అబద్ధాల వేట - నిజాల బాట/శాస్త్రీయ పద్ధతి వినియోగం - దుర్వినియోగం
ఇండియాలో శబ్ద ప్రమాణానికి విలువ ఎక్కువ. వేదాలు శబ్ద ప్రమాణాలే. వాటిని 'అపౌరుషేయాలు'అన్నారు. (ఎక్కాల పుస్తకం కూడా అపౌరుషేయమే) ఈ శబ్ద ప్రమాణాన్ని రుజువుకు పెట్టరు. అదంతా నిజమేనని నమ్ముతారుగూడా. బలీయమైన ఈ సంప్రదాయం బాగా నాటుకపోయినందువలన మనకు శాస్త్రీయ పద్ధతి బాగా అలవాటు కాలేదు.
అచ్చులో ఉన్నదంతా నిజమని నమ్మే మరో సంప్రదాయం గూడా ఉన్నది. చదువుకున్నవారు మనదేశంలో 30 % కాగా,అందులో వచ్చీరాని భాషాజ్ఞానం కలవారే ఎక్కువగా ఉన్నారు. పత్రికలలో వచ్చే అశాస్త్రీయ విషయాలు, అభూత కల్పనలు, వారఫలాలు, సన్యాసుల బోధనలు నమ్మేవారున్నారు.
అధికార ప్రమాణం కూడా మరొక ప్రమాదకారిగా పరిణమించింది. పండితులూ, కళాకారులూ, శాస్త్రజ్ఞులు వారి పరిధిలో నిపుణులు కావచ్చు. కాని, ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏం మాట్లాడినా అతని, పరిధికాని విషయాలను చెప్పినా, ప్రమాణంగా తీసుకోటం కనిపిస్తున్నది. సూరిభగవంతం ఫిజిక్స్ లోని ఒక విభాగమైన స్ఫటికాలపై పరిశోధన చేసి ప్రమాణాలను సాధించాడనుకొందాం. ఆయన తనకు వచ్చిన కీర్తినీ, పేరును వినియోగించుకొని సత్యసాయిబాబా భక్తుడుగా ప్రచారం చేసాడు. నమ్మేవారు అయన్ను భక్తుడుగాక, శాస్త్రజ్ఞుడుగా గౌరవించి, అంతటి శాస్త్రజ్ఞుడే చెపుతున్నప్పుడు మనవంటి వారిదేమున్నది? అని సాష్టాంగపడతారు. ఇలా వ్యక్తుల మాటల్ని సందర్భసహితం కాకపోయినా ప్రమాణంగా స్వీకరిస్తున్న ప్రమాదం భిన్నరంగాలలో ప్రబలి ఉన్నది. శాస్త్రీయ పద్ధతిని అన్వయించక పోవటం వలన ఈ చిక్కు వచ్చింది. సైన్సులో గూడా ఇలాంటి దోషాలు లేకపోలేదు. ఉదాహరణకు, ఎలక్ట్రాన్, ఖగోళశాస్త్రం, అలోపతి, ప్రజాస్వామ్యం అనేవి ఆయా రంగాలలో శాస్త్రీయ పద్ధతికి నిలబడే అంశాలు. ఇందుకు భిన్నంగా జ్యోతిష్యం, ఆయుర్వేదం, హోమియోపతి, దేవుడు, మార్క్సిజం అనేవి అశాస్త్రీయాలు. అనగా రుజువుకు నిలబడవు. నమ్మకం వీటికి ప్రధానం ఇదే విధంగా సైన్సు పరిధిలో అనేక అశాస్త్రీయ విషయాలు కొందరు ఆకర్షణీయంగా ప్రచారం చెస్తున్నారు. అతీంద్రియ శక్తులు, మరణించిన వారితో మాట్లాడటం, పునర్జన్మ, సంఖ్యకు బలం ఉంటుందనీ, కంటిచూపుతో దూరాన ఉన్న వస్తువును కదిలించవచ్చునని, మొదలైనవి ఎన్నో శాస్త్రం పేరిట ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ఏదీ క్లిష్టమైన పరీక్షకు నిలబడదు. మిడిమిడి జ్ఞానంతో అన్వయించే శాస్త్రీయ పద్ధతి వలన రుజువులు లభించినట్లు కనిపించినప్పటికీ, సరైన పద్ధతిలో ఇవి రుజువు చేయజాలనివే.
శాస్త్రజ్ఞులు సహితం పరిశీలన, వివేచన ఆధారంగా ఒక్కొకసారు కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొంటారు. కుళ్ళిపోతున్న మాంసం నుండి క్రిమికీటకాలూ,ఈగలు తదితర సూక్ష్మజీవులు పుట్టుకోస్తాయని ఒకప్పుడు నమ్మేవారు. నిర్జీవ పదార్ధం నుండి జీవం పుట్టిందని కూడా కొంతకాలం నమ్మేవారు. 17, 18, 19 శతాబ్దాలలో ఇలాంటి నమ్మకాలు బాగా విస్తరించి ఉండేవి. సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) 19వ శతాబ్దం మధ్యలోగాని కనిపెట్టలేదు. సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొన్న తరువాత, నిర్జీవ పదార్ధం నుండి దానంతటదే జీవం పుడుతుందనే నమ్మకం తొలిగిపోయింది. లూయీపాశ్చర్, ఎఫ్.ఎ.పోచే ఈ విషయాలపై పరిశోధనచేసి పరస్పర విరుద్ధమైన నిర్ణయాలకు వచ్చారు.
తమ పరిశోధన శాస్త్రీయమైనదే అని ఇద్దరూ భావించారు. పరిశీలన, పరిశోధన, తర్కాన్ని ఇరువురూ వినియోగించుకున్నారు. కాని పరిశోధన చేసేటప్పుడు అందుకు వినియోగించే పరికరాలు శుభ్రంగా ఉన్నాయా, లేదా, గాలిలో ఉండే ధూళి, సూక్ష్మజీవుల ప్రభావం లూయీపాశ్చర్ పరికరాలను వేడినీటిలో స్టెరిలైజ్ చేసి జాగ్రత్త వహించాడు. మిగిలినదంతా ఇరువురూ, శాస్త్రీయ పద్ధతిలోనే చేశారు. కాని ప్రధానమైన ఈ తేడా వలన నిర్జీవం నుండి జీవం పుట్టుకొస్తున్నట్లు పోచేకు తేలగా, అది అబద్ధమని పాశ్చర్ రుజువు చేసాడు. చివరకు పాశ్చర్ చేసిందే సరైనదని తేలింది. సాక్ష్యాధారాలు నిర్ధుష్టంగా కనుగొనటం వ్యయప్రయాసలతో కూడినపని. అందుకు ఓర్పు, జాగ్రత్త, ప్రశ్నించే స్వభావం, క్లిష్టపరీక్షకు నిలబెట్టే ధోరణి ఉండాలి. ఈ దృష్ట్యా మానవులపై శాస్త్రీయ పరిశోధన చేయటం జటిలమైన సమస్య. అందువలన శాస్త్రీయ పద్ధతిలో మానవులకు సంబంధించి మూడు విధాలైన రీతులను పాటిస్తున్నారు. ఒకటి 'కోహార్ట్' అధ్యయనం. కొందరు వ్యక్తులను చాలాకాలంపాటు పరిశీలించి వారి అలవాట్లకూ, ఆరోగ్యానికీ ఉన సంబంధాన్ని గమనించటం ఈ పద్ధతిలో ఉన్నది. తమలపాకు నమిలేవారికి గొంతు కేన్సర్ వస్తుందా? అనే పరిశీలన చేయాలంటే ఇటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. 'క్రాస్ సెక్షన్ సర్వే' మరొక పద్ధతి. ఇందులో కొందరు వ్యక్తులను ప్రస్తుత స్థితిలో ఎలా ఉన్నారో చూచి, దాన్నిబట్టి వారి లక్షణాలనూ ఆరోగ్యస్థితిని పోల్చిచూడటం జరుగుతున్నది. లావుగా ఉన్నవారికి, గుండె జబ్బులు వస్తాయనే లక్షణాన్ని ఇలా పరిశీలించటం జరుగుతున్నది. మూడవ పద్ధతి 'కేస్ కంట్రోల్' అధ్యయనం. ఇందులో గతాన్ని ఆధారంగా వ్యక్తుల లక్షణాలు , ప్రస్తుతం ఉన్న స్థితి, గతానికి ప్రస్తుతానికీ ఉన్న సంబంధం చూస్తారు.
శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనల వలన ఉపయోగం ఏమంటే ఒకరు రుజువు చేసినదాన్ని మరే శాస్త్రజ్ఞుడైనా రుజువు చేయవచ్చు. అంటే క్లిష్టపరిస్థితి అనేది బహిరంగ సత్యమన్నమాట. శాస్త్రీయ పద్ధతిలో, క్లిష్ట పరీక్షకు నిలబడిన తరువాత ఎవరైనా నమ్మవలసిందే. మరొక శాస్త్రజ్ఞుడు అది తప్పని రుజువు చేసేవరకూ శాస్త్రీయ సత్యం నిలబడుతుంది. విజ్ఞానంలో ఏదీ శాశ్వతం కాదు. దేనినైనా, ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. న్యూటన్ను, ఐన్ స్టీన్ ప్రశ్నించాడు. హైజన్ బర్గ్ వచ్చి ఐన్ స్టీన్ను తల్లక్రిందులు చేసారు. ఈ విధంగా కాలానుగుణంగా విజ్ఞానపరిధి విస్తృతమవుతున్న కొలదీ, కొత్తవి కనుగొనటం జరుగుతున్నది. పాతవాటికీ చారిత్రక విలువ మాత్రం ఉంటుంది. శాస్త్రానికి, సాంకేతికానికీ తేడా ఉన్నది. సాంకేతికం శాస్త్రం ఆధారంగా వస్తుంది. ఉదాహరణకు మనం రోజూవాడే రేడియో, టెలివిజన్, టేప్ రికార్డర్లు సాంకేతికపరమైనవి. విద్యుత్-అయస్కాంత తరంగాల గురించి శాస్త్రం పరిశోధించి కనుగొన్నది. అది సిద్ధాంతం.దాన్ని అన్వయిస్తే సాంకేతికమౌతుంది. విద్యుత్-అయస్కాంత తరంగాల అన్వయీకరణే రేడియో, అలాగే ఆటంబాంబు సాంకేతికపరమైనది. పదార్ధాన్ని శక్తిగానూ, శక్తిని పదార్ధంగానూ పరస్పరం మార్చుకోవచ్చుననేది రుజువైన శాస్త్రీయ సిద్ధాంతం. శాస్త్రం బహుళ ప్రచారంలోకి రాదు. నిపుణులైన కొందరికే ఇది పరిమితం. దీనిని మరికొందరు నిపుణులు సాంకేతికంగా మారుస్తారు. మన నిత్య జీవితంలో ఆటంబాంబు-ఆయుధాలు మొదలైన సాంకేతిక విషయాలను చూస్తున్నాం కనుక, అదే సైన్సు అనుకొని మానవాళిని సైన్స్ నాశనం చేస్తుందని విమర్శిస్తుంటాము. సైన్స్ ను దుర్వినియోగపరచటం సద్వినియోగం చేయటం అనేది సాంకేతిక శాస్త్రానికి చెందినది. ఈ ప్రధానమైన తేడాను గమనించాలి.
ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైన దశలు కొన్ని ఉన్నాయి. పరిస్థితిని పరిశీలించి తదనుగుణమైన విషయామన్నిటినీ సేకరించటం, ఆ విషయాలాధారంగా అంచనా వేయటం, అంచనాలను పరిశీలనకు పెట్టడం. శాస్త్రీయ పద్ధతిలో క్రొత్త ప్రతిపాదన రుజువుకు నిలబడితే అది కూడా శాస్త్రంలో భాగం అవుతుంది. ఐన్ స్టీన్ గురుత్వాకర్షణకు కాంతికిరణాలు గురి అవుతాయని, అవి శక్తిని మోసుకెళుతుంటాయనీ, అందువలన నక్షత్రాలనుంచి వచ్చే కాంతి కిరణాలు సూర్యుని గురుత్వాకర్షణకు ఒంగుతాయని సిద్ధాంతీకరించాడు. ఇది వాస్తవమేనని శాస్త్రజ్ఞులు పరిశోధన ద్వారా రుజువు చేసారు.
సామాజిక విషయాలలొ కూడా తరచు శాస్త్రీయ పద్ధతిని గురించి వింటుంటాం. మార్క్సిజం శాస్త్రీయమైన సిద్ధాంతమని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని చర్చిద్దాం. మార్క్స్, ఏంగిల్స్ శాస్త్రజ్ఞులు కారు. 19వ శతాబ్దంలో ఉన్న శాస్త్రాలను చదివి తదనుగుణంగా సిద్ధాంతీకరణ చేసారు. వారి అంచనాలేవీ క్లిష్టపరీక్షకు నిలబడలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందనీ, కార్మిక నాయకత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇది ఎక్కడా జరగలేదు. ఇందుకు భిన్నంగా రష్యా,చైనా వంటి దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. కార్మిక నియంతృత్వం ఏర్పడలేదు. కమ్యూనిస్టు సమాజంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యం హరించిపోతుందనీ మార్క్స్ చెప్పాడు. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పలేదు. కమ్యూనిస్టు దేశాలలో ఈ ధోరణి అమలు జరగటం లేదు. మార్క్సిజం విఫలం కావటానికి పరిస్థితులపై నెపం వేస్తున్నప్పటికీ, అసలు ఎలాంటి శాస్త్రీయ పరీక్షకూ నిలబడే అవకాశం లేదు. మార్క్స్, ఏంగిల్స్ అనంతరం సాపేక్ష సిద్ధాంతం - న్యూక్వాంటం సిద్ధాంతం, పార్టికల్ సిద్ధాంతం, జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) వచ్చాయి. వీటన్నిటికి ఆధారాలు రుజువయ్యాయి. ఇందులో ఏ ఒక్కటినీ కమ్యూనిస్టులు తమ సిద్ధాంత రీత్యా పరీక్షకు పెట్టలేదు. పైగా రుజువైన ఈ సిద్ధాంతాలను సోవియట్ యూనియన్ నిరాకరించింది. గతి తార్కిక`భౌతికవాదంతో సహా అన్నీ పోతాయనే దృష్టితో సాపేక్ష సిద్ధాంతాన్ని స్టాలిన్ చనిపోయేవరకూ సోవియట్ రష్యాలో ప్రవేశింపనివ్వలేదు. ఆధునిక జన్యుశాస్త్రాన్ని కూడా ఆమోదించని లైసెంకో చెప్పిన ప్రచార ధోరణిని బలపరిచారు. న్యూ క్వాంటమ్ సిద్ధాంతాన్ని కూడా స్టాలిన్ చనిపోయే వరకూ విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడుప్పుడే రుజువైన ఈ సిద్ధాంతాలను సోవియట్ యూనియన్ వంటి కమ్యూనిస్టు దేశాలు తప్పనిసరిగా ఆమోదిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళూలేని కొత్త జాడ్యం ఒకటి కమ్యూనిస్టు దేశాలలో ప్రబలుతున్నది. అతీంద్రియ శక్తులను నమ్మటం, చూపుతో ఇనుప పరికరాలను వంచటం వంటి అశాస్త్రీయ విధానాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా మార్క్సిజంలో వేసిన అంచనాలు శాస్త్రీయ పద్ధతికి నిలబడవు గనుక వాటిని నిరాకరించవలసి వుంటుంది. అయితే మన కమ్యూనిస్టులు భారతదేశంలో సైన్సు జోలికి,ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతికి పోవడం లేదు. తాము నమ్మిన సిద్ధాంతాలకు శాస్త్రీయ పద్ధతిని అన్వయించటం లేదు. మతపరమైన మూఢ నమ్మకాలకూ-మార్క్సిస్ట్ మూఢనమ్మకాలకూ తేడా లేదు. శాస్త్రీయ పద్ధతి దృష్ట్యా సైన్సు పేరిట జరుగుతున్న కొన్ని మోసాలను బయటపెట్టటానికి అమెరికాలో ఒక సంఘాన్ని ఏర్పరచి నిరంతర పరిశోధన చేస్తున్నారు. తప్పుడు వ్రాతలగుట్టును బయటపెడుతున్నారు. మనకు కూడా ఇలాంటివి చాలా అవసరం.