6. షష్ట్యంతములు
ఉ. హారికి నందగోకుల విహారికిఁ జక్రసమీర దైత్య సం
హారికి భక్త దు:ఖ పరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీ పయో ఘృతా
హారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్. (1-27)
ఉ. శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్త ని
ర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపగోపికా
పాలికి వర్ణధర్మపరిపాలికి నర్జున భూజయుగ్మ సం
చాలికి మాలికిన్ విపుల చక్రనిరుద్ధ మరీచిమాలికిన్. (1-28)
ఉ. క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరి నర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్రనందన నియంతకు సర్వచరాచరావళీ
మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకున్. (1-29)
ఉ. న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ మన:
స్థాయికి భూతసమ్మద విధాయికి సాధు జనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్ర పరిధాయికిఁ బద్మభవాండ భాండ ని
ర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయికిన్. (1-30)
వ. సమర్పితంబుగా నే నాంధ్రభాషను రచియింపఁబూనిన శ్రీమహాభాగవతంబునకుం బ్రారంభం బెట్టిదనిన, (1-31)