అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 10
ప్రకరణము ౧౦ ఆశాభంగము
శివాజి గోలకొండనుండి వెడలిపోయెను. వెంటనే ఈ విషయమంతయు మొగలాయీవారికి తెలిసిపోయెను. ఔరంగజేబు చాలమండిపడి బహదుర్‌షా అనువానిని అధికారమునుండి తొలఁగించి అతనిస్థానమున దిలిరుఖాననువానిని నియమించెను. దిలిర్‌ఖాను గోలకొండమీఁదికి దాడివెడలెను. మాన్యఖేటము కడ (మాల్‌ఖేడ్) గోలకొండవారి సైన్యము మొగలాయీ వారిని ఎదుర్కొని సులువుగా ధ్వంసము చేసినది. అదేసందర్భమున మొగలాయీలబలము తగ్గినదని గ్రహించి దత్తాజీ యను మహారాష్ట్రసేనాపతి, గృహరక్షణకై శివాజిచే నిలుపఁబడినవాఁడు, కనరాపైకి దాడి వెడలి హుబ్బళిపట్టణమును కొల్లగొట్టెను.
గోలకొండనుండి బయలుదేరిన ఛత్రపతి, ఆంగ్లేయులు ఇటీవల కర్ణాటకమని పేర్కొన్న మదరాసురాజ్యమును ప్రవేశించెను. ఈప్రదేశమున దాదాఁపు నూఱుకోటలు గలవు. అందు చెంచి (జింజి) వేలూరులు ప్రధానములు. శివాజీ 1677–78 సంవత్సరములనడుము జయించిన భాగము సంవత్సరమునకు ఇరువదిలక్షలహొన్నుల యాదాయముగలదిగా నుండెను. ఈ దేశమును ఆతఁడు మూలమట్టముగ దోఁచుకొనెను. ఇట్లు దాహశాంతి యైనంతట ఆప్రదేశములలో తనసిబ్బందిని కాపుంచి ఆతఁడు మైసూరు, కొప్ప, గదగు, ధార్వారు బెలగాములను జయించెను.
ఇప్పుడు శివాజీ గోలకొండవారికి కృతజ్ఞత తెలుపుచు ఒప్పందమును నెఱవేర్పవలసియుండెను. కాని ఆతఁడు ఆప్రకారము చేయలేదు. మాదన్నకును తానాషాకును ఆశాభంగ మాయెను. గొప్పవారికి ఎట్టివారికైనను ఒకలోటుండును; అది రాజనీతి కానిండు లోకనీతికానిండు. శివాజీ తనతోడిహిందువునకే మాటతప్పెను. తనప్రక్కనుండు దక్కనురాజ్యములలో నొకదానినే మోసముచేసెను. ఇంతవఱకు మాదన్న నిర్మించిన నీతి పునాదిలేని సౌధమువలె నేలఁగూలెను. తానాషా శివాజీ శీలమును చక్కగా నెఱింగెను. శివాజీకి దక్షిణదిగ్విజయమునకు వలసినద్రవ్యమును వస్తువులను తా నొసంగియుండియు గోలకొండలో తానును తనమంత్రులును వజీర్లును అట్లు మర్యాద చేసియుండియు దక్షిణదిగ్విజయమున శివాజి తనతండ్రికి పూర్వముచెందని రాజ్యములను తానాషాకు తానిచ్చుటకు ఒప్పుకొని యుండియు తుదకు ఇట్లు గోష్పాదమంత భూమియైన నీయక పూర్తిగా ఏమియునెఱుఁగని యట్లుండుట ఎల్లవారికిని ఆశ్చర్యకరముగానుండఁగా తానాషాకును అక్కన్న మాదన్నలకును ఆశ్చర్యమగుటలో నాశ్చర్యములేదు. తాను జయించిన కోటలలో నొకటిగాని, తానుగ్రహించిన ధనములో కొంత మరలగాని, తాను కొల్లగొట్టినదానిలో కొంతయైననుగాని ఇచ్చుట, ఏదియు శివాజి తలపెట్టలేదు. దోఁచిన ధనమంతయు తానే గ్రహించెను; ఆక్రమించిన భూమినంతయు తనయధీనమందే యుంచుకొనెను. అధికారమంతయు తానే చెల్లించుకొనుచుండెను. జగడమాడు భార్యలు, చెప్పినమాట విననికుమారుఁడు, నిర్వహింపవలసిన కార్యభారము అపారముగానుండుట - వీనిచే శివాజీమాట నిలుపుకొన లేకపోయెననుట ఇందులకు చాలిన సమాధానముగా కనఁబడదు.
గోరుచుట్టుపై రోఁకటిపోటుగా శివాజీ మఱియొక ఎత్తు ఎత్తెను; లంచములిచ్చి బిజాపురమును స్వాధీనము చేసికొన యత్నములు చేయసాగెను. ఇప్పుడు బిజాపురములో సిద్ది మసూద్ అనునతఁడు క్రొత్తమంత్రి. ఇతఁడు శివాజీప్రయత్నములను ప్రతిఘటించెను. తానాషాకు శివాజీ క్రొత్తయెత్తులు దుస్సహములుగ నుండెను. మాదన్న బిజాపురమునకు సాయము చేయఁదలంచి సిద్దిమసూదునకును అతని బిజాపురశత్రువులకును సంధిగావింప నారంభించెను. అంతఃకలహములు అడఁగిన యెడల శివాజీయిచ్చెడు లంచము లేమిచేయఁగలవు? బిజాపూరు వారు సైన్యమునకు జీతము లీయలేకుండినందున వారు తిరుగఁ బడునట్టుండిరి. మాదన్న ఆలోచించెను. ఆజీతములను గోలకొండనుండి తానాషాచేత నిప్పించి సైన్యమును సిద్దిమసూదునకు అనుకూలముగచేసి సైనికుల తిరుగుబాటు తప్పించుటకును శివాజీని కొంకణమునుండి వెలికి రానీయకుండుటకు శివాజీ మీఁదికి బిజాపురమువారు దండెత్తుటకును కావలసినంత ధనసహాయము చేయుటకు వాగ్దానము చేసెను. ఈ యుపాయము మీఁద ఆడిల్‌షాహిసర్దారులు ఇరువదియైదువేల గుఱ్ఱపుదళముతో లెక్కలేని కాల్బలముతోను శివాజీమీఁదికి తయారగు చుండిరి.
కాని ఇంతలో పరిస్థితులు మాఱినవి. మొగలాయీ సేనాధిపతి యెత్తులవలన మాదన్న ప్రయత్నము నెఱవేఱలేదు. దిలిరుఖాను మొగలాయి సేనాధిపతి. ఇతఁడు బిజాపురమును ఓడించి 1677 నవంబరులో సిద్దిమసూదునకు చాల యవమూనకరమగువిధమున సంధిచేసికొనెను. తనయూరిలో అంతఃకలహములు, ఆఫ్ఘనుసిఫాయీలు ప్రతిదినమును జీతము లడుగుచు తిరుగుబాట్లు జేయుచుండుట, ఒకవైపు రాజ్యములో శివాజీ కొల్లగొట్టుచుండుట-వీనిచేత ఎల్లవారును తన్ను దూషించు చుండఁగా సిద్దిమసూదు చాల చీకాకుపడియుండెను. ఖజానా ఖాళీగానుండెను. ఇట్టిసందర్భములలో శివాజీతో సంధిచేసికొనుట మేలని ఆతఁడు తలంచెనుగాని దిలిరుఖాను అట్టిచర్య అనవసరమనియు మహారాష్ట్రులను శిక్షించుటకు మొగలాయీ సైన్యము సిద్ధముగా నున్నదనియు ధైర్య మొసంగెను. కాని దేశముండిన సంక్షోభములో సిద్దిమసూదు దిలిరుఖానునకు తెలియనీయక శివాజీకి జాబువ్రాసెను. “మనము ఇరుగుపొరుగువారము, మొగలాయీలు మన కుభయులకును శత్రువులు. మనమిరువురునుకలసి వారిని తఱుమవలెను” - అని.
ఈవిషయము తెలియఁగానే దిలిరుఖాను చాల కోపపడెను. బిజాపురముమీఁదికి దండెత్తెను. ఈకాలమున నొక విశేషము జరిగినది. శివాజీకొమారుఁడు శంభూజీ తండ్రికి లోఁబడక వ్యర్థుఁడుగా నుండెను. నీతిరహితుఁడై తిరుగుచుండెను. శివాజీ అతనిని పన్హాలాకోటలో ఖైదుచేయఁగా తప్పించుకొనివచ్చి మొగలాయీవారితో చేరెను. దిలిరుఖాను పరమానందభరితుఁడై శంభుజీని సప్తహజారి మన్సబ్దార్ గావించి, ఏనుఁగుతో బహుమానించి ఔరంగజేబుచే సత్కరింపించెను. ఇప్పుడు బిజాపురమును ముట్టడించుటకు దిలిరుఖాను చేయు ప్రయత్నములు తీవ్రము లయ్యెను. తత్క్షణమే సిద్దిమసూదు శివాజీని సహాయము కోరెను. శివాజి వెంటనే ఆఱు ఏడువేల గుఱ్ఱపుదండును బిజాపుర రక్షణకు పంపెను. కాని మసూదునకు మహారాష్ట్రులయందు నమ్మకము తగ్గసాగెను. మహారాష్ట్రులు కొంతవఱకు స్నేహముగానేయుండి తమద్రోహబుద్ధిని చూపఁగానే మసూదు వారిని దూరమందుంచెను. వెంటనే శివాజియాజ్ఞచే వారు దోఁచుటకు ప్రారంభించిరిగాని తుపాకిదెబ్బకు వారినాయకుఁ డొకఁడు చచ్చుటచే వారు వెంటనే పాఱిపోయిరి. బిజాపూరువారు మొగలాయీలతో సంధి చేసికొనిరి.
మొగలాయీలు ఊరుకొనలేదు. మరల 1679 లో వారు బిజాపూరుమీఁదికి దండెత్తిరి. సిద్దిమసూదు మరల శివాజీనే ప్రార్థించెను. శివాజీ సహాయము పంపెను. మొగలాయీలు పట్టువదలక ఆక్రమించుచు బిజాపురమును మెల్లమెల్లగా సమీపించుచుండిరి. కాని శివాజీసాయముచేతను బిజాపూరువారి మొండిపట్టుచేతను మొగలాయీలకు విజయము కలుగలేదు. తర్వాత శివాజీ ఎక్కువ కాలము బ్రదుకలేదు. సయ్యద్‌జాౝ మహమ్మద్ అను సన్న్యాసియొక్క శాపముచేతనో లేక ఆయుర్దాయము లేనందువలననో శివాజీ 1680 ఏప్రిలు 5, ఆదివారమునాఁడు మరణించెను. తర్వాత శంభుజీ రాజారాములకు రాజ్యముకై స్పర్ధకలిగి తుదకు శంభువు 1680 సం॥ జూలైనెల రాజాయెను గాని 16 జనవరి 1681లోనే ఆతనికి పట్టాభిషేకము జరిగినది. ఈ కాలమునకు సరిగా మొగలాయీలకు రాజపుత్రు లతో పోరాట మేర్పడినది. బలవంతులైన మొగలాయీసేనాపతు లెవరును దక్కనులో లేరు. ఈలోపల పాదుషా కుమారుఁడు అక్బరనువాఁడు తిరుగఁబడి శంభుజీ అండఁజొచ్చెను. మహారాష్ట్రులను శిక్షించుటకు ఔరంగజేబు చేసినప్రయత్నములు ఏవియు కొనసాగవయ్యెను.
తనకొమారుఁడు అక్బరు శంభుజీకడ నున్నాఁడని తెలియఁగానే ఔరంగజేబు రాజపుత్త్రులతో సంధి కుదుర్చుకొని 1681లో దక్షిణమునకు వచ్చెను. అప్పటికి శంభువొకఁడే ఆతనికి శత్రువు. బిజాపురముమీఁదికిగాని గోలకొండమీఁదికిగాని దాడివెడలునుద్దేశ మాతని కింకను లేదు. శంభుజీమీఁదియుద్ధమున తనకు సాయపడవలసినదని బిజాపురి సర్దారులను పాదుషా కోరెనుగాని వారెవరును రాలేదు. శంభుజీతో ఆడిల్‌షా స్నేహముగానేయుండెను. శంభువునకు బిజాపురమువారి సాయము రాకుండుటకై పాదుషా తనసైన్యమును విభజించి ఇరువుర మీఁదికిని 1682లో పంపెనుగాని ఫలింపలేదు. 1683 లో పాదుషా అహమద్ నగరమునకు వచ్చెను. ఆసంవత్సరమే మహామంత్రి, సిద్దిమసూదు తమరాజ్యములోని అంతఃకలహములకు విసిగి తనయుద్యోగమును వదలుకొని ఆదవానిలో తనకోటలో ప్రవేశించెను.