అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 11



ప్రకరణము ౧౧ - పాదుషా ప్రయత్నములు

అక్కన్న మాదన్నల యధికారమునకు గోలకొండలో నడ్డులేదు. తానాషాసుల్తాను వారికి స్వాధీనుఁడు, వారిచేతిలోని కీలుబొమ్మయని ప్రజలు వాకొనుచుండిరి. పైకట్లే తోఁచును. ఏలయన సకలవిషయములును ఈమంత్రులచేతులలో నుండెను. సుల్తాను వారినడుగక ఏదియు చేయఁడు. అంతమాత్రమేగాదు తనతో వా రేదిచెప్పినను ఒప్పుకొనును. వారి యందు అతనికి అట్టినమ్మకము కుదిరినది. మొదట వారు మూసా ముజఫరులను తొలఁగించి అతనికి సాయముచేసిననాటినుండి పెత్తనమంతయు వారిదే. తొలుత కృతజ్ఞతతో ప్రారంభమైన నమ్మకము స్నేహముగా మారినది. అక్కన్నమాదన్నలు మహమ్మదీయులు గాకపోయినను దైవభక్తిగలవారనియు రాజసేవాసక్తులనియు ద్రోహు లెంతమాత్రము కారనియు నాతఁ డెఱుఁగును.

ఔరంగజేబుపాదుషా ఎటులైనను గోలకొండరాజ్యమును ఆక్రమింపఁ దలంచియుండెను. తానాషాపై నేదైన నిందారోపణ చేసినగాని తోడిమహమ్మదీయులు తనచర్య నొప్పరని దోషములు కల్పింపసాగెను. తానాషా విషయాసక్తుఁడనియు నిరంతరము అంతఃపురములోనే కాలము గడపుచుండుననియు, తనత్రాగుడు నిరంతరాయముగ జరుగుటయే ఆతనికి ప్రధానమనియు ప్రచారము చేయసాగెను. గోలకొండలోని తనస్థానాధిపతికి వ్రాసిన యొకజాబులో నీవాక్యము లుండినవి. “వీఁడు (తానాషా) దురదృష్టవంతుఁడు. ఒక కాఫిరువాని (మాదన్న) చేతిలో రాజ్యమునువదలి గొప్పగొప్పసయ్యదులను, షేకులను, పండితులను వానికి లోఁబఱచియున్నాఁడు. ప్రత్యక్షముగా సకలపాపములను చేయుచున్నాఁడు... ఇస్లామునకును కాఫిర్లమతమునకు భేదము తెలియకయున్నాఁడు. ఆకాఫిరు శంభువు (శంఖాజీ) నకు లక్షహొన్నుల నిచ్చినాఁడు. నాస్తికులతోనే వీనికి స్నేహము. భగవంతుని నియమముల నుల్లంఘించి దేవమానవులకు దూరమై పోవుచున్నాఁడుగదా!”

కాని వాస్తవముచూడఁగా తానాషామహాత్ముఁడు. తండ్రి మరణానంతరము పదునాలుగేండ్లు ఒకమహాత్ముని పరిచర్య చేసి యుండెను. ఇప్పటికిని ఆయనను దర్శించుచుండును. సత్పాత్రమందు రాజ్యమునుంచి వేదాంతగోష్ఠియందు కాలము గడపు చుండెనుగదా. కాని రాజకార్యములలో అప్రమత్తుఁడై స్వయముగా నన్నిటిని గ్రహించుచు సమయము దొరకినపుడెల్ల ఉర్దూ పారసీభాషలలో కవిత్వముచేయుచు నుండెను.

ఇట్టిసందర్భమున దక్షిణరాజ్యములకు మొగలాయీల వలనిబాధ తప్పదని తలఁచి గోలకొండమాదన్నపంతులు మహారాష్ట్రులతోను బిజాపురీయులతోను సఖ్యమే చేయుచుండెను. ఎట్లును బిజాపురమునకు గోలకొండవారిసాయము తప్పదని ఢిల్లీ పాదుషా ‘ఎంతమాత్రమును బిజాపురమునకు సాయపడవలదు; పడితివా నీకును అంత్యకాలము సమీపించును.’ అని తానా షాకు రాయబార మంపెను. కాని 1684 లో సికందర్‌ఆడిల్‌షా గోలకొండవారిసహాయ మపేక్షించెను. సికందర్ పదునాఱేండ్ల బాలుఁడని తానాషా ఆతనిపై కనికరము వహించియుండెను. దక్షిణరాజ్యములన్నియు కలసియుండుట మంచిదని మాదన్న, పదివేలసైన్యమును సికందరుకు సాయముపంపుటకు ఒప్పుకొనెను; అట్లే శంభుజీని పంపవలసినదని కోరుచు జాబువ్రాసెను. మఱియొకజాబులో నలబదివేలనైన్యమును తాను పంపునట్లును తాము రెండువైపులను మొగలాయీలను కొట్టవలయుననియు వ్రాసియుండెను. ఈజాబు ఔరంగజేబుయొక్క వేగులవాండ్ర చేతపడినది. వెంటనే పాదుషా హైదరాబాదుమీఁదికి దండు పంపెను. కాని బిజాపురమువారికి గోలకొండవారి సాయము ఎట్లును అందిపోయినది.

పాదుషా ఉపాయాంతరములు వెదుకసాగెను. ప్రస్తుత పరిస్థితులలో గోలకొండను పీడించి ధనము పిదుకుకొనుటయే దానిని స్వాధీనము చేసికొనుటకన్న మేలని తలంచెను. హైదరాబాదులోని మొగలాయీ స్థానాధిపతి గోలకొండ సుల్తాను మీఁదను జనులమీఁదను అధికారము చలాయించుచు, వారిని తిరస్కరించుచుండినను వారు సాయుధులై తిరుగఁబడునంత వఱకు రానీయక వ్యవహరించుచుండెను. ఇందులకై ఔరంగజేబు కావలయుననియే మీర్జామహమ్మద్ అను నొకదయారహితుని, నిష్ఠురాలాపుని, అతికర్కశుని పంపియుండెను. అతనికి పాదుషా పెట్టినపని నిరంతరము కఠినముగా మాటలాడుచు ఏదోసాకుమీఁద గోలకొండసుల్తానునకు కోపము తెప్పించి, ఘర్షణకు లాగి, ఆమీఁద గోలకొండపై దండెత్తుట కొకనెపము కల్పించుటయే. తనరాయబారిని గోలకొండకుపంపుచు ఔరంగజేబు ఇట్లు చెప్పియుండెను. “నేను నిన్ను గోలకొండకుపంపుట అచటినుండి నీవు రెండు పనికిరాని రాతిముక్కలను తేవలయుననికాదు, (వాస్తవముగా తానాషాకడ రెండు గొప్పవజ్రము లుండినవి) అవి నాకులక్ష్యము లేదు. నీవు తానాషాను సంతోష పెట్టవలయుననియు గాదు. నిర్లక్ష్యముగా వానితో మాటలాడుచు ఘర్షణకు దిగుము. అందుచేత నాతఁడు కోపము తెచ్చుకొని నిన్ను తిరస్కరించినయెడల వాని నుచ్చాటన చేయుటకు నాకు అవకాశము దొరకును. సాధ్యమైనంతవఱకు వానితో జగడమువేయుము. సభలోగాని ఏకాంతమునగాని వానిని మర్యాదగా చూడకుము.”

తానాషా మహామేధావి. శత్రురాయబారియొక్క యభిప్రాయమును గ్రహించి అతఁ డేమిచేసినను ఆగ్రహింపక యుద్ధమునకుగాని మనస్తాపమునకుగాని ఎట్టియవకాశమును రానీయక మెలఁగుచుండెను. ఔరంగజేబు పంపిన గోలకొండలోని మొగలాయీ రాయబారి సర్వస్వతంత్రుఁడైన ప్రభువువలె వ్యవహరించుచు, నిరంకుశముగా ఆజ్ఞలు, నిర్గమనపత్రములు, శాసనములు వ్రాయుచుండుటయేగాక జనులను మిక్కిలి పీడించుచుండెను. ఒకనాఁడు అక్కన్న తమయింటిమేడమీఁద నిలువఁబడి వీథివైపు చూచుచుండఁగా దూరమున నొకపల్లకి ఎవరిదో వచ్చుచుండెను. అది పెద్దపల్లకి. దానినిమోయువారు దాదాఁపు పదునాఱుగు రుండిరి. వారి వెనుకను ముందును కొంత సిబ్బంది. వారు ‘ఓంభాయి’ అని అఱచుశబ్దము చాలదూరము వినవచ్చుచుండెను. అక్కన్న ఆవైపే చుఱచుఱ చూడసాగెను. ఆవీధిలో నెవరిసవారిగాని వైభవమున పోరాదు. మహామంత్రియు మహాసేనాధిపతియు నివసించు గృహముముందు వారితో సమానవైభవము ప్రకటించుటకు ఎవరికిని అధికారములేదు. మీఁదుమిక్కిలి ఎక్కువగాచూపుట ఇంకను ధిక్కారమగును. అక్కన్నకు ఈ పల్లకీవైభవమును చూడఁగానే ఎవఁడో తమ్ము ధిక్కరించునంతటివాఁడు వచ్చుచున్నాఁడని తోఁచినది. ఆతఁడు ఎవఁడుగానుండునాయని ఆలోచించునంతటినెమ్మది అక్కన్నకు లేదు. వెంటనే ఆబోయలను నిలుపుఁడని తనసేవకులకు ఆజ్ఞాపించెను. తటాలున మంత్రులసేవకులు ఆ బోయలను అడ్డగించిరి. మాటలును, తిట్లును, పోరాటము నైనవి. మంత్రులపటాలము అక్కన్నచూపులో పల్లకిని చించి చెండాడిరి.

ఇదంతయు మాదన్న ఎఱుఁగఁడు. లోన నేదో పనిలో నుండి తటాలున వెలుపలికి వచ్చిచూచెను. ఆతని కేదో తోఁచినది. ఆపల్లకీలోనివాఁ డెవఁడు! అత్తిమత్తరాయఁడు; ఢిల్లీ పాదుషాయొక్క ఆంతరంగికనివేదకుఁడు, ఆ కాలమున పాదుషా సకలవృత్తాంతమును రహస్యనివేదకుల మూలమున గ్రహించు చుండెసు. పాదుషాకు ఎవరియందును నమ్మకములేదు, తన కొమారులనే నమ్మఁడు. తనరాయబారిమీఁద ఈనివేదకుఁడు వేగు. రాయబారికి ఈతఁడన్న హడలు, ఏమివ్రాయునో తన్ను గుఱించియన్న భయము. పాదుషాకు వేగులపై వేగులుండిరి. అట్టివానికి కోపమువచ్చినయెడల అది ఎంత ప్రమాదకరమో ఊహింప శక్యమా! ఆతని శాంతింపఁజేయుటకు మాదన్న చాల ప్రయత్నించెను. ‘ఆ! ఆ! ఎంతపని! ఎంతపని! ఎవరురా ఈపని చేసినవారు’ అని బంట్లనుతఱిమి, అన్ననుచూచి ‘ఏమన్నయ్యా, ఈవిధముగా జరిగినది. వీరిని నీవు చూడలేదా?’ అని అనుచునే ఆయనను చాలమర్యాదగా లోనికి కొనివచ్చి చాలక్షమాపణ కోరుచు, మర్యాదచేయించెను. అక్కన్న తమ్మునిభావము గ్రహించి, ఇది సిబ్బందిదోషమనియు, తనకు తెలియకపోయిన దనియు చెప్పి తానును మన్ననకోరెను. అత్తిమత్తరాయఁడు ‘ఏమియు పరవాలేదు’ అనెనేగాని ఆతనిహృదయమున క్రోధానలము ప్రజ్జ్వలించుట మాదన్న చూడకపోలేదు. మెల్లగా మర్యాదలతో తమపల్లకీలో కూర్చుండఁబెట్టి సాగనంపెను.

ఈగందరగోళమైన నాటిరాత్రి మాదన్నకు చాలసేపు నిదురరాలేదు. ఉదయమున జరిగినదానినే చాలసేపు తలపోయుచు అక్కన్న తొందరపాటునకు చింతించుచు ఇందేదో అనిష్టమున్నదని భయపడుచుండెను. సగమురాత్రి గడచినతర్వాత ఆతనికి నిదురపట్టినది. స్వప్నమున మహాలక్ష్మి దర్శనమిచ్చినది. ‘మాదన్నా నేను మీయింట అడుగుపెట్టి పదునొకండుసంవత్సరములు. ఇక నొకసంవత్సరము పూర్తియగులోపలనే నేను మిమ్మువిడిచి పోవుచున్నాను.’ అని దేవిచెప్పినది. మాదన్న మేలుకొనెను. ఆనిముసమందే అక్కనయు అదేస్వప్నముఁగని మేల్కనెను. సోదరు లిరువురును కలియఁబలికికొనిరి. మాదన్న వెంటనే ఇట్లనెను. ‘అన్నా, తెలిసిపోయినది. మన భాగ్యదేవత మనలను వదలిపోవుదినములు వచ్చినవి. అందుచేతనే మన బుద్ధులు ఆవిధముగా మాఱినవి. కానీ, దైవగతి.’ తర్వాత వారిరువురును నిదురపోక ఉదయము తలిదండ్రులకు ఈవిషయమును తెలిపిరి. తండ్రి ‘భగవదాయత్తము’ అనెను. నాఁడు అందఱును కలసి గ్రహశాంతులుచేసి దానధర్మములు చేసిరి.

మాదన్న తనపదవికి అంతము సమీపించుచున్నదని నిశ్చయించుకొనెను. ఇఁకను మిగిలియుండు నీకాలమును సద్వినియోగము చేయనెంచెను. భావికాలమునకు జాగరూకత వహించుటగా, కోయిలకొండ, హసనాబాదు, రాజగోపాల పేట అనుమూఁడుఫర్గణాలను తనసోదరులు విశ్వనాథ మృత్యుంజయులకును తన తల్లిదండ్రులకును ఇప్పించెను. వెంటనే వారిని గోలకొండనుండి పదిలముగానుండు ప్రదేశములకు పంపెను. తనబంధువుల కనేకులకు భూదానములు చేసెను.

ఆదినము అక్కన్న తనపల్లకి నాశనముచేసినదిమొదలు అత్తిమత్తరావు (ఆదిత్యమూర్తిరావు) అక్కన్న మాదన్నల మీఁద గంటు వహించియుండెను. మాదన్న ఇదిగ్రహించి, ఆ దినము తాను అతనిని మర్యాదగా పంపినది చాలదని మరల నొకమారు ఆతనియింటి కేగెను. మరల క్షమాపణ ప్రార్థించెను. ఆదినము చాలపొరపాటు జరిగినదనియు, ఆపల్లకి ఎవరిదోయని అక్కన్న తలంచెననియు నానావిధముల చెప్పి ఆతని హృదయమును రంజింపఁజూచెను. తనకుతోఁచిన బహుమతుల నెన్నిటినో ఇచ్చెను. కాని వాని నాతఁడుగ్రహింపలేదు. తాను ఆవిషయమును అప్పుడే మఱచిపోయితి ననెను. ఆతఁడు నవ్వుచునేయుండెనుగాని అది తెచ్చికోలునవ్వు, వికారముగా నుండెను. ఆతనిహృదయమున క్రోధానలము ప్రజ్జ్వరిల్లుచుండెనేగాని ఆఱలేదు. “అక్కన్నగారు ఆవిధముగా ప్రవర్తించినందువలన వారికే మానభంగముగాని నాకేమికొదువ. వారిగౌరవము పోయినదిగాని నాకేమిపోయినది. దీనినిగుఱించి మీరేమియు అనుకొనవలదు.” అని ఈతీరుననే మాటలాడుచుండెను. మాదన్న ప్రయోజనములేదని తలంచి వెడలిపోయెను.