సంపాదకీయము

ఆంధ్రపదనిధానము మాకాకతీయగ్రంథమాలలో మొదటి యనుబంధగ్రంథముగఁ బ్రచురించితిమి. ఇంతకుమున్ను గ్రంథమాలాపక్షమునఁ బ్రచురించిన ఆంధ్రమంత్రులు, విక్రమోర్వశీయమును, వసుంధరను, దాసబోధన నాదరించినట్లే యీయుత్తమగ్రంథరాజమునుగూడ నాంధ్రమహాజను లాదరించినచో మేము ధన్యులము.

జీర్ణతరమైన నీగ్రంథమును గ్రంథమాలాపక్షమున నాంధ్రలోకమునకు సమర్పింప నత్యంతికృషి చేసిన గ్రంథమాలాసంపాదకులగు శ్రీ శేషాద్రిరమణకవులకు కృతజ్ఞతఁ దెలుపుకొనుట ప్రధానకర్తవము. గ్రంథముద్రణమునకు వలయుధన మొసంగి మాయుద్యమము నాదరించిన ప్రకాశకులకుఁ గూడ మేము కృతజ్ఞులము.

గ్రంధమాల చందాదారులందరు నీగ్రంథమును విధిగఁ గొనవలసిన యగత్యము లేదు. రాజపోషకులకు, పోషకులకు, సంసదీయులకు మే ముచితముగ నొసఁగుదుము. చందాదారులకు వలయునేని పోష్టేజితో 1-4.0కు నొసంగుదుము. ఆంధ్రసోదరులు మాయుద్యమము నభిమానింపఁ బ్రార్థితులు.

భవద్విధేయుఁడు,

వరంగల్లు

తూము వరదరాజులు

24-2-30

కాకతీయ గ్రంథమాలా కార్యదర్శి

తొలిపలుకు

ఆంధ్రకవుల గ్రంథములలోఁ బెక్కు నశించినవి. కేవలప్రాచీనకవులగ్రంథములు ప్రత్యంతరరూపమున వ్యాప్తి చెందినకతన నేఁడుగాకున్న మఱికొంతకాలమునకేని లభింపవచ్చును. ఆధునికకవుల గ్రంథములస్థితి శోచనీయముగ నున్నది. ముద్రణ మలభ్యమైన కాలమునఁ గలకవులు గ్రంథరచన మొనరించి ప్రత్యంతరములఁ దమయింట భద్రపఱచి గతించిరి. వానికి లోకమున వ్యాప్తి లేదు. వంశీయులు ప్రచురింపరు. లోకులకు వాని యునికియె తెలియదు. ఈ యజ్ఞాతావస్థలో విలువగల గ్రంథములు నశించుచున్నవి. అట్లు నశింప నున్ముఖమైన పుస్తకములలో నీయాంధ్రపదనిధాన మొకటి.

గ్రంధకర్త తూము రామదాసకవి. ఈయన జీవితచరిత్రమును గ్రహింపఁదగిన వివరములు కృత్యాదియందు లేవు. వాధూలగోత్రజులగు సింగరాచార్యుల శిష్యుఁడనియు రంగాచార్యులకు మిత్రుఁడనియు మాత్రము కృత్యాదియందలి యైదవపద్యమువలన గ్రహింపవచ్చును. బాలనరేశుఁ డగువిష్ణుమూర్తి కృతిభర్త. ఈవివరములు జీవితచరిత్రసంగ్రహమునకుఁ జాలవు. కవి కుమారులవద్దనుండి సంగ్రహించిన యంశముల ననుసరించి జీవితము వ్రాయుచున్నారము.

తూము రామదాసకవి కాపుకులజుఁడు. పూర్వమునుండియు నివాసము ఒరంగల్లు. పకృతము ఒరంగల్లులోని యొకభాగముగు బాలనగరమున వీరిగృహము కలదు. పసుపునూళ్ళగోత్రము. ఈయన జననకాలము గడచిన నలసంవత్సర శ్రావణబహుళ ద్వితీయ సోమవారము (క్రీ.శ. 18-8-1856), మరణకాలము గ్రోధి సం॥ కార్తీక బహుళసప్తమి (క్రీ.శ. 29-11-1904). జీవితకాలము దాదాపు 49 సంవత్సరములు. ఇరువదియొకటవయేటఁ గవితారచనమున కారంభించినాఁడు. కవితారంభకాలము ధాతసంవత్సరము కానోపు. కవి పంచసంస్కారములఁ బడిసిన వైష్ణవమతస్థుడు.

ఈరామదాసకవి ఒరంగల్లునివాసియు సరసకవితావిశారదుఁడు వైదుష్యభూషణుఁడునగు ప్రతాపపురము రంగాచార్యులగారివద్ద సంస్కృతాంధ్రముల నభ్యశించి ఈక్రిందిగ్రంథరాజములను గ్రమానుసారముగా రచించెను.

  1. రుక్మిణీకల్యాణము గేయగ్రంథము
  2. గోపికావిలాసము ప్రబంధము
  3. మిత్రవిందోద్వాహము ప్రబంధము
  4. కాళిదాసునాటకము
  5. ఆంధ్రపదనిధానము

రుక్మిణీకల్యాణము బాల్యావస్థలో రచించిన దగుటచే నంతప్రౌఢముగ లేదు. కవియే యాగ్రంథమునెడు శ్రద్ధ గైకొననందున నెన్నఁడో నశించినది. గోపీకావిలాసము పుష్పబాణవిలాసములోని శృంగారలీలల శ్రీకృష్ణున కన్వయింపఁజేసి వ్రాసిన పద్యకావ్యము. ఇందలి పద్యములు మిత్రవిందోద్వాహములోఁ గవి జేర్చుకొనినాఁడు. మధ్యకాలములో నీగ్రంధము మరుగుపడినది. ఇపు డెంత వెదకినను గనుపింపలేదు. కాళిదాసనాటకము ప్రకృతరంగస్థలముల కనుకూలను:గ నిక్కవి సురభికంపినివారిప్రార్థనపయి మూఁడుదినములలో రచించి రంగస్థలమునఁ బ్రదర్శింపఁజేసినాడు. ఆ కాలమున సురభికంపినీవారు ప్రదర్శించు విలువగల నాటకములలో నీ కాళిదాసనాటక మొకటి. క్రీ.శ. 1839లో కాళిదాసనాటకము ముద్రిత మైనది. ఇప్పు డొకప్రతి స్థానికగ్రంథాలయములో నుండఁగ మేము చూచినారము. మిత్రవిందోద్వాహము ముద్రితమెగాని ప్రతులు లభించుటలేదు. ఇది యైదాశ్వాసముల శృంగారకావ్యము. నిర్వచనము. గర్భకవితయు బంధకవితయు శబ్దాలంకారములు గలప్రబంధము. ప్రకృతమగు ఆంధ్రపదనిధానము తుదిగ్రంథము.

ఈకవి ప్రారంభమునఁ గొంతకాలము నిజాముదొరతనమువారి యటవీశాఖలో నుద్యోగిగా నుండి యది విరమించుకొని ఒరంగల్లు మండలములోని ఆత్మకూరు సంస్థానమున వెంకటనరసయ్య దేశాయిగారియొద్ద రాజకీయవ్యవహర్తగ బ్రవేశించెను. కవి స్వరూపపట మెన్నివిధముల యత్నించినను లభింపలేదు.

రామదాసకవికి ప్రతాపపురం రంగాచార్యులవాగు విద్యాగురువు. కాంచివాస్తవ్యులు షట్ఛాస్త్రవేత్తలు నగుకందాళ సింగరాచార్యులవారు పంచసంస్కారప్రదాతయగు కులగురువు. విద్యాగురువగు రంగాచార్యులవా రీయాంధ్రపదనిధానము మూఁడవకాండము ముద్రించువఱకు సజీవులై యుండిరి. కవిజీవితమునకు వలయు నంశములు నెన్నియేని చెప్పుదుమని వాగ్దానము గావించిరి. గ్రంథముద్రణాంతరము వారితో సంప్రదింపవచ్చు ననుకొన నీసంవత్సరము వర్షకాలమున నాకస్మికముగ స్వర్గస్థులైరి. ఆంధ్రవిద్యార్థిలోకమున కందుచే విపులజీవితచరిత్రము నివేదింపలేకపోతిమి.

ప్రకృతగ్రంథమగు నాంధ్రపదనిధానమునుగూర్చి కొంచెము చెప్పవలసియున్నది. ఈ గ్రంథమును కవి నలువదవయేట వ్రాయనారంభించి, మరణకాలమునకుఁ గొంచెమించుమించుగఁ బూర్తి గావించెను. నిఘంటువునకు వలయు పదసముదాయమును శబ్దరత్నాకరమను అకారాదినిఘంటువునుండి గైకొని వర్గీకరణ మొనరించి పద్యములు గావించెను. సమగ్రమగు శబ్దరత్నాకరమున నున్న పదముల వర్గానుసారముగఁ దొలుత వ్రాసికొన్న చిత్తుప్రతులను మొదట వ్రాసిన పద్యప్రతులు దాని ననుసరించి వ్రాసినశుద్ధప్రతియుఁ గవికుటుంబమున నేటికిని భద్రపఱుపఁబడియున్నవి. కవిశుద్ధప్రతి మరలఁ బరిశోధింపమిచేఁ బలుతావుల దోషములు కలవు. మ్యూడవకాండమునందు దాదాపుగ మూఁడుభాగముల కర్థము వ్రాయలేదు, మాకు లభించిన మాతృకలోఁ జివరభాగము చెదపుర్వులు దినివేసెను. అందుచేఁ గొన్ని పద్యములకు మొదలు, కొన్నిపద్యముల కర్ధము, మేము సమకూర్చితిమి. అర్థమునుబట్టి పద్యభాగము, పద్యభాగమునుబట్టి యర్థము వ్రాసియుంటిమి గాన దాదాపుగ నీసంస్కరణము కవిభావము ననుసరించి చేసియుందుమని మా విశ్వాసము. అందుచేఁ గుండలీకరణము మానితిమి.

సంస్కృతమున వర్గీకరణరూపముననున్న నిఘంటువు లెన్నియో గలవు. నామలింగానుశాసనము, మేదిని, విశ్వము, నానార్థరత్న మున్నగు నుపలభ్యములగునవియే గాక నింక నెన్నియో యున్నట్లు వ్యాఖ్యాతల యుదాహృతభాగములవలన నెఱుంగ నగును. ఆంధ్రమున బద్యనిఘంటువులు చాలయరుదుగా నున్నవి. అందు

  1. ఆంధ్రభాషార్ణవము పద్యసంఖ్య 624
  2. ఆంద్రనామసంగ్రహము పద్యసంఖ్య 209
  3. ఆంధ్రనామశేషము పద్యసంఖ్య 100
  4. సాంబనిఘంటువు పద్యసంఖ్య 95
  5. వెంకటేశాంధ్రనిఘంటువు పద్యసంఖ్య 100

మాత్రము ప్రకృత ముపలభ్యములు. నామలింగానుశాసనమువలె వర్గీకరణ మొనరించిన కోటి వెంగనార్యుని ఆంధ్రభాషార్ణవము సర్వవిధముల బ్రశస్తతరము. ఆంధ్రనిఘంటువులో బ్రథమము ప్రథమగణ్యమునగు నీయాంధ్రభాషాభూషణమునకు ఆంధ్రనామసంగ్రహమున కున్నంతయేని వ్యాప్తి లేకుండుటకుఁ గారణము చింత్యము. వర్గీకరణమున సాదృశ్యముంటచేతను గ్రంథప్రశస్తి కొఱఁతగఁ దోఁచుటచేతను ఆంధ్రనామసంగ్రహమునకు సాంబనిఘంటు వీవలిది. వెంకటేశాంధ్రము సాంబనిఘంటువునకు సమకాలికము. ఆంధ్రనామసంగ్రహమునకు తరువాత జనించిన ఆంధ్రనామశేషమును గూర్చి ప్రత్యేకించి చెప్పవలసినపనిలేదు. సమగ్రమగు ఆంధ్రభాషార్ణమునకుఁ టీక లేకపోయినందునను దానియునికియె యిటీవలివారలకు తెలియనందునను అసమగ్రనిఘంటువులు కొన్ని బయలు వెడల నవకాశము గలిగినది.

ఆంధ్రపదనిధానమునకు మాతృకయగు శబ్దరత్నాకరమునందు ఆంధ్రభాషార్ణవ ముట్టంకితమగుటచే నందలిపదములు సంగ్రధితము లైన వనవచ్చును. శబ్దరత్నాకరసారమగు నీయాంధ్రపదనిధాన మీకారణములచేఁ బ్రకృతోపలభ్యములు, పూర్వోక్తములు నగునిఘంటువు లన్నింటికంటె సమగ్రమనుట నిస్సంశయము, ఆంధ్రభాషార్ణవమున గ్రియావర్గ మొకటి కలదు. అందు ధాతురూపములు వివరింపఁబడినవి. సామాన్యవ్యాకరణసహాయమున రూపింపఁదగిన యీరూపములకుఁ బ్రత్యేకవివరణము అనవసరమని కాఁబోలు ఆంధ్రపదనిధానకారుఁ డావర్గమును మానినాఁడు. ఆంధ్రభాషార్ణవమున రచనాప్రాగల్భ్యసూచకముగఁ బర్యాయపదములు మిగులదీర్ఘములుగఁ జెప్పఁబడినవి. జిజ్ఞాసువుల కాదీర్ఘపదములనుండి హ్రస్వపదముల గల్పించుట యెంతేని కష్టమనుటకు సందేహములేదు. ఆంధ్రభాషార్ణవములోని శివనామములఁ జూడుడు.

సీ.

గట్టుల యెకిమీడు గన్నవాల్గంటిని
              జెట్టపట్టుక యేలినట్టి దిట్ట
మున్నీటిరాచూలి ముక్కఁగెంజెడలోనఁ
              క్రొవ్విరిగాఁ దాల్చుకొన్నమేటి
గబ్బుచెంకమెకంబు గట్టికళవసంబు
              కుబుసంబుగాఁ జేసికొన్నదంట
ప్రాఁబల్కుగుఱ్ఱముల్ పన్నిసిస్తగునట్టి
              పుడమితే రెక్కిన పోటుకాఁడు

ఈదీర్ఘపదము లాంధ్రపదనిధానమున వరుసగఁ గొండయల్లుఁడు, నెలతాల్పు, తోలుదాల్పరి యనుపర్యాయపదములుగ నీయఁబడెను. ఇట్లే సంక్షేపరూపమున నున్నకతన ఆంధ్రపదనిధానమునందు విశేషపదసముదాయము 1565 పద్యములలో నిముడుట కవకాశము చిక్కినది. వర్గీకరణమున నామ లింగానుశాసనముతో బోల్కి యున్నను నిందు విశేషించి యందులేని పర్యాయపదములు గలవు. ఒక్కస్వర్గవర్గు దిలకించిన నమరమున లేని నారదుఁడు, కృష్ణుఁడు, నృసింహుఁడు, సీత, వెంకటేశుఁడు మున్నగువేల్పులకు బర్యాయపదములు గోచరించును. ఇట్లే యీయాంధ్రనిఘంటువున బ్రతివర్గమున విశేషాంశము లున్నవి.

బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకరపీఠికలో తెనుఁగునిఘఁటువులయందుండి పదములను మాత్ర మెత్తి వ్రాసికొని యర్థము లందలివి తఱుచుగ లక్ష్యవిరుద్ధములుగ నుంటచే లక్ష్యశోధనంబు గావించితి అని పూర్వోక్తనిఘంటువులపయి నొకదోష మారోపించిరి. వాఙ్మయము గావించినవారినుడి యెంతయేని సత్యము. సుపరిశోధితమగు శబ్దరత్నాకరము ననుసరించి వ్రాయబడినది గావున నీయాంధ్రపదనిధానమున కట్టిదోష మారోపింపఁ దావులేదు. కాన నిది యింతవఱకు బయలువెడలిన యన్నినిఘంటువులకంటె సమగ్ర మనియు విశేషపదావృత మనియు శబ్దరత్నాకరముెలే ప్రమాణభూత మనియు జెప్పవచ్చును.

ఇందు నామలింగానుశాసనమువలెఁ గాండములు వర్గములు విభజింపఁబడినవి. లింగాదిసంగ్రహవర్గము మాత్రము తెనుఁగున విడువఁబడినది. ఆంధ్రమున లింగాదిసంగ్రహవర్గము గూర్ప నవకాశములు లేవనియు నేకొన్నిపదములకో యీనిర్ణయము జేసినను నీవర్గమువలన నంతగా నుపయోగ ముండదనియుఁ గవి మానియుండును. మిగిలిన వర్గములన్నియు నామలింగానుసారముగ నున్నవి.

ఆంధ్రపదనిధానము 1565 పద్యములు గల యుద్గ్రంథము. శబ్దరత్నాకరస్థములగు పదములెగాక నిజామురాష్ట్రమున వ్యవహరింపబడు దేశ్యపదములు సైత మిందు జేర్పఁబడినవి కొన్ని కొన్ని వర్గములందు అమరముకంటెఁ బదసముదాయము విస్తరముగఁ గలదు. అమరమునందులేని పనిముట్టులపేరులు జాతీయవాచకములు వస్తునామములు నీకవి స్వయముగఁ బరిశోధించి సమకూర్చియుఁ గొన్నితావుల సంస్కృతపదముల వ్యుత్పత్తిభావాదుల గమనించి యాంధ్రపదములను గల్పించియు గ్రంథాంతరములనున్న దేశ్యపదములను గూర్చియు నీగ్రంథమునఁ బదసముదాయమును బెంపొందించియున్నాఁడు. అందుచే నీనిఘంటువు ఆంధ్రలోకమునకుఁ బరమోపకార మనియు నాంధవాఙ్మయ ప్రత్యేకవ్యక్తిత్వమున కాదర్శప్రాయమనియు విద్యార్ధుల కవశ్యపఠనీయమనియు మాతలంపు.

ఆంధ్రవ్యాకరణసహాయయున రూపాంతరములు సాధింపఁదగిన పగలు పవలు, తోడబుట్టువు తోఁబుట్టువు, వెలది వెలంది, పెనిమిటి పెన్మిటి, ఇగురుచు ఇగ్రుచు, మున్నగు పదములు ఇందు భిన్నపదములుగాఁ జెప్పఁబడినవి. పాదుసా, మస్తీ, హజురు, మున్నగు హిందుస్థాని వికృతిపదములు దేశ్యములుగఁ జెప్పబడినవి. ఆంధ్రవాఙ్మయమున నేయేపదముల కెన్ని పర్యాయపదములు కలవో దెలిసికొనుటకును సంస్కృతసంబంధము లేని యాంధ్రభాషావిస్తృతి గ్రహించుటకును శుద్ధాంధ్రభాషాస్వరూపము నెఱుంగుటకును ఇరువదవశతాబ్దమునాటి కాంధ్రపదములుగ గ్రంథస్థములైన శబ్దములను గుర్తించుటకును నీనిఘంటువు పరమోపకారిక మగునని మాతలంపు. మేము జూచినంతలోఁ బద్యనిఘంటువులలో నిదియె సమగ్రమైనది. లక్ష్మీనారాయణీయమును ప్రత్యేకశుద్ధాంధ్రాకారనిఘంటువు వొకటి గలదు గాని యిరువురుగ్రంథకర్తలు సమకాలికులు, భిన్నస్థలవాసులు, అపరిచితులు నగుటచే నొకరిగ్రంథమువలని యుపయోగమును వేఱొకరు బడసియుండరని మాయుద్దేశము.

ఆంధ్రభాష ప్రత్యేకవ్యక్తిత్వము స్వతంత్రలక్షణములు గల ప్రత్యేకభాష. వికృతివివేకకారుఁడు "భాషేయమమితాతత్ర। దేశ్యాచిత్ర స్వభావయుక్। తచ్చిత్రాతుద్రష్టవ్యా పూజ్యపాద సుభాషితే” యని యాంధ్రభాషను బ్రశంసించినాఁడు. (దీనిచే నాంధ్రభాష పరిమితిరహిత మైనదనియు దేశ్యములు చిత్రములుగ నుండుననియు వ్యాకరణసహాయమున నాచిత్రములు గ్రహింపనగుననియుఁ దెలియనగును) విశాలమగు నాంధ్రదేశమున ససంఖ్యాకజనులచే వ్యవహృతముగు నాంధ్రభాషలోఁ బదసముదాయ మమితముగఁ గలదు. ఎన్నియో పదము లింకను గ్రంథస్థము కావలసియున్నది. అరణ్యకులగు చెంచులు, ఏనాదులు, కోయలు, బోయలు, మాటలాడుపదములం దెన్నియో యాంధ్రపదములు గెలవు. నిజాంరాష్ట్రమున మహమ్మదీయసంపర్కములేని మండలములు కొన్నికలవు. తన్మండలవాసులు వ్యవహరించు విలక్షణాంధ్రవాఙ్మయమునుండి గ్రంథస్ధము కాఁదగినపదము లెన్నియో గలవు.ఇటులే యాంధ్రవాఙ్మయ మమితమైనదను నిర్ణయమున కీయాంధ్రపదనిధానము తోఁడడఁగలదు, త్రిలింగములలో నొకటియగు కాళేశ్వరక్షేత్రమునకు నెలవైన పశ్చిమాంధ్రదేశమున నెన్నియో యుత్తమగ్రంథములు నన్నయనాటినుండి నిన్నటి వరకు బయలు వెడలినవి. అందు ఆంధ్రనగరమని పేరొందిన ఒరంగల్లు ఆంధ్రకావ్యరత్నములకు ఖని. భాస్కరరామాయణ భాగవత సీతారామాంజనేయాది గ్రంథరత్నముల కీఖనియే మాతృస్థానము. అదృష్టవశమునను ఆంధ్రపరిశోధకుల సుకృతవశమునను లభించిన కోహినూరు రత్న మీయాంధ్రపదనిధానము. ప్రకృతిసిద్ధమగు నీదివ్యరత్నమునకు సంక్రమించిన స్వల్పదోషముల సంస్కరించి మెఱుఁగుబెట్ట నవకాశ మొదివిన మే మెంతయు ధన్యులము.

రామదాసకవి యీ నిఘంటువును బూర్తిచేసి చివరకాండమును సంస్కరించి టీక వ్రాయనారంభించి రాచపుండుచే బాధ నొంది యచిరకాలమున స్వర్గస్థుఁ డగుటచే నూతనసంస్కరణము తృతీయకాండమునందు విశేషించి జరుపవలసివచ్చినది. ఓరంగల్లులోని దర్శనీయప్రదేశములలో స్మారకచిహ్న మనదగు రామదాసకవిసమాధి యొకటి. ఇది బౌలనగిరి సమీపముగా నున్నది.

ఆంధ్రనగరమని ప్రసిద్ధి వహించిన ఒరంగల్లుమండలమున గ్రంథపరిశోధనము శాసనపరిశోధనము జరుపుతరుణమునఁ గొన్నిదినములు ఒరంగల్లున నివసించితిమి. స్థానికులును శబ్దానుశాసనగ్రంథాలయస్థాపకులును సౌజన్యభావులు నగు తూము వరదరాజులుగారికి మాకు నవ్యాజమగుస్నేహము కుదిరెను. వారు మాయుద్యమమును దమయన్నగారును ధర్మస్వభావులును న్యాయవాదులు నగు తూము రంగయ్యగారికిఁ జెప్పి పరిశోధనోద్యమందున మాకు నెంతేనిసాయంబు చేయించిరి. అనఁతర మొకదినమున మీమింట నేమేమి ప్రాచీనగ్రంథములు గలవా యని ప్రశ్నించ తమతండ్రియగు రామదాస కృత్రగంథపేటిక మాముందు పెట్టిరి. జీర్ణాతిజీర్ణములగు నాగ్రంథములనుండి పుస్తకాకారగముగనున్న యీయాంధ్రపదనిధానమును వెలికిఁదీసి పరిశీలించితిమి.

గ్రంధకర్తకుమారులగు తూము రంగయ్యగారు మాప్రోత్సాహమున కామోదిఁచి యాంధ్రభాషోపకారముగ ఆంధ్రపదనిధానమును ముద్రించుటకు వలయునంతధనము నొసఁగి ముద్రణభారము గ్రంథసంస్కరణభారము మాతలపయి బెట్టి చివికి జీర్ణమైయున్న కాకితములకట్టను సంస్కరించి శుద్ధప్రతి వ్రాసి నాలుగుసంవత్సరములు తీవ్రకృషి చేసి గ్రంథరూపముగ నీయాంధ్రపదనిధానము నాంధ్రలోకమునకు సమర్పింపఁగలిగితిమి.

మే మొకతావునను ముద్రణాలయము వేఱొకతావునను నుంటచే నెన్నివిధముల బరిశీలించినను దోషములు దొరలినవి. ద్వితీయముద్రణమున కవకాశము లభించినచో నిర్దుష్టతరముగ నీగ్రంథమును బరిష్కరింపఁగలము. ఈగ్రంథమును ముద్రించుపట్ల ప్రత్యేకశ్రద్ధ గైకొన్న బెజవాడ భవానీముద్రణాలయమువారికిఁ దొలుత కృతజ్ఞత దెలుపుట మాప్రధానధర్మము.

ఆంధ్రపదవిధానమును ముద్రించి బ్రచురించినచోఁ బితౄణవిముక్తు లగుటయెగాక యాంధ్రలోకోపకారు లగుదురని చెప్పినంతన వ్యయభారమున కోర్చి గ్రంథప్రకటనమునకు దోడ్పడిన తూము రంగయ్యగారికిని — అభిమానపూరితులై ముద్రితభాగములఁ బరిశీలింపుచు సంస్కరణముల కానందించుచు మాకు బ్రోత్సాహ మిచ్చిన తూము వరదరాజులుగారికిని — సంతోషపూర్వకముగ ధన్యవాదముల నొనర్చుచున్నారము.

పితృగౌరవము నూతగఁగొని యీయుత్తమగ్రంథము ప్రకటించి తమపితృవరుఁడగు రామదాసకవి శ్రమ సార్ధక మొనర్చిన తూము రంగయ్య, సర్వేశము వరదరాజులుగారల యుదారభావముపై నింకఁ గొంతగ్రంథప్రచురణ మాధారపడియున్నది.

నందిగామ,

ఇట్లుభాషాసేవకులు,

శుక్ల సం॥ మాఘ బ ౧౨

శేషాద్రిరమణకవులు,

శతావధానులు.