అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/కొయ్యబొమ్మలాట కళాకారుడు గొంబేగౌడరరామనగౌడ
.
ఆత్మకధ
కన్నడ మూలం: డా.చంద్రప్ప సొబటి; తెలుగుసేత: రంగనాథ రామచంద్రరావు 90597 79289
కొయ్యబొమ్మలాట కళాకారుడు
గొంబేగౌడరరామనగౌడ
కళాబండి మొదటి ప్రయాణం
నాకు అప్పుడు పదమూడేళ్ళు.
ఆట ఆడటానికి నాన్న తన మేళంతోపాటు తీసుకుని పోతానని చెప్పారు.
అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగింది.
ఆ నాటి రోజుల్లో మేము మా ఊరు వదిలి మరో ఊరికి వెళ్ళడమంటే అంత సులభం కాదు.
అదీ ఆటాడటానికి మరో ఊరికి వెళ్ళమంటే సామాన్య విషయం కాదు.
అందువల్లనే చాలా సంతోషం కలిగింది.
అయితే ఆ రోజు కళాకారుడిలా వారితో వెళ్ళలేదు.
అందుకు బదులుగా ఎద్దుల బండిని బాడుగకు తోలేవాడిగా వెళ్ళాను. అంటే నాన్న మేళం బొమ్మలాటకు వాడుతున్న బొమ్మలను, వాయిద్యాలను, ఆట ప్రదర్శనకు వేదికను నిర్మించటానికి కావలసిన సామానులను వేసుకుని, అలాగే కళాకారులను ఎద్దులబండిలో ఎక్కించుకుని తోలేవాడిని. అదీ బాడుగకు!ఇదొక విచిత్రమైన విషయంగా అనిపించవచ్చుకదా !
వంశపారంపర్యంగా వచ్చిన కళ !
నాన్ననే మేళం నాయకుడు.
అలాంటి నాయకుడి కొడుకు బండి తోలుతూ సంపాదించడం నిజం.
సుమారు నాలుగైదు సంవత్సరాలు ఈ పని చేశాను.
ఆ అనుభవం ఉపయోగపడింది. కేవలం బాడుగదారుడిగా ఈ పని చేయలేదు.
ఆ సమయంలో బొమ్మలను ఎలా ఆడించాలో నేర్చుకున్నాను. ఆట ప్రదర్శనలో అప్పుడప్పుడు చిన్న ప్రమాణంలో భాగం వహించేవాడిని. అయితే మేళం వారికి నేనాక బాడుగకు బండి తోలేవాడిని మాత్రమే.
అందువల్ల బండి బాడుగ సొమ్ము తప్ప మరే సంభావన ఇచ్చేవాళ్ళు కాదు.
మొదట్లో బండి బాడుగ అని రోజుకు అయిదు రూపాయలు ఇచ్చేవారు. కొన్ని నెలలు గడిచిన తరువాత, ఆ బాడుగ ఒక ఊరిలో ప్రదర్శించే ఒక ఆటకు పది రూపాయలుగా మారింది. ఈ మార్పు ఒకే ఊళ్ళో, అది ఒకే 'అట్ట 'లో ('అట్ట ' అంటే వేదిక) రెండు ఆటలు లేదా ఒకే ఊళ్ళో రెండు 'అట్ట 'ల్లో రోజుకు రెండు ఆటలు ప్రదర్శించేవారు. అంతేకాకుండా ఒక్కో రోజు రెండు ఊళ్ళల్లోనూ ఒక్కో ఆట ప్రదర్శించేవారు. ఒక ఊళ్ళో సాయంకాలం సుమారు ఆరు నుంచి ఎనిమిదిన్నర- తొమ్మిది వరకు ఆట ఆడితే, మరో ఊళ్ళో సుమారు రాత్రి తొమ్మిదిన్నర -పది నుంచి ఉదయం అయిదున్నర-ఆరు గంటల వరకు ఆట సాగుతూ ఉండేది. అలాంటి సందర్భంలో నాకు చాలా అలసట కలిగేది. కళాకారులు భోజనం చేసి, సిద్దమయ్యేలోపు బండిలో ఉన్న సామానులను ఆట జరిగే స్థలంలో చేర్చాలి. ఆట జరిగే వేదిక- బండి నిలబడ్డ స్థలానికి సమీపంలో ఉన్నా తొందరగా మోసుకొచ్చి, వేదిక నిర్మాణానికి సిద్ధం చేయాలి. లేకపోతే నాన్న చెడామడా తిట్టేవారు. ఎన్నోసార్లు నాన్న మేళంవారి ముందు, ఊరి జనం ముందు తిట్టేవారు. ఊరికే తిట్టడం ఆయన అభిప్రాయంకాదు. ఆట సమయంలో చూపే సోమరితనాన్ని ఆయన ఎన్నడూ సహించేవారు కాదు. అలా తిట్టించుకుంటూ ఆట ప్రదర్శనకు అన్నీ సిద్ధం చేస్తుండేవాడిని. అలాంటి రోజున నాకూ, ఎద్దులకూ అలసట కలిగేది.
ఇది అర్థం చేసుకున్న మేళంవారు ఆటకు పదిరూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేశారు.
ఇక్కడ ఒక మాట చెప్పాలి. మేళంవారు ఆటకు పదిరూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసినపుడు, నాన్న వ్యతిరేకించారు. రోజుకు అయిదు రూపాయలు చాలని మొండిగా పట్టుబట్టారు. ఒకటి రెండు రోజులు మేళంవారికి, నాన్నకు మధ్యన చిన్నవాదన జరిగింది.
నాన్న మొదట తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళుతున్నప్పుడు ఆట ప్రదర్శనకు తీసుకునే డబ్బు, ఆటలో వచ్చే ముయ్యి, మొదలైన ఖర్చుల ఆధారంగా బండిలో లెక్కాచారం జరిగేది. అప్పుడు నా బండిబాడుగ విషయమూ వచ్చేది.
ఆ సందర్భంలోనూ నాన్న రోజుకు అయిదురూపాయలు చాలనే వాదననే కొనసాగించారు.
బండి తోలుతూనే ఈ వాదప్రతివాదాలను వింటున్న నేను అయోమయంలో పడ్డాను.
మనస్సుల్లోనే కోపగించుకోసాగాను. ఎందుకంటే ఆ విషయం గురించి నాన్నతోకానీ, మేళంవారితోకానీ సూటిగా నేనేమీ చెప్పలేను. నాన్న తీసుకున్న నిర్ణయానికి ఎదురుజవాబు ఇవ్వాలంటే భయం. మాటకు మాట, వాదానికి వాదం చేసేవారిని, అందులోనూ పెద్దవారి ముందు మాట్లాడటం ఆయన భరించేవారు కాదు.ఆ సమయంలో సాయంత్రం ఆట మొదలైన తరువాత నా ఎద్దుల బండిలో ఒక్కడినే కూర్చుని వెక్కివెక్కి ఏడ్చాను.
మూడు రోజుల తరువాత రాణిబెన్నూరు శ్రీ రుద్రప్ప హిత్తలమనిగారి ఒత్తిడి వల్ల ఒప్పుకున్నప్పటికీ ఒక పని నియమాన్ని జారీకి తెచ్చారు. అంటే 'మేళంవారు ఆట ప్రదర్శనకు పల్లెకు వచ్చినపుడు వాళ్ళల్లో ఎవరికైనా ఆరోగ్యం పాడవుతే, లేదా అనివార్య కారణాల వల్ల ప్రదర్శనకు రాకపోతే వాళ్ళు చేస్తున్న పనినీ, ప్రదర్శనకు పూరకమైన మరొక పనినీ రామ (నేను) చేయాలి. ఆ పని చేయడానికి సాధ్యం కాని సందర్భంలో అలాంటి పని చేసేవారికి సహాయం చేయాలి. అయితే ఆ సహాయానికి ఎలాంటి సంభావన ఉండదు” అని షరతు పెట్టారు.
ఈ షరతును మేళం వారు ఇష్టంలేని మనసుతో అంగీకరించారు.
అలాంటి ఆత్మాభి మానం నాన్నది. ఒప్పుకున్నందుకు సంతోషం కలిగింది.
అయితే నూడునాలుగు రోజుల నాన్న చేసిన వాదన వల్ల మనస్సులోని కలవరం సుమారు ఆరేడు నెలల వరకు తగ్గలేదు.
బాడుగ చర్చ జరిగి ఆరేదు నెలలు గడిచివుండాలి.
అప్పుడు ఆట నుంచి వచ్చిన డబ్బు పంపకం గురించి మేళంలో ఒక ఛిన్న గొడవ జరిగింది.
ఆ రోజు అసుండి గ్రామం షెహనాయి వాయించే వ్వక్తి మా మేళం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఉత్తమ కళాకారుడు. అతను మేళం నుంచి బయటికి వెళ్ళడం మేళంలో ఉన్నవారెవరికీ ఇష్టం లేదు. నాన్నకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మేళంలో ఉన్నవారందరూ నాన్న వయసువారే. ఆ గుంపులో అత్యంత పిన్న వయస్కుడిని నేను మాత్రమే. వారి అనుభవంలో సగం కూడా నా వయసు లేదు. అందువల్ల పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం తప్పనే అవగాహన నాన్న కలిగించారు. నిజానికి అది చిన్న విషయం. అందరూ కూర్చున్న చోటే సరిచేసుకున్నారు. అయినా అతను వెళ్ళిపోయాడు.
కొద్ది నెలల తరువాత అతను మళ్ళీ తిరిగి వచ్చినా మేళం జరిగిన సంఘటనలు, నాన్న గతంలో బండిబాడుగ గురించి తీసుకున్న నిర్ణయాలు, అదే విధంగా దేన్నీ తొందరగా ఒప్పుకోని స్వభావం నాకు జ్ఞాపకం వచ్చాయి. నాన్న గురించి అప్పటిదాకా ఉన్న కోపం, అయోమయం నాలో నుంచి పారిపోయాయి.
నాన్న ఆ రోజు చేసిన వాదన మేళం అభివృద్దికి అనుకూలంగా ఉంది.
ఇంటి వాళ్ళే ఎక్కువ డబ్బులు తీనుకుంటారనే నిందను మోసుకోకూడదనే ముందాలోచన నాన్నది.
ఇది తండాలోని సభ్యులకు తనతో సమానంగా కలుపుకునిపోయే గుణం.
ఎక్కువగా శ్రమపడే, సంపాదించే, ఆటలో మనస్ఫూరిగా పాల్గొనేలా చేసే ఆలోచన అని నాకు అప్పుడు అర్థమైంది.
మేళాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో చాలాకాలం వరకూ నడిపించుకునిపోయే నాన్న ముందుచూపును గమనించి మనసులోనే ఆయనకు భక్తిగా నమస్మరించాను.
ఈ స్వభావాన్ని నేను అలవరుచుకోవాలని నిర్ణయించుకున్నాను.
భవిష్యత్తులో నా నాయకత్వంలో వాటిని అలవరుచుకున్నాను.
ఆ రోజుల్లో మా మేళంలో సంభావన ఫొందడం అంత సులభంగా ఉండలేదు. కళపై పట్టులేని ఏ కళాకారుడికి ఇక్కడ అవకాశం లేదు. కళా ప్రదర్శన విజయానికి ప్రతి ఒక్క కళాకారుడి శ్రమ ముఖ్యమని నాన్న చెప్పేవారు. అందువల్లనే అందరినీ సమానంగా చూసేవారు. ఈ 'సమాన సంస్కృతి" అనుసరిస్తున్న కారణం వల్లనే మా వంశంలోని కళ ఇప్పటివరకు బతికి ఉండటానికి, మరింత ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందటానికి కారణమైంది. నాన్న కాలంలో ఈ రకమైన విధానాన్ని జారీకి తీసుకుని వచ్చే అనివార్యత పదే పదే పెరిగింది.
నాన్న దగ్గరే నేర్చున్న, మా మేళంలోనే ఆటలు ప్రదర్శించిన, మా ఊరిలోని మా బంధువులే కొత్త మేళాన్ని కట్టుకున్నారు అంతేకాకుండా ఆ సమయంలో రాణిబెన్నూరు తాలూకా చుట్టుపక్కలున్న పల్లెల్లో అనేక బృందాలు ఆటను ప్రదర్శించేవి. ఈ బృందాలు మా మేళంలోని సభ్యులను తమ వైపుకు లాక్కోవటానికి ప్రయత్నించేవి. కొందరు మేళం నుంచి బయటికి పోయి మళ్ళీ తిరిగొచ్చారు. నేను, అన్నయ్య చాలా బాధపడేవాళ్ళం.
అన్నయ్య అప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పటికీ సెలవు రోజుల్లో మేళంవారిలో ఎవరైనా రానటువంటి సందర్భంలో ఆటలో పాల్గొనటానికి వచ్చేవాడు. దీనివల్ల నాన్న మేళం నుంచి సభ్యులు వెళ్ళిపోయినందుకు ఏ మాత్రం బాధపడలేదు. కళాకారులు మేళం నుంచి బయటకి పోవడం మళ్ళీ తిరిగి రావడం సహజమైన విషయాలుగా మారిపోయాయి. బయటకిపోయిన కొందరైతే మళ్ళీ మేళంలోకి రానేలేదు. ఇంకా కొందరు తమదైన తండాలను తయారు చేసుకున్నారు. మళ్ళీ ఇద్దరు మేళం వదిలి పోయారు. ఇలా మేళం వదిలి పోవటం మళ్ళీ తిరిగి రావటం నాన్న కాలంలో ఎక్కువైంది.
నాన్న తరువాత అన్నయ్య మేళం నాయకుడయ్యాడు.
సామాన్యంగా ఆ కాలంలో మేళం వదిలి వెళ్ళేవారు తక్కువగా ఉండేవారు.
ఇక నా నాయకత్వంలో అయితే లేనేలేదు.
ఎవరూ మేళం నుంచి బయటికి పోలేదు.
అలాంటి పరిస్థితి నేను ఎదుర్మోలేదు.
నాకు కలిగిన, కలుగుతున్న అనుభవాలు వేరు. అంటే నేను ఆట ప్రదర్శించడానికి అవసరమైన కళాకారులను వెతుక్కుని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆ పరిస్థితి మరింత దిగజారింది.
నాన్న కాలంలో కళాకారులకు ఉన్న డిమాండ్ కు మా కాలంలో అది తగ్గటానికి అనేక కారణాలున్నాయి.
ముఖ్యకారణంగా నాకు కనిపించేదేమిటంటే ఆ రోజుల్లో ఈ ఆటకు ప్రజల నుంచి భారీగా డిమాండ్ ఉండేది.
అప్పట్లో ఈ టీవీ, సినిమా, ఏదీ ఉండలేదు.
చుట్టుపక్కలున్న పల్లెల్లో అనేక తండాలు ఉండేవి.
మా బృందానికి కాకపోయినా బయలాటలో అవకాశాలు దొరికేవి.
షెహనాయి, హార్మోనియం మాస్టర్లకైతే చాలా డిమాండ్.
అందువల్ల కళాకారులకు నాన్న కాలంలో అంత డిమాండ్ ఉండేది.
అన్నయ్య మేళం నాయకుడైన కాలానికి కొన్ని బృందాలు ఆట ప్రదర్శించడమే వదిలేశాయి. కొన్ని బృందాలు ఆటను వదులుకోవలసిన పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా కొన్ని బృందాలు ఉన్నప్పటికీ నాన్న కాలంలో ఏ పోటీకి దిగే స్థితిలో లేవు. ఇక పెళ్ళి సమయాల్లో కొన్ని సంప్రదాయాలు, బయలాట మొదలైన కళలూ తగ్గిపోయాయి.
నేను నాయకత్వం వహించే కాలానికైతే 1990లో చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న అన్ని బృందాలు ఆటలను ప్రదర్శించడమే నిలిపివేశాయి. ఈ రోజు ఏ మేళాలు లేవు. అందువల్లనే ఉత్తర కర్ణాటకలో ఏకైక తండా అనే పేరుప్రతిష్టలను మా బృందం సజీవంగా నిలుపుకుంది. ఇది మా వంశానికి ఉన్న గౌరవం కావచ్చు. మాలాంటి మేళంలో వృద్దకళాకారులూ ఆడటానికి ఇష్టపడుతారు. దేశవిదేశాల నుంచి జనం, కళపై ఆసక్తి ఉన్నవారు, పరిశోధకులు వెతుక్కుంటూ మా ఇంటికి వస్తారు. అంతకన్నా గొప్ప సంతోషం వేరే ఏముంటుంది?
బాడుగకు బండి తోలటం ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత బాడుగ మొత్తం ఇరవై రూపాయలైంది.
ఆట ఆడించేవారు ప్రదర్శనకు ఇస్తున్న మొత్తం పెరగటమే నా బండిబాడుగ పెరుగుదలకు కారణం.
మొదట పదిరూపాయలు ఇచ్చేటప్పుడు ఒక ఆట ప్రదర్శనకు అరవై నుంచి ఎనభై రూపాయలు సంభావన వచ్చేది. తరువాత నూటాయాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలకు పెరిగింది.
ఆట ప్రదర్శనలకు మంచి కాలం ఆరంభమైన సమయంలో ఇంకొక రూపాయి దొారకటాన్ని చూసి నేనూ, మా కళాకారులంతా సంతోషపడ్డాం.
ఒక్క రోజూ బిడువు లేకుండా ఆటలుప్రదర్శించాం.
అప్పట్లో చేతినిండా డబ్బు. నాకూ అంతే. రెండు ఆటలు ఆడిన రోజైతే రోజుకు నలభై రూపాయలు దొరికేవి. దొరికేవి అంటే ఆ రూపాయలు నా చేతికి వచ్చేవికావు. అన్నిటినీ నా పేరిట నాన్న లెక్క రాసుకుని తన దగ్గరే పెట్టుకునేవారు. నిజానికి నాకు అప్పుడ డబ్బుల అవసరం ఉండేది కాదు. తన కొడుకులు ఇంత సంపాదిస్తున్నారని మా నాన్న అమ్మతో, చెల్లెలితో చెప్పేవారుకదా! అదే గొప్ప సంతోషం!
అలా ఆరునెలలు గడిచివుండొచ్చు.
ఇరవై రూపాయలున్న బండిబాదుగ ముప్పయి అయ్యింది.
అప్పట్లో ఒక ప్రదర్శనకు నాలుగు వందల యాభై నుంచి అయిదు వందలకు సంభావన పెరిగింది. మరో సంవత్సరం గడిచివుండాలి. బండిబాడుగ యాభై రూపాయలైంది. ఒక్క దెబ్బకు డబ్బు జంప్ కావడం అదే మొదలు. ఈ బాడుగ చాలా కాలం వరకూ అమల్లో ఉంది.
అప్పుడు మా ఇంటి సంపద ఉన్నట్టుండి పెరగసాగింది.
ఏందుకంటే ఆ సమయానికే మా అన్నయ్య కూడా ఆట ఆడటానికి అప్పుడప్పుడు వచ్చేవాడు.
నాన్న అన్నయ్యల సంభావన, నా బండిబాడుగ అంతా కలిసి మేళానికి వచ్చే సంభావనలో సింహభాగమైంది.
అప్పుడు ఒక ఆట ప్రదర్శనకు 1000 నుంచి 1200 రూపాయల వరకూ ఇచ్చేవారు.
ఎక్కువ డబ్బులు వస్తాయని నాన్న సంతోషపడితే ఇంటి వాళ్ళు, పిల్లలు, మనవళ్ళు కళలు నేర్చుకుని ఆట ఆడుతున్నారుకదా అని తాతయ్య సంతోషపడేవారు.
(తరువాయి వచ్చే సంచికలో...)