అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య


            వరాళి - రూపక  రాగం            ఆది తాళం

ప: అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య || అయ్యయ్యో ||


చ1: చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య || అయ్యయ్యో ||


చ2: వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు|| అయ్యయ్యో ||


చ3: మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు|| అయ్యయ్యో ||


చ4: ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు|| అయ్యయ్యో ||


చ5: అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు|| అయ్యయ్యో ||


చ6: మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు|| అయ్యయ్యో||


చ7: ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు|| అయ్యయ్యో ||


చ8: జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ9: వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ10: వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ11: పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ12: వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓరామ || అయ్యయ్యో ||


చ13: ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ14: అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ15: ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటిగదా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ16: చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య || అయ్యయ్యో ||


చ17: పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలోనలిగి వరలుచు నుంటిగదా కొన్నాళ్ళు || అయ్యయ్యో ||


చ18: పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో||


చ19: లేతరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు|| అయ్యయ్యో||


చ20: తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామా || అయ్యయ్యో||


చ21: తెల్లతెల్లనై దంతము లూడివణకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు || అయ్యయ్యో||


చ22: బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు || అయ్యయ్యో||


చ23: అంతట మృతినొంది యలయుచు యమునిచే బాధలొందితిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో||


చ24: ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు || అయ్యయ్యో||


చ25: కంజజనక భద్రాచలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు॥|| అయ్యయ్యో||


చ26: వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామా || అయ్యయ్యో||


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.