అడవి శాంతిశ్రీ/తృతీయ భాగం
తృతీయభాగం
రతీదేవి
అడవి బ్రహ్మదత్తుడు మహారాజకుమారికకు మరల విద్య ప్రారంభించవలెనా, వలదా? పదినెలలు అంతరాయం వచ్చింది. తాను ఏమొగం పెట్టుకొని వెళ్ళి ఆమెకు పాఠం చెప్పగలడు? వసంతుడైన పురుషుడు వనరముగా ఒక బాలికను ఎన్నుకుంటే, ఆ బాలికను భార్యగా ఎన్నుకొన్నాడన్నమాటే. ఆ స్వయంవరాన్ని పెద్దలుకూడా కాదనలేరు. సగోత్రీకురాలిని ఎన్నుకొనగూడదు. తాను వివాహంకాదలచుకొన్న బాలికనే ఎన్నుకోవాలి. మన్మథుడుగా ఎన్నాకైనవాడు రతీదేవిని ఎన్నుకొన్నా అంతే. బ్రహ్మదత్త ప్రభువు రతీదేవిగా రాజకుమారి ఇక్ష్వాకు శాంతిశ్రీని ఎన్నుకొని లోకానికి ఆమెనే తాను ప్రేమించినది అని నిరూపించినాడు. అది ఎంత ద్రోహము, ఎంత నీచకార్యము? లోకంతో సంబంధం లేక యోగినీహృదయంతో జీవించే ఒక బాలికను, సమస్త బాలికాలోకం ఎదుట రతీదేవిగా ఎన్నుకొని తాను సలిపిన పాపానికి నివృత్తి లేదు.
ఆ దినాన తనకట్టి హీనబుద్ది కలగడానికి కారణమేమి? తన హృదయాంత రాళాలలో ఆమెపై వలపు ఉన్నదన్న మాటేగదా? ఆ వాంఛను దాచుకో లేని, వాంఛను నాశనం చేయలేని దుర్భలత్వం తనలో ప్రవేశించింది. అది తధ్యము. ఎంత అంద మా బాలికకు? లోకంలో యుగానికొక బాలిక అంత అతిలోక సౌందర్యవతిగా ఉద్భవిస్తుందేమో? అదివరకు మహారాజు తనయ జగదద్భుత సుందరి అని చెప్పుకొనే మాటలు విన్నప్పుడు తన కేవిధమైన స్పందనమూ కలుగలేదు. కాని, తన్ను మహారాజు ఆ బాలికకు గురువుగా ఉద్దేశించి తమ రాజహర్మ్యానికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ దివ్యసుందర గాత్రను చూచినప్పుడు, తన కళ్ళు మిరుమిట్లయి తక్కిన లోకం అగోచరమై పోయింది.
ఆ బాలిక అందం హిమాచలశృంగస్వరూపమైంది. ఆ అందం మానవ మాత్రులకెట్లు సన్నిహితం కాగలదు? ఆమె హృదయం వజ్రాయుధపు తునకలు కరిగించి పోతుపోసి ఉండవచ్చును. సూర్యబింబాన్ని తన కొమరితకై తురిమినప్పుడు ఆ తురుముడు పోగుచేసి ఆమె మెదడు చేసి ఉంటాడు దాత. ఆమెలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందా, లేక కరిగించిన సూర్యకిరణాలు ప్రవహిస్తూ ఉంటాయా? తాను వెఱ్ఱిబాగుల వానిలా ఆ బాలికను రతీదేవిగా ఎన్నుకొన్నంత మాత్రాన ఆమెలో మానవ చైతన్యం తీసుకువచ్చి, స్వచ్ఛమైన ఆమె చెంపలలో కల్హారాలు విరియపూయిద్దా మనుకున్నాడు.
బ్రహ్మదత్తుడు ఉస్సురని లేచినాడు. ఈ పదినెలలు ఆ యువప్రభువు పడినవేదన వర్ణనాతీతము. ప్రేమను దగ్గరకు రానీయక శ్రీకృష్ణ భగవద్బోధితమయిన స్థితప్రజ్ఞత్వము తన ఆశయంగా పెట్టుకొని సన్యాసాశ్రమ స్వీకారము త్వరలో పొందడానికి నిశ్చయించుకొన్న తనకు ఎక్కడనుండి వచ్చినదీ అవస్థ? ఆ బాలికకు ఆ దినాన ఏదో నిర్వేదము కలిగినందుకు తామందరు సంతోషించినామని వీరపురుషదత్తుడు తెలిపినాడు. చైతన్యరహితయై నిర్గుణగా ఉండే బాలికకు తనచేష్ట ఎంత అవమానమో కలుగజేసి ఉండాలి. లేకపోతే ఆమె అంతబాధ ఏలాపడి ఉంటుంది?
తాను యుద్ధయాత్రకు పోయి యుద్ధం అంటే భయపడినాడు. ఇది వరకు చిన్నతనంలో తాను చేసిన యుద్దా లేమంత ఘనమైనవి ఉన్నాయి? తనకు ఎప్పుడు ఇతికర్తవ్యతామూఢత్వమే! ఇతికర్తవ్యతామూఢులు “అవునా కాదా?” అనే కావడికుండల ఒడుదుడుకులలో పడిపోతూ ఉంటారు. తన తాతలు ధీరులు, జ్ఞానసంపన్నులు. ఆదిశేషులులా ప్రజాభారం మోస్తూ ఉండేవారు. తాను భారమే మోయలేని మామూలు నాగమ్మ అయి చక్కాపోయాడు. తన రక్తనాళాలలో రక్తమేనా ప్రవహించేది, లేక పారాణి నీళ్ళా? తన తలలో ఉన్నది మెదడా లేక ఊకఉండా?
రాకరాక తన హృదయంలో ప్రేమ ప్రవేశించింది. ప్రేమ అనే వస్తువు అవసరం లేకుండా తల్లిదండ్రులు ఏర్పాటుచేసిన బాలికను వివాహం చేసుకొని, సంసారధర్మం నిర్వహిస్తారు ఉత్తమ యువకులు. అట్లుకాక, ప్రేమ అనే రోగం దాపురిస్తే అన్ని అడ్డం తిరుగుతాయి. శాంతిశ్రీలో చైతన్యం కలిగిందని నమ్మక మేముంది? ఆమెకు ఇష్టములేనిచో తానెట్లా ఆమెను ఉద్వాహం అవడం? ఆమెను విడిచి ధర్మప్రకారం వేరొకబాలికను తానెట్లా వివాహం చేసుకోగలడు? తన హృదయం, బుద్ధి, అహంకారము ఆ బాలికను కోరినాయి. అవి వేరుగా ప్రసరించనేరవు. తాను మనస్సులో నైనా అలా ఊహించలేదు. ఆ బాలిక తండ్రిమాట జవదాటక వివాహానికి ఒకవేళ ఒప్పుకొన్నా తానట్టి వివాహాన్ని ఎలా అంగీకరిస్తాడు?
బ్రహ్మదత్తుడు ఆ బాలిక దివ్యసౌందర్యమూర్తిని తలంచుకొన్నాడు. ఆమె చూపులు తనకు కలిగించిన వేదనను స్మృతికి తెచ్చుకున్నాడు. తానూ, మహారాజూ ఆ బాలికకు బాధను కలుగజేస్తున్నారు. సాధారణ భోజనం విషయంలోనే ఇష్టంలేని పదార్థం తినిపిస్తే పడేబాధ ఇంతింత అని కాదు. అలాంటప్పుడు. వివాహం విషయంలో ఒక బాలికను వ్యధలో ముంచడం కంటె హైన్యం ఏముంటుంది?
త్వరలోనే నామెను భార్యగా కోరననీ ఆమెకు చదువు చెప్పుటకూడా మానివేస్తాననీ మహారాజుకు వార్త పంపాలని బ్రహ్మదత్తుడు నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయానికి రావడంతోటే పట్టలేని ఆనందమూ భరింపరాని వేదనా రెండూ కలిగినాయి. తన ధర్మము ఏ మాత్రమూ స్వలాభం ఆలోచించకుండా నిర్వహించగలుగుతున్నందుకు, ఒక బాలికకు నిర్మలానందం సమకూర్చడానికి తాను కారకుడు కావడానికీ అతనికి ఎంతో సంతోషం కలిగింది.
ధర్మము పురుషునకై, జీవితము పురుషునకై, రాజ్యము పురుషునకై, మోక్షము పురుషునకై, ఎంతకాలము పురుషులు ఈలా స్త్రీలను తమలో భాగం చేసుకొని తామే సర్వమూ అయి మెలగడం? స్త్రీ పురుషులు సంపూర్ణ సమాన భాగస్వామ్యం పొందడం ఎన్నాళ్ళకో? వేదవిహిత ధర్మాలు ఆచరణలో పెట్టలేని మానవలోకం స్త్రీ విషయంలో ధర్మనిర్వహణం ఏమి చేయగలదు? రాకుమారి తన చదువువలననే బాధపడుతున్నట్లు కనిపించింది. తండ్రిమాట జవదాటకూడదని నిశ్చయించుకొన్న బాలిక కావున తన గురుత్వం ఒప్పుకొన్నది. కాబట్టి తాను మహారాజుతో రాకుమారికకు చదువు చెప్పుట ధర్మముకాదని తెలపాలి, అని ఆలోచించుకొన్నాడు బ్రహ్మదత్తుడు. ఆ నిశ్చయానికి రాగానే బ్రహ్మదత్తుని హృదయభారం తీసివేసినట్లే అయింది.
ఆనందంతో ఆ సాయంకాలము సముచిత వేషంలో స్కందవిశాఖాయ నక బ్రహ్మదత్త ప్రభువు కోటలోనికి వెళ్ళి మహారాజు దర్శనము నర్దిస్తూ ఆలోచనా మందిరం లోనికి వెళ్ళేసరికి ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి అక్కడ నిలిచి ఉన్నది.
2
ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారిని ఆంధ్రశాతవాన చక్రవర్తి దాయాది అయిన పులమావిశాతవాహన కుమారుడు రెండేండ్లనాటి వసంతోత్సవాలలో చూచినాడు. ఆ రాకుమారునకప్పుడు ఇరువది అయిదు సంవత్సరాలుంటాయి. వివాహమయినది. బృహత్పాలాయన సామంతుల కొమరితను చేసుకొన్నాడు. ఇరువురు బిడ్డల తండ్రి. ఇరువురు ఆడపిల్లలే.
వాసిష్ఠీపుత్ర శ్రీ పులమావి చక్రవర్తి రెండవకొమరుని మనుమడు. యజ్ఞశ్రీ శాతకర్ణి దివంగతుడు కాగానే తానే రాజ్యం ఆక్రమించుకొందామని దృఢసంకల్పం పూనినాడు పులమావి రాకొమరుడు. అందుకై బృహత్పాలాయనులను, పల్లవులను సాయం ఆర్థించాడు. కాని మహామండలేశ్వరుడైన ఇక్ష్వాకు శాంతిమూల మహారాజు శ్రీవిజయశాతకర్ణిని చక్రవర్తినిచేసి, జైత్రయాత్రలు సలిపినాడు. శాంతిమూలుని ఎదిరించగల మగవాడు ఎవడు?
విజయశాతకర్ణికి బావమరది అగుటచేకదా శాంతమూలుడు సహాయం చేసినాడు. శాంతిమూలునకు తాను అల్లుడే అయితే తనకిక కుడిచేయి ఎడమ చేయీ శాంతమూలుడే. వీరపురుషదత్తుడుకూడ మహావీరుడు. ఇతన్నెవరు తేరి చూడగలరు అనుకొన్నాడు పులమావి రాకుమారుడు.
శాంతిశ్రీ రాకుమారి రూపజిత రతీదేవి. ఓహో! ఏమి సౌందర్యమది! అలాంటి సౌందర్యంచూచి ముగ్దుడుకాని పురుషుడు ఉండగలడా? ఈ మహాదాంధ్రపథంలోని కవులంతా ఆ బాలికా సౌందర్యం వర్ణించడమే తమకు జన్మసాఫల్యం అనుకుంటారు.
ఆ నాడు తానామెను చూచిన మరుక్షణంనుంచీ ఆ బాలికను గురించే మాట్లాడడంవల్ల నర్మసచివుడు “మహారాజా! తమకు శాంతిశ్రీ జబ్బు పట్టుకున్నదా?” అని గేలిచేశాడు. తాను చక్రవర్తి అగుట అల్లా ఉంచి, ఆ బాలికను వివాహం చేసుకొని తీరవలెనని ప్రతిజ్ఞపూనినాడు.
పులమావి రాకుమారుడు కొంచెం బొద్దుగా, పొడవుగా ఉంటాడు. విశాలమైన ఫాలం, గరుడనాసిక, లంబకర్ణాలు. కాని పెదవులు రెండు గీతలు గీచినట్లు సన్ననివి. అతని గడ్డము చాల చిన్నది. ఆ గడ్డముకూడ ముడుతలు పడి ఉంది అతనికి చేరేడేసి కళ్ళు. కాని లోచనాంగాలలో సౌమ్యస్థితిలేదు. నల్ల గుడ్లు చిన్నవి. అందుకే అతడెప్పుడు అతికోపంతోనో, అతి భయంతోనో చూస్తూ ఉన్నట్లు ఉంటాడు. పైగా కొంచెం మెల్ల ఉన్నది. పై రెప్పలు ఒత్తు. ఒత్తైన కనుబొమలు. చటుక్కున చూచినపుడు పులమావి రాజకుమారుడు తీక్ష్ణమైన, మనోహరమైన చూపులుకలవాడని అనుకుంటారు. కాని ఆ కళ్ళలో అతి క్రూరమైన పాముచూపులున్నాయి. అతనికి ఇరుపది ముప్పదిమంది అందమైన ఉంపుడుకత్తెలున్నారు. అతడు సర్వదా స్త్రీలోలుడు.
పులమావి రాకుమారుని హృదయంలో ఎంత క్రౌర్యమున్నా పైకి చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడు. చిరునవ్వులు ప్రసరిస్తూ వెంటవెంటనే ఎదుటివాని నాశనాన్ని కోరుతూ ఉంటాడు. ఎదుటివాని భావం గ్రహించాలని అతి ప్రయత్నం చేస్తు ఉంటాడు. అసత్యాలాడటానికి వెరవడు. వెనుక నుండి చురకత్తియతో తన గురువునైనా పొడవగలడు పులమావి రాకుమారుడు. రాజకీయాలలో నిర్వహించవలసిన పని లాభకరమైతే చాలు, మార్గమేదైనా సరే!
పులమావి రాకుమారుని ముసికనగరం (నేటి మస్కీ) రాజధానిగా శాతవాహన రాష్ట్రం పాలిస్తున్నాడు. ముసికనగరంలో తన కేళీ మందిరంలో సువర్ణాసనం అధివసించి పులమావి నర్మసచివుడైన నందిధర్మునితో మాట్లాడుతూ ఉండెను.
పులమావి: శాంతిశ్రీని మళ్ళీ ఒకసారి చూడాలి. ఆమెను చూడడమే శృంగార కళాసిద్ది.
సందిధర్ముడు: చిత్తం మహారాజా! ఇంక వివాహం ఎందుకు?
పుల: ఓయి వెఱ్ఱివాడా! భగవంతుడు ప్రత్యక్షమవడమే దుర్లభం. ప్రత్యక్షమగుటే చాలునని భక్తుడూరకుంటాడా చెప్పు. ఆ భగవంతునిలో లయం కావాలి అని కోరుతాడు
నంది: మహాప్రభువులు రాజకుమారిలో లయం కావాలి అని కోరుతున్నారా, లేక శాంతిశ్రీయే మహాప్రభువులో లయం కావాలి?
పుల: ఓయి విదూషక చక్రవర్తీ! నువ్వు ఏ ఉపాయం ఆలోచిస్తావో. మేము ఆ రాజకుమారిని ఒక పక్షందినాలలో చూడకపోతో...
నంది: పక్షవాతం వచ్చినంతపని అవుతుందంటారు ప్రభువులు.
పుల: నీ నొసలు వెక్కిరించక మానవు?
నంది: మహాప్రభువుల కళ్ళు తామరపూవుల్ని వెక్కిరించినట్లు.
పుల: ఉపాయం ?
నంది: దేవేంద్రుని ఉపాయం
పుల: దేహమెల్లా కళ్ళయి ఊరుకుంటే?
నంది : గౌతము డొకడు ఏర్పడితేకదా మహారాజా!
పుల: ఓయి మట్టితలకాయా నేనే ఆ గౌతముణ్ణి కాదలుచుకొన్నాను.
నంది: మహారాజా ఇంతకూ ఆమె అహల్య కాకపోయినా, ఆమె పోలికలున్న వంటారు.
పుల: అంటే?
నంది: మహాప్రభూ! ఆమెకు చైతన్యమే లేదట. ఆమెకు మెదడు ఉంది. హృదయంలేని రాయి అంటారు.
పుల: మే మాదినాన చూచినప్పుడు ఎక్కువ అభిమానమూ, గర్వమూ ఉన్నదానివలె కనిపించింది. నంది: ఆమె అపురూపు సౌందర్యంచే మహారాజు కన్నులు మిరుమిట్లుగొని ఇతరమును చూడలేక పోయినవి. నిజానికి ఆ కన్య అతిలోక సౌందర్యవతే. వైకుంఠలో భక్తులు నివేదించే వంటకాలకన్న రుచియైన అందం ఆమెది. కాని ఆ వంటకంలో అమృతమూలేదు, కామ దేనువు వెన్నా లేదు, పాలసముద్రంలో పాలూ లేవు, మందారంలోని మకరందమూ లేదు.
పుల: వెఱ్ఱిదికాదు. సర్వశాస్త్రపారంగత!
నంది: బుద్దభక్తి ఉన్నది. తండ్రిమాటకు జవదాటదు.
పుల: ఇంతకూ ఆ బాలిక ఎలాంటి దంటావు?
నంది: పాలులేని పాలసముద్ర మంటాను.
పుల: వెన్నెలలేని పూర్ణచంద్రుడు.
నంది: వాసనలేని పారిజాతం.
పుల: ఆవిడ ఓ విగ్రహమా?
నంది: తారుణ్యం, లావణ్యం, యవ్వనం, సౌందర్యం అన్నీ ఉన్నాయి.
పుల: అయితే మనం దేవేంద్రుని ఉపాయమే పూనుదాము. మంచి ముహూర్తం చూడు!
3
ఇక్ష్వాకు శాంతిశ్రీకుమారి, అప్పుడు బ్రహ్మదత్తుడు తన్ను రతీదేవిగా ఎన్నుకోగానే ఎంతో ఆవేదనకు లోనయింది. ఆమె అట్టి అవస్థనే ఇదివరకు ఎరగదు. హృదయంలో ఉప్పొంగు, మనస్సుకు మంట ఆమె ఎరగదు. అర్థం కాని ఒక ప్రళయగర్జన విన్న కురంగశాంబకంలా ఆమె గజగజలాడింది. ఒక పెద్దరాయిపడిన నూతిలోని నీరుచుట్టూ గోడకు తాకినట్లు ఆమె హృదయము దడదడ లాడిపోయింది. ఆ బాలిక వసంతోత్సవ వేషధారులై ఉన్న యువతీ యువకులను చూచింది. ఆమె కళ్లు ఏదోభయంతో అతివిస్పారితలు అయ్యాయి. కళ్ళనీళ్ళు వేడినీటి ఊటలా జివ్వున ఊరినాయి. కెవ్వున కేకవేయబోయి, కుడిచేతితో పెదవులు బిగించుకుంది. బ్రహ్మదత్తుడు వెంటనే రథమెక్కి వెళ్ళిపోయినాడు. యువతీ యువకులు వెళ్ళిపోయినారు. నీళ్ళలో ఊపిరాడనంతవరకూ మునిగిపోయి పైకి ఎలాగో తేలినట్లనిపించింది. ఆ బాలికకు. ఆమె కూడా తిన్నగా యింటికిపోయింది.
నిజంగా ఏమి జరిగింది? బహ్మదత్తప్రభువు తన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాడు. ఎన్నుకొంటే తన కెందుకంతభయం కలిగింది? భయం కలగడమేమిటి? శాస్త్రగ్రంథాలలో “భయము, కంటినీరు, వణకుట” వీటిని గురించి నిర్వచనాలున్నాయి. ఆ నిర్వచనాలు మాత్రం మా బాలకు ఏమి తెలియజేస్తాయి? పూలదండ మెళ్ళోవేస్తూ బ్రహ్మదత్తప్రభువు చేయి ఆమెకు తగిలినప్పుడు ఆమె దేహంలో ఏదో మహానది ప్రవహించినట్లయిపోయింది. గ్రంథాలలో చెప్పినట్లు, తన బౌద్దగురువు సెలవిచ్చినట్లు దేహంలోని నరాలు బాహ్యంగా జరిగిన ఒక సంఘటనవలన స్పందిస్తాయి. ఆ నరాలు దేహకండరాలను కదుపుతాయి. అదే జల్లుమనడానికి కారణమని అంటారు. ఏమిటా సంఘటన? బ్రహ్మదత్తప్రభువు తనమెడలో దండ వేయడమే సంఘటనా? బాలికలంతా తనతో “మన్మథుడు నిన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాడు” అని చెప్పినారు.
రతీదేవిగా ఎన్నుకోడంలో అర్థం చాలా ఉందనికదా తాను విన్నది? మన్మథునిగా ఎన్నుకొన్న పురుషుడు, ఒక స్త్రీని రతీదేవిగా ఎన్నుకొంటే ఆమెను తన భార్యగా వరించినట్లు అనీ, ఆ బాలికకు ఆ పురుషునియందు ఎంత ఇష్టములేకపోయినా, ఆ పురుషుడు కోరినట్లయితే అతని భార్య అయి తీరాలని తన తల్లిగారయిన మహారాణి చెప్పినారు. వివాహం అంటే వైదిక ధర్మము ననుసరించి స్త్రీ పురుషులు ఇరువురు కలిసి గృహస్థాశ్రమం నడపుట అని శాస్త్రాలు చెప్పుతున్నాయి.
శాంతిశ్రీ శాస్త్రపఠన కుశల. అవి ఆమెకు బుద్దిస్థమైనవేకాని అనుభవానికి రాలేదు. చిన్న బిడ్డలకు ప్రేమ అంటే ఏమిటో తెలుసును. తల్లి ముద్దు పెట్టుకుంటే శిశువు ఆనందం వెలిబుచ్చుతుంది. శిశువులకు పంతం ఉంది గంతులు వేస్తారు. బాలబాలికలు నవ్వుతారు. ఏడుస్తారు. పౌరుషం సిగ్గు అన్నీ ఉంటాయి వారికి. చిన్నతనాన్నుంచీ శాంతిశ్రీకి ఇవి ఏమీ తెలియవు. పదినెలల శిశువుగా ఉప్నప్పుడు చిటికవేసి నవ్విస్తే నవ్వేదికాదు. వెఱ్ఱిబిడ్డ అని అనుకునేందుకు వీలులేదని పండితులన్నారు.
శాంతిమూల మహారాజు దైవజ్ఞులకూ, పండితులకూ, ఆర్యఋషులకూ, బౌద్దార్హతులకూ తన బాలిక జాతకము చూపించినారు. వైద్యులచేత ఆ బాలికను పరీక్ష చేయించినారు. అందరు ఈమె ఒక విచిత్ర శిశువన్నారు. శాంతిశ్రీ ఆనాటి వసంతోత్సవం నుండి మరీ మౌనవ్రతం తాల్చింది. ఆమె ఎవరితోను మాట్లాడుట మానివేసింది. తండ్రితో, బౌద్దచార్యులతో ఏవో రెండు మూడు మాటలు అత్యవసరమైనవి అంటుంది. ఆమె ప్రార్ధన చేస్తుంది. ఆ ప్రార్ధనలో ఆమె పులకరింపు ఎరుగదు. ఉద్వేగము లేదు. మహారాజు బ్రహ్మదత్త ప్రభువుకు వసంతోత్సవంలో రతీదేవి నిర్ణయవిషయం సూచించలేదు. మంత్రులకు, రాజపురోహితులకు ఏమీ తెలియదు.
ఇంతలో శాంతిమూలమహారాజు, స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువూ ధాన్యకటకనగరం వెళ్ళినారు. ఆ వెళ్ళడం వెళ్ళడం వారిరువురు జైత్రయాత్ర సలిపి పదినెలలకు తిరిగి వచ్చినారు. వారు తిరిగివచ్చినప్పటినుండి అంతఃపురాలలో వసంతోత్సవ విషయం ఏమవుతుందనే గుసగుస లారంభమయినవి. వసంతోత్సవం వస్తున్నది. పదిదినాలు మాత్రమున్నది. ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. శాంతిమూలుని హృదయమూ, ఆకాశపులోతూ ఒకటేనని పెద్దల అభిప్రాయము. ఆ దినాన శాంతిమూల మహారాజు తామే స్వయముగా రాకుమారి అంతఃపురానికిపోయి ఆ బాలికను తన హర్మ్యానికి కొని వచ్చినారు. ఆ బాలిక ఏదో ఆలోచించుకుంటూ తండ్రి ఆలోచనామందిరానికు పోయినది.
4
బ్రహ్మదత్తప్రభువు శాంతిశ్రీని చూచి, తెల్లబోయి, నిలుచుండిపోయినాడు. బ్రహ్మదత్తుని చూచి ఆ బాలిక నిర్ఘాంతపడినది. మోము వెలవెల పోయినది. మరుసటి క్షణంలో బ్రహ్మదత్తుడు యథాస్థితినంది చిరునవ్వుతో “ఏమి శిష్యురాలా! మహారాజు మందిరాలకు దయచేసినావు?” అని ప్రశ్నించినాడు. “ఉదయమే నాయనగారు నా మందిరానకు వచ్చి నన్ను తమ అంతఃపురానికి తీసుకొని వచ్చినారు. అటూఇటూ తిరిగినాను. ఆలోచనామందిరానికి వచ్చినాను.”
బ్రహ్మదత్తునికి తా నాబాలికను మొదటిసారి చూడడం ఆ మందిరంలోనే అన్న విషయం హృదయాన ప్రత్యక్షమయింది. “ఏమిటి ఈ రెండు సంఘటనలకూ అర్థం ?” అనుకున్నాడు ధనక ప్రభువు.
వెనక ఈ స్కందవిశాఖాయనక ప్రభువును ఈ మందిరంలో కలుసుకొనడానికే తన తండ్రిగారు రప్పించినారు. అప్పుడే వారు తనకు గురువగుటకు నిశ్చయింపబడినది. ఈమధ్య కొంచె మెచ్చు తగ్గుగా సంవత్సరంనుండి వీరి దేశికత్వము తనకు తప్పిపోయింది. మరల ఆ దేశికత్వమును కొనసాగించడానికి మహారాజుగారు తన్ను రప్పించినారు కాబోలు అని రాజకుమారి అనుకున్నది. ఈ ప్రభువు జ్ఞానసముద్రుడు అవి ఆ బాలిక తన మనస్సున ఒప్పుకొన్నది. స్వభావముచే ఆమె జిజ్ఞాసువు. ఈ ధనక ప్రభువు బోధనా కుశలుడని ఆమె గ్రహించింది. వీరికి అడవి అనే ఉపనామ మెందుకు వచ్చిందో! వీరి పూర్వులు అడవి ప్రదేశాలు శాతవాహనులకోసం జయించడంవల్ల వచ్చి ఉంటుంది అనుకొన్నది.
అడవి ఎంత విచిత్రమైనది! అడవిలో ఎన్నిలక్షల జాతుల చెట్లు లతలు, నికుంజాలు, ఓషధులు, ముళ్ళమొక్కలు ఉంటాయి. లక్షలకొలది జంతువులు భయంకరమైనవి, సాధువైనవి, క్రూరమైనవి అడవిలో వాసం చేస్తాయి. మనుష్యులను, ప్రాణికోట్లను బ్రతికించేవి, నాశనం చేసేవి ఓషధులు మొదలయినవి ఉంటాయి అడవిలో. నదులా అడవులలో ప్రవహిస్తాయి. చినచిన్న సెలయేరులు, చెరువులు ఆ అడవులలో ఉంటాయట. అడవులు దావానలంవల్ల మండిపోతూ ఉంటాయట. మనుష్యులను కబళించే రాక్షసులు అడవులలో ఉంటారట. పిశాచులు, శాకినీ, ఢాకినీ మొదలుయిన క్షుద్రదేవతలు అడవులలో వాసంచేస్తూ ఉంటారుట.
అయినా ఈ ప్రభుకుటుంబానికి “అడవి” అని బిరుదనామం వచ్చింది. కాని అడవిలో మహర్షులు జ్ఞానం సంపాదించినారు. ఆ అడవులలో అనేక బౌద్ధసన్యాసులు ఆశ్రమాలు నిర్మించారు. ఈ విజయపురం నిర్మాణం కాకముందు ఇదంతా అడవే. నాగార్జునదేవుని ఆశ్రమం ఏర్పడిన తర్వాతనే ఈ విజయపురి వెలసిందంటారు. ఎంత భయంకరమైనా అడవి దివ్యమూ పవిత్రమూ అంటారు. ఈ అడవి బ్రహ్మదత్తప్రభువుకూడా దివ్యుడూ, పవిత్రుడూ.
ఈ ఆలోచన మనస్సులోతట్టి “ప్రభూ! తాము నాకు మరల చదువు ఎప్పుడు ప్రారంభిస్తారు?” అని శాంతిశ్రీ రాకుమారి ఆయనను అడిగింది. స్కందవిశాఖాయనక ప్రభువు ఆశ్చర్యంలో మునిగిపోయినాడు. ఈ రాజకుమారీయేనా ఈ మాటలన్నది? ఈమెకు చదువంటే ఇష్టంకూడా ఉన్నది! బలవంతంచేసి చెప్పిన చదువై నా మహాజ్ఞాపశక్తి కలది అవడంచేత జ్ఞాపకం ఉంచుకోగలదు. కాని చదువంటే కాంక్ష ఉంటుం దీమెకు అవి ఆ ప్రభువు అనుకోలేదు.
“రాజకుమారీ! మీకు చదువులందు కుతూహలం ఉంటే నేనెప్పుడూ సిద్దమే.” “మీరు పదినెలలు ఇక్కడలేరు. తిరిగివచ్చిన నెలాపదిహేను దినాలు చదువు తిరిగి ప్రారంభించలేదు.”
“రాజకుమారీ! రాజధర్మానికి మహారాజుగారివెంట యుద్ధయాత్రకు వెళ్ళాను.”
“వచ్చిన వెంటనే ఎందుకు ప్రారంభింపలేదు?”
బ్రహ్మదత్తప్రభువునకు ఆశ్చర్యము ఇంకా ఎక్కువై మిన్నుముట్టింది. ఈ బాలికకు యవ్వనవతులగు బాలికలకు ఉండే సహజమైన సిగ్గు లేనేలేదు. సౌందర్యంలో లోకానికే శిఖరము ఈమె! ఈమెను చూసిన క్షణంనుండి తాను ఓడిపోయినాడు. పరమేశ్వరుడే అపరాజితాదేవి. సర్వసృష్టిలో ఈ పరమసౌందర్యమూర్తిని చూచి మన్మథుని పూలబాణాలకు గురిఅయినాడు. రాజకీయ శ్లేష్మంలోపడి కొట్టుకొనే ఈగలా ఉన్న తన బ్రాహ్మణత్వమూ, వైరాగ్యమూ ఈ దివ్యబాల సౌందర్యంముందు ధైర్యం వహించి ఉండగలవా? ఎప్పటికైనా ఈ బాలిక హృదయంలో వలపు అంకురించునా?
“రాజకుమారీ! నేను రహస్యం దాచుకోలేను. క్రిందటి వసంతోత్సవాలకు నన్ను బాలికలందరూ మన్మథునిగా ఎన్నుకొన్నారు నేను రతీదేవిని ఎన్నుకోవలసి ఉండి మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు వర్ణనాతీతమైన సౌందర్యవతులు. కాబట్టి మిమ్ము రతీదేవిగా నేనానాడు ఎన్నుకొన్నాను. ఆ ఎన్నుకొనడానికి కారణం మీ అందము. నా కళ్ళు మిరుమిట్లు గొన్నాయి. ఇతికర్తవ్యతా మూడుడనై వెనువెంటనే మిమ్ము రతీదేవిగా ఎన్నుకొన్నాను.”
“ప్రభూ! నన్ను మీరు రతీదేవిగా ఎన్నుకొన్నప్పుడు నాకు ఏదో బాధ కలిగింది” అని శాంతిశ్రీ తలవాల్చింది.
5
శాంతిశ్రీ తలవాల్చడమేమిటి అవి బ్రహ్మదత్తప్రభువు ఆశ్చర్యమందినాడు. అస్పష్టమైన నిట్టూర్పు ఒకటి ఆ యువక ప్రభువు చెవినిబడి అతనికి మరీ ఆశ్చర్యం కలిగించింది. రెప్పలువాల్చే దేవతలను చూస్తే ఎవరికి ఆశ్చర్యం కలుగదు?
మరుసటి నిమేషంలో శాంతిశ్రీ తలఎత్తి “మీరు శుభముహూర్తము చూచి త్వరలో చదువు మళ్ళీ ప్రారంభించండి. రతీదేవి గొడవ నాకు తెలియదు. వసంతోత్సవము, వసంతుని ఎన్నిక, వనరమును వసంతుడే నిర్ణయించటం, అలాగే మన్మథుని బాలికలు ఏర్పరచుట, అతడు రతిని ఎన్నుకొనుట ఈ ఆచారాలు నాకు తెలుసును. అలా ఎన్నుకోబడిన బాలికలు వారివారికి భార్యలు కావలసి ఉంటుందనీ నాకు తెలుసును. భార్యాభర్తల ధర్మాలను శాస్త్రాలు విపులీకరించాయి. కాని ఆ ధర్మాలలో చెప్పబడ్డ మనోభావాలు ఏలా కలుగుతాయో నాకు తెలియదు ప్రభూ! అందుకని నేను మీకు రతీదేవిని ఎలా కాగలను? నన్ను మీరు వివాహం చేసుకుంటారు. నేను మీకు భార్యనై లాభమేమి? నాకు భార్యాత్వమంటే ఏమిటో తెలియదు. మా నాయనగారు ఆజ్ఞ ఇస్తే, మీరు తప్పదు అంటే, మీకు తప్పక భార్యనౌతాను. కాని ఆ తర్వాత ఏమిటి?”
శాంతిశ్రీ కనుబొమలు ముడిపడినాయి. పాలసముద్రంలో చిరు కెరటాలు ఏర్పడినా సౌందర్యమే భాసిస్తుంది. ముడులుపడిన శాంతిశ్రీ కనుబొమలు కూడా ఆమె సౌందర్యానికి ఇంకా ఎంతో అందం చేకూర్చినాయి. “రాకుమారీ! ఆ వసంతోత్సవ విషయం మరిచిపోయి, ఆనాటి సంఘటన జరగలేదనుకో! నాకు వివాహం అంటే ఇష్టమని అనుకోకు. వైరాగ్య పథాలలోనే నామనస్సు ఎప్పుడూ విహరిస్తోంది. వివాహం నా హృదయ విహంగానికి బంగారు పంజరమే!”
బ్రహ్మదత్తుడీ మాటలని చిరునవ్వు నవ్వి, ఆమెను తీవ్రంగా పరిశీలిస్తూ, పరిశీలించనట్లు నటిస్తూ “నేను ఆ దినాన నీ దివ్యసౌందర్యానికి ముగ్ధుడనై అలా చేసినాను. నీకు గురుత్వం చేసినపుడు నా మనస్సులో అట్టి వికారం కలుగలేదు. ఆ ముహూర్తంలో బాలికలందరూ నన్ను మన్మథునిగా ఎన్నుకోగానే ఎట్ట ఎదుట శుకమహర్షిని కూడా దాసుణ్ణి చేసుకోగలిగిన నీ సౌందర్యం దివ్యమైగోచరించింది. ఏమిచేస్తున్నానో తెలియకుండానే వచ్చి నీ మెడలో దండవైచినాను. అందువల్ల నాకు సంప్రాప్తించిన స్వత్వాన్ని నేను అత్యంత విచారంతో ఆ వెంటనే వదలివేసినాను” అని నెమ్మదిగా పలికినాడు.
“విచారం ఎందుకు మీకు?”
“సర్వదా శాంతమైన నీ పవిత్రహృదయాన్ని మూర్బుడనై కలచివేసినందుకు."
“ప్రభూ! మీరు నా నిమిత్తం ఏమీ మనస్సులో ఉంచుకోకండి! క్షణికమైన నా అందం చూచి మీరు మోసపోయి ఉంటారు.”
“ఈ సృష్టిలో క్షణికంకానిదేది రాజకుమారీ?”
“నిర్వాణం."
“నిర్వాణం సృష్టికి ఆతీతంకదా. క్షణికమైన జీవితంలో ఉంది. మనుష్యుడు శాశ్వతమైన నిర్వాణం వాంఛిస్తున్నాడు.”
“ఆ వాంఛకూడా గుణమేనా?”
“అదీ గుణమే.”
“శుద్ధ నిర్వాణముగాని, శుద్ధ స్థితప్రజ్ఞగాని గుణాతీతత్వాన్ని సూచిస్తుంది” అని తామే సెలవిచ్చినారు ప్రభూ!"
ఆ మాటలు వింటూ బ్రహ్మదత్తుడు నవ్వుతూ “నా పాఠం నాకే అప్పగింత చేసినావా రాకుమారీ?”
ఎప్పటికైనా ఈ బాలికలో స్త్రీత్వము స్పందనమౌతుందా అని బ్రహ్మదత్తు డనుకొన్నాడు. 'గుణాతీతత్వ'మని అన్నది కాని అది ఏమిటీ అని ఆ బాలిక ఆలోచించు కుంటున్నది. ఇంతలో మహారాజు వీరిరువురు పీఠాలపై అధివసించి, మాటలాడు కొనుచుండిన ఆలోచనా మందిరానికి వేంచేసినారు బ్రహ్మదత్తప్రభువూ, శాంతిశ్రీకుమారీ లేచి నిలిచిరి. బ్రహ్మదత్తుడు మహారాజు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము పొందినాడు. మహారాజు తమ పీఠము అధివసిస్తూ, బ్రహ్మదత్తుడువచ్చి రాకుమారిని కలవడం భగవన్నిద్దేశము. వీరిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. అదికూడా శుభసూచకం. ఈ ప్రభువులోని మహత్తరమైన శక్తి తన కొమరితను స్త్రీని చేయలేదా అని తలపోసినారు.
శాంతిమూల మహారాజు: విశాఖాయనక ప్రభూ! మీరు దయ చేసిన విషయము. బ్రహ్మదత్తుడు: మహాప్రభూ, రాజకీయ విషయాలు కొన్ని చర్చించాలని వచ్చాను. ఇక్కడికి రాగానే మహారాజకుమారిని చూచినాను. వారు నన్ను తిరిగి తమ చదువు ప్రారంభింపుమని కోరినారు.
ఆ మాటలు వింటున్న శాంతిమూలునకు విపరీతమైన అనందం కలిగింది. ఆ ఆనందము పైకి ఏమీ కనబడనియకుండా మహారాజు బ్రహ్మదత్తప్రభువు వైపు తిరిగి, “ధనకప్రభు, రాజకుమారి చదువు మన జైత్రయాత్రమూలాన భంగం అయినందుకు విచారిస్తూ, అమ్మాయి మళ్ళీ చదువు ఎప్పుడు ప్రారంభించగలదో కనుక్కోడానికే ఆమెను ఇక్కడకు తీసుకొని వచ్చాను. ఆ విషయం మా అమ్మాయికి తెలియదు. మా కన్నతల్లి మిమ్ము పాఠాలు ప్రారంభించండి అని అడగడం మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది “అని సెలవిచ్చినారు.
శాంతిశ్రీ: మహాప్రభూ! శుభముహూర్తముచూచి బ్రహ్మదత్త ప్రభువే చదువు మళ్ళీ ప్రారంభిస్తారు.
శాంతిమూల: ఇంక ఒక విషయం ఉన్నది. రేపు వసంతోత్సవాలు వస్తున్నవి. ఈలోగా బ్రహ్మదత్తప్రభువు పూంగీప్రోలు పట్టణం పోయి మీ పెద్ద మేనత్త పూంగీరాష్ట్ర మహారాణి శాంతశ్రీనీ, మహారాజును, వారి కొమరిత శాంతశ్రీ రాకుమారిని, వారి బాలుడు రాజకుమారుని తీసుకొనివస్తారు. అలా రాక వారు పూంగీప్రోలులోనే వసంతోత్సవానికి ఏర్పాటులుచేస్తే మనమందరము పూంగీప్రోలే ఆ ఉత్సవాలకోసం వెళ్ళవలసి ఉన్నది.
శాంతిమూల మహారాజు హృదయం వెంటనే బ్రహ్మదత్తుడు అర్థం చేసుకొన్నాడు. "రాజకుమారీ! నేను పూంగీప్రోలునుండి రాగానే మీకు చదువు ప్రారంభిస్తాను” అని తెలిపినాడు. బ్రహ్మదత్తుడు మహారాజుకడ సెలవుపొంది, శిష్యురాలు నమస్కరించగా ఆశీర్వదించి, మహారాజునకు నమస్కరించి, ఆశీర్వాదం పొంది వెడలిపోయినాడు.
శాంతిమూలుడు కొమరితచెయ్యి పుచ్చుకొని “రాతల్లీ! నా పూజా మందిరానకు. ఆ మందిరంనుండి మహారాణి బుద్ధపూజామందిరానకు వెడుదువుగాని” అని ఆమెను లోనికి కొనిపోయినారు. శాంతిశ్రీ తండ్రి పూజామందిరానికి, తల్లి పూజామందిరానికి వెడుతూ ఉంటుంది. అయినా ఆమెలో భక్తి చైతన్యము ఏమీకలుగలేదు. తానుకూడా పూంగీప్రోలు వసంతోత్సవాలకు వెళ్ళవలసి ఉంటుందా అని ఆమె ఆలోచించుకొన్నది. ఈ బాలిక బ్రహ్మదత్తప్రభువును తారసిల్లినపుడెల్ల ఏదో స్పందించిపోతున్నది. ఈమెను స్త్రీని చేయగల శక్తిమంతుడా యువకుడే అని శాంతి మూలుడు అనుకొన్నాడు.
6
బ్రహ్మదత్తప్రభువు మహారాజులో మాట్లాడిన మూడు దినాలకు విజయపురంనుండి సపరివారంగా పూంగీప్రోలు బయలుదేరెను. పూంగీప్రోలు సముద్రతీర పట్నం. విజయరపురినుండి కోటలా ఉన్న కొండలు దాటి, కొండలావల పల్లవభోగముగుండా అరువదిరెండు గోరుతాలు ప్రయాణం చేస్తే పూంగీప్రోలు వస్తుంది. చంద్రవంక, నాగనది, తుంగభద్రల మీదుగా మహారాజపథం, సస్యశ్యామలమైన భూమిగుండా వెళ్ళుతుంది. ధనకరాష్ట్ర మహాసామంతుడైన అడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్తప్రభువు విజయపురి వదలిన శుభముహూర్తంలోనే ఒక వర్తకుడు తన స్నేహితుడైన శ్రోత్రియునితో, అంగరక్షకులగు ఏబదిమంది అశ్వికులతో, నాలుగు ఏన్గులతో, పది ఒంటెలతో, ఇరువది కంబళి వ్యాహకములతో, బయలుదేరి కృష్ణదాటి విజయపురికి విచ్చేసినాడు. ఆ రత్నాల వర్తకుని ఉద్యోగులు కొంద రదివరకే వచ్చి పట్టణవర్తక ముఖ్యోద్యోగిని, వణిక్ సంఘ పంచాయతీ సభ్యులను కలుసుకొని, వణిక్ చక్రవర్తికి తగిన విడిదిలు ఏర్పాటు చేసినాడు. ముసికనగర మహాసామంతుడైన పులమావి శాతవాహనప్రభువు ఆ వర్తక చక్రవర్తిని సర్వవిధాల ఆదరింపుడని శాంతిమూల మహారాజునకు సుహృల్లేఖ పంపినాడు.
యౌవనమధ్యస్థుడూ, విలాసమూర్తి అయిన ఆ వర్తకోత్తముడు అనుచరులతో, తనకై వర్తకోద్యోగి ఏర్పాటు చేయించిన విడిది చేరి, స్నానాదికాలు నిర్వర్తించి భోజనంచేసి, కొంతకాలం ప్రయాణపు బడలిక తీరేటట్లు విశ్రమించాడు.
శుభముహూర్తంనాడు విడిదిలోనే వజ్ర, వైఢూర్య, గోమేధిక, పుష్యరాగ, నీల, మౌక్తిక ప్రవాళ, గారుత్మత, పద్మరాగాది రత్నాలు ఉంగరాలుగా, హారాలుగా, బాహువురులుగా, కంకణాలుగా, మేఖలాలుగా, మంజీరాలుగా రచించిన భూషణాలగానూ విడిగానూ, రత్నవర్తకులకూ ప్రభువులకూ ప్రదర్శింప ప్రారంభించినాడు. ఆ వర్తకుడు స్వయంగా మహారాజదర్శనము చేసుకొని వారికి నవరత్నములు పొదిగిన కంఠమాల ఒకటి సమర్పించెను. మహారాజు ఆ భూషణము ప్రాభృతముగా స్వీకరింప నిరాకరించి కోశాధ్యక్షునిచే మూల్యము నిప్పించెను.
నవరత్నాలే కాకుండా ఆ వర్తక కుమారుడు బంగారపు కణికలను, బంగారపు ఇటుకలనుకూడా విరివిగా అమ్మకము సాగించినాడు. వణిక్ సంఘాధ్యక్షునకు చక్కని ఉంగరము బహుమాన మిచ్చినాడు. విజయపుర ప్రభువైన స్కందవిశాఖాయనక ధనకప్రభువు తాను వచ్చినదినమున పూంగీప్రోలు వెళ్ళినాడని విని ఆ వర్తకోత్తముడు ఎంతో కించపడినాడు. పది దినాలు గడచిపోయినవి.
ఒక రాత్రి తన పడకగదిలో మంచంమీద పండుకొని ఉండగా వినోదుడు రత్నకంబళిపై అధివసించి ఆ వర్తకకుమారునితో మాట్లాడుతూ ఉండెను.
“మహారాజు మన బహుమాన మెందుకు తీసికొనలేదంటావు?”
“మహాప్రభు! మీరు తప్పటడుగు వేసినారు. తెలివితక్కువ అక్కడే ప్రారంభమయింది."
“ఏమిటా తెలివితక్కువ?”
“మీరు ఆ భూషణం ప్రాభృతంగా సమర్పించడంవల్ల మహారాజుకు మీ మీద అనుమానం కలగవచ్చును!”
“అనుమానం ఎందుకు? నేను చేసింది తప్పుపని కాదుగదా?”
“ప్రభూ! వర్తకులు మహారాజులకు అంతటి ప్రాభృతం ఇవ్వడం విపరీతంకాదా?”
“అది అలా ఉంచుగాని మన శాంతిశ్రీకి, యువకుడైన బ్రహ్మదత్తుడు చదువు చెప్పుచుండెనటగా?” అని వర్తకకుమారుడు వినోదుణ్ణి ప్రశ్నించాడు. “ఓయి వర్తకప్రభూ! ఎవరు చదువు చెప్పితే ఏమి? మీకు అది లాభమే కదా?”
“ఒక యువకునిచే, ఒక యువతికి చదువు చెప్పించడం ఎంతదోషం?”
“ఉదయన మహారాజు వాసవదత్తకు వీణాగానం పాఠాలు చెప్పితే ఏమేమి దోషాలు ఎవరెవరికి సంభవించాయి?”
“ఇక్కడా అదే ఉద్దేశ్యమా?”
“మరేమిటనుకున్నారు వర్తకమహారాజా?”
“ఏల్లాగు దీనికి అడ్డు అస్త్రం తగిలించడం?”
“ఇంతవరకు జరిగినదానికి భయపడ నవసరంలేదు. ఇకముందూ అంత భయపడ నవసరం లేదు!”
“ఏమిటా ధైర్యం ?”
“మన అడ్డుఅస్త్రం రాజకుమారి దగ్గరే ఉన్నది.”
“అంటే?”
“శాంతిశ్రీ రాకుమారి ప్రకృతి అత్యంత విచిత్రమైనది. ఆమెకు స్త్రీపురుష భేదం తెలియదనీ, ఆమెలో చైతన్యమే లేదనీ, ఆమె ఎవ్వరినీ ప్రేమించలేదనీ, అలా సంభవిస్తే లోకమే తల్లక్రిందులవుతుందనీ మనచారులు, స్త్రీ అపసర్పిణలు వేగు తెచ్చారు.”
“అయితే మనకు మాత్రం ఆశ ఏమిటి?
“ఎంత వెఱ్ఱివారండీ ప్రభూ! ఒకసారి పెళ్ళిచేసుకుని మన్మథతల్పం చేర్చండి! ఎవరైనా కరిగి పోరండీ?”
“ఇవి అనుభవంచే చెప్పే మాటలేనా?”
“ఎంతచెట్టు కంతగాలి!”
“అసాధ్యుడవే!” “అసాధ్యమైన చోట్లకూడా, దారి సాధ్యం చేసుకున్నాను మహా ప్రభూ!”
“ఇదా నీ వినోద ప్రభావం?”
“మహారాజా! నా స్త్రీ వేట ఎంత సేపు అక్కలవాడలలో, బౌద్ధభిక్షుణి ఆశ్రమాలలో, నేను గృహస్థాశ్రమాల జోలికిపోను. అందుకనే నా కున్న గౌరవం వసిష్ఠ మాహర్షికైనా ఉందోలేదో?”
“ఇంతకూ మన కార్యక్రమం?”
“పంచతంత్రం చదివారుకదా! మిత్రలాభ, మిత్రభేద, సంధి విగ్రహాదులయిన తంత్రాలు ప్రయోగించాలి. మిత్రలాభం దాసీ జనాదులపట్ల, మిత్రభేదం మనకు అడ్డువచ్చే వారియందు, కాపలాకాసే వారిపట్ల సంధి, విగ్రహం మహారాజు నమ్మకమైన బంట్ల ఎడ?”
“బాగానే ఉంది. నీ ప్రయోగం ఫలించేవరకు నా విరహతాపం చల్లారడం ఎల్లా? ఆ బాలికను ముందు నేను చూడాలి. చూడకపోతే నిలిచేటట్టులేవు నా ప్రాణాలు.”
“ఈ రెండుళ్ళూ ఎల్లా నిలిచి ఉన్నాయి?”
“దగ్గరకు రానంత సేపు స్వప్నసుందరి మాత్రం!” “దగ్గరకు రాగానే జాగరసుందరి అయి ఊరుకొన్నదా?”
“వెఱ్ఱిప్రశ్నలు వేయక వెంటనే ఉపాయం ఆలోచించు.”
“చిత్తం, ఆలోచిస్తున్నా. ఆలోచిందా; ఆలోచించడమేమిటి ఆచరణలో పెట్టినాను.”
“ఏమిటది?”
“రాజకుమారిక కడకు దారిలో రెండు సింహిక లుండేవి. అవి లేవు ప్రస్తుతము. ఇప్పుడున్న సింహికలు మన విషయంలో వట్టి మార్జాలికలు.”
“అంటే?”
“మనం నగలవర్తకులుగా ఆమెకడకు వెళ్ళే వీలు ఏర్పాటు చేస్తాయా మార్జాలికలు.”
“మనకు అంతఃపురాలన్నీ ఇక నివృతద్వారాలే.”
“సరే. నీ చేతిలో ఉన్నాను.”
“జారిపోకుండా ఉండండి. నేను చెప్పిన పాఠాలు మరవకండి. కొంపలు మునిగిపోతాయి."
ఈ యిరువురు మన పాతమిత్రులే అని పఠితలు గ్రహించే ఉంటారు.
7
ఈ నూత్న వర్తకచక్రవర్తి వినోదకునితో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారిని గూర్చి మాట్లాడిన అయిదు దినాలకు శాంతిశ్రీ రాకుమారి వినయపీఠికల చదువుకుంటూ తన విద్యామందిరంలో కూర్చుండి ఉన్నది. ఇంతలో దౌవారిక ఒకతె ఇద్దరు వర్తకులను మందిర ముఖద్వారానికి లోని భాగంలో నిలుచుండబెట్టి చదువు కొంటున్న రాకుమారి దగ్గరకుపోయి “జయము జయము భరృదారికా! వారు వచ్చినారు” అని విన్నవించెను. “ఎవరే?” అని రాకుమారి తన పీఠమునుండి లేచి ద్వారమువైపు చూచినది. “ఎవరువీరు?” అని ఆ బాలిక కనుబొమలు ముడివడ ఆ దౌవారికను ప్రశ్నించింది. “నగలవర్తకులా? నగలవర్తకు లిక్కడి కెందుకు వచ్చినారు?”
“తమకు నగలు చూపించడానికండి”
“నాకు నగలు చూపించడమేమిటి! నేను చూడనని నీకు తెలియదా?” ఆమె కొంచెం విసువు కనబర్చింది.
“తమతో మనవిచేసి తమ అనుమతిపొందే తీసుకవచ్చానండి.” ,
ఇంతలో వణిక్కుమారులిమంత్రి రాజకుమారికవైపు తిరిగి రెండు చేతులు జోడించి, “మహారాజకుమారీ! మేము విదేశాలనుండి వచ్చిన వర్తకులము. మా దగ్గర ఉన్న నగలూ, నవరత్నాలూ, బంగారమూ రెండుమూడు వందలకోట్ల సువర్ణ ఫణాల వెల చేస్తాయి. సువర్ణగిరిలో ఉన్న మా కేంద్ర స్థానంలో ఉన్న నగలూ మొదలైన వాని మూల్యం ఎన్ని కోట్లుంటుందో మాకే తెలియదు. మహారాజులైన ఇక్ష్వాకు శాంతిమూల మహాప్రభువుల అంతఃపుర దేవేరులు రాజకుమారీమణులు మేము తెచ్చిన భూషణాలన్నీ తీసుకొని మమ్ము సన్మానిస్తారనే ఆశతో మీ మహానగరం వచ్చినాము. మహారాణిగారు మూడు లక్షణ ఫణాల నగలు పుచ్చుకొన్నారు” అని మనవిచేసి తలవంచుకొన్నాడు. ఏమీ మాట్లాడకుండా ఆ వర్తక కుమారుడు శాంతిశ్రీ రాకుమారిని కళ్ళతో కబళిస్తూ నిలుచున్నాడు. శాంతిశ్రీకి ఏమీ అర్థంకాలేదు. చిన్నబిడ్డవలె తెల్లబోయి చూచింది వారిరువురివైపూ. దౌవారికమాత్రం అక్కడనుంచి మాయమైపోయింది. ఏమీ తోచక రాజకుమారి పదిలిప్త లలా ఉండి వెంటనే అక్కడనుంచి తలవంచుకొని వేరొక ద్వారంగుండా తన ప్రార్థనామందిరానికి వెళ్ళిపోయింది.
వర్తకులిద్దరూ ఆశ్చర్యంతో ఒకరి మొగమొకరు చూచుకున్నారు. వారిని తీసుకొని వచ్చిన దౌవారిక ఎక్కడనుంచి వచ్చిందో అక్కడకు పెదవులకడ వేలుంచుకొని, వారిని తనతో రండని తీసుకొని పోయింది. కక్ష్యాంతరాలు గడుస్తూ రాకుమారిభవనాలు రక్షించే మహాకుడ్య గోపురం దాటి బయటపడ్డారు. ఆ బాలిక వారిద్దరనీ గోపురద్వారం బయటవదలి, తిరిగి లోనికి పోయినది.
ఆమె లోనికి వెళ్ళగానే ఒక ప్రతీహారిణివచ్చి “రాజకుమారిగారు సభామందిరంలో ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు” అని దౌవారికతో చెప్పింది. సభామందిరంలో దౌవారిక వెళ్ళగానే, అక్కడ మహారాజ కుమారి సభ తీరిచి ఉన్నది. అంతఃపురపాలకురాలు మహారాజకుమారి ప్రక్క ఒక ఆసనంమీద కూర్చునిఉంది. ఒక ప్రక్కగా బారులుతీర్చి, నలుగురయిదుగురు ప్రతీహారిణులు, పదిమంది దౌవారికలు, ఎనమండుగురు అంగరక్షకు రాండ్రు దాసీజనమూ, ముగ్గురు చెలికత్తెలు నిలిచి ఉన్నారు. వీరందరినీ చూడగానే ఆ దౌవారికకు ప్రాణాలు క్రుంగిపోయాయి.
అంతఃపురపాలకురాలు (ఏభైఏళ్ళుంటాయి): ఏమి బౌగ్దాయినీ, ఎవరినీ వర్తకులను తీసుకొని వచ్చినవావుట?
బౌద్దాయని: కా - కాదమ్మా! నేను రాకుమారి గారి అనుమతిమీదనే తీసుకొని వచ్చినాను.
అంతః: అనుమతిపొందే తీసుకొని వచ్చి ఉండవచ్చు. కాని విద్యామందిరంలోకి ఎందుకు తీసుకవచ్చావు? అమ్మగారిని చూడడానికి పురుషులెవరైనా వస్తే, నాకు తెలియజేయవద్దూ?
బౌద్దాయని: చిత్తం! కాని ఆవర్తకులు మహారాణులు మొదలయిన వారికే నగలు, నవరత్నాలూ అమ్ముతారు. వారికి చాలా తొందరపని ఉండటంచేత, విద్యామందిరానికి తీసుకొని వెళ్ళాను. తమతో మనవిచేసి తమ అనుమతి పొందడానికి వ్యవధి లేకపోయింది.
అంతః: తీసుకొని వచ్చినావు, బాగానే వుంది. ఆ వెంటనే నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పినావు కావు?
బౌద్దా: చిత్తం ఆ వర్తకులను సాగనంపడానికి వెళ్ళానండి.
అంతః: ఆ వర్తకులను విద్యామందిరంలో దిగబెట్టగానే నువ్వు ఆ మందిరం వదలివచ్చి పైన నిలుచుని వున్నావు. అప్పుడు వచ్చి చెప్పలేదేం?
ఆ దౌవారిక మౌనం వహించింది.
అంతః: దుర్మార్గులారా! నువ్వు ఆ వర్తకుల దగ్గర కొంతధనం బహుమానం పుచ్చుకొని లోనికి తీసుకొని వచ్చావు అంతవరకూ నాకు తెలిసింది. సరే, నిజం చెప్పు. ఎవరా వర్తకులు. మహారాజుకుమారికను చూడ అవసరం ఏమి కలిగింది? బౌద్దాయని కళ్ళనీళ్ళుకారిపోతూ ఉండగా వెక్కివెక్కి ఏడుస్తూ అంతఃపుర రక్షకురాలి ఎదుట గజ గజ వణుకుతూ సాష్టాంగపడి “రక్షించుతల్లీ! పది బంగారు పణాలూ ఒక నీలిరంగు ఉంగరమూ బహుమానం ఇచ్చారు. మన నగరంలో అందరు రాజకుటుంబాల వారూ కొన్నారట. రాజకుమారికగారుపుచ్చుకొంటారని వారికై ఎన్నో చిత్ర చిత్రభూషణాలు తీసుక వచ్చారట. ఎలాగన్నా రాజకుమారిగారి దర్శనం చేయించమన్నారు. అంతే నండి” అని ఘొల్లుమన్నది.
8
ఈ మధ్య శాంతిశ్రీ మనస్సులో ఏవో ఆవేదనలు మొలకలెత్తాయి. అవి ఆవేదనలని ఆమెకు తెలియదు. ఆమె కూర్చోలేకపోయింది. నిలుచుండ లేకపోయింది. ఇటూ అటూ పదచారం ఏస్తూ ఉండేది. భోజనం అంత సహించేదికాదు. ఏదో ఆలోచన. ఆ ఆలోచనకు తలాతోకాలేదు. వానిని గూర్చి ఆమెకు ఏమీ తెలియదు.
మహారాజకుమారికి వంట్లో బాగాలేదని అంతఃపురపాలకురాలు భయపడి పోయింది. రాజ్యవైద్యుడు వచ్చి పరీక్షచేసినాడు. ఒంట్లో ఏమీ జబ్బు కనబడలేదు ఆయనకు. రాజకుమారి మనఃప్రవృత్తి ఆ వైద్యునకు పూర్తిగా తెలియును ఆమెకు దుఃఖములు, కాంక్షలు, పట్టుదలలు ఏమీలేవని ఆయన పూర్తిగా గ్రహించే ఉన్నాడు. శాపగ్రస్తయై ఒక దివ్యభూమిని ఈ జన్మ ఎత్తిందని ఆయన నమ్మకం అతి నిశితమైన బుద్ధి కలిగి ఉండీ మనోవికారాలు లేకపోవడానికి ఇంకోకారణంలేదు. ఆ బాలిక పుట్టినప్పటినుండి ప్రతిఘట్టమూ ఆయనకు తెలియును. ఆమె యోగిని అని వైద్యుడెప్పుడూ అనుకోలేదు. మనోవికృతులు ఆమెలో ఉద్భవించడానికి ఓషధీయుక్త తైలాలెన్నో ఆ సద్బ్రాహ్మణుడు పయోగించేవాడు. అందువల్ల ఆమె బుద్ది మరింత వికసించింది, ఆమె దేహం మరింత ఆరోగ్యవంతమయింది. ఇంక ఆమెలో కామాది వికారాలు ఉదయింపజేసే ఔషధం ఎక్కడ ఉన్నది?
ఈ దినాన రాజకుమారిలో ఏదో ఒక విచిత్రపరివర్తన ఆమెకు తెలియకుండానే ఉద్భవించి ఉంటుందని వైద్యులవారు ఊహించుకొని పరిచారికలను, సఖులను, అంతఃపుర పాలకురాలినీ విచారణ చేసినాడు. ఇన్నాళ్ళనుంచీ జరిగిన విషయాలాయన ఎరిగినవే అయినా, వానిలో ఉండే పరమార్ధ మావైద్యవృషభునకు తెలియలేదు. ఆ వైద్యుడంతట అంతఃపుర పాలకురాలికి ఉపచారవిధులు కొన్ని ఉపదేశించి వెడలిపోయెను.
శాంతిశ్రీదేవి యధాప్రకారం వారాని కొక్కపర్యాయము తన చదువు కోసం బౌద్ధసంఘారామానికి పోవుచున్నదే కాని, ఆమె సంగీతం చిత్రలేఖనమూ నేర్చుకొనదు. బౌద్ధగీతాలూ, జాతకగాథలూ వింటూ ఉంటుంది.
ఆ వర్తకులు తమ విడిది చేరారు. వర్తక కుమారునకు లోకభావమే నశించింది. ఆతడు కనురెప్పలు మూయకుండా శూన్యాన్ని చూస్తూ గడియ లుంటాడు. లేదా, కళ్ళుమూసుకొని పండుకొని ఉంటాడు. నందిధర్ముడు రెండు దినాలు చూశాడు. ఆ కుమారుడు భోజనం సరిగా చేయడు, మాటలాడడు, రాత్రులు నిద్రపోడు. అస్తమానమూ ఉస్సురంటూ ఉంటాడు. కళ్ళు గుంటలు పడ్డాయి. నందిధర్ముడు కొంచెం భయపడ్డాడు. “ఏమిటిది ప్రభూ?” అని ఒక దినాన వర్తకకుమారుని ఎదురుగుండా నిలుచుండి, అతని భుజాలు పట్టి కదిపివేసి, అడిగినాడు. ఆ యువకుడు మాట్లాడలేదు సరికదా తలవాల్చుకొని, కుంగిపోయి కూలబడి ఉన్నాడు.
“వెనక ఈ బాలికను చూచినప్పుడు ఇంత అందంగా కనబడలేదా? కాకపోతే వెనుకటి అందం అంతా మాయమై సాధారణ మైపోయిందా రాజకుమారి?”
“నన్ను చంపకు.”
“అమ్మయ్య! ఇన్నాళ్ళకు మాటొకటి ఊడిపడింది. మహాప్రభువుకు ఇదంతా విరహవేదన కాబోలు. ఉండండి లేత అరటిఆకులు, పన్నీరు, అన్నీ తెప్పించగలను.”
“నీకు బుద్ది ఉందా?”
“ఆ! ఇతరుల సంగతి నేను చెప్పలేను. నాకు ఉన్నదొక్కబుద్ధే. అదే నా ఆస్తిపాస్తీ. నాకేమీ రాజ్యాలులేవు కొట్లులేవు, అమ్మేందుకు భూషణాలులేవు.”
“నోరు మూయవోయి ఇంతట.”
“ఎవరిది ప్రభూ?”
“నీ విషయం శ్రుతిమించి రాగాన్ని పడుతోందే!”
“మీ విషయం రాగాన్నుంచి మూర్చనలోకి ఉరకటంలేదు కాబోలు. అచ్చంగా చంద్రాపీడులయ్యారు. మీ సభలో నాటకాలు వేసేవారు మీ అంత బాగా శృంగారం అభినయిస్తేనా, ఎంత బహుమతి దొరికేదో?”
“నాదంతా అభినయమంటావు?”
“అభినయం కాకపోతే నిజమే అనుకోండి. నా అభ్యంతరమా!”
“ఓరి ఛండాలుడా ఎంతమాట అంటున్నావురా?”
“నన్ను ఓ పదిపూలచెండులు వేసికొట్టరాదూ?”
ఆ బాలకుడు కొంచెం అర్థహాసం చేసినాడు.
“సరే, ఇంతకూ నీ ఆలోచన ఏమిటి?”
“ప్రభువుల ఆలోచనే నా ఆలోచన.”
“మొత్తుకున్నట్లుంది!”
“ఉన్నట్లుండడ మెందుకు? నిజంగ మొత్తుకుంటున్నాను!"
“ఎందుకూ?”
“ఇంతకన్న అందమైన బాలికలున్నారనీ, ఈబాలిక మనకు సాధ్యం కాదనీ.”
“ఓయి వెఱ్ఱివాడా! సాధ్యంకానిపని అనేది పులమావి చక్రవర్తి ఎరగడు. ఈ బాలిక సౌందర్యం నామతి పోగొట్టింది. ఈ బాలిక నాకు రాణి కాకపోతే నాకు చక్రవర్తిత్వమూ వద్దు, జీవితమూవద్దు. ఈ బాలిక నా అంతిపురానికి వచ్చిందాకా నాకీ బాధ తప్పదు. ఏమి అందం, ఏమి అందం, ఏమి అందం!”
“చిత్తం! ఎందుకా అందం? వట్టి బంగారుబొమ్మ. ముసికలోనే ఉండి మీరూ ఓ బంగారు బొమ్మను చేయించుకోరాదూ?” “ఆమె కన్నులు కన్నులా? అవీ....”
“కావు. ఆలి చిప్పలు”
“ఆమె నుదురు, పెదవులు, చెవులు, ఆమె శరీరకాంతి, ఆమె వక్షస్సౌభాగ్యము....”
“మహాప్రభూ! మీకు ఈ బాలికే కావాలంటే....”
“అలా దారికిరా. త్వరగా చెప్పు ఏం చెయ్యాలో.”
“మీరు ఆమెను ఎత్తుకొనిపోయి పెళ్ళిచేసుకోవడమే మార్గము.”
“ఆ ఎత్తుకుపోవడం ఏలాగు? ఆ తర్వాత ఏమవుతుంది?”
“ఎత్తుకుపోయే ఉపాయాలు పన్నుదాము. వెంటనే వివాహం. ఇంక అల్లుడిపైన కత్తిగడతాడా శాంతిమూలుడు? పెళ్ళయితే ఏలాంటి బాలిక అయినా క్రమంగా అలవడుతుంది.”
“అమ్మయ్యా! నా ఉపాయమే నీకూ వచ్చింది. ఇంక మనం ఈ ఊరునుంచి విడిది ఎత్తివేయాలి.”
“నేను సిద్ధం మహాప్రభూ! అయినా ఒక్కసారి తాము శాంతిమూల మహారాజును దర్శించి, బేరాలు బాగా సాగినాయి అని మనవిచేసి, వారి కొమరిత మాత్రం నగలేమీ కొనలేదని యాధాలాపంగా చెప్పినట్లు చెప్పి, ఏదో ప్రాభృతం సమర్పించండి. ఆ మరునాడు మనం బయలుదేరిపోదాము.”
“బాగానే ఉంది నీ ఉపాయం.”
“అయితే వెంటనే ఏర్పాట్లు చేస్తాను. ఆమెను తస్కరించి వచ్చిన క్షణంనుండి మీరు సప్తమేఘాలు ఒకసారి అవతరించినట్లు, ద్వాదశార్కులు ప్రజ్వరిల్లినట్లు పరాక్రమించి దుర్నిరీక్షులయిపోవాలి.”
“తథాస్తు!”
9
ఆంధ్రశాతవాహనుల మహాసామ్రాజ్యము, ఇక్ష్వాకుల మహారాజ్యము. అయినా బీదతనం ఉంది. కోటీశ్వరులెప్పుడు ఉంటారో బీదవాళ్ళూ అప్పుడే ఉంటారు. కోట్లకొలదీ బంగారుకాసులు చెట్లను పండవు. అయినా బంగారం భూమిలో దొరుకుతుంది; నదీగర్భాలలో దొరుకుతుంది.
బంగారంకోసం పాటుపడాలి. త్రివిష్టపంనుంచీ, హిమాలయాలనుంచీ, మేరు పర్వతంనుంచీ బంగారం వస్తుంది. బంగారం తళతళ లాడుతుంది, కాబట్టి సువర్ణం. శతకుంభ పర్వతంలో దొరుకుతుంది గనుక శాతకుంభం జంబూనదియందు దొరుకుతుంది గనుక జాంబూనదం. ఇంకా ఇది స్వర్ణగిరిలో దొరుకుతుంది. వేణ్ణానదిపుట్టే నంది పర్వతాలలో దొరుకుతుంది. స్వర్ణముఖీనదిలో దొరుకుతుంది. బంగారం ఎంతటివానినై నా మాయలో ముంచగలదు. బంగారానికి దాసులు కానివారెవరు? హరిశ్చంద్రుడు బంగారానికి అమ్ముడుపోయాడు. బ్రహ్మబొడ్డునందు బంగారము దాచుకొన్నాడు. అగ్ని తన కేశముల బంగారుతో రచించుకొన్నాడు. స్వర్ణనది తన కెరటాలలో బంగారు పద్మాలను అలంకరించుకొన్నది. భరతదేశంలో శాతవాహనుల కాలంలో ముష్టివాళ్ళు ఉండేవారు. ఆ దినాల్లో ముష్టివాళ్ళు ఉండడానికి ముఖ్యమైనవి మూడుకారణాలు. పనిచేయలేని స్థితిలో నా అనేవాళ్ళు లేకపోవడం వల్లా, బద్దకించి పనిచేయక మనుష్యుల ధర్మప్రకృతిపై ఆధారపడి ముష్టి ఎత్తడమే జీవనోపాధిగా చేసుకోవడంవల్లా, ఉంఛవృత్తిపై ఆధారపడి ముష్టి ఎత్తడమే ధర్మంగా స్వీకరించడంవల్లనూ. కాని బద్ధకంచేత ఉంఛవృత్తి నవలంబించినవాళ్ళు శాతవాహన సామ్రాజ్యంలో ధర్మశాస్త్రరీత్యా కఠిన శిక్షలకు పాలయ్యేవారు.
భిక్కులు, కాపాలికలు, భిక్కునిలు, జైనయోగులు, యోగినులు మొదలైనవారు దేశం అంతా తిరుగుతూ ఉంటారు. పంటలు బాగా పండుతూ ఉన్నాయి. కాబట్టి బిచ్చానికేమీ లోటులేదు. దుర్భిక్షము సంభవించి, కాటకము పిశాచనృత్యం చేస్తే, మూడేళ్ళనుండీ కాటకంకోసం నిలవ ఉంచిన ధాన్యపు గాదులలో నుండి ధాన్యాదులు దేశం అంతా ప్రవహిస్తాయి. ప్రతిగ్రామములో ప్రతినగరంలో ఈ కాటకధాన్యపుగాదులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది భారతీయ ధర్మం.
ఒక దినాన విజయపురంలో నలుగురు భిక్కులు “బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్ఛామి” అంటూ వెడుతున్నారు. ఈ భిక్షావృత్తి వారికా దినానికి సరిపోయేతిండి వచ్చేవరకే. పది ఇళ్ళు తిరిగేసరికి వారి జోలెలు నిండాయి. అంతటితో వారు భిచ్చ మెత్తడం మాని మహాసంఘారామానికి చేరారు. ఎక్కడి బౌద్ధభిక్షువులు వచ్చినా, వారే సంప్రదాయానికి చెందినా మహాసంఘారామం చేరుతారు. అక్కడ అన్ని సంప్రదాయాలవారికి వివిధ విహారగృహాలు ఉన్నాయి. ఈ నలుగురు భిక్షుకులు మహాచైత్యవాదులు. తాము భిక్షునడిగి తెచ్చుకొన్న అన్నము, కూరలు, పప్పు భోజనంచేసి, ఒక తల్లి ఇచ్చిన మజ్జిగత్రాగి, ఒక చోట కూరుచున్నారు.
మొదటిభిక్కు: మహారాజకుమారి భవనానికి బిక్షకు వెళ్ళినా ఆమె కనబడలేదు. ఏమిటి ఉపాయం ?
రెండవభిక్కు: మనం ఆ బాలికను చూచితీరాలి ఆరునూరయినా.
మూడవభిక్కు: నేను బొమ్మవేసి తీరాలి.
నాలుగవభిక్కు: లేకపోతే మన అపసర్పత గంగకలిసినట్లే!
మొదటి: మనం నివేదించినమీదట కదా మహారాజుగారి ఈ నగరం నాగార్జునదేవుని దర్శించడానికి వస్తామన్నారు.
మూడవ: ఈ బాలిక అందం అంత లోక ప్రఖ్యాతి పొందిందా?
నాల్గవ: ప్రఖ్యాతా! గాంధారరాజు ఈ బాలికను ఆశిస్తున్నాడంటే, మన మగధమహారాజు ఒక లెక్కా?
మొదటి: ఇంతకూ మనం ఆ రాజకుమారిని చూడడం ఏలాగు?
రెండవ: నిదానంగా, నెమ్మదిగా ఆలోచించాలికదా? -
ఆ నలుగురు ఆరితేరిన అపసర్పులు. ఏ వేషమైనా చక్కగా వేసుకోగలరు, వేషం తొందరలో మార్చగలరు. వేసుకొన్న వేషానికి తగిన కార్యకలాపంలో వారు ఉద్దండ పండితులు. వారికి జంబూద్వీపంలోని భాషలన్నీ వచ్చును. వారిలో వారు మాట్లాడుకొనే భాష ఇతరదేశాల అపసర్పులకు తెలియదు.
కొంతసేపు వారు ఏమేమో మాట్లాడుకొని, పాలీలో బౌద్ధధర్మ విచారణ ప్రారంభించారు. మొదటి భిక్కు తక్కినవారికి గురువై గంభీర కంఠంలో ఉపదేశం ప్రారంభించాడు. మువ్వురు శిష్యులూ, మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ ఉండడము, ఆచార్యులు దారపు చిక్కు విడదీసినట్లు వారి అనుమానాలు తీర్చడమూ, ఈలా విచారణ జరుగుతూ ఉంటే, అనేకమంది భిక్కులు, సాధారణులు నెమ్మది నెమ్మదిగా సమీపానికి చేరారు. ఆ బౌద్ధాచార్యుల ప్రతిభకు, ఆయన మహాత్మ్యానికి వారు ఆశ్చర్యం చెందుతున్నారు.
(10)
అడవి స్కందవివాఖాయనక బ్రహ్మదత్తప్రభువు పూంగీప్రోలుచేరి అమాత్యులచే ఆహ్వానితుడై కోటలో తన విడిది గృహం చేరినారు.
హారీతసి శాంతశ్రీ రాకుమారి బ్రహ్మదత్తప్రభువు ఎందుకు పూంగీప్రోలు వచ్చినారో వెంటనే గ్రహించుకొన్నది. తన బావగారు వీరపురుషదత్త యువరాజు తన్ను దివ్యప్రేమతో పూజిస్తున్నాడని ఆమెకు బాగా తెలియును. తాను వనదేవతావరణానంతరం కోపంతో ఇంటికివచ్చి, తల్లిదండ్రులను బయలుదేరతీసి పూంగీప్రోలు చేరినప్పటినుంచీ, ఆ యువరాజు అమిత హృదయవేదన అనుభవిస్తున్నాడని శాంతశ్రీ రాకుమారికి తెలుసును. తనకు బావగారు చేసిన అవమాన్నాన్ని ఆమె ఎప్పుడూ మరచిపోలేదు. -
వసంతకాలం వచ్చింది. మన్మథుడూ, రతీదేవీ లేకుండా వసంతోత్సవం జరిగిందనీ, ఉత్సవంలో వసంతుడు హేమంతుడైనాడని పూంగీయ శాంతశ్రీకి తెలిసింది.
తానెంత మూర్ఖురాలు! స్త్రీకి వుండే పౌరుషాలూ, అహంభావాలు, ఓర్వలేని తనమూ ఎవరు వర్ణించగలరు? స్త్రీ హృదయం స్త్రీకే తెలియదు. స్త్రీ మాయ అవడంచేత ప్రకృతి అవడంచేత ఆమెలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో ఎవరికి తెలుసును? ఆమె ప్రేమిస్తున్నాను అని చెప్పినా ప్రియుడు ఒక్కొక్కప్పుడు నమ్మలేడు. ఈ దినం తన సర్వస్వమూ ప్రియుని పాదాలకడ పూజా పుష్పాలు చేసిన యువతియే రేపు ఆ ప్రియుని సర్వస్వమూ తన పాదాలకడ పూజాకుసుమాలయినా ఆ పూవులను నిర్దాక్షిణ్యంగా కాలితో నలిపివేయ గలదు.
పతివ్రతా లక్షణాలు శాంతశ్రీకి పూర్తిగా తెలుసును. ఇక్ష్వాకు వంశాన్ని సీతాదేవి పవిత్రం చేసింది. భర్తమాట వేదవాక్కు. భర్తసేవ, భర్తపూజ, భర్తతో జీవనము, భర్తజీవితం ముగింపుతో తన జీవితమూ ముగింపు.
అవును. అవి మహాపతివ్రతా లక్షణాలు అయిఉండవచ్చును. అట్టి పరమోత్తమస్త్రీ మహాకావ్యనాయిక అవుతుంది. లోకంలో తక్కిన స్త్రీలు శాకినిలో, ఢాకినిలో! శ్రీరాముడూ, పరమ శ్రమణకుడూ వంటి మహాపురుషులు దివ్యులు. తక్కినవారు సామాన్యులే అయినా ఆ మహాపురుషులను వారివారికై ఉద్భవించిన స్త్రీలు ప్రేమించడం మానినారా? వారికి తమ సర్వస్వాలు అర్పించడం మానినారా? ఒకస్త్రీకి ఒకేపురుషుడు, ఒక పురుషునకు ఒకే స్త్రీ. ఈ అఖండ ధర్మము లోకంలో ఎక్కడో నెరవేరుతూ ఉంటుంది. రాజకీయంగానో సంతాన వాంఛార్ధమో పురుషుడు ఇరువురు మువ్వురూ స్త్రీలను వాంఛిస్తాడు. నీరస పురుషుల ప్రేమ ఇర్వురూ, మువ్వురూ స్త్రీల పైన ప్రసరిస్తుంది. ఆ పురుషుడు ఉత్తముడు అయితే కావచ్చును.
తన బావగారు తన్ను ప్రేమించాడు. ఇంత చిన్ననాటినుండీ తనబావ తన్ను ప్రేమించినాడు. తాము భార్యాభర్తలవలె మెలగేవారు. తనకు అయిదేడులు, యువరాజుకు ఎనిమిదేడులు. ఇరువురూ విజయపురంలో మహారాణి మాఠరి సారసికాదేవి హర్మ్యాలలో యువరాజు క్రీడామందిరంలో రాణీరాజు ఆట ఆడుకొన్నారు. ఆ ఆటలో దాదులూ పాలుగొన్నారు.
“దేవీ! మన రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉన్నారు” అని తన బావ అన్నారు.
తాను "ప్రభూ! మన ప్రజల క్షేమం మనమే విచారించాలిగదా!” అన్నది.
తన బావ “నువ్వు చాలా అందమైన దానవు దేవీ!” అన్నారు.
“నాధా! మీరు చాలా అందమైనవారు” అని తానన్నది.
తరువాత తనకు పదునాల్గవఏట నవయౌవనము పొడసూపే సమయంలో తన బావగారూ, తాను మహారాణి విహారోద్యానవనంలో కలుసుకొనడం తటస్థించింది. పదునేడేండ్ల యౌవనప్రారంభ దివ్యసౌందర్యస్నాతుడై తన బావవస్తున్నాడు. తన హృదయం ఎన్నిఘటికలో ఆగిపోయినట్లయింది. ప్రేమ ఎంత విచిత్రము, ఎంత బాధాపూర్ణము, ఎంత ఆనందోన్మాదకరము!
తన్ను చూడగానే తన బావ ఒక్క గంతున తన దగ్గరకు వాలినాడు. తనకెంత సిగ్గు వేసింది? ఆ సిగ్గూ స్త్రీల ఆనందంలో భాగం! తనకు ఈడురావడం మేనమామల మహానగరంలో జరిగింది. నెలదినాలు ఉత్సవాలు జరిగినవి. ఆనాటినుంచీ, తనకు ఎవరిని చూడాలన్నా సిగ్గే! తన పినతల్లి కొమరిత రాకుమారి బాపిశ్రీ “అక్కా” అని తన్ను ఒక్కక్షణమూ వదిలి ఉండేది కాదు. తానూ, బాపిశ్రీయూ ఏవో పిచ్చిమాటలు, మధుర రహ్యసాలూ మాట్లాడుకొనేవారు. ఆ రహస్యాలన్నీ తమబావను గురించే. తమ అందాలబావ వీరపురుషుడు. అందంలో ఆ రాకుమారునితో పోలగలిగిన యువకుడేడీ?
అలాంటి సిగ్గుతో నిండి ఉన్న తన్ను తనబావ, తనదైవము, పరుగున వచ్చి కలుసుకున్నప్పుడు మరీ సిగ్గుతో తాను కుంగిపోయింది. ఆ సిగ్గు బావగారికి ఏమి తెలుస్తుంది? వెంటనే అంతమంది దాదులలోనూ తన రెండు చేతులూ పట్టుకొన్నారు ఆయన కళ్ళల్లో ఏదో కాంతి! ఆయనచుట్టూ ఎంతో వెలుగు! -
“నువ్వు ఎంత అందమైనదానవు శాంత?” అన్నాడు బావ.
అంత తీయనిబాధ ప్రేమ! అంత మధురమత్తత ప్రేమ! ప్రేమనిధియై బావ ప్రజ్వరిలు సుందరాకారుడై బావ! ఆనాటి బావ! భట్టిదేవిని వనదేవతగా వరించాడు!
★ ★ ★