అబద్ధాల వేట - నిజాల బాట/చిట్కా వైద్యంలో కొత్త రష్యా డాక్టర్లు
రష్యాలో తిరుగుబాటు వచ్చి కమ్యూనిజం పోయిన తరువాత కొన్ని వివాదాలు తలెత్తాయి. అందులో మతఛాందసం ఒకటికాగా, అద్భుత చికిత్సకారులు మరొక ప్రక్క బాగా వ్యాపారం చేస్తున్నారు. అలాంటివారిలో ఇటీవల వ్లాడిమర్ మాక్సిమోవ్ (Vladimor Maximov) ఒకరు. మూఢనమ్మకాలకు, మతవిశ్వాసాలకు, అద్భుతచికిత్సల పేఠిక మోసాలకు పేరెన్నికగన్న వెనుకబడిన ప్రాంతం రష్యాలోని సైబీరియా. మాక్సిమోవ్ అక్కడే యీ చికిత్సల చిత్రాలు నేర్చాడు. ఆయన వయస్సు 38. గత సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం అక్కడ తన వ్యాపారాన్ని విస్తృతపరుస్తున్నాడు. అమెరికాలో చదువుకున్న జనానికి తీరిక, ఓపికలేక, మూఢవిశ్వాసాలతో జబ్బుల్ని నయం చేసుకోవాలనే మనస్తత్వం వ్యాపిస్తోంది. ఆ ధోరణిని మతవాదులు బాగా గిట్టుబాటు వ్యాపారంగా మార్చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మాక్సిమోవ్ కూడా చేస్తున్నాడు. అందులోనూ రష్యానుండి వచ్చాడు గనుక ఇంకా అద్భుతంగా అమెరికన్లకు కనిపించడం దూరపుకొండలు నునుపు సామెతను గుర్తుకు తెస్తుంది. అమెరికాలో వైద్యం బాగా ఖరీదు కనుక. అది అడ్డం పెట్టుకొని వీరు మార్గాంతరం అంటూ జబ్బుపడ్డవారిని ఆకర్షిస్తున్నారు. ఫోనుపై కొన్నాళ్ళు మాక్సిమోవ్ చికిత్స చేశాడట. ఇతడు తండ్రిని పోగొట్టుకొని, కమ్యూనిస్టు రాజ్యంలో బాధలుపడి, కసిగా యిలాంటి చికిత్స చిట్కాను మొదలుపెట్టాడు. కమ్యూనిస్టు హయంలో అద్భుతచికిత్సల్ని అణచివేశారని, ప్రజలలో దీనిపై ఆసక్తి వున్నదనీ ఆయన ప్రచారం చేశాడు. జీవశక్తిని ప్రకృతికి అనుకూలంగా మలచడం తన ప్రత్యేకత అని, ప్రకృతి అందరికీ ఒకటే అనీ, దేహంలో చికిత్స అంతర్గతంగా వుంటుందనీ మాక్సిమోవ్ అంటారు. నయం కానప్పుడు చిత్తశుద్ధితో ప్రార్ధనచేస్తారనీ, అప్పటికీ కుదరకపోతే, ప్రకృతిపై ఆధారపడాలనీ అంటాడు! దేహంలో వున్న జీవశక్తికి తోడ్పడాలనేదే తన ఆశయం అనీ, అన్ని పవిత్ర కీర్తనలలోనూ సర్వసాధారణ ప్రకంపనాలున్నాయని పెర్కొన్నాడు.
స్టాలిన్ కు, బ్రెజ్నెవ్ కు సైతం అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకాలుండేవని వీరు ప్రచారం చేస్తున్నారు. జార్ చక్రవర్తులు విదేశీమంత్రగాళ్ళను, ఆధ్యాత్మికవాదుల్ని సంప్రదించేవారు. చివరి జార్ చక్రవర్తి కాలంలో రస్ పుటిన్ ఇలాంటి శక్తులు చూపి తన గుప్పిట్లో ఎందరినో పెట్టుకుని ఆడించాడు. రష్యాలో బ్లావట్ స్కీ అనే ఆమె పుట్టి, అమెరికాలో దివ్యజ్ఞాన సమాజం పెట్టి ఇండియాకు వచ్చి కల్మషం వ్యాపింపజేసిన విషయం చాలామంది మరచిపోలేదు.
మతాన్ని మూఢనమ్మకాల్ని బలవంతంగా తుడిచిపెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాధమిక పాఠశాల స్థాయి నుండీ పాఠాలు చెబితే మూఢనమ్మకాలు ఈ సరి పోయేవే. అద్భుత చికిత్సలకు తావు లేకుండా వుండేది. కమ్యూనిస్టులు 70 ఏళ్లపాటు నియంతృత్వంలో ముసుగువేసిన విషయాలు ఈ రూపంలో బయటపడుతున్నాయి.