అబద్ధాల వేట - నిజాల బాట/ఆంధ్ర సాహితీ సంస్కృతులు హేతువాద దృక్కోణం
దేశంలో మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనప్పుడు ఆంధ్రలో వాటి ప్రభావం సాహిత్యపరంగా కనిపించింది. బెంగాల్ లో బ్రహ్మసమాజం విగ్రహారాధన పద్ధతిని, సతీసహగమనం పోవాలని, బాల్యవివాహాలు ఆపాలని, విధవా వివాహాలు చేసుకోవచ్చంటే, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం ఆ సమస్యల్ని తమ రచనల్లో ప్రతిబింబించారు. ఆ మాత్రానికే ఆయనపై సనాతనులు దాడిచేశారు. కన్యాశుల్కం, వ్యభిచారం ఇత్యాది అవినీతికర సమస్యల్ని గురజాడ అప్పారావు ఇతివృత్తంగా స్వీకరించి ఉత్తరోత్తరా సంస్కరణవాదులకు కొన్ని మార్గాలు చూపారు.
స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, బిడ్డల శిక్షణలో శాస్త్రీయ దృక్పథం ఒక తీవ్ర ఉద్యమంగా చలం తన రచనల ద్వారా చూపారు. ఇవన్నీ మత పరిధిలో సంస్కరణలు ఉద్దేశించినవే.
కట్టమంచి రామలింగారెడ్డి ప్రబంధాలలో,భారతంలో స్త్రీలను చులకనగా చూచిన పద్ధతిని ఎత్తిచూపి, ద్రౌపదివంటి పాత్రలను శ్లాఘించారు. మతాన్ని మానవుడు సృష్టించాడు. ఎంతో సాహిత్యం మతపరంగా వచ్చింది. ఆ మతం, సాహిత్యం మానవుడికి ప్రాధాన్యత పోగొట్టి, అతడిని దేవుడికి బానిసగా, మూఢనమ్మకాల కీలుబొమ్మగా చేసి ఆడించాయి. ఇవి భరించలేక, మత సంస్కరణలు, వాటి ప్రభావంతో పైన సూచించిన తీరులో రచనలు వెలువడ్డాయి. కాని సనాతనులు సంస్కరణల్ని వ్యతిరేకించారు.
విశ్వనాధ సత్యనారాయణ వంటి వారెందరో కులతత్వంతో సహా సనాతన మతాన్ని, విలువల్ని అట్టిపెట్టాలన్నారు. సంస్కరణవాదుల్ని నిరసించే సాహిత్యం వచ్చింది. దివ్యజ్ఞాన సమాజం ఇందుకు అండదండలు చేకూర్చి పెట్టింది.
జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక సాంఘిక ఉద్యమంగా ఆంధ్రలో త్రిపురనేని రామస్వామి వంటివారిని ప్రోత్సహించింది. పురాణాలను, రామాయణ, భారత, భగవద్గీతలలోని అమానుష విలువల్ని చూపుతూ ఆయన రచనలు చేశారు. ఆర్యసమాజ్,హిందూ మహాసభ ప్రభావంతో ఆయన ఉద్యమం సాహిత్యపరంగా సాగగా కొందరిని ప్రభావితం చేసింది.
మతం పేరిట సాగుతున్న అంటరానితనాన్ని ఖండిస్తూ జాషువా కవితలు ఎందరినో కదలించి వేశాయి. దేవుడి పేరిట మతం దృష్ట్యా సాగిపోతున్న బూతును తాపీ ధర్మారావు కొంతవరకు శాస్త్రీయంగా బయటపెట్టారు.
మతాన్ని, దేవుణ్ణి అంగీకరిస్తూనే సంస్కరణలు రావాలని ఇలాంటి సాహిత్యం ఎంత వచ్చినా, మూలాన్ని పెకలించలేకపోయింది. మతానికి కట్టుబానిసలుగా మారిన మనుషులను బంధవిముక్తులను గావించడానికి తీవ్రస్థాయిలో గోరా నాస్తిక ఉద్యమం మొదలెట్టారు. వెలికి గురయ్యారు.
మరోప్రక్క దేశ స్వాతంత్రోద్యమ ప్రవాహంలో ప్రభావితులైన వారు ఆ ధోరణిలో ఎన్నో రచనలు చేశారు. నాయకులపై కవితలు, వచనాలతో కూడిన సాహిత్యం వెలువడింది. ఉన్నవ లక్ష్మినారాయణ 'మాలపల్లి', తుమ్మల సీతారామమూర్తి 'ఆత్మకథ' ఇందులో భాగమే.
సంఘంలో జరుగుతున్న అక్రమాలు,మతం పేరిట సాగుతున్న దురన్యాయాలు 'సాక్షి' ద్వారా పానుగంటి లక్ష్మీనరసింహారావు వెల్లడించి నవ్వించారు. మరోవైపు సామ్యవాద ఉద్యమాల హోరువలన ప్రచార సాహిత్యం పుంఖాను పుంఖంగా ప్రారంభమైంది. శ్రీ శ్రీ యిందుకు శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్టులు అప్పుడప్పుడూ మతాన్ని ముట్టడించినా, మతవిమర్శలోనే అన్ని విమర్శలూ ఆరంభించాలనే మార్క్స్ సూత్రాన్ని పాటించలేదు. ఆర్థిక చట్రం మారితే అన్నీ వాటంతట అవే కుదుటబడతాయని, మతం ఉపరితల నిర్మాణం అని భావించారు. అదంతా దోషపూరిత ఆలోచన అని రుజువైంది. కమ్యూనిస్టుల ప్రచార సాహిత్యం కొందరు యువకులను తాత్కాలికంగా ఉద్రేకపరచినా అది నిలవలేదు. అయితే స్వాములు, బాబాలు చేస్తున్న మోసాల్ని బయట పెట్టడంలో కమ్యూనిస్టు కవిత తోడ్పడింది.
గోపీచంద్ వంటివారు హేతువాద ధోరణిలో రచనలు ఆరంభించి క్రమేణా అరవిందో ప్రచారకులుగా మారిపోయారు.
హేతువాదం మతపరిధిలో మార్పులు తేవడం కుదరనిపని అని గ్రహించింది. మతాన్ని, దైవభావాన్ని శాస్త్రీయంగా పరిశీలించింది. మానవుడే కొలమానం, మనిషి అన్నిటికీ మూలం అనే మూలసూత్రాలతో హేతువాదం ఆవిర్భవించింది.
అంతర్జాతీయంగా వచ్చిన మానవ హక్కులు హేతువాదానికి పట్టుగొమ్మలు. మత సమాజంలో మానవహక్కులకై కృషిచేయడమంటే ఎదురీతే. అందుకే హేతువాదంలో రచనలు చేసేవారు మైనారిటీగానే మిగిలారు. వీరిది దీర్ఘకాలిక కృషి.
ఆంధ్రలో ఎం.ఎన్.రాయ్, మానవవాదతత్వంతో ప్రభావితులైన పాలగుమ్మి పద్మరాజు, జి.వి. కృష్ణారావు తమ రచనల ద్వారా కృషి చేశారు. వారి ప్రభావం పరిమితమే అయినా, రాజకీయ పార్టీల మోసాలు బయటపెట్టడంలోనూ, మానవుడి కీలకపాత్రను చాటడంలోనూ వీరి సాహితీ సేవలు తోడ్పడ్డాయి.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాలకృష్ణమూర్తి తమ రచనలతో చెప్పారు. కొందరు కవులు, రచయితల్ని ఉత్తేజపరచారు. కొండవీటి వెంకటకవినుండి కొల్లా కృష్ణారావు వరకు ఆయన ప్రేరణలో రచనలు చేసి హేతువాదం మానవుడికి ఎలా అవసరమో చూపారు. మతంలోని అమానుష విలువల్ని ఎదిరించిన, ఆవుల గోపాలకృష్ణమూర్తి మనిషి కీలక స్థానాన్ని చాటడంలో తన పదునైన రచనల్ని ప్రయోగించారు.
హేతువాదానికి శాస్త్రీయ దృక్పధం పునాది. ఆంధ్ర సాహిత్యంలో శాస్త్రీయ పద్ధతి గురించి, శాస్త్రాన్ని గురించి రచనలు బహుకొద్ది మందే చేశారు. శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి విజ్ఞాన వీధులు. మహీధర రామమోహనరావు రచనలు, కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాలు, రావిపూడి వెంకటాద్రి విశ్వాన్వేషణ, జీవం అంటే ఏమిటి? శాస్త్రీయ రంగంలో హేతువాద దృక్పధం ప్రబలడానికి తోడ్పడుతున్నాయి. శాస్త్రాన్ని కూడా మతనమ్మకాలకు, మూఢవిశ్వాసాలకు అనుకూలంగా వాడే ప్రయత్నం కొందరు చేయకపోలేదు. అయితే అవి నిలవలేదు. శాస్త్రబలం అలాంటిది. చరిత్రను హేతువాద దృక్కోణంలో చూడడం మన అవగాహనకు అవసరం. చాలాకాలం కట్టుకథలతో, పుక్కిటి పురాణాలను చరిత్రగా చలామణి చేశారు. అందుకు భిన్నంగా కల్లూరి బసవేశ్వరరావు, భట్టిప్రోలు హనుమంతరావు వంటివారు చరిత్రను శాస్త్రీయంగా అందించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. మన వెనుకబడినతనానికి చరిత్ర అవగాహన లోపించడం ప్రధానకారణం. ఏది వూహ, ఏది వాస్తవం అనే విచక్షణ లోపించింది. అందుకే చరిత్ర పరిశీలనకు శాస్త్రీయ దృక్పధం కొలమానంగా వుండాలి.
సెక్స్ గురించి మన సమాజంలో వున్నన్ని అపోహలు, అశాస్త్రీయ ఆలోచనలు మరే రంగంలోనూ లేవేమో! చలం కొంతవరకు యీ విషయంలో కొత్త మార్గాన్ని అవలంబించారు. ధనికొండ హనుమంతరావు,రాంషాలు మరికొంత ముందుకువెళ్ళి శాస్త్రీయ దృక్పధాన్ని ప్రబలింపజేశారు. వైద్యశాస్త్ర జ్ఞానంతో ముడిపడివున్న యీ సెక్స్ జ్ఞానం విద్యార్థి దశ నుండి అందరికీ అవసరమని ప్రపంచవ్యాప్తంగా గ్రహించారు. డా॥సమరం నాస్తిక కేంద్రం నుండి సెక్స్ జ్ఞానాన్ని, హేతుబద్ధంగా దినపత్రికల ద్వారా, పుస్తకాల రూపేణా విపరీత ప్రచారంలోకి తెచ్చారు. కామిగానివాడు మోక్షకామికాడనే మాట విన్నాం. ధర్మార్ధ కామమోక్షాలలో కామాన్ని ఒక పురుషార్ధంగా చేర్చారు. దేవాలయాలపై రతి రహస్యాలను చెక్కారు. అయినా సెక్స్ గురించి మూఢనమ్మకాలే మన సాహిత్యంలో ఎక్కడ చూచినా ఎదురయ్యాయి. హేతువాద దృక్పధం సెక్స్ జ్ఞానంలో అవసరమని ఇప్పుడిప్పుడే కొద్దిమంది గ్రహించారు. ముఖ్యంగా రచనలు చేసేవారు తెలుసుకోకుండా వాత్సాయన కామశాస్త్రం దగ్గర ఆగిపోతే ప్రమాదం. స్త్రీలపట్ల వివక్ష చూపడంలో సెక్స్ జ్ఞానలోపం ఒకటి అనేది కూడా గ్రహిస్తున్నారు.
మన సాహిత్యరంగంలో హేతువాద దృక్పధం బాగా లోపించడానికి సైకాలజి బొత్తిగా తెలుసుకోకుండా రచనలు చేయడం కారణం. సి. నరసింహారావు "రేపు" అనే పత్రిక ద్వారా సైకాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక సమస్యల్ని హేతువాద దృక్పధంతో పరిష్కరింపజేయడానికి కృషిచేశారు. ఆధునాతనంగా మానసికరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రజల్లోకి రావాలి. స్త్రీపురుషులు, పిల్లలు గురించి శాస్త్రీయ అవగహన వుంటేనే సమాజాన్ని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇది నిత్యనూతనంగా జరగాల్సిన కృషి. బాల్యావస్థలోవున్న సైకాలజీ జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎంతో శ్రమ అవసరం.
సాహిత్యపరంగా మన సమాజంలో మహిళలకు జరిగిన అన్యాయం అమానుషమైనది. మతపరంగా వచ్చిన యీ వివక్ష అన్ని రంగాల్లోనూ ప్రబలింది. పాశ్చాత్య దేశాలలో వచ్చిన స్త్రీ విమోచనోద్యమం ఇంకా మన దగ్గర శైశవ దశలో వున్నది. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులు స్త్రీ శక్తి సంఘటనల పేరిట కొంత చైతన్యాన్ని తెచ్చారు. అయితే హేతువాద దృష్టిలో రచనలను చేసి మహిళా రంగంలో ఒక ఉప్పెనవలె చైతన్యం తేవడానికి మల్లాది సుబ్బమ్మ చేస్తున్న కృషి అనన్యసామాన్యం. మత ఛాందసులను అడుగడుగునా ఎదుర్కొంటూ ఆమె రచనలు సాగిస్తున్నారు. ఆధునిక హేతువాద ధోరణికి మతవిమర్శ ఒక భాగంకాగా, శాస్త్రీయ దృక్పధం రెండవభాగంగా వున్నది. ఈ పద్ధతిని పాటిస్తూ తెలుగులో రచనలు చేస్తున్నవారు మల్లాది రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, ఆవుల సాంబశివరావు, కీ॥శే॥నార్ల వెంకటేశ్వరరావు. మతాలన్నీ మానవుడికిగాక దైవానికి కేంద్రస్థానం కల్పించాయి. కర్మ,పునర్జన్మ, కులభేదాలు, అంటరానితనం, సతి,స్త్రీపట్ల వివక్ష యిత్యాదులన్నీ మతపరంగా వచ్చాయి. ఉన్నత సంప్రదాయాలుగా పేర్కొన్న వేదాలు, షడ్దర్శనాలు, ఉపనిషత్తులు, గీత, సామాన్యుడి సంప్రదాయాలుగా బహుళ ప్రచారం పొందిన భారత రామాయణ, పురాణాలు సమాజంలోని దోషాలకు ఆమోదముద్ర వేశాయి. వాటిని హేతువాద రచయితలు ఎదుర్కొనడానికి ప్రయత్నించారు. నార్ల వెంకటేశ్వరరావు జాబాలి, నరకంలో హరిశ్చంద్ర, ద్రౌపది, హిరణ్యకశిపుని వధ, సీతజోస్యం యీ కోవకు చెందినవే. అలాగే ఆవుల సాంబశివరావుగారి నాటికలు, విమర్శలుకూడా, మతదోషాల్ని సునిశితంగా పరిశీలించినా కొంత తీవ్రధోరణిలో రావిపూడి వెంకటాద్రి శంకరాచార్యుల తత్వాన్ని, మూఢనమ్మకాలను దుయ్యబట్టారు. ఇవన్నీ చాలా హేతుబద్ధంగా వున్నాయి. క్రైస్తవ, ఇస్లాం, హిందూ మతాల విమర్శలు మల్లాది సుబ్బమ్మ రచనల్లో కనిపిస్తాయి. "జిల్లెళ్ళమూడి అమ్మ" అనే రచన ఎం.వి. రామమూర్తి చక్కని విశ్లేషణ చేసి, బాబాలందరికీ అన్వయించేటట్లు శాస్త్రీయ పరిశీలన చేశారు.
వైజ్ఞానిక దృక్పధం ప్రత్యామ్నాయంగా వుండాలని, మతం స్థానంలో మానవ విలువలు వుండాలని హేతువాదులు ప్రతిపాదించారు. మతం, దైవం లేకుంటే నీతి వుండదనే భయాన్ని కాదంటూ, అవన్నీ మానవుడి సృష్టీ అనీ, మనిషికి వైమనస్యత రాకుండా వుండడానికి మానవ హక్కులు, విలువలు పాటించాలని వీరు తమ రచనలలో చూపారు.
ఇస్లాంమతాన్ని హేతువాద దృక్పధంతో విమర్శించిన మల్లాది సుబ్బమ్మ, వివేకానందను నిశిత పరిశీలనకు గురిచేసిన ఆవుల గోపాలకృష్ణమూర్తి, బైబిల్ బండారాన్ని బయట పట్టినందుకు ఎన్.వి.బ్రహ్మం అనేక నిర్హేతుక విమర్శలకు, చిక్కులకు లోనుగావలసి వచ్చింది. అయినా సాహిత్యంలో ఔచిత్యం కావాలని వీరు పట్టుబట్టారు.
హేతువాదం వేమనలో తొంగిచూడగా, వెంకటేశ్వరరావులో పరిపక్వతను అందుకోగా, వెంకటాద్రిలో శాస్త్రీయ పంధాలో సాగింది. హేతువాదం ఒక తాత్విక దృక్పధంగా అవగాహన అయిన తరువాత, అది కవితలో, నాటకంలో, నవలలో, సామాజిక, సాంకేతిక శాస్త్రాలలో, విమర్శలలో జీవం పోసుకుంటుంది.
మూఢనమ్మకాలు చాలా హాయిని సమకూర్చిపెడతాయి. కొందరు రచయితలు వీటిని బాహాటంగా తమ రచనలలో ప్రవేశపెట్టగా పాఠకుల్ని ఆకర్షిస్తున్నాయి. కాని ఇది మనిషి పురోగతికి పనికిరాదు. అందుకే హేతువాదం యిలాంటి రచనల్లోని మూఢత్వాన్ని ఖండిస్తుంది. నమ్మడం మొదలెడితే దేన్నైనా నమ్మొచ్చు. రుజువు అవసరం లేనప్పుడు, కర్మ, పునర్జన్మలపైన అన్నిటినీ నెట్టెయ్యవచ్చు. హేతువాదం అడుగడుగునా శాస్త్రీయ పంధాను స్వీకరించి, తప్పులుచేస్తే దిద్దుకుంటూ, మనిషిని ముందుకు తీసుకెడుతుంది. ఇన్నాళ్ళుగా మనకు యిష్టమైన నమ్మకాలను దెబ్బకొడుతుంటే కొందరికి బాధగా వుంటుంది. అయినా మానవ వికాసానికి శాస్త్రీయపంధా మూఢనమ్మకాలతో రాజీపడలేదు.
ఒక విధంగా చూస్తే హేతువాద రచనలు శైశవదశలోనే వున్నాయి. యువతరం ఇప్పుడిప్పుడే హేతువాదాన్ని ఆకాంక్షిస్తున్నది.
- హేతువాదమన్న జ్యోతిని చేబూని
- నరుడు నడచివచ్చె నేటి స్థితికి
- హేయమౌను బ్రతుకు హేతువాదమువీడ
- నవయుగాలబాట నార్లమాట
- తెలిసిన విషయాలు తెలియనివాటిలో
- ఎంతో స్వల్పమనును హేతువాది
- విఱ్ఱనీగ నతడు వేదాంతి కాడురా
- నవయుగాలబాట నార్లమాట
ఇదీ సారాంశం:
ఎం.ఎన్.రాయ్, మానవతా ప్రభావం ఆంధ్రలో 1940 నుండీ కనిపించింది. ఆలోచనలలో శాస్త్రీయ దృక్పధానికి యీ తత్వం తోడ్పడింది.
(బెంగుళూరు తెలుగు మహాసభలకు 1990 మార్చి సమర్పించిన వ్యాసం)