేశములోను దక్షిణభాగము జయంగొండ చోళమండలములోను జేరియుండెనని నిస్సంశయముగా జెప్పవచ్చును. అయినను నెల్లూరునకు దిగువభాగమునందలి దేశమున మొదటి పరాంతకుడు మొదలుకొని మొదటి కులోత్తుంగ చోడుని వరకు శాసనము లేవియునంతగా గానంబడకుండుట చేత నా భాగము చాలవరకు నిర్జనారణ్యముగానుండెనని నూహింపబడుచున్నది. మొదటి పరాంతకుని నాటనుండియు ద్రావిడదేశమునందు బెక్కు దేవాలయములు స్థాపింపబడి పెక్కు శిలాశాసనములు లిఖియింపబడి యున్నవి. ఈ భాగము చోడులవశమై యున్నను మొదటి కులోత్తుంగుని కాలము వరకు నొక్క శాసనమైన గానరాదు. శాసనములు మాత్రమేగాక వీరు కట్టించిన పురాతన దేవాలయములయిన నా ప్రదేశమున గానరావు. ఆ ప్రదేశము శైవులకుగాని వైష్ణవులకుగాని పవిత్రములైన పుణ్యక్షేత్రములేవియును గానరావు. ఈ ప్రదేశము అనంతపురము, బళ్ళారి, కడప, కందవోలు మండలముల వలెనే దండకారణ్యములో నొక భాగముగానుండి చాలకాలము నిర్జనప్రదేశముగానే యుండినది. ఆ హేతువుచేతనే ఈ ప్రదేశమునందు పురాతన దేవాలయములుగాని, పురాతన బ్రాహ్మణాగ్రహారములు గాని లేకపోయెను. మొదటి కులోత్తుంగ చోడచక్రవర్తి కాలమున వేంగీ చోడ రాష్ట్రములు కలసిపోయినప్పుడు రామానుజుని కాలమున నుద్ధరింపబడిన వైష్ణవమతతరంగ మొకటి కాంచీపురమునుండి యుత్తరభాగమున కెగబ్రాకెను. కులోత్తుంగుని పరిపాలనావసాన సమయమున ను, దరువాతను, సామంతమాండలిక రాజకుటుంబములవారు తెలుగు దేశములో నందందు గుదురుకొనుటచేత నిస్సారమైన యా భూప్రదేశము జనాకీర్ణమై వర్ధిల్ల మొదలుపెట్టెను. తరువాత దేవాలయములు నిర్మింపబడుచు వచ్చినవి. ప్రస్తుత కాలమునందు గన్పట్టెడి దేవాలయములు మొదలగునవి మొదటి కులో త్తుంగ చోడ చక్రవర్తి కాలమునకు దరువాత నిర్మింపబడినవి కాని, వానికి బూర్వము నిర్మింపబడినవి కావు.

నెల్లూరు మండలములోని శిలాశాసనములనేకములు మొదటి కులోత్తుంగ చోడుని తరువాత లిఖియింపబడినవే. కులోత్తుంగ చోడ చక్రవర్తి యొక్క ముప్పదిరెండవ పరిపాలన సంవత్సరమున గూడూరు తాలూకాలోని రెడ్డిపాలెమునందలి పాండురంగేశ్వరునకును, పావన వినాయకదేవునకు, భూదానములు మొదలగునవి చేయబడి శాసనము లిఖింపబడినది. అందీభాగము రాజేంద్ర చోడ మండలములోని కడలగొండ 'పవ్వత్తిరి కొట్టమ'ని వ్యవహరింపబడియెను. పైజెప్పిన దేవతలు కాకండి యను మహానగరమున వేంచేసియున్నటుల జెప్పబడియున్నది. ఈ శాసనమున నడవులును బొలములును బావులును నానావిధ ఫలవృక్షములును దానము చేయబడినటుల జెప్పబడియున్నది. ఇది దేవదానమనియు, దీనికి పన్ను తీయబడదనియు, నందు జెప్పబ డియున్నది. [12]ఇతనికి లోబడియీ భాగమును బరిపాలనము చేయుచుండిన మహామండలేశ్వరులగు తెలుగుచోడులెవ్వరో దెలియరాదు.ఇతని కొడుకగు విక్రమచోడుని కాలమున నున్న సామంతులయిన తెలుగు చోడుల నామములు గొన్ని వినంబడుచున్నవి.

మధురాంతక పొత్తపి చోడ బేటరాజు 1121.

ఇతడు తెలుగు బిజ్జనవంశమున జనించిన మొదటికులోత్తుంగ చక్రవర్తి కుమారుడును, వరకేసరివర్మ బిరుదాంకితుడునగు విక్రమచోడుని కాలమున నాతనికి లోబడిన మాండలికుడుగ ఉండి పొత్తపి నాటిని బరిపాలించుచుండెను. ఇతడు విక్రమచోడుని విజయమునకై క్రీ.శ.1120_21వ సంవత్సరమున నొక దానశాసనమును వ్రాయించుటయే పై యంశమును స్థాపించుచున్నది. ఇతని శాసనము పొత్తపి నాటిలోని నందలూరు గ్రామమునగన్పట్టుచున్నది. ఈ బేటరాజును, మరియొక తెలుగుచోడుని శాసనము లో గన్పడుచున్న బేటభూపాలుడును, ఒక్కడేయని నిర్ధారించుటకు బేటభూపాలుని మనుమడగు నల్లసిద్ధిరాజు క్రీ.శ.1202వ సంవత్సరమున బరిపాలనము సేయుచున్నందున తాతమనుమలకు నడిమికాలము మిక్కిలి సుదీర్ఘమైనది గనుక నిద్దరు నొక్కరేయని చెప్పుటకు గొంచెము సంశయముగలుగుచున్నది. విక్రమచోడ చక్రవర్తి కాలమున బొత్తపి నాటికి బరిపాలకుడుగ నుండిన మరియొక తెలుగుచోడుని నామము గానంబడుచున్నది. అతడు మధురాంతక పొత్తపిచోడ విమలాదిత్యుడు. ఇతనికిని పైజెప్పిన మధురాంతకపొత్తపిచోడ బేటరాజునకు నెట్టి సంబంధముగలదో విచారింపవలయును.

మధురాంతక పొత్తపి చోడ విమలాదిత్యుడు.

1125_1126

ఇతడు సిద్ధిరాజునకు గుమారుడనియు, పొత్తపినాటికి ప్రభువనియు నందలూరు శాసనములవలన దేటతెల్లమగుచున్నది. ఈ విమలాదిత్యుని తండ్రియగు సిద్ధిరాజు శాసనమొకటి నందలూరున గానంబడుచున్నది. విక్రమచోడుని విజయము కొరకు విమలాదిత్యుడు క్రీ.శ.1125_26వ సంవత్సరముననొక గ్రామమును దానముచేసెను. ఈ మధురాంతకపొత్తపి చోడవిమలాదిత్యుని కుమారుడగు సోమేశ్వరుడు నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవాలయముయొక్క వెలుపలి గోపురమును నిర్మింపించెనని మరియొక శాసనము వలన దెలియుచున్నది. ఈ సిద్ధిరాజును, విమలాదిత్యుడును, సోమేశ్వరుడును నిర్వచనోత్తరరామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు పూర్వీకులతోడ నెట్టి సంబంధము గలవారో స్పష్టముగా బోధకాలేదు. అయినను నిర్వచనోత్తరరామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు తాతయగు సిద్ధిరాజు యొక్క చిన్న తమ్ముడగు తమ్ముసిద్ధిరాజుయొక్క శాసనములలోనొక

[13] దానియందు బేటరాజునకు సిద్ధిరాజను జ్యేష్ఠసోదరుడు కలడని చెప్పబడినదికావున, విమలాదిత్యుడా సిద్ధిరాజనకు కొడుకని చెప్పవచ్చును.

మధురాంతక పొత్తపి చోడ నల్లసిద్ధిరాజు.

మధురాంతకపొత్తపి చోడబేటరాజునకు "దయభీమరాజు, నల్లసిద్ధిరాజు, ఎర్రసిద్ధిరాజు” అను ముగ్గురు కొమారులుగలరు. వీరిలో నల్లసిద్ధిరాజు కాంచీపురమును జయించి గైకొనియెనని చెప్పబడియున్నది. ఇందెంత మాత్రమయిన సత్యముండునేని చోడచక్రవర్తియైన మూడవ కులోత్తుంగ చోడునికి బూర్వము జరిగియుండును. ఎందులకన, నల్లసిద్ధిరాజు తమ్ముడైన ఎర్రసిద్ధిరాజు పుత్త్రులయిన మనుమసిద్ధిరాజు, తమ్ముసిద్ధిరాజు మూడవ కులోత్తుంగ చోడదేవునకు సామంతమాండలిక రాజులుగునుండి కప్పముగట్టువారుగ నుండిరి. త్రిభువన చక్రవర్తియైన మూడవ కులోత్తుంగ చోడదేవుని శాసనములలో గొన్నిట నాతడు కాంచీపురమును వశపరచుకొనుటయు, జయవిజృంభణముతో నగరము సాత్తెంచుటయు, బేర్కొనబడుట చూడ, నల్లసిద్ధిరాజునుండి గైకొనియెనని యూహింపనవకాశము గలిగించుచున్నది.

మధురాంతక పొత్తపి చోడ మనుమసిద్ధి రాజు

మూడవ త్రిభువన చక్రవర్తి కులత్తుంగ చోడదేవుని పరిపాలన కాలమున శా.శ.1112వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1189వ సంవత్సరముననొక సిద్ధిరాజు కోవూరు గ్రామమును నెల్లూరనియెడు విక్రమసింహపురములోని యొక విష్ణ్వాలయమునకు దానము చేసినట్లు దెలిపెడి శాసనమొకటి ప్రాచీనమైనదిగ గన్పట్టుచున్నది. ఇందు సంస్కృత భాగములో సిద్ధిరాజుపేరు గలదు గాని, ద్రావిడ భాగములో ఆ నామము చాలా భాగము శిథిలమై పోయినందను స్పష్టముగ దెలియరాకున్నది. ఇంతియగాక జయంకొండ చోడ మండలములోని యొక భాగమగు చేదికుల వలనాటిలోని నెల్లూరనెడు విక్రమసింహపురములోని నాగరీశ్వరదేవునకు పూగినాటి లోని యెఱ్ఱంపల్లి గ్రామములో గొన్ని భూములను దానము చేసినట్టు దెలిపెడు నెల్లూరు శాసనమున మనుమసిద్ధిరాజు పేరు గానంబడుచున్నది. కాబట్టి పై రెండు శాసనములలోని సిద్ధిరాజు మధురాంతక పొత్తపిచోడ మనుమసిద్ధిరాజని యూహింపవచ్చును. ఇతడు తమ్ముసిద్ధిరాజుయొక్క జ్యేష్ఠసోదరుడనియు, చోడ తిక్కనృపాలుని తండ్రియగు మనుమసిద్ధిరాజు యొక్క తమ్ముడును తన పినతమ్ముడు నైన తమ్ముసిద్దిరాజు నిమిత్తమై రాజ్యపాలనము వహించినటుల జెప్పబడిన రెండవ బేటరాజుయొక్క శాసనములేవియు నెల్లూరున గప్పట్టవు. [14]

మధురాంతక పొత్తపిచోడ తమ్ముసిద్ధిరాజు.

ఇతని శాసనములు తెలుగుదేశమునందును, అరవదేశమునందునుకూడ గానవచ్చుచున్నవి. ఈ తమ్ముసిద్ధిరాజుయొక్క కావలి శాసనములలో నతని వంశావళి పేర్కొనబడినది గాని, తక్కిన శాసనములలోని వానితో గొంచెము భేదించి యున్నది.

కరికాలుని వంశమున బేటరాజు జనించెననియు, నతనికి ఎర్రసిద్ధిరాజు పుట్టెననియు, నతనికి శ్రీదేవిగర్భమున తమ్ముసిద్ధి మొదలుగా గొందరు కొమారులు పుట్టిరనియు, వారిలో నల్లసిద్ధి తమ్ముసిద్ధికి జ్యేష్ఠసోదరుడనియు బేర్కొనబడియున్నది. 'మన్మ'యనుటకు 'నల్ల'యని నెల్లూరుశాసన సంపాదకులు పొరబాటున భావించియుందురేమోయని సంశయము కలుగుచున్నది. ఇందు నల్లసిద్ధిరాజు పట్టాభిషిక్తుడయ్యెడనియు, నతని యనుమతినంది యతని చినతమ్ముడు తమ్ముసిద్దిరాజు రాజ్యపాలనము చేయుచున్నాడనియు చెప్పబడినది. శా.శ.1129 వ సంవత్సరమున (క్రీ.శ.1207-08)తన తల్లిపేరిట బరంగు శ్రీపురమును బండారు త్రిపురార్యుడు మొదలగు వేదవేత్తలయిన బ్రాహ్మణులకు నగ్రహారముగా నొసంగినటుల వ్రాయబడినది. మరియు నితడు పళ్ళికొండ పెరుమాళ్ళకు ముండనాటిలోని తామరమడువు చెరువను గ్రామమును దానముచేసినటుల నెల్లూరిలోని యొక యరవ శాసనమున బేర్కొనబడినది. త్రిభువనచక్రవర్తియైన కులోత్తుంగచోడదేవుని 26వ పరిపాలన సంవత్సరమున నీ దానశాసనము వ్రాయబడినటుల జెప్పబడినందున, నీతడు మూడవ కులోత్తుంగచోడదేవునికి లోబడి పరిపాలనము సేయుచుండిన యొక మండలేశ్వరుడని తేటపడుచున్నది.

మఱియును, ఇతని శాసనములు చెంగల్పట్టు మండలములోని కాంచీపురము, తిరువోత్తీయూరు, తిరుప్పానూరు గ్రామములలోను, ఉత్తరార్కాడు మండలములోని తిరువాలంగాడు గ్రామములోను, గానంబడుచున్నవి. కాంచీపురశాసనములో నితడు గండగోపాలునికి శ్రీదేవిగర్భమున జనించిన పుత్రుడనియు, మనుమసిద్ధిరాజునకు గడగొట్టు తమ్ముడనియు, వ్రాయబడియున్నది. గండగోపాలుడనునది యెర్రసిద్ధిరాజుయొక్క నామాంతరము. తమ్ముసిద్ధిరాజుయొక్క శాసనములు ద్రావిడదేశమునందు క్రీ.శ.1204 మొదలుకొని 1208 వరకు గానంబడుచున్నవి.

భుజబలవీర నల్లసిద్ధనచోడదేవ మహారాజు.

మధురాంతకక పొత్తపిచోడ నల్లసిద్ధిరాజను నామముగల మరియొక సిద్దిరాజు త్రిభువన చక్రవర్తి మూడవకులోత్తుంగునకు సామంతుడుగనుండినటుల గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు శాసనములవలన తెలియుచున్నది. ఇతనికి బేటరాజనుకుమారుడుండెను. క్రీ.శ.1218-14 సంవత్సర ప్రాంతముననున్న మధురాంతక పొత్తపి బేటరాజు పై జెప్పినతడే యై యుండవచ్చును. ఈ బేటరాజు తండ్రియగు నల్లసిద్ధిరాజు పేరు మరికొన్ని శాసనములందు గన్పట్టెడి. భుజబలవీర నల్లసిద్ధచోడదేవ మహారాజు నొక్కడేయని కొందరు తలంచుచున్నారు. ఈ భుజబలవీర నల్లసిద్ధచోడదేవ మహారాజు వల్లూరుపురము రాజధానిగ జేసికొనియెనని చెప్పబడినది. ఈ వల్లూరుపురము మార్జవాడి లేక మహారాజుపదియను ఏడువేలుగల దేశమునకు రాజధానిగనుండెను. కడపకు వాయవ్యపుమూల 8 మైళ్ళ దూరమున నున్న వల్లూరుపూర్వము గొప్ప పట్టణమై వల్లూరుపురమను పేర బరగుచుండెను. ఇతడు క్రీ.శ.1192-93సంవత్సరమున వ్రాయబడినట్టి చౌడూరుశాసనమును బట్టి కాంచీపురమునుండి కప్పము గైకొనినటుల దెలియుచున్నది. ఈ నల్లసిద్ధిరాజు కాంచీపురమునుండి కప్పము గైకొనిమాట సత్యమేయైనయెడల రెండవ రాజాధిరాజునకు దరువాత కాంచీపురమునబుట్టిన సంక్షోభములో నీతడు కొంత జోక్యము కలుగజేసికొని యుండవలయునని యూహింపవలసియున్నది. [15]అప్పుడు స్వల్పకాలము కాంచీపురము చోడులవశమునుండి తొలగిపోయినది. క్రీ.శ.1196వ సంవత్సరమునకు బూర్వమునగాని, పరమునగాని, త్రిభువనవీరదేవుడగు మూడవ కులోత్తుంగుడు కాంచీపురమును మరల వశముచేసికొనియుండును. ఇతడసమానములయిన గజబలంబులతోడ గాంచీపురముపై దండెత్తి అనేకములయిన వీరకృత్యములను గావించి విరోధులయిన రాజులనెల్ల జయించి కాంచీపురమునుజొచ్చి క్రోధాగ్ని చల్లారిన వెనుక గాంచీపురము మొదలుగ నుత్తరభాగమునంతట గప్పమును విదించి గైకొనియెనని చెప్పబడినది. [16] ఈ భుజబలవీర నల్లసిద్ధచోడ మహారాజునకును, ఎర్రరసిద్ధిరాజుకొడుకగు తమ్ముసిద్ధి రాజునకునెట్టి సంబంధముగలదో శాసనములంబట్టి యేమియుందెలియరాదు. తెలుగుచోడులు, పల్లవులు, నాగవంశజులు మొదలగు వారిలో నల్లసిద్ధిరాజు, మనుమసిద్ధిరాజు నను పేరులుగలవారు పెక్కండ్రు కానంబడుచుండుట చేత వీరికింగల సంబంధము దెలిసికొనుట బహుకష్టసాధ్య మనుటకు సందియము లేదు.

భుజబలవీర ఎఱ్ఱసిద్ధనదేవ చోడమహారాజు.

ఇతడు త్రిభువనచక్రవర్తి మూడవరాజరాజునకు సమకాలికుడుగ గన్పట్టుచున్నాడు. తమ్ముసిద్ధిరాజు తండ్రియగు ఎఱ్ఱసిద్ధిరాజును ఈ సిద్ధిరాజును నొక్కరుగాదని తోచుచున్నది. ఇతడును కాంచీపురాధిపతి వలన గప్పము గైకొనినటుల మహిమలూరు శాసనమునంబేర్కొనబడినది. ఇతని రాజ్యప్రతిపాలకుడు గొల్లపైడి బయ్యపనాయకుని కడగొట్టు తమ్ముడగు బమ్మినాయకుడని (భీమనాయకుడు) పై మహిమలూరు శాసనమునందే పేర్కొనబడియున్నది. ఈ శాసనము శాలివాహనశకము 1139వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1212-18వ సంవత్సరమున వ్రాయబడినది. భీమనాయకుడీతనికి ప్రధానిగను, సైన్యాధ్యక్షుడుగ నుండెను. ఈ యెఱ్ఱసిద్ధిరాజునకు కీర్తినారాయణుడనియు, అయ్యనసింగనియు, ఒరయూరు పురవరాధీశ్వరుండనియు, భుజబలవీరుడనియు, సాహసోత్తుంగుడనియు, నీ మొదలగు బిరుదములెన్నియో చెప్పబడినవి. భావిపరిశోధనముల వలన గాని ఈ తెలుగు చోడులలో నీ పేరులు గలవారికింగల పరస్పర సంబంధ బాంధవ్యములను విస్పష్టముగా జెప్పుట సాధ్యముగాదు. తెలియని వారిని గూర్చి గ్రంథబాహుళ్యముచేసి వ్రాయుటయు నంత మనోహరముగా గన్పట్టదు.

తిక్కభూపతి.

ఇతడు మనుమసిద్ధి రాజుయొక్క కొడుకని తిక్కనసోమయాజి విరచితంబైన నిర్వచనోత్తర రామాయణంబున దెలుపంబడినది. అందు :-

"క. తద్వంశంబున బోషిత
విద్వజ్జనుడహితభుజగ విహగేంద్రుడు ధ
ర్మాద్వైత మూర్తి వరయో
షిద్వర్గస్మరుడు మన్మసిద్ధి జనించెన్.

సీ. భూరిప్రతాపంబు వైరిమదాంధకా
రమున కఖండదీపముగ జేసి,
చరితంబు నిఖిల భూజన నిత్యశోభన
లతకును నాలవాలముగ జేసి
కరుణ దీనానాథ కవిబంధు జన చకో
రములకు జంద్రాతపముగ జేసి,
కీర్తిజాలముద్రిలోకీశారికకు నభి
రామరాజిత పంజరముగ జేసి,

గీ. సుందరీజనంబు డొదంబునకు దన
నిరుపమాన మైననేర్పుకలిమి,
నతిప్రసిద్ధి చేసి యసదృశలీలమై
బరగె మనుమసిద్ధి ధరణివిభుడు."

అని తిక్కభూపాలుని తండ్రియగు మనుమసిద్ధి రాజు వర్ణింణపబడియున్నాడు. తెలుగు చోడులల దిక్కనృపతి సుప్రసిద్ధుడును, పరాక్రమవంతుడునైయున్నాడు. ఇతడు బాల్యముననేఅసహాయశూరుడై యుద్ధములను జేసి విజయములను గాంచుచు వచ్చెననుటకు దృష్టాంతములు గలవు.

తిక్కరాజు పృథ్వీశ్వరరాజును జంపుట.

ఈ తిక్కభూపతి శైశవమునందనగా బదునెనిమిదేండ్ల ప్రాయమునకు లోపలనే పృథ్వీశ్వర రాజుతో యుద్ధముచేసి రణరంగమున వాని మస్తకమును ద్రుంచి దానితో గందుకగ్రీడ గావించినాడని నిర్వచనోత్తరరామాయణమునందీ క్రిందిపద్యమువలన దేటపడుచున్నది.

"ఉ. కేశవసన్నిభుండు పరిగీత యశోనిధి చోళతిక్కధా
త్రీశుడు కేవలుండె, నృపులెవ్వరి కాచరితంబు గల్గునే,
శైశవలీలనాడు పటు శౌర్యధురంధర బాహుడైన పృ
ధ్వీశ నరేంద్రుమస్తకము నేడ్తెఱ గందుకకేళి సల్పడే." ఈ పద్యములోజెప్పబడిన పృథ్వీశ్వరరాజు వెలనాటిచోడులలోని వాడై రాజరాజచోడచక్రవర్తికి సామంతుడై పండ్రెడవ శతాబ్దాంతముననున్నవాడు. ఇతడు వెలనాటి మనుమగొంకరాజునకును జయాంబికకును దనయుండు. ఇతని శాసనములు క్రీ.శ.1163 మొదలుకొని 1180 వరకును గానిపించుచున్నవి. ఇతడు బ్రదికియున్న కాలముననే క్రీ.శ.1186-87వ సంవత్సరమున నితని తల్లి యగు జయాంబిక తాను గట్టించిన పిఠాపురములోని కుంతీమాధవస్వామి యాలయమునకు గంగైకొండ చోడవనాటిలోని యంతర్భాగమగు ప్రోలనాటిలో నున్న నవఖండవాడయను గ్రామమును దానము చేసెను. కాబట్టి పృథ్వీశ్వరరాజు పండ్రెండవ శతాబ్దాంతమున నుండెననుటకు సందియములేదు.

దానశాసనములు.

ఈ తిక్కభూపాలుని దానశాసనములనేకములు చెంగల్పట్టు మండలములోను, నెల్లూరు మండలములోను గానంబడుచున్నవి. ఇతడు జయంగొండ చోళమండలములో జేరిన పేరూరు నాటిలోని యంతర్భాగమైన చేదికుల మాణిక్యవలనాటిలోని విక్రమసింహపుర మనియెడు నెల్లూరులో నొక పేటయగు మనుమకేశ్వరపురములో నిర్మింపబడిన మనుమకేశ్వర పెరుమాళ్ళకు మండనాటిలోని ఈడప్పూరు గ్రామమును పన్ను చెల్లింపకుండు పద్ధతిని దానము చేసెనని రామతీర్థ దేవాలయములోని యొక యరవశాసనము బట్టి దెలియుచున్నది. ఇందు తిరుక్కాళత్తి దేవుడను మూడవకులోత్తుంగ చోడుని 31వ పదిపాలన సంవత్సరమున నీశాసనము లిఖియింపబడినది. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తియొక్క 37వ పరిపాలన సంవత్సరమున తిరుక్కాళత్తి దేవుడు పరిపాలనము చేయుచున్నటుల ఊటుకూరు శాసనములవలనను దెలియుచున్నది. కావున నీతడు పేరికి మాత్రము కులోత్తుంగచోడునకు లోబడినవాడై యతని కడపటి కాలమున నుండెను. ఇతని దానశాసనములు రాపూరు కందుకూరు, తాలూకాలలో బెక్కులు గలవు. ఇతడు శాసనములలో చోడతిక్కనృపతియనియు, తిరుక్కాళత్తి దేవ చోడ మహారాజనియు, భుజబల వీర తిరుక్కాళ దేవచోడ మహారాజనియు, వ్యవహరింపబడుచు వచ్చెను. మూడవ కులోత్తుతంగునకి ఇ దరువాత నితడు మిక్కిలి బలవంతుడై స్వతంత్రుడై పరిపాలనము చేసెను.

తిక్కరాజు విజయములు.

తిక్కన కవి తన నిర్వచనోత్తరరామాయణమున దిక్కభూపాలుని వర్ణించు వర్ణనా సందర్భమున మరికొన్ని చరిత్రాంశములనుగూడ వక్కాణించియున్నాడు. వానినీక్రింద నుదాహరించెదను.

"సీ. లకుమయ గురుములూరికి నెత్తివచ్చిన
గొనడె యాహవమున ఘోటకముల,
దర్పదుర్జయులగు దాయాదనృపతుల
ననిలోన బరపడే యాగ్రహమున
శంభురాజాధి ప్రశస్తారిమండలి
కముజేర్చి యేలడే కంచిపురము
జేదిమండలము గాసిగచేసి కాళవ
పతి నియ్యకొలుపడే పలచమునకు

గీ. రాయగండగోపాలు నరాతి భయద
రాయపెండార బిరుదాభిరాము నుభయ
రాయగండాంకు ఖండియరాయుదిక్క
ధరణివిభు బోల రాజులకరిదిగాదె
"

"మ. కమలాప్తప్రతిమానమూర్తి యగు నాకర్ణాట సోమేశు దు ర్దమదోర్వర్గము రూపుమాపి నిజదర్పంబుం బ్రతిష్ఠించి లీ లమెయం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్య నా
మము దక్కంగొని తిక్కభూవిభుడు సామర్థ్యంబు చెల్లింపడె?"

ఈ పై పద్యములలో నితడు శంభురాజాది శత్రువులను జయించి కాంచీపురమును బాలించెననియు, చోడుని సింహాసనము పైనుంచి చోడస్థాపనాచార్య బిరుదమును గైకొనియెననియు చెప్పబడియున్నది. ఈ పద్యములలో జెప్పబడిన విషయములన్నియు సత్యములనుటకు సందియము లేదు. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తికి వెనుక రాజ్యపదవిని వహించిన మూడవరాజరాజచోడుడు సమర్థుడుగాక మిక్కిలి బలహీను డగుట వలన ను, గృహకలహముల వలనను, మధ్య గొంతకాలము రాజ్యమును బోగొట్టుకొనవలసిన వాడయ్యెను. ఇతని కాలమున మారవర్మ సుందర పాండ్య మహారాజు వలనను, కర్ణాటక వీరసోమేశ్వరుని వలనను, పల్లవుండైన కొప్పరింజింగ దేవుడను మహామండలేశ్వరుని వలనను, రాజ్యమునకుపద్రవము సంభవించెను. మహా మండలేశ్వరుడైన యీ తిక్కభూపాలుడు పాండ్యులను, కర్ణాటక వీరసోమేశ్వరుని జయించి, రాజరాజచోడుని సింహాసనమున నిలిపి చోళస్థాపనాచార్యుడను బిరుదము వహించెను. గాంగవాడి దేశమును బరిపాలించుచుండిన హోసిలరాజయిన వీర సోమేశ్వరుని శాసనములు క్రీ.శ. 1234 మొదలుకొని 1253 వరకును గానంబడుచుండుట చేతను, అతనితో తిక్కభూపతి సమకాలికుండని చెప్పబడియుండుటచేతను, తిక్కరాజు కాలము మనకు స్పష్టముగా దెలియుచున్నది. వీరసోమేశ్వరుడు గూడ చోళని సింహాసనమున గూర్చుండబెట్టెననియు, అతడును తిక్కభూపాలుడు నొండొరులతో బోరాడుచుండిరనియును, దెలియుచుండుట చేత, నిరువురును చోళ సింహాసనమునకై పోరాడువారిలో జెరియొక ప్రక్కను జేరి యుద్ధము చేసిరని యూహింపనగు. కాంచీపురములోని ఆరుళాళప్పెరుమాళ్ళ యాలయములో క్రీ.శ.1233_1234వ సంవత్సరమున నీతిక్కనృపతి పేరిటనొక దానశాసనము గానంబడుచున్నది.

తిక్కరాజు వైష్ణవ మతస్థుడు.

తిక్కభూపతి వైష్ణవమతావలంబకుడని యొకశాసనమునుబట్టి స్పష్టముగా దెలియుచున్నది. ఆరుళాళప్పెరుమాళ్ళ దేవాలయములోని యొక శాసనమునదన మతమిట్టిదని ప్రకటించినాడు. "ఎవ్వడు శ్రీ వరదరాజస్వామి చరణసరోరుహములను బూజించుచున్నాడో అతడే నాకు తల్లియు, తండ్రియు, గురువును, ధనమును, పుత్రుడును, మిత్రుడును అగుచున్నాడ"ని చెప్పియుండుటచేత, నీతడు వైష్ణవ భక్తాగ్రేసరుడని స్పష్టముగా బోధపడుచున్నది. కాంచీపురములోని శ్రీ వరదరాజస్వామి దేవాలయము సుప్రసిద్ధమైనది. ఇతడు వైష్ణవమతమునకు బోషకుండగుటవలననే ఇతని కాలమునను, ఇతని సంతతివారి కాలమునను, వైష్ణవమతము పాకనాడు, కమ్మనాడులలో విశేషముగా వ్యాపించినది. అనేక విష్ణ్వాలయములు నెలకొల్పబడినవి. వానికి వసతులేర్పరుపబడినవి. ఇతడు వైష్ణవమతావలంబకుడయినను పరమతసహనము గలిగియుండినట్లే గానంబడుచున్నాడు.

తిక్కరాజు కవిసార్వభౌముడు.

ఇతనికి గలికాలభూవిభుడను నామాంతరముండినటులను, ఇతడు విద్వాంసుడై, కవిసార్వభౌమ బిరుదాంకము గలిగియుండినటులను, నిర్వచనోత్తర రామాయణములోని ఈ క్రిందిపద్యము వలన జక్కగా దెలియుచున్నది.

సీ. భృత్యానురాగంబు పెంపుజెప్పగనేల
పరివారసన్నాహ బిరుదుగలుగ,
వంది ప్రియత్వంబు వర్ణింపగా నేల
పాఠ్యక పుత్త్రాఖ్య పరగుచుండ,
సకల విద్యా పరిశ్రమము దెల్పగనేల
కవి సార్వభౌమాంక మవనిజెల్ల,
సుభగతా మహిమ బ్రస్తుతి సేయగా నేల
మన్మథనామంబు మహిమ నెగడ,

గీ. నుభయబలవీరు డనుపేరు త్రిభువనముల
బ్రచురముగ ఘోరబహుసంగరముల విజయ
లక్ష్మి జేకొను బాహుబలంబు సొంపు
పొగడ నేటికి గలికాలభూవిభునకు.

తిక్కనకవి ఇతనిని సకలవిద్యా పరిశ్రమము గలవాడనియు, కవిసార్వభౌమ బిరుదము గలవాడనియు వర్ణించియున్నాడె కాని ఈతడు రచించిన గ్రంథము లెవ్వియో పేర్కొన్నవాడుకాడు. విక్రమార్క చరిత్రమును రచించిన జక్కయ కవి ప్రపితామహుడగు పెద్దయామాత్యసుకవి తిక్కభూపాలుని యాస్థానకవి యైనటుల విక్రమార్క చరిత్రములోని ఈ క్రిందిపద్యము వలన ధ్రువపడుచున్నది.

"గీ. అనుచు నెల్లూరి తిరుకాళమనుజ విభుని,
సమ్ముఖంబున సాహిత్యసరణి మెరసి,
మహిమ గాంచిన పెద్దయామాత్య సుకవి
మనుమడడు నీవు నీ వంశమహిమ యొప్పు"

మంత్రి భాస్కరుడు - సిద్ధనామాత్యుడు.

ఈ తిక్కభూపాలునకు సిద్ధనామాత్యుండు మంత్రిగ నుండెనని కేతనకవి కృతమైన దశకుమార చరిత్రములోని ఈ క్రింది పద్యములో జెప్పబడినది.

"ఉ. స్థాపిత సూర్యవంశవసుధాపతి నా బరతత్త్వధూత వా
ణీపతి నా నుదాత్త నృపనీతి బృహస్పతి నా గృహస్థ గౌ
రీపతి నా గృపారససరిత్పతి నా బొగడొందె సిద్ధివే
నా పతిప్రోడ తిక్కజననాథ శిఖామణి కాప్తమంత్రియై"
ఈ సిద్ధనామాత్యుడాప్తమంత్రిగ నుండుట మాత్రమేగాక సేనాపతిగగూడ నుండెనని పై పద్యమును బట్టియే తెల్లమగుచున్నది. ఇతని ఇంటిపేరు కొట్టరువువారు. ఇతడు సుప్రసిద్ధుడైన మంత్రి భాస్కరుని తృతీయపుత్త్రుడు. శూరవరాగ్రణి యగు ఖడ్గతిక్కనకు దండ్రి. కవిబ్రహ్మయైన తిక్కన సోమయాజికి బెదతండ్రి. ఈ కొట్టరువు వంశమువారిలో బెక్కండ్రు తెలుగుచోడ రాజుల కడ బ్రధానమంత్రులుగను, సేనాపతులుగను, ఆస్థాన కవీశ్వరులుగను ఉండి యాంధ్రప్రపంచమునందంతట విఖ్యాతిగాంచియున్నారు. వీరిలో మంత్రి భాస్కరుడు గుంటూరు సీమకు బాలకుడుగ నియమింపబడియుండెను. ఇతడు రామాయణమును మొదట రచింపగానది యే కారణముచేతనో అరణ్యకాండము తక్క తక్కిన కాండములన్నియు శిథిలములయి పోవుటచేత హళక్కి భాస్కరాది కవులు వానిం బూరించిరనియు, ఆ రామాయణమే భాస్కరరామాయణమను పేర బరగుచున్నదనియు నాంధ్రులచే విశ్వసించబడుచున్నది. గాని మంత్రి భాస్కరునిబట్టి గాక హళక్కి భాస్కరుని బట్టియే యా గ్రంథమున కానామము వచ్చినదనియే నా యభిప్రాయము. ఇది చర్చాంశము గనుక గ్రంథవిస్తరభీతిచేతను, మరియొక తావున నీ విషయమునుగూర్చి చెప్పవలసి యుండుటచేతను, ప్రస్తుతము నేనాచర్చ నిట వివరింపంబూనుకొనలేదు.

మంత్రి భాస్కరుడు రామాయణమును రచించినను, రచించియుండకపోయినను, ఆతడు ప్రసిద్ధకవి యనుటకు సందియములేదు. తిక్కనసోమయాజి తన నిర్వచనోత్తర రామాయణమునందు :-
"సారకవితాభిరాము గుంటూరి విభుని
మంత్రి భాస్కరు మత్పితామహుని దలచి
యైన మన్ననమెయి లోకమాదరించు
వేల నా కృతిగుణులు వేయునేల?"

అని తన కావ్యము స్వగుణముచేత గాకపోయినను, తన పితామహుడైన మంత్రి బాస్కరుని సారకవిత్వమహిమచేతనైనను, లోకాదరణమునకు బాత్రమగునని స్పష్టముగ జెప్పుకొనియున్నాడు. తన తాతయైన మంత్రి భాస్కరుడు ఆ కాలమునందంతటి ప్రసిద్ధకవి కాకయుండినయెడల తిక్కనవంటి కవిరాజశిఖామణియట్లు చెప్పుకొనియుండునా? కేతనకవి తన దశకుమారచరిత్రమునందు తిక్కన సోమయాజి తాతయైన మంత్రి భాస్కరుని నిట్లభివర్ణించి యున్నాడు.

"శా. శాపానుగ్రహశక్తియక్తుడమలాచారుండు సాహిత్యవి
ద్యాపారీణుడు ధర్మమార్గపథికుండర్థార్థి లోకావన
వ్యాపారవ్రతుడంచు జెప్పు సుజనవ్రాతంబు గౌరీపతి
శ్రీపాద ప్రవణాంతరంగు విబుధ శ్రేయస్కరున్ భాస్కరున్."

కేతనకవి ఈ భాస్కరమంత్రి గ్రంథరచన చేసినటుల జెప్పకపోయినను "శాపానుగ్రహ శక్తియుక్తుడు" అనియు, "సాహిత్య విద్యాపారీణుడు"అనియు, చెప్పుటచేతనే యతడు కవియైనటుల నూహింపవచ్చును. ఇంక గుంటూరివిభుత్వమును గూర్చి కొంచెము చెప్పవలసియున్నది. "ఏ కాలమునందు మంత్రి భాస్కరుడుండెనని ప్రతిపక్షులు తలంచుచున్నారో యా కాలమున గుంటూరును బరిపాలించుచున్న ప్రభుడొకడు కలడని శాసనముల వలన దెలియవచ్చుచున్నది. ఆ కాలమున గుంటూరు రాజ్యమునకు పాలకుడు శ్రీమన్ మహామండలీక గుంటూరి యుదయరాజు, అతని మంత్రి బొల్లన, సేనాని రాయనప్రెగడయు, నైనట్లుగా బెజవాడ మల్లేశ్వరస్వామి వారి యాలయ స్తంభమునగల శాసనమువలన దెలియవచ్చుచున్నది. ఈ శాసనమును బట్టి చూడగా గుంటూరు పాలకుడుగాని, మంత్రిగాని, సేనానికాని, మంత్రి భాస్కరుడు కాడని దోచుచున్నది."అని యొక విమర్శగ్రంథమున వ్రాయబడినది. ఈ శాసనము క్రీ.శ.1216వ సంవత్సరమున వ్రాయబడినది. ఈ శాసనము వ్రాయబడియన కాలమున దిక్కభూపాలుడు నెల్లూరు మండలమును బరిపాలించుచున్నవాడు. మంత్రి భాస్కరుని మూడవకుమారుడగు సిద్ధనామాత్యుడాతని కాప్తమంత్రిగ నుండెనని దెలిసికొనియుంటిమి. కాబట్టి మంత్రిభాస్కరుడింతకు పూర్వము నలువది, యేబది సంవత్సరముల క్రిందట నుండియుండెను. అప్పు డీతడు గుంటూరునకు బాలకుడుగ నుండెనని నమ్ముట కేవిధమయిన యభ్యంతరముండును? ఉదయరాజునకు గాని, అతని పూర్వులకుగాని, బొల్లనమంత్రికి బూర్వము భాస్కరుడు మంత్రిగనుండియుండునని యేల తలంపరాదు? ఇంతకును నా శాసనములో నుదాహరింపబడిన మండలేశ్వరుడు "గొంటూరియుదయరాజు" అని పేర్కొనబడినంత మాత్రమున నాతడు గుంటూరి సీమకు బరిపాలకుడని యెట్లు సిద్ధాంతము చేయవచ్చును? కానిండు. సిద్ధాంతమైన దనుకొందము. బొల్లనయే కాని ఇతర మంత్రులెవ్వరు లేరని యెట్లు నిర్ధారణ సేయవచ్చును? వట్టికుతర్కముల వలన బ్రయోజనము లేదు. భాస్కరుని తండ్రి కేతన కమ్మనాటిని బరిపాలించుచుండిన త్రిభువనమల్ల దేవ చోడ రాజునకు మంత్రిగనుండెను. భాస్కరుని మూడవకొడుకు సిద్ధనామాత్యుడు తిక్కజననాథశిఖామణికి నాప్తమంత్రియు, సేనాపతియునై యుండెను. కొమ్మనామాత్యుని పుత్త్రుడు తిక్కనసోమయాజి మనుమసిద్ధి రాజునకు సేనాధిపతిగనుండెను. తండ్రులును, తమ్ములును, కొడుకులను, మనుమలను, మంత్రిత్వాదిపదవులను వహించియుండగా మంత్రి భాస్కరుడు సామాన్య గృహస్థుడని నమ్మించుటకై ప్రయత్నపడుట మిక్కిలి శోచనీయము. ఇంతియగాక కేతనకవి తన దశకుమారచరిత్రమున విక్రమసింహపురవర్ణనమును, తత్పురాధీశ్వరుండగు మనుమసిద్ధి మహీవల్లభునకు గరుణారసపొత్రంబైన కొట్టరువు తిక్కనామాత్యుడు నిజకుల మాగతం బగు మంత్రిపదంబున వర్తిల్లుచు,

"గీ. అందలంబు గొడుగులడపంబు మేల్కట్టు
చామరములు జమిలిశంఖములును
గంబగట్లు భూమికానికగా గబెం
వెసగు రాచపదువులెల్ల బడసె."

అని మంత్రిపదంబు నిజకులక్రమాగతం బయిన దని నుడివి యున్నాడు. తిక్కనామాత్యునికంకితము చేయబడిన దశకుమారచరిత్రములోని వాక్యములకంటె బరమప్రమాణములయినవి మరియెవ్వికలవు? ఈ తిక్కరాజు మంత్రియైన సిద్ధనామాత్యునకు బ్రోలాంబికయందు నేడుగురు పుత్త్రులు జనించిరని దశకుమార చరిత్రములోని ఈ క్రింది సీసపద్యము వలన దెలియుచున్నది.

"సీ. విపులనిర్మల యశోవిసరగర్భీకృత
దిక్కుండు నా దగు తిక్కనయును,
దర్పితక్రూర శాత్రవ సముత్కరతమో
భాస్కరుండనదగు భాస్కరుండు,
న ప్రతి మానరూపాధరీకృతమీన
కేతనుండనదగు కేతనయును,
నిజభుజాబలగర్వనిర్జితోగ్రప్రతి
మల్లుండు నా దగు మల్లనయును,
శ్రీయుతుండు చౌహత్తనారాయణుండు,
మల్లనయు నీతి విక్రమమండనుండు,
పిన్న భాస్కరుండును బుధప్రీతికరుడు,
పెమ్మనయు నుదయించిరి పెంపు వెలయ."

మనుమక్షమావల్లభుండు.

తిక్కభూపాలుని కొడుకు మనుమక్షమావల్లభుండు. ఇతనినే మనుమసిద్ధియని చెప్పుదురు. ఇతడు మొదట చోడచక్రవర్తియగు మూడవ రాజరాజచోడునకు సామంతుడుగ నుండి తరువాత మూడవ రాజేంద్రచోడచక్రవర్తి కాలమున స్వతంత్రుడై కడపట కాకతీయాంధ్రచక్రవర్తి యగు గణపతిదేవునకు సామంతుడుగనుండెను. ఇతడు తన కాలమున మహావీరుడై శత్రురాజులనెదుర్కొని పోరాడుచు జయాపజయములను గాంచుచు వచ్చెనుగాని, తన తండ్రియైన తిక్కభూపతివలె నదృష్టశాలిమాత్రుడుగాడు. ఈతనికి గవిబ్రహ్మయగు తిక్కనసోమయాజి మంత్రిగ నాస్థానకవిగనుండి తన నిర్వచనోత్తరరామాయణము నంకితముచేసియుండుటచేత, ఇతనికీర్తి యాంధ్రప్రపంచమున నాటుకొని శాశ్వతమై నిలిచియున్నది. ఇతడు విక్రమసింహపురము రాజధానిగ బాకనాటిని బరిపాలించెను. ఇతడు క్రీస్తుశకము పదమూడవ శతాబ్ద మధ్యముననున్నవాడు.

బ్రాహ్మణులకు వెలమలకు వివాదము.

పూర్వము ముక్కంటికాడువెట్టియను పల్లవరాజు శ్రీశైలమునకు దూర్పున నుండు దేశమున డెబ్బదియగ్రహారములను గల్పించి బ్రాహ్మణులకు దానముచేసియుండెను. అధిరాజేంద్రచోళ మండల మనియెడు పశ్చిమపాకనాటిలోని పేరంగండూరు గ్రామము వానిలో నొక్కటిగానుండెను.ఈ గ్రామము నేబదిరెండు భాగములుగా విభాగించి ముక్కంటికాడు వెట్టి బ్రాహ్మణులకు దానము చేసియుండెను. అప్పటినుండియు నా బ్రాహ్మణులు పుత్త్రపౌత్త్ర పారంపర్యము నిరాటంకముగా ననుభవించుచుండిరి. ఇట్లుండ సకలికోడూరులోనుండు వ్యవసాయదారులు తమ దేశమునందు గొప్ప కలహము జనించుట చేత తమ దేశమును విడిచి వలసవచ్చి, ఈ గ్రామములోని చెరువునకు ఉత్తరభాగమున వసతులేర్పరుచుకొని నివసించుచుండిరి. మరియు ఇనంబ్రోలు గ్రామవాసులయిన వెలమలు కొందరు తమ గ్రామమున మహామారిజ్వరమంకురించి ప్రజానాశనము గలిగించుచుండుట చేత నా గ్రామమును విడిచి ఈ బ్రాహ్మణాగ్రహారముకు జనుదెంచి తామాక్రమించుకొనెడు పొలములో నెంత పంట పండునో యంత మొత్తమును పన్నుగా జెల్లించుపద్ధతిపై నొడంబడిక చేసికొని గుడిసెలు కట్టుకుని కాపురముండుచువచ్చిరి. తరువాత మీనరాశియందు శనిప్రవేశించుటచేత దేశమున గాటకము సంభవించెను. ఆ కారణముచేత బ్రాహ్మణులు గ్రామమును విడిచిపెట్టిపోయిరి. కాటకము వదలిపోయిన తరువాత మరికొంత కాలమునకు బ్రాహ్మణులు మరల స్వగ్రామమునకు వచ్చిరి. వెలమలు తమ యొడంబడిక ప్రకారము బ్రాహ్మణులకు కట్టుబడి చెల్లింపరైరి. ఇంతియగాక యా యగ్రహారము పరిపాలనము చేయునట్టి ప్రభువు పాలయ్యెను. అందుపైని బ్రాహ్మణులు పరిపాలనము చేయునట్టి ప్రభువగు మనుమసిద్ది రాజుకడకు పోయి తమ కష్టములను గూర్చి మొరపెట్టుకొనిరి. మనుమసిద్ది సహృదయుడై ఇనంబ్రోలు వాసులయిన వెలమలకు వర్తమానమంపి పాకనాటిలోని ప్రజల సాహాయ్యమును బడసి వారి వివాదమునుగూర్చి విమర్శజరిపెను. ఆ విమర్శలో నా భూములు బ్రాహ్మణులవైనటుల దేలినందున వీరరాజేంద్రచోడ చక్రవర్తియొక్కక పదుమూడవ సంవత్సర పరిపాలనకాలము అనగా శా.శ.1179 (క్రీ.శ.1257-58)వ సంవత్సరమున దనతండ్రి తిరుకాళదేవ మహారాజు పుణ్యముకొరకు మనుమసిద్ధి రాజు కోడూరు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేసెను. ఈ విషయములు కడప మండలములోని నందలూరి యరవశాసనములలో నొకదానివలన దేటపడుచున్నవి. [17]దీనింబట్టి పదమూడవ శతాబ్దమునకు బూర్వము కడప మండలములో మహామారిజ్వరము (ప్లేగు) గాని, అటువంటిదే మరియొక అంటువ్యాధిగాని వ్యాపించియుండెననియు, అట్టి సమయములయందు స్వగృహములను విడిచిపెట్టి పొలములలో గుడిసెలు వైచికొని కాపురముండుట క్షేమకరమని ప్రజలు తెలిసికొనియున్నారనియు బైశాసనములోని విషయములు స్పష్టముగ తెలుపుచున్నవి. ఈ శాసనములో చెప్పబడియున్న కోడూరు గ్రామము కడపజిల్లాలోని పుల్లంపేట తాలూకాలో ఉన్నది. పేరంగండూరు గ్రామమిప్పుడు గానరాదు. పై శాసనమునుబట్ట మనుమసిద్ధి రాజు పేరికిమాత్రము వీరరాజేంద్రచోడ చక్రవర్తికి సామంతుడుగనున్నటులగపడుచున్నను, స్వతంత్రుడై పరిపాలనము చేయుచుండెనని తేటపడుచున్నది. ఈ మనుమసిద్ధి రాజు యొక్క వీర్యవితరణ రూపవివేకమహిమాదులు నిర్వచనోత్తరరామాయణమునగవిబ్రహ్మచే జక్కగా వర్ణింపబడినవి.

మనుమసిద్ధి శత్రురాజులను జయించుట.

ద్రావిడోర్వీపతి గర్వంబు దునిమి కర్ణాటదర్ప విఘాతంబు గావించిన విజయక్ష్మాధీశ్వరుని, రక్సెగంగని, మహారాష్ట్ర సామంతుడైన సారంగుని జయించెనని నిర్వచనోత్తర రామాయణములోని ఈ క్రింద నుదాహరించబడిన పద్యములంబట్టి గ్రహింపనగు.

“మ. ద్రవిడోర్వీపతి గర్వముందునిమి శౌర్యంబొపప గర్ణాటద
ర్ప విఘాతంబు నొనర్చి వైరిమనుజేంద్ర శ్రేణికిన్ గొంగనా
నవనిం బేర్కొనియున్నయట్టి విజయక్ష్మాధీశ్వరుం గాసిగా
నెవిచెం జోళనమన్మసిద్ధి యని బ్రాయేటంబ్రగాఢోద్ధతిన్.

ఉ. రగంగదుదారకీర్తి యగు రక్కెసగంగని బెంజలంబు మై
భంగమొనర్చి మన్మజవపాలుడు బల్విడి నాచికొన్న రా
జ్యాంగము లెల్లనిచ్చి తన యాశ్రిత వత్సలవృత్తి యేర్పడన్
గంగయసాహిణిం బదము గైకొనబరచె బరాక్రమోన్నతిన్.

శా. శృంగారంబు నలంగదేమియును బ్రస్వేదాంకుర శ్రేణిలే
దంగంబుల్ మెరుగేద వించుకయు మాహారాష్ట్ర సామంతు సా
రంగుం దోలి తురంగముంగొనిన సంగ్రామంబునందృప్తస
ప్తాంగ స్ఫారయశుండు మన్మ విభుపంపై చన్న సైన్యంబునన్.”

ఇందలి మొదటి పద్యమున ద్రవిడోర్వీపతి గర్వమును దునిమి కర్ణాటదర్ప విఘాతంబు గావించి శత్రురాజమండలికి గొంగయై యున్న విజయక్ష్మాధీశ్వరుని బ్రాయేటనే మన్మసిద్ధి సమరంబున బ్రగాఢోద్ధతిగాసిగా నెవిచెనని చెప్పబడియున్నది. ఇందు బేర్కొనబడిన విజయక్ష్మాధీశ్వరుండు త్రిభువనచక్రవర్తి బిరుదాంకితుడగు విజయగండగోపాలదేవుడని తోచుచున్నది. ఈ విజయగండ గోపాలదేవుని శాసనములు గాంచీపురమునం గానంబడుచున్నవి గాన, నీతడు ద్రావిడ మండలమును జయించి పాలించినవాడని చెప్పుటకు సందియము లేదు. ఇంతియగాక ఇతడు పాండ్యమండలాధీశ్వరుడయిన జటవర్మసుందర పాండ్యదేవుని యుద్ధముననోడించి తరిమినట్లుగ గానంబడుచున్నది. పైవానిలో విజయక్ష్మాధీశ్వరునికి జెప్పబడిన విశేషణములు విజయగండగోపాలునకు మ్రాతమే వర్తించుచున్నవిగాని, మరియొకనికివర్తింపజాలవు. ఇతడు క్రీ.శ.1250 మొదలుకొని 1266 వరకును బరిపాలనము చేసినట్లుగ గానంబడుచున్నది. ఇతని శాసనములు కాంచీపురమునందు మాత్రమేగాక, నెల్లూరుమండలములోని గూడూరు, నెల్లూరు, సూళూరుపేట తాలూకాలలో గానిపించుచున్నవి. మనుమసిద్ధి తండ్రియగు తిక్కరాజు కాలమున బాండ్యులు కాంచీపురముపై దండెత్తివచ్చి యారాజ్యమాక్రమింపగా దిక్కరాజు పాండ్యులతో యుద్ధముచేసి వారలను దరిమి మరల చోడునిసింహాసనమున గూరుచుండబెట్టి చోళస్థాపనాచార్య బిరుదమును వహించెనని తెలిసికొనియుంటిమికదా. తిక్కరాజు మరణానంతరము పాండ్యరాజులు తమ తొంటిపూనికను విడనాడక కాంచీపురము మొదలుకొని యుత్తరభూమిని జయింపగోరి పలుమారుదాడి వెడలివచ్చి నెల్లూరునకు దిగువనున్న దేశమును గల్లోలపెట్టుచుండిరి. వారిలో జటవర్మసుందర పాండ్యమహారాజు ప్రముఖుడుగానుండెను. క్రీ.శ.1249వ సంవత్సరమున గాకతీయగణపతిదేవ చక్రవర్తి యాంధ్రదేశమునుండి పాండ్యరాజులను బారద్రోలి కాంచీపురముననొక దేవాలయములో నొక దానశాసనమును వ్రాయించెను. [18]

అయినను, జటవర్మసుందరపాండ్యమహారాజు మరుసటి సంవత్సరమునందనగా 1250వ సంవత్సరమున కాంచీపురమార్గమున నాంధ్రదేశముపై దండెత్తివచ్చి తెలుగుచోడులను జయించి మనుమసిద్ధిరాజును నెల్లూరినుండి పారద్రోలి సిద్ధిరాజునకు శత్రువులయిన వీరులను పట్టాభిషిక్తులను గావించి నెల్లూరులోని పళ్ళికొండపెరుమాళ్ళ దేవునకు మండనాడులోని మావడికుండ గ్రామమును దానముచేసెనని తెలిపెడి శాసనము నొకదాని రంగనాయకస్వామి దేవాలయములోని యొక స్తంభముపై వ్రాయించెను. [19]ఆ సంవత్సరముననే విజయగండగోపాలదేవుడు కాకతీయుల సాహాయ్యమును బడసికాని, పడయక గాని జటవర్మసుందరపాండ్యదేవుని, వాని సైన్యములను నెల్లూరుమండలమునుండి బారద్రోలి యుండవలయును. ఈ విజయగండగోపాలునినే తరువాత మనుమసిద్ధి యెదిరించి పోరాడి విజయమును గాంచి యుండవచ్చును. విజయక్ష్మాధీశ్వరుండు జయించిన ద్రవిడోర్వీపతి సుందర పాండ్యుడుగాక కాంచీపురదాధిపతియైన వీరరాజేంద్ర చోడచక్రవర్తియే యైన యెడల 1250వ సంవత్సరమునకు బూర్వముననే మనుమసిద్ధి వానిని జయించియుండవలయును. పైన జెప్పిదే వాస్తవమైన యెడల 1250వ సంవత్సరము తరువాతనే నిర్వచనోత్తర రామాయణము రచింపబడి యుండవలయును. ఈ త్రిభువనచక్రవర్తి విజయగండగోపాలుడు, మనుమసిద్ధిరాజునకు సమకాలికుడు. ఇతడును తెలుగుచోడులలోని వాడుగానే కనబడుచున్నాడుగాని, సిద్ధిరాజు కుటుంబమునకు నీతనికెట్టి సంబంధముగలదో తెలియరాదు.

ఇంక రెండవపద్యమునందు బేర్కొనంబడిన గంగయసాహిణిం గూర్చి విచారింతము. ఈ గంగయసాహిణి, కాకతీయగణపతిదేవుని సైన్యమునకధ్యక్షుడును, రాజప్రతినిధియై నిజాము రాష్ట్రములో నిప్పుడు చేరియుండిన నల్లగొండసీమలోని పానగల్లు మొదలుకొని మార్జవాడిదేశము (కడపమండలములోని వల్లూరు రాజధాని) వరకుగల దేశమునంతయు బరిపాలించుచుండిన యొక యున్నత రాజకీయాధికారిగాని సామాన్యుడుగాడు. ఇతనికి బ్రహ్మరాక్షసుడని బిరుదుండుటచేతనే రక్సెగంగని పేర్కొనంబడియున్నాడు. ఇతని చరిత్రము గణపతిదేవుని గూర్చి వ్రాయు చరిత్రమున సవిసత్తరముగా దెలుపబడునుగాన, నిచ్చట విస్తరించి వ్రాయలేదు. ఇట్టి మహాపరాక్రమవంతుడైన గంగయసాహిణి నొక మండలాధిపతిగ నున్న మనుమసిద్ధి యెట్లు జయించి యతని రాజ్యాంగములెల్ల వాచికొనియెనో, ఎట్లాత 75

డాశ్రితుడై ఇతనింబ్రార్థించెనో, ఎట్లీతడాశ్రితవత్సల వృత్తి యేర్పడునట్లుగా నాచికొన్న రాజ్యాంగములనెల్ల నిచ్చి పదము గైకొనబంచెనో, యెంతమాత్రము బోధపడకున్నది. ఇదియే వాస్తవమగునేని సిద్ధేశ్వరచరిత్రమునందును, సోమదేవరాజీయము నందును, జెప్పబడిన విషయములయొక్క సత్యతనుగూర్చి ప్రశ్నింపవలసియుండును. ఏతద్విషయమై మరియొక తావున వివరింపదలంచితిని.

ఇంక మూడవపద్యమున నీతడు మహారాష్ట్ర సామంతుడైన సారంగుని జయించెనని చెప్పబడియున్నది. ఇందు బేర్కొనంబడిన సారంగుడు, అతి విషమహయారూఢ ప్రౌఢరేఖావంతుడును, పరబలాంకృతాంతుడును, శరణాగతవజ్ర పంజరుడును, మండలీకరవందోళియు, జీవరక్షచక్రనారాయణుడును, అగు మన్మహామండలేశ్వర శ్రీ సారంగపాణి దేవ రాజే గాని, యన్యుడుగాడని తోచుచున్నది. ఇతడు కాకతీయ గణపతిదేవునకు సామంతుడుగ నుండి అద్దంకి సీమకు బరిపాలకుడుగా నుండెను. ఇతని తండ్రి మాధవదేవరాజు. ఇతడు మనుసిద్ధికి సమకాలికుడైయుండెను. గోవిందనాయకుడీతనికి మంత్రిగనుండెను. ఇతని వంశమువారు మహారాష్ట్రములోని శౌణదేశమునుండి వచ్చినటుల దెలియుచున్నది. కాబట్టి నిర్వచనోత్తర రామాయణమున బేర్కొనంబడిన సారంగుడితడే యనుటకు సందియములేదు. ఇట్లు మనుమసిద్ధి కాకతీయ సైన్యాధిపతులతోడ బోరాడి విజయములనుగాంచినటుల గవితిక్కన వ్రాసియున్నాడు కాని, సిద్ధేశ్వరచరిత్రమునందును, సోమదేవరాజీయమునందును, దెలుపబడిన చరిత్రాంశములిందలిచరిత్రాంశములకు మిక్కిలి విరుద్ధములుగా గానిపించుచున్నవి.

అక్కన బయ్యనలు.

అక్కన బయ్యనలనువారు మనుమసిద్ధి రాజుయొక్క దాయాదులని సిద్ధేశ్వరచరిత్రమను శైవగ్రంథమునందు వ్రాయబడినది. సిద్ధేశ్వరచరిత్రమునకు బ్రతాపచరిత్రమను నామాంతరము గలదు. దీనిని కాసె సర్వప్పయను నాతడు ద్విపద కావ్యముగా రచియించెను. ఈ కవికాలమెప్పుడో మనకు నిశ్చయముగా దెలియరాదుగాని, యితడు ప్రతాపరుద్రునికి తరువాతనుండిన వాడని చెప్పవచ్చును. అందువలన సిద్ధేశ్వరచరిత్రములోని విషయములన్నియు యధార్థములని విశ్వసింపరాదు. ఈ సిద్ధేశ్వరచరిత్రమును బట్టియే కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని తమ్ముడును, ఆధునికుడునగు జగ్గకవి సోమదేవరాజీయమను పద్యకావ్యమును రచియించెను. అక్కనబయ్యనలను దాయాదులు మనుమసిద్ధిరాజును నెల్లూరునుండి పారద్రోలి రాజ్యమాక్రమించుకొని పరిపాలించుచుండ, మనుమసిద్ధిరాజు పక్షమున నతని మంత్రికయు నాస్థానకివయునగు తిక్కనసోమయాజి కాకతీయుల రాజధానియైన యేకశిలానగరమను నామాంతరముగల యోరుగంటికిబోయి, గణపతిదేవచక్కవర్తికి భారతాఖ్యానమును వినిపించి, యనతి వలన బహుమానమునలను బడసి, యతనితో మనుమసిద్ధి దురవస్థను జెప్పగా, నాతడు సదయహృదయుడై సోమయాజుల రాయబారమును మన్నించి, బహుసైన్యముతో దండెత్తి వచ్చి అక్కనబయ్యనలను నెల్లూరునుండి పారద్రోలి, మనుమసిద్ధిని బునరభిషిక్తునిగావించి, వెడలిపోయెనని సిద్ధేశ్వరచరిత్రములోని ఈ క్రింది చరణముల వలన బోధపడగలదు.

"తగుమాట విను మొక్క ధర్మకార్యంబు
సూర్యవంశంబున సొబగొందునట్టి
యార్యపూజితవర్యుడామన్మసిద్ధి
రాజు దా నెల్లూరు రమణతో వేల

                        *                                                         *                                                           *

అక్కనబయ్యనలధిక బలిష్ఠు
లక్కట సిద్ధిరాయని బారద్రోలి
దక్కిన రాజ్యంబు తామె యేలుచు
నొక్కకాసైనను జక్కగ వీరు

వారల దండించి వారి నెల్లూరు
రెండవ ప్రకరణము

77

వారికిప్పింపు మవారణఁ బ్రీతి
ననిన, గణపతిరాజట్లకా కనుచు
                                                   ***
వెడలి గణపతియు విజయంబునకును
గుడియెడమల సేన కొలిచి యేతేర
వెలనాడు చేరియు వీడెల్ల గాల్చి
వెలనాటి రాజును వెసగెల్చి వాని
యప్పనంబులు గొని యటచని రాజు
గుప్పున నెల్లూరుకూడనేతెంచి
యక్కన బయ్యన నచట సాధించి
                                                   ***
నెల్లూరు ప్రజల నేర్పు వాటిల్లఁ
జెల్లించె మన్మనసిద్ధి రాజునకు
నెల్లూరి పట్టంబు నేర్పుతోఁగట్టి
సల్లలితాదృతి సమదుర్గములను
నరువదెనిమిదియు నగుపట్టణముల
నరుదొంద సాధించి యా మన్మసిద్ధి
రాజుకిచ్చియుఁ దన తేజంబు దిశలఁ
బూజకెక్కఁగ ఘనరాజిత యశుఁడు
ఘనతటాకంబు దాఁ గట్టించె నచటఁ
గొనకొని నెల్లూరఁ గొన్నెలలుండి
మనుమసిద్ధికి రాజ్యమహిమలు దెల్పె."

ఈ పై గ్రంథమునఁ బేర్కొనంబడిన యక్కనబయ్యనలను వారి నామములేశాసనములందును వినంబడకున్నవి. మనుమసిద్ధి రాజు యొక్క శాసనములు కందుకూరు సీమలోని పెంట్రాలలోఁ గాన్పించుచున్నవి. అయ్యవి 1257 మొదలుకొని 1262 వఱకుఁ గానిపించుచున్నవి. కడప మండలములోని నందలూరు శాసనములో నొకదానియందు మనుమసిద్ధి కోడూరుగ్రామమును 1257వ సంవత్సరమున బ్రాహ్మణులకు దానముచేసినట్లుగ వ్రాయబడినట్లు చెప్పియున్నాను. ఆ శాసనములోనే మనుమసిద్ధి రాజు కాకతీయ గణపతిదేవునితో స్నేహము సంపాదింపవలయునని కోరిక గలిగియున్నట్టుగ దెలుపబడియున్నది. కాబట్టి 1257 వరకును మనుమసిద్ధికి గణపతిచక్రవర్తితో మైత్రిలేనటుల స్పష్టమగుచున్నది. మరియు అతడా సంవత్సరముననే గణపతిదేవుని సామంతుడైన మహారాష్ట్రసారంగునితో యుద్ధముచేసి జయించుటకూడ పై యంశమును బలపరచుచున్నది. కనుక 1257వ సంవత్సరమునకు తరువాతనే వారిరువురకు మైత్రియేర్పడియుండవలయును. క్రీ.శ.1260వ సంవత్సరమున రుద్రమదేవి కాకతీయసింహాసనమధిష్టించినటుల త్రిపురాంతకములోని ఒక శాసనమున చెప్పబడియున్నందున, గణపతిదేవుడు 1260వ సంవత్సరముననే కీర్తిశేషుడై యుండుననుటకు సందియములేదు. కనుక సిద్ధేశ్వరచరిత్రము నందు జెప్పినట్లు అక్కనబయ్యనలు సిద్ధిరాజును బారద్రోలి రాజ్యమాక్రమించుకొనుట 1257, 1259 సంవత్సరములలో జరుగవలసియుండునుగదా. ఆ సంవత్సరములో మనుమసిద్ధిరాజు రాజ్యాభివృద్ధికై సిద్ధిరాజుచేతను, అతనికి సామంతలుగనున్న పల్లవరాజుచేతను, కందుకూరు సీమలోని వెంట్రాలలో జేయబడిన దానశాసనములు గనంబడుటచేత నా కాలమునందు సిద్ధిరాజు రాజ్యపదభ్రష్టుడయ్యెనని విశ్వసింపరాదు. కాబట్టి సిద్ధేశ్వరచరిత్రమునందలి అక్కనబయ్యనల చరిత్రము కల్పితమని చెప్పవలసివచ్చుచున్నది. తిక్కనసోమాయజి నిర్వచనోత్తర రామాయణము రచించునప్పటికీ మహాభారతమును తెనిగించియుండలేదని యా గ్రంథములలోని గద్యములనుబట్టియే మనము సులభముగా గ్రహింపవచ్చును. నిర్వచనోత్తరరామాయణము 1257వ సంవత్సరమున రచింపబడియుండవచ్చును. అట్లయినయెడల నా సంవత్సరముగాని, మరుసరి సంవత్సరముగాని, సిద్ధిరాజు రాజ్యపదభ్రష్టుడైయున్న కాలమున తిక్కనమంత్రి యజ్ఞమునుజేసి, తెనుగు భారతమును రచించి గణ పతిదేవుని కొల్వుకూటమునవిన్పించినాడని విశ్వసించుటకంటె వింతవిషయము మరియొక్కటి యుండబోదు. కాబట్టి సిద్ధేశ్వరచరిత్రములోని విషయములను సమన్వయింపవలసిన పక్షమున నిట్లు సమన్వయింపవచ్చును. అక్కనబయ్యనలు నెల్లూరునుండి సిద్ధిరాజును బారద్రోలగా సిద్ధిరాజు కందుకూరుసీమలోని వెంట్రాలకోటలో జేరి యందు నివసించియుండును. ఆ కాలమున దిక్కనసోమాయజి గణపతిదేవునికడకుబోయి యాతనివలన మన్ననలను గాంచి, తన వచ్చినపని తెలుపగా నాతడు తన సైన్యమును బంపి అక్కనబయ్యనలను నెల్లూరునుండి పారద్రోలి మనుమభూపతిని బునరభిషిక్తుని గావించియుండును. తిక్కనభారతాఖ్యానమును విన్పించినాడనియు, తిక్కన బౌద్ధులను వాదము గెలిచినాడనియు, బౌద్ధులక్రూరమారణకర్మకు దిక్కనయొడంబడినాడనియు జెప్పుట కవికల్పితములని స్పష్టముగ జెప్పదగును. భావిపరిశోధనముల వలనగాని, మనకీవిషయముచక్కగా బోధపడజాలదు. మనుమసిద్దిరాజు బ్రతికియున్నంత వరకు స్వతంత్రుడై స్వల్పరాజ్యముతోనే తృప్తిగాంచి కాకతీయసైన్యాధిపతులతో బోరాడుచు జయాపజయములను గాంచుచుండెనని నా యభిప్రాయము.

కాటమరాజు మనుమసిద్ధిరాజుల యుద్ధము.

ఖడ్గతిక్కన పౌరుషపరాక్రమములు.

పసులమేపు బీళ్ళనిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్ధిరాజునకును వివాదము పొసగి మహాయుద్ధము జరిగినటుల గాటమరాజుకథ వలన దెలియుచున్నది. ఈ యుద్ధకథనము ద్విపదలో రామరావణ యుద్ధముగ వర్ణింపబడినది. మనుమసిద్ధి రావణుడుగ బోల్పబడియెను. కాటమరాజు తండ్రి పెద్దిరాజు. పెద్దిరాజు తండ్రి వల్లురాజు. ఇతడాత్రేయ గోత్రోద్భవులయిన యాదవుల సంతతిలోని వాడుగ జెప్పబడియెను. ఇతడు కనిగిరిసీమలోని ఆలవలపాడునకధిపతిగ నుండెను, కాటమరాజు కనిగిరిసీమలోని యెర్రగడ్డ పాడున కధిపతిగ నుండెను. దేశమున ననావృష్టి సంభవింప యాదవులనం 80

బడు గొల్లవాండ్రెల్లను తమతమ పసులమందలను దోలుకొని దక్షిణమునకు వచ్చి మనుమసిద్ధి రాజుయొక్క పసులబీళ్ళను గొన్నిటిని పుల్లరికి గైకొని పసులను మేపుకొని పుల్లరి జెల్లింపకయే వెడలిపోయిరి. అందుపై సిద్ధిరాజునకు గోపమువచ్చి అన్నంభట్టను బ్రాహ్మణుని రాయబారిగా గాటమరాజుకడకు బంపించెను. కాటమరాజు పుల్లరి చెల్లిపంక తగవు పెట్టెను. అంతట మనుమసిద్ధిరాజు కాటమరాజును శిక్షించుటకై బహుసైన్యములం గూర్చుకొని దండెత్తివచ్చెను. కాటమరాజుకూడ బంధుజనులను మిత్రులను గూర్చుకొని యుద్ధసన్నద్ధుడయ్యెను.

అప్పుడు తిరునామాలతిప్పరాజు, శ్రీకంకరాజు, పెదవేగి చొక్కరాజు, పెదవరద రాజు, ఆర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నె మాదిరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్రశేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాపతిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరిపట్టణము పద్మశేఖరుడు మొదలగు యోధులు మనుమసిద్ధికి దోడ్పడవచ్చిరి. ఈ యోధుల కందరకు నాయకుడై ఖడ్గతిక్కన సిద్దిరాజు సేనల నడిపించుకొని వచ్చెను.

పల్నాటప్రభువయిన పద్మనాయడును, పల్లికొండప్రభువయిన చల్ల పిన్నమనాయడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, కరియావులరాజు, వల్లభన్న, నాచకూళ్ళనాయడు, నేతిముద్దయ్యనాయడు, పాచయ్యనాయడు, ముమ్మయ్యనాయడు, పుత్తమరాజు, మొదలగు యాదవవీరులును, కాటమరాజునకు దోడ్పడవచ్చిరి. ఈ సైన్యములకంతకు బిన్నమనాయనిమంత్రియు నారాధ్యబ్రాహ్మణుడు నగు బ్రహ్మరుద్రయ్యనాయకుడై నడిపించెనట. ఉభయసైన్యములును పాలేటియొడ్డున నున్న పంచలింగాలకొండకడ నెదుర్కొన్నవి.

సిద్ధిరాజు సేనాపతి ఖడ్గతిక్కన, తిక్కరాజుమంత్రియును తిక్కనసోమయాజి పెద్దతండ్రియునగు సిద్ధనామాత్యుని నేడ్వురు కొడుకులలోను బెద్దవాడని ఇదివరకే తెలిపియుంటిని. ఇతడే ప్రతిమానమైన ప్రతిభ కల వాడు. దశకుమారచరిత్రమునందు కేతనకవి యీతని నీక్రిందివిధమున వర్ణించియున్నాడు.

" సీ. వేడిననర్థార్థి వృథపుచ్చనేరని
దానంబు తనకు బాంధవుడు గాగ,
నెదిరినజము నైవ బ్రదికిపోవగనీని
శౌర్యంబు తన కిష్ట సఖుడు గాగ,
శరణుచొచ్చిన శత్రువరు నైన రక్షించు
కరుణయె తనకు సంగాతిగాగ,
బలికిన బాండవ ప్రభువైన మెచ్చని
సత్యంబు తనకు రక్షకుడు గాగ,

గీ. జగతినుతికెక్కె రాయవేశ్యాభుజంగ
రాజ్యరత్నాకర స్ఫూర్తి రాజమూర్తి
గంధవారణ బిరుద విఖ్యాత కీర్తి
దినపతేజుండు సిద్ధయ తిక్కశౌరి."

మరియు దిక్కనసేనాని గృహంబీవిధంబుగా నుండునని మిక్కిలి మనోహరంబుగా వర్ణింపబడినది.

" సీ. వీరనికాయంబు వేదనినాదంబు
బాయక యే ప్రొద్దుమ్రోయుచుండు,
భూసుర ప్రకరంబు సేసలు చల్లంగ
బాయకెన్ని యొకుటుంబములు బ్రదుకు,
బ్రాహ్మణావళికి ధారలుపోసిన జలంబు
సతతంబు ముంగిట జాలువారు,
రిపులకొసగిన పత్రికల పుత్ర్తికలను
బాయక కరణముల్ వ్రాయుచుండ్రు,

గీ. మానధునుడైన తిక్కనమంత్రియింట,
మదనపుముడైన తిక్కనమంత్రి యింట,
మహితయశుడైన తిక్కనమంత్రియింట,
మంత్రిమణియైన తిక్కనమంత్రి యింట."

ఆహా! ఇమ్మహానుభావుడు పరశురామునివలెను, ద్రోణాచార్యునివలెను, కృపాచార్యునివలెను, అశ్వత్థామవలెను, బ్రహ్మతేజము దాల్చుటమాత్రమే కాక, మహాక్షాత్ర్తమునుబూని వారలవలె గ్రూరచిత్తుడై దుష్కర్మములకొడిగట్టక మానియై ధర్మయుద్దంబున బ్రాణంబులర్పించుటకు నైన సిద్ధపడియెంగాని, అపయశంబు పాలబడుటకొల్లడయ్యెను గదా! అభినవదండియైన కేతనకవి పొగడ్తలు పొల్లులుగాక తిక్క సేనాని పట్టున సత్యంబులై సార్థకంబులగుచున్నవి. తిక్కనసేనాని, సిద్ధిరాజు సమ్మతిగైకొని తానొక్కడనే యాదవులను జయించివత్తునని తన సైన్యములతో ముందుగాబోయి, శత్రువులను మార్కొనియెను. అప్పుడుభయ సైన్యములకును ఘోరమైన యుద్ధము జరిగెను. తుదకు తిక్కనసైన్యమంతయు హతమయ్యెను. తిక్కన యుద్ధభూమిని నొక్కడు మిగిలియుండుటను ప్రతిపక్ష యోధుడైన పిన్నమానాయుడు చూచి -

"పోరునిలుపుమోయి భూసురోత్తముడ
సరిగాదు మాతోడ సమరంబుజేయ
అగ్రజుల్ మీరు యాదవులము మేము
ఆగ్రము మామీద నుంపంగరాదు."

అని పలికెనట. అందుపైని తిక్కన, సైన్యమంతయు హతమగుటకు జింతించి మరల సైన్యమును గొనివచ్చి తలపడియెదంగాక యని గుర్రమును ద్రిపఙకొని పురంబునకు వచ్చెనట. పౌరజనంబులు పరాజితుడై పారివచ్చిన తిక్కయోధునిగాంచి, నవ్వువారును, కేరడములాడువారును, నై యనేక విధముల మనస్సునకు జింతగలిగించిర. పౌరజనంబులుమాత్రమేగాక, ఇంటికిబోయిన తోడనే వృద్ధుడైన తండ్రి సహితం "యుద్ధమున నైన జావక ఇటులేల పారివచ్చితివి.కడుపచెఱుప బుట్టితిని" అని నిందించెనట. ఈ రణతిక్కన స్నానమునకు వచ్చినపుడు భార్య స్త్రీలకుంచినట్లుగా రహస్య స్థలంబున నీళ్ళ బిందెనుంచి దానికి నులకమంచమును చాటుపెట్టి దానిమీద బసుపుముద్దయుంచెనట? దానింజూచి సిగ్గుపడి ఖేదపడుచుండగా,భార్య _

"క. పగఱకు వెన్నిచ్చినచో
నగరే నిను మగత్ పంపు నాయకులందున్
ముగురాడువారమైతిమి
వగసేటికి జలకమాడవచ్చినచోటన్"
అని యెకసక్కెములాడెనట!

అన్నములో బోయునప్పుడు పాలు విరిగిపోగా తల్లి సైతము పరిహాసముగా_

"కం. అసదృశముగ సరివీరుల
బసమీరగ గెలువలేక పందక్రియన్నీ
వసివైచి విరిగివచ్చిన
బసులు న్విరిగినవి, తిక్క! పాలున్విరిగెన్"

అని పలికెనట! ఇంక జెప్పవలసినదేమున్నది? ఇట్లీపలుకులెల్లను శూలములైనాట మానాభిమానియైన యమ్మహాయోధుడు చేసినపనికి బక్సాత్తప్తుడై "ఈ సారి మరలబోయి శాత్రవులను మార్కొని జయంబుగొండు. అయ్యది సంప్రాప్తంబు గాదేని ప్రాణం బుండుదనుక బోరాడి వీరస్వర్గమునైన జూరగొందు. మానాభిమానములుగల శూరుడిట్టి రోత బ్రదుకు బ్రదుకడు." అని తలపోసి, యెవ్వరెన్ని విధముల వారించినను వినక, సిద్ధిరాజు నోడంబరిచి మరల సైన్యముం గొనిపోయి శత్రువులను మార్కొని భీమసంగ్రామంబు గావించెను. చరిత్రకారుడు యుద్ధభూమిని నాతండు చేయుచున్న యుద్ధక్రమము నిట్లభివర్ణించుచున్నాడు.

"చ. పదటున వాజి రాహుతుల పై దుమికించుచు దిక్కడార్చినన్
బెదరి పరిభ్రమించి కడుబిమ్మట వీరులు భీతచిత్తులై
యదెయదెడాలు వాల్మెరుగులల్లవె యల్లదె యాతడంచనన్
గొదుకక యాజి జేసె రిపుకోటులకందర కన్ని రూపులై"
ఇట్లే బ్రాహ్మణుడగు నండూరి కొమ్మనామాత్యుడు క్రొత్తచర్ల పరిసర భూములందు గటకరాజుతో బోరాడి చూపిన యుద్ధనైపుణ్యమును మంచనకవి కేయూరబాహుచరిత్రమునందు,

"సీ. నెలకట్టె వాటున జెలగి రెంటిని మూటి
గూడ గుర్రంబులు గుదులుగ్రుచ్చు
బ్రతిమొగం బగు వరపతుల కత్తళమున
గడిమమై వీపులు వెడల బొడుచు,
బందంపుగొరియల పగిది నేనుంగుల
ధారశుద్ధిగ వసిధార దునుము,
జిదియించు బగిలించు జేతుల తీటవో
వడిగాండ మేసి మావతుల తలలు,

గీ. తల పుడికి వ్రేసి మావంతు తలలు శత్రు
రాజ శిరములు ద్రొక్కించు రాగె దిరుగ
వాగె నుబ్బెడు తన వారునంబుచేత
మహిత శౌర్యుండు కొమ్మనామాత్యవరుడు."

అని మిక్కిలి మనోహరముగా వర్ణించి యున్నాడు. ఆ కాలమునందీ బ్రాహ్మణమంత్రివరులు రాజ్యతంత్రమునందు మాత్రమే గాక యుద్ధతంత్రమునందును బ్రవీణులైయుండిరనుట కిట్టి దృష్టాంతములెన్నియైన నాంధ్ర సారస్వతమునం గనుంగొనగలము.

ఇట్లు ప్రచండ విక్రమార్కుడై ఘోరసంగ్రామంబున శత్రుసేనను మార్కొని పీనుంగుపెంటలు గావించుచు రణకేళి సల్పుచుండ, యాదవ వీరులును వెనుదీయక మహోదగ్రులై తిక్కనసైన్యముపై బడి కత్తుల గఠారుల నీటెలం బొడిచి చక్కాడుచు బెద్దకాలంబు పోరాడ నుభయ సైన్యంబులం బెక్కండ్రు వీరభటులు నేలంగూలిరి. అంతట చిన్నమనాయడు ఖడ్గతిక్కనను సమీపించి "ఓ విప్రోత్తమా! యుద్ధము చేయుట బ్రాహ్మణునకు బాడిగాదు. మిమ్ముం జంపిన మాకు బ్రహ్మహత్యా దోషంబు వాటిల్లునని నా " మనంబు తల్లడిల్లుచున్నది. తొలంగుట నీకును మాకునుగూడ శ్రేయస్కరంబని యూహింతు" నని గొంతెత్తి గంభీరవాక్యంబులు పలుక దిక్కనయు "ఓ నాయడా! రణశూరుడవై యుద్ధము సేయజాలక పందక్రియ ధర్మపన్నంబులేల చదివెదవు? వానింగొన్న నేనెరుంగుదునుగాని, వీరుడ వౌదువేని కదలక నిలుచుండి యుద్ధంబుచేసి చేతనయ్యెనేని నా ప్రాణంబులు గొని విజయపతాకమెత్తుము. కాదేని శరణుచొచ్చి మా పుల్లరి మాకు బెట్టుము" అని హెచ్చరింప బిన్నమనాయడు బ్రహ్మహత్యాదోషమునకు వెరచి యేమిచేయుటకును జేతులును గాళ్ళునాడక నిశ్చేష్టితుడై చూచుచుండ, వాని మంత్రి బ్రహ్మరుద్రయ యచటికి నేతెంచి "తిక్కన నేదలంపడి పోకార్చెద నీవటుండు" మని తన ప్రతి వీరునిపై హయంబును బరపి యుద్ధము చేయగా నిరువుర గుర్రంబులు నీటెపోటుల నేలంగూల, ఇరువురును గత్తులు దూసి "హర హరా" యని యభిమన్యు, లక్ష్మణకుమారుల వలె ద్వంద్వయుద్ధంబునకు గలియంబడి యుభయసైన్యంబుల వారును నివ్వెరపడిచూచుచుండ బెద్దయుం బ్రొద్దు పోరాడి తుదకు నేలకొరిగిరి. ఆపాటుంగని తిక్కన సైనికులలో హతశేషులయిన వారలీ క్రింది విధముగా జెప్పుకొని యాక్రందించిరని యొక కవి చెప్పియున్నాడు.


"సీ. ధైర్యంబు నీమేన దగిలియుండుట జేసి
చలియించి మందరాచలము తిరిగె,
గాంభీర్యమెల్ల నీకడన యుండుట చేసి
కాకుత్థ్సుచే వార్ధి కట్టువడియె,
జయలక్ష్మి నీ యురఃస్థలినె యుండుట జేసి
పారిపోయి బలిదానమడుగుకొనియె,
నాకారమెల్ల నీయందె యుండుటజేసి మరుడు చిచ్చునబడి మడిసిచనియె,

గీ. దిక్కదండనాథ దేవేంద్రపురికి నీ
పరుగుటెరిగి నగము తిరుగుటుడుగు
నబ్దికట్టువిడుచు నచ్చుతుకొదమాను
మరుడు మరల కలుగు మగలరాజ."

అని తన సైనికులెల్ల హాహాకారంబులు సేయుచుండ బ్రాణంబులు దేహంబులు విడిచినవిధం బా కవివర్యుండే మరలనిట్లు చెప్పియున్నాడు.

"సీ. నందినిబుత్తెంచె నిందు శేఖరుడునీ
వన్నెయే తెమ్ము తారాద్రికడకు,
గరుడుని బుత్తెంచెఎ నరహరి రావయ్య
వడి సిద్ధతిక్క కైవల్యమునకు,
హంసనుబుత్తెంచె నజుడు నీకడకును
భయకుల మిత్త్ర రా బ్రహ్మసభకు,
నైరావతముబంపె నమరేంద్రుడిప్పుడు
దివమునకేతెమ్ము తిక్కయోధ,

గీ. యనుచు వేరువేర నర్థితో బిలువంగ
వారువీరుగూడ వచ్చివచ్చి
దివ్యయోగియైన తిక్కనామాత్యుడు
సూర్యమండలంబు జొచ్చిపోయె."

తరువాత కాటమరాజునకును మనుమసిద్ధిరాజునకును యుద్ధము జరిగి యా యుద్ధమున నిరువురును గూడ వీరస్వర్గమును జూరగొన్నట్లుగా గాటమరాజు చరిత్రము వలన దెలియుచున్నది. ఈ యుద్ధము జరిగినది యే సంవత్సరమో సరిగా జెప్పుట కే యాధారమును గానిపింపలేదు. కందుకూరు సీమలోని గుండ్లపాలెములో భ్రమరేశ్వరాలయములో నొక రాతిపలకపై నీ విషయము సంగ్రహముగా దెలుపబడియెను గాని, యందు జెప్పబడిన కాలము వేరుగను నాయకులు వేరుగనున్నారు. [20] అందసందర్భ విషయములెన్నో గలవు. ప్రతాపరుద్రుని కాలమున ననగా శా.శ.1170 కాళయుక్తి సం. కార్తీక శుద్ధ పంచమీ గురువారమున జరిగినటుల దెలుపబడినది. ఇందు జెప్పబడిన సంవత్సరమునకును తిథివారంబులకును బొసగపాటు గానరాదు. ఇది కాటమరాజునకును మనుమసిద్ధి రాజునకు గాక, పల్లురాజునకు నల్లసిద్ధిరాజునకు జరిగిన యుద్ధముగా జెప్పబడియెను. మనుమసిద్ధి రాజునుగూడ నల్లసిద్ధి రాజని పేర్కొనుచుండిరేమో. కాటమరాజు తాత పల్లురాజు. ఈ శాసనము ఎవ్వరో కొండయ్య కొడుకు రామయ్య యను నాతడు వ్రాయించినది గాని, యొక రాజుగాని యతని మంత్రులుగాని వ్రాయించినది గాదు. అది ఎప్పుడు వ్రాయబడినదియు దెలియరాదు. వీనినన్నిటిని బరిశీలించిచూడగా నది విశ్వాసపాత్రమైనదిగా గనుపట్టదు.

క్రీ.శ.1260వ సంవత్సరాంతము వరకు మనుమసిద్ధిరాజు బ్రదికి యున్నట్లుగా శాసనములు గానంబడియుండుట చేత నా సంవత్సరమునకు తరువాతనే కాటమరాజుకథ నిజమైన ఎడల మనుమసిద్ధిరాజు మరణము నొంది యుండవలయును. కృష్ణా మండలములోని నందిగామ సీమలోని అనమంచిపల్లె గ్రామమునందలి శివాలయముయొక్క గర్భాలయము ముందరి రాతిపలక మీది శిలాశాసనములు నాలిగింటిలో నొకదానియందు శాలివాహన శకము 1182వ సంవత్సరమునందనగా క్రీ.శ. 1260వ సంవత్సరమునందును; మరియు, కృష్ణామండలములోని నూజివీడు సంస్థానములో జేరిన కొండనాయని వరగ్రామముయొక్క చెరువుగట్టు మీద ఉన్న దేవాలయము సమీపమునందలి యొక రాతిమీద చెక్కబడిన శాసనములో శాలివాహన శకము 1179వ సంవత్సరమునందనగా క్రీస్తు శకము 1256వ సంవత్సరమునందును "మనుమరాజు" భూదానములు చేసినటుల జెప్పబడియున్నదని స్యూయల్ దొరగారి గ్రంథమునుండి కాబోలు నెత్తి యాంధ్రకవుల చరిత్రమునందు వ్రాయబడియున్నది. [21] ఆ శాసనములందు బేర్కొనంబడిన మనుమభూపతి నెల్లూరును బాలించిన యీ మనుమసిద్ధిరాజు కాడని స్పష్టముగా జెప్పవచ్చును.

తిక్కనసోమయాజి.

తిక్కనసోమయాజి మంత్రి భాస్కరుని మనుమడనియు, కొమ్మనామాత్యుని పుత్త్రుడనియు, నిదివరకు దెలిపియుంటిని. ఆపస్తంబసూత్రుండును, గౌతమపుత్రుండు నగు కొమ్మనామాత్యుడు గుంటూరునకు దండనాథుడుగా నుండెను. గుంటూరి విభుడనగా గుంటూరి కరణమనియొక విమర్శగ్రంథమునందు సవిచారపూర్వకముగా వ్రాయబడినది. కొమ్మనదండనాథుడని తిక్కనసోమయాజియే విరాటపర్వములోని ఈ క్రింది పద్యమున బేర్కొనియున్నాడు.
"సీ. మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
మహితుండు భాస్కరమంత్రి తనయు
డన్న మాంబాపతి యనగులు కేతన
మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమి తమ్ముండు గుంటూరి విభుడు కొ
మ్మన దండనాథుడు మధురకీర్తి
విస్తర స్ఫారుడాపస్తంబ సూత్ర ప
విత్ర శీలుడు సాంగవేదవేది,


గీ. యర్థిగలవచ్చి వాత్సల్య మతిశయిల్ల
నస్మదీయ ప్రణామంబు లాచరించి
తుష్టి దీవించి కరునార్థ్ర దృష్టి జూచి,
యెలమినిట్లని యానతి ఇచ్చె నాకు."


తిక్కనసోమయాజి యొకవేళ బక్షపాత బుద్ధితో తనతండ్రి సామాన్యుడై యుండగా దండనాథుడని పేర్కొనియుండవచ్చునని చెప్పవత్తురేమో? తిక్కన సోమయాజికి తన కావ్యము నంకితము చేసిన కేతనకవియు గొమ్మనామాత్యుని ధైర్యంబున హిమవంతునితోడను, శౌర్యంబున నర్జునునితోడను బోల్చి, సూర్యవంశ క భూపాల సుచిర రాజ్యవన వసంతుడని ఈ క్రింది పద్యములో మనోహరముగా వర్ణించియున్నాడు. "సీ. స్వారాజ్య పూజ్యుండొ కౌరవాధీశుండొ
నాగ భోగమున మానమున నెగడె,
రతి నాథుడో దినరాజ తనూజుడో
నాగరూపమున దానమున నెగడె,
ధరణీధరేంద్రుడో ధర్మసంజాతుడో
యనగ ధైర్యమున సత్యమున నెగడె,
గంగాత్మజన్ముడో గాండీవ ధన్వుడో
యనగ శౌచమున శౌర్యమున నెగడె,


గీ. సూర్యవంశక భూపాల సుచిర రాజ్య
వనవసంతుండు బుధలోక వత్సలుండు
గౌతమాన్వయాంభోనిధి శీతకరుడు
కులవిధానంబు కొట్టరు కొమ్మశౌరి."


కాబట్టి కొమ్మనామాత్యుడొక సామాన్య కరణముగా నుండవచ్చునని చేసిన ప్రశంస యప్రశస్తమైనదనియు, నిరాధారమైనదనియు జెప్పుట కెంత మాత్రము సందియము లేదు. ఇట్టి కొమ్మనామాత్యునకును అన్నమాంబికకును జనియించినవాడు మన ఈ తిక్కనసోమయాజి. ఇతడు మనుమసిద్ధి రాజు కడ మంత్రియు, గవియునై విఖ్యాతి గాంచెను. ఇతడు సిద్ధిరాజుకడ మిక్కిలి మనన గలవాడై యతని తోడ సమానప్రతిపత్తి గలవాడై వరుసచే బిలువబడుచున్నట్లును, నట్టి వరుసలలో మనుమక్షమావల్లభున కీ కవి మామ వరుసగలిగియున్నట్టును నిర్వచనోత్తరరామాయణము మొదట తిక్కన కవిని గూర్చి మనుమభూపతి చెప్పినటులున్న ఈ క్రింది పద్యమును బట్టి విస్పష్టమగుచున్నది.

"క. ఏ నిన్ను మామ యనియెడు
దీనికి దగనిమ్ము భారతీ కన్యక నా
కీనర్హుడ వగు దనినను
భూనాయకు పలుకు చిత్తమున కింపగుదున్."
ఇట్లు సిద్ధిరాజుచే గోరబడి తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణ కావ్యమునాతని కంకితము చేసెను. ఈ నిర్వచనోత్తర రామాయణము ప్రథమంబున రచింపబడినదగుటంజేసి కాబోలు నిందు దిక్కనార్యుడు తన పాండిత్యాతిశయమును దన కవిత్వనియమమును జెప్పుకొని కుకవినిందయు చేసియున్నాడు.ఇట్టిది యాంధ్రీకృత భారతమున గానరాదు. ఇతడు నిర్వచనోత్తర రామాయణము రచించునప్పటికి యజ్ఞము చేసియుండలేదనియు, వయస్సు మీరినవాడు కాడనియు, నిర్వచనోత్తరరామాయణములోని "ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త్రబుధారాధన విధేయ తిక్కన నామధేయ ప్రణీతంబైన"అను గద్యమునుబట్టియే మనము సులభముగా గ్రహింపవచ్చును. భారతము రచించునప్పటికీతడు యజ్ఞము చేసినటుల భారతములోని "ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కనసోమయాజి ప్రణీతంబైన" యను గద్యమునుబట్టియే విస్పష్టమగుచున్నది. నిర్వచనోత్తరరామాయణమున 1258వ సంవత్సరము వరకు జరిగిన విషయములను బేర్కొనియుండుట చేతను, అప్పటికి యజ్ఞము చేసి యుండలేదు గనుకను, భారతము మనుమసిద్ధి రాజునకంకితము చేయబడక హరినాధునకంకితము చేయబడి యుండుటచేతను భారతము మనుమసిద్ధి రాజు మరణానంతరము కొన్ని సంవత్సరములకు రచియించబడినదని చెప్పవలసియున్నది. ఈ మంత్రి పుంగవుడు మనుమసిద్ధి రాజునకు నతని సేనానియు దనకు బెదతండ్రి కొడుకునగు తిక్కనమంత్రియు మరణమునొందిన తరువాత విరక్తిభావము జనింప లౌకికాధికార ధూర్వహత్వమునుండి తొలగి వైదికమార్గనిష్ఠమగు వర్తనమునం బ్రీతిజనింప నగ్నిష్టోమ మను క్రతువు నాచరించి సోమయాజియై మహాభారతము రచించి జగద్విఖ్యాతిగాంచెను. ఇతడు లౌకికాధికార ధూర్వహుండై యున్న కాలముననే మహాభారతమును రచింపబూనుకొనెనను కేవలము బొరబాటుగాని వేరొండుకాదు.ఇతడు గణపతిదేవుని యాస్థానమునకుంబోయి భారతాఖ్యానమును వినిపించెననుటయు విశ్వాసపాత్రమైన విషయము గాదు. ఇమ్మహనీయుడు మనుమసిద్ధి రాజు మరణమునొందిన వెనుక బహుకాలము వరకు జీవించియున్నట్టుగ గనంబడుచున్నది. తిక్కన సోమయాజి శిష్యుడైన మారనకవి 1295వ సంవత్సరము మొదలుకొని 1323వరకు బరిపాలనము చేసిన రెండవ ప్రతాపరుద్రుని సేనాధిపతులలో నొక్కడగు నాగయగన్న మంత్రికి దన కావ్యము నంకితము చేసియుండుటచేత తిక్కన సోమయాజి 1290వ సంవత్సరము వరకు జీవించియుండవచ్చును.

సరసకవితా సామ్రాజ్య విలసితుడైన యిమ్మహాకవివరుండు_

"ఉ. ఆదరణీయ సార వివిదార్థగతి స్ఫురణంబుగల్గి య
ష్టౌదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండునం
దాది దొడంగి మూడు కృతులాంధ్రకవిత్వ విశారదుండు వి
ద్యాదయితుండొనర్చె మహితాత్ముడు నన్నయభట్లు దక్షతన్."

అని నన్నయభట్టును ఆంధ్రకవిత్వ విశారదుండనియు, విద్దాయితుండనియు మాత్రమే చెప్పియున్నాడు గాని, ప్రథమాంధ్ర కవినిగా జెప్పియుండలేదు. అదియునుంగాక,తిక్కన యాదికవీంద్రులను నూతన సత్కవీశ్వరులను నిర్వచనోత్తరరామాయణమునందు స్తుతించుటచేత నన్నయాదులకు బూర్వమునందు గూడ నాంధ్ర కవీంద్రులనేకులున్నట్టు స్పష్టపడుచున్నది. [22]

కవిబ్రహ్మయనియు, కవిలోక చక్రవర్తియనియు, నాంధ్రకవి ప్రపంచముచే నిరంతరము సంకీర్తనము సేయంబడుచున్న ఇమ్మహానుభావుని గుణ విశేషంబులను గూర్చియు, వీర్యవితరణ మహిమాదులను గూర్చియు, మహత్తర కవిత్వ సంపత్తిని గూర్చియు, సారవిహీనంపు బలుకులతో రసాభాసమును గావించుచు నేనిచట వర్ణించి చదువరుల మనంబులకొకింత శ్రమంబు గలిగింపనిష్టము లేక, అభినవదండి నా వినుతిగాంచిన కేతనకవివర్యుండు మిగుల రసవత్తరంబుగా రచించి యమ్మహనీయునకే యంకితము గావించిన దశకుమార చరిత్రములోని పద్యములనే చదువరులకు గర్ణరసాయనముగా నీ క్రింద నుదాహరించుచున్నాడను.

"సీ. సుకవీంద్ర బృందరక్షకుడెవ్వడనిన వీ
డను నాలుకకు దొడవైనవాడు,
చిత్త నిత్య స్థిత శివుడెవ్వడనిన వీ
డను శబ్దమున కర్థమైనవాడు
దశదిశావిశ్రాంతయశు డెవ్వడనిన వీ
డని చెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచణుడెవ్వడనిన వీ
డని చూపుటకు గురియైనవాడు,

గీ.మనుమసిద్ధ మహీశ సమస్త రాజ్య
భారధౌరేయు డభిరూప భావభవుడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మిసుతుడు
దీనజనతా నిధానంబు తిక్కశౌరి.

క. అగు నన గొమ్మయ తిక్కడు
జగతి నపూర్వార్థ శబ్దచారుకవితమై
నెగడిన బాణోచ్ఛిష్టం
జగత్త్రయం బనిన పలుకు సఫలం బయ్యెన్.

క. కృతులు రచియింప సుకవుల
కృతులొప్ప గొనంగ నొరునికిం దీరునె వా
క్పతి నిభుడు వితరణశ్రీ
యుతుడన్న మసుతుడు తిక్క డొకనికి దక్కన్. క. అభిమతుడు మనుమభూవిభు
సభ దెనుగున సంస్కృతమున జతురుండై తా
నుభయ కవిమిత్త్రనామము
త్రిభువనముల నెగడ మంత్రి తిక్కడు దాల్చెన్.

సీ. సరస కవీంద్రుల సత్ప్రబంధములొప్ప
గొనునను టధికకీర్తనకు దెరువు,
లలిత నానా కావ్యములు చెప్పునుభయ భా
షలయందు ననుట ప్రశంస త్రోవ,
యర్థిమై బెక్కూళ్ళ నగ్రహారంబులు
గా నిచ్చుననుట పొగడ్త పొలము,
మహిత దక్షిణ లైన బహువిధయాగంబు
లొనరించుననుట వర్ణనము దారి,

గీ. పరునికొక్కని కిన్నియు బ్రకటవృత్తి
నిజములై పెంపుసాంపారి నెగడునట్టి
కొమ్మనామాత్యు తిక్కన కొలది సచివు
లింక నొక్కరు డెన్నంగ నెందుగలడు?"

ఈ పై పద్యములంబట్టి తిక్కనసోమయాజి విబుధజనవర సంస్తుత్యంబైన పాండిత్యమునను, కవిత్వమునను, జతుర రాజనీతి కార్యనిర్వహణ దురంధరత్వమునను, గృతిపతిత్వ సామ్రాజ్య వైభవమునను, వైదిక మార్గ నిష్ఠా ప్రారంభమునను, లోక ప్రసిద్ధింగాంచి హరిహరనాథ భక్తి భావ నిర్మలచిత్తుండై యుత్తమంబైన గృహస్థ ధర్మంబును నిర్వహించుచుండెననుటయే ఈయన ప్రతిభా విశేషమును వేనోళ్ళ జాటగలదు. ఈ కవినిగూర్చి పై పద్యములలో జెప్పబడిన మాటలు నిక్కంబులు, అందతిశయోక్తి యేమియులేదని నొక్కి చెప్పగలను. తిక్కనకృతమైనను మహాభారత కావ్యభాగ మాంధ్రభాషలో నద్వితీయమైనదనుటకు లేశమాత్రము సందియములేదు. ఇంత చక్కని కావ్యము ప్రపంచములో మరి యే భాషయందైనను నుండునన్న విశ్వాసము నాకు లేదు. వేయునేల? ప్రపంచమునందలి సమస్తభాషలలోని యుత్తమోత్తమ కావ్యములలో నిదియొక్కటి యని చెప్పవచ్చును. ఈ మహాకవిని గూర్చి రావుబహదరు వీరేశలింగము పంతులుగా రాంధ్రకవులచరిత్రమునందిటుల వ్రాసియున్నారు.

" కాని తిక్కనసోమయాజిశైలితో సమానముగా వ్రాయుటమాత్ర మెవ్వరికిని సాధ్యము కాదు. తెలుగు భాషయం దెన్నో ద్రంథము లున్నను, తిక్కనసోమయాజి కవిత్వముతో సమానముగా గాని, దానిని మించునత్లుగా గాని, కవిత్వము చెప్పగలిగినవారు నేతివర కొక్కరును గనబడ లేదు. తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమై మిక్కిలి రసవంతముగా నుండును. ఈతని కవిత్వమున బాదపూరణమునకయి తెచ్చిపెట్టుకొనెడు వ్యర్థపదము లంతగా నుండవు. పదములకూర్పు మాత్రమేగాక యర్ధసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏ విషయము చెప్పినను, యుక్తియుక్తముగాను ప్రౌఢముగాను నుండును; ఎక్కడ నేవిశేషణము లుంచి యేరీతి నేపదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికి దెలిసినట్లు మరియొకరికి దెలియదు; ఈతని కవిత్వము లోకోక్తులతో గూడి జాతీయముగా నుండును; ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహుళ్యమును, అర్ధగౌరవమును రచనా చమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్ధియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు. "

శ్రీమదాంధ్రమహాభారతమునకు బీఠికవ్రాసిన బ్రహ్మశ్రీ, శతఘటము వేంకటరంగశాస్త్రులవా రీకవిని గూర్చి యిటుల వ్రాసియున్నారు.

" ఏ విషయమునంజూచినను నిమ్మహాకవికి సమాను డని చెప్పదగిన కవి యొక్కడు నిప్పటికి వినబడడు. ఇక నధికుడు లేడని చెప్పనేల ? ఈమహాకవి కవనముంగుర్చి యెంతసెప్పినం జెప్పవలసియే యుండునుగాని, యొకప్పటికైనం దనివిదీర జెప్పినట్లుండదు.... ఈమహాకవి గ్రంథముం జూచి నేర్చుకొనవలసిన విషయములు నెన్నియేని గలవు. ఆంధ్రభాషాకవిత్వ మర్మ మాతనికి దెలిసినట్టులు మరి యేయాంధ్రకవికి నిప్పటికిని తెలియదనియు, నిరాపేక్షముగ జెప్పవచ్చును. " 95

విజ్ఞాన చంద్రికా గ్రంధమాలా సంపాదకు లగు శ్రీయుత వేంకట లక్ష్మ రావు పంతులు. ఎం. ఏ. గారిట్లు వ్రాసి యున్నారు.

తిక్కన కృత భారత సంస్కృత మహా భారతమునకు భాషాంతీకరణమని మనవారందఱనుకొనుచున్నారు; కాని, అది గొప్ప పొరబాటు. ఇట్లనుకొనుట మనము తిక్కన యెడ నొక యపరాధము సేయుటయే. సంస్కృతాంధ్ర మహ భారతముల నొద్ద బెట్తుకొని సాంతముగ జ్గివ్ చూచిన యెడల నాంధ్ర మహా భారతము సంస్కృత మహా భారతములో నుండి కధ మాత్రము గ్రహించి దాని కంటే వేయి రెట్లధిక మనోహరముగా రచించిన స్వతంత్ర మహాకావ్యమని చెప్ప తప్పదు. మూలములో లేని యుద్దాలంకారములును, రస భావములును, మానవ స్వస్భావ వర్ణనలును, దెలుగు మహాభారతమునం దెచ్చట జూచినను విచ్చల విడిగా గాన వచ్చును. మూలములోని విసుగు బుట్టించెడి యనేక ధీర్ఘ కథానకములును, వర్ణనలును, వేదాంత ఘటేటములును, తెలుగు నందు లేనే లేవు. తిక్కన నిజమైన కవి యగుటచే నిరంకుశ్యుడసి మూలము లోని ముఖ్య కథను మాత్రము తీసుకొని కడమ భాగము నిష్టము వచ్చి నటుల తగ్గించి పెంచి, మార్చి వ్రాసెను. ఇట్లు చేయక సంస్కృతము లోనున్న ' చ ' కు దెనుగున 'ను ' పడ్డదా, లేదా యని యిప్పటి కొందఱు కవుల వలె జూచుకొనుచు దిక్కన తెనించి యుండినచో నతని కావ్యము పృథివిలోని యుత్తమ కావ్వ్యములలో మెక్కటి యై యుండును. కావున తిక్కన కృత మహ భారతము స్వతంత్ర కావ్య మనియే చెప్ప వలలసి యున్నది. ఇట్లనుట వలన సంస్కృత మహాభారతము స్వతంత్ర కావ మనియే చెప్పవలసి యున్నది. ఇట్లనుటకు వలన సంస్కృత మహా భారతము నుండి తిక్క యేమియు కైకొని యుండ లేదని కాని, యది మిక్కిలి తక్కువ యోగ్యత కలదని గాని, చెప్పుట మాయుద్దేశము కాదు. సంస్కృత మహా భారతము మా కత్యంత పూజనీయమే. కావ్యముగను, ఇతి హాసముగను, దాని యోగ్యత గొప్పది మే మెఱుంగుదుము. కాని,. మూలములోని ప్రతి శబ్దమునకు దూచి నట్లు దెనుంగున నొక్కొక శబ్దముండిన గాని యది మంచి కావ్యముగా నేరదని యనేకాంధ్ర విద్వాంసుల యభిప్రాయ మైనందున నది యసత్యమని చూపుటయే మాయుద్దేశము. సంస్కృత భారతము బంగారపు ముద్దవంటిది. ఆంధ్రభారత మాముద్దలోనుండి కావలయునంత బంగారమును దీసికొని స్వర్ణకారుని బుద్ధివైభవముతో జేయబడిన చక్కని సువర్ణ కమలము వంటిది. ఉభయ భారతములలోని యీ భేదముజూపి స్వర్ణకారుని బుద్ధివైభవము వెల్లడిచేయుటయే మా యుద్దేశము."

ఇట్లాధునిక విద్వాంసులు మాత్రముగాక ఇట్టి యభిప్రాయములు పూర్వ కవులుగూడ కలిగియున్నారు. కవిత్రయము వారిలో మూడవ వాడును ప్రబంధ పపరమేశ్వర పదప్రఖ్యాతుడు నైన యెఱ్ఱాప్రెగ్గడ తను రచియించిన హరివంశమునందు నన్నయభట్టును నీకవిచంద్రుని బ్రస్తుతించునప్పు డీక్రింది పద్యములను రచించి నన్నయభట్టారకునికంటె నీతడు మహిమోన్నతుడని సూచించెను.

"ఉ. ఉన్నతగోత్రోసంభవము నూర్జితసత్వము భద్రజాతి సం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్ర పూ
జోన్నయయోచితంబు వయి యొప్పెడు నన్నయభట్టుకుంజరం
బెన్న నిరంకుశో క్తిగతి నెందును గ్రాలుట బ్రస్తుతించెదన్.
"

అను పద్యమును విద్వత్కవికుంజరుం డయిన నన్నయభట్టారకుని వినుతి చేసి,


"మ. తన కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు నానేముఖం
బున దా బల్కినపల్కు లాగమములై పొల్పొందు నా వాణి న
త్తునునీతం డొకరుండు నా జను మహత్త్వాం గని బ్రహ్మ నా
వినుతింతుం గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.
"

అని తిక్కన సోమయాజిని కవిబ్రహ్మయని చెప్పియున్నాడు.

ఈ కవివతింసుడు నిర్వచనోత్తర రామాయణమును, మహాభారతమును మాత్రమేగాక, విజయసేన మను మఱియొకసమాన ప్రౌఢకావ్యముని, కవివాగ్బంధన మనియెడు ఛందస్సును, కృష్ణశతకమును, రచించెనని చెప్పుదురు. విజయసేనము మిక్కిలి ప్రౌఢమైన యముద్రితగ్రంథము గావున శైలిదెలియుటకై దానినుండి కొన్ని పద్యములిందు బ్రకటించుచున్నాను.

సీ. ఘనసారకస్తూరికాగంధముల నవ్య
గంధబంధంబులు గఱపికఱపి,
కుసుమితవల్లి కాలసితవీధుల జొచ్చి
గని సరోగృహముల మునిగమునిగి
సమధికాహార్యాంగ సంగీతములతోన
కన్నెతీగలకాట కఱపికఱపి,
కుముదకుట్మలకుటీకోరకంబులుదూఱి
యలిదంపతుల నిద్ర దెలిపిదెలిపి

గీ. యనుదినమ్ము నప్పుకాంతి కమ్మున గట్టు
వాలువోలె విప్రవరుడు వోలె
నట్టువోలె దాసు నచ్చిన చెలివోలె
మలయుచుండు మందమారుతంబు

సీ. మదనవశీకారమంత్రదేవత దృష్టి
గోచరమూర్తిగైకొనియె నొక్కొ,
సీతకరబింబ నిస్రుతసుధాధారని
తంబినీరూపంబు దాల్చెనొక్కొ,
విధికామినీశ్రేష్ఠవిజ్ఞానపరసీమ
విధి గండరంపంగ వెలసెనొక్కొ,
శృంగారనవరసశ్రీవిలాసోన్నతి
సుందరాకారంబు నొందె నొక్కొ,

గీ. కాక యెకవదూటి కడుపునబుట్టిన
భామకేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచు గున్నియపై మహీ
పాలసుతుడు దృష్టి పఱపె నర్థి

ఉ. పల్లవపుష్పసంపదలంబించి వసంతుడు కాపు రాకకై
యెల్లవనంబు సంకటము లేదగ దారొడికంబుమీఱ న

ట్లల్లన క్రోలిక్రోలి మలయానిలు డందు బురాణపత్త్రముల్
డుల్లగజేసె సత్క్రియ బటుత్వము కాముడు విచ్చలింపగన్"

కవివాగ్భందన మనులక్షణగ్రంథము నొక దాని రచియించినటుల దిక్కనసోమయాజి యీ క్రింది పద్యములలో జెప్పుకొనియున్నాడు.

"క. తనరం కవివాగ్భందన
మనుఛందం బవనివెలయ హర్షముతో ది
క్కన సోమయాజి చెప్పెను
జనులెల్ల నుతింప బుధులు సమ్మతి గాగన్
"

తిక్కనసోమయాజి కృష్ణశతక మొకటి చెప్పెనని వేంకటరంగ కవి యీ పద్యము నుదాహరించుచున్నాడు.

"ఆరయస్ శంతనపుత్త్రుపై విదురుపై నశ్రూరుపై గుజ్జపై
నరుపై ద్రౌహదిపై గుచేలునిపయిన్ నందప్రజశ్రేణిపై
బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంచరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా కృష్ణభక్తప్రియా.
"

ఇట్టి కృష్ణశతక మొకటియుండెనేని యది తిక్కనసోమయాజికృతమైనది గాదని నిశ్చయముగా జెప్పవచ్చును.

తిక్కనసోమయాజి మతము

ఇతడు నిర్వచనోత్తరరామాయణము రచించునప్పటికిని శివభక్తుడని యీ క్రింది నిర్వచనోత్తర రామాయణములోని పద్యమువలన దేటపడుచున్నది.

మ."అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢి బాటించు శి
ల్పమునం బారగుడం గళావిదుడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుడ దిక్కాంకుండ సన్మాన్యుడన్
"

మఱియిను భారతము రచించునప్పటికి బరిపక్వ స్థితినిగాంచి అద్వైతముయొక్క నిజతత్త్వమును దెలిసికొని పరతత్త్వమునే గొల్చుచుండె నని శ్రీమదాంధ్రమహాభారతములోని విరాటపర్వమున మొదట జెప్పబడిన దేవతాస్తుతి, పరతత్త్వస్తుతి యైనటుల నీక్రిందిపద్యము వేనోళ్ళ జాటుచున్నది.


"ఉ. శ్రీయన గౌరినా జెలగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగు రూపముగాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వముగొల్చెద నిష్టసిద్ధికిన్."

ఇతడద్వైతియనియు, ఏకేశ్వరోపాసకుడనియు, స్పష్టముగా బోధపడుచున్నది. గావున నీపరతత్త్వవేది కృష్ణభక్తుడై కృష్ణశతకమును జెప్పినాడనుట యుక్తియుక్తముగ లేదు.

తిక్కన వంశమువారు

తిక్కన కొమరాుడైన కొమ్మనవంశమువారు నెల్లూరు మండలములో బెక్కండ్రు గలరట. ఇదియే వాస్తవమైనయెడల దిక్కనవంశము తామరతంపరయై వర్ధిల్లుచున్నది గాని యీ వంశములం దిక్కన కీవల నొక్కకవియైన బుట్టకుండుటమాత్రము మిక్కిలి వింతగా దోపకమానదు. కొట్టురువు వంశము వారు పాటూరు వారయినారట.

అథర్వణాచార్యుడు

ఇతడు త్రిలింగశబ్దానుశాసనమును, వికృతివివేకమను వ్యాకరణకారికావళిని, అధర్వణచ్ఛందమును, భారతమును వ్రాసి ప్రసిద్ధి గాంచిన యొక మహాకవి. పై వానిలో ద్రిలింగశబ్దానుశాసనము వ్రాసినదు మఱియొక యధర్వుణుడనియు, అతడు నన్నయభట్టారకునకు మిక్కిలి ప్రాచీనుడునియు గొందఱు పండితులు తలంచుచున్నారు. అయునను హేమచంద్రునినామ మాగ్రంధమున బేర్కొనంబడియుండుట వలన నది యంత విశ్వాసపాత్రమైన వాదముగా దలంపరాదు. అయినను, హేమచంద్రులు గూడ మెకరిద్దఱికన్న నెక్కువగ నుండవచ్చును. త్రిలింగశబ్దానుశాసనము వ్రాసిన యథర్వణుడు వేఱయిన గాకపోయినను వికృతివివేక మను వ్యాకరణకారికావళిని వ్రాసిన వాడు పండ్రెండవ శతాబ్దాంతమున గాని, పదుమూడవ శతాబ్దాదాని గాని యున్నట్టు మనము నిశ్చయింపవచ్చును. అథర్వణకారికలలో జెప్పబడిన తెలుగక్కరము లనుగూర్చిన మార్పులు పండ్రెండవ శతాబ్దాంతము వఱకు జరిగియుండలేదని దక్షిణ హిందూస్థాన ప్రాచీనలిపి శాస్త్రమును రచియించిన బర్నెల్ దొరగారు వ్రాసి యున్నారు. కాబట్టి యాకాలమునకు దరువాతనే యధర్వణాచార్యుడుండెనని మన మూహింపవచ్చును. అథర్వణాచార్యుడు కొంచెమించుగా దిక్కనసోమయాజి కాలమువాడై యుండవలయును. ఇతడు మహాభారతమును విరాటపర్వము మొదలుకొనియే ప్రారంభించినట్లుగ గానంబడుచున్నది. ఆంధ్రశబ్దచింతామణిలో లేని లక్షణములు బెక్కింటిని అధర్వణాచార్యుడు వికృతివివేకములో జెప్పియున్నాడు. ఈకవి రచించిన తెలుగు భారతమిప్పటికి బ్రకటింపబడలేదు గాని యందలి పద్యము లనేకములు లక్షణ గ్రంథములలో బ్రకటింపబడియున్నవి. ఈ కవి వంశచరిత్ర దెలియరాదు. ఇతడు జైనుడని కొందఱు తలంచుచున్నారు. లక్షణ గ్రంథములలో నుదాహరింపబడిన పద్యములనుబట్టి చూడగా నితడు విరాటోద్యోగభీష్మ పర్వములను రచించినట్టును, కవిత్వము సంస్కృత పద బహుళముగా నుండి రసవంతమైయుండు ననియు రావుబహదరు వీరేశలింగము పంతులుగారి తమ కవుల చరిత్రమునం దెలిపియున్నారు.

గీ. "ధర్మతనయ యుష్మదాజ్ఞానిగళవిని
బద్ధమగుచు జిక్కువడియె గాక
విజయమత్తగజము విడివడ్డచో వడ్డ
పాటు గలదె విష్టపత్రయమున

క. శ్రీకంఠు దెదురునపుడు వ
నౌకోధ్వజ మింద్రమకుట మర్జునతురుగా
నీకము దివ్యకతాంగము
నా కవ్వడికబ్బియున్న నతం దేమగుమో

క. ఆకర్ణు దురాలాపము
లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో

రెండవ ప్రకరణము

నాకనదీసుతు డనియె వ
నౌకోధ్వజ మెఱుగవచ్చు నరుజూపి తగన్.(విరాట పర్వము.)


 శా. తృష్టాతంతు నిబద్ధబుద్దు లగు రాధేయాదులంగూడి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుగా దలచి మర్థింపంగ నుత్సాహవ
ర్థిష్ణుండయ్యె సుయోధనుం డకట ధాత్రీనాధ యూహింపుమా
యుష్ణంబున గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.(ఉద్వోగ పర్వము)

క. పదిదినము లయిదు ప్రొద్దులు
పదవడి రెణ్ణాళ్లు నొక్క పగలున్ రేయిన్
గదనంబు చేసి మడిసిరి
నరిసుత గురు కర్ణ శల్య నాగపురీశుల్. (భీష్మ పర్వము)

కేతన మహాకవి.

కేతనకవి తిక్కన సోమయాజి కాలమునందుండి యీతనికి దన దశకుమార చరిత్రము నంకితము చేసి మొప్ప గాంచిన వాడు. ఈతడు దండి విరచిత మైన దశకుమార చరిత్రమును దెనిగించుట చేత బండిత లీతని నభినవ దండి యని పొగడిన ట్లీ క్రింది యాంధ్ర భాషా భూషణములోని పద్యములో గవియే చెప్పు కొను చున్నాడు.

క. వివిధకళానిపుణుడు నభి
నవదండి యనంగు బుధజనంబుల చేతన్
భువి బేరుగొన్న వాడను
గని జనమిత్తృడను మూల ఘటికాన్వయుడన్.

ఈ కవి యింటి పేరు మూల ఘటిక వారని పై పద్యమును బట్టి దెలియు చున్నది. ఇతడు శివ భక్తుడు, కవిత్వము చెప్పి తిక్కన సోమయాజిని మెప్పించుట

ఆంధ్రుల చరిత్రము.

సాధ్యము గాదని సూచించుచు నాతని చేత మెప్పు గాంచిన ప్రోడనని ఘనతగా నీ క్రింది పద్యమున జెప్పుకొని యున్నాడు.


గీ.కవిత చెప్పి యుభయకవి మిత్త్రు మెప్పింప
  నరిది బ్రహ్మ కైన; నతడు మెచ్చ
  బరగ దశకుమార చరితంబు చెప్పిన
  ప్రోడ నన్ను వేఱె పొగడనేల?

ఇతడు వేగి విషయములోని వెఱ్ఱిరాల యను నగ్రహారమున కధిపతి, మ్రానయకును నంకమాంబకును జనించిన ద్వితీయ పుత్త్రుడు, ప్రోలనార్యుని తమ్ముడు. బండారు కేత దండాధీశుని మఱిది, సంస్కృతాది భాషాకావ్యకర్తృత్వమున నుతిగన్నవాడు. అట్టి విఖ్యాతయశు డైన కేత నార్యుని రావించి యుత్యాదరంబున నాసనార్ఘ్య పాద్య తాంబూలాంబరాభరణదానాద్యు పచారంబుల బరితుష్ట హృదయుం జేసి ' నీవు సంస్కృ తాద్య నేక భాషా కావ్య రచనావిశారదుం వగుట జగత్ప్రసిద్దంబు గావున నొక్క కావ్యంబు రచియించి నన్ను గృతి పతిం జేయ వలయు.' నని తిక్కన సోమయాజి ప్రార్థింపగా, నతడు దశ కుమార చరిత్రమును దెలిగించి యాతని కంకితము చేసినట్లుగా నవతారిక యందు వ్రాసి యున్నాడు. ఇతడు దశకుమార చరిత్రమును మాత్రమే గాక కాదంబరిని, విజ్ఞానేశ్వరీయ మను యాజ్ఞవల్క్యధర్మ శాస్త్రమును, దెనిగించెను. ఆంధ్ర భాషా భూషణము రచించుటకు ముందు దెనుగున వ్యాకరణ మెద్దియు రచియింప బడియుండ లేదని,


క.మున్ను తెలుగునకు లక్షణ
  మెన్నడు నెవ్వరును జెప్ప రేజెప్పెద వి
  ద్వన్నికరము మది మెచ్చగ
  నన్నయభట్టాది కవి జనంబుల కరుణన్.

అని చెప్పి యున్నంత మాత్రమున నదివఱకు దెలుగులో వ్యాకరణము మెదలగునవి లేవని యెంత మాత్రమును దలప రాదు. నన్నయ భాట్టారకునికి బహు శతాబ్దములకు ముందే యాంధ్రకవితాకన్య జనించి వర్ధిల్లుచుండగా వ్యాకరణాదిగ్రంథములు లేవని యొట్లు విశ్వసింపవచ్చును? ఆంధ్రభాషా చరిత్రమను ప్రత్యేక గ్రంథమున నీ విషయమును గూర్చి సవిస్తరముగాఁ జర్చింపదలంచి గ్రంథవిస్తర భీతిచే నిచ్చట జర్చింప మానుకొనుచున్నాను. ఈతని కవిత్వము తానె జెప్పుకొన్నట్లుగా దిక్కనసోమయాజి మెచ్చునంత రసవంతముగానే యున్నది. దశకుమారచరిత్రమునుండి యిందనేక పద్యములుదాహరింపబడియున్నవి గావున శైలి దెలుపుటకై తెనుగుకాదంబరినుండి యొక పద్యము మాత్రముదాహరించుచున్నాడను.

 సీ.“కడువేడి వెల్లెండ పుడమి పేల్చిన బొద్దు
లాకాశగతియ మే లనితలంప,
వాత్యాభిహతి లగ్గ వాడి వియచ్చరు
లవనిపై జనుట మే లని తలంప,
నడవడగా నీళు లుడికిన జలనరుల్
వనచరవృత్తి మే లని తలంప,
వనముల గార్చిచ్చు దనడిన వనచరు
లంబుసంచరణ మే లని తలంప
గీ. వాడి యెండ గాసె వడిగొనె సురగాడ్పు
లెసగె వడయగాలి నెగసివీచె
దావదహన మడలె జీవుల కధికసం
తాపకారి యగు నిదాఘవేళ.”

బయ్యనామాత్య కవి.

మార్చు
మరియు దిక్కనసోమయాజి కాలమున బోజరాజకీయము, రసాభరణము మొదలగు గ్రంథరాజములను రచించి విఖ్యాతి గాంచిన యనంతామాత్యుని ముత్తాత యగు బయ్యనామాత్యుడు కవిత్వము చెప్పి తిక్కనసోమయాజిచే ‘భవ్యభారతి’యని పొగడ్త గాంచినటుల ననంతామాత్యుడు తన భోజరాజీయములోనిదైన___

“క్షితిగతుకర్త నా వినుతి చేకొని పంచమవేద మైన భా
రతము దెనుంగుబాస నభిరామముగా రచించినట్టి యు
న్నత చరితుండు తిక్క కవినాయకు డాదట మెచ్చి ‘భవ్యభా
రతి’యన బేరుగన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుడే”

అను పద్యములో దెలిపియున్నాడు. ఈ బయ్యనామాత్య కవి రచించిన గ్రంథము లేవో దెలియరాకున్నది. ఇట్లే యనేక మహాకవుల గ్రంథము లంత రించియున్నవి. ఆంధ్రదేశభాషాభిమాను లెల్లరును బ్రాచీనాంధ్ర సారస్వత మునకై పరిశోధనల గావించిన దప్పక యనేక గ్రంథము లిప్పటికిని బయల్పడక మానవు.

అనంతర రాజకీయస్థితి

మార్చు

మనుమసిద్ధి రాజు మరణ సంవత్సరము తెలియబడనందున నెప్పటి వర కాతడు పరిపాలనము చేసియుండెనో చెప్పజాలను. అయినను సిద్ధిరాజు మరణానంతరము విక్రమసింహపురమునకు దక్షిణభాగమునం దున్న దేశ మం తయు కాకతీయ సేనాధిపతుల వశమయ్యెనని చెప్పవచ్చును. తెలుగుచో డులకును, కాకతీయ సేనాధిపతులకు అప్పుడప్పుడు పోరాటములు జరుగు చుండుట స్పష్టమైన విషయము. కాకతీయ సేన్యాధ్యక్షులలోని ప్రముఖు లయిన గంగయసాహిణి, త్రిపురారి దేవుడు, మొదలగు వారు మిక్కిలి బలవం తులును, పరాక్రమవంతులు అయినందున తెలుగుచోడులను జయించి సామం తులనుగ చేసికొనిరి. శా.శ.1197వ సంవత్సరము అనగా క్రీ.శ. 1275వ సంవత్సర ప్రాంతమున శ్రీమన్మహా మండలేశ్వర నాగదేవ మహారాజు విక్రమ సింహపురమునన పరిపాలనము చేయుచున్నటుల ఆత్మకూరు సీమలోని కామిరెడ్డిపాడులో వెలసియున్న దుర్గాపరమేశ్వరి కైంకర్యమునకై అనుయూరు ప్రభువులగు ఇతమరెడ్డి మారతోయలను బారు చేసిన దానశాసనమును బట్టి తెలియుచున్నది. ఈ శాసనమున పేర్కొనబడిన మాండలికుడైన నాగదేవరాజు కాకతీయాంధ్ర చక్రవర్తుల యొక్క రాజకీయాధికారియు, సేనాపతియు నైనటుల మరికొన్ని శాసనములంబట్టి తెలియుచున్నది. ఇతడు

రెండవ ప్రకరణము.

క్రీ.శ. 1272-73వ సంవత్సరమున విక్రమసింహపురాధిపతియై యున్నటులను, అంగపళందనాడులోని భూములను గొన్నిటిని భీమనదేవుడనకు దానము చేసినటులను, ఈడూరులో వెలసియున్న చొక్కనాథస్వామి యాలయములో శాసనము వ్రాయించెను.

నెల్లూరు నాగరాజులు

మార్చు

పైన చెప్పిన నాగదేవుడు నాగవంశమున జనించిన వాడుగ గనుపట్టుచున్నాడు. ఇతడాంధ్రచక్కవర్తిని యగు రుద్రమదేవి కాలమునుండి నెల్లూరు మండలములోని కొంత భావమునకు బరిపాలకుడుగా నియమింపబడి యుండెను. చోడచక్రవర్తులకును, కాకతీయాంధ్ర చక్రవర్తులకును సామంతులుగనుండిన నాగవంశజులమని చెప్పుకొనిన రాజులు కొందరు నెల్లూరు మండలమున అప్పుడప్పుడు పరిపాలనము చేయుచువచ్చిరి. రాజరాజదేవచోడ చక్రవర్తి యొక్క 18వ పాలన సంవత్సరమున నాత్రేయగోత్రజుడును, అహిక్షేత్రపురాధీశ్వరుండును, మధ్యదేశాధీశ్వరుండును. ఫణిమండలాధిపతియును, శివపాదశేఖరుండను బిరుదారచితుడును, కులోత్తుంగ చోడపట్ట శేఖరదేవుని కుమారుడునగు సిద్దరాజుయొక్క దానశాసనము గూడూరు సీమలోని మల్లమను గ్రామములోని సుబ్రహ్మణ్యేశ్వరుని యాలయములో వ్రాయబడియున్నది. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తికి సామంతుడుగ నుండి యా ఆలయముననే వ్రాయించిన దానశాసనములో తానాత్రేయ గోత్రజుడననియు, ఫణిమండలాధీశ్వరుడననియు, అహిక్షేత్రపురాధిపతి ననియు, చెప్పుకొన్న పెద్దరాజుకూడ పైనుదాహరించిన సిద్ధరాజు వంశములోని వాడేయనుట కెంత మాత్రమును సందియము లేదు. ఈ పెద్దరాజు కొడుకు సిద్ధరాజు, తన జ్యోష్ఠసోదరి యగు పచ్చలదేవి మనుమసిద్ధి రాజు యొక్క భార్య యని గూడూరుసీమలోని రెడ్డిపాలెములో నున్న పాండురంగస్వామి ఆలయములో తాను వ్రాయించిన దానశాసనమున బేర్కొనియున్నాడు. ఈ సిద్ధరాజుయొక్క భార్య ఒరయూరుచోడు డనుశూరళ్వారు కత్తిదేవ రాజు కొమార్తయగు ఇమ్మడి శ్రీయాదేవియని యిప్పటికే మఱియొక శాసనమునుబట్టి దెలియుచున్నది. ఈ శాసనములంబట్టి తెలుగు చోడరాజులకును తెలుగు నాగరాజులకును సంబంధబాంధవములు గలవని స్పష్టముగా దెలియుచున్నది. దర్శిసీమలో జేరిన దర్శిపట్టణములోని యొక దేవాలయములో నాగవంశోద్భవుడైన ఆసనదేవ మహారాజు యొక్క శాసనములో నాతని వంశవృక్షము దెలుపబడినది. ఆ శాసనము క్రీ.శ.1384-85వ సంవత్సరమున వ్రాయబడినది. ఆ శాసనములోని వంశవృక్షమున ఆసనదేవరాజు తాతయగు వేములమలిదేవరాజునకు దాత నాగరాజని యొక నాగరాజు పేరు గానంబడుచున్నది. పైనుదాహరింపబడిన నాగదేవాజితడేయైయుండునేమో నిర్ధారించుటకు బ్రస్తుతము నొక్క యాధారమైన గానరాదు. దర్శి నాగరాజుల హరిత గోత్రులమని చెప్పుకొనియున్నారు గావున, వీరికిని పై గూడూరు శాసనములోని యాత్రేయగోత్రజులయిన నాగరాజులకు నే విధమయిన సంబంధము లేదని యూహింపవలసినది. నాగరాజులను గూర్చి మఱియొక ప్రకరణమునందు సవిస్తరముగా వివరింపబడును గావున, నిచ్చట వ్రాయుట విరమించుచున్నాడను.

ఇమ్మడి తిక్కరాజు.

మార్చు

మనుమసిద్ధి రాజునకు బిమ్మట సిద్ధిరాజుకొడుకగు రెండవతిక్కరాజు గద్దెనెక్కినటుల గానిపించుచున్నది. ఈ యిమ్మడి తిక్కరాజు శా.శ.1200 (క్రీ.శ.1278)వ సంవత్సరమున బట్టాభిషిక్తుయైనటుల గూడూరు సీమలోని కృష్ణాపట్టణములోని శాసనముబట్టి తెలియుచున్నది. ఇతడు సింహాసనమెక్కిన రెండవ యేటనే అనగా శా.శ.1201వ సంవత్సరమున మీనమాసమున శుద్ధదశమి గురువారమునాడు గండగోపాలపట్టణ మనియెడి కొల్లిత్తురై పట్టణమున నివసించయునట్టి వర్తకులు తిరుక్కావనమునందు సమావేశులై తాము చేసికొన్న యొడంబడిక ప్రకారమా రేవుపట్టణములో నెగుమతి చేయబడునట్టియు, దిగుమతి చేయబడునట్టియు, బస్తాల యొక్క మదింపు విలువనుబట్టి నూటికి నాలుగువంతున కొల్లిత్తురై గ్రామము లోని మనుమసిద్ధీశ్వరుని యాలయ నిర్మాణముకొరకును, ధూపదీప నైవేద్యాలంకారము కొరకును, వినియోగించునటుల దానశాసనము వ్రాయించిరి.[23]

కృష్ణాపట్టణము గొప్ప రేవు పట్టణము

మార్చు

ఆ కాలమునందు కొల్లిత్తురై యనియు, గండగోపాల పట్టణమనియు పేర్కొనబడిన కృష్ణాపట్టణము గొప్ప రేవు పట్టణముగా నుండెనని పై శాసనమునుబట్టి విస్పష్టమగుచున్నది. పదునెనిమిది విదేశములనుండి యైదు వందల మంది విదేశ వర్తకులును, ఆయా నాడులనుండియు, పట్టణములనుండియు, పంచమండలముల నుండియు వచ్చినట్టి వర్తకులును, ఆ రేవుపట్టణమున నివసించుచుండి రని యా శాసనమునందు జెప్పబడియుండుట చేతనే యా కాలమునందు కృష్ణాపట్టణము (Krishnapatam) గొప్ప రేవు పట్టణముగా నుండెననియు, విదేశములతో విరివిగా వర్తక వ్యాపారము జరుగుచుండె ననియు, జక్కగా బోధపడుచున్నది. ఇతడు విశేష కాలము రాజ్యపాలనము చేసినట్టు గానరాదు.

మనుమగండగోపాలుడు

మార్చు

ఇమ్మడి తిక్కరాజునకు వెనుక మనుమగండగోపాలుడు రాజ్యపాలనము వహించెను. ఇతడు క్రీ.శ.1282-83వ సంవత్సరమున బట్టాభిషిక్తుడైనటుల నెల్లూరుసీమలోని కొడవలూరు చెరువులోని యొక రాతి మీద వ్రాయబడిన రెడ్ల దానశాసనము వలన దెలియుచున్నది. నెల్లూరు తెలుగు చోడులలో మనుమగండగోపాల నామము గలవారిరువురు గనుపట్టుచున్నారు. ఒక మనుమగండగోపాలుడు నెల్లూరునకు దక్షిణభాగమునను, మరియొక గండగోపాలుడు నెల్లూరునకు ఉత్తరభాగమునను, పరిపాలనము చేసినట్లు శాసనము వలన దేటపడుచున్నది గాని, వీరురువునకు నెట్టి సంబంధము గలదో బోధపడకున్నది. వీరిలో మొదటి మనుమగండగోపాలుడు, తిక్కరాజునకు వెనుక వెనువెంటనే రాజ్యపదవిని బొందక, కాకతీయ సైన్యాధిపతులలో నొక్కడగు అంబదేవమహారాజుయొక్క సాహాయ్యము చేత రాజ్యపదవి బొందినటుల గనుపట్టుచున్నది. ఈ మొదటి మనుమగండగోపాలుని విక్రమసింహపురంబున దాను సింహాసన మెక్కించినటుల త్రిపురాంతకుని సోదరుడగు అంబదేవమహారాజు త్రిపురాంతకమున తనచే లిఖింపబడిన యొక దాన శాసనమున చెప్పుకొనియున్నాడు. రెండవ మనుమగండగోపాలుడు కాకతీయచ్రకవర్తిని రుద్రమదేవికి భృత్యుడై కాకతీయ సైన్యాధిపతులలో నొక్కడైయుండెను. ఇతడు నిర్వచనోత్తర రామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు యొక్క రెండవపుత్రుడును, రెండవ తిక్కరాజుసోదరుడు, నగు విజయాదిత్యదేవుని పుత్రుడని తోపుచున్నది. ఒక కాకతీయ సైన్యాధిపతి తాను యుద్ధరంగమున ఒక మనుమగండగోపాలుని సంహరించితినని చెప్పుకొనియున్నాడు. ఆ మనుమగండగోపాలుడు మొదటివాడో, లేక మఱియొక వంశములోనివాడో, భావి పరిశోధనమునగాని తెలియునదికాదు. మొదట రాజ్యమును పోగొట్టుకొని తరువాత కాకతీయ సైన్యాధిపతి యగు అంబదేవునిచే సింహాసనమెక్కింపబడిన మనుమగండగోపాలుని చరిత్రమును బురస్కరించుకొని సిద్ధేశ్వర చరిత్రమునందును, సోమదేవరాజీయమునందును, వక్కాణింపబడిన మనుమసిద్ధిరాజు యొక్కయు; అక్కనబయ్యనల యొక్కయు గాథ ఇటీవల గల్పింపబడినదేమో యని సందేహము కలుగుచున్నది.

రాజగండగోపాలదేవుడు

మార్చు

మనుమగండగోపాలునికి వెనుక విక్రమసింహపురాధిపత్యమును వహించినవాడు మధురాంతక పొత్తపిచోడ శ్రీరంగనాథుడు. ఇతనినే రాజగండగోపాలదేవుడందురు. ఇతని కాలమున గాంచీపురచోడులయొక్క యధికారము సంపూర్ణముగా నంతరించి పోయినందున నీతడు త్రిభువనచక్రవర్తియను బిరుదమును వహించెను. ఇతని శాసనములు గూడూరు, నెల్లూరు సీమలలో గానింపిచుచున్నవి. ఇతడు క్రీ.శ.1289-90వ సంవత్సరమున సింహాసనమెక్కినటుల శాసనములలో ఉదాహరింపబడిన పరిపాలన సంవత్సరములంబట్టి యూహింపదగియున్నది. కాంచీపుచోడుల యధికార మంతరించిన వెనుక నితడు స్వతంత్రుడై కాకతీయరుద్రమదేవికిని, కొంతకాలము కాకతీయ ప్రతాపరుద్రదేవ చక్రవర్తికిని ప్రత్యర్థిగనుండి క్రీ.శ.1314వ సంవత్సరము వరకు పరిపాలనము చేసి తుదకు, ప్రతాపరుద్రునిచే జయింపబడి రాజ్యము గోలుపోయినటుల గనబడుచున్నది. ఇతినికి బిమ్మట కాంచీపురము వరకు గల యావద్దేశమును ప్రతాపరుద్రుని సైన్యాధిపతి యగు ముప్పిడినాయకునిచే జయింపబడి కాకతీయసామ్రాజ్యమున జేర్చబడినది. ఇతడు తాను గావించిన దానములన్నియును నెల్లూరులోని శ్రీరంగనాయకస్వామి ఆలయమునకే చేయబడియుండుటచేత ఇతడు వైష్ణవమతావలంబకుడని చెప్పనగును. ఇతనితో విక్రమసింహపురచోడుల చరిత్రమంతరించినది.

తెలుగు పల్లవరాజులు

మార్చు

చాళుక్యచోడ సామ్రాజ్యము శిథిలమై దురవస్థలపాలగుచున్న కాలమున దెలుగుచోడులవలెనే ప్రాచీన పల్లవరాజవంశములలో జనించిన నవీన పల్లవరాజులు కొందరు తమ పూర్వులు గోల్పోయిన రాజపదవులను మరల సంపాదింపవలయునని ప్రయత్నపడినటుల గనుపట్టుచున్నది. ప్రాచీన పల్లవరాజుల చరిత్రమును నాయాంధ్రులచరిత్రములోని ప్రథమభాగమున విస్తరించియున్నానుగదా, ఆ పల్లవరాజుల సంతతివారు పెక్కండ్రు పూర్వ చాళుక్యచక్రవర్తులకును, చాళుక్యచోడ చక్రవర్తులకును లోబడినవ సామంతులుగనుండియు, బిమ్మట చాళుక్యచోడ సామ్రాజ్యముస్తమించు కాలమున గొంతవరకు స్వాతంత్ర్యమును వహించి తెలుగు చోడ రాజులతోను, కాకతీయసైన్యాధిపతులతోడను బోరాడుచు వచ్చి, తుదకు తెలుగుచోడులకును, కాకతీయులకును వశులై, తమతమ రాజ్యభాగములను కోల్పోయిరి. ఈ నవీన పల్లవరాజుల చరిత్రముగూడ తెలుగుచోడుల చరిత్రము వలెనే స్పష్టముగా దెలియంబడక చరిత్రకారులకు వేసటబుట్టించునదియై యున్నది. అయినను దెలిసినంతవరకు నిట సంగ్రహముగా వివరించుచున్నాడను. మొదటి కులోత్తుంగచోడ చక్రవర్తి బ్రదికియున్న కాలముననే అమ్మరాజను నామాంతరముగల శ్రీమన్మహామండలేశ్వర నందివర్మ మహారాజు కడపమండలములోని ప్రొద్దుటూరు రాజధానిగ గొంత యాంధ్రభూభాగమును బరిపాలించుచుండెను.

నందివర్మ మహారాజు

మార్చు

ఇతడు ముక్కంటి కాడువెట్టి వంశమున జయించిన దారపరాజునకు దుర్గాదేవియందు జనించిన పరాక్రమశాలియగు పుత్రుడు. ఇతని రాజ్యము నెల్లూరు మండలములోని పూగినాడు వరకు వ్యాపించియుండెను. ఇరుగరాజు, సమర్తరాజు నితని కన్నలు. భీమరాజు, బంధురాజు నితనికిదమ్ములు. ఇతడు శాలివాహన శకము 1024 అగు చిత్రభాను సంవత్సర వృషభమాసమున (అనగా క్రీ.శ.1102-03వ సంవత్సరమున) చోడపురమున బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు పెనుగోడు మాడురేని సీమలను బాలించుచు తన సామంతులతోడ సఖ్యమును వహించియుండి యొకానొక చంద్రగ్రహణ సమయమున పూగినాడులోని మ్రిదికల్లు,గుడిమట్ట, బద్దిమడుపు, కోకూరు, ఉప్పలపురము, రావిపాడు, ఇద్దుకులపాడు, బద్రుపడియ, సంగము, గోనుగుంట, గుడిపాడు గ్రామములను బ్రాహ్మణులకగ్రహారములుగా నిచ్చుటయేగాక, పాదటూరులోని యురుగేశ్వరునకును, దారేశ్వరునకును, దేవళములను మండపములను గోపురప్రాకారములను నిర్మించెను. మరియు వింధ్యవాసినియను గుడిని కట్టించెను. షోడరసముద్రం బను చెరువును త్రవ్వించెను. పంటకాల్వలను ద్రవ్వించి తూములను గట్టించెను. వృషభకేశ్వరునకును, దారేశ్వరునకును, భూదానములను చేసి పూలతోటలను వేయించెను. తల్లి దుర్గాదేవి పేర నొక మండపమును, తన యన్నయగు సమర్తరాజు పేర గోపుర ప్రాకారములను నిర్మించెను. మరియు నింకెన్నెన్నో దేవస్థానములకును, బ్రాహ్మణులకును, భూదానములు మొదలగునవి చేసి విఖ్యాతయశుడయ్యెను. ఇతడు వహించిన బిరుదములనుబట్టి స్వతంత్రుడని కనబడుచున్నను, మొదటి కులోత్తుంగచోడ చక్రవర్తికి లోబడియున్ యొక మహాసామంత ప్రభువనియే యూహింపదగియున్నది. తాను కాంచీపురములోని కామకోట్యంబిక యొక్క పాదభక్తుడనని చెప్పుకొనియుండుటచేత శాక్తేయమత మవలంబించిన వా డని చెప్పవచ్చును. అయినను వేంగడము (తిరుపతి) లోనుండు వేంగడ నాధుని సందర్శించినవాడనని చెప్పుకొనియుండుటచేత మతసహనము వహించిన వాడని వ్యక్తమగుచున్నది.

అల్లుర తిరుకాళత్తి దేవరాజు

మార్చు

ఇతని శాసనములు కొన్ని నెల్లూరుసీమలో గానిపించుచున్నవిగాని, ఇతడు స్వతం్రతుడుగాక తెలుగుచోట రాజుల క్రింద సామంతుడుగనుండినటుల ఊహింపదగియున్నది. ఈ తిక్కరాజు పల్లవుడని గండవరము గ్రామములోని శాసనములవలన తెలియుచున్నది కావున, ఇతనికిని మనుమసిద్ధిరాజు తండ్రియగు చోడుతిక్కరాజునకు ఏ విధమైన సంబంధము లేదు. ఇతడు దేవస్థానములకును, బ్రాహ్మణులకును, అగ్రహారములు భూదానములు మొదలగునవి చేసియుండెను. ఇతడు క్రీ.శ.1182వ సంవత్సరప్రాంతముననున్నవాడు. ఆ కాలముననే కడప మండలములో సిద్ధనదేవమహారాజు పరిపాలనముచేయుచుండెనని కడపమండలములోని చింతలపుత్తూరు శాసనమువలన తెలియుచున్నది.

అభిదేవ మలిదేవమహారాజు

మార్చు

ఈ పల్లవరాజును తాను పల్లవుడననియు, భారద్వాజగోత్రుడననియు, ముక్కంటికారువెట్టి వంశజుడననియు, కామకోట్యంబిక భక్తుండననియు చెప్పుకొని యుండుటచేత ఇతడును బైపల్లవరాజు వంశములోనివాడనియే చెప్పదగును. ఇతను క్రీ.శ.1218-19వ సంవత్సర ప్రాంతముననున్నవాడు. ఇతడును దైవతాభక్తియు,బ్రాహ్మణభక్తియుగలిగి యనేకాగ్రహారములను దానము చేసియున్నాడు.

ఇమ్మడిదేవమహారాజు

మార్చు

ఇతడును శ్రీశైలమునకు తూర్పుదేశమున డెబ్బదియగ్రహారములను నిర్మించిన ముక్కంటికాడువెట్టియొక్క వంశజుడని పైవారి వలెనే పెక్కు బిరుదములను వహించియుండెను. తన తండ్రి భీమరాజునకును,తల్లి సిరియాదేవికిని, పుణ్యమునకై నాగలావరముననందు చెన్నకేశవపెరుమాళ్ళను ప్రతిష్ఠచేసి యా దేవర అర్చకత్వమునకై శ్రీరంగభట్టు కొడుకు పెరుమాడినంబిని నియమించి,ఇతనికిని అనేక బ్రాహ్మణవర్యులకును భూదానములు మొదలగునవి చేసియున్నాడు. ఇతడును స్వతంత్రుడుగాక, మరియొకనికి లోబడియుండెననియే ఊహింపదగియున్నది. ఈ పల్లవరాజు క్రీ.శ.1268-69వ సంవత్సర ప్రాంతముననున్నవాడు.

మహారాజసింహుడు

మార్చు

పల్లవుడైన ఈ మహారాజుసింహుడు మిక్కిలి ప్రసిద్ధికెక్కినవాడుగ కనిపించుచున్నాడు. ఇతడు ద్రావిడ భాషాశాసనములలో కొప్పరంజింగదేవుడని వ్యవహరింపబడినవాడు. ఇతని దానశాసనములు క్రీ.శ.1243 మొదలుకొని 1279 వరకు కనిపించుచున్నవి. ఇతని శాసనములు కందమోలి (కర్నూలు) మండలములోని త్రిపురాంతకము నందును, గోదావరి మండలములోని ద్రాక్షరామమునందును, గన్పట్టుచుండుటచేత నా కాలమునందీతడు తెలుగుదేశమునందు స్వసైన్యముతో సంచరించున్నవాడని తేటపడుచున్నది కాని, ఏ కారణముచేత తెలుగుదేశమునకు వచ్చెనో, ఎంత కాలముండెనో, భావి పరిశోధనమువలన తెలియదగినదే కాని, ప్రస్తుత సాధనములంబట్టి తెలియరాదు. ఇతడు కాకతీయ గణపతిదేవునియొక్క యవసానకాలమునందును, రుద్రమదేవి యొక్క పరిపాలనాకాలమందును, కాకతీయ సైన్యాధిపతులతో పోరాడుచు జయాపజయములను కాంచుచువచ్చి తుదకు కాకతీయులకు వశ్యుడై అంతరించెనని తోచుచున్నది. ఇతడొకచోటునుండి పరిపాలనము చేసినట్లు కనబడలేదు. ఇతడు కాంచీపురమునందున్న కాలమున మనుమసిద్ధిరాజు తండ్రియగు తిక్కరాజుచే జయింపబడినటుల ఇదివరకే తిక్కరాజుచరిత్రమున తెలిపియున్నాడను.

మఱికొందరు పల్లవరాజులు

మార్చు

త్రిపురాంతక శాసనములలో గన్పట్టెడి అల్లాడ పెమ్మయదేవమహారాజు,విజయగండగోపాలదేవమహారాజు, పౌడకమాదిసిద్ధిరాజు మనుమడు అల్లాడనాథదేవమహారాజు, అండలూరి విజయాదిత్యదేవుని మనుమడు మధుసూధనదేవమమారాజు, భీమయదేవమహారాజు కొడుకు సిద్ధమదేవుల విజయదేవుడు, విజయాదిత్యదేవమహారాజు మొదలగు పల్లవరాజులు పదమూడవ శతాబ్ద మధ్యమున తెలుగు చోడ రాజులకు సామంతులుగ ఉండి వర్థిల్లుచుండిరి. పల్లవులలో కొందరును, తెలుగు చోడులలో కొందరును,తాము రాజ్యాధికారము వహించినవారు కాకపోయినను రాజకుటుంబములయందు జనించినంత మాత్రముననే మహారాజబిరుదములను వహించి తమతమ దానశాసనములందు వానిని వల్లెవైచి మనకీకాలమున జరిత్రరచనకు పెక్కు చిక్కులను కల్పించియున్నారు.

యాదవ చాళుక్యరాజులు

మార్చు

చాళుక్యచోడ చక్రవర్తులగు మూడవ కులోత్తుంగచోడదేవునకును, మూడవ రాజరాజచోడ దేవునకును,సామంతులుగనుండిన కొందరు తాము చాళుక్యవంశజులమనియు, యాదవవంశజులమనియును చెప్పుకొని ఉన్నారు. వీరి శాసనములు చిత్తూరు మండలములోని కాళహస్తిలోను, చెంగలుపట్టు మండలములోని రామగిరిలోను, దక్షిణార్కాటు మండలములోని తిరువణ్ణామలలోను కనిపించుచున్నవి. మరికొన్ని శాసనములు వేంకటగిరి సీమలోని చాపలపల్లి గ్రామములోను కనుపట్టుచున్నవి. ఈ శాసనముల వలన తెలియదగిన ముఖ్యాంశమెద్దియన, నీ వంశములో చేరిన భుజబలసిద్ధరాజను నామాంతరముగల రాజమల్లదేవుడు పాకనాటలో నాగపడోలను ప్రదేశమునకు బ్రాహ్మణులననేకులను రప్పించి అనేక నివేశనములనిప్పించి ఆ పట్టణమునకు రాజమల్లచతుర్వేదిమంగళమని నామంబిడుటయే. ఆ కాలమునందే ఆతడా గ్రామమునందు విజయదేవియను నామాంతరముగల కమలమహాదేవి యను తన దేవిపేరిట గమలమహాదేవిపుత్తేరి అను తటాకమును నిర్మించెను. వీరి శాసనములున్న విష్ణ్వాలయమాకాలమున యాదవనారాయణపెరుమాళ్ళ కోవెల అని పేర్కొనబడుచుండెను. అదియుగూడ నా కాలముననే కట్టబడియుండును. ఇప్పుడెచ్చటను గానరాని తిరునగరేశ్వర మొడయరుని దేవళము దానికన్నను ప్రాచీనమైనదిగ నుండెను. రాజమల్లుడను సిద్ధరాజు కట్టిదేవ రాజు కొడుకు. ఇతడే కాళహస్తిలోని రెండు శాసనములలో ఘట్టిదేవుండని పేర్కొనబడియున్నాడు. ఈ కడపటి వాడు మూడవ రాజరాజచోడ చక్రవర్తికి సామంతుడుగనుండి కప్పము గట్టుచుండెను. ఈ కట్టిదేవరాజునకును, ఆ వంశములోనివారే యగు తిరుక్కాళత్తిదేవునకును, నరసింహదేవునకు నెట్టి సంబంధముగలదో భావిపరిశోధనములను బట్టియే నిర్ధారింపనగును. తెలుగు చోడ వంశములోని వాడగు మధురాంతకపొత్తపిచోడయెర్రసిద్ధిరాజు రాజమల్లునకు సామంతుడుగనుండి కప్పముగట్టుచున్నటుల నూహింపదగియున్నది. [24]

మతసాంఘిక రాజకీయార్థిక స్థితులు

మార్చు

తెలుగుచోడరాజుల పరిపాలనకాలమున దేశములోని మతసాంఘిక రాజకీయార్థిక స్థితిగతులెట్లుండెనో వానినిగూర్చి కొంచెము చెప్పవలసియున్నది. ఆంధ్రదేశముయొక్క యాగ్నేయభాగమునందనగా కాంచీపురము,కడప,నెల్లూరు పట్టణములకు నడుమనుండు దేశముయొక్క మతసాంఘిక రాజకీయార్థిక స్థితిగతులకు చాళుక్యచోడచక్రవర్తుల పరిపాలనమునుబట్టిగాక పేరికిమాత్రము వారికి సామంతులుగనుండి నిజమైన అధికారమునంతను వహించిన తెలుగుచోడరాజులయొక్కయు, వారి సామంతులయొక్కయు పరిపాలనముబట్టి తెలిసికొనవలసియున్నది. పండ్రెడవ శతాబ్దము మొదలుకొని పదునాలుగవ శతాబ్దము వరకు నిన్నూరుసంవత్సరముల కాలమీతెలుగు చోడరాజులు పారతంత్ర్యమునంజిక్కి యైకమత్యములేక తమలోతాము పోరాడుచుండుటయు, పారతంత్ర్యమునుండి విడిబడి స్వతంత్రులగుటకై చేసిన ప్రయత్నములన్నియు భగ్నములగుటయు జూచినప్పుడు స్థూలదృష్టికి మతసాంఘికరాజకీయార్థికస్థితులభివృద్ధి లేక హీనతియందున్నవని పొడగట్టవచ్చునుగాని కొంచెము పరిశీలనచేసి సూక్ష్మదృష్టితో జూచిన పక్షమున నయ్యభిప్రాయము సరియైనదికాదని తోపకపోదు. సామంత మాండలిక రాజు లైకమత్యములేక యొండొరులతో గలహించి పోరాడుచున్నను, ఆ కాలమునందలి పరిపాలనాపద్ధతులను బట్టి మతసాంఘికస్థితుల కంతగా నలజడి కలిగియుండునని తలంపరాదు. గ్రామపరిపాలనము ప్రజల స్వాధీనమునందుండచేత ప్రభుత్వము చేయు రాజులు మహారాజులు మారుచుండినను గ్రామపరిపాలనా పద్ధతులు మారకుండెను. అందువలన దేశమున రాజకీయపు గలవరమెంత యున్నను, మతసాంఘికస్థితులు చెక్కుచెదరకయుండెను. ప్రభుత్వము చేయు రాజులుగాని, రారాజులుగాని, ప్రజలు మతసాంఘికస్థితులయందు జోక్యము కలుగచేసికొన్నప్పుడే గొప్ప సంక్షోభము జనించును. ఈ తెలుగుచోడరాజులెన్నడు నట్టి జోక్యమును కలిగించుకొన్నట్టు దృష్టాంతములు గానరావు. ఈ చోడరాజులలో పెక్కండ్రు వైష్ణవమతమవలంబించి పెక్కు విష్ణ్వాలయములను నెలకొల్పి వసతులేర్పాటుచేసి నూతన వైష్ణవమతమును వ్యాపింపజేసిరి. అయినను, మతసహనబుద్ధి కలిగి శైవులతో వైరమును పెంచుకొనక కొందరు శివాలయములకును వృత్తులనేర్పరుచువచ్చిరి. కమ్మనాటిచోడులు శైవులుగను, పాకనాటిచోడులు వైష్ణవులుగనుండిరి. ఈ తెలుగు చోడ రాజుల కాలముననే ఈ యాంధ్రభూభాగమునకు దక్షిణమునుండి వైదికబ్రాహ్మణులును, ఉత్తరపశ్చిమములనుండి నైయోగికబ్రాహ్మణులును వచ్చి స్తిరనివాసులైరి.
చాళుక్యచోడచక్రవర్తులలో గడపటివారనగా రాజరాజనరేంద్రుని తరువాతివారు వేంగీదేశమునందుండక ద్రావిడదేశమునందున్న వారగుటచేత వారికాంధ్రభాషకంటె ద్రావిడభాషయే యభిమానపాత్రమయ్యెను. అయినను వారికి సామంతులుగనుండిన మన ఈ తెలుగుచోడరాజుల కాలమున మన ఈ యాంధ్రభాష మహోత్కృష్టదశకు వచ్చినదని చెప్పుటకొక్క తిక్కనసోమయాజి పేరు చెప్పినచాలును. వీరి పరిపాలనయందు దేశభాషాభివృద్ధిమాత్రమేకాక జనాభివృద్ధియు, వర్తకాభివృద్ధియు, సస్యవృద్ధియు లభించియుండెను. అరణ్యములు ఛేదింపబడి గ్రామములు, పట్టణములు నిర్మింపబడినవి. చక్కనిబాటలేర్పరుపబడినవి. బాటలకిరుప్రక్కల వృక్షములును, అచ్చటచ్చట బాటసారులకు విశ్రాంతిగృహము లును నెలకొల్పబడుచువచ్చినవి. సెలయేళ్ళ కానకట్టలు కట్టి తటాకముల నిర్మించి వానింబట్టి పంటకాల్వలు త్రవ్వించి వ్యవసాయదారులకు జలాధారములను గల్పించుచువచ్చిరి. వీరి కాలమునందు కృష్ణాపట్టణము గొప్ప రేవుపట్టణముగ నుండెను. ఈ రేవుగుండ విదేశములతోడ విస్తారముగా వర్తకవ్యాపారము జరుగుచుండెను. విదేశర్తకులెందరో ఈ దేశమునకు వచ్చి ఇచ్చట నివసించుచుండిరి. విదేశవర్తకులు సహితమిచ్చటి వర్తకులతో మ్రైతిబాటించి వీరు చేయు ధర్మకార్యములకు దామును తోడ్పడుచుండిరి. తక్కువజాతుల వారు నాగరికులై శైవులు, వైష్ణవులనగుచు నగ్రవర్ణముల వారితో సాటిరాగలవారమని చెప్పుకొనుట ప్రారంభమయ్యెను. ఈ విషయము మరియొక తావున విస్తరించి వ్రాయబడును.

మూడవ ప్రకరణము

మార్చు

నాగవంశోద్భవులైన మహారాజులు

మార్చు

క్రీ.శ.1030 మొదలుకొని క్రీ.శ.1325 వరకు

మార్చు

ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగమున నాగులగూర్చియు, నాగకులస్థులనుగూర్చియు గొంతవఱకుజర్చించి వారల యుదంతంబు బావుకులకు దెలిపి యున్నాడను. వీరలచరిత్రం దామూలాగ్రముగా దెలిసికొనగోరినయెడల సంస్కృతభాషలో వ్రాయబడిన పురాణేతిహాసకావ్యగ్రంధములు మొదలగువాటిని బెక్కింటిని బరిశోధించి యొక ప్రత్యేకగ్రంధమును వ్రాయవలయునెగాని యీయాంధ్రులచరిత్రమున సవిస్తరముగా దెలుప సాధ్యముకాదు. ఆర్యు లీజంబూద్వీపమునం బ్రవేశించినకాలమున నీదేశమునందును దీన్తిసమీపదేశములయందును సురాసురయక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధసాధ్యవిద్యాధరగరుడోరగాది జాతులవారు ఇవసించుచుండిరి. ఈ జాతులలోని వీరనాయకులనేకసహస్రవత్సరములు గడిచిపోవగా దివ్యపురుషు

  1. Annual Report on Epigraphy for 1899. Nos. 188 & 205
  2. Annual Report on Epigraphy for 1907-08, Part II. paragraph 79.
  3. Nellore Incriptions D.Nos. 48.49.
  4. ఈ గ్రంథమును శ్రీయుత మానవల్లి రామకృష్ణయ్యపంతులు ఎమ్.ఏ., గారు నూతనముగా బ్రకటించియొక పీఠికను వ్రాసియున్నారు.
  5. The Early History of India by V.A.Smith., p.419.
  6. Ep.Ind.Vol.ix., pp.47 to 56; Copper Plate No.19, Nellore. Inscriptions Part I.p.164; Annual Report on Epigraphy No.655, Public, 28th July 1910 para 10.
  7. ఈ కవియొక్క శైలి తెలియుటకై కుమారసంభవమునుండి యీ క్రిందిపద్యములుదాహరించుచున్నాడను. మదనదహన సమయమున :
    “క. కనికోపించెనొ, కానక
    మునుగోపించెనొ మహోగ్రముగ నుగ్రుడు సూ
    చినగాలెనొ చూడకయట
    మునుగాలెనొ నాగనిమిషమున నరగాలెన్.“

    “క. గిరిసుతమై గామాగ్నియు
    హరుమై రోషాగ్నియుం దదంగజు మైను
    ద్ధుర కాలాగ్నియు రతిమై
    యురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్.“
    రతి సహగమనోద్యుక్తయైచితి జొరజనునప్పుడాకాశవాణి యాత్మహత్య వారించిన శోకాగ్నితప్తయగుచు :
    “క. కరువున బూరితమై లో
    హరసములో గాలునట్టు లంగజు శోకో
    ద్ధురశిఖి రతి తనువిమ్ముగ,
    గరగియు బొడవరక లోన గాలుచునుండెన్.“
    సీ. అలమట సెడియొండె నిలువదు చిత్తంబు
    మూర్ఛిల్లి నెడబాసి పోవ దొండె,
    నూరటగొనియొండె నారదుశోకాగ్ని
    వొరిమాలగొని కాలిపోవదొండె,
    ఘర్మాశ్రుజలములొక్కట గట్టుకొన వొండె
    బొడవంతయు గరంగి పోవ దొండె,
  8. బర్వనిట్టూర్పులు పట్టువ బడవొండె,
    బొందిమ్ముగా బాసి పోవ దొండె,
    నిట్టి కడలేని దుఃఖాబ్ధిబెట్టి ముంప
    దలచియో కాక పోనీక బలిమి నాదు
    ప్రాణమొడలిలో నాకాశవాణి దెచ్చి
    మగుడ జెరబెట్టెనని రతిమగుచుండె.“
    వీరపురుషులు యుద్ధమునకు వెలువడుచుండ నొక వీరపత్ని పచ్చవలువయు, గంఠమాల్యములును, వీరమద్దియలును ధరించి నిశ్చిత హృదయుండగుపతిం గనుంగొని చెప్పుచున్నది.
    ఉ.ఓలములేదు కూర్చునని యోరడియుండితి గూర్మియెల్ల నే
    డాలముచేసి నన్ను బెడయాకులబెట్టె మనఃప్రియుండు త
    న్నాలములోన బెట్టి దివిజాంగనలం గలయంగ నెత్తెనే
    నాలనె బేలగాక చెలియాయని నెచ్చెలిమీద వ్రాలుచున్.“
  9. కోయంబత్తూరు మండలములో కొల్లేగాలము అను స్థలమునకు 18మైళ్ళ దూరముననున్న ఉజ్జపురమే ఉజ్యపురమని డాక్టరు లూడర్సుగారు నిర్ధారణము చేసినారు. అయినను నెల్లూరు మండలములో సూళూరుపేట డివిజనులో ఉచ్చూరు అనెడి గ్రామమొకటి కలదు. ఇచ్చటి యరవశాసనములలో నీ గ్రామము ఉచ్చియూరని వాడబడియున్నది.
  10. Annual Report on Epigraphy for 1905-06. p.10.
  11. Annual Report on Epigraphy for 1903-04. p.26.
  12. Nellore Inscriptions. Vol. I. p.443, G.87.
  13. Annual Report on Epigraphy, for 1937. Nos.579, 584.
  14. Ep.Ind. Vol.VII. p.122
  15. A.R.1904-05, para.19.
  16. S.I.I.Vol.III.p.218.
  17. Annual Report on Eepigraphy of 1907. No.580
  18. Ind.Ant.Vol.XXI. p.202; Ep Ind. Vol. VII. No. 588, Kielhorn's List of Inscriptions of Southern India.
  19. Nellore Inscriptions, Vol II. No.61
  20. 1.Nellore Inscriptions, Vol.II, Kandukur, 26
  21. Lists of the Antiquarian Remains In the Presidency of Madras by Robert Sewell, Vol. I. pp. 43, 51.
  22. నన్నయభట్టారకుడు బూర్వము అనేక శతాబ్దములనుండి యాంధ్రసారస్వతము వర్ధిల్లుచున్నటుల ననేక దృష్టాంతముల వలన దెలియుచున్నది. క్రీ.శ.6వ శతాబ్దమునుండి యాంధ్రకవిత్వము వర్ధిల్లుచున్నదనుటకు తెలుగు శాసనములలోని పద్యరచనయే సాక్ష్యముగనున్నది. రాజరాజనరేంద్రునకు సమకాలికుడగు భోజమహారాజునకు ముద్రామాత్య మనునొక యాంధ్రకావ్యము క్షేమేంద్రకవిచే నంకితము చేయబడినటుల దెలియుచున్నది. కవిభల్లటుడను కవి భేతాళపంచవింశతి యను తెలుగు ప్రబంధమును జాళుక్య విక్రమాదిత్యునకంకితము చేసెనని దెలియుచున్నది.
  23. Nellore Inscriptions. Vol.1.p414, Gudur (45)
  24. Nellore Inscriptions Vol.III; P.1407. V.II.