అబద్ధాల వేట - నిజాల బాట/నేటి తాత్విక విమర్శలు-ధోరణులు

నేటి తాత్విక విమర్శలు-ధోరణులు

ఇసుకలో ఆడుకుంటూ,సముద్రపు ఒడ్డున బొమ్మలు గీస్తారు. కొందరు ఇసుకమేడలు,కోటలు కడతారు. కాసేపు అవి బాగానే వుంటాయి. ఆ తరువాత అలలు వచ్చి కొట్టుకపోతాయి. ప్రకృతి పరిణామంలో మనిషి కూడా అంతే-ఫ్రెంచి తాత్వికుడు మైకెల్ ఫౌకో(1926-1984) మానవవాదాన్ని దుయ్యబడుతూ చేసిన విమర్శ సారాంశం అది.

మానవ ప్రగతిని పేర్కొంటూ పునర్వికాసం, ఆధునికయుగం అని వర్గీకరించినట్లే, మానవవాదాన్ని కూడా చెబుతున్నారని మైకల్ ఫౌకో(Michel Foucault)అన్నాడు. పునర్వికాసం కొంతకాలం వుండి,తరువాత అంతరించింది. మానవవాదమూ అంతే. ఆధునిక పేరిట మానవవాదులు శాశ్వత తత్వాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. మానవవాదం, ఆధునికత తాత్కాలికాలే.అవి కాలగర్భంలో కలిసిపోతాయి. మైకల్ ఫౌకో విమర్శలకు మరొక ఫ్రెంచి తాత్వికుడు జీన్ ఫ్రాంకో లెటార్డ్(Jean Francois Lyotard) తోడై మానవవాదంపై ధ్వజమెత్తాడు. తత్వాన్ని పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది? అన్నీ కథలు,అదిభౌతిక చర్చలు, అస్థిరత్వాన్ని గురించిన చర్చలు అని లెటార్డ్ అన్నాడు. ఆధునిక విజ్ఞానం కూడా అస్థిరత్వాల్ని వెతుక్కుంటూ పోతున్నదన్నాడు. ఫౌకో ఈ అస్థిరత్వ ధోరణిని, మానవవాదాన్ని ఖండించాడు. సైన్స్ బంధంలో మానవుడు చిక్కుకపోయాడనీ, అతడిని విడిపించాలనీ ఫౌకో వాదించాడు. వాస్తవాన్ని ఎదుర్కోలేక మానవవాదులు, ఇతరులపైబడి, అందరినీ పలయనవాదులుగా నిరాశాపరులుగా చిత్రిస్తున్నారన్నాడు.

విశ్వంలో మానవుడు కేంద్రం అంటూ,నీతిశాస్త్రాల్ని సృష్టించే మానవవాదాన్ని ఫౌకో, లెటార్డ్ లు నిరాకరించారు. మానవుడి ప్రగతిని, ఆశావాదాన్ని వర్ణించడమే మానవవాదంగా చూపడాన్ని వారు నిరాకరించారు. మానవశాస్త్రాలన్నీ అస్థిరమైనవిగా వారు చూపారు. మానవవాదుల తలబిరుసుతనాన్ని వివరిస్తూ డేవిడ్ ఎరన్ ఫీల్డ్ విమర్శల పరంపర చేశాడు. (David Ehrenfield-The Arrogance of Humanism)మానవుడి భవిష్యత్తు నిర్మాణంలో మానవవాదుల కృషి ఏమీ లేదంటూ,వీరు కేవలం మానవ ప్రేమ పేరిట స్వార్ధాన్ని పెంచుకుంటున్నారని డేవిడ్ విమర్శించాడు. ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించి, మానవుడు కేంద్రంగా వుండే తీరును వీరు వూహిస్తున్నారన్నాడు. వాస్తవానికి మానవుడే విధ్వంసానికి పూనుకుంటున్నాడనీ,మానవశక్తిని మరచిపోయి ప్రవర్తిస్తున్నాడన్నాడు. మానవుడు తన హద్దుల్ని తెలుసుకుంటే, సృజనాత్మకతలో భాగం పంచుకుంటాడనీ, అదే అతడికి తృప్తి కలిగిస్తుందన్నాడు.

ఆధునికతకు వ్యతిరేకంగా పోయే ధోరణికి ముసుగు వేసి చూస్తున్నారని జర్గన్ హాబర్ మాస్(Jurgen Habermas)అన్నాడు.

ఆధునికతపైనా,మానవవాదంపైనా సమకాలీన ప్రపంచంలో,ముఖ్యంగా యురోప్, అమెరికా,ఆస్ట్రేలియాలలో విమర్శలు 1950 నుండే ఆరంభమయ్యాయి. దీనినే ఆధునికత అనంతర కాలం(Post Modernism) గా పేర్కొంటున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం సత్తావాది హైడిగ్గర్(Heideggar) మానవవాదాన్ని ఎదుర్కొనడానికి శ్రీకారం చుట్టాడు. మానవుడిని ఉన్నతస్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నంలో మానవవాదం విఫలమైందని, యుద్ధానికి,విధ్వంసానికి మూలం మానవవాదమేనని ఆయన మొదలెట్టాడు. ఆ తరువాత ఫ్రెంచి తాత్వికులు వియన్నా చింతనాపరుల్ని విమర్శిస్తూ, నిక్కచ్చిగా ప్రతిదీ వుండాలనే వాదాన్ని ఖండించారు. అందులో భాగంగానే మానవవాదాన్ని చేర్చి, మైకల్ ఫౌకో, జీన్ ఫ్రాంకో లెటార్డ్,డెరిడా(Derrida)లు చాలా విమర్శనాత్మక రచనలు చేశారు.

అమెరికాలో ఈ విమర్శల్ని అందుకున్నవారు,మానవవాదం వలన పాశ్చాత్యనాగరికత సృష్టించిన విలువలు పలచబడ్డాయని, కుటుంబవ్యవస్థ దెబ్బతిన్నదనీ, దైవనమ్మకం సడలిందనీ అన్నారు. "నేషనల్ రివ్యూ" ప్రచురణకర్త విలియం ఎ.రషర్ ఇలాంటి రచనలు చేశారు.

మానవుడు సృష్టించిన సాంకేతిక శాస్త్రం విధ్వంసానికి దారి తీసిందనీ,అన్ని సమస్యలకూ మానవుడే పరిష్కారాన్ని యివ్వగలడనుకోవడంలో మానవవాదం పొరపాటు పడిందనీ డేవిడ్ ఎరన్ ఫీల్డ్ రాశాడు.

వాతావరణాన్ని, పరిసరాల్ని దృష్టిలో పెట్టుకోకుండా మానవుడు ప్రవర్తించడం, మానవుడే ముఖ్యం అంటూ, మానవుడి కోసం ప్రకృతిని నాశనం చెయ్యడం బైర్డ్ కాలికాట్ చూపాడు. దీనివలన మానవ కేంద్రనీతి ఎలా కాలుష్యానికి దారితీసిందీ వివరించాడు.

కంప్యూటర్ సృష్టిలో సృజనాత్మకత,ఉద్వేగం దెబ్బతిన్నాయని మార్మికవాదులు, దివ్యదృష్టిని నమ్మేవారూ విమర్శలు చేశారు. దేవుడిలో నమ్మకం కోల్పోతేనైతికంగా అరాచకత్వం వస్తుందనే వాదన పూర్వం నుండే వస్తున్నాయి టీవలీ టైం పత్రిక ఎడిటర్ సైతం యిలాంటి విమర్శలు చేశాడు. హెన్రీ గ్రున్ వాల్క్ తన విమర్శలలో,మానవుడికి దేనిపైనా నమ్మకం,గురి లేకుంటే,నీతి నిలబడదని వాదించాడు. సృష్టివాదులు కూడా అలాంటి వాదనే చేస్తునారు. మానవవాదంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో రష్యా రచయిత అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, ఇర్వింగ్ క్రిష్టల్, రిచర్డ్ జాన్, న్యూహాస్ మొదలైన ప్రముఖులు వున్నారు.

మానవవాదంపై మతం విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు. కాని తాత్వికులు, చింతనాపరులు విమర్శలు చేసినప్పుడు జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుంది.

మానవవాదాన్ని సమర్థించడంలోనూ,విమర్శల్ని పట్టించుకోవడంలోనూ యూరోప్,అమెరికా,ఆస్ట్రేలియాలు బాగా శ్రద్ధ వహిస్తున్నాయి. ఇండియాలో ఇంకా ఈ విమర్శలకు ప్రాధాన్యత యివ్వడం లేదు. అలాంటి విమర్శలు వున్నాయని కూడా ఏ కొద్దిమందికో తప్పతెలియదు.

డేవిడ్ విల్సన్ ,జాన్ డ్యూయీ, కార్ల్ లెమాంట్, కార్ల్ వాగన్, ఇజక్ అసిమోవ్, పాల్ కర్జ్,అడాల్ఫ్ గ్రున్ బాం, బార్పరాస్మోకర్ మొదలైనవారు విమర్శల్ని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఎదుర్కొన్నారు.

1980 ప్రాంతాల నుండీ మానవవాదానికి వచ్చిన అపఖ్యాతి తొలగుతూ పోయింది. మానవవాదం అంటేనే ఒక తిట్టుగా 1950-80 మధ్య ప్రచారం సాగింది. ఆ ధోరణి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.

సంఖ్య రీత్యా మానవవాదులు ప్రపంచవ్యాప్తంగా అల్పసంఖ్యాకులే. కాని వారి వాదబలం నిలబడడానికి ప్రధాన కారణం వారు స్వీకరించిన ఆయుధమే. అదే శాస్త్రీయపద్దతి. సామాజిక,మానసిక శాస్త్రాలలో సైతం వివేచనాత్మకంగా సాగాలని మానవవాదులు కోరుతున్నారు. థామస్ సాజ్(THOMAS SZASZ) వంటివారు యిటీవల చేసిన విమర్శలే మానవవాదాన్ని మళ్ళీ పట్టాలపై నిలబెట్టడానికి ఉపకరించాయి.

ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అతిప్రధాన సమస్యల్ని గుర్తిస్తే, ఒకటి జనాభా పెరుగుదలగానూ,రెండవది ప్రకృతిలో కాలుష్యవ్యాప్తిగానూ తేలాయి. మానవవాదులు యీ రెండింటినీ పట్టించుకుంటున్నారు. మతవాదులలో కొందరు మానవ నియంత్రణను వ్యతిరేకిస్తున్నారు. సోషియో బయాలజీ తత్వానికి పితామహుడైన ఎడ్వర్డ్ ఈ సమస్యలపట్ల అటు మతవాదుల్ని ఇటు మానవవాదుల్ని కలిపి చర్చలు సాగించే కృషిని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు. తాత్వికంగా చూస్తే,పరిణామవాదాన్ని అంగీకరించిన మానవవాదులు ప్రకృతిని కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారని విల్సన్ అంటారు. (ఫ్రీ ఇన్ క్వైరీ 1993 స్ప్రింగ్, బఫెలో,అమెరికా) జనాభా పెరుగుదలకూ,సంపదను శక్తిని వినియోగించడానికీ సంబంధం వుంది. ప్రకృతి పరిసరాలపై దీని ప్రభావం పడుతున్నది. కనుక మత గ్రంథాలు ఏంచెప్పినా, క్రమేణా యీ సమస్యల్ని గుర్తించి పరిష్కరించక తప్పదని ఎడ్వర్డ్ విల్సన్ అన్నారు.

తాత్వికంగా పరిశీలిస్తే మానవవాదులు ఫౌకో, డెరిడా, లెటార్డ్ విమర్శల్ని తట్టుకోగలిగారు. వియన్నా తాత్విక సర్కిల్ ను అధిగమించి, సైన్స్ పద్ధతులను వారు స్వీకరించగలిగారు. నిర్ధారణే కావాలని నేడు సైన్స్ కోరుకోవడం లేదు. పరిశీధనలు ఎటు దారి చూపితే అటు పోవడం నేర్చుకున్నారు. కార్యకారణవాదం స్థూల ప్రపంచంలో వున్నదనీ, సూక్ష్మప్రపంచంలో లేదనీ సైన్స్ నిర్ధారించింది. మానవవాదులు అందుకు అంగీకరించక తప్పదుగదా.

కోపర్నికస్ రుజువుల వలన ప్రకృతిలో భూమి చాలా స్వల్పం అనీ,డార్విన్ ఆధారాల వలన మానవుడు పరిణమించిన ప్రాణి అనీ తేలిన తరువాత,మానవవాదులకు వినయం, నమ్రత తప్పదు. మానవ సమస్యల పరిష్కారానికి మానవుడే కేంద్రం అంటారే తప్ప,మరేమీ కాదు.

మానవవాదంపై వచ్చిన విమర్శల దృష్ట్యా కళలు,రామణీయకతలు, కవితల విషయంలోనూ చాలా మార్పులు చేసుకున్నారు. రుజువుకు నిలబడని శక్తుల్ని ఆరాధించడం మానేసి,మానవుడికి ప్రాధాన్యత యిస్తూ ఆనందించే అన్ని కళల్ని పోషిస్తూ పెంపొందించుకుంటున్నారు. అంతేగాక పుట్టిన దగ్గర నుండీ చనిపోయేవరకూ వివిధ దశలలో ఉత్సవాలు, క్రతువులు, పండుగలు చేసుకుంటున్నారు. వీటిలో దైవం బదులు మానవుడే వుంటాడు. మరణించేటప్పుడు ఓదార్పు, అనంతరం బంధుమిత్రులకు వూరట కలిగించే రీతులు కూడా పెంపొందించారు. మతం ఆయా సందర్భాలలో పురోహితుడ్ని ప్రవేశపెట్టగా మానవవాదులు మధ్యవర్తిత్వాల్ని కాదని, సహకార భావంతో క్రతువులు చేస్తున్నారు.

మానవుడిలో పెద్ద బలహీనత మరణమే. అది తలచుకొని భయపడుచున్నకొద్దీ,దాని చుట్టూ చాలా సిద్ధాంతాలు,తత్వాలు అల్లారు. అందులో భాగంగానే అమరత్వం, శాశ్వతత్వం, ఆత్మ, పునర్జన్మ, కర్మ, మోక్షం, నరకం మొదలైనవి వచ్చాయి. ఇంచుమించు అన్ని మతాలు మరణాన్ని ఆసరాగా తీసుకొని మనిషి బలహీనతలపై స్వారీ చేస్తున్నాయి.

మానవవాదులు నిస్సహాయులుగా వున్నంతకాలం మరణం అనే వాస్తవం మనిషిలో ఎన్నో వికారాలు పుట్టిస్తుంది. మరణం సహజమని, తరువాత ఏమీ వుండదని, మనిషి భావాలు తరువాతివారు గుర్తుంచుకోవడం ప్రధానమని నచ్చచెప్పగలగాలి. ఈ విషయమై సుప్రసిద్ధమానవ తాత్వికుడు కార్లిస్ లెమాంట్ చక్కని రచన చేశారు. మరణం పట్ల మానవుడు ఎలాంటి ధోరణి అవలింబించాలో చర్చించారు. నమ్మకాల మధ్య పెరిగేవారికి ఇది కష్టమైన విషయం. అయినా మానవవాదులు చెప్పేది మానవకేంద్రంగా వున్న తత్వమే. మానవవాదంపై ఫౌకో, డెరిడా, లెటార్డ్ చేసిన విమర్శలు నిలిచేవి కావు. మానవుడు దీర్ఘకాలిక పరిణామంలో తాత్కాలిక జీవి కావచ్చు. కొన్నేళ్ళకు ముందు మానవుడు లేనట్లే, కొన్నేళ్ళ తరువాత మానవుడు లేకుండా పోవచ్చు. అయితే సైన్స్ కాలమానం ప్రకారం అది కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. తక్షణ ప్రమాదం మానవ ఉనికికి లేదు. ఈ దృష్ట్యా, మానవుడు ఇసుకలో బొమ్మవలే చెరిగిపోతాడనడం అంత ఉచితం కాదేమో!

సమకాలీన విమర్శలకై పరిశీలించాల్సిన రచనలు:

1. Michel Foucault : The Order of Things

2. Jean Francois Lyotard : The Post Modern Condition

3. Richard Rorty : The Consequences of Pragmatism

4. David Ehranfeld : The Arrogance of Humanism

5. James Rachels : Created from Animals

6. Martin W. Lewis : Green Delusions

7. Bill McGibben : The End of Nature

8. Edward O. Wilson : The Biophilia Hypothesis 1993

9. Jacques Derrida : The End of Man in Margins of Philosophy 1982

10. E. Ann Kaplan (ed) Post Modernism and its Discontents

11. Hugh silverman (ed), Donn Welton : Post Modernism and Continental Philosophy

12. Robert Basil (ed) On the Barricades, 1989, Prometheus book, USA.

13. Corliss Lamont : The illusion of Immortality

1990 Half Moon Foundation New York PP 303.

- మిసిమి మాసపత్రిక, జూన్-1995