3. విదుర మైత్రేయుల సంవాదము
అధ్యాయము - ౫
వ. ఇట్లు గనుంగొని యమ్మునీంద్రుని పాదంబులకుం బ్రణమిల్లి ముకుళిత హస్తుండై ఇట్లనియె.మునీంద్రా! లోకంబున సకలజనంబులు మనంబులు ఘనంబు లగు సౌఖ్యంబు లందం దలంచి తత్పల ప్రాప్తి హేతువులైన కర్మంబు లాచరించి దైవోపహతులై తత్కర్మంబులచేత నిష్ఫలారంభు లగుదురు. కర్మంబులు బంధకరంబులు, దుఃఖ హేతువులుంగాని సౌఖ్యదాయకంబులై పాపనిష్కృతిఁ జేయ నోపవు. అది యట్లుండె. భూరి దుఃఖానుసారంబైన సంసార చక్రంబునం బరిభ్రమింపుచుం గామ విమోహితులై పూర్వ కర్మానుగతంబులైన శరీరంబులు దాల్చుచుఁ జచ్చుచు మగలం బుట్టుచు నెంతకాలంబునకుం బాపనిష్కృతిఁ గానక మాతృ యౌవన వన కుఠారులై జనియించి వర్తించు మూఢాత్ములం బశుప్రాయుల రక్షించుకొఱకుఁ గాదె నారాయణ పరాయణు లైన మీ వంటి పుణ్యాత్ములు లోకంబునం జరియించుట. అదియునుం గాక, (181)
మ. అవివేకానుగత స్వకార్య జల పూరా కీర్ణమై మిత్ర బం
ధు వధూ పుత్రగ్ర హోగ్రయుతమై దుర్దాంత మై నట్టి దు
ర్భవ పాథోధిఁ దరించు వారె హరి సంబంధ క్రియా లోల భా
గవతానుగ్రహ నావ లేని యధ్ముల్ కల్యాణ సంధాయకా! (182)
క. మునినాథచంద్ర! ననుఁ గై, కొని కాచు తలంపు బుద్ధిఁ గూడిన యేనిన్
వినుము మ దీప్సిత మది నా, చనవునఁ గావింపు మయ్య సజ్జన తిలకా! (183)
వ. అని వెండియు విదురుండు మైత్రేయుం జూచి మునీంద్రా! త్రిగుణాత్మక మాయా నియంత యగు భగవంతుండు స్వతంత్రుం డగుచు నవతరించి యెయ్యే యవతారంబు లందు నెయ్యే కర్మంబు లాచరించె? (నిష్కృయుండగు నీశుండు) మొదలఁ బ్రపంచంబు నే విధంబునం గల్పించె ! ఏపగిదిం దీనిం బాలించె! (మఱియు నీ విశ్వంబు) నాత్మీయ హృదయాకాశ గతముం జేసి నివృత్తవృత్తి యగుచు యోగమాయ యందు నెట్లు వసియించె? బ్రహ్మాండంబు నందు నే లీల వర్తించె? అందు బ్రహ్మాది రూపంబులం బొంది బహు ప్రకారంబుల నెట్లు గ్రీండించె! భూసుర గో సురాదులఁ బరిరక్షించుటకై మత్స్యాద్యవతారంబులు ధరియించె యెయ్యే ప్రయోజనంబులం దీర్చె? పయోరుహగర్భాండ కటా హాంతర్గతంబులై (లోకపాల సహితంబులైన) లోకంబుల లోకాలోక పర్యంతంబుల బహిర్భాగంబుల నెయ్యే తత్త్వభేదంబుల నే తెఱంగునం బుట్టించె? అందుఁ బ్రతీతం బగు జీవకోటి యెవ్వనిం గొల్చి బ్రతుకు? జనులకుం గర్మ నామ రూప భేదంబు లెట్లు నిర్దేశించె? ఇంతయు సవి స్తరంబుగా వివరింపుము. ఉత్తమశ్లోక మౌళిమండనుండు యోగీశ్వరేశ్వరుండు నైన పుండరీకాక్షుని చరిత్ర శ్రవణంబునంగాని జన్మ మరణాది సకల దుఃఖాకరంబులు, దుష్క్ర్మ ప్రాప్తంబులు నగు భవ బంధంబులు దెగ వని వెండియు నిట్లనియె. (184)
తరల. సతతమున్ సరసీరుహోదర సత్కథామృత పూరమున్
శ్రుతి పుటాంజలి చేత నిమ్ముల జుర్రియుం దనివోదు భా
రత కథామిష మూని విష్ణుఁ బరాశర ప్రియ సూతి స
స్మతి నుతించిన చోట సన్మనినాథ! నా మది నుబ్బుదున్ (185)
క. ఇతర కథా కర్ణనముల, నతిహేయత నొందెఁ జిత్త మనఘాత్మ ! రమా
పతి చరితామృత రతి సం, సృతివేదన లెల్లఁ బాయ జేయు మునీంద్రా ! (186)
తే. భూరి విజ్ఞాన విదులగు నారదాది, నిర్మలాత్ముల కైన వర్ణింపరాని,
హరికథామృతపానంబు నందు విసివి, యొల్ల నను వాఁడె పో వెర్రిగొల్లఁడనఘ! (187)
వ. అదియునుం గాక, (188)
సీ. అరవిందనాభుని యపరావతారమై జనన మొందిన పరాశరసుతుండు
మహినొప్పు వర్ణాశ్రమాచార ధర్మముల్ ఠవణింప లోక విడంబనములు
నగు గ్రామ్య కథలు పెక్కిర్ధిఁ గల్పించుచు హరికథా వర్ణన మందులోన
నించుకించుక గాని యేర్పడఁ జెప్పమి నంచిత విజ్ఞాన మాత్మ నిలువ
తే. కున్నఁ జింతించి మఱి నారదోపదిష్టుఁ, డగుచు హరివర్ణనామృత మాత్మఁగ్రోలి
విమల సుజ్ఞాననిధి యన వినుతికెక్కి, ధన్యుఁడయ్యెను లోకైక మాన్యుఁడగుచు. (189)
వ. కావున, (190)
క. సరసిరుహోదరు మంగళ, చరితామృత మాత్మఁ గ్రోలు జనుఁ డితర కథా
గరళము గ్రోలునె? హరి సం, స్మరణము జీవులకు నఖిల సౌఖ్యద మనఘా! (191)
క. శ్రీ వనితాధిప నామక, థా విముఖుల కిహము పరము దవ్వై పిదపం
బోవుదురు నరకమునకున్, వావిరి నే వారిఁ జూచి వగతు మునీంద్రా ! (192)
క. ఏ నరుఁ డే నొక నిమిషం, బైన వృథావాద గతిని హరిపదకమల
ధ్యానానందుఁడు గాఁడే, నా నరునకు నాయు వల్ప మగు మునినాథా! (193)
చ. మృదుగతి పువ్వుఁ దేనియ రమింపుచుఁ బానము సేయఁ బాఱు ష
ట్పదమును బోలి యార్తజన బాంధవు విశ్వభవ స్థితి వ్యయా
స్పద మహితావతారుఁ డగు పంకరుహోదరు నిత్యమంగళ
ప్రద గుణకీర్తనామృతముఁ బాయక గ్రోలెదఁ జెప్పనే దయన్ (194)
క. అని విదురుఁడు మైత్రేయుం, డను మునినాయకుని నడిగెనని వేదవ్యా
సుని తనయుం డభిమన్యుని, తనయునికిం జెప్పి మఱియుఁ దగ ని ట్లనియెన్. (195)
వ. ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతం డతనిం గని యతి మృదు మధుర వచన రచనుండై ఇట్లనియె. అనఘా! కృష్ణకథా శ్రవణ తత్పరుండవై నీవు న న్నడిగితివి గావున భద్రం బయ్యె. నీవు భగవద్భక్తుండవు గావున హరికథా సక్తుండ వగుట చిత్రంబుగాదు. అదియునుంగాక మాండవ్యుని శాపంబున సాత్యవతేయు వలన (భ్రాతృ క్షేత్రంబున) శూద్రయోనిం బుట్టి నట్టి ప్రజా సంయ మనుండ వగు యముండవు, పరమజ్ఞాన సంపన్నుండవు. నారాయణునకుం బ్రియతముందవు. కావున గృష్ణుఁడు నిర్యాణ కాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయం జీరి విజ్ఞానం బెల్ల నుపదేశించి నీకు నెఱింగింపు మని యానతిచ్చుటం జేసి యవశ్యంబు నీకు నెఱింగింతు. దత్తావధానుండవై వినుము. (196)
క. వనజాక్ష యోగమాయా, జనితం బగు విశ్వ జనన సంస్థాన వినా
శనముల తెఱఁ గెఱిఁగింపుచు, ననఘా! విష్ణుని మహత్త్వ మభివర్ణింతున్. (197)
సీ. సకల జీవుల కెల్లఁ బ్రకట దేహము నాత్మనాథుండు పరుఁడు నానావిధైక
మత్యుపలక్షణ మహితుండు నగు భగవంతుండు సృష్టిపూర్వంబు నందు
నాత్మీయ మాయా లయంబు నొందిన విశ్వ గర్భుఁడై తాన యెక్కటి వెలుంగు
పరమాత్మఁ డభవుం డుపద్రష్ట యయ్యు వస్త్వంతర పరిశూన్యుఁ డగుటఁజేసి.
తే. ద్రష్ట గాకుండు మాయా ప్రధానశక్తి, నతుల చిచ్చక్తి గలవాఁడు నగుచు దన్ను
లేని వానిఁగ జిత్తంబులోనఁ దలఁచి, ద్రష్టయగుఁ దన భువన నిర్మాణ వాంచ. (198)
తే. బుద్ధిఁ దోఁచిన న మ్మహాపురుష వరుఁడు, గార్య కారణ రూపమై ఘనత కెక్కి
భూరి మాయాభిధాన విస్పురిత శక్తి, వినుతి కెక్కిన యట్టి యవిద్య యందు. (199)
క. పురుషాకృతి నాత్మాంశ, స్ఫురణన్ గల శక్తి నిలిపి పురుషోత్తము ఁడీ
శ్వరుఁ డభవుం డజుఁడు నిజో, దర సంస్థిత విశ్వ మపుడు దగఁ బుట్టించెన్ (200)
సీ. ధృతిఁబూని కాలచోదితము నవ్యక్తంబు ప్రకృతియు నను పేళ్ళఁ బరఁగు మాయ
వలన మహత్తత్త్వ మెలమిఁ బుట్టించె మాయాంశకాలాది గుణాత్మకంబు
నైన మహత్తత్త్వ మచ్యుత దృగ్గోచర మగుచు విశ్వనిర్మాణ వాంచ
నందుటఁ జేసి రూపాంతరంబును బొంది నట్టి మహత్తత్త్వమందు నోలిఁ
తే. గార్య కారణ కర్రాత్మకత్వమైన, మహిత భూతేంద్రియక మనోమయ మనంగఁ
దగు నహంకారతత్వ ముత్పన్నమయ్యెఁ, గోరి సత్త్వరజస్తమోగుణక మగుచు (201)
వ. వెండియు రూపాంతరంబులం బొందుచున్న సాత్త్వికాహంకారంబు వలన మనంబును వైకారిక కార్యభూతంబులైన దేవతాగణంబులును సంభవించె. ఇంద్రియా ధీష్ఠాతలైన వానివలన శబ్దంబు పూర్వంబునఁ బ్రకాశం బగుటంజేసి, జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణంబులును, కర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థములును, తైజసాహంకారంబున నుత్పన్నంబయ్యె. తామసాహంకారంబు వలన శబ్ద స్పర్శ రూప రస గంధంబు లుదయించె. అందు శబ్దంబు నిజగుణంబైన శబ్దంబువలన నాకాశంబుఁ బుట్టించె, గగనంబు కాలమాయాంశ యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శ తన్మాత్రంబు వలన వాయువుం గలిగించె. పవనుండు నభోబలంబున రూపతన్మాత్రంబు వలన లోక లోచనం బైన తేజంబు నుత్పాదించె. తేజంబు కాలమాయాంశ యోగంబున నుత్తమ శ్లోకుని విలోకనంబునఁ బవమాన యుక్తం బగుచు రసతన్మాత్రంబు వలన నంబువులఁ గలిగించె. సలిలంబు కాలమాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబుఁ గలిగి తేజోయుక్తంబై గంధ గుణంబు వలనఁ బృథినిఁ గలిగించె. అందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజంబునకు శబ్దస్పర్శ రూపంబులును, సలిలంబునకు శబ్దస్పర్శరూపరసంబులును పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధంబులును గుణంబులై యుండు. కాలమాయాంశ లింగంబులం గలిగి మహదా ద్యభిమానంబుల నొందిన దేవతలు విష్ణు కళాకలితు లగుదురు. అట్టి మహదాది తత్త్వంబు లైక్యంబు చాలమిం బ్రపంచంబులు గల్పింప సమర్ధంబులు గాక కృతాంజులులై యోగీశ్వరేశ్వరుండైన నారాయణు నిట్లని స్తుతియించె. (202)
దండకము. శ్రీనాథ నాథా! జగన్నాథ! నమృకరక్షా విపక్ష! క్షమా భృత్సహస్రాక్ష! నీరేజ పత్రేక్షణా! దేవదేవా! భవద్దాస వర్గానుతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబు నాఁ బొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసార తాపంబులం బాయఁగా మీఁటి వర్తింతురో తండ్రి యీశా! సమస్తాఘ నిర్ణాశ! యీ విశ్వమం దెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్ని చేఁ గ్రాఁగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యే కర్మమున్ ధర్మముం బొందఁగాలేక సంసార చక్రంబు నందున్ బరిభ్రామ్యమాణాత్ములై యుందు ర మ్మూఢ చేతస్కులం జెప్పఁగా నేల? ఓ దేవ! విజ్ఞాన దీపాంకురంబైన మీ పాద పంకేరుహ చ్చాయఁ బ్రాపింతు మబ్జాక్ష సన్మౌని సంఘంబు లైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్ణాశకాంబు ప్రవాహాభ్ర గంగా నివాసంబు నా నొప్పు మీ పాదయుగ్మంబు, యుష్మ న్ముఖాంభోజ నీ డోద్గతం బైన వేదాండజ శ్రేణిచేతం గవేషించి సంప్రాప్తులై యుందు రోనాథ! వైరాగ్య శక్తిస్ఫుట జ్ఞాన బోధాత్ములై నట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులం దే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు మింద్రాది వంద్యా! ముకుందా! సమస్తంబు గల్పింపఁబాలింపఁదూలింపఁగా బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహ ధ్యానపారీణ సుస్వాంతులై యొప్పు భక్తాళికి న్మోక్షదంబైన మీ పాద కంజాతముల్ గొల్తు మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియా లోలురై దేహ గేహంబులం దోలి వర్తించు దుర్మానవ శ్రేణులం దంతరాత్ముండవై యుండియుం దూరమై తోఁచు మీ పాద పద్మంబు లర్చింతు మో దేవ! బాహ్యేంద్రియ వ్యాప్తినుద్వృత్తు లై నట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వ ప్రభావాఢ్యులై మీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసముం గన్న య య్యుత్తమ శ్లోకులం గానఁగా జాల ర ప్పుణ్యులాదుష్టులం జూడఁగా నొల్ల రంభోధిరాట్కన్యకాకాంత! వేదాంత శుద్ధాంత మై యొప్పు మీ సత్కథాపార చంచత్సుధా సార పూరంబులం గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులం దేలి సంపన్నులై మన్న నిత్య ప్రపన్నుల్ మహో త్కంఠతం బేర్చి వైకుంఠధామంబు నల్పక్రియా లోలురై కాంతురద్దివ్య వాసైక నంప్రాప్తికిం గోరుచున్నార మో దేవ! వైరాగ్య విజ్ఞాన బోధాత్మ యోగక్రియారూఢి సంతర్భహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్ల సన్మూర్తిఁ జిత్తంబులం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వర శ్రేణికిం దావకీనానుకంపాను లబ్ధస్ఫుట జ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెందదో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీత కీర్తి! లసద్భూతవర్తీ! భవద్దాసులై నట్టి మమ్ముం జగత్కల్పనాసక్త చిత్తుండ వై నీవు త్రైగుణ్య విస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటే కాక నీ భవ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముం జేయ నే మెంత వా రౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజఁ గావింతు మట్లుండె నీ సత్కళాజాతులై నట్టి మమ్మెన్నఁగా నేల నధ్యాత్మతత్త్వం బవన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచంబవన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్త్వాది త్రైగుణ్య మూలంబు నా నొప్పు మాయా గుణంబందు నుద్య న్ముహత్తత్త్వమై నట్టి నీ వీర్యముం బెట్టుటంజేసి నీ వింతకుం గారణం బొదు వాయాయి కాలంబులన్ నీకు సౌఖ్యంబు లే మెట్లు గావింతు మే రీతి నన్నంబు భక్షింతు మెబ్భంగి వర్తింతు మే నిల్కడ న్నుందు మే జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచున్నున్న యిక్కార్య సంధానులై నట్టి మాకుం జగత్కల్పనాసక్తికిం దేవ నీ శక్తి దోడ్పాటు గావించి విజ్ఞానముం జూపి గారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీ మనః పల్వలక్రోడ ! యోగీంద్ర చేతస్సరో హంస! దేవాది దేవా ! నమస్తే ! నమస్తే ! నమస్తే! నమః. (203)
అధ్యాయము - ౬
సీ. అనినఁ బ్రసన్నుఁడై హరి మహదాదుల కన్యోన్య మిత్రత్వ మంద కున్న
కతమున నిఖిల జగత్కల్పనా శక్తి వొడమ కుండుట దన బుద్ధి నెఱఁగి
కైకొని కాలవేగమున నుద్రేకంబు నొందిన ప్రకృతితోఁ బొంది నిజ బ
లము నిల్పి తా నురుక్రముఁ డన సప్త వింశతి తత్త్వముల యందు సమత నొక్క
తే. పరి ప్రవేశించి యాతత్త్వ భవ్యగుణము, నందుఁ జ్యేష్ఠాను రూపంబు లలరఁజెంది
- యొకటి నొక్కటి గలయక యుండి విశ్వరచన మెఱుఁగని యా తత్త్వనిచ యమునకు (204)
వ. ఇట్లు విశ్వ నిర్మాణ నిపుణత్వంబు నెఱుంగఁ జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి, తన యనుగ్రహంబునం బ్రేరితం బై కానంబడి క్రియాసామర్థ్యంబునఁ జెన్నొందిన తత్త్వ వితానంబు దేవ ప్రేరితం బై స్వకీయంబులగు నంశంబులచేతం బుట్టించిన విర్వాడిగ్రహం బై (తత్త్వ వితతి) దమ యందుఁ జెందిన పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబును జెందె. ఏ తత్త్వంబున నేనియుఁ జరాచరలోక పుంజంబులు నిండియుండు నా హిరణ్మయం బైన విరాడ్విగ్రహంబు నొందిన పురుషుండు సర్వజీవ సమేతుండై యుండె నంత. (205)
క. జలములలోపల నిమ్ముల, జలరుహ జాతాండ మందు సాహస్రాబ్దం
బులు నిలిచెఁ గార్యరూపా, కలితం బగు న వ్విరాట్సుగర్భము వరుసన్. (206)
తే. దైవకర్మాత్మశక్తి వితానములను, దగిలి తనచేతఁ దను దాన దైవశక్తి
యగుచు వెలుఁగొందుచుం బ్రకారాంతరమునఁ, దనువు వితతంబుగాని చైతన్య మొంది. (207)
తే. రూపసంస క్తిఁ జేసి నిరూఢకర్మ, శక్తియును వృత్తిభేద సంసక్తి దశ వి
ధముల గలిగిన ప్రాణరూపమును నాత్మ, శక్తి భోక్తృత్వమగుచున్న శక్తిగలిగి. (208)
క. త్రిపిధం బగుచును నాధ్యా, త్మ్య విభేదంబులను బాపి మఱి యధిభూతా
త్మవిరా డ్రూపం బగునిధి, వివిధ ప్రాణులకు నాత్మ విధమై మఱియున్. (209)
క. జీవంబై పరమాత్మకుఁ, దావలమై యాదిమావతారం బగు న
ద్దేవుని గర్భంబున భూ, తావలి తోడం బ్రపంచ మర్థిం దోఁచెన్. (210)
వ. ఇట్లు దోఁచినవిరాట్పు రుషుం డాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబు లను భేదంబులచేఁ బూర్వోక్త క్రమంబున వెలుఁగొందు ననుచు విదురునకు మైత్రేయుం డెఱింగించె అని చెప్పి వెండియు ని ట్లనియె. (211)
చ. హరి పరమాత్ముఁ డీశుఁ డజుఁ డాఢ్యుఁ డనంతుఁ డనంతమూర్తి సా
గరతనయా హృదీశుఁడు వికార విదూరుఁడు నిత్యమంగళా
కరుఁడు గృపాపయోనిధి యకల్మష చిత్తుఁడు సర్వశక్తి దా
మరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుఁ డిమ్ములన్. (212)
వ. ఇత్తెఱంగున నీశుం డగు నధోక్షజుండు మహా దాది తత్త్వంబుల మనంబుల ఘనంబు లగు తలంపులు దా నెఱింగి, యట్టి తత్త్వంబుల వివిధవృత్తి లాభమునకై స్వకీయ చిచ్చక్తిచే నిట్టు లొనర్తునని చింతించి, నిజకళా కలితం బగు విరాడ్వి గ్రహంబు నందు నగ్ని ప్రముఖం బగు దేవతావళి కెల్ల నివాసం బగుచుఁ గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు. దత్తావధానుండనై వినుము, (213)
సీ. నరనుత యా దివ్య పురుషోత్తముని పృథగ్భావంబు నొంది ముఖంబు వలన
భువన పాలకుఁ డైన పవమాన సఖుఁ డంత రాత్ముఁ డీశ్వరు నంశ మైన వాణి
కనయంబు ననుకూల మగుచు నిజస్థానమునఁ బ్రవేశించిన ముఖము నందుఁ
బరఁగు జీవుండు శబ్దము నుచ్చరించుఁ బృథగ్భావము లగు నేత్రముల నినుఁడు
తే. చక్షురింద్రియ యుక్తుఁడై సరవిఁజెంద, రూప విజ్ఞాన మహిమ నిరూఢి నొందు
మఱియుఁ జర్మములను బవమానుఁడీశ్వ, రాంశమైత త్త్వగింద్రియమందుఁగూడి. (214)
వ. నిజ నివాసంబు నాశ్రయించిన జీవుండు స్పర్శేంద్రియ గతుండగు. పృథగ్భావంబైన శ్రోత్రంబుల దిక్కు లచ్యుత కళాంశంబు లగు. శ్రవణేంద్రియ యుక్తంబులై నిజస్థానంబుల బొందిన జీవుండు శబ్ద జ్ఞాన గతుండగు. మఱియుఁ దాలువు నిర్భిన్నంబైన లోకపాలుండగు వరుణుం డందుఁ బ్రవేశించి రసనేంద్రియంబుచేఁ బ్రకాశించినం బ్రాణి రసంబులం గ్రహించె. పరమేశ్వరుని నాసికేంద్రియంబు పృథగ్భావంబు నొంది యాశ్వినేయాధిష్ఠానంబై ఘ్రాణాంశంబు నొందిన జంతువు గంధగ్రహణ సమర్థంబయ్యె. వెండియు భిన్నం బైన చర్మంబున నోషథులు పరమ పురషాంశంబులైన కేశంబులం గూడి నిజ నివాసంబు నొందిన జీవుండు కండూయమానుం డగు. భిన్న భూతం బైన మేఢ్రంబునం బ్రజాపతి రేతంబున నిజస్థానంబు నొందిన జీవుం డానందంబునం బొందు. భిన్న భావంబైన గుదంబున మిత్రుఁ డచ్యుతాంశంబును బొంది పాయువుం గూడి నిజాధీష్ఠానంబు నొందిన జీవుండు విసర్గంబుఁ జెందు. వేఱు వేఱైన బాహువులం ద్రిదశాధీశ్వరుండైన పురందరుండు క్రయ విక్రయాది శక్తియుక్తుఁ డగుచు నిజస్థానంబు నొందిన జీవుండు వానిచేత జీవికం బొందు. మఱియుఁ బాదంబులు నిర్భిన్నంబులైన విష్ణుండు స్వావాసంబుఁ గైకొని గతి శక్తిం బొందిన జీవుండు గమనాగమ నార్హుండయ్యె. వెండియు భిన్న భావం బైన హృదయంబు మనంబు తోడంగలసి నిజాధిష్ఠానంబునం జంద్రుండు ప్రవేశించిన జీవుండును శరీర సంకల్పాది రూపంబగు వికారంబునుం బొందు. భిన్న భావం బైన యహంకారంబున నహం కృతి యుక్తుండై రుద్రుండు నిజస్థానంబుగా వసియించు. ఆ యహంకృతిచే శరీరి కర్తవ్యంబులు నడపు. బుద్ధి వాగీశ్వరావాసంబై హృదయంబు తోడం గలిసి నిజాధిష్ఠానంబున బోధాంశంబుచే వెలింగిన శరీరి బోద్ధవ్యతం బొందు. భిన్నం బైన చిత్తంబు బ్రహ్మావాసంబై చేతనాంశంబు నొందినఁ బ్రాణి విజ్ఞానంబునుం బొందు. ఆ విరాట్పురుషుని శీర్షంబున స్వర్గంబును, చరణంబుల వసుమతియును, నాభి యందు గగనంబునుం గలిగె. సత్త్వాది గుణ పరిణామంబుల నమరు లైరి ఊర్జిత సత్త్వగుణంబున న ద్దేవతలు ద్రిదివంబునుం బొందిరి. రజోగుణంబున మనుజులును గవాదులును ధరిణిం బొందిరి. తామసంబున భూతాదులైన రుద్ర పార్షదులు ద్యావా పృథివ్యంతరం బగు వియత్తలంబునుం బొందిరి. ముఖంబు వలన నామ్నాయంబు లుత్పన్నంబు లయ్యె వెండియు. (215)
క. ధరణీ దివిజలు శ్రుతులును, నరవర య మ్మేటి ముఖమునం బొడముట భూ
సురుఁ డఖిల వర్ణములకున్, గురుఁడు న్ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ ! (216)
క. ధర బ్రాహ్మణాదికము ద, స్కర బాధం బొందకుండఁ గైకొని కావన్
బురుషోత్తము బాహువులన్, నరనాథకులంబు పుట్టె నయతత్త్వనిధీ! (217)
క. గణుతింపఁగఁ గృషి గోర, క్షణ వాణిజ్యాది కర్మ కలితంబుగ నా
గుణనిధి యూరువు లందుం, బ్రణుతింపఁగ వైశ్యజాతి ప్రభవం బయ్యెన్. (218)
తే. తివిరి సేవక ధర్ములై దేవదేవు, పదములను శూద్ర సంతతు లుదయ మైరి
వీర లందఱు దమ తమ విహితకర్మ, మలరఁ జేయుచు జనకుండు నాత్మగరుఁడు. (219)
క. అగు సర్వేశు పరాపరు, జగదేక ప్రభుని పాద జలజాతంబుల్
దగిలి భజింతురు సతతము, నిగమోక్తిన్ భక్తియోగ నిపుణాత్మకులై. (220)
తే. మహిమ దీపింపఁ గాల కర్మ స్వభావ, శక్తి సంయుక్తుఁడగు పరమేశ్వరుని భూరి
యోగమాయా విజృంభణోద్యోగ మెవ్వఁ, డెఱిఁగి నుతియింపఁగానోపు నిద్ధచరిత! (221)