అబద్ధాల వేట - నిజాల బాట/ఈనాటి సైన్సు విశేషాలు

ఈనాటి సైన్సు విశేషాలు

(సైన్సు చాలా సుందరమైన,అందమైన అద్భుత విషయాలు కనుగొన్నది. అవి ప్రాథమిక దశ నుండి పిల్లలకు చెప్పాలి. తెలియనివి చెప్పకూడదు. అబద్ధాలు అసలే చెప్పరాదు. నమూనాగా కొన్ని సైన్సు సత్యాలు ఇన్నయ్య అందిస్తున్నారు.)

మనం ఒక చోట నిల్చుంటే, మన వేగం ఎంత?

కదలకపోవడం అనేది తరచుగా వాడే మాట అయినా, అది వాస్తవమా?

భూమధ్యరేఖ వద్ద మనం గంటకు వెయ్యిమైళ్ళ వేగంతో భూమితో పాటు తిరుగుతాం. కర్కాటక, మకరరేఖల వద్ద కొంచెం తక్కువగా తిరుగుతాం.

సూర్యునిచుట్టూ భూమి గంటకు 67 వేల మైళ్ళ వేగంతో, తిరుగుతుంది, అందులో మనమూ వున్నాం!

పాలపుంత చుట్టూ సూర్యుడు గంటకు 13 లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతుంది. మనమూ అందులో భాగమే.

మనం కదిలితే, ఈ వేగాలకు అది కలుపుకోవాలనమాట.

క్షణాలలో సమాచారం ఎలా సాధ్యం

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల మీద మనకు ఎలా తెలుస్తున్నది?

పత్రికలు, రేడియోలు, టెలివిజన్, ఫోను, టెలిప్రింటర్ మనకు అందించే సమాచారానికి నేడు శాటిలైట్సు(కృత్రిమ ఉపగ్రహాలు) తోడ్పడుతున్నాయి. ఇవి ఆకాశంలో ఆయా దేశాల వారు నెలకొల్పారు.

భూమధ్యరేఖపైన 22 వేల 300 మైళ్ళ ఎత్తున ఆకాశంలో శాటిలైట్ ఏర్పరిస్తే భూమి తిరిగినట్లే అదికూడా తిరుగుతుంది కనుక, మన దృష్టిలో "స్థిరంగా"వున్నట్లే. ఆర్ధర్ సి.క్లార్క్ 1940లో చెప్పిన యీ విషయాన్ని 1964లో మొదట అమలుపరచారు. నేడు వందలాది శాటిలైట్లు ఆకాశంలో నెలకొల్పారు. ఒక్కొక్క శాటిలైట్ ఒకే సమయంలో 120000 టెలిఫోన్ కాల్స్ అందించగలుగుతుంది. అలాగే టెలివిజన్ ప్రసారాలు కూడా! గురుత్వాకర్షణ ఆధారిత కృత్రిమ ఉపగ్రహాలు సంకేతాలను పంపించడంలో తోడ్పడుతున్నాయి.

తప్పించుకోలేని శక్తి

భూమిపై మనం ఎక్కడికెళ్ళినా గురుత్వాకర్షణ తప్పదు. తలుపులు మూసినాసరే, ప్రతిచోటా యిది పనిచేస్తూనే వుంటుంది.

మనం పడిపోకుండా అట్టిపెట్టేది గురుత్వాకర్షణే!

గతాన్ని చూడగలమా

మనం చూచే నక్షత్రాలు, సూర్యుడు పాలపుంత అన్నీ గతంలోవే.

8 నిమిషాల క్రితం వున్న సూర్యుడినే మనం చూడగలుగుతున్నాం.

మనం చూచే నక్షత్రాలు కోట్లాది సంవత్సరాల క్రితంలోనివే.

వెలుగు సెకండుకు 186282 మైళ్ళ వేగంతో ప్రసరిస్తుంటే అలా చూడగలుగుతున్నాం.

మనం మోసే బరువు ఎంత?

మనం ఒకచోట కదలకుండ కూర్చుంటే ఎంత బరువు మోస్తున్నట్లు?

వింత ప్రశ్నగా వుంది గదూ! వాస్తవానికి 10 టన్నుల బరువు మనపై పడుతున్నది.

భూమిపై వున్న గాలి చదరపు అంగుళానికి 14.7 పౌండ్ల వత్తిడి కలిగిస్తుంది. మన శరీరంపై అన్ని కోణాల నుండి ఈ గాలి బరువు వుంటుంది.

మనలోని అంగాలు, కణాలు అదేశక్తితో మనపై పడే గాలి శక్తిని వెనక్కు తిప్పికొడుతుంటాయి. కనుకనే 10 టన్నుల బరువుతో పడేగాలికి మనం అణగిపోవడంలేదు.

గాలిలేని శూన్యంలో మనిషిని పెడితే పటాపంచలైపోతాడని తెలుసుకోండి!

పోలరైజ్డ్ అద్దాల శక్తి

ప్లాస్టిక్ గ్లాస్ తో చేసిన కళ్ళజోడు పెట్టుకుంటే చాలా మార్పు జరుగుతుంది. ప్లాస్టిక్ లో ఏటవాలు కణాలు (elongated molecules) కలిసి రంధ్రం వలె ఏర్పడతాయి. ఈ రంధ్రాలు అడ్డంగా అమర్చితే అడ్డంగా ప్రసరించే తరంగాలనే పోనిస్తుంది.

రైట్ కోణంలో అమర్చిన రెండు ఫిల్టర్ల గుండా వెలుగు ప్రసరించదు. అంటే ఒకటి అడ్డంగా, మరొకటి నిలువుగా అమర్చిన గ్లాస్ ద్వారా వెలుగు తరంగాలను పోనివ్వదు.

స్థిరత్వంలో చలనం

కదలకుండా పడివున్నదనుకునే ఏ వస్తువులోనైనా చలనం వుంటుంది. మనం చూచేవాటికీ, లోన జరిగేదానికీ చాలా తేడా వుంది. అణువులు, రేణువులు, వరమాణువులు, నిరంతరం చలనంలో వుంటాయి. అది మనం కంటితో చూడలేం. న్యూక్లియస్, ఎలక్ట్రాన్లు, అణువులు కదులుతూనే వుంటాయి. ఘన, ద్రవపదార్ధాలలోని అణువులు నిరంతరం కదులుతూనే వుంటాయి. వాయు పదార్ధాలలో ఇక చెప్పనక్కరలేదు.

కదలకుండా వున్నట్లు కనిపించే లోహాలలో గంటకు 20 లక్షల మైళ్ళ వేగంతో ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి!

వైరస్ అంటే

వైరస్ వల్ల ఫ్లూ, ఆటలమ్మ,మసూచి వంటి తీవ్ర జబ్బులు వస్తాయి.

సూక్ష్మజీవిలో పదోవంతు పరిమాణం వుండే వైరస్ ప్రాణి కాదు. పెద్ద జీవాణువుల చుట్టూ వుండే ప్రొటీన్ వంటివి. జీవాణువుతో వైరస్ తారసిల్లినప్పుడు కణాల ఉత్పత్తి విధానం వైరస్ లో ఏర్పడి ఇతర కణాలకు ప్రాకుతుంది.

సూక్ష్మక్రిముల వలన టైఫాయిడ్, క్షయ, న్యుమోనియా, కోరింతదగ్గు, సిఫిలిస్, గనేరియా, కుష్టు, ధనుర్వాతం వస్తాయి.

వైరస్ కూ బాక్టీరియాకు యీ తేడా వుందని గ్రహించాలి.

సూక్ష్మకణాలు:(జీవాణువులు)

సూక్ష్మకణాలు కంటికి కనిపించవు. అయినా ఒక్కొక్క జీవకణంలో 200 బిలియన్ అతిసూక్ష్మ కణాలు (మాలెక్యూల్స్) వుంటాయి. అంగనిర్మాణానికి యివి సాధనాలు.

జీవకణాలు శక్తినిస్తాయి. ఇవి ఎమినోయాసిడ్స్ నుంచి ప్రొటీన్లు తయారుచేస్తాయి. జీవకణాల్ని విభజించి, మరిన్ని జీవకణాల్ని రూపొందిస్తాయి.

అన్ని జీవులకూ, ప్రాణానికీ ఆధారం జీవాణువులే (డై ఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్- డి.ఎన్.ఏ.)

జీవాణువును విప్పిచూస్తే నిచ్చెన మెట్ల వలె కనిపిస్తుంది. అందులో రెండు జతల కలయికతో నాలుగు రసాయన పదార్ధాలుంటాయి. అడినైన్, తైమైన్, గానైన్, సైటోసైన్ అనే కోడ్ వరుసనే జన్యువు(జీవి) అంటాం. ఇందులో అడినైన్, థైమన్ ఒక జతగా, గానైన్, సైటోసైన్ మరో జతగా కలుస్తాయి. వివిధ ప్రొటీన్లకు వీటి కలయిక ఉపకరిస్తుంది.

జీవాణువుల రహస్యం

జీవాణువుల సంకేతాలు విప్పుకుంటే రహస్య సంకేతం గ్రహింపవచ్చు. నాలుగు జీవాణువులు తగిన రీతిలో కలసి, అచ్చుగుద్దినట్లుగా రూపొందుతాయి. అణువు నిభజించుకొనే ముందు తగిన రీతిలో రూపొందే కొత్త అణువుకు తగ్గట్లు సిద్ధమౌతుంది. ప్రొటీన్ తయారు గావడానికి ఒక జన్యు అణువు విప్పుకొని, తాత్కాలిక నమూనా రూపొందుతుంది.

మనిషిలో జన్యు అణువు ఎంజైం కు తారసిల్లినప్పుడు, ఇన్సులిన్ తయారయ్యేట్లగా జన్యు అణువును తెగగొడుతుంది. జన్యు అణువుల స్రవంతిలో ఇన్సులిన్ జొప్పించే తీరులో ఇతర ఎంజైం లు చిన్న పేగులలోని సూక్ష్మజీవులతో కలుస్తాయి.

ఇకోలి లక్షలాదిగా తనను పోలిన జీవణావులను తయారుచేసుకుంటుంది. అమినో యాసిడ్ అణువుల్ని ఇన్సులిన్ గా తయారుచేయడం ఆశ్చర్యకరంగా సాగుతుంది.

సూక్ష్మ అణువుల అనంతశక్తి

పరమాణువుల ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలిస్తే, గురుత్వాకర్షణ శక్తి భారం వలన యివి మూడు విచిత్ర కలయికల్ని రూపొందిస్తున్నట్లు తెలుసుకున్నారు. అందులో పల్సార్(న్యూట్రాన్ నక్షత్రం) ఒకటి. కాగా, బ్లాక్ హోల్ మరొకటి. ఈ రెండూగాక, వైట్ డ్వార్ఫ్ మరొకటి. సూక్ష్మాణువుల మధ్యగల ఖాళీప్రదేశాన్ని కోల్పోవడం వల్ల యివి ఏర్పడడం ఆశ్చర్యకరంగా వుంటుంది.

వైట్ డ్వార్ఫ్ లో సాంద్రత ఉక్కుకంటే 10 వేల రెట్లు ఉంటుంది. ఒక చంచా బరువు 10 టన్నులు వైట్ డ్వార్ఫ్ లో వుంటుంది. సూర్యుని వంటి నక్షత్రం తగులబడి, అణగిపోగా యిది జరుగుతుంది.

సూర్యునికంటె 1.4 రెట్ల సాంద్రతగల తార అణగారిపోతే, దాని గురుత్వాకర్షణ శక్తిని అందులోని ఎలక్ట్రాన్లు ఏ మాత్రం అడ్డుకోలేవు. ప్రొటాన్లు న్యూక్లియస్ తో మిళితమై అణగిపోతాయి. ఘనపు సెంటీమీటర్ పరిణామం 10 మిలియన్ టన్నుల బరువు వుంటుంది. ఆ న్యూట్రాన్ తారలు తిరుగుతూ రేడియో పల్స్ విడుదలచేస్తాయి.

బ్లాక్ హోల్

సూర్యుడికంటె మూడు రెట్లున్న నక్షత్రంలో గురుత్వాకర్షణశక్తి న్యూట్రాన్ తారకూడా ఆపలేనంతగా వుంటుంది. అలాంటి గురుత్వాకర్షణ పదార్ధన్నంతటినీ అనంత సొరంగంలోకి లాగేస్తుంది. అందులో నుండి వెలుతురుకు సైతం తప్పించుకొనే దారిలేదు!

బ్లాక్ హోల్ లో భూమి అంత పదార్ధం ఒక ముత్యపు పరిమాణంలో వుంటుంది. మొత్తం పరిమాణం అనూహ్యం.

- హేతువాది, నవంబరు 1995