6. బ్రహ్మకు శ్రీమన్నారాయణుని వరప్రదానము మఱియు స్కంధాంతము

సీ. హరిపాదభక్తి ర | హస్యోపదేష్టయు సకల దేవతలకు | నధివిభుండు నైన విధాత క | ల్పాదియందును నిజా, శ్రయ పద్మమున కధి | ష్ఠానమరయ నర్థించి జలముల | నన్వేషణము సేసి, నళినంబు మొదలు గా | నంగలేక విసివి క్రమ్మఱను ద | ద్బిసరుహాసీనుఁడై, సృష్టినిర్మాణేచ్ఛఁ | జిత్తమందు తే|| జాల నూహించి తత్పరి | జ్ఞానమహిమ, సరణి మనమునఁ దోఁపక | జడనుపడుచు లోకజాలంబుఁ బుట్టింప | లేక మోహి, తాత్ముఁడై చింత నొందు న | య్యవసరమున.

వ. జలమధ్యంబున నుండి యక్షరసమామ్నాయంబున స్పర్శంబులందు షోడశాక్షరంబు మఱియు నేకవింశాక్షరంబు నైన నీ యక్షరద్వయంబు వలన నగుచు మహామునిజనధనంబైన ’తప’ యను శబ్దంబు రెండుమారులుచ్చరింపంబడి వినంబడిన, నట్టి శబ్దంబు వలికిన పురుషుని వీక్షింపంగోరి నలుదిక్కులకుం జని, వెదకి, యెందునుం గానక మఱలి, నిజస్థానంబైన పద్మంబునం దాసీనుండై, యొక్కించుక చింతించి, యట్టి శబ్దంబు తన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలంచి, ప్రాణాయామపరుండై, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్రచిత్తుండై, సకలలోఖసంతాపహేతువైన తపంబు వేయి దివ్యసంవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన నా కమలసంభవుండు తత్క్షణంబు రాజస, తామస, సత్త్వ, మిశ్ర గుణాతీతంబును, శుద్ధసత్త్వగుణావాసంబును, అకాలవిక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకలసురగణస్తుత్యంబును. లోభమోహభయవిరహితంబును, అపునరావృత్తిమార్గంబును, అనంతతేజోవిరాజితంబును నైన వైకుంఠపురంబుఁ బొడఁగని, యందు.

సీ. సూర్యచంద్రానల | స్ఫురణలఁ జొఱనీక, నిజదీధితిస్ఫూర్తి | నివ్వటిల్ల దివ్యమణిప్రభా | దీపిత సౌధ్ వి, మాన గోపుర హర్మ్య | మండపములు ప్రసవగుచ్ఛస్వచ్ఛ | భరిత కామితఫల, సంతానపాదప | సముదయములు కాంచన దండ సం | గతమారుతోద్ధూత, తరళ విచిత్ర కే | తన చయములు తే|| వికచ కైరవ దర దరవింద గత మ,రంద రస పాన మోదితేం | దిందిర ప్ర భూత మంజుల నిననద ప్ర | బుద్ధ రాజ, హంసశోభిత వర కమ | లాకరములు.


సీ. వలనొప్పఁగా "న దై | వం కేశవాత్ పర" మ్మని పల్కు రాజ కీ | రావళియును మహిమ "సర్వం విష్ణు | మయము జగ""త్తని చదివెడు శారికా | సముదయంబు తైవారఁగా"జితం | తే పుండరీకాక్ష !" యని లీలఁ బాడు పి |కావళియును లలి మీఱఁగా "మంగ | ళమ్ మధుసూదన !" యని పల్కు కేకు ల | నారతంబు తే|| తవిలి శ్రౌషడ్‌వషడ్‌ స్వధే | త్యాదిశబ్ద, కలితముగ మ్రోయు మధుప ని | కాయములు గలిగి యఖిలైక దివ్యమం | గళ విలాస, మహిమఁ జెన్నొందు వైకుంఠ | మందిరంబు.

వ. మఱియుఁ బయోధరావళీ విభాసిత నభంబుం బోలె వెలుంగుచున్న యద్దివ్యధామంబునందు.

సీ. సలలితేందివర | శ్యామాయమాణోజ్జ్వ, లాంగులు నవ్య పీ | తాంబరులును ధవళారవింద సుం | దరపత్రనేత్రులు, సుకుమార తనులు భా | సుర వినూత్న రత్నవిభూషణ | గ్రైవేయ కంకణ, హారకేయూర మం | జీరధరులు నిత్య యౌ | వనులు వినిర్మల చరితులు, రోచిష్ణులును హరి | రూపధరులు తే|| నగు సునందుండు నందుండు | నర్హణుండు, ప్రబలుఁడును మొదలగు నిజ | పార్శ్వచరులు మఱియు వైడూర్యవిద్రుమా | మల మృణాళ, తుల్యగాత్రులుఁ దను భక్తి | తో భజింప.

సీ. క్షాళితాఖిల కల్మ | షవ్రజామర నదీ, జనక కోమల ప | దాబ్జములవాని నఖిలసంపత్కార | ణాపాంగ లక్ష్మీ వి, లాసిత వక్షః స్థ | లంబువాని బద్మమిత్రామిత్ర | భాసిత కరుణా త, రంగిత చారు నే | త్రములవాని భువన నిర్మాణ నై | పుణ భవ్య నిజజన్మ, కారణనాభి పం | కజమువాని తే|| నహిహితాహిత శయన వా | హములవాని, సేవితామర తాపస | శ్రేణివాని నఖిలలోకములకు గురుం | డైనవానిఁ గాంచెఁ బరమేష్ఠి కన్నుల | కఱవు దీఱ.

కం|| కమనీయ రూపరేఖా, రమణీయతఁ జాలనొప్పు రమ | ణీమణి య క్కమలాలయ తన మృదు కర, కమలంబుల విభుని పాద | కమలములొత్తన్.

వ. వెండియు,

శా|| శ్రీకాంతాతిలకంబు రత్నరుచి రా | జి ప్రేంఖిత స్వర్ణ డో లాకేళిన్ విలసిల్లి తత్కచ భరా | లంకార స్రగ్గంధ లో భాకీర్ణప్రచరమధువ్రత మనో | జ్ఞోల్లాస నాదంబు ల స్తోకానుస్వరలీల నొప్పఁగ నిజే | శున్ వేడ్కతోఁ బాడఁగన్.

వ. అట్టి నిత్యవిభూతియందు.

మ. సతతజ్ఞాన రమా యశో బల మహై | శ్వర్యాదియుక్తున్ జగ త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళ | త్పంకేరుహాక్షున్ శ్రియః పతి నాద్యంతవికారదూరుఁ గరుణా | పాథోనిధిన్ సాత్త్వతాం పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ వి | భ్రాజిష్ణు రోచిష్ణునిన్.

మ. దరహాసామృత పూరితాస్యు నిజ భ | క్త త్రాణ పారాయణు న్నరుణాంభోరుహ పత్రలోచనునిఁ బీ | తావాసుఁ ద్రైలోక్య సుం దరు మంజీర కిరీట కుండల ముఖో | ద్యద్భూషు యోగీశ్వరే శ్వరు లక్ష్మీయుతవక్షుఁ జిన్మయు దయా | సాంద్రున్ జతుర్బాహునిన్.

వ. మఱియు (ననర్ఘరత్నమయ సింహాసనాసీనుండు సునంద నంద కుముదాదిసేవితుండు) ప్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహా భూతంబులను షోడశశక్తులును, బంచతన్మాత్రలును బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుఁడును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయుండును, (స్వస్వరూపంబునఁ గ్రీడించు సర్వేశ్వరుండునైన) పరమపురుషుం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానంద కందళితహృదయారవిందుండును, రోమాంచకంచుకిత శరీరుండును, నానందబాష్పధారాసిక్తకపోలుండును నగుచు.