అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/వివాహిత స్త్రీల ఇంటిపేర్లు ఎందుకు మారుతున్నాయి


వివాహిత స్త్రీల ఇంటిపేర్లు ఎందుకు మారుతున్నాయి?

కొంత కాలం క్రితం “మీ ఇంటి పేరెలా వచ్చింది” అని ఆంధ్రజ్యోతిలో ఈ రచయిత నిర్వహించిన శీర్షికకు ప్రతిస్పందిస్తూ పాఠకులు అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటి. అయితే మారి తీరాలి అని నిర్దేశం చేసినట్లు గాని లేక అలాంటి చట్టం ఉన్నట్లు గాని దాఖలా ఏమీ లేదు. కాని మారుతున్న మాటనిజం. ఇది ఒక ఆచారం అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆచారం ఏర్పడడానికి కూడ ఏవో కారణాలుండాలి.

వ్యక్తికి పేరు సమమైన గుర్తింపు కొరకు. సమూహం నుండి వ్యష్టిని గుర్తించడం కొరకు. ఇంటి పేరు, ఆ గుర్తింపును మరింత సమగ్రం గావించడం కొరకు. ఇంత మేరకు స్త్రీ, పుం వివక్షలేదు. వివక్ష ప్రారంభమైంది వివాహిత స్త్రీల విషయంలో. అలా ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్న.

ఈ ప్రశ్న భారతీయ సమాజంలో మాత్రమే ఉత్పన్నమైనది కాదు. ఇతరదేశాల్లో కూడా వచ్చింది. బహుశా ఆ స్ఫూర్తే ఇక్కడ పనిచేసి వుండవచ్చు. ఇది సమాజంలోని పురుషాహంకారానికి నిదర్శనమన్న వారు కూడ వున్నారు. ఇతర దేశాల్లో ఈ విషయమై న్యాయస్థానాల నాశ్రయించడం కూడ జరిగింది. వివాహిత, భర్త ఇంటిపేరు లోనికి మారడం, మారక పోవడం అనేది ఆ స్త్రీ ఇష్టాయిష్టాలకు వదిలివేస్తూ, సమాజానికి, లేక లౌకిక వ్యాపారానికి సంబంధించినంత వరకు అలా మారడం అనేది అవసరమని ఉట్టంకించాయి. కాని ఆ ఆచారానికి కారణాలు వివరింపలేదు. కారణమేమై వుంటుంది. లోకంలో చాల ఆచారాలుంటాయి. కొన్నింటికి కారణాలు తెలియవస్తాయి. కొన్నింటికి తెలియరావు. కారణం, ఆ ఆచారం మొదలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు గల కాలంలోని అంతరం. మొదలు కారణమున్నా ఆ కారణమేదో ఇప్పుడు అంది రాక పోవడం. అందిరావడం లేదు గనుక, దానిని పాటించడం మానివేస్తున్నారా! లేదు. ఎందువలన. అవి సమాజపు విలువలుగా రూవుదిద్దుకున్నాయి గనుక. అయితే పూర్వవు ఆచారాలనన్నింటిని పాటిస్తున్నారా అంటే - అదీ కనుపింపదు. అంటే కొన్ని పాటింపబడుతున్నాయి. కొన్ని పాటింపబడటం లేదు. పాటింపబడుతున్నవి మాత్రం, చట్టం కంటె బలీయమైనవి. నిజానికి చట్టం వాటి జోలికి వెళ్లదు. కారణమేమిటి! చట్టంకాని, ఆచారంగాని, బహుజనులకు హితవును, సుఖాన్ని కలిగించాలి తప్ప కష్టం కలిగింపరాదు. అలాగే కొన్ని 'కుల' కట్టుబాట్లుంటాయి. వాటిని అనుసరింపక పోతే, అనుసరించడం ఇష్టం లేక కోర్టు నాశ్రయిస్తే కోర్టుకూడ, ఆ కట్టుబాటుకే విలువనిస్తుంది తప్ప, దానిని అతిక్రమించే విధంగా తీర్పునివ్వదు. కారణమేమిటి. చట్టాలు, నిబంధనలు, న్యాయసూత్రాలు - ఒకప్పటి ఆచారాలు, వాటి పాటింపు మొదలైన వాటి క్రోడీకరణమే గనుక. అలాంటి క్రోడీకరణలలో ఈ ఇంటి పేరు మారడం, మారక పోవడం అనేది ఎందుకు చోటు చేసుకోలేదు. ఇదొక్కటే అన్నమాటేమి, చాలా చోటు చేసుకోలేదు. అలాంటి వాటిల్లో ఇదొకటి. ఇక ముందు చోటు చేసుకుంటుందేమో. అది ఇప్పటికిప్పుడు చెప్పగలిగింది కాదు. ఏమైనా ఆచారం మాత్రం బలీయమైనది.

ఇక విషయానికి వస్తే, ఎందుకు మారాలి, లేక ఎందుకు మారుతోంది అనే ప్రశ్న ఎవరి నుండి ఉత్పన్నమైంది. విద్యావంతులైన స్త్రీల నుండి, వివాహం తరువాత, వీరికి సంబంధించిన రికార్డులు మార్చుకోవలసి రావడం చేత మాత్రమేనన్నది గుర్తుంచుకోవాలి. - అలా మార్చకపోయినా ఇబ్బంది కలుగని చోట, వివాహితులైన విద్యావంతులైన స్త్రీలు, తమ వివాహత్పూర్వపు ఇంటి పేర్లతోనే కొనసాగుతున్న వారు లేకపోలేదు. అంటే అవసరం కారణమవుతోంది. ఇబ్బంది లేని చోట కూడ మార్చుకోవలసిందేననే నిర్బంధము భర్త నుండి, లేక అత్తవారింటి నుండి ఎదురైతే అది వ్యక్తినిష్టమే తప్ప, 'మారితీరాలి' అన్న చట్టమున్నట్లు లేదు. విద్యావంతురాండ్రు కాని స్త్రీల విషయంలో ఈ సమస్య ఉత్పన్నం కాదు. కారణం లౌకిక వ్యవహారంలో స్త్రీల విషయంలో ఇంటి పేరుతో పని లేదు గనుక, పురుషుల విషయంలో వుందా - అంటే అదీ అనుమానమే. లిఖిత పూర్వకమైన వ్యవహారం లేని చోట ప్రత్యేకంగా ఇంటిపేరు ఉట్టంకించనవసరం లేదు. స్త్రీల విషయంలో కూడ, వారు విద్యావంతులు కాకపోయినా, ఓటర్ల లిస్టులో, ఒకవేళ వ్యష్టిగా జీవిస్తున్న వేళ, రేషనుకార్డు, తపాలాచిరునామా ఇలాంటి విషయాల్లో, ఇంటిపేరు తప్పదు. దీనిని బట్టి లిఖిత వ్యవహారంలో, ఇంటిపేరు అవసరమవుతోంది. అది పురుషుని విషయంలో తప్పనిసరి. కాగా, స్త్రీల విషయంలో కొన్ని అవసరాలను బట్టి, విద్యావంతులైన స్త్రీల విషయంలో మరిన్ని అవసరాలను బట్టి ఇంటిపేరు అవసరమవుతోంది. ఇక మార్పు కన్పిస్తోంది స్రీల విషయంలో మాత్రమే. (స్త్రీలు అంటే ఇకనుండి విద్యావంతులైన వారిని ఉద్దేశించి మాత్రమేనని గ్రహించాలి). పురుషుల విషయంలో మార్పులేదు. ఇలా ఎందుకు జరిగిందనేది ప్రశ్న

మార్పు జరగడమనేది లిఖిత వ్యవహారంలో స్ఫుటంగా కన్పిస్తుంది. వాగ్వ్యవహారంలోనికి వచ్చేటప్పటికి, అలా వుండదు. ఒక వ్యక్తిని గూర్చి (స్త్రీ గాని, పురుషుడు గాని) ఆరా తీసేటపుడు, ఎవరు అనే ప్రశ్నకు ఫలానా వారి అబ్బాయి, లేక అమ్మాయి (వివాహితులు కానపుడు), వివాహిత స్త్రీ అయినపుడు ఫలానా వారి భార్య అని గదా సమాధానం. పాఠశాలలో చేర్చించవలసిన చోట, విధిగా, ఆ వ్యక్తి తండ్రి ఎవరో సూచింపవలసి వుంది. ఈ సూచించడమనే ప్రక్రియ, వివాహం తరువాత మార్చు అనే దానికి కారణమైనది. పురుషుని విషయంలో మార్పులేదు. వివాహిత స్త్రీ విషయంలో పైన సూచించిన సందర్భాలను బట్టి మారుతోంది. దీనిని బట్టి నమోదు అనేది లేకపోతే మార్పు అనేది లేదు. కారణమేమంటే సాధారణ వ్యవహారంలో ఇంటి పేరుతో అందునా - స్త్రీల విషయంలో పనిలేదు గనుక. పురుషుని విషయంలో ఎందుకుంది అంటే, ఆ కుటుంబానికి అతడు వారసుడు గనుక, అతని తండ్రి తరువాత ఆ కుటుంబానికి అతడు యజమాని గనుక. ఆ కుటుంబపు ఆస్తి అతనికి సంక్రమిస్తుంది గనుక, తత్సబంధమైన వ్యవహారాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇంటిపేరు వ్యక్తపరుపవలసి వస్తుంది గనుక. స్త్రీ విషయంలో పై కారణాల ప్రమేయం లేదు గనుక, అది వ్యక్తీకరింపబడే అవకాశముత్పన్నం కాదు. ఉత్పన్నమైన వేళ, ఆమె ఫలానా వారి భార్య అని చెప్పబడుతుంది. ఆ వ్యవహారాలతో ప్రమేయమేర్పడే నాటికి వివాహితురాలు కాకపోతే ఫలానా వారి కుమార్తె అని వ్యవహరింపబడుతుంది. అప్పుడైనా, (ఫలానా వారి కుమార్తె అన్నపుడు) తండ్రి ఇంటి పేరు ఉట్టంకింపబడడం లేదా - అంటే, (వివాహిత అయితే భర్త ఇంటిపేరుతో) ఉట్టంకింపబడవచ్చును . అది లేఖరి విన్యాసమే తప్ప, ఉట్టంకించకపోయినా, చట్టపరమైన ఇబ్బందిలేదు. పురుషుని విషయమైనా (ఫలానా వారి కుమారుడు అని చెప్పేటప్పుడు) అంతే...

అంటే విద్యాసంబంధమైన వ్యవహారాలు, యోగ్యతా పత్రాలపై నమోదు విషయంలో మాత్రమే, ఇంటిపేరు ప్రసక్తి వస్తోందనేది స్పష్టము. ఇది వివాహత్పూర్వం, యువతీ యువకుల విషయంలో సామాన్యం. పై విధమైన వ్యవహారం లేనిచోట్ల ఈ మార్పు అనే ప్రసక్తికి ఆస్కారం లేదు అనే విషయం జ్ఞాపముంచుకోవాలి. అదే సమయంలో చట్టపరమైన ఆంక్షలు కూడ లేవని కూడా గుర్తుంచుకోవాలి. వివాహ కార్యక్రమంలో గూడ గోత్రనామానికే తప్ప, ఇంటి పేరు ప్రసక్తి లేదు సరికదా, ఒకే ఇంటి పేరున్నా (వధూవరులకు) గోత్రభేదమున్నపుడు సంబంధ బంధుత్వానికి అడ్డులేదు. మూడు తరాల నుండి, వధూవరుల కుటుంబాల మధ్య ఏవిధమైన బంధుత్వం లేనపుడు, వారు ఏకగోత్రజు లైనప్పటికి వివాహాలు గావింపవచ్చునని కూడా వెసులుబాటు వుంది. కాబట్టి ప్రాధాన్యం వహిస్తోంది. గోత్ర గృహనామాలు కాదని, జన్యు సంబంధమైన కారణాలేనని బోధపడుతోంది.

అయితే వివాహం తరువాత పురుషుడు, తన తండ్రి ఇంటి పేరుతో అంటే తనదైన 'కుటుంబనామం' తోనే వ్యవహరింపబడుతున్నాడు. కాని స్త్రీల విషయంలో అలా గాక, వివాహం తరువాత, తన తండ్రి కుటుంబనామం నుండి, భర్త కుటుంబనామంలోకి మార్చబడడం జరుగుతుంది. (అది కూడ పైన వివరించిన సమస్యల వల్లనే తప్ప సాధారణ లోక వ్యవహారంలో దాని ప్రసక్తి లేదని, అదికూడ విద్యావంతులైన స్త్రీల విషయంలో మాత్రమేనని గుర్తుంచుకోవాలి). ఇలా ఎందుకు మారాలి అనేది సమస్య. మార్చుకోవడం ఇష్టంలేని వారు, మార్పుతో అవసరం లేదనువారు (యోగ్యతాపత్రాలు మొ॥ వాటి విషయంలో) వివాహం తరువాత కూడ తమ తండ్రుల కుటుంబ నామాలతోనే లౌకిక వ్యవహారాలలో కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, అలాంటి వారి విషయంలో సంఘం నుండి ఎట్టి అభ్యంతరం ఎదురుకాలేదు. నిజానికి ఈ వ్యవహారాల్లో సంఘానికి ప్రమేయమే లేదు. చట్టం కూడా దానికి ఎలాంటి ప్రాధాన్యము ఇవ్వడం లేదు. వివాహస్థితిని నిరూపించడానికి, ఇతర ఆధారాలను పరిగణనలోనికి తీసుకొంటారు తప్ప, ఇంటి పేరు మారిందా లేదా అన్న దానిని పరిగణింపరు. ఇక సమస్య అంతా భర్త నుండి, ఇతర కుటుంబసభ్యుల నుంది వత్తిడి వచ్చినపుడు, అలా మారడం ఆత్మన్యూనతగా భావింపబడుతున్నపుడు మాత్రమే ఇది ప్రసక్తమవుతోంది. ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా, ఇలా జరగవలసిందే నన్నప్రడు మాత్రమే, అలా ఎందుకు జరగాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందులో ఆత్మ గౌరవమనే విషయం చోటుచేసుకుంటే, అది సమస్యగా పరిణమిస్తుంది. అలా లేనపుడు ఆ సమస్యకు ఉనికియే లేదు.

మారి తీరాలి అంటున్నవారు కూడ, అది ఆచారం గనుక, అలా మారకపోతే, తమకు, తమ కుటుంబ ప్రతిపత్తికి, గౌరవానికి ఏదో భంగం కలుగుతుందనే అపోహతోనే తప్ప, ఎందుకు మారాలో స్పష్టమైన అవగాహన లేదు. ('ఎందుకు మారాలో' అనే మాట వలన, ఈ రచయితకు అలా మారితీరాలి అనే అభిప్రాయం వుందని భావింపవలదు. విషయ వివరణ కొరకు మాత్రమే ఆ పదం ఉపయోగింప వలసి వచ్చింది). అలాగే, పురుషుని విషయంలో మార్పులేనపుడు స్త్రీ విషయంలో మాత్రమే ఈ మార్పు ఎందుకుండాలి అనే వారిలో కూడ, పంతమే కనిపిస్తుంది తప్ప, ఆచారమే అయినా, అది ఎందుకు అలా ఏర్పడిందోననే దానిపై స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కనుపింవదు. ఇలా అనడానికి కారణాలున్నాయి. అవేమిటో ముందు చూసి, తరువాత ప్రధాన విషయానికి వద్దాము.

విద్యావంతురాండ్రు కొందరైనా, తమపేరు తరువాత, భర్తల ఇంటి పేర్లు చేర్చుకుంటున్న వారు గలరనేది నిర్వివాదం. ఇలాంటి వారిలో ఇంటి పేరు ఎందుకు మారాలి అనేవారు కూడా ఉండి ఉండవచ్చు. అలాగే మార్చుకున్నవారు కూడా ఉండి వుండవచ్చు. వారు పై రెంటిలో ఏ వర్గానికి చెందినా, కావలసిన విషయం, వివాహితులు తమ భర్తల పేర్లు, తమ పేర్లకు ఎందుకు జోడిస్తున్నారనేది. మీదు మిక్కిలి అది నాగరకతగాను, సంస్కారానికి ప్రతీకగాను భావింపబడుతోంది. (అందరి విషయంగాదు. అలా భావించే వారి విషయం మాట) ఇది మన తెలుగు సమాజంలో స్థూలంగా స్వాతంత్ర్యానంతరం ప్రారంభమైంది! అక్షరాస్యత పెరగడం, ఇతర ప్రాంతాలతో, అక్కడి ఆచార వ్యవహారాలతో సంసర్గం ఏర్పడడం కారణంగా ఇది ప్రారంభమైంది. ముఖ్యంగా రచయిత్రులు దీనిని పాటిస్తున్నట్లు కనుపిస్తుంది. పై కారణాలు దీనికి మూలం. కాగా ఇది కేవలం అవగాహనా లోపం వలన జనించిన అనుకరణ మీది మోజుతో చోటు చేసుకుంది. దీనికి గల కారణాలు. పాశ్చాత్య ప్రపంచం లోను, ఉత్తర భారతదేశంలోను, దక్షిణాదిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోను, మన అనుసరణకు భిన్నంగా, కుటుంబనామాలు వ్యక్తుల పేర్ల చివర వుంటాయి. ఉదా : విలియం వర్డ్స్‌ వర్త్‌, జాన్‌ ఫిట్జరాల్డ్‌ కెనడి, మొరార్జీదేశాయి, వల్లభభాయిపటేల్, సుబ్రహ్మణ్యం పిళ్ళ, శంకరన్‌ నంబూద్రి, వీనిలో వర్డ్స్‌ వర్త్‌, కెనడి, దేశాయి, పటేల్‌, పిళ్ళ, నంబూద్రి అనేవి ఆయా వ్యక్తుల కుటుంబ నామాలు. కాని వాటిని వ్యక్తి నామాల్లోని భాగంగా పరిగణించి, ఇక్కడ తమ భర్తల పేర్లు చేర్చుకోవడం జరిగింది. అన్ని సందర్భాల్లోను ఇలాగే జరగకపోయినా, ఈ భావనే అలా చేయడానికి ప్రోత్సహించింది. అలా తమ భర్తలపేర్లను తమ పేర్ల చివర చేర్చుకున్న స్రీలు, తమ ఇంటిపేర్లను అలాగే ఉంచుకున్నారంటే దీనిని అవగాహనాలోపంగా తప్ప ఎలా పరిగణించాలి! వాదానికి అలా కాదని చెప్పవచ్చు. కాని సమమైన ఆలోచనలతో విచారిస్తే సత్యం బోధపడకపోదు.

ఇది ఇలాంటిదైతే, కొందరు, భర్తల ఇంటి పేరు లోనికి ఎందుకు మారాలి అన్నవారు, ఒకటి రెండు సూచనలు గావించారు. అది 1) తమ వివాహత్పూర్వపు ఇంటి పేర్లతోనే - అంటే, పుట్టింటి కుటుంబనామం తోనే వ్యవహరించబడాలి అనేది ఒకటి. మరి ఆ పుట్టింటి ఇంటి పేరు కూడ తండ్రిదే గదా? తండ్రి కూడా పురుషుడే గదా! ఇంటి పేరు మారడం, పురుషాహంకార సమాజానికి నిదర్శనము అన్నపుడు, మరో పద్ధతిలోనైనా దానినే పాటించడం ఎలా సబబు అవుతుందో వివేచనకు అందిరాదు. రెండవ సూచన ఏమంటే, తమ సంతతికి, తమ (వివాహితలు) వివాహత్పూర్వపు ఇంటి పేరు పెట్టాలనడం. ఇందులో గావించిన మరో సూచన ఏమంటే, సంతతిలోని బాలురకు తండ్రి ఇంటి పేరు. బాలికకు తల్లి ఇంటిపేరు ఉండాలనడం. వీటి వలన కాలాంతరంలో ఉత్పన్నమయ్యేది. గందరగోళమే తప్ప, పురుషాహంకారాన్ని తప్పించడమెలా అవుతుందో తెలియరాదు. నిజానికి, ఈ ఎందుకు మారాలి అన్న సమస్య పాశ్చాత్య ప్రపంచం నుండి ముఖ్యంగా అమెరికా నుండి దిగుమతి అయింది. అచ్చటి స్త్రీవాదులు పరిష్కారం కొరకు న్యాయస్థానాలను ఆశ్రయింపగా వచ్చిన తీర్పుల విషయం, ఈ వ్యాస ప్రారంభంలో పేర్కొనడం జరిగింది. అది, మారడం, మార్చుకోకపోవడం, అనేది అలా కోర్టు నాశ్రయించిన వారి ఇష్టాయిష్టాలకు వదిలివేయడం. ఆస్తి సంక్రమణం లాంటి విషయాల్లో మారి వుంటే పరిష్కారం సులభమని చెప్పడం జరిగింది. అంతేగాక అది. విశ్వవ్యాప్తమైన ఆచారమని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆచారానికి మూలమేమిటో చెప్పబడలేదు. ఈ విషయాలన్నీ అమెరికాలోని న్యూయార్కు నుండి వెలువడే 'నేము' అనే పత్రిక నుండి గ్రహించడం జరిగింది. ఇలా వుండగా ఈ మధ్యకాలంలో 'నడుస్తున్న చరిత్ర' అనే పత్రికలో, ఎందుకు మారాలి అనే విషయంపై ఒక వ్యాసం వెలువడగా, దానిపై ఇరువురు పాఠకురాండ్రు, ఇలాంటి సమస్యలను అనవసరంగా రేకెత్తిస్తున్నారని, అలా మార్చుకోకపోవడం ఇష్టంలేని వారు అలాగే కొనసాగవచ్చని, ఇతరులపై వారి అభిప్రాయాలను ప్రసరింప జేయడం అనవసరమని, ఆ వ్యాసకర్త, తమ నిజ జీవితంలో దానిని ఎందుకు ఆచరణలో పెట్టడం లేదని వ్రాశారు (కారణం ఆ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ వివాహిత. వారు తమ భర్త ఇంటి పేరుతోనే కొనసాగుతున్నారు) అంతేగాక ఇది ఒక వికారపు ఆలోచన, వ్యర్థ చర్చ తప్ప మరొకటి కాదని కూడ వ్రాశారు. (చూడు : నడుస్తున్న చరిత్ర, జనవరి, ఫిబ్రవరి 2001) అంతేగాక, ఈ మారడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నపుడు, దాని వలన ఇబ్బంది లేనపుడు, ఆ ఆనవాయితీని కొనసాగిస్తే తప్పు ఏమిటి అని వ్రాశారు. దీనిని బట్టి ఈ సమస్య పట్ల వివాహిత స్త్రీలలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తుంది. (పై ప్రశ్నలకు ఆ వ్యాస రచయిత్రి సమాధానం ఇవ్వలేదు).

ఇక అసలు విషయానికి వద్దాము. మారడం అనేది ఆచారం. ఈ ఆచారం ఎందుకు ఏర్పడింది అనేది ప్రశ్న. నిజానికి మారడం అనేది లేదు. అంటే వివాహత్పూర్వం స్త్రీకి కుటుంబనామం లేదు. వివాహం తరువాతనే ఆమె ఇంటిపేరు స్థిరీకరింపబడుతోంది. అది భర్త ఇంటి పేరుతో! అయితే వివాహత్పూర్వం పురుషునికి కూడ కుటుంబనామం లేదు. మొదలు వివాహ విషయంలో దీని ప్రసక్తిలేదు. వివాహం తరువాత, వెంటనే కాక పోయినా, కుటుంబాలు విడిపోతున్నాయి. అలా విడిపోయినపుడు, వ్యవహార సరళి నిమిత్తం, వివాహితుడైన వానికి అతని కుటుంబ నామం సంక్రమిస్తోంది. తత్పూర్వం, రికార్డులతో పని ఏర్పడినప్పుడు తప్ప, ఇతరత్రా అతడు ఫలానా వారి కుమారుడు అని, ఆమె ఫలానా వారి కుమార్తె అని మాత్రమే వాస్తవమైన వ్యవహార సరళి అని ముందు చెప్పడం జరిగింది. వివాహానంతరం వురుషుడు కుటుంబీకుడు అవుతున్నాడు. అతని భార్య కుటుంబిని అవుతోంది. ఇరువురు, వారి సంతతి అంతా కుటుంబ మవుతోంది. అలా ఆ కుటుంబాని కంతకు కుటుంబనామం స్థిరీకరింప బడుతోంది. ఈ స్థిరీకరణంలో పురుషుని కుటుంబనామం అలాగే వుండగా, స్త్రీకి అప్పటికి గల - అంటే ఆమె తండ్రి కుటుంబనామం, మారుతోంది గదా అనబోతారు. ఇదే గదా అసలు సమస్య! పై వాక్యాల్లో దీనికి సమాధానం వుంది. అయినా మరి కొంత వివరంగా చూద్దాము. వివాహితకు తన కుటుంబం ఏది! తండ్రి కుటుంబమా! లేక తాను, తన భర్త, తన సంతానంతో కూడిన కుటుంబమా! మారడం దోషమైతే, తండ్రి కుటుంబ నామంతో కొనసాగడం మరింత దోషం కాదా! మరి ఆమె సోదరుల కుటుంబనామాలు ఎలా ఉండాలి. ఆమెది, ఆమె సోదరులది ఒకటే కుటుంబనామమైతే, సమమైన గుర్తింపు కొరకు ఏర్పడిన వివక్షకు స్థితి ఏమిటి. ఆమె వల్లనే గదా పురుషుడు కుటుంబీకుడు అవుతోంది. ఆమె కుటుంబిని అవుతోంది. కనుక దీనిలో ఇంటిపేరు మారడం అనే సాధారణ వ్యవహారం గాక, సమాజ మనుగడ అందులోని కుటుంబ వ్యవస్థ అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. కనుక అది కేవలం ఇంటిపేరు గాదు. కుటుంబ నామం. ఇది పైకి కనుపించేటంత సాధారణ వ్యవహారం గాదు. కనుకనే ఇది విశ్వవ్యాప్తమైన ఆచారం.

ఇప్పుడు ఈ ఆచారానికి మూలమేమిటో చూద్దాము. పెళ్లివలన గదా, ఈ సమస్య ఉత్పన్నమైనది! అది లేకపోతే ఈ సమస్యే వుండదు. కాని అపుడు సంతతిని ఎలా గుర్తించాలో తెలియదు. అది అలా వుంచినా, పెళ్లి లేని సమాజం స్వీడన్లో అమల్లోనికి వచ్చిందని, అది విఫలమయిందని ఎవరో చెప్పగా తెలిసింది. అయినా ఇప్పుడు దానితో పనిలేదు. మన సమస్య ఇంకా అంతవరకు ఎదగలేదు. పెళ్ళి అంటే వివాహమని అర్థం - అని అనుకుంటారు. నిజానికి కాదు. పెళ్లి అంటే వధువు అని మాత్రమే. మనం పెళ్ళికూతురని ఎవరిని సంభావిస్తున్నామో ఆమె పెళ్లి. అంతే! వివరాలు కావలసినవారు, దీనిని పరిశీలించండి. బాలిక, కన్య, వధువు, భార్య - ఇవి సంస్కృత పదాలు. వీటికి సమమైన పదాలు ఆడపిల్ల, పడచు, పెళ్లి, మగువ (మగనాలునే మగువ అనాలి) అంటే వధువు అనే సంస్కృత పదానికి సమానమైన తెలుగుపదం పెళ్లి, ఈ భాషాచర్చ ఇలా వదలి, వధువు అని ఎప్పుడు అంటున్నామో తెలుసుకుందాము. వివాహం నిశ్చయమైనపుడు, కన్య, వధువు అవుతుంది. అంటే ఏమిటి. ఫలానా వరునికి ఈమె వధువు అని నిశ్చయింపబడిందన్న మాట. దీనికి ఒక కార్యక్రమం వుంది. అది లగ్నాలు పెట్టుకోవడం. అప్పుడు జరుగుతోందేమిటి.

బ్రాహ్మణుల్లోనయితే గోత్రచ్ఛేదనం. ఇతరుల్లో నయితే వరుని ఇంటివారు, ఉద్దిష్ట కన్యను, తమ అమ్మాయి అనిపించుకోవడం. పసుపు కుంకుమలు ఇచ్చి, తాము తెచ్చిన చీరను ఆమెతో ధరింపజేయడం. గోత్రచ్ఛేదనం ఎవరి గోత్రం నుండి. ఆమె తండ్రి గోత్రం నుండి. మారడం,

...తరువాయి 48 పుటలో

...41వ పుట తరువాయి

భర్త గోత్రం లోనికి. అంటే ఆ క్షణంలోనే ఆమె వరుని కుటుంబంలో చేరిపోయింది. ప నిజానికి మనం దేనిని పెళ్లి అంటున్నామో (వ్యవహారంలో) అది జరిగిపోయింది. తరువాత పందిట్లో జరుగుతోంది, అలా జరిగిపోయిన దానిని, విస్తృతమైన పరిధిలో అందరికి తెలియజేయడం, వేడుకగా నిర్వహించడం. దానికి మరింత పరివ్యాప్తత ఊరేగింపులో ఉంది. మాంగల్యధారణ, సప్తపది - ఇవన్నీ దానికి మరింత ప్రమాణీకరణాన్ని మందిలో అనుసంధించడం. నిజానికి కొన్ని సందర్భాల్లో పై కార్యక్రమానికి, అనంతరం బంధుమిత్రుల సమక్షంలో జరిగే తంతుకు మధ్య, వరుడు గతించిన సందర్భాల్లో అతనికి ఉద్దిష్టమైన వధువు వైధవ్యాన్ని పాటించిన సంఘటనలున్నాయి. ఇది అభిలషణీయమా అనేది కాదు ఇక్కడి ప్రశ్న గోత్ర చ్చేదనానికి ఎంత ప్రాముఖ్యత వుందో, మన పూర్వులు దానిని ఎలా పరిగణించారో తెలియజెప్పడం మాత్రం వరకే దీని ప్రసక్తి.

కనుక, మార్పు జరుగుతోందనే దానికి (ఇంటి పేరుకు) స్థితి లేదని, మారుతోంది గోత్రమని, తత్ఫలితంగా స్త్రీకి కుటుంబనామం స్థిరపడుతోందని తెలుస్తుంది. దంపతులు, వారి సంతతి - ఇదీ కుటుంబం. సమమైన గుర్తింపు కొరకు వివక్షింపబడడం తప్పదు. వివాహం తరువాత కూడ స్త్రీ తండ్రి ఇంటి పేరుతో కొనసాగితే - అది ఆమె ఇష్టమనిపిస్తుంది. కాని కుటుంబమనే విషయంగా, ఆ మార్పు, ఆమె సోదరులకు కూడా అయిష్టం కలిగింపవచ్చు. అందులో కొన్ని న్యాయపరమైన చిక్కులుండే అవకాశం కూడా వుంది.

అన్నింటికంటే ప్రధానమైనది, స్త్రీకి తనదైన కుటుంబం అవసరమా కాదా అనేది. ఆమె కుటుంబిని. ఆమె వల్లనే కుటుంబమనే దానికి అస్థిత్వముంది. ఆమెయే గృహనీతి విద్యకు గృహము. విమలచారిత్ర శిక్షకు ఆమెయే ఆచార్య. ఆమెయే అన్వయస్థితికి మూలము. ఇదీ గృహిణి విషయమై మహాభారత ప్రతిపాదనము. తొందరపాటు, ఏమరపాటు లేక, విజ్ఞులు ఆలోచింతురుగాక! ఫలితార్థము వివాహం తరువాత స్త్రీ ఇంటి పేరు మారడం లేదు. స్థిరీకరింపబడుతోంది.


కీ.శే. యార్లగడ్డ బాలగంగాధరరావు - ప్రఖ్యాత తెలుగు ఆచార్యులు. పరిశోధకులు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా అనేకమంది శిష్యులకు మార్గదర్శనం చేసినవారు. రచయిత. ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలపై 'నడుస్తున్న చరిత్ర' (ఈ పత్రిక 'అమ్మనుడి' కి తొలిపేరు)లో 2001లో కొంత చర్చ జరిగింది. తర్వాత 'నామ విజ్ఞానం' పేరుతో 2002లో, 2015లో వెలువడిన పుస్తకంలో - వెలువడిన ఈ వ్యాసంలో ఆ ప్రస్తావన ఉంది. సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వ్యాసాన్ని ఇక్కడ పునర్ముద్రిస్తున్నాము.

బాలగంగాధరరావుగారికి స్మృత్యంజలి ఘటిస్తూ - సంపాదకుడు