అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/మాఊరు

అగరం వసంత్‌ 094883 30209

“ఏంరా కాకా! అబుదే కానుగకాయలు ఉదరిస్తా(రాలుస్తా) వుండావు” తాత మాట్లాడిచ్చె.

“ఈపొద్దుకి సరిగ్గా నెలపొద్దుకి ఓసూరు పరస(తిరునాళ్లు), కానుగ విత్తులు అమ్మి నాలుగు కాసులు వెనకేనుకొంటే వరన సెలవు(ఖర్చు)లకి తొందర వుండేలేదు కదనా” కాకన్న అనె.

“ఊర్లా వుండే అర్ధము చింతకాయలని కొట్టి చింతగింజలు కూడేసింది చాలదారా” తిరగా అనె తాత.

“నీకు వనగూడినట్ల (కలసివచ్చినట్ల) అందరికీ వనగూడాల కదన్నా నాకు ఏడాదిలా ఈ నెలలా మాత్రమే నాలుగుకాసులు మిగిలేది. ఇంగ ఏడాదంతా కూలికి పోతే కూడు లేకుంటే వీడు అన్నెట్ల వుంటుంది” అంటా వుండాడు.

కాకన్న మాత్రమే కాదు మావూర్లా చానా జనాలు ఈ పట్టెంతా (ప్రదేశమంతా) పారాడి కానుగకాయలు ఉదరిచ్చి విత్తనాల్ని వ్యాపారగాళ్లకి అమ్మి సొమ్ము చేసుకొంటారు. అట్లే చింతగింజలు అమ్మి చీరలు, రవికలు తీసుకొనిన వాళ్ల చిత్రవిచిత్రాలు మీరు చూడొచ్చు.

మాపక్క ఈ పరసని ఒక పండగలా చేస్తారు. కొత్తబట్టలు పిండివంటలే కాదు నేలతల్లి కళాచారం తానుగా లేచి నాట్యము ఆడుతుంది. పెద్దోళ్లు, చిన్నోళ్లకి, సొంతమోళ్లకి కాసులిచ్చి పరసకి పంపి పరవశిస్తారు.

ఓసూరు పరసకి ముందే బాగలూరు తేరు జరుగుతుంది. మా చుట్టాలు రమ్మంటే నేనూ తాతా పోతిమి.

తేరు చానా ఎత్తరముగా వుంది. కొత్తబట్టలు పుసుపుకుంకుమ, రంగులజెండాలు, పువ్వులగమ్ములా మెరసిపోతా వుంది. తేరు కొనలా శికరము, మద్దిలా దేవుని విగ్రహము, అయివార్లూ వయసుసిన్నోళ్తూ ఎక్కి నిలిచిండారు. పూజ అయినంక తేరు కదిలె. “గోవిందా... గోవిందా” అంటా జనాలు తేరుని ఈడ్చిరి. తేరు కదిలె. జనం కదలతా తేరుని కదిలిస్తా పోతావుండారు.

“దోవలా బండి, బండి వెనక బండి కదలి పోతావుండాయి. పట్టాలపైన రైలు కదలి పోతా వుంది. గాలిలా ప్లేను బెరోని (జోరుగా) కదలి కడలిని దాటి పోతా వుంది. ఇవన్నీ కదలతా ఫోతా వుండాయి. వీటిని మనిషి కదలిస్తా, కదలి పోతా వుండాడు. ఇది మనిషి కత. బూమమ్మ కదలి పోతావుంది. సెంద్రుడు కదలతా వుండాడు. పొద్దప్పడు(సూర్యుడు) కూడా కదిలే పనిలా పడి కాలాన్ని మరిసినట్లుండాడు. ఎపుడు చూసినా కదలాడతా, కదలి పోతా కనిపిస్తాడు. గ్రహాలు, నక్షత్రాలు కదలిఫోతా వుండాయి ఇది విశ్వం కత. ఎవరు కదలిస్తా వుండారో. ఏది కదిలిస్తా వుందో” అంటా ఆర్మోనియం వాయిస్తా గుడి మెట్ల పైన కూకోనుండాడు జడల గుర్రన్న.

జనం తేరుచుట్టూ చేరిండారు. గుడి ముందర బిచ్చగాళ్లూ కూకోనుండారు. “అమ్మా ఆకలి” అంటావున్నా వినబడనోళ్ల మాదిరిగా గుడిలోపలికి పోయి ఉండిగలా (హుండి) దుడ్డు వేసి వస్తావుండారు జనం.

“కాయమే కైలాసము.. సాయమే సొర్గము..” గుడి శికరముపైనింకా తెల్లపావురం అంటా వుంది. దాని మాటలు ఎవరూ వింటా లేదు.

“రేయ్‌! మీకేరా చెప్పేది, చచ్చినపుడు పరమాన్నము చేసి మాకు పెట్టేది కాదురా, బతికినవాని కడుపుకు అంత కూడు పెట్టండ్రా, ఏమి జాతిరా మీ మనిషిజాతి” కాకమ్మ కసరుకొంటా వుంది.

తేరు దోవంతా తిరిగి ఇంక రవంత పొద్దుకి గుడితావుకి చేరుతుంది అని అంతా అనుకొంటా వున్నట్లే ఒగ పక్క చక్రం విరిగింది. చానా జనము చానా గాసిపడి తేరుచక్రము తిరిగి తిరిగే మాదిరిగా చేసిరి. మెల్లగా ఈడ్చి గుడితావ నిలిపిరి. మునిమాపు పొద్దు ఆవూరి పెద్దలంతా గుడిముందర చేరిరి.

“మా తాతల కాలములా చేసిన చక్రాలు అవి. ఎండకి ఎండి వానకి నాని పాడైపోయె. రవంత ఏమారింటే తేరు పడిపోయివుణ్ణు. వచ్చే ఏడాదికి కొత్త చక్రాలు, అచ్చులు తయారు చేసుకోవాల” పెద్దాయన అంటా వుండాడు.

“ఛానా పాతమాన్లు కావాల, ఏడ చిక్కుతాయి. ఏఏ మాను కావాలనేది అట్లే చెప్పండ” ఎవరో అనిరి.

“చశ్రాలకి జాలిమాను, అచ్చులకి నల్ల అత్తిమాను, గుజ్జులకి టెంకాయమాను కావాల, ఇవ్వన్నీ ఏటిగడ్డలానే చిక్కుతాయి” అదెవరో


చెప్పిరి.

అందరూ చేరి వచ్చే ఏడాదికి కొత్తతేరు తయారు చేయాలని ముడుపుకి వచ్చిరి.

బాగలూరు తేరుమాదిరిగానే మా తావుల్లా చానా తేర్లు కిందనింకా మిందగంటా పూర్తిగా మానుల్లా తయారు చేసిండే తేర్లు. కానీ మా ఓసూరు తేరు అట్ల కాదు. రాయిచక్రాలు, ఇనుము అచ్చులా సుమారుగా 20 అడుగుల పొడవు రాయిలానే తేరును చెక్కిండారు. దీనిపైన ఏడాది ఏడాది మానుతేరును కడతారు. ఈడ్చేకి ఇనుము సర్పిణిలు(గొలుసులు) అబుడే చేసి పెట్టిండారు. ఏకాలములో చేసిరో కానీ ఈ కాలానికీ చెక్కుచెదరకుండా ఉండాయి.

“యక్షగానం సురువు అవుతా వుంది. మీరింగా ఈడే వుంటే ఎట్ల " పూజారన్న అంటానే గుడి ముందర వున్నోళ్ళంతా లేచిరి.

పాటలు, పద్యాలు, మాటలతో అపుటికే ప్రహ్లాదవిజయము జరగతా వుంది.

మునీశ్వరుని గుడితావ రోకలి ఆట ఆడతా వుండారని తెలిసి ఆడికి మాతాత కూడా పోతిని.

సుమారుగా ఆరు అడుగుల పొడవు వుండే రోకలిని తలపైన పెట్టుకాని కాళ్లకి గజ్జెలు కట్టుకాని ఎగరతా, దుమకతా గిరగిరా తిరగతా ఆట ఆడతా వుంటే చూసేకి బలేగా వుంది. రోకలి కింద పడకుండా బలే న్యాకు(జాగ్రత)గా ఆయప్ప ఆడేఆటకి ఆటతనానికి ఏమిచ్చినా తక్కువే. మునీశ్వరుని గుడితావ హరికత,బేటరాయ సామి గుడితావ బుర్రకత, ఎల్లమ్మ గుడితావ శనిమహత్ముని కంసాళి కతలు, శివుని గుడితావ వీరకాసి, పండరిబజన, వినాయకుని గుడితావ ఎద్దులాట, నెమలాట, మురుగుని గుడితావ కావడి చిందులు, మారెమ్మ గుడితావ భారతం కతలు.

ఆటల్ని చూస్తా పాటల్ని కతల్ని వింటా అన్నదానాల సత్రాలలా అన్నం తింటా ఆపొద్దు గడిపితిమి.

XXX XXX XXX

ఓసూరు పరసకి ముందే పల్లకీలు, గెరిగె (గరగ). నేను అమ్మ కూడా గెరిగె జరిగే తావుకి పోతిని.

కంచుపాత్రపైన ద్రౌపదీదేవిని పెట్టి చుట్టూ మూడు అడుగుల ఫొడవు వరకు మల్లెపూలు అలంకారము చేసుకొని తలపైన పెట్టుకొని తెల్లబట్టలు, కాళ్లకి గజ్జెలు కట్టుకొని వుండాడు. ఇట్ల గెరిగె ఎత్తేవాళ్లు చానాళ్లనింకా నియమనిష్టగా వుంటేనే గెరిగె ఎత్తేకి అయ్యేదంట.

గెరిగెను తలమింద పెట్టుకొని ఆడతా వస్తావుంటే గెరిగె కిందపడిపోతే ఆయప్ప తల నరికేకి కత్తులు ఎత్తుకొని చుట్టా కుణనలాడతా వరన వస్తా వుండారు వయసుచిన్నోళ్లు. గెరిగె అయ్యేకంట చూసి ఆమీట తినేకి (చిరుదిళ్లు) తిని ఇంటికి వస్తిని.

వచ్చే వారమే ఓసూరు పరస. ఇంటికి చుట్టాలు వస్తారు, ఇంటికి కావలసిన సరుకులు తీసుకొనేకి నేనూ అబ్బా అమ్మా బండిలా సంతకి పోతిమి.

సంతకి ఒగపక్కగా రకరకాల రాగులు, వద్దు, నూగులు, జొన్నలు, కొర్రలు, ఉలవలు, సజ్జలు, అనప, కంది, చెనిగ బ్యాళ్లు, సెనగ పప్పు, సెనక్మాయలు, బెల్లము అచ్చులు, చింతపండు మూటలు సోలువు సోలువుగా వరస పెట్టిండారు.

సంతంతా గుమ్మడికాయలు, సొరకాయలు, పళ్లకాయలు, బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, గోరుచిక్కుడుకాయలు, కారామణి, పీంచకాయలు (బీన్స్‌), డబుల్‌ బీన్సు, క్యారేటు, బీటురూటు, వుర్లగడ్డలు, నవకోలు, ముల్లంగి గడ్డలు, మునగకాయలు మెరస్తా వుండాయి. నల్ల తెల్ల గుండు, పొడవు, సప్రము వంకాయలు. బజ్జి, బోండా, బుడ్డ, మూన్నెల్ల, ఆర్నెల్ల మిరపకాయలు. కోసు, పువ్వకోసు, పచ్చి బటాణి, తమాటాలు, బెండకాయలు, తొండకాయలు రాసులు రాసులు పోసిండారు.

సొంటి, అల్లము, గెణసగడ్డలు, ఏళికాయలు, వెలక్కాయలు, నిమ్మకాయలు, ఉడ్డలు ఉడ్డలు పోసిండారు.

దంటుకూరాకు, సొక్కెతాకు, సబ్బచ్చాకు, పాలాకు, మెంతము కూరాకు, సిలికిలాకు, పణగంటాకు, గురగాగు, కన్వాకు, కాశాకు, మునగాకు, పుదినా, కొత్తమీరి, కరివేపాకు కట్టలకు కొదవలేదు.

ఆ పక్కలానే జొన్నెన్నులు, చేపుకాయలు (జామ), సేవుకాయలు (ఆపిల్), దాలందరి (దానిమ్మ) పనస, పరంగి, మామిడి, తెల్ల, నల్ల ద్రాక్ష సపోట, తిత్తిలికాయలు (ఆరెంజ్‌), బేరికాయలు, కలంగరి (పుచ్చకాయ) కాయలు, సోలువు సోలువులుగా పేర్చి పెట్టిండారు.

“అడవిమల్లి సూదిమల్లి, గుండుమల్లి, జాజిమల్లి, మూడుచుట్ల మల్లి, ఏడుచుట్ల మల్లి, ఏ మల్లి కావాలన్నా ఒగేరేటు” కూస్తా వుండాడు పువ్వులన్న

“కనకబరాలు, రోజాపూలు, రుద్రాక్షపూలు, దాసాళం పూలు, గులాబి, చామంతి, చెలుమల్లి, బేరీపూలు, సంపంగి, సుగందర రాజులు, పన్నీరాకు, మంచితొలసి, అన్నీ వుండాయి” అంటా కాసులు బాగా కమాయిస్తా (సంపాదిస్తా) వుంది పూలమ్మి.

నూగులనూనె, సెనగనూనె, ఆముదము, వేపనూనె, కానుగనూనె డబ్బాలకు కొదవలేదు.

సంతకి రవంత దూరంలా ఎండిడే చేపలు, రవ్విలు, నాటుకోడిగుడ్లు పారం కోడిగుడ్లు, నాటుకోళ్లు, గొర్రెలు, మేకల వ్యాపారాలు జోరుగా సాగతావుండాయి.

బోండాలు, వడలు, పుట్టు, బజ్జీల గమ్ములు ముక్కులాకి ఎక్కి ఎబుడెబుడు తిందామా అనే ఎన్నాన్ని (మనసు) పుట్టుబడి చేస్తా వుండాయి.

ఎలనీరు (కొబ్బరిబొండాం), తాటినుంగులు జనాల దప్పి తీరస్తా వుంటే, ఇంకొందరు జనాలు దోసకాయకి కారము పూసుకొని తిని మింగి మైమరస్తా వుండారు.

నేనూ వూరికే వుంటానా, కావలసింది తిని, కడగా మజ్జిగ తాగి మామిడికాయ ఊరగాయ నంజుకుంటిని.

“సింతలేని సితరంగి సంతకి ఒగ బిడ్డని కన్నెంట. అట్లా ముండ అది. దాని మాటల్ని నువ్వు కట్టుకొంటావా? (వింటావా), ఏల ఏడస్తావు కలకుండుమా” పేదరాలు పెద్దమ్మ చిన్నమ్మని సుదారిస్తా వుంది.

“దాని పుట్టు చూస్తే పురొస్తుంది, వాకిలి చూస్తే వాంతికి వస్తుంది. దానికి నీ సుద్ది ఏమిటికంటా” వేమిరెడ్డి మల్లమ్మ రేగతా వుంది.

“అంతా నా కర్మక్కా కంతకి తగిన బొంతలా నా మొగుడు ముద్దలు మింగి (తిని) పనుకొంటాడే కాని నా గురించి ఒగ మాటా మాట్లాడేలే” అంటా మీనమ్మ .

“ఎదురుయాజ్యానికి వెనగుండాలా. బంతిబోజనానికి ముందుండాల, అనేది పెద్దోళ్ల మాట. కొన్నాళ్లు సరుసుకొనిపోమ్మా నీకూ మంచికాలము వస్తుంది” దైర్యము చెప్పతా దేవమ్మ.

“ఈకిత కర్చులు పోయి మిగిలింది పదివేలే. కొడుకుని కాలేజికి చేర్చాల, ఏమి చేసేదో ఏమో " వెత పడకా వ్యవసాయి (రైతు).

“ఈఫొద్దే కాసులు కట్టిడాల, లేదంటే సీటు చిక్మేలేదు” డాక్టరు కోర్సుకు కొడుకుని చేర్చతా వ్యాపారి.

రైతు వెతలే కాదు వ్యాపారి కిక్కు కతలూ ఈడ చానా కనిపిస్తాయి, వినిపిస్తాయి.

“అబ్బా పరంగిపండు(బొప్పాయి) మాదిరిగా వుందిరా” పడుచును చూస్తా పిల్లగాడు అనె.

“పండు పైన పొట్టు వుంటుందిరా చూసి నడు, గొంతులా తగులుకొంటే చానా గాసిపడాలా” మంచిమాట చెప్పతా మల్లన్న

“దేశము తిరిగిన గువ్వ గూటికి రాకుండా పోతుందా, నువ్వ పదరా” అదేమి యవ్వారము నడిచెనో మొకము ఎర్రగా అయిండే సత్తిగాని బుజంమింద చెయ్యేసి పిట్టన్న పోతావుండాడు.

ఈసంత మాసంత సరుకుల సంతే కాదు. సంసారాలని నిలబెట్టే సంత. చింతల్ని తుడిపి మనషుల్ని మంచిగా మార్చి. తన గుండెల్లో పెట్టుకొని గూడుకట్టుకొనే సంత. సంత సమాచారము తెలుసుకొాంటా నేను. సరకుల బేరములా అబ్బా అమ్మ.

పొద్దయిపోతా వుంది. పొద్దప్పని చూస్తా జనం సంతను విడచి చిన్న చిన్న దోవలుగా మారి మబ్బు ముసురుకొంటా వుందనంగా ఇండ్లు చేరిరి.

XXX XXX XXX

ఓసూరు పక్కలాని వూర్ణువూర్లంతా కొత్తబట్టల్లా కళకళలాడతా పిండివంటల్లా గుమగుమలాడతా వుండాయి. పరసని చూసేకి పయనమవ్వతా వుండాయి.

అమ్మా అబ్బ, అవ్వాతాత, మామ, అత్త, మామకూతురు మల్లి, మా అమ్మ అంతా చేరి పరస దోవలా పోతావుండారు. పొద్దప్పని కష్టంలా మేఘాలు పాలుపంచుకొని చల్లనిగాలిని నేలపై గుమ్మరిస్తా ఆడాడ నీడని పరస్తా వుండాయి.

“రామరామ ముకుంద మాధవ రామ సద్దురు కేశవా
రామ దశరథ తనయదేవా - రామశ్రీ నారేయణ ౹౹రామా॥!
కంటకులు హరిని చూపమందురు - కాయమందే చూడరూ
అత్మమర్మము తెలియనేరరు - అమర శ్రీ నారేయణ”

తాతగారి ఆశ్రమము నింకా బజన పాట వినబడతా వుంది. పాట వినుకొంటా ముందరికి నడిస్తిమి.

దోవ పక్కలా చింతమాను నీడలా ఆదాయమ్మ డోలుని మెడకి తగలేసుకొని వాయిస్తా వుంటే మగోడు ఉరుమారెమ్మని తలమీద పెట్టుకొని ఆడతా నారపగ్గము (కొరడా)తో కొట్టుకొంటా వుండాడు. అది చూసినవాళ్లంతా వాళ్లకి తోచిన కాసుల్ని ఆడవేసి పోతావుండారు.

ఆ పక్కలానే కొందరు కట్టిసాము చేస్తా కనిపిచ్చిరి. వాళ్ల కట్టెని బలే న్యాక్‌గా జోరుగా తిప్పతా వుండారు. “ఇందప్పా” అంటా రాయిని తీసి వాళ్ల పక్కకి విసరె తాత. అదే గడియలా అది కిందపడే మాదిరిగా చేసిరి వాళ్లు. నా కండ్లని నేనే నమ్మలే. అంత బాగా కట్టెసాము చేస్తా వుండారు. “మంచి కళాకారులు” అంటా తాత వాళ్లకి పదిరూపాయలు ఇచ్చె. ఆడనింకా కదిలితిమి.

నెమలి, గుర్రము, ఎద్దు వేషాలు వేసుకొని కుణుసులాడతా కీలుగుర్రాల వాళ్లు ఎదురు వచ్చిరి. వాళ్లని చూస్తానే వీళ్లమాదిరిగా నేనూ చేయాలనే బెమ (కొరిక) నాలా పుట్జె.

రచ్చతావ మానునీడలా చిన్న చిన్నోళ్లు కిష్టలీలలు ఆడతా వుంటే చానా కండ్లు చూస్తావుండాయి. ఆంజనేయ గుడితావ కొయ్యి బొమ్మలాట. రామయ్య గుడితావ కోలాట ఆడతా వుండారు. కాలిగజ్జి గల్గుగల్లు అంటా వుంటే ఒక చేతిలా పిల్లనగోవి, ఇంగో చేతిలా బుడిబుడికి (డమరుకం) అల్లాడిస్తా ఆట ఆడతా వుండే గొరవయ్య.

సిడిరన్న (జీనుగారులు) ఎత్తుకొని కుణుసులాడతా వుండే చిన్నోళ్ల సంబరాన్ని చూస్తా ముందరికి పోతిమి.

అప్పటికే తేరుతావ జనం నిండిపోయి వుండారు. తేరుకు పూజచేసి మాకంతా బొట్టు పెటింది అమ్మ

అంటిపండు (అరటిపండు)ని తేరుపైకి జనాలంతా విసరతా వుండారు. నేనూ విసరితిని.

రవంత సేపయినంకా తేరు కదిలె. మేము తేరుదోవలా కదలి పోతావుండాము.

ఆపక్మ తోలుబొమ్మల ఆట చూసేకి జనం తోసులాడతా పోతా వుంటే... డికంబరి ఆట చూసి నాకు దిగులాయె. ఆయప్ప ఒళ్లంతా బండారు (కుంకుమ) పూసుకొని వీపుకు కత్తులు కట్టుకొని కాలికి ఇనుము సర్పిణిలా (చైన్‌) గుండు కట్టుకొని ఆడే ఆటను చూస్తే ఎవరికైనా దిగులవుతుంది. ఆ ఆటగాడు ఎంత థైర్యవంతుడబ్బా అని నాలా నేను అనుకొంటిని.

ఏకనాదం వాయిస్తా అగ్గురారం నారాయణన్న తంబూర వాయిస్తా తిమ్మసంద్రం గోపన్న కంచుతట్టని కొడతా కగ్గదాసం సాకన్న మనిషి కడుపుపైన పొడవుగా వుండే కట్టెని పెట్టి దానిపైన ఎక్కి తమ ఆటతనం చూపే దొమ్మరయ్యలు. నగనగతా నయాండీ ఆటలు. పచ్చకొళము తావ పులివేషగాళ్ల చిందులు.

కొలువు, డోలు వాయిద్యాల పసందైన పాటలు విందులు. అజ్జ అజ్జకి (అడుగు అడుగుకు) అన్నసత్రాలు, పానకం బండ్లు నేలతల్లి బిడ్డల తరతరాల కళాచారం. నరనరాన జీర్ణించుకొన్న తెలుగుదనం. పరసపొద్దుని పసందుగ చేసి పల్లెపల్లెకి పయనమయ్యె,.

(తరువాయి వచ్చే సంచికలో...)


స్పందన

కొయ్యబొమ్మలాట కళాకారుడు/గొంబేగౌడర రామనగౌడ

బామ్మారెడ్డి రామారెడ్డిగారి(గొంబేగౌడర రామనగౌడ) కత అమ్మనుడిలో మొదలుకావడం బాగుంది. ఒక ఎన్నువ(కళ )ను నమ్ముకొని బతుకుతున్న కొందరు తెలుగువారి గురించి కన్నడంలో మంచి ఫొత్తాలు వెలువడుతున్నాయి. వాటిని తెలుగులోకి మార్చి రామచంద్రరావుగారు, అచ్చులోకి తెచ్చి “అమ్మనుడి” మంచిపనిని చేస్తున్నారు. అయితే తెలుగుచేత మీద నాదొక తెగడ్త(విమర్స) ఉంది. రామచంద్రరావుగారు కొన్నిచోట్ల కన్నడనుడుగు(వాక్యా)లను అట్లాగే తెలుగు చేస్తున్నారు. తెలుగు కన్నడాలు ఎంత తోబుట్టునుడులైనా, వాటి నడుమ కూడా ఎంతో కొంత వేరిమి ఉంటుంది. నుడుగును కట్టంలోనే కాదు, సంసుక్రుతపు మాటలను వాడడంలో కూడా ఆ వేరిమి తేటతెల్లంగా ఉంటుంది. నెలవిక(మాండలికం)లో రాసేటపుడు మనం ఎట్ల రాసినా చెల్లుతుంది. అలవిక(ప్రామాణికం)లో అంటే ఆకిక(పత్రిక) నుడిలో రాస్తున్నపుడు మెలకువగా రాయాలి. కన్నడ నుడుగును తెలుగులోకి తెచ్చేటపుడు, ఆ నుడుగుకున్న కన్నడదనాన్ని వదిలించి, దానిని తెలుగుదనంతో నింపాలి. అది రావుగారి తెలుగుచేతలో అక్కడక్కడా కొరవడింది. మచ్చుకు ఈ క్రింది నుడుగులను చూడండి.

  • ఇట్లా ఉంది **ఇట్లా ఉండాలి
  • 1947 మార్చి 1న నేను పుట్టినరోజు.
    • 1947 మార్చి ఒకటి, నేను పుట్టినరోజు(లేదా) 1974 మార్చి ఒకటిన నేను పుట్టాను.
  • ఇంటిపేరు జీవనగౌడ అని. ** ఇంటిపేరు జీవనగౌడ
  • మా తల్లితండ్రులకు పెళ్లయి పన్నెండేళ్లు గడిచినా పిల్లలు కాలేదంట.
    • మా తల్లితండ్రులకు పెళ్లయి పన్నెండేళ్లు గడిచినా పిల్లలు కలుగలేదంట
  • నేను, మా అన్న తమ్ముడు, చెల్లెలు ఎవరూ పుట్టలేదు. ** ...ఏవరమూ పుట్టలేదు
  • గొడ్రాలు అనే సూటిపోటి మాటల నుండి విముక్తి పొందవలసిందేనన్నది అమ్మ గొప్పకోరికట.
    • గొడ్రాలు అనే సూటిపోటు మాటలను అనిపించుకోకూడదని అమ్మ ఎంతో ఆరాటపడేదట.
  • ఈరోజు ఇదే బొమ్మలాట వల్లనే కీర్తిమంతుడినీ, అవమానికుడినీ అవుతున్నానని కుమిలిపోయేవారట.
    • ఈనాటికి ఈ బొమ్మలాట వల్ల కీర్తితోపాటు, అవమానం కూడా కలుగుతోందే అని కుమిలిపోయేవారట.
  • కీర్తి తెచ్చిన బొమ్మల వల్లనే అవమానం నుండి విముక్తి పొందాలని అనుకుని...
    • కీర్తిని తెచ్చిపెట్టిన బొమ్మలతోనే అవమానాలనూ తొలగించుకోవాలని అనుకుని...
  • ఆ ఏడుపే నేను సుసంస్కృతంగా పెరగటానికి కారణమైందేమో.....
    • ఆ ఏడుపే నేను సంస్మారవంతంగా పెరగటానికి కారణమైందేమో

ఒక్క పొరట(పేజి)లోని నుడుగులే ఇవన్నీ మొత్తంమీద ఇంకాకొన్ని ఉండుంటాయి. కన్నడం నుండి తెలుగుచేయడంలో ఒడుపు తెలిసినవారు రావుగారు. వడివడిగా ఎక్కువగా చేయాలనే తొందరలో ఇట్ల జరుగుతున్నదేమో! ఓరిమితో ఒకటికి నాలుగుసార్లు చూసుకొంటే ఇంకా బాగా వస్తుంది రావుగారి తెలుగుచేత. -స. వెం.రమేశ్‌