అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/అమ్మమాట

“అమ్మా! ఆకలేస్తోంది... అన్నం పెట్టు...హడావిడిగా ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ అమ్మనడిగాడు. అప్పుడు తనకి అయిదేళ్లుంటాయి.

“ఆకలేసిన తర్వాత అమ్మ, ఇల్లూ గుర్తుకు వచ్చాయా నాన్నా!” కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ లాలిస్తూ అడిగింది అమ్మ.

అమ్మ మాటకి ఏమని జవాబు చెప్పాలో అర్థంకాలేదు కృష్ణకి. “అది కాదమ్మా... మన వాకిట్లోనే ఆడుకుంటున్నాం నేను, మన పక్కింటి రాజు...” తడబడ్డాడతను.

అమ్మమాటతో “ఇంకెన్నాళ్ళులే నీ ఆటలు! వచ్చే నెలలో స్కూల్‌కి పంపిస్తాంగా!" నవ్వుతూ అమ్మ మామూలుగా అన్నా తన మనసు చివుక్కుమంది.

వచ్చే నెల నుంచి తనిలా ఆడుకోలేడా?

స్కూల్లో చదువు చెప్పే మాస్టారు చదువుకోకపోతే కోప్పడతారట?

స్కూల్‌లో ఆయన పక్క పిల్లలతో కూడా మాట్లాడుకోనివ్వరట! ఎప్పుడు 'ఇంకా చదువు' అంటూ కోప్పడుతూనే ఉంటారట. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆడుకోవడానికి వీల్లేకుండా బోల్డంత హోమ్‌వర్క్ ఇస్తారట!

స్నేహితుడు రాజు వాళ్ళన్నయ్య మురళి చెప్పిన మాటలు చటుక్కున గుర్తుకు వచ్చాయి తనకి.

“ఏమిటాలోచిస్తున్నావ్ కంచంలో అన్నం పెట్టాను. కాళ్ళు, చేతులు కడుక్కుని రా...” అమ్మ వంటింట్లోంచి కేక వేయడంతో ఆలోచనల్ని తాత్కాలికంగా విరమించుకుని పెరట్లోకి పరుగెత్తాడు తను -

మొదటి రోజు స్కూల్ కాగానే “మమ్మీ” అంటూ తను బాగ్‌తో పరుగెత్తుకొచ్చాడు ఆనందంగా.

అమ్మ జవాబియ్యలేదు. తన ఆనందం మీద తల్లి నీళ్ళు పోసినట్లు జావగారిపోయాడు!

“మమ్మీ!” తేరుకుని మళ్ళీ ఆనందాన్ని పుంజుకుంటూ అమ్మ దగ్గరకు చేరాడు తను.

అమ్మ.... అమ్మ మాట... అమ్మ భాష... అమ్మ దేశం... అన్నింటికి దూరంగా తనింకెన్నాళ్ళు ఉంటాడు? తిరిగి మాతృదేశం వెళ్ళి పోవాలి. మాతృభాషలో మాట్లాడుకోవాలి. తననింతటివాణ్ణి చేసిన 'అమ్మ రుణం' తీర్చుకోవాలి. నేను పెరిగినట్లే నా పిల్లలూ అమ్మ మాటతోనే పెరగాలి. మమ్మీ డాడీల సంస్కృతితో కాదు! కానీ అతడిని అమ్మ ఎప్పట్లా దగ్గరకి తీసుకోకపోవడం బాధగా అనిపించింది.

“ఎందుకు మమ్మీ అలా ఉన్నావు కోపంగా” తను అమ్మ కొంగుపట్టుకుంటూ అడిగాడు.

“మమ్మీ అంటే ఏమిటో తెలుసా? అమ్మ శవపేటిక” అమ్మ గొంతులో కోపం!

అమ్మమాట, పెద్దకర్రతో వీపుమీద గట్టిగా కొట్టినట్లనిపించింది కృష్ణకి.

“నాకు అర్థం తెలీదు మమ్మీ... తెలీదు అమ్మా! ఆ స్కూల్లో అందరూ అమ్మని మమ్మీ అంటుంటే ఇంటికి వచ్చిన నేనూ అలా పిలిచాను. అంతే"

అమ్మ కోపం పోయింది!

“మళ్ళీ ఎప్పుడూ అలా పిలవకుండా ఉంటావని కోపం తెచ్చుకున్నాను. అంతే!” నవ్వుతూ తనను ఎత్తుకుంది అమ్మ.

కాళ్ళు, చేతులతోబాటు వళ్లంతా తడిగుడ్డతో తుడిచి మరో చొక్కా లాగూ వేసింది అమ్మ.

ఇంత ప్రేమగా చూసే అమ్మకి తనలా పిలిచేసరికి ఎంతకోపం వచ్చింది! అమ్మకి కోపం వస్తే తను తట్టుకోగలడా? భయంతో అమ్మని గట్టిగా కౌగిలించుకున్నాడు తను.

“అదేమిటిరా... అలా చేస్తున్నావ్‌” అమ్మ నవ్వింది.

“అమ్మకి కోపం వస్తే భయం వేయదా?” గోముగా అడిగాడు తను --

మరోసారి “మరెవరైనా సాయం చేస్తే 'థాంక్స్‌' అనాలని, ఎదుటివాళ్ళకి బాధకలిస్తే 'సారీ' అనాలని స్కూళ్లో మాష్టారు చెప్పారమ్మా...” అన్నాడు తను.

“అది ఆంగ్లేయుల సంస్కృతి. మన సంస్కృతి పొరబాటున కూడా ఎవరికీ బాధ కలిగించవద్దంటుంది! మంచిచేస్తే కృతజ్ఞతలు చెప్పమంటూ, తప్పు చేస్తే క్షమాపణలు చెప్పమంటుంది. కొత్త విషయాలు తెలుసుకో... మన పద్ధతుల్ని మరచిపోకు!” అమ్మ మాటలు అర్ధమయ్యీ, అర్థం కానట్లున్నాయి తనకి.

“స్కూల్‌ నుంచి రాగానే ఆ యూని ఫారమ్‌ విప్పేసి, మనింట్లో ఉన్న మరో జత దుస్తుల్ని వేసుకున్నావా? లేదా? అలాగే అక్కడి మాటల్ని ఇక్కడ హోమ్‌వర్క్‌చేసుకోవడం వరకే పరిమితం చేయ్‌! ఆ ఆంగ్లం స్కూల్లోనే... ఇంటిదగ్గర అమ్మ భాష... అమ్మమాట! మీ మాస్టారు నీకు బతుకు విద్యనేర్పితే, నేను మనగురించి, మన అలవాట్లు, ప్రవర్తన నేర్పుతాను అంతే!” ఖచ్చితంగా అంది అమ్మ,

అమ్మకి మళ్ళీ అలా కోపం తెప్పించ కూడదనుకున్నాడు తను. చిన్న వయసులో జరిగినా ఆ సంఘటన తన మనసులో అలాగే ముద్రించుకుపోయింది.

ఇంకోసారి చేతిలోంచి సన్నని ముక్కుతో ఉన్న పెన్సిల్‌ జారి కిందపడింది.

అది గమనించని అతను లేచి చటుక్కున దానిమీద కాలేశాడు.

ఒక్కసారి నోట్లోంచి తెలీకుండానే వెలువడింది “అమ్మా...” అన్నమాట.

“చూసావా? ఆకలి వేస్తేనేకాదు నొప్పి కలిగినా కూడా గుర్తుకొచ్చేది అమ్మ భాషలోని ఆ మాటే!” అమ్మ నవ్వింది. అమ్మకోప్పడక నవ్వినా అమ్మమాట మనసులో నాటుకు పోయింది!

అమ్మమాటంతే! అంతనిక్కచ్చిగా ఉంటుంది!

రాత్రి చాలాసేవు చదువుకుంటూ కూర్చుని, రాసుకుంటూ - కుర్చీలోంచి లేచే సరికి తెలీకుండానే వళ్ళు విరుచుకుంటూ “అమ్మా...” అన్నాడు కాస్త గట్టిగానే తను.

“ఏంట్రా నాన్నా...” గబగబా తన గదిలోకి వచ్చి అడిగింది అమ్మ.

“అబ్బే.... నిన్ను పిలువలేదన్మూ... వళ్ళు విరుచుకుంటుంటే నాకు తెలికుండానే అమ్మనే మాట అలా వచ్చేసింది!”

అతని మాటలకి అమ్మ నవ్వి లోపలకు వెళ్ళిపోయింది. ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు! ఆమె చెప్పకపోయినా తనకి అర్ధమయ్యాయి.

గత జ్ఞాపకాలన్నీ ఒక దాని తర్వాత మరోటి గుర్తుకొచ్చాయ్‌ కృష్ణకి. అమ్మ గుర్తు కొచ్చింది. అమ్మ మాట గర్హుకొచ్చింది. అసలు తను వాటిని మరచిపోతేగా - గుర్తుకు వచ్చాయనుకోవడానికి!

అమ్మ తనని విడిచి సుదూరలోకానికి వెళ్ళిపోయినా అమ్మ రూపం, అమ్మ మాట - అలాగే శాశ్వతంగా తన మనసులో ఉండి నడిపిస్తూనే ఉంది. మంచి భవిష్యత్తుకోసమనే భ్రమలో తను అమ్మ దేశాన్ని విడిచి దూరంగా. వచ్చేసినా అమ్మకి తను దూరమెలా కాగలడు?

అమ్మ... అమ్మ మాట... అమ్మ భాష... అమ్మ దేశం...అన్నింటికి దూరంగా తనింకెన్నాళ్ళు ఉంటాడు? తిరిగి మాతృదేశం వెళ్ళి పోవాలి. మాతృభాషలో మాట్లాడుకోవాలి. తననింతటివాణ్ణిచేసిన 'అమ్మ రుణం' తీర్చుకోవాలి. నేను పెరిగినట్లే నా పిల్లలూ అమ్మ మాటతోనే పెరగాలి. మమ్మీ డాడీల సంస్కృతితో కాదు!

ఓ స్థిరనిశ్చయానికొచ్చి భార్యతో చెప్పాడు కృష్ణ

“తనకి గర్భం వచ్చిందని చెప్పినప్పటి నుంచి భర్త ఏవేవో ఆలోచనలతో సతమతమవుతున్నా'డని గుర్తించిన భార్య ఓ చిరునవ్వుతో సమాధానమిచ్చింది.

ఆ నవ్వులో అతనికి అమ్మ నవ్వు గుర్తుకు వచ్చింది. తనకి పుట్టబోయే కొడుకుకి 'అమ్మ మాటే కావాలి. మమ్మీ ఆలన అక్కర్లేదు! ఆ మాటే భార్యతో ఆవేశంగా అన్నాడు కృష్ణ

ఆమె నవ్వింది.

ఆ నవ్వులో అమ్మమాట... అమ్మ మళ్లీ మళ్ళీ గుర్తుకు వచ్చింది కృష్ణకి.


35వ పుట తరువాయి... వడ్లమూడి గోపాలకృష్ణయ్య

పీఠికల్లో ఆయన పాండిత్యమూ దర్శనమిచ్చింది. కేంద్ర విదేశాంగ శాఖామంత్రిగా శ్రీ పి.వి. నరసింహారావు రాసిన అందులో ఓ పీఠికను చూడమన్నారు. చూశాను, చదివాను. ఇది పి. వి.గారు రాశారా ఆయనకు తీరిక లేక మీరు రాశారా అన్నాను ప్రేమ పూరితమైన చనువుతో. ఏం ఎందుకలా అనుకొంటున్నావు అన్నారు. ఏం లేదులేండి ఆ పీఠికలో మీ గురించి రాసినప్పుడు మీ బిరుదులన్నీ ఇచ్చారు, అన్నాను. భలేవాడివే అని నవ్వుకున్నారు. అర్ధవంతమైన నవ్వే అది.

పొత్తప్తు గుడుల్లో తి. తి. దే. వేసిన ఆ పెద్ద సంపుటాల్ని చూస్తున్నప్పుడు గౌతమిలో దానికి చెందిన రాత ప్రతుల దుమ్ము దులపడం, భద్రపరచడంలో మా సిబ్బంది పాత్ర - ముద్రిత గ్రంథాల్లోని పద్యాలేకాక - అచ్చుకృషి నేపథ్యాలూ కళ్లముందు కదలాడడం-ఎప్పటికీ తీపి గురుతులే. పెద్దవారితో చిన్నవాడిగా నా తీపి గురుతులు నాకు సంజీవకారణులే! జీవన రసాయనాలే.