అడవి శాంతిశ్రీ/ద్వితీయ భాగం
ద్వితీయ భాగం
జైత్రయాత్ర
సర్వసేనాధిపతి బ్రహ్మదత్తప్రభువు ఇక్ష్వాకు సైన్యాలతో ధాన్యకటక నగరం చేరినాడు. అంతకుముందే మహారాజు ద్వితీయ భార్యతో ధాన్యకటకం చేరెను. శ్రీశ్రీయజ్ఞశ్రీ శాతవాహన చక్రవర్తి స్ప్రుహలోలేడు. మహావైద్యులు వైద్యం చేస్తున్నారు. బౌద్ధాచార్యులు త్రిశరణములు పఠిస్తున్నారు. ఆర్యపండితులు పౌష్టిక మంత్రాలు పఠిస్తున్నారు.
చక్రవర్తికి చైతన్యం వచ్చి అల్లుడు శాంతమూలుని పిలిచి అస్పష్ట వాక్యాలతో, “ప్రభూ! మా అవసానదశలో నీ బాహుబలమే ఈ సామ్రాజ్యాన్ని సంరక్షిస్తున్నది. ఈ రాజ్యంపై మాక్రొత్త ఏల్బడిలో వివిధ సామంతులు తిరుగబడినప్పుడు మీరు చూపిన మహావిక్రమము, మా రాజ్యం నిష్కంటకం చేసింది. మేము ఇంక గడియకో, అర్థగడియకో వెళ్ళి పోతాము. మీ బావమరిది విజయశాతకర్ణిని మీ చేతులలో పెట్టి వెళ్ళుతున్నాము ప్రభూ” అని దాపున ఉన్న కొమరుని పిలిచి, అతనిచేయి శాంతి మూలుని చేతిలో పెట్టి “స్కంద దేవాయనమః, బుద్దదేవాయనమః” అంటూ చిరునవ్వుతో ప్రాణం వదిలాడు.
శాతవాహన మహాచక్రవర్తులలో తుది చక్రవర్తి నిర్యాణం పొందినాడు; చక్రవర్తి వపువును చందనాది తరుకాండాలతో బూది చేసినారు. కుమారుడు నలుబది. అయిదేండ్లవాడు. విజయశాతకర్ణి మహారాజు తండ్రికి ఉత్తరక్రియలు సలిపి పితౄణము తీర్చుకొన్నాడు. ఆ వెనుక శుభమూహూర్తంలో శ్రీశ్రీ విజయ శాతకర్ణి నవకోటి బంగారుపణముల విలువగల ఆంధ్రసింహాసనంపై పట్టాభిషిక్తుడైనాడు.
ఉత్తర కళింగాధిపతులు వాసిష్టులు, దక్షిణ కళింగాధిపతులు, మాఠరులు, వేంగీరాష్ట్రాధిపతులు, సాలంకాయనులు, మంజీర రాష్ట్రాధిపతులు, గౌతములు, గృధ్రరాష్ట్రాధిపతులు, బృహత్పలాయనులు, క్రమక రాష్ట్రాధిపతులు, ధనకులు, పూంగీ రాష్ట్రపతులు, చళుక రాష్ట్రాధిపతులు, కదంబులు, నాగదేశాధిపతులు, చూతకుల శాతకర్ణులు, ములకరాష్ట్రాధిపతులు, ఆశ్మకులు, ఆభీరులు, మాళవులు, కురవులు, మంజీరాధిపతులు మొదలయిన వారి ప్రతినిధులు నూత్న చక్రవర్తి అభిషేకానికి ఆహూతులై వచ్చారు. ఆవెంటనే మా ఏవులు, అభీరులు తమ స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. వనవాసాధిపతులు, చూతకుల శాతకర్ణులు కూడా స్వాతంత్ర్య ప్రకటన చేసారు. ఆంధ్రసామ్రాజ్యము చిన్న చిన్న చక్రవర్తులతో నిండిపోయింది.
ఇక్ష్వాకు శాంతిమూలమహారాజు బ్రహ్మదత్త ప్రభువుని చూచి, “స్కందవిశాఖాయనక ప్రభూ! మీరు మన సైన్యాలతో మా బావగారికి బాసట కావలసిం’దని ఆదేశమిచ్చినాడు.
చక్రవర్తిని కనుంగొని “మహాభ్రూ! మీరు సైన్యాలతో వానాకాలమైనా సరే, బయలుదేరి ఒక్కసారి దిగ్విజయ యాత్రచేయండి. తమ కుడి చేయిగా మా ధనకప్రభువు ఉండగలరు. మీరు ఈ సమయంలో ఈదిగ్విజయం చేయకపోతే, ధాన్యకటక రాష్ట్రం నీరసించిపోతుంది” అని ఖండితంగా మనవి చేశాడు.
“చక్రవర్తి తన బావమరిదితో “ప్రభూ! మీరు మా బదులు సైన్యాధిపతులై దిగ్విజయం చేసి రాకూడదా?” అని పృచ్చ చేసినాడు.
"చక్రవర్తి స్వయంగా వెళ్ళటం శాతవాహన సామ్రాజ్యానికి అవసరం మహాప్రభూ.”
“మేము ప్రస్తుతం ధాన్యకటకాన్నుంచి కదిలే వీలు కన్పించడంలేదు. తాము మాకు ప్రతినిధులుగా వెళ్ళిరండి.”
శాంతిమూల మహారాజు సరే అని శుభమూహూర్తాన సర్వాంధ్రసైన్యాలకు మహాసేనాపతి అయి ఉత్తరాభిముఖుడై వెళ్ళినాడు. వేంగీసాలంకాయనులు కప్పముగట్టి శాంతిమూలుని ఎంతో గౌరవం చేసినారు. వేంగినుండి పయనించి గోపాదక్షేత్రముకడ గోదావరిదాటి ఉత్తరంగా పిష్టపురంపోయి తన అత్తవారయిన మాఠరుల సన్మానముపొంది, వారి కప్పముగొని, మేనమామ లయిన వాసిష్ఠులకడకు పోయినాడు. అచ్చట కప్పముగొని ఉత్తరంనుంచి ఈశాన్యాభిముఖుడై శైలోద్భవుల కొంగోడ పట్టణము చేరినాడు శాంతిమూలుడు. శైలోద్భవులు కప్పముగట్టి శాంతమూలుని ఎంతయో గౌరవించి అచ్చటనుండి ఆయనను పశ్చిమంగా సాగనంపినారు. శాంతిమూల మహారాజు సైన్యాలతో నైఋతికి తిరిగి శరభపురముకడ దండు విడిసినాడు. వారు ఆంధ్ర సామ్రాజ్యానికి కప్పము గట్టినారు. శాంతమూలుడు అతివేగంగా ప్రయాణాలు చేసి మాళవరాజధాని ఉజ్జయిని చేరినాడు.
2
మాళవ రాజ్యాధిపతి, రుద్రసేన మహారాజు శాంతమూల మహారాజును ఎంతేని గౌరవించి సర్వమర్యాదలు నెరపినాడు. వారిద్దరు ప్రత్యేకంగా మంతనం సలిపే సమయంలో మాళవప్రభువు శాంతిమూలుని చూచి,
“మహాప్రభూ! నీరసించిపోయిన గుఱ్ఱము అశ్వశాలకైనా అందం కాదు” అన్నారు.
“అయినా ఇదివరకా గుఱ్ఱం చేసిన సేవకు మనమేమి చేసినా దాని ఋణం తీర్చుకోలేము కాదా మహారాజా!”
“తాము చెప్పింది నిజమే. ఇంతకూ మా మనవి తాము చిత్తగించాలి. మా అమ్మాయి రుద్రభట్టారిక ఈడు వచ్చిన బాలిక. ఆ కుమారిని విజయ చక్రవర్తి కొమరుడైన మా మేనల్లునకు ఈయవలసిందని పరోక్షంగా మాకు ఆలోచనలు వచ్చినవి మహాప్రభూ! కాని అమ్మాయికి ఏమీ ఇష్టంలేదు.”
“బాలికకు ఇష్టంలేని సంబంధం తలపెట్టడం ఉత్తమంకాదు మహా ప్రభూ.”
“తాము అభీరులపైకి వెళ్ళడం నిశ్చయమేనా?”
"చిత్తం, అభీరులు ఎప్పుడూ ఈ సామ్రాజ్యానికి ప్రక్కబల్లెము వంటివారు మహారాజా! కాబట్టి ఏ చక్రవర్తి అయినా అభీరులను విజృంభింప నీయకూడదు.”
“భరుకచ్ఛం మీ రాజ్యాలకు చాలా ముఖ్యమైన రేవుపట్టణం కాదా మహాప్రభూ!” “అవును మహాప్రభూ! పారశీక, యవన, రోమకదేశాల వర్తకానికి భరుకచ్ఛం ఉండితీరాలి. లేకపోతే ఈ మహాసామ్రాజ్యానికి ఎంతో నష్టం సంభవిస్తుంది.”
మాళవ మహారాజు రుద్రసేనుడు తన సైన్యం కొంత తన సేనాపతి నడుపు తుండగా ఆంధ్ర సైన్యాలతో పంపించినారు. అభీరులు తమ సైన్యాలతో ఆంధ్రులకు నర్మదాతీరాన అడ్డువచ్చారు. శాంతిమూల మహారాజు శాతవాహనుల దళాలతో సైన్యమధ్యభాగమును, బ్రహ్మదత్తుడు ఇక్ష్వాకు సైన్యాలతో ఎడమ భాగమును, మాళవసైన్యాలు మాళవ సేనాధిపతి నాయకత్వంతో కుడిప్రక్కకు నిలిచారు. ఎదుట అభీరులు నర్మదానదికి నదీతీర రాజపథం పక్క కొండలను మూడుక్రోశాలు ఆక్రమించుకొన్నారు. భరుకచ్చానికి పోవాలంటే ఈ దారికన్న వేరు మార్గం లేదు. అభీరు లాక్రమించిన ఆ దుర్గమ ప్రదేశం మీదకు తమ సైన్యాలను నడపడం వినాశన హేతువని శాంతిమూల మహారాజు నిమేషంలో గ్రహించినాడు.
ఆంధ్రసైన్యాలు తమ శిబిరాలను అభీరసైన్యాలకు ఎదురుగా ఉన్న కొండలమీద నిర్మించుకొని, ఆ కొండలప్రదేశం కోటలా సిద్దం చేసుకొన్నారు. వెనుకనుంచి అభీరులు వచ్చి తాకకుండా మాళవసైన్యాలు రాజపథమునకు పొడుగునా ఈవలావల ఎత్తైన ప్రదేశంలో మూడుయోజనాల దూరంవరకూ ఆక్రమించాయి.
యుద్దరంగం స్తంభించింది. అప్పుడు బ్రహ్మదత్త ప్రభువు శాంతి మూల మహారాజుకడకు వచ్చి “మహాప్రభూ! నేను మన సైన్యాలతో వెనకకేగి, కొండలుదాటి, నర్మదానదిని ఎగువభాగంలో దాటి తపతీనది తీరాన్నే అడవులలో, కొండలలో చొచ్చిచని బరుకచ్ఛాన్ని ముట్టడిస్తాను. ఆ వార్త వచ్చిన వెంటనే ఈ శత్రు సైన్యాలు భరుకచ్ఛ రక్షణకు రావాలి. లేదా మీతో యుద్ధానికి తలపడాలి” అని మనవి చేసెను.
“అభీరులలో కొంతమంది మాత్రమే మిమ్ము వెనుకనుంచి వచ్చి తాకితే?”
“మాళవ వేగులను అభీరులను కనిపెడుతూ ఉండమనండి. అభీర సైన్యాలలో కొంతభాగం భరుకచ్చం సాగితే మాళవ సైన్యాలను నాకు సహాయంగా పంపించండి.”
“మీ ఆలోచన బాగుంది స్కందవిశాఖ ప్రభూ!”
శాంతమూలుడు బ్రహ్మదత్తునికి ఆనతి ఇచ్చినంతట బ్రహ్మదత్త ప్రభువు కొండలుదాటుతూ, అడవులవెంట వేగంగా సాగిపోయి భరుకచ్చం ముట్టడించాడు. ఎంత రహస్యంగా వెళ్ళినా బ్రహ్మదత్తుడు వస్తున్న వార్త ముందుగానే భరుకచ్ఛవాసులకు తెలిసింది. అందుకనే వారు సర్వసిద్ధంగా ఉండి బ్రహ్మదత్తుని కోటదగ్గరకు రానీయకుండా చేయగలిగినారు. ధనక విశాఖాయనక ప్రభువు ఇలా జరుగుతుందని ఇదివరకే అనుకున్నాడు.
దారి పొడుగునా బ్రహ్మదత్తుడు భరుకచ్ఛపు కోటను పట్టుకొనే విధానం ఆలోచిస్తూనే వచ్చాడు. ఖరుకచ్ఛం మహాపట్నం. ఆ పట్నంలో, ఆ పట్టణం చుట్టుప్రక్కల ప్రదేశాలలో రోమకులు, పారశీకులు, బాహ్లికులు, యవనులు, ఇగుప్తులు ఎంతమందో కాపురాలుండి వర్తకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పట్నం కోటచుట్టూ పది గోరుతముల పొడవు ఉంటుంది. పట్నంలో ఎన్నో చిన్న చిన్న కోటలు చాలా ఉన్నాయి.
3
రాజ్యాలు అవసరమా? కృతయుగంలో ఆశ్రమాలు, నగరాలు, నగరాలలో వ్యవహార దక్షులయిన ఆర్యులు సంఘాలు స్థాపించి క్షత్రియత్వం తమ జాతినీ యజ్ఞయాగాది క్రతువులను, ధర్మాన్ని రక్షించడం అంతేగదా ఆర్యమానవ జీవితం. మూడుయుగాలలో ఎంత మారిపోయింది. మానవ జీవితం? రాజ్యాలు స్థాపించడం అవసరమైంది. వృద్ధిపొందే మానవజాతికి సాత్విక, రాజసిక, తామసిక గుణసమేతులైన మానవులు మహాసంఘాలను స్థాపించారు. రక్షణకు, శాంతికీ వృద్దికీ, బడాయికీ, అభిమానానికీ, ఆశకూ రాజ్యస్థాపన, రాజ్యాభివృద్ధి, సాంకేతిక విద్యలూ కారణాలు అయ్యాయి. ఈ సంస్థాపనకై ప్రజానాశనము తప్పదా? ప్రజారక్షణా, ప్రజాశాంతీ, ప్రజాభివృద్దీ - ఇవే ఆశయాలయినప్పుడు ఆ ఆశయాలకు ప్రజాహింసా, ప్రజాసంక్షోభం, ప్రజానాశనమూ ఏలా మార్గాలు అవుతాయి?
బ్రహ్మదత్తప్రభువు ఈ ఆలోచనలతో సంక్షుభిత మసస్కుడై స్కంధావారం మధ్య తన శిబిరంలో కృష్ణాజినాసనస్థుడై వణకిపోయినాడు. ఈ యువక ప్రభువున కిదే మొదటి పర్యాయము జైత్రయాత్రలకు రావడం. తన విక్రమం, విజ్ఞానం, విజయతృష్ణ తనకు విజయం చేకూర్చవచ్చు, లేదా తన్ను నాశనం చేయవచ్చు. కాని ఈలోపున ఎందరు అంధ్రవీరులు, ఎందరు అభీరులు నాశనం అయిపోవాలి! ఆంధ్రులే ఈలా సర్వసామ్రాజ్యాధినేతలు ఎందుకు కావాలి? అభీరులు ఈ రాష్ట్రం ఆక్రమించి, ఇక్కడే నివసించి, ఇక్కడే పుట్టి, పెరిగి, ఇక్కడే మట్టిలో కలుస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రకృతిలో వారు భాగం; వారిలో ఈ ప్రకృతి భాగం. ఈ మహానదాలు రెండూ, ఈ వింధ్యాంత శ్రేణీ ఈ ఫలవత్తర భూమీ, ఈ సముద్రమూ, ఈ రేవుపట్టణమూ వీరివి. ఇందులో భాగం పంచుకోడానికి శాతవాహనులకు ఇక్ష్వాకులకు ఏమి స్వత్వం ఉంది?
ఆలోచనలోపడి ఏదీ నిశ్చయం చేసుకోని స్కందవిశాఖాయనక ప్రభువు కడకు యవనులు, పారశీకులు ఆర్యులు కొందరు రాయబారానికి వచ్చినారు. బ్రహ్మదత్త సేనానాయకుని అంగరక్షాధిపతులు వారిని సగౌరవంగా బ్రహ్మదత్తునికడకు కొనివచ్చారు. బ్రహ్మదత్తప్రభువు లేచి వారిని ఎదుర్కొని ఉచితాసనాల కూర్చుండబెట్టి “తాము దయచేసినపని ఏమి?” అని పృచ్చ చేసినాడు.
భరుకచ్ఛంకోటలో యవనులకు, రోమకులకు, పారశీకులకు, యూదులకు వర్తకం చేసుకొనే మహాభవనాలున్నాయి. అవి చిన్న చిన్న కోటలవంటివి. ఆర్యవర్తకులకు అట్టి చిన్న కోటలున్నవి. బ్రహ్మదత్తుని కడకు రాయబారానికి వచ్చిన వారంతా అలాంటి కోటలకు యజమానులు.
యవనవర్తకుడు: శాతవాహనప్రభూ! ధాన్యకటక మహారాజులు మాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చి మా వర్తకం సర్వవిధాలా వృద్ధిపొందేటట్లు చూచినారు. మాకు వారెన్నో రక్షణలు కల్పించిరి.
పారశీకవర్తకుడు: శ్రీయజ్ఞశ్రీ చక్రవర్తికీ జబ్బుగా ఉంది అని తెలిసినప్పటినుంచీ ఈ అభీరసామంతులకు ఎక్కడలేని ధీరత్వమూ వచ్చి మాబోటి వర్తకులనందరిని బాధిస్తున్నారు. ఐగుప్తవర్తకుడు: మా “పారోఆ” చక్రవర్తులతో దీటైనవారు మీ చక్రవర్తులు. “పారోఆ” చక్రవర్తుల రాజ్యాలు పోయాయి, టోలమీ చక్రవర్తులు వచ్చారు. అయినా మా వర్తకులకు వారూ సహాయం చేస్తున్నారు. కాని ఈ అభీరరాజులు మా రాబడులలో తమకు సగం పంచి ఇమ్మంటారు.
యూదువర్తకుడు: మా కోటలు పడగొట్టి తక్కిన ప్రజలతోపాటు ఉండమంటారు.
రోమకవర్తకుడు: నెమ్మది నెమ్మదిగా మా వర్తకాలన్నీ అభీరుల కిచ్చి మేము మా దేశాలకు వెళ్ళిపోవాలట.
ఆర్యవర్తకుడు:అభీరులకు వర్తకులంటే కోపం. మా వస్తువులు విదేశాలకు వెళ్ళడంగాని,విదేశవస్తువులు దిగుమతి చేయించడానికిగాని వీలు లేదట.
యవన: కాబట్టి మీరు సైన్యాలతో రావడం మాకు మహోపకారం.
బ్రహ్మదత్తుడు: ఇంతకూ మీరంతా రాయబారం రావడానికి కారణం?
యవన: తమ ఆశ్రయిం కోరి వచ్చాము.
బ్రహ్మదత్తుడు: అభీరులను నేను ఓడిస్తే మీకందరకూ ఉపకారం జరుగుతుంది. నేను వచ్చిందే అందుకు. మీరందరూ రాయబారం వచ్చినా సరే, రాకపోయినా సరే. జరిగే ఉపకారం ఎల్లాగా జరిగి ఉండునే.
యవన: కాదు, సేనానాయకా! మీరు పట్టణంమీద విరుచుకుపడకుండా ఉంటే, పట్టణాన్ని మీకు లోబరుస్తాము. అదీ మా మనవి.
బ్రహ్మదత్తుడు: మీరు అభీరుల పాలనలో ఉండి, అభీరులకు ద్రోహం చేస్తామంటే నేనెలా ఒప్పుకోగలను?
యవన: మేము ద్రోహం చేసేవాళ్ళము కాము. మేము అభీర నాయకునితో చెప్పనే చెప్పినాము. భరుకచ్చము అంధ్రులకు తిరిగి అప్పచెప్పవలసినదనీ, లేకపోతే ఆంధ్రులకు మేము సహాయం చేయవలసి వస్తుందనీ.
బ్రహ్మదత్తుడు: అయినా మీ ధర్మం మాకు నచ్చలేదు, మీరూ మాకూ మాకూ జరిగే యుద్దాలలో పాల్గొనకూడదు.
ఇంతలో అంగరక్షక దళపతి వచ్చి బ్రహ్మదత్తునకు నమస్కరించి,
“ప్రభూ! అభీరనాయకులు తమ ఆజ్ఞకై వేచి ఉన్నారు” అని మనవి చేసెను.
బ్రహ్మ: ప్రవేశ పెట్టు.
అభీరనాయకులు లోనికివచ్చి బ్రహ్మదత్తప్రభువునకు నమస్కరించి వారిచే అనుజ్ఞాతులై ఉచితాసనాల కూరుచున్నారు.
4
“ప్రభూ! మేమెప్పుడూ శాతవాహన చక్రవర్తుల బిడ్డలము. ఇన్నివందల సంవత్సరాలుగా వారికి శక్తివంచనలేకుండా సేవ చేశాము. సామ్రాజ్యాన్ని మాళవులు మొదలయిన విరోధులు ఆక్రమించకుండా మా స్వాతంత్ర్యం మేము కాపాడదలచుకొన్నాము. తామూ, శ్రీ ఇక్ష్వాకుమహారాజు శ్రీశాంతి మూల మహా ప్రభువూ, శాతవాహన సార్వభౌముల ప్రతినిధులుగా వచ్చారని మాకు నమ్మకం కలుగగానే తమ సన్నిధికి మా ప్రభుభక్తిని అణకువతో ఉద్ఘాటించడానికి వచ్చాము” అని అభీరనాయకులు బ్రహ్మదత్త ప్రభునకు విన్నవించెను. బ్రహ్మదత్తప్రభువు చిరునవ్వు నవ్వుతూ యవన పారశీకాది వణిజులను చూచి “మీ కోరికా, నా ఆశయమూ ఫలించాయి” అంటూ, అభీరులను చూచి గంభీరంగా, “మేము మా సైన్యాలతో భరుకచ్ఛం ఆక్రమించుకుంటాము” అని తెలిపినాడు.
ఆ దినమందే బ్రహ్మదత్తప్రభువు భరుకచ్చం ఆక్రమించుకున్నాడు. బ్రహ్మదత్తుని కడనుండీ భరుకచ్చపట్టణ నాయకులకడనుండీ చారులు, భరుకచ్చం లోబడిన విషయం వార్తలు కొనిపోయినారు. భరుకచ్ఛనాయకులు కట్టవలసిన కప్పము కట్టివేసినారు. కతిపయదినాల్లో శాంతిమూలమహారాజు సైన్యాలతో, భరుకచ్ఛ సేనాపతులతో సేనలతో భరుకచ్చం చేరిరి. నగరంలో నూతన్న శాతవాహన చక్రవర్తి సామ్రాజ్యాభిషేకోత్సవాలు వైభవంగా అభీరులు జరిపినారు.
భరుకచ్చంనుంచి శాంతిమూల మహారాజు దక్షిణంగా మరలి కుంతల దేశం చేరుకున్నారు. చూతశాత కర్ణాట ప్రభువు యుద్ధం చేయడానికి ఇష్టం లేక తానీయవలసిన కప్పం కట్టి, తన అకుంఠితభక్తి తెలిపినాడు. వైజయంతీ పురంనుంచి శాంతిమూల మహారాజు ముసికనగర ముఖ్యనగరస్థమైన శాతవాహనపథం దాటి కాంచీపురం చేరుకొని, కాంచీపురాధిపతులకడ, తొండమండలాధిపతులకడ కప్పముగొని, తిరిగి ప్రయాణాలు సలుపుతూ ధాన్యకటక నగరం విచ్చేసినారు. ఈ యాత్ర సంవత్సరానికి పూర్తియైనది. సామంతులందరూ యుద్ధం అవసరం లేకుండా కప్పముకట్టిన సంగతి విని విజయశ్రీ శాతకర్ణి చక్రవర్తి ఎంతో సంతోషించినారు. శాంతిమూల మహారాజు కప్పమంతా చక్రవర్తికి అప్పగించి, తాను విజయపురం వెళ్ళినాడు. బ్రహ్మదత్త ప్రభువు తాను యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా ఈ జైత్రయాత్ర పూర్తి అయినందుకు భగవదనుగ్రహాన్ని కొనియాడుకొన్నాడు.
శాంతిమూలమహారాజు ఈ జైత్రయాత్ర ఇంత సులభంగా జరిగిపోయినందుకు ధాన్యకటక మహేశ్వర దేవాలయంలో అర్చనలు చేయించి, మహా చైత్యానికి వేయి దీపములు అర్పించుకున్నాడు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు శాంతిమూలునితో ఏ తీర్థయాత్రకో వెళ్ళివచ్చినట్లు జైత్రయాత్ర చేసి వచ్చినందుకు ఆశ్చర్యం చెందినాడు. యజ్ఞశ్రీశాతవాహన చక్రవర్తి కాలంలో ఆ సార్వభౌముడు అభీరులతో, మాళవులతో యుద్దములు చేసినాడు. కుంతలములో నాగదేవులతో మహాయుద్ద మొనరింపవలసి వచ్చింది. యజ్ఞశ్రీ దేవుని తండ్రి నీరసుడవడంవల్ల శాతవాహన సామ్రాజ్యము క్రుంగి కృశించిపోయినది.
యజ్ఞశ్రీప్రభువు విక్రమ ప్రజ్ఞలవల్ల తండ్రితరాన ముక్కలైపోయిన సామ్రాజ్యము తిరిగి తాతగారయిన పులమావి, వారితండ్రి గౌతమిపుత్ర శాతకర్ణులనాటి మహోత్తమదశకు వచ్చింది. బ్రహ్మదత్తుడు శాతవాహనవంశంలో అట్టి చంద్రవిక్రముడు ఇంక రాడు అనుకున్నాడు. శాతవాహనవంశ ప్రభువులనేకులు వలసవెళ్ళి శాతవాహన రాష్ట్రము స్థాపించినారు. తుంగభద్రా కృష్ణవేణా సంగమస్థానంలో వారిలోగాని, మరి ధాన్యకటకాది ప్రదేశాల చిన్న చిన్న సామంతులలోగాని, కళింగంలో శాలివాహన గుండరాజ్య ప్రదేశాల సామంతరాజ్యాలు స్థాపించిన వారిలోగాని ఒక్కడైనా శక్తిమంతుడైన శాతవాహన వీరుడు లేడు. విజయశ్రీ మహారాజే కడగొట్టుపిందె. ఆయన కొమరుడు తండ్రీకన్న నీరసుడు.
బ్రహ్మదత్తుడు యువరాజు వీరపురుషదత్తుని కలుసుకొన్నాడు. వీర పురుషదత్త ప్రభువు మాళవంనుండి అంతకుమున్నే విజయపురికి వేంచేసినారు. మాళవాధిపతియైన రుద్రసేనప్రభువు తన ముఖ్యమంత్రిని శ్రీవీరపురుషదత్త ప్రభువును ఉజ్జయినికి ఆహ్వానించడానికి పంపిస్తాడు. ఆ సమయంలో భరుకచ్ఛంలో మహారాజు శాంతిమూలుడు విడిసి ఉన్నాడు. మహారాజు యువరాజునకు తమతో వచ్చిన ఇక్ష్వాకుమంత్రి నొకరిని పంపి తమ అనుమతిని తెలియజేసినారు. శీతకాలం ప్రారంభమైన దినాలలో ఉజ్జయిని వెళ్ళితిననీ, ఆనాడు ఉజ్జయిని కన్నుల వైకుంఠంలా అలంకరించారనీ యువరాజు బ్రహ్మదత్తునితో చెప్పినాడు.
బ్రహ్మదత్తుడు: ప్రభూ! మాళవ రాజపుత్రిక రుద్రభట్టారిక అపరిమిత సౌందర్యవతి అని నేను ఉజ్జయినిలో విన్నాను.
యువరాజు: ఈ యువరాజు ఈలా అపరిమిత సౌందర్యవతులను ఎంతమందిని చూడవలసి ఉంటుంది?
బ్రహ్మ: ప్రభువులు సర్వసాధారణంగా దక్షిణ నాయకులు. రాజధర్మ సంరక్షణకై దక్షిణ నాయకత్వమును పూనవలసి ఉంటుంది.
యువ: బలవంతుడైన రాజునకు దక్షిణ నాయకత్వం అవసరమా అనుకొంటాను.
బ్రహ్మ: దక్షిణ నాయకత్వమే ప్రభువులకు బలమిస్తుంది. క్రిందటి వసంతోత్సవంలో పూంగీయ రాకుమారికకు కోపం వచ్చింది కదా ప్రభూ?
5
వీరపురుషదత్తుడు బ్రహ్మదత్తుని ఒక నిమేషం తీక్షంగా గమనించి “ధనకప్రభూ! ఆ దినాన వసంతోత్సవంలో జరిగిన గజబిజి ఇదివరకెన్నడూ జరగలేదు. మా చెల్లెలు రతీదేవిగా ఉండలేకపోవడం, మీరు వెళ్ళిపోవడమూ జరిగింది. రాజకుమారి బాపిశ్రీ రహస్యంగా కన్నుల నీరునింపడం నేను చూచాను. దక్షిణ నాయకత్వ ప్రభావం అప్పుడే నాకు అవగతం అయింది.”
“ప్రభూ! మళ్ళీ వసంతోత్సవాలు వస్తున్నవి.”
“మా మరదలు శాంతశ్రీ రాకుమారి ఈ ఏడు వసంతోత్సవాలకు ఉండదలచుకోక తల్లిదండ్రులను ప్రోత్సహించి పూంగిప్రోలు వెళ్ళిపోయింది.”
“ప్రభూ! మేము ఉత్తరకళింగ రాజధానికి పోయినప్పుడు వాసిష్ట ప్రభువు క్రిందటి వసంతోత్సవాన ఆరంభించిన రాయబారాన్ని పూర్తిచేసినారు. అందుకు మహారాజుగారు ఒప్పుకున్నారు.” “రాజుల బ్రతుకులు రాజనీతి పాశబద్ధాలై కనిపిస్తవి.”
“అలా కాకపోతే ప్రజలకు ధర్మం ఏలా సన్నిహితం అవుతుంది?”
“అవును ప్రభూ! సాధారణ మనుష్యుడు భరించవలసిన బరువు ఏమి ఉంటుంది! భూమి భరించే శేషునిలా భారం భూపతే భరించవలసి ఉంటుంది. అయితే మా చెల్లెలు విషయం మీకు తెలిసి ఉండదు.”
“ప్రభూ! ఈ ఏడు వసంతోత్సవం జరిపే కార్యక్రమం ఏర్పాటు చేసినారా?”
“ఈఏడు వసంతోత్సవం జరపాలనే ఉత్సాహమేలేదు. నిరుటి వసంతోత్సవంలో శాంతిశ్రీ రాకుమారి తన్ను రతీదేవిగా మీరు ఆహ్వానించినప్పుడు గజగజ వణికింది. ఏ విషయం వచ్చినా పట్టించుకోనిది ఆనాడామె ఎంతో బాధపడింది. ఆ బాధ చూచిన మా కందరకు ఎంతో ఆనందం కలిగింది, బాధచే ఆమెలో చైతన్యం పొటమరించింది కదా అని.”
“ప్రభూ! రాకుమారి శుద్ద సాత్వికమూర్తి. శుద్దసాత్వికులకు అవస్థా భేదములుండవు. ఆ శుద్దసాత్విక స్థితికి ఏదైనా విపరీతావరోధము వచ్చినప్పుడు వారు యింకా పైకన్నా వెడతారు. లేకపోతే కొంచెం క్రిందికి దిగి బాధపడతారు.”
“మా మరదలు పూంగీయ రాజకుమారికి నేనెన్ని రాయబారాలను పంపినా ఆమె అన్నీ పెడచెవిని బెట్టింది” అంటూ యువరాజు మోము చిట్లించుకొని “మహారాజుగారి ఆదేశంవల్ల భట్టిదేవి రాకుమారిని వనరమగా ఎన్నుకొంటిని. శాంతశ్రీ ఇక్ష్వాకుల దౌహిత్రి. ఆమెకు రాజనీతి పరమైన ఆలోచన లేకపోలేదు. వనలక్ష్మి కానంత మాత్రాన ఆమె అందానికి లోటు వచ్చిందా? నేను స్వయంగా వెళ్ళి బ్రతిమాలినాను. ఆమెపై రచించిన గాథా గీతికలు చదివాను; చిత్ర చిత్రాలైన ప్రాభృతాలు పంపినాను. కాని ఆమె నాతో మాట్లాడలేదు. బాపిశ్రీ రాకుమారి నాకుగా దౌత్యంచేసి ఎంతో బ్రతిమాలుకుందట. నాల్గు నెలలు శాంతశ్రీ నాతో మాట్లాడలేదు. ఇంతలో నేను ఉజ్జయిని వెళ్ళినాను. అచ్చటనే రెండునెలలు గడచింది. తిరిగి నేను వచ్చిన తర్వాతకూడా పూంగీప్రోలు (నేటి ఒంగోలు) ఆ బాలకు రాయబారాలు పంపినాను” అని తెలిపినాడు.
వీరపురుషదత్తుడు పరాక్రమశాలి. సుగుణ సౌందర్యములాతని వరించినవి. రాజనీతిలో వక్రబుద్ధిలేని ధీమంతుడా రాకుమారుడు. దక్షిణా పథమందు శాతవాహన రాజ్యము అంతరించిపోతున్నదనీ, తన తండ్రిగారే దక్షిణాపథస్వామి కావలసివస్తుందని వీరపురుషదత్త రాకుమారునకు నిశ్చితాభిప్రాయం కలిగింది. తండ్రిగారికి రాజ్యకాంక్ష లేదు. కాని ధర్మనిర్వహణార్థం సామ్రాజ్యభారం వహించవలసివస్తే వెనుదీయరనీ, ఆ భారంవారు వహించవలసిస్తుందని నిర్ధారణ చేసుకొనే ఈలా తనకు దక్షిణ నాయకత్వం తప్పనిసరి చేశారని వీరపురుషదత్త ప్రభువునకు పూర్తిగా అర్థమైంది.
బ్రహ్మదత్తుని భుజంమీద చేయివైచి “దేశానికీ యుద్ధక్షోభం తప్పదా?” అని అడిగినాడు.
బ్రహ్మదత్తుడు: పశుధర్మం ఏదోరూపంగా మానవజీవితం అడుగున ఉండనే ఉంటుంది. సంపూర్ణ మానవత్వం మానవులలో దీపించినంత కాలము ఈ యుద్ధాలూ, ఈ నాశనాలూ, ఈ రక్తపాతాలు తప్పవు. వీర: ఎప్పటి కా ఉత్తమస్థితి?
బ్రహ్మ? ఈ ప్రపంచం విశ్వంలో లయమైనప్పుడే.
6
బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకసైన్యం పదునైదువందల వీరులతో విలసిల్లుతూ ఉంటుంది. వీరంతా ఒకధనస్సు (ఈ నాటి ఆరడుగులు) పొడుగుంటారు. అందరు బలసంపన్నులు, సంశప్తకులు. ఆయుధ విద్యలో వీరికి దీటయిన శూరులరుదు. విజయపురానికి అయిదుగోరుతాల దూరంలో ఉన్న సాలగ్రామవాసి నాగదత్తుడు ఈ దళానికి నాయకుడు సాలగ్రామం ధర్మగిరికి ఎదురుగా కృష్ణకావల రెండుగోరుతాలలో ఉన్న చిన్న గ్రామం.
ఇక్ష్వాకు సైన్యాలు జైత్రయాత్ర చాలించి విజయపురం రాగానే నాగదత్తుడు తన సేనాపతి అనుమతి తీసుకొని సాలగ్రామం వెళ్ళాడు. నాగదత్తుని తండ్రి బుద్దనాగడు అరువది ఏళ్ళవాడయినా జవసత్వాలుడుగని పోటుమానిసి. అతనికి సాలగ్రామంలో రెండు పెద్దఇళ్లు ఉన్నాయి. ఆ రెండు ఇళ్ళలో అతడూ భార్యలూ, అతని అయిదుగురు సంతానమూ ఉంటారు.
అతని పెద్దభార్య కన్నసిరి సంతానంలో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుండ్రు. కన్నసిరి మూడవ కొడుకు నాగదత్తుడు. కన్నసిరి పెద్దకొడుకు దుగ్గసామికి నలుగురు సంతానం రెండవకొడుకు గోదత్తునికి ఇద్దరు సంతానం. మూడవ కొడుకు నాగదత్తునికి వివాహమేలేదు. పెద్దకూతురు నాగసిరి రెండవ సంతానం. ఆమెకు పెండ్లయి అత్తవారూరయిన కోంబ్రోలకు పోయింది. ఆ గ్రామం సాలగ్రామానికి మూడు గోరుతాలుంటుంది. ఈమెకు అయిదుగురు సంతానం.
బుద్ధనాగుని రెండవ అమ్మాయి మహారాజకుమారి శాంతిశ్రీకడ అంగరక్షకి. ఆమె పేరు యశోదనాగిని. యశోదనాగినితో ఉన్న రెండవ అంగరక్షకి తారానిక. తారానిక తండ్రిగారి ఊరు విజయపురానికి దిగువను కృష్ణానది ఒడ్డునవున్న ఏటిరాయి గ్రామం. తారానిక తండ్రి ఏటిరాయి గ్రామణికుడైన సప్తనాగుని రెండవపుత్రుడై, శాంతిమూల ప్రభువు తండ్రికి అంతఃపుర రక్షకుడుగావచ్చి అంతిపురాలు కాస్తూ ఉండెను. అతని పెద్ద కొమరిత తారానిక.
తారానికకు ఇప్పుడు పదునెనిమిదేండ్లున్నవి. అంగరక్షకులుగా ఉన్నంత కాలం స్త్రీలు వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకోవాలంటే అంతఃపురోద్యోగం వదలి తండ్రి ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకోవలసిందే.
తారానికా యశోదనాగిని లిరువురూ దేహబలమూ, సౌందర్యమూ, బుద్ధిబలమూ, సుగుణసంపత్తీ ఉన్న బాలికలు. యశోదనాగినికి పది హేడేండ్లు. యశోదనాగినికకూ తారానికకూ పువ్వునకూ సువాసనకు ఉన్నంత స్నేహం. ఇద్దరూ కలిసి భోజనం చేయవలసిందే. ఇద్దరూ ఒకే రంగు చీరెలూ, వల్లెలూ, స్తనవల్కలాలూ, ఒకే దినుసు నగలూ ధరించవలసిందే. ఇద్దరూ మొలనూళ్ళకు దిగువను ఛురికలు ధరిస్తారు. యశోద నాగనిక శాంతిశ్రీ రాకుమారిక కడకు వెళ్ళవలసివస్తే ఆమె వెనుకనే తారానిక ఉన్నదన్నమాట. తారానికి రాకుమారిక పనికోసం ఎక్కడికేని వెళ్ళినచో యశోదనాగనిక కూడా వెళ్ళిందన్నమాటే. అంగరక్షకస్వామిని ఈ ఇద్దరిని ఒకర్తెగానే భావించి విధుల నేర్పాటుచేస్తూ ఉంటుంది. వీరిద్దరిపైనా ఉన్న నమ్మక మాస్వామినికి ఇతరులపై లేదు. రాకుమారిక ప్రార్థనా మందిరం ముందరగాని శయనమందిర ప్రాంగణంలోగాని కాపుగా ఉండేది ఈ బాలిక. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్కజట్టు పరిచారికలు తమ తమ గ్రామాలకు ఒకనెల దినాలపాటు వెళ్ళివస్తూ ఉంటారు. రాబోయే వసంతోత్సవాలకు యశోదనాగనికా తారానికలు సాలగ్రామం వెళ్ళుదమనుకుని స్వామిని ఆనతిని పుచ్చుకున్నారు. శుభముహూర్తం చూచి బాలికలిద్దరూ రాకుమారిక పాదాలకెరగి ఆమె అనుమతి నందుకొని కోట్యరథము కృష్ణకావల నెక్కి సాలగ్రామం బయలుదేరారు.
యశోద నాగరిక: ఏమే వదినా!
తారానిక: ఎందుకే సుదతీ!
యశో: ఏమిటే ఆలోచిస్తున్నావు?
తారా: నీ అందాన్ని గూర్చి.
యశో: నా అందమా?
తారా: నీ అందమే వదిన
నీ అందమే! సుదిన
మే నేను నినుచూచి
చూచినప్పుడో కాణాచి!
యశో: కాణాచి నేనై తే
జాణ వీవగుదువే
అంగజుని బాణమా
చందురుని కిరణమా?
రథాశ్వాలు వీరి పాటలు వింటూ నెమ్మదిగా నడుస్తున్నవి.
7
యశోదనాగనిక తలవంచుకొని దారిలో కాల్చిన జొన్నకంకుల ఊచబియ్యం నములుతూ “ఈ చేను లేగాపుది. అందుకనే జొన్నబియ్యం మారుచిగా ఉంది. పైరు పొలాలన్నీ ఏపుగా వస్తున్నాయి. సంక్రాంతి పండుగ ముందరనే కోతలైపోతాయి” అని చెప్పి తలెత్తి తారానికను చూచింది.
తారానిక నవ్వుతూ “మంచి రుచిగా ఉంది. ఈ ఊచబియ్యం పంట దినాల్లో పొలాలకు పోయి బాలబాలికలు ఈలా తింటూ ఉంటారా?” అని ఆ బాల యశోద నాగనికను ప్రశ్నించింది.
“వానాకాలంలో పొలాలకు పని ఉన్నవాళ్ళు తప్ప మరి ఎవరూ వెళ్ళరు. శీతకాలం వచ్చిందీ అంటే మా పల్లెటూళ్ళ వాళ్ళందరూ పొలాలలోనే కాపురాలు పెడ్తారు.” “అప్పుడు తినే ఫలహారాలు ఏమిటి యశోదా?”
“లేత కందికాయలు కాల్చుకుని గింజలు వలుచుకు తింటాము. అలాగే సెనగలు, పెసలు, బొబ్బర్లూ, ఊచబియ్యమూ తింటాము. ఒసేతారా, అప్పుడు బంతిపూలు, చేమంతులు, పొగడబంతులు, సీతామ్మవారి జడపూలు, పొద్దుతిరుగుడులు మా పొలాలంతా నిండి ఉంటాయి. ఆ పూలు జడలో కుట్టుకుంటాము. చెవులలో పెట్టుకుంటాము. జడకుచ్చులకు అలంకరిస్తాము.
“మీ పల్లెటూరి జీవితము వింటే నాకు నోరు ఊరుతోంది. ఇంకా పొలాల్లో జనులు కాపురాలు ఉన్నారే?”
“ఆ! చాలామంది వేసవికాలంకూడా పొలాల్లో గడిపివేస్తారు. ఆ తాటాకుల పాకలన్నీ అందుకే.”
“తాటాకుల ఇళ్ళు అసహ్యంగా ఉండవూ?”
“ఎంత చల్లగా ఉంటాయనుకొంటావు! మా మోటబావులలో నుంచి చల్లటినీరు తోడుతూ ఉంటారు. పొలాల్లో దిమ్మలమీద మామిడితోటలూ, నాగరంగం తోటలూ ఉంటాయి. పొలాల కంచెలలో సీతాఫలము, కలిమి కాయలు విరివిగా ఉంటాయి.”
“నన్ను ఊరించేస్తున్నావే!"
“ఈపాటికి మా అన్నయ్య యుద్ధయాత్రనుంచి తిరిగివచ్చి ఇల్లు చేరి ఉంటాడు.”
“ఆ సైన్యంలో మీ అన్న ఉన్నారా?”
“అవునే! బ్రహ్మదత్తప్రభువు ఆుగరక్షకులలో ఉన్నాడుగా!”
“అయితే ఇంటికి ఏలాగు రావడం?”
“యుద్ధయాత్రలు లేనిదినాల్లో స్వగ్రామాలకు వెళ్ళవచ్చునుగా?”
“మీ అన్నగారు ఇంటికి వెడుతున్నానని విజయపురంలో నిన్ను కలుసుకొని తెలిపినారా?”
“నీవు దగ్గరలేకుండా నన్ను ఎవరు కలుసుకున్నారే?”
“అయితే నీకు ఏలా తెలిసింది?”
“నాకు ఏలా తెలుస్తుంది? ప్రతిసంవత్సరమూ వసంతోత్సవాలకు మా అన్న మాగ్రామం వెడుతూ ఉంటాడు.”
“నువ్వూ వెడుతూ ఉండేదానవుగా?”
“అదుగో అప్పుడే మా చిట్టన్నను కలుసుకోవడము.”
తారానిక : ఎవరే ఆ చిట్టన్నా
ఆ పొట్టన్నా?
ఎంత పొట్టిగా ఉంటాడే?
ఎంత చిట్టిగా ఉంటాడే?
యశోద : నీ చిన్న కొంగులో ఇమిడేనే
మాచిట్టన్న
మా గట్టన్న
నీ కొప్పు పూలలో తుమ్మెదలా
నీ చెవులను వెలిగే తమ్మటలా
మా చిట్టన్నా
మా గట్టన్నా!
“మీ అన్న నా కొప్పుపూవులో తుమ్మెద అయితే ఉపున ఊదేస్తా.”
“నీ పెదవి కుట్టి వదులుతాడు.”
“ఈ అల్లరి మాటలు చాలించు.”
“నీకు అంతకోపంవస్తే గడ్డంక్రింద బెల్లం గెడ్డ పెట్టి బ్రతిమాలు కుంటాలే.”
రథం సాలగ్రామం ఊరిబయటకు వచ్చింది. సాలగ్రామంలోనూ, గ్రామం చుట్టూ పొలాలోనూ తాళవృక్షాలు నిండి ఉన్నాయి. ఆ చెట్లను వింతగా చూస్తూ తారానిక, ఈ చెట్ల ఆకులు పాకలూ, పందిళ్ళూ వేసుకోడానికి పనికివస్తవి కాబోలు అంతేనా?” అని అడిగింది.
“ఈ చెట్టు నిలువునా ఉపయోగం తారా! తాటిపళ్ళు వానాకాలంలో తింటాము. వేసంకాలంలో లేతనీటిముంజెలు అమృతమే. ఈ చెట్ల డొలకలూ కమ్మలూ చక్కని వంటసరుకుగా ఉపయోగిస్తాయి. పళ్ళలోఉండే టెంకలు చెట్ల విత్తనాలు ఈ విత్తనాలు పాతినప్పుడు మొక్క రాబోతున్నప్పుడూ అవి బద్దలుకొడితే అమృతమువంటి బుజ్జగుంజు వస్తుంది. లేతమొక్కలు అకులు వెయ్యకమునుపు తేగలంటారు. అవి కాల్చుక తింటే పిండివంట లెందుకూ పనికిరావు. నువ్వు వట్టి పట్నంవాసం దానపు. నీకేమి తెలుసు మా పల్లెటూరి జీవితాల అందమూ, రుచీ!”
“మళ్ళా నోరు ఊరించేస్తున్నావు.”
“ఉండు. మా పశువులుదొడ్డిలో, జొన్నచొప్ప, వట్టిగడ్డి, కందికంప నిలవ చేసుకొనే పెద్దదొడ్డిలో ఒకపక్క తేగలపాతళ్లు ఉన్నాయి. ఆ పాతళ్లలో తేగలు, బుఱ్ఱగుంజూ దొరుకుతాయి. రుచి చూద్దువు కాని.”
రథం యశోదనాగనిక ఇంటిముందు ఆగింది. ఇంటిలోనుంచి పిల్లలు, “చిన్నత్త వచ్చిందో” అంటూ రథందగ్గరకు పరుగెత్తుక వచ్చారు. ఇంటి చాకళ్ళువచ్చి సామాను లోపలికి చేరవేశారు. యశోదనాగనిక తల్లి వచ్చి ఇరువురు బాలికలకు పారాణినీరు దృష్టితీసి లోనికి తీసుకుపోయింది. “పట్నం నుంచి ఏమి పట్టుకువచ్చావు చిన్నత్తా” అని ఒక చిన్న బాలకుడు. యశోద ఒక బిడ్డ తరువాత ఇంకోబిడ్డను ఎత్తుకొని ముద్దులాడి, రాకుమారి మహానస గృహానవుండే అపూపాలు మొదలయినవి లక్కబరిణలలో నుంచి తీసిబిడ్డలకు పెట్టనారంభించింది. ఇంతలో ఆగది గుమ్మందగ్గరకు ఒక ఆజాను బాహుడగు యువకుడు అందాల మిసిమివయసువాడు వచ్చి “చెల్లీ, ఎప్పుడు వచ్చావే?” అని ప్రశ్నించినాడు.
8
“అడుగో మా చిట్టన్న” అని కలకలలాడుతూ యశోదనాగనిక అన్న చెంతకు ఉరికింది. నాగదత్తుడు చెల్లెలిని హృదయమునకు చేర్చి, భుజములుపట్టి సువ్వున పైకి ఎత్తివేసినాడు. యశోదే మంచి ఒడ్డూ పొడుగూ గల దిట్టరిపిల్ల. ఆ బాలిక అన్నగారిముందు చిన్న బిడ్డలా ఉంటుంది. ఒక్క ఎగురు ఎగరవేసి ఆ బాలికను క్రిందికి దింపాడు. ఇదంతా ఆశ్చర్యంగా తారానికి చూస్తూ నిలుచుంది.
“చిట్టన్నా! ఈ అమ్మాయి తారానిక. నా స్నేహితురాలు. మేమిద్దరం రాజకుమారిగారి నగరులో కవలపిల్లలం” అని యశోదనాగనిక నవ్వుతూ స్నేహితురాలి దగ్గరకు పరుగెత్తి “తారా! మా చిట్టన్నయ్యను చూచావా? ఈయనగారు గొప్పవీరుడు” అన్నది.
తారానికను రెప్పవాల్చకుండా నాగదత్తుడు చూస్తూ అలాగే నిల్చున్నాడు. అతని చూపులలోని తైష్ణ్యము చూచి తారానిక తల వంచేసింది. ఆమె మోము కెంపువారింది. ఈ బాలిక ఎంత అందంగా ఉంది! ఈమె కృష్ణానది కెరటం కాదుగదా అని నాగదత్తుడను కొన్నాడు. ఈ బాలిక ఇన్నాళ్లనుంచీ ఎక్కడ ఉంది? ఈమె మహాయుద్ధంలో విజయం పొందిన సేనాపతి నవ్వులా ఉంది. మెరుగుపెట్టిన కృపాణంలా ఉంది. ఈమె సావాసంచేసి తన చెల్లెలు ఎంత అదృష్టవంతురాలయింది. ఈమె మహావేగంతో వెళ్ళేపారశీకాశ్వం యొక్క నడకలాఉంది. ఈ బాలిక తన ఇంటికిరావడంవల్ల ఈ ఏటి వసంతోత్సవం నిజమైన వసంతోత్సవం కాబోతున్నది. ఈమె వసంత వనంలో పూచిన పూవులన్నీ ఒకచోట ప్రోగుచేసినట్లుగా ఉంది అనుకున్నాడు.
ఏమిటీ ఇంత అందంగా ఉన్నాడు! పల్లెటూళ్లలో ఇంత అందమైన పురుషులు ఉంటారా? ఎంతబలమో అతనికి, ఎంతచక్కని సోగమీసాలు! అ విశాలమైన వక్షం ఏనుగు నుదురు జ్ఞాపకం తెస్తోంది. సింహవక్షంలా ఉన్నది. సింహమంత బలమైనవాడా? అని తారానిక ఆలోచించుకొంది.
పల్లెటూరంత అందమైన ప్రదేశం ఇంకోటి లేదనుకొంది తారానిక. దినమూ తారానిక గదిలోనికి తంగేడుపూలు, అడవిమల్లెలు, కలిమిపువ్వులు, సూర్యకాంతాలు, చేమంతులు, చెట్టుసంపెంగ పువ్వులు దొంతర్లు దొంతర్లు వచ్చేవి. ఇవి ఎక్కడనుంచి వస్తున్నాయో తారానికకు తెలుసును. తారానికకు చలిదిఅన్నము, ఊరగాయ, గేదెపెరుగు అలవాటయింది. ఉదయమే స్నానం చేసేది. స్నేహితురాలూ తనూ తల దువ్వుకొనేవారు. చక్కని వస్త్రాలు కట్టుకొని చలిదిబువ్వలు ఆరగించడానికి పోయేవారు. తిరిగి వారిరువురూ గదిలోనికి వచ్చేసరికి తారానిక మంచంమీద పూలగుత్తులుండేవి. తారానికకు ఈ పూలు ఎల్లా వస్తున్నాయో స్వయంగా చూడాలని బుద్ధిపుట్టింది. ఒకరోజు యశోద భోజనం చేస్తూంటే తారానిక, “తింటూ ఉండు పని ఉంది యశోదా”అని ఆరగించకుండా పరుగున వచ్చి తమ గదిలో మంచంక్రింద దూరి కూర్చుంది.
అలా దాక్కొందో, లేదో నెమ్మదిగా అడుగువేసుకుంటూ నాగదత్తుడా గది చొచ్చి, తారానిక దాగిన మంచం దగ్గరకువచ్చి, తిరిగి నెమ్మదిగా అడుగు లిడుచు వెళ్ళిపోతూ ఆగినాడు. అతని పాదాలు ఆమె తోలు పెట్టెకడకు దారి తీసినాయి. భోజనానికి వెళ్ళుతూ తారానికి పెట్టెతాళ్లు ముడివేయలేదు. నాగదత్తుడు పెట్టెకడ వంగి పెట్టెతెరచి, అందులో నుండి ఏదో తీసుకొని, మళ్ళీ పెట్టెమూత నెమ్మదిగా వేసి, పిల్లి అడుగులు వేసుకుంటూ గదిగుమ్మందాటి వెళ్ళిపోయినాడు.
తారానిక చటుక్కున మంచంక్రిందనుంచి వచ్చి పెట్టెతెరచి ఏమి తీసుకొనివెళ్లి ఉంటాడు అని వెదకింది. తాను ప్రయాణమై వచ్చిన దినాన కట్టుకొన్నస్తనవల్కల మామె కాపెట్టెలో కనిపించలేదు. ఆ బాలిక చిరునవ్వు నవ్వుకుంటూ గుండె కొట్టుకుంటూ ఉండగా భోజనాల సావిడికడకు పరుగెత్తింది. యశోద భోజనం చేయకుండా కూర్చుని ఉంది.
యశోద: ఎందుకే వెళ్ళావు? ఇంతసేపు చేశావు?
తారానిక: నా వల్కలం ఒకటి ఎక్కడుందా అని జ్ఞాపకం వచ్చి వెళ్ళి వెదికాను. ఎక్కడా కనబడలేదు.
యశో:చాకిరేవుకు పోయిందేమో!
తారా: అబ్బే, అది మొన్ననే చాకలిది పట్టుకువచ్చింది.
యశో: ఎక్కడ పెట్టావు?
తారా: తోలు పెట్టెలో.
యశో: ఆహఁ! చిత్రంగా ఉందే! మా ఇంటిలో ఏవీ పోవే. తిన్నగా వెదికావా?
తారా: ఆ.
యశో: నేను వచ్చి వెదుకుతా ఉండు. ముందర భోజనంచేయి.
ఇద్దరూ భోజనం చేసినారు. తరువాత ఇద్దరూ వెళ్ళి గది అంతా వెదకినారు. ఇల్లంతా వెదకినారు. ఆ స్తనవల్కలం ఎక్కడా కనబడలేదు. లోపల నవ్వుకుంటూ తారానిక స్నేహితురాలితో కలసి ఇల్లంతా వెదికింది. ఎక్కడ కనబడుతుందో ఆమెకే తెలుసును. తారానికకు అల్లరిచేయాలని బుద్ధిపుట్టి, నాగదత్తుడు పొలానికి వెళ్ళి ఒక దినం అదను చూచి, నాగదత్తుని గదిలోనికి పోయి అతని అయుధాలలో ఒక చక్కని చురకతీసి, తన గదికి కొనివచ్చి, ఆమె అలంకారపు చందుగలో దాచుకొన్నది. ఆ మరునాడు నాగదత్తుడు అన్నబిడ్డలను, వసంతోత్సవానికై వచ్చిన తన పెద్దతోబుట్టువు బిడ్డలను, అన్నలను, యశోదను, తల్లిని ఇంట్లో పనివాళ్ళను అందరినీ తన చిన్న కత్తిని తీసినారా అని అడగడం, గడబిడ చేయడం చూచింది. తనలో తాను చిరునవ్వు నవ్వుకుంది. తన గదిలో ఏమీ ఎరుగనిదానిలా పువ్వులు గుచ్చుకుంటూ కూర్చుంది. నాగదత్తుడూ చెల్లెలు యశోదా మాట్లాడే మాటలు వింటూంది.
నాగదత్తుడు: ఎల్లా పోయింది చెల్లీ?
యశోద: అదే నాకు ఆశ్చర్యం వేస్తూంది.
నాగ: ఆ ఛురిక చాలా మంచిది సుమా.
యశోద: సేనాపతి నీకు ఇచ్చినది కాబోలు
నాగ: అంతకన్నా ముఖ్యం. విజయదశమి వీరోత్సవాలలో మొదటి వాణ్ణిగా నెగ్గినందుకు మహారాజుగారిచ్చిన బహుమతితోపాటు ధనక ప్రభువు తను ఛురికనే నాకిచ్చారు.
9
తాను బ్రహ్మదత్త ప్రభువుతో సలిపిన జైత్రయాత్రా విశేషాలు నాగదత్తుడు చెల్లెలికి, చుట్టాలకు చెపుతూ ఉంటే, తారానిక విననట్లు నటిస్తూ అంతా తన చిన్నారి అందాల చెవులు రెండూ దోరవిప్పి వింటున్నది. తారానికి వినడంలేదని మొదట నాగదత్తుడు కించపడ్డాడు. కాని కొంచెం ఎత్తువేసి చూద్దామని బుద్ధిపుట్టి, కథ చటుక్కున ఆపినాడు. తారనిక తలెత్తి నాగదత్తుని వైపు చూచింది. నాగదత్తుడు సోగమీసాలపై చిరునవ్వుతో ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె చకితయై తలవంచేసింది. నాగదత్తుడు 'దొంగాదొరికావు, అని మనసులో అనుకొని, “ఆంధ్రులంటే రాజులకూ, వారి సైన్యాలకూ అడలు. మేము వస్తున్నాము అని వినేసరికి కప్పాలు సరిచేసుకొని, మాకు అర్పించేందుకు సిద్ధంగా ఉండేవారు” అని నాగదత్తు డన్నాడు.
కొంటెపిల్ల తారానిక తలవంచుకునే, “ధనిక ప్రభువుగారి అంగరక్షక సైన్యం అంటే రాజులు కిరీటాలు పారేసి, మడమలకు బుద్ది చెప్పి అడవులకు ఉడాయిస్తారు” అన్నది. నాగదత్తుడు తెల్ల బోయి, ఒక్క నిమేషం చెప్పడంమాని, ఆ బాలిక హాస్యం అర్థం చేసుకొని, పకపకనవ్వి “విజయపురం కోటలో ఒక చిన్న దుర్గాదేవి వెలిసి రాకుమారిక మందిరంలో ఉందని ఆ రాజులకు తెలిసి, కలగుండుపడి, బిలబిలా పరుగెత్తి నారు” అన్నాడు.
తారానిక: (తలవంచుకునే) ఆ దుర్గప్రక్కనే మహాకాళికాదేవి సంరక్షిస్తూ ఉండడంవల్ల, ఆ దుర్గ అంటే అందరికీ భయం.
యశోద: నేను కాళినటే తారా?
తారా: నేను దుర్గను కాబోలు.
నాగదత్తుడు: అది నాకు తెలియదుకాని నేను మాత్రం వీరభద్రుణ్ణి కాను.
అందరూ పకపక నవ్వారు. నాగదత్తుడు తాను చూచిన దేశాలు, ఆ దేశాల ఆ వారాలు, అక్కడి వివాహ విధానాలు, స్త్రీ పురుషుల వర్ణనలు, భాషలు, ఆయా దేశాలలలోని విచిత్రాలు, అక్కడక్కడ తాను విన్న కథలు చెప్పాడు. ఇంత సంతోషంగా నాగదత్తుడు ఉండటానికి కారణం లేకపోలేదు.
బహుమానం పొందిన ఛురికపోయిందని అతడు బెంగపెటుకొని మతిలేని వానిలా తిరిగి ఊరి పురోహితుని ప్రశ్న అడిగినాడు. ఊరికావల ఉన్న ఎరుకలవారి కుటుంబాలలో ఉన్న గట్టుసిరి అనే ముసలిదాన్ని సోది అడిగాడు. గట్టుసిరి పోయిన వస్తువులు పశువులు, ఎక్కడ ఉన్నాయో జోస్యం చెప్పడంలో ఆ చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటిలో ప్రసిద్ధి కెక్కింది.
“ఓయి తండ్రీ, నీ సేతిలో యివాహరేకలు దగ్గిర వొచ్చినాయిరా!”
“ఓయి తండీ కొండ దేవత పేరు చెప్పి, కులం దేవతకు దణ్ణమెట్టి సెప్పుతుండానురా!”
“ఓరి బాబయ్యా! నీ కత్తే నీ సత్తి. నీ సత్తే నీ కత్తి బాబయ్యా!
“ఓరి అప్పా! ఒక యేలుకాదూ, రెండేళ్ళుకావు ఏళ్ళ మద్దెనె ఉంది నీ కళ్ళకాణాసీ!” “ఓరి తండీ! ఎరుకది సెప్తా ఉండది ఇనుకోరా! నీ సిన్న కత్తికీ, సిన్నదానికీ సంబంధం ఉంది కాదట్రా! నీ సిన్నకత్తే సిన్నదైతే, సిన్నదానిని నేలుకోవంట్రా!”
ఈ విధంగా గట్టుసిరి సోదే చెప్పింది. ఆ ముసలి ఎరుక చెప్పిన మాటలవల్ల అతని హృదయం మరీ అగమ్యగోచర స్థితిలో పడింది. తన చిన్నకత్తికి, చిన్న దానికి సంబంధమేమి అని ఆలోచించుకుంటూ నాగదత్తుడు ఇంటికి వచ్చి, గుఱ్ఱం దిగి గుఱ్ఱపువానికి అప్పగించినాడు ఇంట్లో ఎవ్వరూ లేరు. వంటలూ, భోజనాలూ పొలంలోనే అని పాలేరు చెప్పినాడు. వెంటనే నాగదత్తుడు లోనికిపోయి వస్త్రాదికాలు సేకరించుకొని పొలానికి పట్టుకుపొమ్మని ఆజ్ఞ యిచ్చి, తాను ఆలోచించుకుంటూ పొలము వెళ్ళినాడు.
ఆ పొలంలో వంటలు జరుగుతున్నాయి. పిల్లలు ఆడుకొంటున్నారు. యశోదనాగనిక, తారానిక ఎక్కడా కనబడలేదు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారని తన మేనగోడలి నొక బాలిక నడిగి, వీరి పొలం ప్రక్కప్రవహించే చిన్న కొండ ఊటవాగువైపు పోయినారని తెలుసుకుని, వారిని వెదుక్కుంటూ వెళ్ళినాడు. ఆ వసంతం ముందు మాఘమాసోదయ శీతలతపోయి, మత్తయిన ఉదయపు ఎండ కాస్తున్నది. ఆ ఉదయం జాము ప్రొద్దు ఎక్కింది. నాగదత్తు డా చిన్నవాగుదగ్గరకు పోయినాడు.
ఆ చిన్న వాగు కీవలావల దట్టంగా చెట్లు పెరిగి ఉన్నాయి. నాగదత్తుని తండ్రి ఆ వాగుప్రక్కనే తములపాకుల తోటలు వేయించాడు. ఆ తోటలోని ఆకు ఆ ఊరివారికే కాకుండా ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నిటికీ ఎగుమతి అవుతుంటాయి. ఆ తమలపాకుల తోటల ఎదుట వాగు. వాగు కావలిగట్టు పక్కగ్రామం వారిది. అక్కడా ఎన్నో తమలపాకుల తోటలున్నాయి. ఆ తోటలలో నాగదత్తుడు వెదకుతున్నాడు. అతనికి ఎక్కడా కనబడలేదు.
ఆ చిన్నవాగు గలగలా రాళ్ళమధ్య ప్రవహిస్తున్నది. చిరుపాటలు పాడుకుంటున్నది.
“జగమంత ఆటలే
జగమంత పాటలే
అందచందాల ఆనందమే జగము”
అని వాగు పాడుతున్నదనుకొన్నాడు. ఆ పాటలో ఏదో గుసగుసలు వినిపించాయి.
మొదటి గుసగుస: అందుకని దాచానూ.
రెండో గుసగుస: మంచిపని చేశావు. మా అన్నయ్య బెంగపెట్టుకున్నాడు, నిజంగా పోయిందనుకుని.
మొదటి: నా వల్కలం తీసి దాచవచ్చు నేం పాపం?
రెండో: ఎందుకు దాచాడో మరి? మొదటి: నేనూ అందుకే.
నాగదత్తుని గుండె జల్లుమంది. ఎక్కడ నీ గుసగుసలు? నెమ్మదిగా అతడా చుట్టుప్రక్కల ప్రదేశం వెదక నారంభించాడు. ఆ వాగుమధ్య అనేకమైన బండరాళ్లు పడిఉన్నాయి. ఓ పెద్ద బండరాయి చాటున నీళ్ళలో ఉన్న ఒక రాతిమీద కూర్చుండి యశోదా, తారా మాట్లాడుకోవడం గమనించాడు. నాగదత్తుడు చప్పుడు కాకుండా ఆ పెద్దరాతికి ఈవలప్రక్క చేరి గొంతు కెత్తినాడు.
10
పట్నవాసంపిల్ల
పల్లెటూరొస్తేను
ఊరంత విరగబడి
తారుమారై పోయె.
నగరవాసంపిల్ల
నవ్వితే ముత్యాలు
నాట్యమాడే కళ్ళు
నక్షత్రకాంతులే.
నగరవాసంపిల్ల
సొగసుదిద్దినపిల్ల
వగలుపోయే పిల్ల
నగవు కులికే పిల్ల.
అని పాడినాడు. వెంటనే రాగమూ వరసా మార్చి -
“ఓ అందాలా దేవకన్యా
చందురూనే ఎక్కిరిస్తా ?
మందుపెట్టీ మనసూ లాగేవా?
మాయచేసీ మాటాలాడేవా? ఓ అందాలా....
ఓ పట్నవాసం బంగారుపిల్లా
పల్లెటూరూ రాజ్యంచేశావా?
ఘల్లుమంటూ గంతూ వేసేవా? ఓ అందాలా....
ఓ దొంగవారీ రాచకన్నే
దోచుతావ మనసూ ప్రాణాలూ?
దాచుతావ మనసూ మర్మాలు ఓ అందాల....
ఓ చిన్నారి వయసుదానా
వన్నేల చిన్నాదానా
ఎక్కడీవే నీకీ అందాలూ
చుక్కల్లో తేలివచ్చావా?
ఓ అందాల దేవకన్నే?
అని గలగల నవ్వినాడు.
ఈ పాట ఒళ్ళు పరవశం అయిపోగా విన్నది తారానిక. తా మెక్కడ ఉన్నదీ నాగదత్తునికి తెలియకూడదని యశోద నాగనిక నోరు మూసి “ష్” అని చేయితీసివేసింది. ఇంకా దొంగమాటున ఉండదలచుకుందనీ, తన చెల్లెలినికూడా మాట్లాడవద్దన్నదనీ నాగదత్తుడు క్షణికంలో గ్రహించాడు. అతనిలో మత్తులు తాండవించాయి. కన్నులు బరువెక్కాయి.
“ఘలఘలఘల కదిలిరావ
థళథళథళ తరలిరావ
పసిడి వొంటి పడుచుదాన
మిసిమి వయసు సోకుదాన.”
యశోద పట్టలేక పకపకమని నవ్వింది. తారానిక కొండవాగులా మిల మిలల తళతళల నవ్వు నవ్వింది. నాగదత్తుడు “హహో, ఓహో” అని ఉరుము లురిమినట్లు నవ్వాడు. బాలిక లిద్దరూ లేచి నిలిచినారు.
తారానిక: పెద్దపులి వచ్చిందేమో అని అడిలిపోయాను.
నాగదత్తు: కోకిల గుంపు వచ్చిందేమో అని ఉప్పొంగిపోయాను.
యశోద: మీ ఇద్దరికీ మతిపోయిందేమోనని బేజారయ్యాను.
నాగదత్తు: ఇంతకీ నా చిన్నకత్తి తీసిన అందాలదొంగ దొరికింది. అదే సంతోషం.
తార: నా వల్కలం తస్కరించుకొని పోయిన ముచ్చు దొరికాడు. అదీ నాకు విచారం.
యశోద: అన్నయ్యకు సంతోషం ఏమిటీ, నీకు విచారం ఏమిటీ?
నాగ: నా కత్తి నాకు దొరికినందుకు సంతోషం, కాదుటే చెల్లీ!
తార: ఆడవాళ్ళ వల్కలం మొగవాళ్లు ఎత్తుకుపోవడం విచారం కాదుటే నాగవల్లీ!
యశోద: మా అన్నయ్య వీపుతట్టనా, నీకు కన్నీరు తుడవనా?
తార: పాపం మీ అన్నగారి వీపుతట్టు లేకపోతే నవ్వి నవ్వి వీరులకు పొరమారుతుంది.
నాగ: మీ స్నేహితురాలు కన్నీళ్ళు తుడు ముందు. లేకపోతే ఆ నీళ్ళతో ఈ వాగుపొంగి మన ఊళ్ళన్నీ ములిగిపోతాయి.
యశోద: ఉండండి ఇక్కడే. తట్టటానికీ తుడవడానికి కావలసిన వస్తువులు పట్టుకువస్తాను, అంటూ తుఱ్ఱున పారిపోయింది. “నేనూ వస్తాను ఉండవే” అని తారానిక ఆమెవెంట పారిపోబోతూంటే, నాగదత్తుడు చేయి పట్టి ఆపినాడు.
“నా చేయి వదలండి.”
“ఇది నాచేయి.”
“మీ చేయి ఏలాగు ?”
“నేను వరించిన చేయి నాదికాదా ఏమిటి?”
“అయితే మీకు ఎన్ని చేతులు దక్కి ఉంటాయో?”
“రెండే రెండు చేతులు తారా!”
“నా పేరు తారానిక.”
“నా పేరు నాగదత్తుడు. అయితే ఏమి, నేను నాగయ్యను. నువ్వు నాకు దారి చూపే చుక్కల రాణివి."
“మీరు చుక్కల్లో చంద్రుడు.” “నాకు ఒక్కటే చుక్క చక్కని చుక్క”
“మీ ముక్కలు మాబాగున్నాయి. నేను చుక్కనేగాని వెలుగులేని చుక్కను.”
“నా జీవితమంతా వెలిగే చుక్కవు.”
“నా చెయ్యి వదలరా ఏమిటి?”
"క్షమించు. ఏదో పువ్వు చేత్తో పట్టుకున్నట్టుంది.”
“చూడండి, నా మణికట్టు ఏలా కందిపోతోందో.”
“ఆమె నవ్వుతూ పెదవులు పూవులా ముడిచింది.
“అయ్యో ఎఱ్ఱటిగాజు ధరించినట్టు కందింది. నేను వట్టి బండవాణ్ణి.”
“ఎవరండీ మిమ్మల్ని బండవారనేది? మీ చెల్లెల్ని పువ్వులా ఎత్తేశారు.”
“నిన్నూ ఎత్తుతాను చూడా.”
నాగదత్తుడు ఆమె నడుం రెండుచేతులతో పట్టి సువ్వున పైకి ఎత్తి వేశాడు.
“నన్ను దింపండి. నాకు భయమేస్తోంది, ఎవరన్నా వస్తారు.”
“ఎవరు చూడవస్తారు” అని ఆమెను తన హృదయం మీదకు దింపుకొని, గట్టిగా అదుముకొని, ఆమె పెదవులను గాఢంగా చుంబించినాడు. ఆ బాలిక కళ్ళు మూసుకుని మళ్ళీ ముద్దులిచ్చింది. అతడామెను ఎత్తుకొని తన చెల్లెలూ ఆమే కూర్చుండిన రాతిమీదకు తీసుకువెళ్ళి అక్కడ కూర్చుండ పెట్టి ఆమె ప్రక్కనే కూర్చున్నాడు.
“మీరు ఒక పరాయి అమ్మాయిని ఈలా చేయవచ్చునా?”
“నేను ఇదివరకు ఏ అమ్మాయినీ ఈలా చేయలేదు. నువ్వు నాకు పరాయి అమ్మాయివి కావు. మనం క్షత్రియులం. నా ఖడ్గాన్ని నువ్వు దాచావు. నీ వల్కలాన్ని నేను దాచాను. ఇంతకన్న గాంధర్వ వివాహం ఏం కావాలి?”
“మనిద్దరికీ వివాహమే అయిపోయిందా! ఇదెక్కడ శాస్త్రమండీ?”
“ఆపస్తంభుల సూత్రం. వివాహంకాని బాలిక స్తనవల్కలం తీసుకొన్నవాడు ఆమెను వివాహానికై అడిగినట్లు, ఆమె ఖడ్గం తీసుకుంటే ఒప్పుకున్నట్లు. ఇదే గాంధర్వం.”
“అమ్మయ్యో! మా నాన్నగారు నన్ను చీల్చివేస్తారు.”
“ఎందుకు?”
“గాంధర్వ వివాహం చేసుకొని...”
“చేసుకునీ?”
“చేసుకుని.... ఆ.... భర్త.... భార్యను గట్టిగా హృదయానికి అదుముకోనందుకు.”
“ఆసి దొంగా!” అతడామెను గాఢంగా కౌగిలించుకొని ఒళ్ళు వేడెక్కి మత్తెక్కి ఆమె తలను తన చెంపలకు గాఢంగా అదుముకొన్నాడు. ఇంకా కొంత సేపు ఇద్దరూ ఉంటే ఏమవుతుందో అని ఆ బాలికా, అతడూ ఒక్కసారిగా అనుకొని ఒక్కసారిగా లేచారు. యశోద "తారా! అన్నా!” అంటూ కేకవేసుకుంటూ వచ్చింది.
★ ★ ★