అబద్ధాల వేట - నిజాల బాట/వేదాల్లో క్లోనింగ్ ఉందట
వైద్యరంగంలో విప్లవాలు వస్తున్నాయి. అంటురోగం వస్తే తుడిచిపెట్టుకుపోయే కాలం పోయింది. కొత్త రోగాలు వస్తుంటే సరికొత్త చికిత్సలు, మంచి మందులు కనుగొంటున్నారు. ఇది నిత్య పరిశోధనా ఫలితం, శుచి, శుభ్రం అనేది దేహారోగ్యానికి ముఖ్యం అని తెలుసుకోవడం వైద్యరంగంలో తొలిమెట్టు. ఇప్పుడు శస్త్రచికిత్సలు చేయాలంటే మత్తుమందువల్ల(అనస్తీషియా) అతి సులువుగావడం పెద్ద విశేషం. చాలా కాలం సూక్ష్మజీవులు వైరస్ వల్ల రోగాలు వస్తాయని తెలుసుకోలేకపోయారు. అది తెలిసిన ఫలితంగా మందులు, టీకాలు వచ్చేశాయి. ఈ విధంగా ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలితంగా వైద్య విప్లవాలు వచ్చి, ఆయుష్షు పెంచుతున్నాయి. కొత్తరంగం అని నేడు సగర్వంగా చెప్పదగింది జన్యుశాస్త్రం. మెండల్ గ్రెగోర్ 1850 ప్రాంతాలకే మొక్కల పారంపర్యత చూచాడు. కాని అదెలా పనిచేస్తుందో, సూక్ష్మరసాయనిక చర్య ఏమిటో ఆనాడు తెలియదు. అందుకోసం 1953 వరకూ పరిశోధనలు జరిగాయి. ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ అనే శాస్త్రజ్ఞుల కృషివల్ల పెనవేసుకుపోయినట్లుండే (డబుల్ హెలిక్స్) రెండు తీగల రూపం చూచారు. ఇది చాలా పెద్ద జీవకణం. అదే డిఎన్ఎలో నాలుగు రసాయనిక మూలకాలు వున్నాయి. పొడి అక్షరాలలో ఎ, టి, జి, సి అన్నారు. ఎ అంటే అడిలైన్, టి అంటే థైమన్, జి అనగా గానైన్, సి అంటే సైటోసిస్. ఈ నాలుగింటిల్లో ఏ మూడు కలిసిన ప్రొటీన్లు వస్తాయి. అవే జీవానికి మూలం.
ఒక్కొక్కజీవకణం ఒక విజ్ఞాన సర్వస్వ నిఘంటువు వంటిదే. ప్రతి జీవకణంలో 23 జతల క్రోమోజోములుంటాయి. ఇందులో పెనవేసుకుపోయిన డిఎన్ఎ లుంటాయి. ఇలాంటి విజ్ఞాన సర్వస్వాలు 46 సంపుటాలమయంగా మానవుడిలో వుండగా, ఒక్కొక్క సంపుటి అనేక విషయాలను చూస్తుంది. నిఘంటువులో ఒక పదం ఒక డిఎన్ఎ పోల్చి చెప్పవచ్చు. ప్రతి వ్యక్తిలో రెండు జన్యు జంట (అలెక్స్) సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల నుండి యీ జంట వస్తుంది. తండ్రి లక్షణాలు తల్లి లక్షణాలు పిల్లలకు యిలా వస్తాయి. అలా వచ్చేటప్పుడు కొంచెం చెదిరినా, మార్పు జరుగుతుంది. దీనికి పెడదారి (మ్యూటేషన్) అని పేరు పెట్టారు. మనం అచ్చుగుద్దినట్టు కార్బన్ కాపీ తీస్తుంటే, కొంచెం జరగడం, ముద్ర సరిగా పడకపోవడం, అక్షరం చెదరడం చూస్తాం. అలాగే పోలికలతోబాటు మార్పులు చూస్తాం. జన్యుకణాలలో మూలంగా వున్న నాలుగు రసాయనికాలలో ఏ మూడైన కలుస్తూపోతాయని గమనించాలి. ఇది జరిగే తీరు ఒక్కొక్క కణంలో విప్పి చూస్తే ఏమి వుంటుంది అని తెలుసుకోడానికి పరిశోధన 1980 ప్రాంతాలలో మొదలెట్టి 1990 ప్రాంతాలకు ఒక దారినపడింది. ఈ బృహత్తర పధకానికి జెనోం ప్రాజెక్టు అని పేరు పెట్టారు.
ఈ పథకం వల్ల గొప్ప ఉపయోగం ఏమంటే రోగాలకు మూలం జీవకణాలేమిటి, వాటిని తొలగించడం ఎలా అనేది సాధ్యపడుతుంది.
సుమారు 5వేల రోగాలు వివిధ జన్యుకణాల మూలంగా వున్నాయని జేనోం ప్రాజెక్టు వల్ల తేలింది. అంటురోగాలు జన్యుకణాల వల్ల రావడమనేది కూడా గ్రహించాలి. కాగా నిరోధకశక్తి జన్యుకణాల వల్లే వివధ దశలలో వుంటుంది. కొన్ని జన్యుకణాలు బాగా పెత్తనం చేస్తాయి. తండ్రి నుండి వచ్చిన కణం ఊదా రంగు (బ్రౌన్)లో వుండొచ్చు. తల్లి నుండి వచ్చిన కణం నీలం (బ్లూ) రంగులో వుండొచ్చు. అయినా సంతానంలో కనుపాపల రంగు బ్రౌన్ అధిక్యతనే చూపుతుంది. ఇదే కణాధిక్యత అంటారు. అలాగే ఒక్కొక్క కణం రోగానికి దారితీసేదిగా వుంటుంది. అలాంటి జీవకణాలను తెలుసుకుంటున్నారు. తరువాత వాటికి చికిత్స, ఎలా తొలగించిడం అనేది పరిశోధిస్తారు. శరీరంలోవున్న జబ్బు కలిగించే జన్యుకణానికి పరిసరాల తోడ్పాటువల్ల కూడా హాని జరిగే అవకాశాలున్నాయి.
మొట్టమొదటగా ఏ కణానికి ఏ లక్షణం వుందో తెలుసుకుంటేగాని దాని బాగోగులను ఎలా మలచడమనేది కుదరదు. ఇదే పెద్దపని. జెనోం ప్రాజెక్టు యీ కృషి చేస్తుంది.
కణ చికిత్స(జీన్ థెరపి) లో మంచి కణాలను ఎంపికచేసి,వాటిని శరీరంలో ప్రవేశపెట్టడం,అవి దేహంలో పెరిగేటట్లు చూడటం ముఖ్యం. ఇదే అత్యంత జటిలమైన పని. అయితే చెడ్డ జన్యువుల్ని పెంపొందించి ప్రవేశపెడితే దుర్మార్గులు పుట్టరా అనే భయాందోళనలు కొందరు వెలిబుచ్చుతున్నారు.
తల్లిగర్భంలో పిండాల్ని తొలిదశలోనే పరిశీలించి, జన్యుకణాల ప్రకారం ఏది చెడు ఏది మంచి అనేది చూడగలిగితే, ఆరోగ్యకరమైన బిడ్డల్నే కనవచ్చు, అనారోగ్యకరమైన సంతానాన్ని రాకుండా చేయవచ్చుకూడా. జన్యు శాస్త్రంలో పరిశోధనల వల్ల చివరకు క్లోనింగ్ విధానానికి దారితీసింది. వేదాల నుండి నేటి వరకూ కథలలో విన్న విషయాలు,సైన్స్ పరిశోధనల వల్ల ఒక దశకు చేరింది. 1996 జులైలో ఇయాన్ విల్మట్ అనే శాస్త్రజ్ఞుడు పరిశోధనాలయంలో జీవకణాల నుండి దాల్ గినే గొర్రెపిల్లను సృష్టించాడు. అలాగే మనుషుల్లోనూ సృష్టి చేయవచ్చుగదా. అంతటితో అలాంటి పని నైతికమా కాదా అనే చర్చ జరుగుతోంది.
క్లోనింగ్ ప్రకారం దాత నుండి అండం తొలగించి జాగ్రత్తగా భద్రపరచి, మరొకరిలో కనడానికి ప్రవేశపెడతారు. అలా తొలగించిన అండంలో జీవకణాలు పెరగకుండా పోషక పదార్థాన్ని ఆపేస్తారు. ఆ తరువాత మళ్ళీ జీవకణాలు పెరిగేటట్లు చేస్తారు. కొందరు స్త్రీల నుండి అండం ఉత్పత్తి చేయిస్తారు. వాటిని జాగ్రత్తగా పరిపక్వదశలోకి తెస్తారు. దాత నుండి తొలగించిన జీవకణం స్వీకరించే వారిలో ప్రవేశపెట్టి విద్యుత్ షాక్ ను జీవకణంలోకి పంపిస్తారు. అప్పుడు జీవకణాన్ని స్వీకరించినట్లు తెలిస్తే, ఉత్పత్తి మొదలౌతుంది. ఆ దశలో అండాన్ని తొలగించి, తల్లికాదలచిన స్త్రీలో ప్రవేశపెడతారు. విల్మట్ చేసిన ప్రక్రియ ఇలాంటిదే. ఇదంతా క్లిష్టమైన పనే.
ఎంతో సాంకేతిక, శాస్త్రీయ పరిశోధన జరిగిన తరువాత క్లోనింగ్ దశకు చేరారు. వేదాల్లోనో, మరెక్కడో పిట్టకథల్లో వూహించిన విషయాలు చూపి, అప్పుడే మన పూర్వీకులు దివ్యదృష్టితో క్లోనింగ్ సహా అన్నీ చెప్పేశారనే వారు, మంచి హాస్యాన్ని సమ కూర్చుతున్నారు.