అధిక్షేపశతకములు/గువ్వలచెన్నశతకము

గువ్వలచెన్నశతకము

శ్రీపార్థసారథీ! నేఁ
బాపాత్ముఁడ నీదుపాలఁ బడినాడ ననుం
గాపాడుమనుచు నాంతర
కోపాదు లడంచి వేఁడు గువ్వలచెన్నా!

1


నరజన్మ మెత్తి నందున
సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద
చ్చరణములు మఱవ కుండిన
గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా!

2


ఎంతటి విద్యలఁ నేర్చిన
సంతసముగ వస్తుతతులు సంపాదింపన్‌
చింతించి చూడ నన్నియు
గొంతుకఁ దడుపుకొనుకొఱకె గువ్వలచెన్నా!

3


సారాసారము లెఱుఁగని
బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా?
నీరెంత పోసి పెంచినఁ
గూరగునా నేలవేము?గువ్వలచెన్నా!

4


అడుగునకు మడుగు లిడుచును
జిడిముడి పాటింతలేక చెప్పిన పనులన్‌
వడిఁజేసి నంత మాత్రన
కొడుకగునా లంజకొడుకు? గువ్వలచెన్నా!

5

ఈవియ్యని పద పద్యము
గోవా? చదివించుకొనఁగఁ గుంభిని మీఁదన్‌
ఈ విచ్చిన పద పద్యము
గోవా మఱిఁ జదువుకొనఁగ గువ్వలచెన్నా!

6


ఇరుగు పొరుగు వారందఱుఁ
గర మబ్బుర పడుచు నవ్వగా వేషములన్‌
మఱిమఱి మార్చిన దొరలకు
గురు వగునా బ్రాహ్మణుండు గువ్వలచెన్నా!

7


అనుభవము లేని విభవము
లను భావ్యము కానియాలు నార్యానుమతిన్‌
గనని స్వభావము ధర్మముఁ
గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా!

8


పదుగురికి హితవు సంప
త్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్‌
జెదరదు సిరియు హరి భక్తియుఁ
గుదురును గద మదిని నెన్న గువ్వలచెన్నా!

9


వెలకాంత లెంద ఱైననుఁ
గులకాంతకు సాటి రారు కువలయ మందున్‌
బలు విద్య లెన్ని నేర్చిన
గుల విద్యకు సాటి రావు గువ్వలచెన్నా!

10


కలకొలఁది ధర్మముండినఁ
గలిగిన సిరి గదలకుండుఁ గాసారమునన్‌
గలజలము మడువు లేమిని
గొలగొల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా!

11

తెలిసియుఁ దెలియనివానికిఁ
దెలుపం గలఁడే మహోపదేశికుఁడైనన్‌
బలుకం బారని కాయను
గొలుపంగలఁ డెవఁడు పండ? గువ్వలచెన్నా!

12


చెలియలి భాగ్యము రాజ్యం
బుల నేలుచు జనుల ద్వేషమునఁజూచుచుఁ గ
న్నుల మత్తతఁ గొన్నాతఁడు
కొలనికిఁ గాపున్నవాఁడు గువ్వలచెన్నా!

13


అపరిమిత వాహనాదిక
మపూర్వముగనున్న యల్పుఁ డధికుండగునా?
విపులాంబర వాద్యంబులఁ
గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా!

14


పందిరి మందిరమగునా?
వందిజనం బాప్తమిత్రవర్గంబగునా?
తుందిలుఁడు సుఖముఁ గనునా?
గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా!

15


మిత్రుని విపత్తునందుఁ గ
ళత్రమును దరిద్ర దశను భ్రాతలగుణమున్‌
బాత్రాది విభక్తంబున
గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా!

16


అంగీలు పచ్చడంబులు
సంగతిఁగొను శాలుజోడు సరిగంచుల మేల్‌
రంగగు దుప్పటు లన్నియు
గొంగళి సరిపోల వన్న! గువ్వలచెన్నా!

17

స్వాంతప్రవృత్తిఁ గార్యా
నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో
గాంతరమున బంధుత్వముఁ
గొంతైనంతటన చూడు గువ్వలచెన్నా!

18


పురుషుండు తటస్థించిన
తరుణమునం దరుణిగునముఁ దరుణిదనంతన్‌
దొరికినఁ బురుషుని గుణమును
గురుబుద్ధీ! తెలియవలయు గువ్వలచెన్నా!

19


కలిమిఁగల నాఁడె మనుజుఁడు
విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా!
గలిమెంత యెల్లకాలము
కులగిరులా కదల కుండ? గువ్వలచెన్నా!

20


బుడ్డకు వెండ్రుకలున్నన్‌
గడ్డముకానట్ల కార్యకరణుల సభలన్‌
దొడ్డుగఁ జూతురె? తలపై
గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా!

21


వనజజకులులును శూద్రులు
ననియెడి భేదంబు లేక యందఱు నొకరీ
తిని గొని యాచారాదుల
గుణముల సరి నుంద్రుముందు గువ్వలచెన్నా!

22


కలుఁద్రావి నంజుడుం దిను
ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్‌
తెలియవు బ్రాహ్మణుఁడైనను
కులపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా!

23


వారిది వారిది ధనమొక
కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె
వ్వారినిఁ దిరస్కరించును
గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా!

24


ఇలుఁగలఁడె? పరివ్రాజకుఁ
డెలమింగొనునెట్లు వేశ్య? యీనివిటునెడన్‌
గులకాంత విత్తమడుగునె?
కొలఁదిఁ గలదె ఱంకులాడి గువ్వలచెన్నా!

25


ధన మతిగఁ గల్గి యున్నను
దనయలుఁ దనయులును గల్గి తనరుచునున్నన్‌
ఘనలోభియు నిఱుపేదయు
గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా!

26


చండాల కులుఁ డొసగిన
తండులముల బ్రతికినట్టి ధాత్రీశకులుల్‌
నిండుతనం బెఱుఁగుదురే?
కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా!

27


సిరిఁగలిగినంత బంధూ
త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా
పరతాశాపరులయి పదు
గురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా!

28


సంపద గలిగిన మనుజుని
కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్‌
సొంపుగ వత్తురు పేదకుఁ
గుంపటు లన నుంద్రువారె గువ్వలచెన్నా!

29

నీచునకు ధనము గల్గిన
వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్‌
నీచ కృతి యగుచు మది
సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!

30


అల్పునకు నెన్ని తెల్పినఁ
బొల్పుగ నిల్వవవి పేడబొమ్మకు నెన్నో
శిల్పపుఁ బనులొనరించినఁ
గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!

31


పిత్రాద్యైశ్వర్యముచేఁ
బుత్త్రులుఁ బౌత్రులును ధర్మబుద్ధిఁ జరింతుర్‌
చిత్రగతి నడుమఁగల్గిన
గోత్రం జిత్రగతిఁదిరుగు గువ్వలచెన్నా!

32


ధర నాడపడుచు సిరిచే
నిరతంబును బొట్టనించి నీల్గెడుమనుజుం
డొరులెఱుఁగకుండ ఱాతో
గురుతుగ నూఁతఁబడు టొప్పు గువ్వలచెన్నా!

33


గొల్లింటఁ గోమటింటను
దల్లియుఁ దండ్రియు వసింప దాను వకీలై
కళ్ళ మద మెక్కి నతనికి
గుళ్ళైనం గానరావు గువ్వలచెన్నా!

34


కాళ్ళం జేతులఁ జెమ్మట
నీళ్లవలె స్రవించుచుండ నిరతము మదిలోఁ
గుళ్లక వకీలు నని తన
గోళ్లం గొఱుకుకొను ద్విజుఁడు గువ్వలచెన్నా!

35

సవతితన మున్న చుట్టలు
భువి నెఱసుగ నుండి సమయమున దూరంబై
నవుచుందురు రావేడినఁ
గువచనములు పల్కుచుంద్రు గువ్వలచెన్నా!

36


తనవారి కెంత గల్గినఁ
దన భాగ్యమె తనకు నగుచు దగు వాజులకున్‌
దన తోకచేత వీఁచునె?
గుణియైనన్‌ ఘోటకంబు గువ్వలచెన్నా!

37


అతిచన విచ్చి మెలంగగ
సుతసతులైన నిరసించి చులకన చేతుర్‌
మత మెఱిఁగి చరింపందగుఁ
గుతుకముతో మనుజుఁ డెపుడు గువ్వలచెన్నా!

38


చెన్న యనుపదము మునుగల
 చెన్నగుపుర మొకటి దీనిచెంతను వెలయున్‌
సన్నుతులు వేల్పు నుతులును
గొన్నాతని కరుణచేత గువ్వలచెన్నా!

39


ధర నీ పేర పురంబును
గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు
ర్వర నుతులుగాంతు విదియొక
గురువరముగ నెంచుకొనుము గువ్వలచెన్నా!

40


తెలుపైన మొగము గలదని
తిలకము జుట్టును ద్యజించి తెల్లయిజారున్‌
దలటోపి గొనఁగ శ్వేత ము
ఖులలో నొకఁడగునె ద్విజుఁడు గువ్వలచెన్నా!

41

వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడఁగ వశమా?
మొల్లముగ నూనివేసుక
కొల్లగ భుజియింప వలయు గువ్వలచెన్నా!

42


నీచున కధికారంబును
బాచకునకు నాగ్రహంబుఁ బంకజముఖికిన్‌
వాచాలత్వము బుధసం
కోచముఁగడు బాధకములు గువ్వలచెన్నా!

43


దుడ్డన నెఱుఁగవి తలిపా
టొడ్డుగఁగొను విద్యచే మహోద్యోగము తా
నడ్డైనఁగనులకీఁగల
గొడ్డువలెఁ జరించుచుండు గువ్వలచెన్నా!

44


బుడుతలు భోగంబులు సిరి
యడరుకొలంది గనకార్యమందతిహితులై
తొడరికడుఁ జెడుదు రిలపైఁ
గుడియెడమలు లేకముందు గువ్వలచెన్నా!

45


కసకసలు కాయగూరల
బుసబుసలగు ఱొంపనుండు బుడుతలయందున్‌
రుసరుసలు కోపియందును
గుసగుసలు రహస్యమందు గువ్వలచెన్నా!

46


కరకర నమలుటయందును
బరపరయగునెపుడు చుఱుకు వ్రాతలయందున్‌
జురచుర కాలుటయందును
గొరకొరయగుఁ గోపదృష్టి గువ్వలచెన్నా!

47

కలిమిగల లోభికన్నను
విలసితమగు పేదమేలు వితరణియైనన్‌
జెలమైన మేలుకాదా
కులనిధియంభోధికన్న గువ్వలచెన్నా!

48


విను మన్నీలశిఫార్సునఁ
దనునమ్మినవానిపనులు ధ్వంసించువకీ
ల్తనమున్నవాఁడు తిరిపెముఁ
గొనునాతఁడు చల్లవాఁడు గువ్వలచెన్నా!

49


సజ్జనులు సేయునుపకృతి
సజ్జను లెఱుఁగుదురుగాక సజ్జనదూష్యుల్‌
మజ్జనమునైన నెఱుఁగరు
గుజ్జగు నంబలినిగాక గువ్వలచెన్నా!

50


తడబడ భీతహృతయముల
బెడబెడయగుఁ బట్టుబట్టవిడఁ గట్టు నెడన్‌
బడబడ బాదుటయందును
గుడగుడయన్నముడుకందు గువ్వలచెన్నా!

51


పాగా లంగరకాలును
మీఁగాళ్లనలారఁబంచె మేలిమికట్టుల్‌
సాగించుకండువాల్పయి
కోఁగాయిఁకఁగానమెన్న గువ్వలచెన్నా!

52


వెలయాండ్రవీథులంజనఁ
దలఁపు లవారిఁగ జనించి తమమిత్రులతోఁ
గలిసి షికారునెపంబునఁ
గులుకుచుఁ బోవుదురుముందు గువ్వలచెన్నా!

53

ఎన్నఁగలజీవరాసుల
యన్నిఁటిగర్భమునఁబుట్టి యటమనుజుండై
తన్నెఱిఁగి బ్రతుకవలెరా
కొన్నాళ్ళకు నెచటనున్న గువ్వలచెన్నా!

54


కామినులకు సంతుష్టియుఁ
గాముకులకు వావివరుస కఠినాత్మునకున్‌
సామోక్తులు విశ్వాసము
కోమటులకుఁ దలఁప సున్న గువ్వలచెన్నా!

55


లొడలొడయగు వదులందును
బుడబుడనీళ్లందుబుట్టి మునుఁగుటయందున్‌
గడగడ చెవిబాధయెడన్‌
గొడగొడ లప్రస్తుతోక్తి గువ్వలచెన్నా!


సంకటములచే మెయిగల
పొంకంబెల్లను నడింగి పొలుపరినడువన్‌
జంకుంగలిగియు మెల్లన
కొంకకముండింటికేగు గువ్వలచెన్నా!

57


ధనమైనంతట భూముల
తనఖాలును విక్రయములు తరువాతసతీ
మణిభూషణాంబరంబులు
గొనుటయు విటలక్షణములు గువ్వలచెన్నా!

58


నిత్యానిత్యము లెఱుఁగుచు
సత్యంబగుదానిఁ దెలిసి సత్కృత్యములన్‌
నిత్యముజేయుచు దశది
క్స్తుత్యముగా మెలఁగుమన్న గువ్వలచెన్నా!

59

ధనమే మైత్రినిఁదెచ్చును
ధనమేవైరమునుదెచ్చు ధనమేసభలన్‌
ఘనతనుదెచ్చును నెంతటి
గొనముల కుప్పలకునైన గువ్వలచెన్నా!

60


జనకుని కులవిద్యలుగల
తనుఁజుడు తనుజుండుగాక ధారుణిలోనన్‌
దనుఁజుడు దనుజుండగుఁ ద
ద్గుణవిద్యలు లేకయున్న గువ్వలచెన్నా!

61


అక్కఱకగు చుట్టములకు
మ్రొక్కఁగవలెఁగానిచూచి మూల్గెడువారల్‌
లెక్కిడుట కొఱకెయోర్వని
కుక్కలు మేఁకమెడచళ్లు గువ్వలచెన్నా!

62


నిజవారకాంతలైనన్‌
బొజుఁగులలారఁగమరందభుజులనధములన్‌
గజిబిజిలేక గ్రహించుచు
గుజగుజ బిట్ట కలరింత్రు గువ్వలచెన్నా!

63


ప్లీడరులమని వకిళ్ళీ
వాడుకచెడ స్వేచ్ఛఁదిరిగి పాడుమొగములన్‌
గూడనివారింగూడుచుఁ
గూడెముల జరింత్రుముందు గువ్వలచెన్నా!

64


ఇల్లాలబ్బెనటంచును
దల్లింగని తిట్టికొట్టి తరిమెడితనుభృ
త్తల్లజునకు భువిఁ గీర్తియు
గుల్లలుగద దివిసుఖములు గువ్వలచెన్నా!

65

తలపరువు నోరె చెప్పును
లలికాయలపండుపరువు రంగే చెప్పున్‌
కలవాజి జవమునడకయుఁ
గులమును వేషంబు చెప్పు గువ్వలచెన్నా!

66


వేములఁ దినునలవాటును
భామలగని వీడుటయును బరితోషమునన్‌
బాములమైత్రియునేర్చినఁ
గోమటితోమైత్రివలయు గువ్వలచెన్నా!

67


ఇలఁగోమటి జెలికానిగఁ
దలఁచుచు దద్ధితముగాఁగఁ దలనాల్కవలెన్‌
మెలఁగుట నేర్చిన గడుసగు
కులకర్ణిని గూడవలయు గువ్వలచెన్నా!

68


తనహితవుఁ గోరుసతికల
దనుకనె గృహనివసనంబు తగుఁ బురుషునకున్‌
దనుకడుపు శక్తికొలదిగ
గొనవలయుఁ బదార్థములను గువ్వలచెన్నా!

69


తనతల్లియొక్కపరువును
దన దగు నోరెప్రకటించుఁ దథ్యంబనియే
సునృపులు ఘోషాఁబెట్టిరి
గుణాదులన్యమగుచుననుచు గువ్వలచెన్నా!

70


చుట్టఱికముఁ చేసికొనన్‌
గట్టడిగాఁ దిరిగితిరిగి కార్యంబైనన్‌
మిట్టిపడుచు మాట్లాడఁడు
గుట్టించునియోగివరుఁడు గువ్వలచెన్నా!

71

ఎంతధికారంబున్నను
సంతతమును బరులయెడల సత్కులజాతుం
డెంతయు నమ్రతఁ జూపును
గొంతైనను మిడిసిపడఁడు గువ్వలచెన్నా!

72


వేషములచేతనొకటను
భాషాపతికులులు మొదలు పదజులవఱకున్‌
శేషించి యొకఁడు నుండఁడు
ఘోషాయును బోవుముందుగు గువ్వలచెన్నా!

73


సధవయు విధవయు
నొకటిగ బుధులీక్షింపగనుంద్రు పొంకముమీఱన్‌
అధమంపువేషభాషలఁ
గుధరములనఁ గదలకుంద్రు గువ్వలచెన్నా!

74


నీతియెఱుంగని నీచున
కాతతరాజ్యము లభింప నధికుండగునా
నాతివలెను నటియించునె
కోతికి స్త్రీవేషమిడిన గువ్వలచెన్నా!

75


తక్కువ తరగతిగల నరుఁ
డెక్కువ యగువానిఁగాంచి యేడ్చుచునుండున్‌
జక్కఁగఁ గరి వీథిం జన
గుక్కలు గని మొఱుగకున్నె గువ్వలచెన్నా!

76


పరువునకొకటగు బంధూ
త్కరమున ధనవంతునధికుగా నధనికునిన్‌
గరమల్పునిగాఁ జూతురు
గురినెన్న ధనంబు తిరమె? గువ్వలచెన్నా!

77

తొత్తునకే శివమెత్తఁగ
నత్తఱి మ్రొక్కవలెననెడి నార్యోక్తివలెన్‌
దొత్తుకొడుకైన రాజును
క్రొత్తగ సేవింపవలయు గువ్వలచెన్నా!

78


కంగాబుంగాగొట్టిన
పొంగినమిరియాలనేతి మొదటిపిడుచతో
మ్రింగిననాఁకలి నడఁచుట
కుంగలనజ్జును హరించు గువ్వలచెన్నా!

79


సంగీతము నాట్యము గణి
కాంగనలవిగాని యవి కులాంగనలవియా?
పొంగుచు వాద్యము ఱచ్చల
కుం గొనిచని పాడఁగలరె? గువ్వలచెన్నా!

80


జాలివిడిన చెలికానిని
మాలనిగా నెన్నవలయు మఱియును బనికిన్‌
మాలినదై చెట్టెక్కెడి
గోలాంగూలమనవలయు గువ్వలచెన్నా!

81


ముట్టంచు మాసమునకొక
కట్టడిచేయఁబడె దాని కట్టుఁదెలియకే
ర ట్టొనరింతురు గర్భపు
గుట్టుం దెలియుటకుఁగాదె? గువ్వలచెన్నా!

82


ఆలికిఁ జనువిచ్చినచోఁ
దేలికకులమందుదైనఁ దేలికచేయున్‌
లాలించిన కొలఁదిగ నను
కూలతఁ గొను నధికకులజ గువ్వలచెన్నా!

83

అవసరవిధిఁ బరువెఱుఁగని
నివసనమున కరుగనగు ననేకావృత్తుల్‌
భువివిత్తముఁ గొనిపలుకని
కువాక్కులు వకీళ్లెసాక్షి గువ్వలచెన్నా!

84


ధనవద్గర్వులు కొందఱు
ఘనమనుచుం బంక్తిభేద కలితమ్ముగ భో
జనముం గావింతు రటులఁ
గొను టఘమందురు బుధాళి గువ్వలచెన్నా!

85


చెడుబుద్ధి పుట్టినపుడు
సడిచేయక తనదుహృదయసాక్షి యెఱిఁగి నీ
వుడుగు మిది తగదనుచు జన
కుఁడువలెఁగృపఁ జెప్పుచుండు గువ్వలచెన్నా!

86


మేడయొకటి కలదని కడు
వేడుకలం బడుచు విఱ్ఱవీగుచు నీచుం
డాడకుఁ బరులెవ్వరు రాఁ
గూడదనుచుఁ బల్కుచుండు గువ్వలచెన్నా!

87


లోభికి వ్యయంబు త్యాగికి
లోభిత భీరునకు యుద్ధలోలత్వమ్మున్‌
వైభవము పతికి బ్రాణ
క్షోభంబుగఁ దోఁచుచుండు గువ్వలచెన్నా!

88


సిరిగలుగ సుఖము గలుగును
సిరిసంపదలున్న సుఖము చింత్యము భువిలోఁ
దరువు చిగిర్చినగోమగు
గురుతఁగొనదె కాయలున్న? గువ్వలచెన్నా!

89

తక్కువవానిని రమ్మని
యెక్కువవానిఁగనొనర్ప నెంచినఁగాద
మ్మక్కఁగ నందలముంచినఁ
గుక్కాకున కుఱకకున్నె గువ్వలచెన్నా!

90


తబ్బిబ్బుగాఁడు క్షుద్రుఁడు
సబ్బండుగ నిష్ఠబున్న సబ్బునఁగడుగం
బొబ్బలిడ నల్లశ్వానము
గొబ్బున తెల్లనిది యగునె? గువ్వలచెన్నా!

91


జారిణి తనవగుపనులె
వ్వారలుఁ జూడరనుబుద్ధి వర్తించు నిలన్‌
క్షీరముఁ ద్రాగుబిడాలము
కోరిక లోఁ దలఁచునట్లు గువ్వలచెన్నా!

92


వాకొనెద గూనమునుగల
చాకలి యధికారియైన జనములసుఖముల్‌
చేకొనిన కొఱవిచేఁ దలఁ గో
కికొనినయట్టులుండు గువ్వలచెన్నా!

93


పక్కలనిడి ముద్దాడుచుఁ
జక్కఁగఁ గడుగుచును దినముసబ్బుజలముచే
నక్కఱదని యస్పృశ్యపుఁ
గుక్కలఁ బెంచుదురు ద్విజులు గువ్వలచెన్నా!

94


కాంచనచేలుని విడిచి ప్ర
పంచమున న్నీచులిండ్ల పాలయ్యుఁగడన్‌
జంచలయగు సిరిపోకకుఁ
గుంచితమతి యగుట తగదు గువ్వలచెన్నా!

95

చింతలఁ జువుకుచు నున్నను
స్వాంతము నెపుడైనహరునియందుంచఁదగున్‌
అంతట నాఁచున్నసరసి
గొంతట రేవైనభంగి గువ్వలచెన్నా!

96


వెలయాండ్రవలెను బనిపా
టలువిడి సంగీతమును నటన మభినయమున్‌
గులవిద్యలుగాఁ గైకొని
కులసతులు చరింత్రు ముందు గువ్వలచెన్నా!

97


లోభికివ్యయంబు సోమరి
యౌభామకుఁ బనియు నిర్ధనాత్మునకునప
త్యాభిప్రవృద్ధియును బహు
గోభర్తకు నఘము లురువు గువ్వలచెన్నా!

98


సరియైనవారితోడను
నరుగఁగవలె నొక్కపనికి నటుకాకున్నన్‌
విరసఁపుబల్కులు పల్కుచు
గురివిడి పొమ్మనఁగఁగలరు గువ్వలచెన్నా!

99


తన్నుమునుపు చదివించిన
మన్నీని విలేఖనమున మాన్యజనునకున్‌
సున్నిడి యరిచే విత్తముఁ
గొన్న వకీల్చల్లవాఁడు గువ్వలచెన్నా!

100


వెలయాలు లజ్జచేఁజెడు
నిలఁబాఱుఁడు చెడుదురాశ నెదసంతుష్టిన్‌
విలసిల్లి భూధరుఁడు చెడుఁ
గులసతిచెడు లజ్జలేమి గువ్వలచెన్నా!

101

భువినొకఁడు చెడును మఱియొకఁ
డవిరళముగ వృద్ధిఁబొందు నదివిధివశమౌ
రవియుదయించును నొకదెసఁ
గువలయపతి క్రుంకునొకెడ గువ్వలచెన్నా!

102


ఎవ్వరి కెయ్యదిచెప్పిన
నెవ్వరువినరెయ్యదియును నెట్టెట్టినరుల్‌
మువ్వముగఁ జూచుచుండుము
గువ్వలనఁ జరింత్రుముందు గువ్వలచెన్నా!

103


ఎప్పటికైనను మృత్యువు
తప్పదని యెఱింగియుండి తగినచికిత్సం
దప్పింప నెఱుఁగకత్తఱి
గుప్పున నేడ్చెదరదేల? గువ్వలచెన్నా!

104


జరయును మృత్యువు మొదలుగ
మరలఁగ రాకుండునట్టి మార్గంబేదో
గురుతెఱుఁగఁ జేయుమని శ్రీ
గురుగురుని భజియింపవలయు గువ్వలచెన్నా!

105


పరమార్థము నొక్కటెఱిఁగి
నరుఁడు చరింపంగవలయు నలువురిలోఁ బా
మరుఁడనఁగ దిరిగినను దన
గురియొక్కటి విడువకుండ గువ్వలచెన్నా!

106


చతురాస్యుని సృష్టియు
ఘటకృతివర్యుని భంగికాన నేకగతి సర
స్వతిచర్య లట్లెయుండును
గుతుకముతోఁ జూచుచుండు గువ్వలచెన్నా!

107

పాపము లంటఁగనీయక
ప్రాపొసఁగి శరీరమొసఁగి పరమపదంబున్‌
జేపట్టియొసఁగి కృష్ణుఁడు
గోపికలను గరుణఁగాచె గువ్వలచెన్నా!

108


మగవారి లక్ష్యపెట్టక
తెగివీథుల నంగడులను దిమ్మరియెడి యా
మగనాలు దుర్యశంబునకుఁ
నగుదురగు న్విడువవలయు గువ్వలచెన్నా!

109


వెలయాలు సుతుడు నల్లుడు
నిలపతియును యాచకుండు నేవురు ధరలో
గలిమియు లేమియు నెఱుగరు
కులపావనమూర్తి వన్న గువ్వలచెన్నా

110


అడుగదగు వారి నడుగక
బడుగుల నడుగంగ లేమిఁ బాపంగలరా
వడగళ్ళఁ గట్టువడునా
గుడి ఱాళ్ళను గట్టకున్న గువ్వలచెన్నా

111


నిలు వరుస దానగుణములు
గల వారికి గాక లోభిగాడ్దెలకేలా
తలుపేల చాప గుడిసెకు
గులపావన కీర్తి వన్న గువ్వలచెన్నా

112


పరిగేరుకున్న గింజలు
కరువున కడ్డంబురావు కష్టుండిడు నా
తిరపెమున లేమి తీరదు
గురుతర సత్కీర్తిఁ గన్న గువ్వలచెన్నా

113

గుడి కూలును, నుయి పూడును
వడినీళ్ళం జెరువు దెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడియెడమల కీర్తి గన్న గువ్వలచెన్నా!

114


ఇప్పద్యము లన్నిఁటిలోఁ
జెప్పిన నీతులను మదినిఁజేర్చి తెలిసినన్‌
దప్పక పదుగురిలోఁగడు
గొప్పగ నీతిపరుఁడగును గువ్వలచెన్నా!

114