అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/మేధోశిఖరం, గాంధేయవాది అంతర్జాతీయ ప్రముఖుడు ఇ. ఎస్‌. రెడ్డి

మేధోశిఖరం, గాంధేయవాది

అంతర్జాతీయ ప్రముఖుడు ఇ. ఎస్‌. రెడ్డి



తెలుగువాడైన ఒక అంతర్జాతీయ ప్రముఖుడు 2020 నవంబరు 1వ తేదీన అమెరికాలో కీర్తిశేషులయ్యారు. ఆయనే శ్రీ ఏనుగు శ్రీనివాసులురెడ్డి. తెలుగేతరులకు ఆయన ఇ.ఎస్‌.రెడ్డిగా పరిచితుడు.

1952లో నెల్లూరులో వుట్టిన ఇ.ఎస్‌. రెడ్డి మద్రాసు విశ్శ్చవిద్యాలయం నుండి పట్టభద్రుడైన తర్వాత న్యూయార్క్‌లో ఉన్నత విద్యాభ్యాసం చెశారు. అ తర్వాత ఐక్క్మరాజ్యసమితిలో చేరి మూడున్నర దశాబ్దాలపాటు పనిచేశారు. ఆ అంతర్జాతీయ సంస్థ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన పలు బాధ్యతల్ని నిర్వహించారు. జాతివివక్ష (అపార్టీడ్‌)కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సారధిగా ఇఎస్‌ రెడ్డి సుప్రసిద్దుడయ్యారు. 1960ల నుంచి 1980ల వరకు దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని సమీకరించేందుకు ఆయన విశేష కృషి చేశారు.

పదవీ విరమణ అనంతరం కూడా ఆయన తన వ్యక్తిగత స్థాయిలో ఆ బాధ్యతలను నిర్వహించారు. జాతివివక్ష వ్యవస్థ ఆ బాధ్యతలను నిర్వహించారు. జాతివివక్ష వ్యవస్థ అంతిమంగా కూలిపోయినప్పుడు ఇఎస్‌రెడ్డి దక్షిణాఫ్రికాను సందర్శించారు. ప్రజలు, ప్రభుత్వం ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం సత్కరించింది. దక్షిణాఫ్రికాలో సామాన్య ప్రజలు ఎందరో ఇ ఎస్‌ రెడ్డి పట్ల ఇటువంటి గౌరవాన్నే కలిగివున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇఎస్‌రెడ్డికి ఆర్దర్‌ ఆఫ్‌ ది కంపేనియన్స్‌ ఆఫ్‌ ఆలివర్‌ టాంబో పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. అయితే సామాన్య ఆఫ్రికన్లు తనపట్ల ఇప్పటికీ చూపుతున్న గౌరవాదరాలే ఇఎస్‌ రెడ్డికి ఎనలేనివి అనడంలో సందేహం లేదు.

దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్వవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ మహాత్మాగాంధీ జీవితం, కృషి పై ఇఎస్‌ రెడ్డి ప్రగాఢ ఆసక్తిని పెంపొందించుకున్నారు. గాంధీపై ప్రపంచవ్యాప్తంగా వెలువడిన వ్యాసాలు, పుస్తకాలు దాదాపుగా అన్నీ ఇఎస్‌ రెడ్డి వద్ద ఉన్నాయి. సబర్మతి ఆశ్రమం వెలుపల గాంధీనీ గురించిన ఇంత విస్తృత సమాచారం బహుశా మరెవ్వరి వద్ద, మరెక్కడా ఉండదనడం సత్యదూరం కాదు. ఈ సమాచార మంతటినీ ఆయన అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. వివిధ దేశాల స్మాలర్లు ఆ సమాచారాన్ని వినియోగించుకొంటున్నారు. గాంధీపై వెలువడిన అనేక గ్రంథాలు, రెడ్డి అందించిన సహకారంతోనే రూపు దిద్దుకున్నాయి.

ఇఎస్‌ రెడ్డి సతీమణి టర్కిష్‌ జాతీయురాలు. టర్కిష్‌ మహాకవి నజీమ్‌ హిక్మత్‌ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన విదుషీమణి.

ఈ దంపతులు మన్‌హట్టన్‌లో యాఖై సంవత్సరాలకు పైగా నివసించారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం కుమార్తె

ప్రోద్బలంతో వారు కేంబ్రిడ్జ్ కు వచ్చి స్థిరపడ్డారు.

ప్రముఖ జర్నలిస్టు, చరిత్రకారుడు, గాంధీపై సాధికార గ్రంథాల రచయిత రామచంద్ర గుహ, ఇ ఎస్‌.రెడ్డి గురించి వ్రాస్తూ ఆయన తనకు తండ్రి వంటివారని, గాంధీ గురించి తాను చేసిన పరిశోధనపై, రచనలపై ఆయన ప్రభావం అపారంగా ఉందని అంటాడు. తాను అమితంగా అభిమానించే, గౌరవించే ఇద్దరు విద్వద్‌ వరుల్లో ఇ ఎస్‌.రెడ్డి ఒకరు అని రామచంద్రగుహ ట్రాశారు. (మరొకరు చైనా చరిత్రకారుడు రోడెరిక్‌ మెక్‌పార్కర్‌ రాడ్‌). రామచంద్రగుహ- ఎంతో పరిశోధన చేసి, రచించిన 'గాంధీ బిఫోర్‌ ఇండియా” ఎంతో ప్రఖ్యాతిగాంచిన పెద్ద గ్రంథం. ఈ రచనను ఆయన ఇ. ఎస్‌.రెడ్డికి అంకితం చేశారు!

అధ్యయనశీలి, పరిశోధక రచయిత టి. రవించంద్‌ ఇలా బాశారు:

“గాంధీ బిఫోర్‌ ఇండియా” పుస్తకాన్ని రామచంద్రగుహ వ్రాస్తూన్న సందర్భంలో 1992 ప్రాంతాల్లో న్యూయార్క్‌లో ఉంటున్న ఇ.ఎస్‌. రెడ్డిని కలుసుకోమని తనను గోపాలకృష్ణ గాంధీ పంపాడని చెబుతూ, ఇఎస్‌ రెడ్డిని కలుసుకోవటమే గ్రేటెస్ట్‌ గిఫ్ట్‌ (గొప్ప బహుమతి)గా భావిస్తున్నానంటాడు. ఆయన్ని యుఎన్‌ఒ కేంద్ర కార్యాలయం సమీపంలో ఉన్న మిడ్‌ టౌన్‌ మాన్‌హట్టన్‌లోని చిన్న గదిలో కలుసుకున్నట్టు రాశాడు. ఈ జీవిత చరిత్ర పరిశోధనలో గాంధీని చేరుకోవటానికి నా మార్గాన్ని ప్రకాశింపచేశాడు ఇ. ఎస్‌.రెడ్డి అంటాడు రామచంద్ర గుహ. ఈ పుస్తక పరిశోధన సమయంలో, రాతప్రతిని సిద్ధం చేసేటప్పుడు ఆయన్ని నిత్యం కలుస్తూ గాంధీజీ గురించి దక్షిణాఫ్రికా చరిత్రలో ఆయనకు ఉన్న అసాధారణ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నానంటాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆర్మెన్స్‌ లో గాంధీజీ కి సంబంధించిన విషయాల్ని గురించి చెప్పడమే కాకుండా, ఆయన తన స్వంత సేకరణలో ఉన్న ఆకరాలను అందించి తన పరిశోధనకు చాలా దోహదపడ్డాడు అంటాడు. ఇ.ఎస్‌. రెడ్డి కుటుంబపరమైన బాధ్యతల్లో తలమునకలయి. ఉండి కూడా తన రాతప్రతుల్ని చదివి, సరిదిద్దేవాడని, అందువల్ల ఈ పుస్తకాన్ని ఆయనకు అంకితమివ్వడమనేది, ఈ పరిశోధనలో ఆయనకు రుణపడిన దానికి తగిన వ్యక్తీకరణ కూడా కాదంటాడు.

ఇ.ఎస్‌. రెడ్డికి తన పుస్తకాన్ని అంకితం చేస్తూ రామచంద్ర గుహ రాసిన మాటల్ని చదివితే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది “ఇ. ఎస్‌. రెడ్డి, భారతదేశ భక్తుడు, దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్యవాది, అన్ని జాతుల గాంధీ పరిశోధకులకు మిత్రుడు, సలహాదారుడు. అని ఆయన రాశారు

బిడియస్టుడు, ఉదాత్తుడు, గొప్ప అధ్యయనపరుడు, నిజమైన వీరోచిత వ్యక్తి అని “గాంధీ బిఫోర్‌ ఇండియా” గ్రంథ రచయిత రామచంద్ర గుహ చేత ప్రశంసలందుకున్న ఇ.ఎస్‌. రెడ్డి తెలుగువాడయినందుకు మనమంతా గర్వపడాలి. అరుదైన ఈ ఆంధ్ర ప్రముఖుడు 1997 ప్రాంతాల్లో నేను డా|| కె.బి. కృష్ణ కొన్ని రచనల్ని వెలుగులోకి తెస్తున్న సమయంలో సోషలిస్టు మిత్రులు రావెల సోమయ్య గారి చ్వారా నాకు పరిచయమయ్యాడు. ఆయనకు డా॥కె.బి. కృష్ణ అంటే చాలా అభిమానం. నాటి త్రివేణి (1940) ఆంగ్ల పత్రికలో వచ్చిన డా॥ కె.బి. కృష్ణ వ్యాసం - మెటీరియలిజం అండ్‌ భగవద్గీత (భౌతికవాదం - భగవద్గీత) చదివి చాలా ప్రభావితుడయ్యాడు ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువాదం కూడా చేశాడు. కాని దాన్ని ప్రచురించలేదు. ఆనాటికి నాకు ఇఎస్‌. రెడ్డి తో ప్రత్యక్ష పరిచయం ఏర్పడకపోయినా, లేఖాపరిచయం ఏర్పడింది. ఎప్పుడో విద్యార్థి దశలో డా|| కె.బి. కృష్ణతో ఏర్పడిన పరిచయాన్ని దశాబ్దాలు గడిచినా ఆయన విస్మరించలేదు. చరిత్ర గుర్తించినవాళ్ళను గుర్తుపెట్టుకోవటంలో విశేషం ఏమీ లేదు. తమ సమకాలీన చరిత్రలోనే కాకుండా తర్వాత కాలంలో కూడా చరిత్రవల్ల దుర్మార్గంగా విస్మరించబడినవాళ్ళను స్మృతిపథంలోకి తెచ్చుకోవటమే గొప్పవాళ్ళ గొప్పతనం. డా|| కె.బి. కృష్ణ చరిత్ర కానీ తమిళ తంబినాయుడుల చరిత్రకానీ ఎవరికి కావాలి? వాళ్ళ గురించి రాస్తే మనకొచ్చెదేమిటి అని ఆలోచించే పరిశోధకులు, మేధావులే మనకు ఎక్కువ. కానీ, ఇ.ఎస్‌. రెడ్డి లాంటి ఉదాత్త వ్యక్తిత్త్స్వంకలవాళ్ళు నిష్కాముకంగా తమ పనేదో తాము చేసుకొంటూ ముందుకు వెళ్తుంటారు. మన పక్కనే ఉన్న ఇటువంటి గొప్పవాళ్ళను తెలియనట్టు విస్మరించటమో, అదీ కుదరకపోతే అపహాస్యం చేయడమో చేసే సగటు తెలుగువాడి తెగులు గురించి ఎంత రాసినా తరగదు".

సంపాదన కోసమే విదేశాలకు వెళ్లినవాడు కాదు ఇఎస్‌. రెడ్డి గారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన సేవలకూ ఒక నిజమైన మేధావిగా అయన మానవాళికి చేసిన సేవలకూ- ముఖ్యంగా జాతివివక్షను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటానికి గుర్తింపుగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు ఎటువంటి గౌరవ మర్యాదలను, మన్ననలను అందించాయో తెలియదు! చరిత్రలో నిలిచెవిధంగా జీవించిన ఉదాత్త మేధోజీవి ఇఎస్‌ రెడ్డి. మన యువతకు గొప్ప ఆదర్శం.

తెలుగువాడుగా పుట్టి, ప్రపంచస్థాయి కీర్తిప్రతిష్టలను ఆర్జించి, తన జీవితాన్ని సార్ధకం చెసుకౌన్న గొప్ప వ్యక్తి ఇఎస్‌.రెడ్డి గారికి శ్రద్దాంజలి ఘటిద్దాం. -అమ్మనుడి