అనిరుద్ధచరిత్రము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

అనిరుద్ధచరిత్రము

చతుర్థాశ్వాసము




మత్పాదాంబుజజని
తామరకల్లోలినీపయఃపూతనభో
భూమండలపాతాళమ
హామహిమోదారమంగళాద్రివిహారా.

1


గీ.

అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ
డాపరీక్షిన్మహారాజు నాదరమునఁ, జూచి విజ్ఞాననిధియైన శుకుఁడు పలికె.

2


వ.

ఇవ్విధంబున మాసచతుష్టయంబు గడచె నంత నొక్కనాఁడు.

3


సీ.

యాదవవృష్ణిభోజాంధకాన్వయవీరకోటు లిర్వంకలఁ గొలువు సేయ
శంబరాహితసాంబచారుధేష్ణాదికుమారవర్గంబు నెమ్మది వసింపఁ
గని వందిమాగధగాయకవ్రాతము ల్వితతవాక్ప్రౌఢసన్నుతులు నెఱప
హితబంధుజనపురోహితమంత్రినికరంబు కాలోచితప్రసంగములు నడప
స్వామి సాహో పరాక హెచ్చరిక యనుచు, వేత్రహస్తులు పలుమారు విన్నవింప
మహితరత్నవిభాసభామంటపమున, నెలమిఁ గొలువుండె నపుడు లక్ష్మీశ్వరుండు.

4


సీ.

చిఱునవ్వుటమృతంబు చిలుకు చెక్కిళ్లపై నక్రకుండలకాంతి యాక్రమింప
ధవళారవిందసుందర మైనకన్నుల నుల్లాసరసము రంజిల్లుచుండఁ
గౌస్తుభమాణిక్యకలితవక్షంబున వైజయంతీవైభవంబు మెఱయ
జిగిబిగిసొగసుచేఁ జెలువొందు నెమ్మేనఁ జర్చితచందనచ్ఛాయ దనరఁ
జిత్రసింహాసనమున నాసీనుఁడై యు, పాంతపీఠిక నుంచిన యడుగుఁదమ్మి
నతనృపాలశిఖామణిద్యుతుల మెలఁగ, భువనమోహనశృంగారపూర్ణుఁ డగుచు.

5


వ.

ఉన్నసమయంబున.

6


సీ.

హంసపీఠికయందు ననువొందు వల్లకీతంత్రులు వల్లికాతతులు గాఁగ
సుందరముఖపద్మమందస్మితచ్ఛవి సొంపారుపువ్వులగుంపు గాఁగ

రాజిల్లు తులసీపయోజాక్షమాలిక ల్ఫలశలాటులతోడిగెలలు గాఁగ
హరినామసంకీర్తనాలాపనినదంబు శుకశారికాపికస్ఫూర్తి గాఁగ
భసితలిప్తాంగరుచి సితప్రభలు నిగుడ, గహ్వరీభాగవిహరణగతి విలాస
జంగమాకారకల్పభూజంబుభాతి, నాకముననుండి విచ్చేసె నారదుండు.

7


చ.

నయనయుగంబునందుఁ గరుణారసవృష్టి చెలంగ భూషణో
దయరుచి చంచలాలతవిధంబునఁ బెంపు రహింప సాధుసం
చయముఖచాతకంబులకు సౌఖ్య మొసంగ సభానభస్థలిన్
నయగుణశోభియై వెలయు నందతనూభవనీలమేఘుమున్.

8


గీ.

కాంచి యానందహృదయుఁడై కదియవచ్చు, సంయమీంద్రునిఁ గని లేచి సపరివారుఁ
డగుచుఁ బ్రణమిల్లి కనకసింహాసనస్థుఁ, జేసి యర్ఘ్యాదివిధులఁ బూజించునపుడు.

9


క.

శ్రీరస్తు కుశలమస్తు మ, నోరథసంసిద్ధిరస్తు నుత్యశ్రీమ
న్నారాయణభవతే యని, సారెకు దీవించి పలికె జలజాక్షునితోన్.

10


క.

తలిదండ్రు లన్నదమ్ములుఁ, గులసతులును బుత్త్రపౌత్త్రకోటియు నాప్తుల్
చెలులుం జుట్టములును భ్ళ, త్యులుఁ బౌరులు సుఖుల రగుచునున్నారుగదా.

11


వ.

అనిన నమ్ముకుందుండు మందస్మితముఖారవిందుం డగుచు శతానందనందనున కి ట్లనియె.

12


గీ.

కమలజాత్మజ మీయనుగ్రహమువలన, వర్తమానమునందు సర్వము శుభంబు
భావికాలంబునకును శుభంబు నిజము, తావకాగమనంబు నిదానమగుట.

13


చ.

పరమమునీంద్ర మీచరణపద్మపవిత్రపరాగలేశ మె
వ్వరిగృహసీమనుం బొరయు వారిపురాకృతపుణ్య మెట్టిదో
దురితములన్నియుం దొలఁగుఁ దోడనె భాగ్యము లెల్లఁ జేకుఱున్
నిరుపమమోక్షలక్ష్మియును నిక్కముగా లభియించు వారికిన్.

14


వ.

అని మఱియుఁ దదీయమహిమానురూపంబు లగుమధురాలాపంబులు పలుకుచుండి
తదనంతరంబ, ప్రసంగవశంబున నిట్లనియె.

15


శా.

అయ్యా మాయనిరుద్ధుఁ డెం దరిగెనో యాకస్మికం బౌటచే
నయ్యైచోటులఁ జూడబంచితిమి గోరంతైన నవ్వార్త లే
దయ్యె న్వానిఁ దలంచి మామకజనం బత్యంతచింతామయం
బ య్యిట్లున్నది సేయఁగావలయు కార్యం బానతీయ న్దగున్.

16


మ.

అనినం గృష్ణునిమోముఁ జూచి దరహాసాంచన్ముఖాంభోజుఁడై
మునినాథాగ్రణి పల్కె సర్వమునకు న్మూలంబవై సాక్షివై
పెనుప న్మన్పఁగఁ గర్తవై ప్రభుఁడవై పెంపొందియు న్నీ వెఱుం
గనిచందంబున నన్నుఁ గార్య మడుగంగా నెంతధన్యుండనో.

17


వ.

నే నెఱింగినయర్థంబు విన్నవించెద నవధరింపుము.

18

సీ.

శోణపురీశుండు బాణాసురుం డనాహతశౌర్యశాలి సహస్రబాహుఁ
డతనికూఁతురు రూపయౌవనభాగ్యలక్షణకళావతి యుషాకన్య యెసఁగు
నాయింతి కలలోన ననిరుద్ధుఁబొడ గాంచి మోహించి సంతాపమునఁ గృశింపఁ
జెలికత్తెయై తగు చిత్రరేఖాంగన యాత్మీయయోగవిద్యానిరూఢి
నింగి నేతెంచి శయ్యపై నిదురవోవు, వానిఁ గొనిపోయి యాచంద్రవదనఁ గూర్చె
నతఁడుఁ దత్కిలికించితరతిసుఖాబ్ధి, మగ్నుఁడై యుండె నిరతంబు మఱచి యందు.

19


ఉ.

అంతట గర్భమయ్యె జలజాక్షికి నవ్విధ మెల్ల బాణుఁ డా
చెంత మెలంగునంగనలచే విని దైత్యులఁ బంపుపెట్టినం
బంతముతోడ వారు దనుఁ బట్టఁగ వచ్చిన సింహశాబకం
బెంతయుఁ దీవ్రత న్మదగజేంద్రముల న్విదలించుకైవడిన్.

20


వ.

హతశేషులు పోయి విన్నవించిన నతండు.

21


ఉ.

చంపిన నాగ్రహంబున నిశాచరుఁ డార్చి యెదిర్చి పేర్చినం
దెంపురు బెంపునుం గలిగి ధీకొని యుద్ధముఁ జేసి చేసి ని
ర్జింపఁగ లేక దైవగతిచే ననిరుద్ధుఁడు వానిచేత బం
ధింపఁబడెన్ దశాస్యజఫణిప్రదరావృతరాఘవాకృతిన్.

22


వ.

జంబూద్వీపంబునం గల్గువిశేషంబులం జూచుటకై విశ్వంభరాభాగంబున సంచరించి
శోణనగరప్రాంతమార్గంబున స్వర్గంబునకుం బోవుచుండి యీయోగక్షేమంబు వినుటం
జేసి తెలియఁబలుక న్వలసె నిటమీఁదటికార్యంబు చతుర్థోపాయసాధ్యంబగుట
చిత్తంబునఁ దోఁచియున్నదేకదా యథోచితప్రయత్నంబు సేయునది మీకు
నభ్యుదయపరంపరాభివృద్ధి యయ్యెడుఁ బోయివచ్చెదనని గోవిందునిచేత నామంత్రి
తుండై నారదుండు యథేచ్ఛావిహారంబున నరిగె. అప్పుడు ప్రద్యుమ్నతనూభవక్షేమ
వార్తాకర్ణనంబునం బొడము మోదంబును దదీయపరాజయవృత్తాంతశ్రవణసంజనితం
బగు భేదంబును దత్పరిపంథిసంహరణోద్రేకం బగురోషంబును ముప్పిరిగొని హృద
యంబులం గలయ నల్లి ముఖంబుల నాక్రమింప యాదవసమూహంబులు ముకుంద
వదనారవిందం బవలోకించుచుండినవార లగుచుండి రప్పుడు పుండరీకాక్షుండు మంత్రి
పుంగవుల నవలోకించి దండయాత్రకుఁ జతురంగబలంబు నాయితంబు గమ్మని నియో
గింపుఁడనిన వారు నుద్దండదండనాయకులఁ బడవాళ్లనుం బిలిపించి తత్ప్రకారంబుఁ
దెలిపిన వారునుం దదీయప్రయత్నపరాయణులై యుండిరి.

23


క.

భేరీధణంధణంధణ, భూరిధ్వానమున భూనభోభాగంబుల్
భోరుమని మ్రోసె నాశా, వారణములు బెదరె నదరె వసుధాధరముల్.

24


ఉ.

పాపయుతత్రిషష్ఠము శుభస్థితకేంద్రము కార్యపూర్ణదృ
గ్వ్యాపకముం గదా యని శరాసనలగ్నము చంద్రహోరను

ద్దీపితపుష్కరాంశ గణుతించి విశేషముహూర్త మంచు మే
ధాపరిపూర్ణు లైనవసుధావిబుధు ల్వినుతింప నయ్యెడన్.

25


సీ.

అంతరాంతరనిబద్ధానూనఘంటికాఖండఘాణంఘణంఘణరవంబు
శుభగణోజ్జ్వలసైన్యసుగ్రీవమేఘపుష్పవలాహకతురంగభాసురంబు
ఘనపతాకాగ్రజాగ్రఙ్జిహ్మగవిపక్షిపక్షరుగ్భూషితాంబరతలంబు
చక్రవిభ్రమణసంజనితనిర్ఘోషభగ్నదిశామతంగజకర్ణకుహర
మహితలోచనదుర్నిరీక్షాక్షరాంశు, మాలికోగ్రసహస్రారమండితంబు
నైనరథ మెక్కి పుండరీకాక్షుఁ డపుడు, కదలె శతకోటిసూర్యప్రకాశుఁ డగుచు.

26


శా.

ఖేలత్తాళతరుధ్వజస్ఫురితమై క్రేంకారవత్కింకిణీ
మాలాజాలవిభాత్యుదాత్తగళశుంభద్ఘోటకోదగ్రమై
శ్రీలం బొల్చుశతాంగ మెక్కి యరిగె న్సీరాయుధుం డుల్లస
త్కైలాసాచలసన్నిభప్రభ లెసంగ న్సంగరోద్యోగియై.

27


చ.

నిరుపమపద్మరాగమణినిర్మితభూషణసంప్రయుక్తసుం
దరతరనీలవిగ్రహఘనద్యుతిపుంజము సేంద్రచాపవి
స్ఫురితపయోధరంబుగతిఁ జూడ్కుల కిం పొనరింప మన్మథుం
డరిగె సమీనకేతనసమగ్రశతాంగపరాధిరూఢుఁడై.

28


క.

కృతవర్ముఁడు దేహాలం, కృతవర్ముఁడు శిఖరకరపరిస్ఫుటసంధీ
కృతధర్ముఁడు భీకరధి, క్కృతధర్ముఁడు నగుచు నరిగెఁ గృష్ణునిమ్రోలన్.

29


ఉ.

సాత్యకిచారుధేష్ణుగదసాంబముఖు ల్యదువీరు లేగి రౌ
ద్ధత్యమునందు రంగమమతఁగజతుంగశతాంగసంస్థులై
హేత్యురుదీధితిచ్ఛటలు హేళివిలాసము నాక్రమింప లా
లిత్యసితాతపత్రతరళీకృతచామరరాజమానులై.

30


సీ.

చటులశుండాదండసంభూతఫూత్కారపవనాహతిని మేఘపఙ్క్తి చెదర
రమణీయదంతనిర్మలచాకచక్యకాంతులు పట్టపగలు వెన్నెలలు గాయ
నైషాదఘీంకారఘోషార్భటిని ఖేచరాంగన ల్పతులఁ గవుంగిలింపఁ
జరదగ్రవిగ్రహస్ఫురణ వజ్రికిఁ బునర్జనితపక్షాహార్యశంక వొడమ
ఘంటికాకింకిణీమాలికాసమూహ, ఘణఘణంఘణకిణికిణికిణినినాద
తాళవైలంబయానావధానములను, గంధబంధురసింధురఘటలు నరిగె.

31


సీ.

లేళ్ళభంగిని జౌకళించి చౌపుటము లొక్కుమ్మడి పదినైద నుఱికియుఱికి
పాతరకత్తెలవలె నిల్చి యడుగులో నడుగుగా నాట్యంబు లాడియాడి
కుమ్మరసారెలకొలఁది గిఱ్ఱున రెండుదిక్కుల వలయము ల్దిరిగితిరిగి
యనిలంబురీతి ఱివ్వునఁ దూఁగి ధరణిపైఁ బదములు నిలుపక పఱచిపఱచి

కఠినరింఖాముహర్ముహుర్లుఠితభూప, రాగధూసరితామలరమ్యచికుర
సంచరవిధూతఖచరచేలాంచలంబు, లగుచుఁ గిహికిహికార్భటి నరిగె హరులు.

32


భుజంగప్రయాతము.

భ్రమచ్చక్రనిహితబాహుళ్యధాటిన్, క్షమామండలం బెల్ల సంక్షోభ మందన్
సముత్తుంగరంగధ్వజచ్ఛన్నశుంభ, త్తమోభిక్పథంబుల్ రథంబు ల్గమించెన్.

33


శా.

చిల్లాడంబులమీఁదట న్బిగువుకాసె ల్జుట్టి పొంకంబు వా
టిల్ల న్వంకులు చెక్కి శూలములు నీఁటె ల్కత్తులుం గేళముల్
బల్లెంబు ల్మొదలైన సాధనతతు ల్బాహాబలోద్వృత్తి సం
ధిల్లం దాల్చిపదాతితోటి నడిచెన్ దిక్చక్ర మల్లాడఁగన్.

34


చ.

గొడుగులు ఫేనము ల్తురగకుంజరము ల్తిమినక్రసంచయం
బుడుగని వాద్యఘోషము మహోర్మిరవంబు పరిభ్రమింపఁగాఁ
బడుపటుహస్తభాస్వదరి పఙ్క్తులు సుళ్లును గాఁగ నెక్కుడున్
వడిశరచాపము ల్గలిగి వాహిని వాహినిలీల నేగఁగన్.

35


గీ.

క్షేమకారి దీర్చె చెలరేఁగి యనుకూల, మారుతంబు వీచె మాంసఖండ
ములును బూర్ణకుంభములు బుష్పఫలములు, నెదురువడియెఁ దురగహేష లెసఁగె.

36


వ.

మఱియుఁ గళ్యాణకరంబు లైనశకునంబు లెడనెడం బొడగనుచు ననుచు ముదంబున
భూసురసమూహంబు లుచ్చైస్స్వనంబున నాశీర్వదించి దిగ్విజయోస్తు తథాస్తు వచన
బాహుల్యనినాదంబులును, బసిండిపళ్లెరంబులఁ గర్పూరదీపికాసముదయంబు నించి
నీరాజనంబు లొసఁగుచు బ్రాహ్మణపుణ్యవనితాజనంబులు జయమంగళంబని పాడు
మంగళకౌశికరాగస్వరంబులును, సౌధశిఖరంబులం దుండి చూచుచుఁ గుసుమలాజాక్ష
తవితానంబు పైఁ జల్లు పురంధ్రీనికరకరకంకణకాంచనకాచఝణఝణత్కారనా
దంబు లిరుపార్శ్వంబుల నిలిచి హృద్యగద్యపద్యంబుల బాహాటంబునం బొగడు వంది
మాగధసందోహంబుల జయవిజయీభవ శబ్దంబులును, విపంచీస్వరమండలరావణహస్తా
దిజంత్రవాద్యంబులు మీటుచు సంగీతంబులు సేయు గాయకోత్తముల షడ్జమధ్యమ
గ్రామరవంబులును, భేరీమృదంగపణవానకడిండిమప్రముఖవాద్యధణధణత్కార
రావంబులును, శంఖకాహళవేణుప్రభృతితూర్యనిస్వనంబులును సమదవారణఘీం
కారఘోషంబులును, దురంగహేషానినదంబులును, శతాంగచక్రనిర్దోషంబులును, బ
థికనికరశరాసనపుజసింజినీటంకారవికారంబులును నేకీభవించి బ్రహ్మాండభాండ
మధ్యంబునం బూర్ణీభవించి మహాకోలాహలంబై రాకానిశాకరబింబోదయసంద
ర్శనసముత్సాహసముజ్జృంభమాణమహాంభోనిధి ననుకరింప ద్వాదశాక్షోహిణీబలసమే
తుండై కతిపయప్రయాణంబుల శోణపుటభేదనోపాంతప్రదేశంబుఁ జేరి యనర్కకి
రణవ్యాప్తచ్ఛాయాసాంద్రసకలమహీరుహశోభితంబుసు, మధురజలసంపూర్ణప్ర

వాహతటాకవాపీసమూహభూయిష్ఠంబును నైన మనోహరస్థలంబునఁ బటకుటీరం
బు లెత్తించి యచ్చట వేలాలంఘనంబు చేసి రాసమయంబున.

37


క.

బాణాసురగర్వము సం, క్షీణం బగు నింక ననుచుఁ జెప్పినక్రియ గీ
ర్వాణులు సంతసమందఁగ, క్షోణిన్ దత్కేతనంబు గూలెం బెలుచన్.

38


వ.

అప్పు డమ్మురాంతకుండు తత్పురంబు దాడివెట్టంబంచిన.

39


సీ.

ప్రాకారములు ద్రవ్వి పడఁద్రోయువారును గోపురంబులు నేలఁగూల్చువారు
సౌధయూధము నేలచదును చేసెడివారు వనభూజములు పీకివైచువారు
కమలాకరములు భగ్నము సేయువారును ధనవస్తువులఁ గొల్లఁగొనెడివారు
యజ్ఞశాలలు వహ్ని కర్పించువారును దెగి పౌరజనుల బాధించువారు
నగుచు యాదవవృష్ణిభోజాంధకాది, యోధవీరులసైన్యంబు లుక్కు మిగిలి
తత్పురం బాశ్రమించి యుద్దండవృత్తి, దాడివెట్టుట కబ్బాణదైత్యవిభుఁడు.

40


మ.

నటదుద్యద్భ్రుకుటీభయంకరముఖాంతశ్శోణదృక్కోణవి
స్ఫుటదీప్తిచ్ఛటవిస్ఫులింగపటలోద్భూతంబు గావింప ను
త్కటధాటీపటుతాకహఃకహకహధ్వానాట్టహాసార్భటిం
జటులాహంకృతి విస్తరిల్ల సమరోత్సంక్రీడనోత్సాహియై.

41


మ.

రణభేరీప్రకటాంకభాంకరణసంరావంబు త్రైలోక్యభీ
షణమై మ్రోయ భుజాసహస్రసముదంచచ్ఛాతహేతిచ్ఛటా
ఘృణి శోభిల్ల ననర్హ్యరత్నఖచితప్రేంకచ్ఛతాంగాధిరో'
హణుఁడై సంగరకేళికి న్వెడలె నుద్యద్వాహినీయుక్తుఁడై.

42


గీ.

వాని మొగసాలఁ గాఁపున్నవాఁడు గాన, యుద్ధసాహాయ్యమునకు నుద్యుక్తుఁడయ్యె
భక్తసులభుండు శాంకరీప్రాణనాథుఁ, డనుఁగుఁజెలికానితో గొంత పెనఁగుటకును.

43


వ.

అప్పుడు.

44


సీ.

ఘనవాలవిక్షేపజనితవాతాహతి దిగ్వలయంబు దిర్దిరను దిరుగ
వడి ఘణిల్లున ఱంకె వైచిన మేరుమందరశైలములు ప్రతిధ్వనుల నీన
గుప్పించి యుఱికినఁ గుంభినీభారంబు సైఁపక దిక్సామజములు మ్రొగ్గఁ
గ్రొవ్వాడికొమ్ములకొనలచిమ్ముల బలాహకసమూహము వకావకలు గాఁగఁ
గంఠవిలుఠన్మహోజ్జ్వలఘంటికాప్ర, భూతఘాణంఘణస్వనస్ఫురణ దనర
విజితరజతాచలస్ఫూర్తి వృషభమూర్తి, నీలకంఠునిముందర నిలిచె నపుడు.

45


సీ.

ఘనజటాజూటసంకలితగంగాతరంగచ్ఛటల్ గళగళంఘళ యనంగఁ
జలితావతంసకోమలశశిస్రవసుధాసారంబు ఝళఝళంఝళ యనంగ
నంగసంఛాదితవ్యాఘ్రేంద్రచర్మసంచలనము ల్బెళబెళబెళ యనంగఁ
గరపరిభ్రమితభీకరశాతశూలనిర్మలదీప్తి తళతళతళ యనంగ

తే.

శంకరుఁడు నందిపై నెక్కి హుంకరించి, యతిశయార్భటిఁ గెవ్వున నార్చి పేర్చి
చౌకళింపులు దుమికించి చక్రగతులఁ, దరిమి పేరంబు దోలు చునరిగె ననికి.

46


క.

చంచత్కోమలపింఛో, దంచితకేకేంద్రవాహనారూడుండై
వేంచేసె భవునివెంబడిఁ. గ్రౌంచవిభేదనుఁడు ప్రమథగణపరివృతుఁడై.

47


లయగ్రాహి.

తుండములు ఫూత్కరణచండపవనంబు ఘనమండలముఁ దాఁకి బహుఖండములు సేయన్
మెండుకొని ఘీంకృతులు దండిసరసీరుహభవాండఘటమధ్యమున నిండి కడుమ్రోయన్
గండములపై మద మఖండఫణితిం గురియుచుండఁ బటుదంతరుచి మండితముగా వే
దండన బలతండములు భండనజయోద్ధతిని గొండలగతి న్నడిచెఁ బాండుకులేంద్రా.

48


స్రగ్ధర.

రింఖాసంఘాతజాతావతవితతధరారేణుపంకీకృతాబ్ధుల్
ప్రేంఖన్మమాణిక్యమాలాధృతకళ లుఠదాభీలఘంటారవంబుల్
పుంఖీభూతాస్త్రమౌర్వీస్ఫుటనికటధనుస్ఫూర్జితారోహకంబుల్
కంఖాణంబు ల్విచిత్రక్రతుగమనచమత్కారలీలం గమించె.

49
తోటకవృత్తము.

పాటనబాహసభవ్యతనూధృ, చ్చాటుసురాలయశైలవిభాతిన్
హాటకరత్నమయస్ఫుటదీఫ్తుల్, దాటి చెలంగ రథవ్రజ మేగెన్.

50


మ.

కృతనానావిధసాధనశ్రమసమిత్క్రీడాచమత్కారని
ర్జితబేతాళు లవక్రవిక్రమగుణశ్రీతుల్యకంఠీరవుల్
శతకోటిప్రతిమానవిగ్రహు లుదంచద్ధైర్యజాంబూనద
క్షితిభృత్తు ల్భటసంఘము ల్నడిచె నక్షీణప్రతాపోన్నతిన్.

51


గీ.

అట్సు చతురంగసేనాసమేతుఁ డగుచు, నరిగె నెడనెడఁ బొడగాంచు నాపజయిక
శకునముల నాత్మలోపల సరకుగొనక, దురభిమానంబు పేర్మి నిర్జరవిరోధి.

52


వ.

అప్పుడు.

53


పరమేశుల్ భగవంతు లవ్యయులు శుంభద్భాహుశౌర్యోజ్జ్వలుల్
హరిమృత్యుంజయు లిద్దఱు న్రణము సేయంజూచు నుత్కంఠచే
సరసీజాసనపాకశాసనసమస్తబ్రహ్మదేవర్షికి
న్నరసాధ్యాదులు మింట నిల్చిరి విమానవ్రాతసంరూఢులై.

54


వ.

యాదవసైన్యంబును నిస్సామాన్యం బగునుత్సాహంబున దానవసేనాసమూహంబు
నెదుర్కొనియె నట్లుభయబలంబులును సంవర్తనసమయసముజ్జృంభమాణా
న్యోన్యసంఘర్షణ పూర్వాపరమహార్ణవంబులవిధంబున నొండొంటిం దాఁకి రథికులు
రథికులును, వారణారోహకలు వారణారోహకులును, నాశ్వికులు నాశ్వికులును, బదా
తులు పదాతులును ద్వంద్వయుద్ధంబునకుం గడంగి కోదండదండంబు లంకించి సింజి

వీటంకారనినాదంబులు రోదసీకుహరంబు నిండ నాకర్షణసంధాన దృఢముష్టిలాఘవ
లక్ష్యశుద్ధిదూరాపాతవిశేషంబులం బ్రచండంబులయిన కాండప్రకాండంబులు సంప్ర
యోగించి, రథరథ్యకేతుసూతవ్రాతంబుల మర్మఘాతంబు నొప్పించుచు, మృత్యుజిహ్వాక
రాళంబు లగుకరవాలంబులు సౌదామనీలతావితానంబులపోలికం దళత్తళాయమానంబు
లై చూపులకు మిఱుమిట్లుగొలుప ఝళిపించి దేహంబు లుపలక్షించి తునకలై పడనఱు
కుచు నవక్రవిక్రమంబునం జక్రంబులు గిరగిరం ద్రిప్పి వైచి ఛత్రచామరధ్వజదండంబులు
ఖండంబులు సేయుచుఁ, బ్రజ్వలజ్జ్వలనకీలాజాలంబులలీలం గ్రాలుశూలంబుల నాభీలం
బులగు శతాంగమాతంగతురంగాంగంబులు భగ్నంబులుగాఁ గ్రుమ్ముచుఁ, గఠోరంబులగు
కుఠారంబు లెత్తి కంఠీరవంబుల క్రేవనకుంఠకంఠారవంబులు చెలంగ నురశ్శిరకరచరణ
ప్రముఖాంగంబు లింధనంబులకొఱకు నఱకు దారుశకలంబులగతి వికలంబులు సేయుచు,
బల్లంబుల మొల్లంబులగు నుల్లాసంబులం గ్రేళ్లురుకుచు, బల్లెంబులు బుచ్చుకొని ఘొల్లునం
బెల్లార్చి కాయంబుల గాయంబుల నమేయంబులై కీలాలప్రవాహంబులు దొఱంగం బొడిచి
పడఁజిమ్ముచు, మదోద్రేక్తంబున గదాదండంబులు విసవిసం ద్రిప్పి గాత్రంబులు నుగ్గు
నూచంబులుగాఁ గొట్టుచు, శ్వసనాశనసంకాశంబు లగుపాశంబులు వీరావేశంబులం
గండదేశంబులం దగులం బ్రయోగించి ప్రాణంబులు క్షీణంబులుగాఁ బడనీడ్చుచు, మఱి
యుఁ బ్రాసపట్టెసముసలముద్గరతోమరబిండివాలశక్తిక్షురికాది నానావిధాయుధం
బులం గొట్టివేసి నఱికి చీరించి చెండాడి గగ్గోలుపఱిచినం జంభవిద్వేషికరాంభోజశుం
భద్దంభోళి ధారాహతంబులైన విశ్వంభరాధరంబులచందంబునం గూలి పీనుంగులైన యే
నుంగులును బుడమిం బడి తన్నుకొనుచుఁ గంఠగతప్రాణంబులైన కంఖాణంబులును యుగ
యుగ్యచక్రకూబరసహితంబుగా హతాంగంబులైన శతాంగంబులును, గూలిన కేతనంబు
లును, జిత్రరూపంబులవిధంబున విగతవిక్రమార్భటులైన భటులును, సోలిన రాహుత్తు
లును, రాలిన భూషణమణిగణంబులును, వ్రాలిన ఛత్రచామరంబులును, వికలంబులైన దం
తంబులును, శకలంబులైన కుంభస్థలంబులును, వ్రక్కలైన డొక్కలును, జెక్కులైన
ప్రక్కలును, భిన్నంబులైన కపాలంబులును, ఛిన్నంబులైన కపోలంబులును, విఱిగిన
చరణంబులును, జిరిగిన చర్మంబులును, శీర్ణంబులైన కర్ణంబులును, జూర్ణంబులైన
వర్మంబులును, గలిగి మహాబిలంబునం గోటానకోటులు దట్టంబులై యట్టలాడంజొ
చ్చె. గజవాజికళేబరంబులు జీమూతంబులును, సాంద్రచంద్రహాసధగద్ధగితద్యుతులు
శంపాలతలును, శంఖదుందుభిస్వనంబులు మేఘనిర్ఘోషంబులును, గదాముసలముద్గర
ఘాతంబు లశనిపాతంబులును, విశీర్ణభూషణపద్మరాగగారుత్మతఘృణిరేఖ లింద్ర
ధనువులును, విభిన్నకుంభికుంభచ్యుతముక్తాఫలంబులు వర్షోపలంబులును, గాకగృధ్ర
ప్రభృతివిహంగంబులు చాతకంబులును, శోణితపూరంబు జలాసారంబునునై, యోధ
యూథధనుర్విముక్తంబులై గగనదేశంబు నిరవకాశంబుగా నిండి కల్పితాంధకార

నైల్యంబైన బాణబాహుళ్యంబువలన మార్తాండమండలగోచరలక్షణంబులేమి
దుర్దినంబై యుత్కర్షవర్షాగమంబు ననుకరించియుండె నప్పుడు వేతాళప్రేతపిశా
చశాకినీఢాకినీప్రముఖభూతంబు లుత్సాహసమేతంబులై మాంసఖండంబులు కడు
పులనిండ మెక్కి రక్తపానంబు చేసిన గఱ్ఱునం ద్రేపుచు, శ్వేతతురంగచర్మంబులు
ధవళాంశుకంబులుగా ధరియించుకొనుచు, మేదఃపంకంబు రక్తజలంబులం బదనుచేసి
లేపనంబులుగాఁ దనువుల నలందికొనుచుఁ, దునుకలై పడిన యాతపత్రంబులఁ బువ్వు
లుగా నలంకరించుకొనుచు, గజకళేబరంబులు పర్యంకంబులుగాఁ బవ్వళించుచు,
ఘోటకాండంబులు క్రముకఖండంబులును, గుంజరకర్ణంబులు తాంబూలపర్ణంబులు
ను, వసలు చూర్ణంబులునుం గాఁ గలయ నమలి విడియంబులు చేసి జిహ్వావలోకనం
బులు చేసికొనుచుఁ గామినీభూతంబులతోడి సురతక్రీడావిలాసంబులం జొక్కుచు,
గంధర్వపిశాచంబులు సేయు గార్దభస్వరసంగీతంబులకు నానందంబు నొంది కరితురగ
నరమాంసంబులు త్యాగంబు లిచ్చుచో వారల గానంబులకుఁ దాముం దమవదాన్యతా
సౌందర్యవిశేషంబులకు వారును శిరఃకంపంబులు చేసి మెచ్చుకొనుచు, నివ్విధంబున
వివిధభోగంబులం దనిసి యుభయబలంబులం బొగడుకొనుచుం దాండవంబులు సలుపు
నమ్మహాకోలాహలంబువలన సంగరప్రకారంబు ఘోరంబై వర్తిల్లె నందు.

55


చ.

హరిహరులిద్దఱుం గదిసి యాహవకేళి యొనర్చి రుధ్ధతిన్
సురనికరంబు లబ్రపడి చూడఁగ శార్ఙ్గపినాకచాపముల్
కరములఁ బూని యెండొరులకంఠభుజోరులలాటమర్మముల్
గురుతరచండకాండములఁ గ్రుచ్చుచు రోషమహోగ్రమూర్తులై.

56


మ.

హరుఁ డాకర్ణధనుర్గుణుం డగుచు బాహావిక్రమక్రీడ ని
ష్ఠురనారాచపరంపర ల్వఱపిన న్సొంపారునెమ్మోమునన్
దరహాసద్యుతి వింతయై నిగుడఁ బద్మామానినీజాని భీ
కరబాణంబుల వానినన్నిటి వెస న్ఖండించె నొక్కుమ్మడిన్.

57


క.

భగవంతుండగు శంభుఁడు, గగనదిశాపూరితముగఁ గడుఁదీవ్రతతో
నగణితవిశిఖౌఘంబులు, నిగిడించి మహోగ్రతమము నిండఁగఁ జేసెన్.

58


మ.

గరుడాంకుం డరుణాంతనేత్రుఁ డగుచు న్గాలాగ్నిసంకాశభీ
కరకాండాళిఁ దదంధకార మడఁగంగాఁ జేసె నాతీవ్రతం
బరివేషస్థితి నుండె విల్లు రవిబింబస్ఫూర్తి నొప్పె న్ముఖాం
బురుహం బుగ్రమయూఖలీలఁ దనరె న్బుంఖానుపుంఖాస్త్రముల్.

59


చ.

మఱియు ననేకబాణములు మర్మము లంటఁగ నేసి హుంకృతుల్
నెఱప లలాటలోచనుఁడు నిష్ఠురశాతశిలీముఖావళుల్

కఱకఱినేసె వేసినను గంజదళాక్షుఁడు వాని నన్నిటిన్
నఱకి నిశాతకాండములు నాటఁగ నేసెఁ దదీయదేహమున్.

60


శా.

ఆసంరంభముఁ జూచి సైఁపక హరుం డాగ్నేయబాణంబుఁ బ్ర
జ్ఞాసామర్థ్యముతోడ నేసిన ఘనజ్వాలావృతంబై పయిన్
రా సత్యారమణుండు వారుణమహాస్త్రంబుం బ్రయోగించి సాం
ద్రాసారంబగు వారిపూరమున మాయంజేసె నత్యుద్ధతిన్.

61


ఉ.

శర్వుఁ డఖర్వగర్వమున శౌరిపయి న్మరుదంబకంబు గం
ధర్వసుపర్వపన్నగవితానము లద్భుతమంద నేసినన్
సర్వమయుండు చక్రి యది సంహరణం బొనరించె నుజ్జ్వల
త్పరత సాయకంబున విపక్షబలంబులు దల్లడిల్లఁగన్.

62


శా.

ఆటోపంబున శంకరుం డపుడు బ్రహ్మాస్త్రంబు సంధించి మౌ
ర్వీటంకార మెసంగ నంబుధియు ఘూర్ణిల్లంగ చేయ న్నిరా
ఘాటంబై చనుదేరఁ గన్గొని తదుగ్రస్ఫూర్తి వారించె దో
షాటధ్వంసితదంబకంబున నమర్త్యశ్రేణి కీర్తింపఁగన్.

63


శా.

అత్యుగ్రాకృతియైన పాశుపతదివ్యాస్త్రంబు భూతేశుఁ డౌ
ద్ధత్యం బొప్పఁగ నేసె నప్పుడు మహోద్యద్విక్రమస్ఫూర్తి నౌ
న్నత్యంబై యసమానమై వెలుఁగు శ్రీనారాయణాస్త్రంబు సం
స్తుత్యప్రాభవశాలి కృష్ణుఁ డుపమంత్రోక్తిం బ్రయోగించినన్.

64


మహాస్రగ్ధర.

రాలె న్నక్షత్రపఙ్కుల్ రహి చెడియ నహోరాత్రిరాణ్మండలంబుల్
వ్రీలెన్ దిక్కుడ్యసంధు ల్విఱిగిపడియె నుర్వీధ్రశ్భంగంబు లోలిం
దూలెన్ మేమౌఘ మత్యద్భుతజవపవనోద్ధూతధూళీసమంబై
కూలెన్ వృక్షాళి మ్రొగ్గె న్గువలయభరభృత్కుంభికుంభీనసంబుల్.

65


క.

ఖండేందుధరజనార్దన, కాండము లొండొంటిఁ దాఁకి గగనంబున ను
ద్ధండగతిఁ బోరిపోరి ప్ర, చండత హరిశరము హరునిశరముం దోలెన్.

66


తే.

తనదుదివ్యశరంబులు దైత్యదమను, చే నిరర్థక మగుటయు మానసమున
నూహదక్కి రణోత్సాహ ముజ్జగించి, యుండెఁ గళ్యాణశైలకోదండుఁ డపుడు.

67


మ.

జలజాతాక్షుఁ డవక్రవిక్రమమున న్సమ్మోహనాస్త్రంబు భూ
తలసంక్షోభము గాఁగ నేయుటయు నిద్రాపారవశ్యంబుతో
వలనొప్ప న్వృషభేంద్రుమూఁపురముపై వ్రాలెన్ హరుం డొయ్యనన్
గలధౌతాచలశృంగసంగతశరత్కాలాంబువాహాకృతిన్.

68


వ.

రుక్మిణీకుమారుండును గుమారుండును నుద్దండపుండరీకంబులవిధంబునం గడంగి కోదండ
పాండిత్యంబు భువనస్తుత్యంబుగా భండనంబు సేయుచు.

69

మ.

శరజన్ముండు ప్రదీప్తరోషముఖుఁడై శాతాశుగశ్రేణి నా
హరిజు న్నొవ్వఁగ నేసి యార్చిన మహోగ్రాకారుఁడై పేర్చి శం
బరవిద్వేషి శిలీముఖప్రకరసంపాతంబున న్ముంచి జ
ర్జరితాంగుం డగునట్లు చేసె సుర లాశ్చర్యంబునం బొందఁగన్.

70


తే.

నారిఁ దెగనేసి యతనిమయూరవాహ, నంబు నెమ్మేన నిశితబాణములు చొనిపి
చేతులాడక యుండంగఁ జిక్కు పఱుప, నిలువలేక విశాఖుండు తొలఁగి చనియె.

71


ఉ.

చండతరప్రతాపభుజశౌర్యధురంధరుఁడైన కామపా
లుండు హలంబుచే రణములో మడియించెను గూపకర్ణకుం
భాండుల భీమహుంకరణభగ్నపయోజభవాండభాండులన్
భండనభైరవస్ఫుటకృపాణమహోజ్జ్వలబాహుదండులన్.

72


గీ.

సాంబుఁ డక్షుద్రరౌద్రావలంబుఁ డగుచు, బాణనందను నధికదోర్బలుని బలుని
గదిసి వివిధాస్త్రశస్త్రసంఘాతములను, భూచరులు ఖేచరులు మెచ్చఁ బోరిపోరి.

73


గీ.

గుఱ్ఱములఁ జంపి కేతువుఁ గూల నేసి, రథము చెక్కలు సేసి సారథిని ద్రుంచి
ఘనతరాశుగపీడితాంగునిగఁ జేయ, నసురపతినందనుఁడు పలాయనము నొందె.

74


శా.

శైనేయుండును బాణుఁడున్ రణజయోత్సాహంబు లాస్యంబులన్
బూనం గార్ముకశింజినీభవరవంబు ల్దిక్కుల న్నిండ న
స్త్రానీకక్షతజాతరక్తజలపూరార్ద్రంబు లైనట్టి నె
మ్మేను ల్పుష్పితకింశుకంబులగతి న్మీఱంగఁ బోరాడుచున్.

75


వ.

ఉండి ర ట్లవ్వాసుదేవుండు సమ్మోహనబాణపాతంబున భూతేశు పరవశుం జేసి లబ్ధవిజ
యుండై నిరుపమోత్సాహంబున నిజవదననిర్గతనిరర్గళనిష్ఠురనినాదనిర్భిన్ననిఖిల
నిర్జరాహితసైన్యం బగుపాంచజన్యంబుఁ బూరించుచు విరోధివరూధినిపయిం గవిసి
కరాధిజ్యధనుర్ముక్తశరాధిక్యఘాతంబుల నరిశిరోధినిచయంబులు నఱకి ధరాధీనంబు
సేయుచుఁ గరాళంబులగు కరవాలంబులఁ గరిహరిప్రకరవాలంబులు కీలాలంబులు హే
రాళంబులై తొరఁగఁ దునుముచు ధృఢవంతంబు లైనకుంతంబులఁ బంతంబున దంతం
బులు విఱగంబొడిచి దంతావళంబుల నంతంతన కృతాంతనిశాంతంబున కనుపుచు నస
దృశంబులగు ముసలంబులు కరిబిసరుహంబుల విసవిసం ద్రిప్పి యసురవిసరంబులు పస
చెడి వనుమతిం గలయ నసువులం బాపుచుఁ గదలమెఱుంగులు చదలం బొదలం ద్రిప్పుచు
వలదని మదంబులం గదిసి యెదురుకొని పొదువుపదాతులం గదలమెదలనియ్యక వదనం
బులు చదిసి రదనంబులు డుల్లి గుదులు గొనుచుం జావమోదుచు నంతకంతకు నతిశయం
బైనవీరావేశంబునం బ్రళయకాలరుద్రాకృతిం బేర్చి రక్తప్రవాహంబులును మాంసరా
సులును బ్రేవులప్రోవులు నెముకలగుట్టలునునై రణం బతిదారుణంబుగఁ జిత్రక్రీడ స
లుపుచుఁ బాంచజన్యజృంభన్నినాదంబులు భూనభోంతరఁబులు నిండఁ బూరించుచుండె
నపుడు.

76

సీ.

సారథు ల్వడిన నశ్వము లీడ్చుకొనిపోవ నందంద పడిపోవునరదములును
దైన్యఘీంకారనాదములు సేయుచుఁ బటాపంచలై పాఱెడుభద్రకరులు
నేటులఁ బడి యెదురెక్కఁజాలక వాహకులతోన పఱచెడిఘోటకములు
ననిమొన నిల్వ ధైర్యములు చాలక తల ల్వీడంగఁ బరువెత్తువీరభటులు
నగుచుఁ గాళియదమనబాహాప్రచండ, కార్ముకజ్వాలతముక్తకాండపటల
దహనకీలాకలాపసంతానమునకుఁ, దాళక పలాయనము నొందె దనుజబలము.

77


వ.

అప్పుడు.

78


ఉ.

విచ్చినయాత్మసేనఁ గని వీరుఁడు బాణుఁడు తెంపు చూపఱుల్
మెచ్చఁగఁ జేయి వీచి మరలించినఁ దద్బల మెల్ల రోషముల్
హెచ్చఁగ నొక్కట న్మరలె నేపున సైన్యయుగంబు పోరికిం
జొచ్చిన సంకులాహవము చూడ భయంకరమయ్యె నయ్యెడన్.

79


శా.

బాణుం డప్పుడు రోషరక్తముఖుఁడై బ్రహ్మాండభీమాకృతిన్
జాణూరాంతకు డాసి మామకభుజాంచద్ధాటిచే సంగర
క్షోణిం బన్నగసిద్ధకింపురుషరక్షోయక్షగంధర్వగీ
ర్వాణుల్ నిర్జితు లైరి నాయెదుట నిల్వన్ నీవు శక్తుండవే.

80


చ.

అనవుడు మందహాసముఖుఁడై హరి నీభుజశక్తి నీవె నె
మ్మనమున లజ్జ లేక పలుమాఱును మెచ్చుకొనంగ నీతియే
యనిమొన నిల్చినప్పుడు నిరర్థక మీవెడమాట లేల నాఁ
కొని భుజియింపఁబోవుచును గూరలమే లడుగంగ నేటికిన్.

81


మ.

అనునాలోననహస్తపంచశతకోద్యచ్ఛాపుఁడై నిల్చి త
క్కినయేనూఱుకరంబుల న్శరము లుత్కృష్టప్రతాపంబునం
గొనిబె ట్టేయఁగ మండలీకృతమహాకోదండముక్తార్ధచం
ద్రనిశాతాంబకపఙ్క్తిఁ ద్రుంచె నవి రాధానాయకుం డుద్ధతిన్.

82


సీ.

శతములు వేలు లక్షలు కోటు లర్బుదంబుల శరౌఘంబులఁ బోదివిపొదివి
వాయవ్యగారుడవారుణప్రముఖదివ్యేషుజాలంబుల నేసియేసి
కరవాలశూలముద్గరశక్తితోమరప్రాసాయుధంబులఁ బఱపిపఱపి
శాంబరీమాయావిడంబనం బొనరించి శిలలు నెత్రుఁ గురియఁ జేసిచేసి
యసురభర్త విజృంభించి యార్చుటయును, నడుమ నన్నింటి ఖండించి పొడ వడంచి
త్రుంచి మాయించి కడువిక్రమించి మించి, తనప్రతాపంబు చూపె నద్దనుజవైరి.

83


వ.

మఱియును.

84


ఉ.

అత్తఱి నమ్ముకుందుఁడుఁ దదర్ధసహస్రశరాసనంబులున్
గత్తిమొగంపుటమ్ములను గండ్రలు సేయుచు నుండ నంతలో

నెత్తెడువిండ్లు నారిబిగు వెత్తెడువిండ్లు శరప్రయోగసం
పత్తిఁ జెలంగువిండ్లు నటు బాణుకరంబుల నొప్పె వింతయై.

85


చ.

తొలుతటియమ్ము పంచశతదోర్ధనురావళి ద్రుంచికొంచు న
వ్వలఁ జన నింతలో మొదలివైపున బాణుఁడు గ్రమ్మఱం గరం
బులఁ గొనుచాపముల్ నఱకిపోవుచు రెండవయమ్ము ముందరన్
వెలుఁగుశరమ్ముఁ గూడ దివి నిండె హరిప్రదరంబు లీగతిన్.

86


శా.

కోపాటోపవిజృంభణారుణితచక్షుష్కోణసంజాతవీ
క్షాపాతఁబులు మేనఁ జొచ్చి వెడలె న్గాఁబోలునన్నట్లు త
చ్చాపోద్భూతశరౌఘముల్ తదనుసంచారంబులై వక్షమం
చాపూర్ణంబుగ నాటి వెల్వడు సురేంద్రారాతిదేహంబునన్.

87


చ.

ధనువులు ద్రుంచి సూతుతల ధారుణీమీఁద నలంకరించి వా
హనముల సంహరించి సముదంచితకాంచనకేతనప్రపా
తన మొనరించి మై రుధిరధారలు గ్రమ్మఁగ నుంచి మించి య
ద్దనుజవిరోధి యొత్తెఁ గృతదానవదైన్యము పాంచజన్యమున్.

88


క.

మతి బ్రమసినట్లు నిశ్చే, స్థితుఁడై బెగడొందు బాణుజీవము రక్షిం
చుతలంపున ముదిరక్కసి, యతినిజనని కోటరీసమాహ్వయ యంతన్.

89


ఉ.

అంబరహీనమైనవికృతాకృతితోడుత నాభిక్రేవలన్
లంబకుచద్వయంబు గదలం బులుచెక్కుల జుంజుఱౌ శిరో
జంబులు వ్రేల నమ్ముదినిశాచరి ఖేచరియై పిశాచరీ
తిం బఱతెంచి నిల్చె వసుదేవతనూభవు సమ్ముఖంబునన్.

90


శా.

దానిం జూడఁగ రోయుచు న్విముఖుఁడై దైత్యాంతకుం డున్న నా
లోనం బాణుఁ డెడంబు గాంచి పఱచెన్ లోకుల్ ప్రమోదింపఁగా
మానం బెల్లను వీడి యాత్మనగరీమార్గంబున న్భీతిదృ
క్పౌనఃపున్యతఁ బాదఘట్టనల భూభాగంబు కంపింపఁగన్.

91


ఉ.

ఆహరిముందట న్నిలిచినట్టినిశాటియు నేగె నంత స
మ్మోహనబాణపాతమున ముంచిన తాంద్రికముం దొలంగి కా
మాహితుఁ డంప శాంభవమహాజ్వర మంఘ్రులు మస్తకంబులు
బాహువులుం ద్రిసంఖ్యలను భాసిలఁగా నతిఘోరమూర్తియై.

92


మ.

తనమీఁదం జనుదేర నవ్వుచును బద్మానేత తీవ్రజ్వరం
బును బంపన్ భయదాకృతిం గదిసి యార్పుల్ మింటనంటంగఁ దాఁ
కొన నా రెంటికి నయ్యె నాహవము సోత్కృష్టప్రతాపోగ్రత
ర్జనసంభర్జనగర్జనంబులు జగత్సంక్షోభముం జేయఁగన్.

93

తే.

పోరిపోరి భుజాబలస్ఫురణ దక్కి, శాంభవజ్వర మాత్మలో సంచలించి
వైష్ణవజ్వర మధికజవంబుతోడ, వెంటనంటంగ నార్తితో వెఱచి పఱచె.

94


ఉ.

ఎక్కడఁ జొచ్చినం జుణుగనియ్యక వైష్ణవి వెంటనంటఁగా
దిక్కులనెల్లనుం గలయఁద్రిమ్మరి యార్తి హరించి కాచువాఁ
డొక్కఁడులేమికిన్ వగల నొందుచుఁ గ్రమ్మఱఁ బాఱుదెంచి స
మ్యక్కరుణావిధేయు హరి నార్తశరణ్యునిఁ జేరి భక్తితోన్.

95


శా.

శ్రీలక్ష్మీపతయేకృతాఖిలజగత్క్షేమాయదివ్యౌజనే
నీలాంభోధరకాంతికాంతవపుషే నిర్వాణసంధాయినే
లీలాకల్పితతాత్త్వికాయమహతే లేశాతిపూర్ణాత్మనే
నాళీకాసనపూజితాయభవతే నారాయణాయోన్నమః.

96


దండకము.

శ్రీమద్రమామానినీ మానసారామవాటీ వసంతాయమానా సమానాంగశృంగారభావా
సమగ్ర ప్రభావా ప్రభావార్యమాణా యుతాహోధిరాణ్మండలా సేవితాఖండలా
కుండలానర్ఘ్యరత్నచ్ఛవిచ్ఛన్నగండస్థలప్రస్ఫురన్మందహాసా కరాంభోజభృన్నంద
కాఖ్యోజ్జ్వలచ్చంద్రహాసా మహాసాహసక్రూరకంసాఘవత్సాదిదైతేయసంఘాత
శైలాంబుభృద్వాహనా గోపకన్యామనోమోహనా గేహనారీసుతారాదిసంసారభో
గాబ్ధినిర్మగ్నహృత్ర్పాకృతాళీ దురాపాదరా పాదకీర్తిప్రతాపోదయా నీదయాశోభి
తాపాంగవీక్షాసుధాలేశసంసేవనాలబ్ధసౌభాగ్యులై బ్రహ్మరుద్రామరాధీశముఖ్యు
ల్ మహత్త్వంబునన్ బూర్ణులై యుందురే తజ్జగత్పాలనార్థంబుగా నీవు మత్స్యస్థితిం
గచ్ఛపాకారతన్ యజ్ఞవారాహలీలన్ నృసింహస్వభావంబునన్ వామనస్ఫూర్తి
తో జామదగ్న్యస్వరూపంబునన్ రామచంద్రావతారంబునన్ రౌహిణేయాభిధేయం
బుతో బౌద్ధవేషంబుతోడం గలిక్యాకృతిన్ సాధుసంరక్షణంబున్ జగత్కంటకధ్వం
సన౦బున్ దగంజేయుచో నీవు గావించు సత్కార్యముల్ చాల నాశ్చర్యముల్ నీ
పదాంభోరుహధ్యానసేవావిశేషంబులన్ నారదవ్యాసవాల్మీకిరుక్మాంగదాదుల్
మహాధన్యులై పుణ్యులై జ్ఞానసంపన్నులై యవ్యయానందముం గాంచి రత్యూర్జితంబైన
యుషన్మహత్త్వంబు వర్ణింపఁగా రెండువేల్ జిహ్వలన్ బొల్చు శేషాహియుం జాలఁ డీ
లోకముల్ దేశకాలంబులున్ వేదశాస్త్రంబులున్ దానధర్మంబులున్ సాగరంబుల్
నదుల్ కానన౦బుల్ గిరుల్ చంద్రసూర్యుల్ పృథివ్యాదిభూతంబులున్ సాత్త్వికాది
త్రయం బాదిగా నామరూపంబులన్ బొల్చు నేతత్ప్రపంచంబు సర్వంబు నీమాయచేఁ
గల్పితంబై భవద్గర్భగోళంబునం బుట్టుచున్ మించుచుం గిట్టుచుం గ్రాలు నోదేవ నీవే
జగత్కర్తవున్ ధర్తవున్ హర్తవున్ నీవె సర్వస్వరూపుండపు న్నీవె దైవంబవు
న్నిర్గుణంబై నిరాకారమై నిశ్చలంబై నిరాఖ్యాతమై నిర్వికల్పస్థితిం బొల్చు నోంకార

గమ్యుం బరబ్రహ్మమూర్తి న్నినుం నామనోవీథి భావింతు సేవింతు నోస్వామి నన్నుం
గృపంజూచి రక్షింపు మోదీనసంరక్ష యోపుణ్యచారిత్ర యోభక్తమందార యో
నిత్యకళ్యాణ కారుణ్యశాలీ జగన్నాయకా దేవతాసార్వభౌమా రమావల్లభా పాహి
మాం పాహిమాం పాహిమామ్.

97


శా.

నీతేజంబు మహోగ్రమై తఱుమఁగా నిల్వంగ శక్యంబు గా
దేతద్విశ్వమునందు రక్షకులు నా కెవ్వారును న్లేరు నీ
వే తప్ప న్శరణంబు చొచ్చితి దయావిస్తారభావంబున
న్నాతప్పుల్ క్షమియించి కావఁగదవే నాతండ్రి నారాయణా.

98


క.

అనినం గృష్ణుఁడుమత్సా, ధన మనితరవార్య మగుటఁ దగఁ దెలిసి రయం
బున మముఁ జేరితి కావున, నినుఁ జెందదు తద్భయంబు నిక్కం బింకన్.

99


క.

మీయుభయజ్వరవాద, మపాయంబున నన్నుఁ గావుమని నీవు నుతుల్
సేయుటయుఁ జదువువారల, కేయెడ మీబాధ పొరయ దించుకయైనన్.

100


వ.

అని యాన తిచ్చెనని శుకుండు పలికిన నటమీఁదటి వృత్తాంతం బెఱింగింపుమని
యడుగుటయును.

101


శా.

సాష్టాంగానతసిద్ధసాధ్యమకుటాంచన్నూత్నరత్నావళీ
సృష్టిస్తోమవిరాజమానవిమలాంఘ్రిద్వంద్వగీర్వాణజి
ద్దుష్టారాతికురంగనిర్దళనశార్దూలాయతోద్యద్భుజా
వష్టంభోజ్వలసర్వదేవమయశశ్వద్రూపవిశ్వంభరా.

102


క.

లక్ష్మీకటాక్షకమలా, లాక్ష్మాంచితవదనహరిణలాంచనబింబా
సక్ష్మాదిభూతవిశ్వగ, సూక్ష్మస్థూలాంతరస్థసుబ్రహ్మకళా.

103


కవిరాజనిరాజితము.

మలయజహారసుధాకరహీరసమాననుసారయశోవృతది
గ్వలయకృతార్థిహితార్థధనంజయవర్ధనకారిసమర్థకృపా
నిలయనిరర్గళశార్ఙ్గధనుర్గుణనిర్గతమార్గణవర్గమహా
విలయగతాహితమోహితలోకవివేకసమాహితహృన్మహితా.

104


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రాయనమంత్రితనూభవ సుజనహితకృత్యని త్యాబ్బయామాత్యప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.