అంటువ్యాధులు/ఎనిమిదవ ప్రకరణము
ఎనిమిదవ ప్రకరణము
2. రక్షణశక్తి (Immunity)
ఒకానొక అంటువ్యాధి రాదగిన అవకాశములన్నియు నున్నను, ఆ వ్యాధిని మనకంటకుండ జేయుశక్తికి రక్షణశక్తి యని పేరు. ఇట్టి రక్షణశక్తి మనకు గలదను విషయము చిరకాలమునుండి ప్రజలకు కొంతవరకు తెలిసియున్నదని చెప్పవచ్చును. ఒక్కసారి మశూచకము వచ్చినవానికి తిరిగి మశూచకమురాదని మనవారల కందరకు తెలియదా? ఇట్లొకసారి మశూచకము వచ్చినవానికి తిరిగి మశూచకము రాకుండుటకే వానికి రక్షణశక్తికలదని చెప్పుదుము. ఇట్టి రక్షణశక్తి మశూచకమునకేగాక యింకనుకొన్ని ఇతరవ్యాధులకును గలదు. ఒకసారి వ్యాధి వచ్చిపోవుటచేతనేగాక ఇతర కారణములచేత కూడ మన రక్షణశక్తి కలుగవచ్చును.
మన చుట్టుప్రక్కలను, మన శరీరముమీదను, మన పేగులలోను, నోటియందును, ముక్కులందును, ఊపిరి పీల్చు గాలియందును సూక్ష్మజీవులు కోట్లు కోట్లుగా నున్నవని చెప్పియున్నాము. మన శరీరములో ప్రాణమున్నంతకాలము మన కేమియు అపకారముచేయలేని సూక్ష్మజీవులు ప్రాణము పోయినవెంటనే శరీరమును నాశనము చేయుటకు ప్రారంభించి
కొద్ది దినములలో తాము నివసించు గృహమును నామము నకైన లేకుండ క్రుళ్లపెట్టును. ప్రాణమున్నప్పుడీ దేహమునకు సూక్ష్మజీవు లపకారము చేయకుండ మనలను రక్షించుశక్తి యొకటుండవలెను. అది సహజముగ ప్రతి జంతువుయొక్క శరీరమునకును కలదు. అట్టి రక్షణశక్తికి సహజరక్షణశక్తియని పేరు. పైన చెప్పిన ప్రకారము ఒక వ్యాధివచ్చి కుదిరిపోవుటచే గాని, టీకాలు మొదలగు నితరప్రయత్నములచే మనము కల్పించుకొనునట్టిగాని రక్షణశక్తికి కల్పిత రక్షణశక్తియనిపేరు.
సహజరక్షణ శక్తియందును, కల్పితరక్షణ శక్తియందునుకూడ అనేక భేదములు కలవు.
సహజరక్షణశక్తి పైన ఒకచోవివరించిన ప్రకారము (౧) మన నెత్తురునందుండు తెల్లకణములు సూక్ష్మజీవులను మ్రింగివేయుటచేతగాని, (౨) ఆ తెల్లకణములనుండి ఉద్భవించువిరుగుడు పదార్థములు సూక్ష్మజీవులను చంపివేసి వాని విషములను విరిచివేయుటచేగాని కలుగవచ్చును.
ఇవిగాక మనకుసూక్ష్మజీవు లంటుటలోకూడ రెండు భేదములుకలవని చెప్పియుంటిమి. ౧. కొన్ని సూక్ష్మజీవులు శరీరములో ప్రవేశించినతోడనే కోట్లుకోట్లుగా పెరిగి దొమ్మ మొదలగు వ్యాధులలోవలె రక్తముగుండ సకలాసయవములకు వ్యాపింపవచ్చును. ౨. మరికొన్ని సూక్ష్మజీవులు ధనుర్వాయువునందువలె ప్రవేశించినచోటనే పెరుగుచు తమ విషములను మాత్రము శరీరమంతట వ్యాపింపజేయుచు ఆ విషములచే మన కపకారము చేయును.
ఇందు మొదటిరకము అంటువ్యాధులలో సూక్ష్మజీవులే మన కపకారము చేయును. రెండవరకము అంటువ్యాధులలో సూక్ష్మజీవులనుండి పుట్టిన విషములు మన కపకారముచేయును. దొమ్మ (Anthrax) క్షయ (Tubercle), కుష్ఠము (Leprosy), మొదలగునవి మొదటిరకములోని అంటువ్యాధులు. ధనుర్వాయువు (Titanus), కలరా (cholera), డిప్తిరియా (Diphtheria) అనునొక క్రూరమైన గొంతువ్యాధి, ఇవి రెండవరకము అంటువ్యాధులు. ఈ రెండురకములుగాక కొంతవరకు సూక్ష్మజీవుల మూలమునను కొంతవరకు వాని విషముల మూలమునను మన కపకారముచేయు అంటువ్యాధులు కొన్నిగలవు. టైఫాయిడు జ్వరము, ప్లేగు,(మహామారి); ఇౝప్లూయంజా జ్వరము, రణజ్వరము (Septic Fever) ఇవి యీ మూడవజాతి అంటువ్యాధులు.
ఇందు మొదటిరకము వ్యాధులలో రక్షణశక్తి కలిగింపవలెననిన, సూక్ష్మజీవులను జంపుటకు ప్రయత్నింపవలెను. అట్లు చంపుపదార్థములకు సూక్ష్మజీవనాశకములని పేరు. ఈ సూక్ష్మజీవనాశకములగు పదార్థములను మన మేలాగుననైన రోగి శరీరములో పుట్టించినయెడల ఆ పదార్థములు సూక్ష్మజీవులను చంపును. మశూచకము మొదలగు వ్యాధులు రాకుండ టీకాలువేయుట ఈ పదార్థములను మన శరీరములో బుట్టించుటకే. ఇట్టి టీకాలలో అనేక విధములుగలవు. వానిని క్రింద వివరించెదము.
రెండవరకము వ్యాధులలో అనగా సూక్ష్మజీవుల విషయములచే మన కపకారము కలుగు వ్యాధులలో రక్షణశక్తి గలిగింపవలెననిన నీ విషములను విరిచివేయు పదార్థములను కనిపెట్టవలెను. ఇట్టి పదార్థములకు సూక్ష్మజీవ విషనాశకములనిపేరు. ధనుర్వాయువను వ్యాధి మిక్కిలి భయంకరమైనది. వ్యాధి అంకురించిన కొద్దికాలములోనే దవడలు దగ్గరగా నొక్కుకొనిపోయి, నడుము విలువంపుగా ముందుకు వంగి కొయ్యబారి రోగి యతిఘోరమగు బాధనొంది మృతిచెందును. [1] అట్టి స్థితిలోకూడ ధనుర్వాయు సూక్ష్మజీవ విషనాశకములగు పదార్థమును రోగియొక్క శరీరములోనికి సన్నని బోలు సూదితో నెక్కించినయెడల నిమిషములమీద రోగికి స్వస్థత కలుగును.
ఈ పదార్థము గుర్రము నెత్తురునుండి ఈ క్రింది ప్రకారము చేయబడినది. ఒక గుర్రముయొక్క శరీరములోనికి ఆ
గుర్రమును చంపుటకు శక్తిగల మోతాదులో ౨౦-వ వంతు మోతాదుల కొలతగా ధనుర్వాయు సూక్ష్మజీవులను ఎక్కింతురు. ఈ గుర్రమునకప్పుడు కొంచెము జ్వరము వచ్చి యది బాధపడినను మోతాదుచాలదు గనుక చావదు. ఈ గుణములన్నియు నయమైన తరువాత కొన్ని దినములకు తిరిగి మొదటి మోతాదుకంటె కొంచెము ఎక్కువ ధనుర్వాయు సూక్ష్మజీవులను ఆగుర్రముయొక్క రక్తములోనికి ఎక్కింతురు. దీనినికూడ గుర్రము జయించును. ఇట్లు అనేకసార్లు చేసిన పిమ్మట ఎంత హెచ్చు మోతాదు ధనుర్వాయువు సూక్ష్మజీవులను ఆ గుర్రమునెత్తురులోని కెక్కించినను అదిలెక్కచేయదు. ఈ ప్రకారము చేయుటవలన ఆగుర్రముయొక్కరక్తమునకు ఒకవిధమైన రక్షణశక్తికలిగినది. దానిరక్తమునందు ధనుర్వాయువుకలిగించు సూక్ష్మజీవుల విషమెంత వేసినను విరిగి పోవును. ఇట్లు చేయు శక్తి దానినెత్తురునందలి ద్రవపదార్థములో అనగా రసములో నున్నదిగాని కణములలో లేదు. ఈరసమును ఆ గుర్రమునుండి వేరుపరచి ఎంత పరిమాణముగల రసము ఎంతవిషమును విరిచి వేయగలదో శోధనలుచేసి నిర్ధారణ చేయుదురు. ఇట్లు శోధించి ఒక తులము రసము ఇన్ని లక్షల సూక్ష్మజీవుల విషమును విరిచివేయునని ఏర్పరతురు. వ్యాధియొక్క ఉద్రేకమునుబట్టి వైద్యుడు ఈ రసమును తగిన మోతాదులతో ఉపయోగించు కొనవలెను. పైనచెప్పిన కుప్పములోని రోగికి
మోతాదు కొక్కతులముచొప్పున మూడుమోతాదుల రసమును ఉపయోగము చేయువరకు ప్రాణము పోవుచున్నదో అని అనుమానముగల ఆమె పూర్వపు ఆరోగ్యమును విచిత్రముగ సంపాదించుకొనెను. ఈ గుర్రపురసమునందు ధునుర్వాయు విషనాశకమగు పదార్థ మెద్దియో కలదనుట స్పష్టము. ఈ విషయమై ఇంకను క్రింది తెలిసికొనగలరు. ఈ టీకా రసవైద్యము (Serum Theraphy) దినదినాభి వృద్ధియగుచున్నది. ఇట్లె వివిధ జాతుల సూక్ష్మ జీవుల విషములను విరిచి వేయుటకు వేరువేరు విధములగు టీకారసములు తగినవి ఇప్పుడు విక్రయమునకు దొరకును.
రక్షణశక్తి సహజరక్షణశక్తి, కల్పిత రక్షణశక్తి యని రెండువిధములనియు, అంటువ్యాధులలో సూక్ష్మజీవులచే కలుగునవి, వాని విషములచే కలుగునవి, యని రెండువిధములనియు ఈ వ్యాధులనుండి రక్షణశక్తి కలిగింప వలెననిన మొదటి రకము వ్యాధులకు సూక్ష్మజీవనాశకమగు పదార్థములను, రెండవరకము వ్యాధులకు సూక్ష్మజీవ విషనాశకములగు పదార్థములను మనము ఉపయోగపరచవలెననియు వ్రాసియుంటిమి. ఇప్పుడు వీని యందొక్కొక విషయమునుగూర్చి వివరించెదము.
- ↑ ఈ మధ్య కొన్నిదినముల క్రిందట బెంగళూరువద్దనున్న కుప్పం అను గ్రామములో నొక ఆమెకు కాలిపై ద్వారబంధముమీదనుండి మట్టిగడ్డపడి, కాలిలో గాయమై ఆ గాయముగుండ కొంతమట్టి లోపలకుపోయి, పైని మూసికొనిపోయెను. ఈ మట్టితో గూడ ధనుర్వాయు సూక్ష్మజీవులు గాయములో ప్రవేశించెను. రెండుదినములు గడచిన పిమ్మట యొక నాటి సాయంకాలము ఆమెకు దవడలు దగ్గరపడిపోయి, శరీరము కొయ్యవలెనయి నిశ్చేష్ఠురాలయ్యెను. వెంటనే వారు నాకు తంతిపంపగా ఇక్కడనుండి నేనుధనుర్వాయు సూక్ష్మజీవివిష నాశకమగుద్రవమును(Titanus Antitoxic Serum) తీసికొని వెళ్లి బోలుసూదిగుండ దండలోని చర్మముక్రింద నెక్కింపగా వెంటనే నెమ్మతించెను.