6. బ్రహ్మ తపంబునకు మెచ్చి శ్రీమన్నారాయణుఁడు వరంబిచ్చుట మఱియు స్కంధాంతము
సీ. హరి పాదభక్తి రహస్యోపదేష్టయు నఖిల దేవతలకు నదివిభుండు
నైన విధాత గల్పాదియుందును నిజాశ్రయ పద్మమున కధిష్టాన మర య
నర్థించి జలముల నన్వేషణము సేసి నళినంబు మొదలు గానంగలేక
విసివి క్రమ్మఱను ద ద్బిసరుహాసీనుఁడై సృష్టి నిర్మాణేచ్ఛఁ జిత్తమందుఁ
తే. జాల నూహించి తత్పరిజ్ఞాన మహిమ, సరణి మనమునఁ దోఁపక జడను పడుచు
లోకజాలంబు పుట్టింపలేక మోహి, తాత్ముఁడై చింతనొందు న య్యవసరమున. (225)
వ. జలమధ్యంబుననుండి యక్షర సమామ్నా యంబున స్పర్శంబులందు షోడశాక్షరంబు మఱియు నేక వింశాక్షరంబు నైన నీ యక్షర ద్వయంబు వలన నగుచు, మహాముని జన ధనంబైన తప యను
శబ్దంబు రెండు మాఱు లుచ్చరింపంబడి వినంబడిన,నట్టి శబ్దంబు వలికిన పురుషుని వీక్షింపం గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలి నిజస్ఠానం బైన పద్మంబునం దాసీనుండై
యొక్కించుక చింతించి యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలఁచి, ప్రాణాయామ పరాయణుండై, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్ర చిత్తుండె, సకలలోక
సంతాప హేతువైన తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడచూపిన, నా కమలసంభవుండు దత్క్షణంబు రాజస, తామస మిశ్ర సత్త్వగుణాతీతంబును, శుద్ధ
సత్త్వగుణావాసంబును, అకాల విక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహ భయవిరహితంబును, అపునరావృత్తి మార్గంబును, అనంత తేజో విరాజితంబును నైన
వైకుంఠపురంబుఁ బొడగని యందు. (226)
సీ. సూర్య చంద్రానల స్ఫురణలఁ జొరనీక నిజ దీధితి స్ఫూర్తి నివ్వటిల్ల
దివ్య మణిప్రభా దీపిత సౌధ విమాన గూపుర హర్మ్య మండపములు
ప్రసవ గుచ్ఛ స్వచ్ఛ భరిత కామిత ఫలసంతాన పాదప సముదయములు
కాంచన దండ సంగత మారు తోద్ధూత తరళ విచిత్ర కేతన చయములు
తే. వికచ కైరవ దర దరవింద గత మ, రందరస పాన మోది తేందిందిర ప్రభూత
మంజుల ని సద ప్రబుద్ధ రాజ, హంస శోభిత వర కమలాకరములు. (227)
సీ. వలనొప్పఁగా "నదైవం కేశవా త్పరం" బని పల్కు రాజ కీరావళియును
మహిమ "సర్వం విష్ణుమయము జగత్త"ని చదివెడు శారికా సముదయంబు
నేపారఁగా "జితం తే పుండరీకాక్ష!" యని లీలఁ బాడు పికావళియును
లలి మీఱఁగా "మంగళం మధుసూదన" యని పల్కు కేకు లనారతంబు
తే. తవిలి శ్రౌషడ్వష ట్స్వధేత్యాది శబ్ద, కలితముగ మ్రోయు మధుప నికాయములను
గలిగి యఖిలైక దివ్యమంగళ విలాస, మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు. (228)
వ. మఱియుం బయోధరావళీ విభాసిత నభంబుం బోలె వెలుంగుచున్న య ద్దివ్య ధామంబునందు. (229)
సీ. సలలి తేందీవర శ్యామాయమాణోజ్జ్వలాంగులు నవ్య పీతాంబరులును
ధవ ళారవింద సుందర పత్రనేత్రులు సుకుమార తనులు భాసుర వినూత్న
రత్న విభూషణ గైవేయ కంకణహార కేయూర మంజీర ధరులు
నిత్య యౌవనులు వినిర్మల చరితులు రోచిష్ణులును హరిరూప ధరులు
తే. నగు సునందుండు నందుండు నర్హణుండు, ప్రబలుఁడును మొదలగు నిజపార్శ్వచరులు
మఱియు వైడూర్యవిద్రుమామలమృణాళ తుల్యగాత్రులుఁదను భక్తితోభజింప. (230)
సీ. క్షాళి తాఖిల కల్మషవ్ర జామరనదీజనక కోమల పదాబ్జములవాని
నఖిల సంప త్కారుణాపాంగ లక్ష్మీ విలాసిత వక్షస్ధ్సలంబు వానిఁ
బద్మమిత్రామిత్ర భాసిత కరుణా తరంగిత చారు నేత్రములవాని
భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభి పంకజము వాని
తే. నహిహితాహిత శయన వాహములవాని, సేవి తామర తాపస శ్రేణివాని
నఖిల లోకంబులకు గురుండైన వానిఁ గాంచెఁ బరమేష్ఠి కన్నుల కఱవు దీఱ. (231)
క. కమనీయ రూప రేఖా, రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య
క్కమలాలయ దన మృదు కర, కమలంబుల విభుని పాదకమలము లొత్తన్. (232)
వ. వెండియు. (233)
శా. శ్రీ కాంతాతిలకంబు రత్న రుచి రాజి ప్రేంఖిత స్వర్ణ డో
లాకేళిన్ విలసిల్లిత త్కచ భరాలం కార స్రగ్గంధ లో
భాకీర్ణ ప్రచర న్మధువ్రత మనో జ్ఞాలోల నాదంబు ల
స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. (234)
వ. అట్టి నిత్యవిభూతియందు. (235)
మ. సతత జ్ఞాన రమా యశో బల మహైశ్వర్యాది యుక్తుం జగ
త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళ త్పంకేరుహాక్షుం శ్రియః
పతి నాద్యంత వికార దూరుఁ గరుణా పాథోనిధిన్ సాత్త్వతాం
పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్. (236)
మ. దరహా సామృత పూరితాస్యు నిజభక్త త్రాణ పారాయణు
న్న రుణాంభోరుహ పత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం
దరు మంజీర కిరీట కుండల ముఖోద్య ద్భూషు యోగీశ్వరే
శ్వరు లక్ష్మీయుత వక్షుఁ జిన్మయు దయాసాంద్రున్ చతుర్బాహునిన్. (237)
వ. మఱియు (ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండు సునంద నంద కుముదాది సేవితుండు) ప్రకృతి పురుష మహా దహంకారంబులను చతుశ్శక్తులును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశ శక్తులును, పంచన్మాత్రలును, పరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయండును, (స్వ స్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండు నైన) పరమపురుషుం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానంద కందళిత హృదయారవిందుండు, రోమాంచ కంచుకిత శరీరుండు, నానంద బాష్పధారాసిక్త కపోలుండు నగుచు. (238)
క. వర పరమహంస గమ్య, స్ఫురణం దనరారు పరమ పురుషుని పద పం
కరుహములకు నజుఁడు చతు, శ్శిరముల సోఁకంగ నతులు సేసిన హరియున్. (239)
చ. ప్రియుడగు బొడ్డుతమ్మి తొలి బిడ్డని, వేలుపు పెద్ద, భూత సం
చయములఁ బుట్టఁజేయు నిజ శాసనపాత్రు, నుపస్థితున్, మదిన్
దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమద స్మిత చారు ముఖారవిందుఁడై
నయమునఁ బాణింపక జమునన్ హరి యాతని దేహ మంటుచున్. (240)
ఆ. కపట మునుల కెంత కాలంబునకు నైన, సంతసింప నేను జలగర్భ!
చిర తప స్సమాధిఁ జెంది విసర్గేచ్చ మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని. (241)
తే. భద్ర మగుఁ గాక నీకు నో పద్మగర్భ! వరము నిపుడిత్తు నెఱిఁగింపు వాంఛితంబు
దేవదేవుఁడ నగు నస్మదీయ పాద, దర్శనం బవధి విపత్తి దశల కనషు! (242)
చ. సరసిజగర్భ ! నీయెడఁ బ్రసన్నత నొంది మదీయ లోక మే
నిరవుగఁ జూపు టెల్లను సహేతుక భూరి దయాకటాక్ష వి
స్ఫురణను గాని నీదగు తపో విభవంబునఁ గాదు నీ తప
శ్చరణము నాదు వాక్యముల సంగతిఁ గాదె ! పయోరుహాసనా ! (243)
క. తప మనఁగ నాదుహృదయము, దప మను తరువునకు ఫల వితానము నే నా
తపముననే జననస్థి, త్యుపసంహారణము లొనర్చుచుండుదుఁ దనయా ! (244)
క. కావున మ ద్భక్తికిఁ దప, మే విధమున మూలధనమొ యిది నీ మది రా
జీవభవ ! యెఱిఁగి తప మిటు, కావించుట విగత మోహకర్ముఁడ వింకన్. (245)
క. అని యానతిచ్చి కమలజ, యెనయఁగ భవదీయ మాన సేప్సిత మే మై
నను నిత్తు వేఁడు మనినను, వనరుహసంభవుఁడు వికచవదనుం డగుచున్. (246)
చ. హరి వచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁడో
పరమ పదేశ ! యోగిజన భావన ! యీ నిఖి లోర్వియందు నీ
వరయనియట్టి యర్థ మొక టైనను గల్గునె ? యైన నా మదిన్
బెరసిన కోర్కె దేవ ! వినుపింతు దయామతి చిత్తగింపవే. (247)
వ. దేవా! సర్వ భూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద నవధరింపుము. అవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష రూపంబులును, నానా
శక్త్యుపబృంహితంబు లైన బ్రహ్మాదిరూపంబులును, నీయంత నీవే ధరియించి జగ దుత్పత్తి స్థితి లయంబులం దంతుకీటంబునుం బోలెం గావింపుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు
మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృపసేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహ దహంకారంబులు నా మదిం
బొడముం గావునం దత్పరిహారార్ధంబు వేఁడెద. నన్నుం గృపాదృష్టి విలోకించి దయసేయు మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. (248)
క. వారిజభవ ! శాస్తార్ధవి, చారజ్ఞానమును, భక్తి, సమధిక సాక్షాత్కారము
లను నీ మూఁడు ను, దాతర నీ మనమునందు ధరియింప నగున్. (249)
సీ. పరికింప మత్స్వరూప స్వభావములును మహి తావతార కర్మములుఁ దెలియు
తత్త్వవిజ్ఞానంబు దలకొని మత్ర్పసాదమునఁ గల్గెడి నీకుఁ గమలగర్భ!
సృష్టి పూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ గలిగియుండుదు వీతకర్మి నగుచు
సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములుఁ దత్కారణ ప్రకృతియుఁ దగ మ దంశ
ఆ. మందు లీనమైన నద్వితీయుండనై, యుండు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృష్టినాశంబున, జగము మత్స్యరూప మగును వత్స! (250)
క. అరయఁగఁ గల్ప ప్రళాయం. తరము ననాద్యంత విరహిత క్రియతోడన్
బరిపూర్ణ నిత్య మహిమం, బరమాత్ముఁడనై సరోజభవ ! యే నుందున్. (251)
వ. అదియునుంగాక నీవు న న్నడిగిన యీ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు. లేని యర్థంబు శుక్తి రజత భ్రాంతియుం బోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱం దోఁచక మాను నిదియె నా మాయా విశేషం బని యెఱుంగుము. ఇదియునుం గాక లేని యర్థంబు దృశ్యం బగుటకుం, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును, తమః ప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియుము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందుం బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందు, సత్త్వాది రూపంబులం బ్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులయందుఁ గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొందిన నాయందు నభివ్యక్తంబులై యుండవు. సర్వ దేసంబులయందు సర్వకాలంబులయందు నేది భోధితంబై యుండు, నట్టిదే పరబ్రహ్మ స్వరూపంబు, తత్త్వం బెఱుంగ నిచ్ఛయించిన మిముఁ బోఁటి వారలీ చెప్పినది మదీయ తత్త్వత్మకంబైన యర్థంబని యెఱుంగదురు. ఈ యర్థం బుత్కృష్టం బైనయది. ఏకాగ్రచిత్తుండవై యాకర్ణించి భవదీయ చిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబులయందు మోహంబు చెందకుండెడి. అని భగవంతుండైన పరమేశ్వరుండు చతుర్ముఖున కాజ్ఞాపించి నిజలోకంబుతో నంతర్ధానంబు నొందె. అని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. (252)
సీ. అవనీశ బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ బుండరీకాక్షుని బుద్ధి నిలిపి
యానందమును బొంది యంజలి గావింవి తత్పరిగ్రహమునఁ దనదు బుద్ధి
గైకొని పూర్వప్రకారంబునను సమస్తప్రపంచం బెల్లఁదగ సృజించి
మఱియొకనాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు నఖిల ప్రజాపతి యైన కమల
తే. గర్భుఁ డాహితార్థమైకాక సకల, భువనహిత బుద్ధి నున్నత స్ఫురణ మెఱసి
మానితంబైన యమ నియమముల రెంటి, నాచరించెను సమ్మోదితాత్ముఁడగుచు. (253)
వ. అ య్యవసరంబున, (254)
క. ఆ నళినాసననందను, లైన సనందాది మునుల కగ్రేసరుండున్
మానుగఁ బ్రియతముఁడును నగు, నా నారదుం డేఁగుదెంచె నబ్జజు కడుకున్. (255)
క. చనుదెంచి తండ్రికిం బ్రియ, మొనరఁగ శుశ్రూషణంబు లొనరిఁచి యతుఁడున్
దనదెసఁ బ్రసన్నుఁడగుటయుఁ, గని భగవ న్మాయఁ దెలియఁగా నుత్సుకుఁడై. (256)
సీ. అవనీశ! నీవు నన్నడిగినపగిది నతఁడు దండ్రి నడుగఁ బితామహుండు
భగవంతుఁ డాశ్రిత పారిజాతము హరి గృపతోడఁ దన కెఱిఁగించినట్టి
లోకమంగళ చతుః శ్లోక రూపంబును దశ లక్షణంబులఁ దనరు భాగవతము
నారదున కున్నతిఁ జెప్పె నాతఁడు చారు సరస్వతీ తీరమునను
తే. హరిపద ధ్యాన పారీణుఁ డాత్మవేది, ప్రకట తేజస్వి యగు బాదరాయణునకుఁ
గోరి యెఱిఁగించె నమ్మహోదారుఁడెలిమి, నాకు నెఱిఁగించె నెఱిఁగింతు నీకు నేను. (257)
వ. అదియుంగాక యిపుడు విరాట్పురుఘనివలన నీ జగంబు లే విధంబున జనియించె, ననియెడి మొదలైన కొన్ని ప్రశ్నలు నన్నడిగితివి. ఏను నన్నింటికి నుత్తరం బగునట్లుగా నమ్మహాభాగవతం
బుపన్యసించెద. ఆకర్ణింపుము. (258)
అధ్యాయము-౧౦
వ. అ మ్మహాపురాణంబు చతుఃశ్లోక రూపంబున దశ లక్షణంబుల సంకుచిత మార్గంబుల నొప్పు. అందు దశ లక్షణంబు లెయ్యవి? యనిన సర్గంబును, విసర్గంబును, స్ధానంబును,
పోషణంబును, ఊతులను, మన్వంతరంబులును, ఈశానుచరితంబును, ముక్తియు, నాశ్రయంబు ననం బది తెఱంగులయ్యె. దశమవిశుద్ధ్యర్ధంబు తక్కిన తొమ్మిది లక్షణంబులు
సెప్పంబడె అవి యెట్టి వనిన, (259)
తే. మహ దహంకార పంచ తన్మాత్ర గగన, పవన శిఖ తోయ భూ భూతపంచకేంద్రియ
ప్రపంచంబు భగవంతునందు నగుట, సరమందురు దీనిని జనవరేణ్య! (260)
క. సరసిజగర్భుండు విరా, ట్పురుషునివలనం జనించి భూరితర చరా
చర భూతసృష్టిఁ జేయుట, పరువడిని విసర్గ మండ్రు భరతకులేశా ! (261)
క. లోకద్రోహి నరేంద్రా, నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠ నాథు విజయం, బాకల్పస్థాన మయ్యె నవనీనాథా! (262)
క. హరి సర్వేశుఁ డనంతుడు, నిరుపము శుభమూర్తి చేయు నిజభక్తజనో
ద్ధరణము పోషణ మవనీ, వర ! యూతు లనంగ గర్మవాసన లరయన్. (263)
తే. జలజనాభ దయాకటాక్ష ప్రసాద, లబ్ధి నిఖిలైక లోకపాలన విభూతి
మహిమఁబొందిన వారి ధర్మములు విస్తరమునఁ బలుకుట మన్వంతరములుభూప! (264)
క. వనజోదరు నవతార క, థనము దదీ యాను వర్తి తతి చారిత్రం
బును విస్తరించి పలుకం, జను నవి యీశాను కథలు సౌజన్యనిధీ ! (265)
సీ. వసుమతీనాథ! సర్వస్వామియైన గో, విందుండు చిదచి దానందమూర్తి
సలలిత స్వోపాధి శక్తిసమేతుఁడై తనరారు నాత్మీయ ధామమందు
ఫణిరాజు మృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి నున్న వేళ
నఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబు లురలుకొనగఁ
తే. జరగు నయ్యవస్థా విశేషంబు లెల్ల, విదిత మగునట్లు వలుకుట యది నిరోధ
మన నిది యవాంతరప్రళయం బనంగఁ, బరఁగునిఁక ముక్తిగతి విను పార్థివేంద్ర. (266)
సీ. జీవుండు భగవత్కృపా వశంబునఁ జేసి దేహ ధర్మంబులై ధృతి ననేక
జన్మానుచరిత దృశ్యము లైన య జ్జరా మరణంబు లాత్మధర్మంబు లైన
ఘన పుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వసంచితము లైన
యపహత పాప్మవత్త్వా ద్యష్టతద్గుణ వంతుఁడై తగ భగవ చ్ఛరీర
తే. భూతుఁడై పారతంత్య్రాత్మ బుద్ధి నొప్పి, దివ్యమా ల్యానులేపన భవ్యగంధ
కలిత మంగళ దివ్యవిగ్రహవిశిష్టుఁ, డగుచు హరిరూపమొందుటే యనుఘ! ముక్తి. (267)
వ. మఱియు నుత్పత్తి స్థితి లయంబు లెందు నగుచుఁ బ్రకాశింపఁబడు నది యాశ్రయంబనంబడు. అదియ పరమాత్మ. బ్రహ్మశబ్ద వాచ్యంబు నదియ. ప్రత్యక్షాను భవంబున విదితంబు
సేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె. అది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులఁ ద్రివధంబయ్యె. అందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళ
కాంతర్వర్తియై యెఱుంగంబడు. చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుండనం దగు. చక్షురాద్యధిష్ఠా నాభిమాన దేవతయు, సూర్యాది తేజోవిగ్రహుండు న్గుచు నెవ్వని
యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండు, విరాడ్వి గ్రహుండు నగుం గావున, ద్రష్టము దృక్కు దృశ్యంబు ననందగు మూఁటి యందు నొకటి లేకున్న నొకటి
గానరాదు. ఈ త్రితయంబు నెవ్వఁ డెఱుంగునతండు సర్వలోకాశ్రయుండై యుండు. అతండె పరమాత్మయు. అ మ్మహాత్ముండు లీలర్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు
నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వ సృష్టం బగు నేకార్ణ వాకారం బైన జలరాశి యందు శయనంబు
సేయుటం జేసి.
శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః
తా య ద స్యాయనం పూర్వం తేన నారాయణ స్స్మృతః.
అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు. ఉపాదానభూతంబైన ద్రవ్యంబును, ద్రివిధంబైన కర్మంబును, గళా కాష్ఠా ద్యుపాధి
భిన్నంబైన కాలంబును, జ్ఞానాధికంబగు జీవస్వభావంబును, భోక్తయగు జీవుండును, నెవ్వని యనుగ్రహంబునంజేసి వర్తింపుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల
సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబు గాఁదలంచి యోగతల్పంబునం బ్రబుద్ధుండై యుండు. అట మీఁద స్వ సంకల్పంబునం జేసి తన హిరణ్మయంబైన విగ్రహంబు నధిదైవంబు
నధ్యాత్మకంబు నధిభూతంబు నను సంజ్ఞాయుతంబైన త్రివిధంబుగా సృజియించె. (268)
సీ.అట్టి విరా డ్వీగ్రహాంత రాకాశంబు వలన నోజ స్సహోబలము లయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూప క్రియాశక్తిచే జనియించి ముఖ్యాసు వనఁగఁ బరఁగె
వెలుపడి చను జీవి వెనుకొని ప్రాణముల్ చనుచుండు నిజనాథు ననుసరించు
భటుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మఱి ముఖము వలనఁ
తే. దాలుజిహ్వాదికంబు లుద్భవము నొందె, నందు నుదయించె జిహ్వయునందు రసము
లెల్లనుదయించె జిహ్వచే నెఱుఁగఁబడును,మొనసిపలుకనపేక్షించుముఖమువలన. (269)
వ. (మఱియు) వాగింద్రియంబు పుట్టె.దానికి దేవత యగ్ని. (ఆ రెంటివలన భాషణంబు వొడమె. ఆ యగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధంబు గలుగుటంజేసి యా జలంబె
ప్రతిబంధకం బయ్యె) దోదూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెం గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థం బయ్యె. (నిరాలోకం బగు నాత్మ నాత్మ
యందుఁ జూదంగోరి) తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షి యుగళంబు పుట్టె. ఋషిగణంబుచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును
నైన శ్రోత్రేంద్రియంబు పుట్టించె. సర్జనంబు సేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులు, లఘుత్వ గురుత్వంబులు,నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రి యాదిష్ఠానంబగు చర్మంబు
పుట్టె. దానివలన రోమంబు లుదయించె. వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె. అందు నధిగత స్పర్శ గుణుండును అంతర్బహిఃప్రదేశంబుల నావృతుండును నగు వాయువు వలన
(బలవంతంబులు నింద్రదేవతాకంబులు నాదాన సమర్థంబులు నానాకర్మ కరణ దక్షంబులు నగు హస్తంబు లుదయించె.) స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు నీశ్వరునివలన విష్ణుదేవతాకంబులగు
పాదంబు లుదయించె. ప్రజానందామృతార్థి యగు భగవంతుని వలనఁ బ్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె. మిత్రుండధిదైవ
తంబుగాఁ గలిగి భుక్తాన్న ద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె. దాని కృత్యం బుభయ మల మోచనంబు, దేహంబున నుండి దేహాంతరంబు జేరంగోరి
పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభి ద్వారంబు సంభవించె. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడు. తద్బంధ విశ్లేషంబె మృత్యు వగు. అదియు యూర్థ్వాధో దేహ భేదకం
బనియుం జెప్పంబడు. అన్న పానాది ధారణార్థంబుగ నాంత్ర కుక్షి నాడీనిచయంబులు గల్పింపఁబడియె. వానికి నదులు సముద్రంబులు నధిదేవతలయ్యె. (వాని వలనఁ) దుష్టిపుష్టులను నుదర
భరణ రస పరిణామంబులును గలిగియుండు. ఆత్మీయ మాయా చింతనం బొనర్చు నపుడుకామ సంకల్పాది స్థానంబగు హృదయంబు గలిగె. దానివలన మనంబును, చంద్రుండును,
కాముండును, సంకల్పంబును నుదయించె. అంత మీఁద జగత్సర్జనంబు సేయు విరా డ్విగ్రహంబు వలన సప్తధాతువులును, పృథివ్యప్తేజోమయంబులైన సప్తప్రాణంబులును,వ్యోమాంబు
వాయువులచే నుత్పన్నంబు లయి గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబులైన గుణంబులును, సర్వవికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియుఁ
బుట్టు. వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు, మఱియును, (270)
క. వరుస బృథివ్యా ద్యష్టా, వరణావృతమై సమగ్ర వైభవములఁ బం
కరుహభవాండాతీత, స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. (271)
క. పొలుపగు సకల విలక్షణ, ములు గలి గాద్యంత శూన్యమును నిత్యమునై
లలి సూక్ష్మమై మనో వా, క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. (272)
సీ. అలఘు తేజోమయంబైన రూపం బిది క్షితినాథ నాచేతఁ జెప్పఁబడియె
మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవ త్స్వరూప
మ మ్మహాత్మకుని మాయా బలంబునఁ జేసి దివ్యమునీంద్రులు దెలియలేరు.
వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ గ్రియలును రూఢిఁ దాల్చి
ఆ. యుండునట్టి యీశ్వరుండు నారాయణుం, డఖిలధృతి జగ న్నియంతయైన
చిన్నయాత్మకుండు సృజియించు నీ ప్రజా, పతుల ఋషులను బితృతతుల నపుడు. (273)
వ. మఱియును, (274)
సీ. సుర సిద్ధ సాధ్య కిన్నరవర చారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ
భూత భేతాళ కింపురుష కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాతుధాన
విద్యాధ రాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరి ఘృష్టి ఖగ మృగాళి
భల్లూక రోహిత పశి వృక్ష యోనుల, వివిధ కర్మంబులు వెలయఁబుట్టి
తే. జల నభో భూతలంబుల సంచరించు, జంతుచయముల సత్వ రజస్తమోగు
ణములఁ దిర్య క్సురాసుర నర ధరాధి, భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర! (275)
మ. ఇరవొందన్ ద్రుహిణాత్మకుం డయి రమాధీశుండు విశ్వంబు సు
స్థిరతం జేసి హరిస్వరూపుఁ డయి రక్షించున్ సమస్త ప్రజో
త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్
హరియించున్ బవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. (276)
క. ఈ పగిదిని విశ్వము సం, స్థాపించును మనుచు నణఁచు ధర్మాత్మకుఁడై
దీపిత తిర్య జ్నర సుర, రూపంబు లా దానె తాల్చి రూఢి దలిర్పన్. (277)
సీ. హరియందు నాకాశ మాకాశమున వాయు వనిలంబు వలన హుతాశనుండు
హవ్యవాహనునందు నంబువు లుదకంబు వలన వసుంధర గలిగె ధాత్రి
వలన బహు ప్రజావళి యుద్భవం బయ్యె నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం డవ్యయుఁ, డజరుఁ డనంతుఁ డాఢ్యుఁ
తే. డాది మధ్యాంత శూన్యం డనాదినిధనుఁ, డతనివలనను సంధూత మైన యట్టి
సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! (278)
వ. అదియునుం గాక, (279)
మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితంజేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్. (280)
వ. బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతర కల్పంబుతోడి సంకుచిత ప్రకారంబున నెఱింగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులును, తత్పరిమాణంబులును
కాల కల్ప లక్షణంబులును, నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును, నతివిస్తారంబుగ ముందు నెఱింగింతు వినుము. అదియును బద్మకల్పం బనందగు.అని భగవంతుం
డయిన శుకుండు పరీక్షిత్తునకుఁ జెప్పె. అని సూతుండు మహర్షులకు నెఱింగించిన, (281)
క. విని శౌనకుండు సూతం గనుఁగొని యిట్లనియె సూత! కరుణోపేతా!
జననుత గుణసంఘాతా! ఘన పుణ్యసమేత! విగతకలుషవ్రాతా! (282)
వ. పరమ భాగవ తోత్తముండైన విదురుండు బంధు మిత్ర జాలంబుల విడిచి, సకల భువన పావనంబులును కీర్తనీయంబులును నైన తీర్ధంబులు నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులును దర్శించి,
క్రమ్మఱ వచ్చి, కొపారవియగు మైత్రేయుంగని, యతని వలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు. అది యంతయు నెఱింగింపు మనిన నతం డిట్లనియె. (283)
క. విను మిపుడు మీరు న న్నడి, గిన తెఱఁగున శుకు మునీంద్రగేయుఁ బరీక్షి
జ్జనపతి యడిగిన నతఁడా, తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్. (284)
వ. సావధానులై వినుండు, (285)
ఉ. రామ! గుణాభిరామ! దినరాజ కులాంబుధి సోమ! తోయద
శ్యామ! దశానన ప్రబల సైస్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా! (286)
క. అమరేంద్రసుత విదారణ! కమలాప్త తనూజ రాజ్యకారణ!భవ సం
తమస దినేశ్వర! రాజో, త్తమ! దైవత సార్వభౌమ! దశరథరామా! (287)
మాలిని. నిరుపమ గుణజాలా ! నిర్మలానంద లోలా !
దురిత ఘన సమీరా ! దుష్ట దైత్య ప్రహారా !
శరధి మద విశోషా ! చారు స ద్భక్త పోషా !
సరసిజ దళనేత్రా ! సజ్జన స్తోత్ర పాత్రా !. (288)
గద్య. ఇది పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేసన మంత్రి పుత్ర, సహజ పాండిత్య,పోతానామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను పురాణంబునం బరీక్షిత్తుతోడ శుకయోగి
భాషించుటయు, భాగవత పురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్షప్రకారంబును, ధారణా యోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదా ద్యవయవంబుల సర్వలోకంబు లున్న తెఱంగును, సత్పురుష
వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫలప్రద దేవతా భజన ప్రకారంబును, మోక్ష ప్రదుండు శ్రీహరి యునుటయు, హరి భజన విరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును,
శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరివలన బ్రహ్మ రుద్రాది లోక ప్రపంచంబు పుట్టుటయు,
శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును, భాగవత వైభవంబును, పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నలును, అందు శ్రీహరి ప్రధానకర్తయని త
ద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడఁ బ్రసన్నుండైన, స్తోత్రంబు సేసి త త్ర్పసాదంబునం ద న్మహిమ
వినుటయు, వాసుదేవుండానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్య
విభూత్యాది వర్ణనంబును, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతు నడుగుటయు, నను కథలు గల ద్వితీయ స్కంధము సంపూర్ణము. (289)