అభినయదర్పణము/తృతీయాశ్వాసము

అభినయదర్పణము

తృతీయాశ్వాసము

సంయుతము

క.

శ్రీవల్లభ! నాపాలిటి
దైవము నీవే యటంచు స్థిరముగ మదిలో
నేవేళను భజియించెదఁ
గావుము! నను వరశుభాంగ! కస్తురిరంగా!

1


క.

చెలువుగ సంయుతహస్తం
బలరఁగ మఱి లక్ష్యలక్షణంబుల మిగులం
దెలియఁగ నిదె వివరించెదఁ
గలుషావహ! దనుజభంగ! కస్తురిరంగా!

2


వ.

ఇట్లు మఱియును, నంజలిహస్తంబును, బుష్పపుటహస్తంబును, జతురస్రకంబును, స్వస్తికంబును, గర్తరీస్వస్తికంబును, డోలహస్తంబును, గపోతహస్తంబును,గర్కటహస్తంబును, నవహిత్థంబును, నుత్థానవందితంబులును, గలశహస్తంబును, నుత్సంగశివలింగహస్తంబులును, నాగబంధహస్తంబును, శకటహస్తంబును, శంఖచక్రహస్తంబులును, సంపుటహస్తంబును, బాశకీలకహస్తంబులును, మత్స్యకూర్మవరాహహస్తంబులును, సింహహస్తంబును, గరుడహస్తంబును, ఖట్వాభేరుండహస్తంబులును, నీ సప్తవింశతియు సంయుతాఖ్యహస్తంబులై పరఁగుచుండు, నంత.

3

అంజలీహస్తలక్షణము: వినియోగము

క.

రెండుపతాకంబులు మఱి
దండిగఁ గరతలముఁ జేర్చి దండమువెట్టన్
మెండుగ వందనమున కా
ఖండలనుత! యంజ లిదియె గస్తురిరంగా!

4

[1]పుష్పపుటహస్తలక్షణము

క.

మఱి సర్పశీర్షహస్తము
వెరవుగఁ గరయుగముఁ జేరి వెలిగా మిగులన్
ఉరమున కెదురుగఁ బట్టిన
గరిమను నిది పుష్పపుటము గస్తురిరంగా!

5

పుష్పపుటహస్తవినియోగము

క.

భానుని కర్ఘ్యము లియ్యను
బూనికగా మంత్రపుష్పపుష్పాంజలులన్
మానుగ నీరాంజనమునఁ
గానుకకును బుష్పపుటమె గస్తురిరంగా!

6

[2]చతురస్రకహస్తవినియోగము

క.

తురగము నెక్కినవానికి
మురహరి! పట్టాభిషేకమునకును మిగులన్
మఱి ముఖచామరమునకును
గరిమను జతురస్రకంబె కస్తురిరంగా!

7

స్వస్తికహస్తలక్షణము: వినియోగము

క.

పరఁగఁ బతాకంబుల నిరు
కరములు నదె చేర్చి నోరు గట్టిగ మూయన్
నిరతము స్వస్తికహస్తము
గరిమను వినయంబునకును గస్తురిరంగా!

8

కర్తరీస్వస్తికహస్తలక్షణము

చ.

సరగను గర్తరీముఖము సారెకు రెండుకరంబులందునన్
మఱి మణిబంధమందు నదె మాటికి మన్ననతోడఁ జేర్చి తా
విరళముగాను బట్ట నది వేమఱు గర్తరిస్వస్తికం బనన్
మురహరి! ధాత్రిలో వెలయు, మోహన! కస్తురిరంగనాయకా!

9

వినియోగము

గీ.

పక్షులకుఁ దారలకు మఱి వృక్షములకు
మొనసి పర్వతములకు సమూహములకు
సారె కిటు సెల్లుఁ గర్తరీస్వస్తికంబు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

10

డోలాహస్తలక్షణము[3]

గీ.

తొడరి సపతాకహస్తంబు నడుమునందు
రెండుకరములఁ బట్టిన మెండుగాను
డోలహస్తం బనంబడు మేలు దనర
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

11

వినియోగము

క.

అల [4]పేరణికిని గడుసై
మెలఁగిననాట్యంబునకును మేదినిలోనం
జెలఁగును డోలాహస్తము
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

12

కపోతహస్తలక్షణము

గీ.

చేతు లటు కట్టుకొనను గపోత మౌను
సరగ భక్తిని గేశవు సన్నుతింపఁ
బొంకముగఁ జెల్లు మఱియు గపోత మిపుడు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

13

కర్కటహస్తలక్షణము

గీ.

వెలయఁగను రెండుకరములవ్రేళ్ళు గ్రుచ్చి
యెదురుకొన సూపి ఱొమ్మున కెగయఁబట్టఁ
గర్కటహస్త మగుచును ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

14

వినియోగము

గీ.

మొనసి చూడంగ మఱియు సమూహమునకుఁ
గలుఁగుచీకటికి నిల నింక గృహమునకు
ధరను గర్కటహస్తంబు దనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

15

అవహిత్థహస్తలక్షణము

క.

మఱి పద్మకోశహస్తము
నిరువుగఁ గరయుగమునందు నెదురుగఁ బట్టం
బరువిడి నవహిత్థం బగుఁ
గరివరదా! దనుజభంగ! కస్తురిరంగా!

16

వినియోగము

క.

ఎలమిని శృంగారమునకు
నెలఁతలకుచములకు మిగులనీటుకు వగవన్
అల యవహిత్థము సెల్లును
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

17

ఉత్థానవంచితహస్తలక్షణము: వినియోగము

గీ.

పొదలఁ ద్రిపతాకహస్తంబు భుజమునందు
రెండుకరములుఁ బట్టిన మెండుగాను
నదియె యుత్థానవంచిత మగును [5]హరికి
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

18

కలశహస్తలక్షణము

క.

విను మర్ధచంద్రహస్తము
నిననుత! కరయుగమునందు నెదురెదురుగనుం
గొనవ్రేళ్ళు వంచిపట్టిన
ఘనకలశకరంబు నదియె గస్తురిరంగా!

19

వినియోగము

చ.

చెలువుగఁ బూర్ణకుంభమును శ్రీధర! యింకను నారికేళముం
బలుమఱు గొప్పగుండ్లనును బాగుగ గుమ్మడికాయఁ జూపనున్
ఎలమిని గుక్షికిన్ మిగుల నింపుగ నీకలశంపుహస్తమే
చెలఁగును వాసుదేవ! భవసేవిత! కస్తురిరంగనాయకా!

20

ఉత్సంగహస్తలక్షణము

గీ.

మొనసి మృగశీర్షహస్తముల్ ముందు వెనుకఁ
బరఁగ మణిబంధములఁ జేర్చి పట్టియున్న
నొనర నుత్సంగహస్త మై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

21

వినియోగము

గీ.

ఎనసి పితృవందనమునకు నింపు మీఱఁ
సరగ నాలింగనమునకు సన్నుతాంగ!
చెల్లు నుత్సంగహస్తంబు చెన్ను మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

22

శివలింగహస్తలక్షణము: వినియోగము

చ.

చెలువుగ దక్షిణంబయినచేతను నాశిఖరంబుఁ బట్టియుం
బలుమఱు వామహస్తమున బాగుగ బట్టియు నర్ధచంద్రము
న్నెలమిని రెండుఁ జేర్చినను నింపుగ నాశివలింగహస్తమై
యలరును లింగభావనకు నంతటఁ గస్తురిరంగనాయకా!

23

నాగబంధహస్తలక్షణము

ఉ.

వేమరు సర్పశీర్షమును వేడ్కను రెండుకరంబులందునున్
బ్రేమ నధోముఖంబుగను బెంపుగ నామణిబంధమందునున్
సామిగఁ జేర్చి వక్షమున సారెకుఁ బట్టిన హస్త మెప్పుడున్
నామము నాగబంధ మఘనాశక! కస్తురిరంగనాయకా!

24

వినియోగము

గీ.

వినుము! పొదరిండ్లకు సర్ప మెనయుటకును
ధర నథర్వంపువేదమంత్రంబునకును
నాగబంధంబు సెల్లును నయముగాను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

25

శకటహస్తలక్షణము

క.

ఇల భ్రమరాస్త్రము లురమునఁ
బలమఱు గరయుగమునందుఁ బట్టుక వెలిగా
నల యంగుళులును జాఁచినఁ
గలిమలహర! శకట మగును గస్తురిరంగా!

26

వినియోగము

గీ.

రమ్యముగఁ జూడ నిలలోన రాక్షసులకుఁ
బరఁగ సింహంబునకు బహుభయమునకును
జెలఁగి శకటంబు హస్తంబు సెల్లు జగతి
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

27

శంఖహస్తలక్షణము: వినియోగము

గీ.

ఎనసి యాసర్పశీర్షంబు నెడమచేతఁ
బరఁగఁ గుడిచేత శిఖరంబుఁ బట్టి గూర్ప
శంఖహస్తంబు నగు నది శంఖమునకె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

28

చక్రహస్తలక్షణము: వినియోగము

చ.

వరుసగ నర్ధచంద్రములు వైపుగఁ బట్టుక రెండుచేతులం
బరువడి నడ్డదిడ్డముగ బాగుగఁ జేతులు మూసి పట్టుచో
నిరవుగఁ జక్రహస్త మగు నింపుగఁ జక్రము సూపఁ జెల్లునో
మురహర! వాసుదేవ! విను, మోహన! కస్తురిరంగనాయకా!

29

సంపుటహస్తలక్షణము: వినియోగము

క.

ఇరుకరపుసర్పశీర్షము
మురహరి! కరతలము లడ్డముగ మూసినచో
సరవిని సంపుటహస్తము
గరిమను సంపుటమునకును గస్తురిరంగా!

30

పాశహస్తలక్షణము

చ.

పరఁగిన సూచిహస్తములు బాగుగఁ బట్టుక రెండుచేతులన్
వరుసగఁ దర్జనీలు నదె వంచుక వ్రేళ్ళును రెండు సేర్చి తా
గరిమను [6]నూర్ధ్వధోముఖముఁ గా మఱియున్ మెలిగాను బట్టినన్
నిరతము పాశహస్త మగు నిక్కము గస్తురిరంగనాయకా!

31

వినియోగము

గీ.

సరఁగ నన్యోన్యకలహపాశంబులకును
నెలమి ద్వేషంబునకు మఱి గొలుసునకును
ననువుగా బాశహస్త మై యలరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

32

కీలకహస్తలక్షణము

చ.

అల మృగశీర్షహస్తములు నంతట నూర్ధ్వ మధోముఖంబుఁ గా
నెలమిఁ గనిష్ఠికాంగుళిని నించుక వంచియు రెండుఁ గూర్చియున్
మెలిగను బట్టియున్న నది మేదినిలోనను గీలకం బగున్
జలరుహనేత్ర! భక్తజనసన్నుత! కస్తురిరంగనాయకా!

33

వినియోగము

క.

చెలువుగ స్నేహాలను మఱి
పలుమఱు మగఁ డాలిఁ జెట్టవట్టను మిగులన్
నిరతం బనుకూలతకును
గరిమను గీలకము వచ్చుఁ గస్తురిరంగా!

మత్స్యహస్తలక్షణము:వినియోగము

గీ.

మఱి పతాకంపుఁగరముపైఁ గరముఁ జేర్చి
సరగ నంగుష్ఠములు రెండుఁ జాఁచియున్న
మత్స్యహస్తంబు నది మఱి మత్స్యమునకె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

35

కూర్మహస్తలక్షణము

గీ.

నెగడు మత్స్యంబునందుఁ గనిష్ఠికలను
రెండువ్రేళ్ళను జాఁచిన మెండుగాను
గూర్మహస్తంబు నగు నది గూర్మమునకె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

36

వరాహహస్తలక్షణము

చ.

అరుదుగ [7]దక్షిణంబునను నామృగశీర్షముఁ బట్టి యంతటన్
వరుసఁ బతాకహస్తమును వామకరంబునఁ బట్టి గూర్చినన్
మఱియు వరాహహస్త మగు మాధవ! చెల్లును సూకరంబుకే
మురహరి! వాసుదేవ! యఘమోచన! కస్తురిరంగనాయకా!

37

సింహహస్తలక్షణము

చ.

ఎనసిన పద్మహస్తములు నింపుగ రెండుకరంబులందునుం
దనరఁ గనిష్ఠికంబు లదె తథ్యము వంచుక ముందు వెన్క గా
ఘనమణిబంధమందు మఱి గ్రక్కునఁ జేర్చిన సింహహస్త మౌ
వనరుహనేత్ర! కేసరికి వచ్చును గస్తురిరంగనాయకా!

38

గరుడహస్తలక్షణము: వినియోగము

చ.

తడయక యర్ధచంద్రములు ధాటిగ రెండుకరంబులందునుం
దొడిఁబడి ముందు వెన్క గను దోయరుహానన! చేర్చి యంతటన్
విడువక యంగుళిన్ మెలిక వేసిన నాగరుడంపుహస్తమై
యడరును వైనతేయునికి నచ్యుత! కస్తురిరంగనాయకా!

39

ఖట్వహస్తలక్షణము

గీ.

ఎలమిఁ జతురంపుహస్తంబు లెదురెదురుగఁ
గూర్చి తర్జనియుగము నంగుష్ఠయుగము
చాఁప నది ఖట్వహస్తమై చాలియుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

40

వినియోగము

క.

మంచానికి నుయ్యాలకు
నెంచఁగఁ దగువారిధికిని నీఖట్వకరం
బంచితముగ వచ్చును మఱి
కంచీపురవరదరాజ! కస్తురిరంగా!

41

భేరుండహస్తలక్షణము

గీ.

మఱి కపిత్థయుగంబును గరములందుఁ
బట్టి మణిబంధములుఁ జేర్ప దిట్టముగను
గండభేరుండహస్తమై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

42

దేవతాహస్తలక్షణము

చ.

వెరవుగ ధాత యీశ్వరుఁడు విష్ణువు భారతి లక్ష్మిపార్వతుల్
పరఁగ వినాయకుండు మఱి బాగుగ షణ్ముఖుఁ డంగజుండునుం
బరఁగఁగ దిక్పతుల్ మిగులఁ బంకజనాభ! దశావతారముల్
స్థిరముగ హస్తభావములు దెల్పెదఁ గస్తురిరంగనాయకా!

43

బ్రహ్మదేవహస్తలక్షణము

క.

కుడిచేతను హంసాస్యము
గడువడిఁ జతురంబు నెడమకరమునఁ బట్టం
బుడమిని విధిహస్తం బయి
గడిదేఱును గలుషభంగ! కస్తురిరంగా!

44

ఈశ్వరహస్తలక్షణము

చ.

మొనసిన శంఖహస్తమును ముందఱఁ బట్టుక వామపార్శ్వమున్
ఘనత్రిపతాకహస్తమును గట్టిగ దక్షిణహస్తమందునం
బనివడ వామహస్తమున బాగుగ నామృగశీర్షహస్తము
న్నెనయఁగఁ బట్టి చూపినను నీశ్వరహస్తమె రంగనాయకా!

45

విష్ణుహస్తలక్షణము

గీ.

ఒనరఁ ద్రిపతాకములు గరయుగమునందుఁ
బరఁగ భుజముల కెగువగాఁ బట్టియున్న
మెఱసి శ్రీవిష్ణుహస్తమై మేలుదనరు
రాక్షసవిరామ!కస్తురిరంగధామ!

46

సరస్వతీహస్తలక్షణము

క.

వామకరంబున హంసము
వేమఱు గుడిచేత సూచి వెలయఁగఁ బట్టం
బ్రేమను భారతిహస్తము
గాముని గన్నయ్య! వినుము కస్తురిరంగా!

47

లక్ష్మీహస్తలక్షణము

క.

మానక యుభయకరంబులఁ
బూని కపిత్థంపుఁగరము భుజముల కెగువన్
దా నిటు వట్టిన శ్రీయై
గానంబడు ఖగతురంగ! కస్తురిరంగా!

48

పార్వతీహస్తలక్షణము

గీ.

చెలువుగను నర్ధచంద్రపుఁజేతియందుఁ
బరఁగ వరదాభయంబులు వట్టియున్నఁ
బార్వతీహస్తమై చాల బాగు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

49

వినాయకహస్తలక్షణము

గీ.

మఱి కపిత్థంబులును రెండుఁ గరములందు
నుదరమున కెదురుగఁ బట్ట నొప్పుగాను
నిల వినాయకహస్తమై యేపు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

50

షణ్ముఖహస్తలక్షణము

గీ.

[8]సొరిది వామకరంబు ద్రిశూలమును
జేరి దక్షిణహస్తంబు శిఖరమునను
నరసి పట్టిన షణ్ముఖహస్త మగును
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

51


గీ.

పొదల నర్ధపతాకంబు భుజము కెగువ
రెండుకరములఁ బట్టిన మెండుగాను
గార్తికేయునిహస్తమై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

52

మన్మథహస్తలక్షణము

గీ.

శిఖరమును వామకరమునుఁ జెన్నుమీఱ
దనరు కటకాముఖంబును దక్షిణంపుఁ
గరమునను బట్ట మదనునికరము గ్రూర
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

53

ఇంద్రహస్తలక్షణము

గీ.

అరయఁ ద్రిపతాకములు రెండుఁ గరములందు
ముందు వెనుకగఁ బట్టిన నింద్రుఁ డగును
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

54

అగ్నిహస్తలక్షణము

గీ.

అలరు త్రిపతాక దక్షిణహస్తమునను
గరిమ లాంగూలమును వామకరమునందు
బట్ట నది యగ్నిహస్తమై పరఁగుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

55

యమహస్తలక్షణము

గీ.

వామపార్శ్వానఁ బాశ మావగను బట్టి
దక్షిణకరంబునను సూచి దనరియున్న
వెలు యమహస్తమై చాలవేడ్క దనరు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

56

నైరృతిహస్తలక్షణము

గీ.

అల పతాకంబు దక్షిణహస్తమునను
నెలమిగాఁ బద్మకోశంబు నెలమి వామ
కరమునను బట్ట నైరృతి ఘనతకెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

57

వరుణహస్తలక్షణము

గీ.

ఒనర సపతాకములు గరయుగమునందుఁ
బట్టి శిఖరంబు మఱియును బట్టి చూపఁ
జెలఁగి వారుణహస్తమై వెలయుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

58

వాయుహస్తలక్షణము

గీ.

అర్ధచంద్రంబు దక్షిణహస్తమునను
నెనయ నర్ధపతాకంబు నెలమి వామ
హస్తమునఁ బట్టఁగా వాయుహస్త మగును
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

59

కుబేరహస్తలక్షణము

గీ.

దక్షిణకరంబునన్ ముష్టి దనరుచుండ
వైపుగను బద్మకోశంబు వామహస్త
మునను బట్టిన ధనదుఁడై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

60

[9]ఈశానహస్తలక్షణము

చ.

మొనసిన శంఖహస్తమును ముందఱఁ బట్టుక వామపార్శ్వమున్
ఘనత్రిపతాకహస్తమును గట్టిగ దక్షిణహస్తమందునం
బనివడ వామహస్తమున బాగుగ నామృగశీర్షహస్తము
న్నెనయఁగఁ బట్టి చూపినను నీశ్వరహస్తము రంగనాయకా!

61

దశావతారహస్తలక్షణములు

మత్స్యావతారహస్తలక్షణము

గీ.

ఎలమి మత్స్యకరమువట్టి చెలువు మీఱఁ
బూని త్రిపతాకములు రెండుభుజములందు
జాఱఁబట్టిన మత్స్యావతార మౌను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

62

కూర్మావతారహస్తలక్షణము

గీ.

మెఱయఁగాఁ గూర్మహస్తంబు మేల్మిఁ బట్టి
పొదవి త్రిపతాకములు రెండు భుజములందు
జాఱఁబట్టినఁ గూర్మావతార మౌను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

63

వరహావతారహస్తలక్షణము

చ.

ఎనయ వరాహహస్తమును నింపుగఁ బట్టుక వేడ్క మీఱఁగా
ఘనముగ నర్ధచంద్రములు గట్టిగ నాకటియందు మిక్కిలిన్
బనుపడ రెండుచేతులను బట్ట నదే [10]వరహావతార మౌ
వనజదళాయతాక్ష! విను వైపుగఁ గస్తురిరంగనాయకా!

64

నరసింహావతారహస్తలక్షణము

గీ.

సింహముఖహస్తమును జూపి చెలువు మీఱఁ
బరఁగఁ ద్రిపతాకములు రెండుఁ బట్టియున్నఁ
బొనర నరహరియవతారమునకుఁ జెల్లు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

65

వామనావతారహస్తలక్షణము

ఉ.

వామకరంబు ముష్టిఁ గొని వైపుగ ఛత్రముఁ జూపఁ బట్టుచున్
వేమఱు దక్షిణంబునను వేడ్కగఁ గ్రిందికి ముష్టిఁ జూపుటల్
ప్రేమను వామనుం డగుచుఁ బెంపు వహించును ధాత్రిలోన నో
సామజపాల! దైత్యరిపుఖండన! కస్తురిరంగనాయకా!

66

పరశురామావతారహస్తలక్షణము

గీ.

గరిమ నదె వామకరమును గటిని నుంచి
దక్షిణకరంబు నర్ధపతాకమునను
బట్ట భృగురాముఁ డనుఖ్యాతిఁ బరఁగుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

67

శ్రీరామావతారహస్తలక్షణము

గీ.

శిఖరమును వామకరమునుఁ జెలువు మీఱ
నలకపిత్థము దక్షిణహస్తమునను
నెనసి పట్టిన శ్రీరాముఁ డనఁగఁ బరఁగు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

68

బలరామావతారహస్తలక్షణము

క.

కుడిచేతను సపతాకము
నెడమకరంబునను ముష్టి యెనయఁగఁ బట్టం
బుడమిని బలరాముం డయి
గడిదేఱును జగతిలోనఁ గస్తురిరంగా!

69

కృష్ణావతారహస్త[11](లక్షణము?)

గీ.

ఘనత మీఱఁగ మఱి వేణుగానమునను
జూపఁ గృష్ణావతార మై సొబగు మీఱు
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

70

కల్క్యవతారహస్తలక్షణము

గీ.

వెలయ సపతాకమును నొత్తగిలను బట్టి
యిరుకరంబులఁ ద్రిపతాక మెనయఁ బట్టఁ
జెలఁగి కల్క్యవతారమై చెలువు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

71

సూర్యహస్తలక్షణము

గీ.

పరఁగ నదె సూచిహస్తంబు బాగు మీఱ
నిరుకరంబుల భుజముల కెగువఁ బట్ట
ధరను మార్తండహస్తంబు మెఱయుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

72

చంద్రహస్తలక్షణము

గీ.

కూర్మి వామంబునను బద్మకోశ మలర
మొనసి కుడిచేత మఱి సింహముఖము బట్ట
ధర సుధాకరహస్తమై దనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

73

బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాది జాతులకు భావలక్షణము

క.

ఎలమిని బ్రహ్మక్షత్రియ
సలలితసద్వైశ్యశూద్రజాతులు దెలియం
బలుమఱు భావము దెల్పెదఁ
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

74

బ్రాహ్మణహస్తలక్షణము

క.

ఒగిఁ గరయుగశిఖరంబులు
సొగసుగ నటు వట్టి యజ్ఞసూత్రముఁ జూపన్
నెగడిన బ్రాహ్మణహస్తము
ఖగవాహన! దనుజభంగ! గస్తురిరంగా!

75

క్షత్రియలక్షణము

గీ.

చేరి వామకరంబున శిఖరముంచి
యల పతాకంబు దక్షిణహస్తమందుఁ
బట్ట క్షత్రియహస్తమై పరఁగుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

76

వైశ్యహస్తలక్షణము

గీ.

మెఱయ హంసాస్యమును వామకరమునందుఁ
దనర సందర్శహస్తంబు దక్షిణంపుఁ
గరమునను బట్ట వైశ్యుఁడై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

77

శూద్రహస్తలక్షణము

క.

అల వామంబున శిఖరము
మెలఁగఁగఁ గుడిచేతఁ బట్ట మృగశీర్షమునుం
దెలివొందు శూద్రహస్తము
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

78

బాంధవహస్తలక్షణము

చ.

నిరతము దంపతుల్ మఱియు నిక్కము భార్యకుఁ దల్లితండ్రికిన్
న్నిరవుగ మామ యల్లునికి నింపుగ బావకుఁ దోడికోడలున్
సరగను నన్నదమ్ములకు సౌతికిఁ గోడలి కింకఁ బుత్త్రుకుం
బరఁగను నత్త పెన్మిటికి భావముఁ దెల్పెద రంగనాయకా!

79

దంపతిహస్తలక్షణము

క.

కుడిచేతను మృగశీర్షము
నిడి శిఖరము నెడమచేత నేపుగఁ బట్టం
దడయక దంపతిహస్తము
గడువడి శోభిల్లుచుండుఁ గస్తురిరంగా!

80

భార్యహస్తలక్షణము

ఉ.

వామకరంబునందు మఱి వారిజలోచన! హంసహస్తమున్
వేమఱుఁ బట్టి కంఠమున వేడ్కగ దక్షిణహస్తమందునన్
సామిగ సందశంబు నిడి సారెకు నాభికిఁ జాఁచి పట్టినం
బ్రేమను భార్యహస్త మది పెంపుగఁ గస్తురిరంగనాయకా!

81

మాతృహస్తలక్షణము

చ.

హరిహరి! యర్ధచంద్రమును నంతట వామకరంబునందునం
గరిమను బట్టి కుక్షి నిడి గట్టిగ నాకుడిచేత సందశం
బిరవుగఁ బట్టి చుట్టి మఱి యింపుగ నాభిని జాఱఁబట్టినన్
వరుసగ మాతృహస్త మగు వైపుగఁ గస్తురిరంగనాయకా!

82

పితృహస్తలక్షణము

క.

మును మాతృహస్తమందున
ననువగు శిఖరంబు దక్షిణంబునయందుం
బనుపడఁ బట్టిన నది మఱి
ఘనముగఁ బితృహస్త మగును గస్తురిరంగా!

83

మామగారిహస్తలక్షణము

క.

అల భార్యహస్తమందునఁ
జెలువుగ దక్షిణకరాన శిఖరము వట్ట
న్నిల మామహస్త మగు నది
కలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

84

అల్లునిహస్తలక్షణము

చ.

పరఁగను బద్మకోశమును బట్టుక వామకరంబునందునన్
మెరయఁగ దక్షిణంబునను మేల్మిని నాశిఖరంబుఁ బట్టినన్
సరసిజనేత్ర చెల్లు నది సారెకు నల్లునిహస్త మంచు నో
మురహరి! వాసుదేవ! యఘమోచన! కస్తురిరంగనాయకా!

85

బావహస్తలక్షణము

గీ.

మఱియు శిఖరంబునందు వామకర ముంచి
మొనసి కుడిచేతఁ గర్తరీముఖముఁ బట్టఁ
బరఁగ నల బావహస్తమై పరిఢవిల్లు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

86

తోడికోడలిహస్తలక్షణము

చ.

తగవుగ సర్పశీర్షమును దక్షిణహస్తము సాఁచి పట్టుచు
న్నెగడినవామహస్తమున నేర్పున నాశిఖరంబుఁ బట్టినం
బొగడఁగఁ దోడికోడలికిఁ బొంకముగా మఱి సెల్లు హస్త మో
నగధర! వాసుదేవ! యదునందన! కస్తురిరంగనాయకా!

87

అన్నహస్తలక్షణము

గీ.

మెరయు శిఖరంబు నావామకరమునందుఁ
దనర నర్ధపతాకంబు దక్షిణఁపు
హస్తమునఁ బట్ట నన్నకు నగును జుమ్ము
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

88

తమ్మునిహస్తలక్షణము

గీ.

అన్నహస్తంబునందును జెన్ను మీఱ
దక్షిణకరంబునను ద్రిపతాక మమర
నరసి పట్టినఁ దమ్మునిహస్త మగును
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

89

సవతిహస్తలక్షణము

గీ.

పాశహస్తంబు ముందుగాఁ బట్టి చూపి
మొనసి కుడిచేతఁ గర్తరీముఖము బట్ట
సవతిహస్తంబ దందురు జగతిలోన
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

90

కోడలిహస్తలక్షణము

క.

వామకరంబున శిఖరము
దామోదర! హంసకరము దక్షిణపాణిం
బ్రేమను బట్టినఁ గోడలు
కాముని గన్నయ్య! వినుము! కస్తురిరంగా!

91

పుత్త్రహస్తలక్షణము

క.

కుడిచేత సందశంబును
గడువున జాఱంగఁ బట్టి గరిమను శిఖరం
బెడమకరంబునఁ బట్టినఁ
గడువడి బుత్త్రాఖ్యకరము గస్తురిరంగా!

92

అత్తగారిహస్తలక్షణము

గీ.

అరయ మృగశీర్షమున వామకరముఁ జూపి
పద్మకోశముఁ గుడిచేతఁ బట్టియున్న
మేలిమిని నత్తహస్తమై మెలఁగుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

93

పెనిమిటిహస్తలక్షణము

గీ.

ఉభయకరముల హంసాస్య మొనర గళము
నందుఁ బట్టుక దక్షిణహస్తమందు
శిఖరమును జూప మగనికె చెల్లు ధరను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

94

ఉదయాస్తమయమధ్యాహ్నములకుహస్తలక్షణము

గీ.

కోరి యుదయంబునకుఁ బద్మకోశ మొప్పు
నస్తమయమునకు ముకుళహస్త మెనయుఁ
బరఁగ మధ్యాహ్నమున కంచకరముఁ జెల్లు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

95

షడృతువులకు హస్తలక్షణము

సీ.

సరవి మీఱఁగను వసంతకాలమునకు
              ననువుగా లాంగూలహస్త మొప్పు
వాలాయమున గ్రీష్మకాలంబునకు నదె
              మృగశీర్షహస్తంబు మేలు దనరు
వర్షకాలమునకు వైపుగా మఱి చూడ
              సందంశహస్తంబు పొందియుండు
తగవు మీఱఁగ శరత్కాలమునకు నింక
              శుకతుండహస్తంబు సొంపు మీఱు


గీ.

నలరు హేమంతమునకును హంసకరము
పరఁగ శిశిరంబునకు నొప్పుఁ బద్మకరము
నిట్లు షడృతుభావంబు లెనసియుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

96

నవరసహస్తలక్షణము

సీ.

శృంగారముకును జెల్లుఁ బద్మకరంబు
              నగు వీరరసమున కర్ధచంద్ర
కరము నౌ కరుణకు ఘనముకుళకరంబు
              నలరు లాంగూలము నద్భుతముకు

హాస్యరసానకు హంసాస్య మొనయును
              జేరి భయానకు శిఖర మొప్పు
రహి మీఱ భీభత్సరసమునకుం జూడ
              మఱి త్రిపతాకంబు మెఱయుచుండు


గీ.

తొలఁగ రౌద్రమునకు శుకతుండకరము
పరఁగ నుత్సాహమునకును బద్మకరము
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

97

నవరత్నహస్తలక్షణము

సీ.

వజ్రంబునకు మఱి వైడూర్యమునకును
              సింహముఖకరంబు చెన్ను మీఱుఁ
బద్మరాగానకుఁ బరఁగ నీలానకు
              సందశహస్తంబు పొందియుండు
గరిమను గోమేధికంబునకుం జూడ
              నర్ధపతాకంబు నలరుచుండుఁ
బొందుగా మాణిక్యపుష్యరాగంబుల
              కనువుగా లాంగూలహస్త మొప్పు


గీ.

సరఁగఁ బచ్చకుఁ జతురహస్తంబు నలరు
మెఱయ ముత్యంబునకు హంసకరముఁ జెల్లుఁ
దనరఁ బగడంబునకుఁ ద్రిపతాక మెనయ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

98

చంద్రకాంతసూర్యకాంతహస్తలక్షణము

గీ.

చంద్రకాంతంబునకు నర్ధచంద్రకరము
భానుకాంతంబునకు నలపద్మకోశ
హస్తమును జెల్లు ధరలోన నంబుజాక్ష!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

99

[12]నవలోహహస్తలక్షణము

సీ.

చెలఁగు స్వర్ణానకుఁ జతురహస్తంబును
              నదె కుందనమునకు హంసకరము
నల రజితంబున కర్ధపతాకంబుఁ
              గంచుకు సింహముఖంబుఁ దనరుఁ
దామ్రమునకుఁ ద్రిపతాకహస్తంబును
              నాయిత్తడికి ముకుళాఖ్య మొప్పు
దగరంబునకు నపతాకము మఱిసెల్లు
              నల యినుమునకు ముష్టిహస్త మలరుఁ


గీ.

గరఁగటకుఁ బద్మకోశంబు గరిమ మీఱుఁ
బేర్మి నిల సుత్తె వట్టఁ గపిత్థకరముఁ
గంబు నీడ్వను గటకాముఖంబుఁ దనరు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

100

సప్తస్వరహస్తలక్షణము

సీ.

సరవిని షడ్జమస్వరమునకుం జూడ
              ననువుగాను మయూరహస్త మొప్
బరఁగను నల ఋషభస్వరంబునకును
              సింహముఖకరంబు చెన్ను మీఱు
సారసనేత్ర! గాంధారస్వరానకు మృగశీర్షహస్తంబు మెలఁగుచుండు
మఱియును మధ్యమస్వరమునకుఁ బద్మ
              కోశహస్తంబు సెల్లును గువలయేశ!


గీ.

పేర్మిఁ బంచమమునకుఁ గపిత్థ మలరు
దైవతస్వరమునకుఁ బతాక మొనరుఁ
మొగి నిషాదంబునకు సింహముఖముఁ దనరు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

101

సప్తవారహస్తలక్షణము

సీ.

భానువారమునకుఁ బద్మకరంబును
              నిందువారమున కర్ధేందుకరము
నల భౌమవారాన కాత్రిపతాకంబు
              సౌమ్యవారానకు సందశంబు
తనరఁగ గురువారమునకును శిఖరంబు
              వరపతాకము భృగువారమునకు
మఱి ముష్టిహస్తంబు మందవారమునకుఁ
              జెలు వొంది మిగులను జెన్ను మీఱు


గీ.

సప్తవారములకు హస్తంబు లివియె
భావ మలరఁగఁ దెల్పితిఁ బంకజాక్ష!
సరసగుణవిహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

102


మత్తకోకిలం.

శ్రీరమారమణీమనోహర! చిత్తజాంతకవందితా!
వారిజాననస్వ్యపద్ద్వయ! వాంఛితార్థఫలప్రదా!
నారదస్తుతిపాత్ర! శ్రీయదునందనా! భవఖండనా!
సారసాక్ష! విభూ! శుభంకర! సత్కృపానిధి! కేశవా!

103


గద్య.

ఇది శ్రీవాసుదేవకరుణాకటాక్షవీక్షణాకలితాశృంగారరసప్రధాన సంగీతసాహిత్యభరతశాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞవల్క్యాచార్యపదారవిందమకరందబిందుసందోహపానతుందిలమిళిందీభూతనిజాంతరంగ శ్రీమృత్యుంజయార్యపుత్త్ర కాశ్యపగోత్రపవిత్ర సుజనవిధేయ లింగముగుంటమాతృభూతనామధేయప్రణీతం బయినయభినవదర్పణం బనుమహాప్రబంధంబునందు సంయుతంబును, దేవతాహస్తంబును, బ్రహ్మక్షత్త్రియవిట్ఛూద్రహస్తంబును, ఋతుషడ్ఢస్తంబును, నవరస-నవరత్న-నవలోహహస్తంబును, సప్తస్వర-సప్తవారహస్తంబును ననుసర్వంబును దృతీయాశ్వాసము.

సంపూర్ణము

  1. “సంక్లిష్టా సర్పశీర్షౌచేత్ భవేత్పుష్పపుటఃకరః” “సర్పశీర్షస్య పార్శ్వేత్వపరస్సర్పశీర్షకః| ధృతః పుష్పపుటాఖ్యస్స్యా దధీశః కిన్నరేశ్వరః” అను నీరెండులక్షణములకంటెను నిది భిన్నముగా నగపడును.
  2. “చతురస్రస్మృతో వక్షఃపురోగౌ కటకాముఖౌ” (అభి 478) అనునది చతురస్రలక్షణము.
  3. “పతాకావూరుదేశస్థౌ డోలాహస్తాఽయ ముచ్యతే” అని లక్షణాంతరమును దీనికిఁ గలదు.
  4. పేరణి – భాండముమీఁదఁ జరపునృత్యము
  5. “త్రిపతాకా వంసదేశగతా వుత్థానవంచితః| విష్ణోరభినయేస్తమ్భభావనాయాం బుధోదితః| ఉత్థానవంచితాభిఖ్య స్సర్వనాట్యేషు కీర్తితః|” (అభి 558)
  6. ‘ఊర్ధ్వాధోముఖము’లని యుండఁదగును
  7. దక్షిణము = దక్షిణహస్తము
  8. ఈలక్షణమే సం. అభినయదర్పణమునను గలదు. “వామేకరే త్రిశూలంచ, శిఖరం దక్షిణేకరే| ఊర్ధ్వం గతే షణ్ముఖస్య కర ఇత్యుచ్యతే బుధైః“ (అభి 590)
  9. సం. అభి. దర్పణమందు దిక్పాలురఁ జెప్పుసందర్భమున నిది వదలఁబడినది.
  10. వరాహావతార మనుటయే సాధువు
  11. “మృగశీర్షేతు హస్తాభ్యామన్యోన్యాభిముఖీకృతే| అంసోప కంఠేకృష్ణస్య హస్తఇత్యభిధీయతే” (అభి)
  12. అష్టలోహములకే హస్తలక్షణము చెప్పఁబడినది. బంగారు, అపరంజి వేఱువేఱుగా గ్రహింపఁబడినవి. సీసము వదలఁబడినది.