24. పరీక్షిన్మహారాజు శృంగి వలన శాపంబు నొందుట

క. వేదండ పురాధీశుఁడు, కోదండము చేతఁబట్టికొని గహనములో

వేదండదుల నొకనాఁ , డే దండలఁ బోవనీక యెగదెన్ బలిమిన్. (450)


క. ఒగ్గములు ద్రవ్వి పడుమని, యొగ్గెడు పెనుదెరల పలల నుగ్రమృగమ్ముల్

డగ్గఱినఁ జంపువేడుక, వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్. (451)


క. కోలముల గవయ వృక శా, ర్దూలములఁ దరక్షు ఖడ్గ రోహిష హరి శుం

డాలముల శరభ చమర, వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్. (452)


క. మృగయుల మెచ్చ నరేంద్రుఁడు మృగరాజపరాక్రమమున మెఱసి హరించెన్

మృగధరమండలమునఁ గల, మృగ మొక్కటిఁ దక్క నన్యమృగముల నెల్లన్. (453)


వ. ఇట్లు వాటంబైన వేఁట తమకంబున మృగంబుల వెంటం దగిలి బుభుక్షా పిపాసలఁ బరిశ్రాంతుండై ధరణీకాంతుండు చల్లన నీటికొలంకులు గానక కలంగెడు చిత్తం బుతోఁ జనిచన యొక్క తపోవనంబు గని యంచు. (454)


సీ. మెలఁగుటఁ జాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడతలేక

ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియంబుల, బహిరంగవీథులఁ బాఱనీక

జాగరణాదిక స్థానత్రయము దాఁటి పదమమై యొండెడి పదము దెలిసి

బ్రహ్మభూతత్వ సంప్రా ప్త్యవిక్రియుఁ డయి యతిదీర్ఘ జటలు ద న్నావరింప

తే. నలఘు రురుచర్మధారియై యలడుచున్న, తపసిఁ బొడగని శోషిత తాలుఁడగుచు

నెండి తడిలేని కుత్తుక నెలుఁగు డింద, మందభాషల డగ్గఱి మనుజవిభుఁడు. (455)


క. తోయములు దెమ్మ మా కిఇ, తోయము వేఁటాడువేళఁ దిల్లి పొడమ దీ

తోయముక్రియ జలదాఅహము, తోయమువారలును లేరు దుస్సహ మనఘా !(456)


వ. అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠుండును హరిచింతాపరుండునై యుండుట విచారింపక. (457)


ఉ. కన్నులుమూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్నవాఁ డు చే

సన్నలనైన రమ్మనఁడు సాజలంబులు దెచ్చె పోయఁ డే

మన్ననలైనఁ జేయఁడు సమగ్రఫలంబులు వెట్టఁ డింత సం

పన్నత నొందెనే ? తన తపశ్చర ణాప్రతిమ ప్రభావముల్. (458)


ఆ. వారిఁ గోరుచున్నవారికి శీతల, వారి నిడుట యెట్టివారికైన

వారితంబు గాని వలసిన ధర్మంబు, వారి యిడఁడు దాహవారి గాఁదు. (459)


చ. అని మనుజేశ్వరుండు మృగయావనరాయత తోయదాహ సం

జనిత దురంతరోషనున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ

జనముల సేయఁ డంచు మృతసర్పము నొక్కటి వింటికోపునన్

బనివడి తెచ్చి వైచె నట బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్. (460)


వ. ఇట్లు వృథా రోషదర్పంబున మునిమూఁపున గతానువైన సర్పంబు నిడి, నరేశ్వరుండు దన పురంబున జనియె. అంత సమీపవర్తులైన మినికుమారులు సూచి శమీకనందనుండైన శృంగికడకుం జని. (461)


క. నర గంధగజ స్యందన, తురగంబుల నేల రాజు తోయాతురుఁడై

పరగ న్నీ జనకునిమెడ, నురగముఁ దగిలించి పోయె నోడక తండ్రీ ! (462)


వ. అని పలికిన సమాన రూప మునికుమార లీలసంగియైన శృంగి శృంగంబులతోడి మూర్తి ధరియించినట విజృంభించి రోషసంరంభంబున నదరిపడి ( బల్యన్నంబుల భుజించి పుష్టంబులగు నరిష్టంబులం బోలె బలిసియు, ద్వారంబులం గాచికొనియుండు సారమేయంబులపగిది దాసభాతులగు క్షత్రియాభాసు లెట్ల బహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులైరి ? అట్టివారి లెట్లు తద్గృహంబుల భాండసహితంబగు నన్నంబు భుజింప నర్హులగుదురు ? తత్కృతంబులైన ద్రోహంబు లెట్లు నిజస్వామిం జెందు నని మఱియు ) నిట్లనియె. (463)


ఉ. ఆడఁడు దన్ను దూషణము, లాశ్రమవాసులఁహాని వైరులం

గూడఁడు, కందమూలములు కూడుగఁ దించు సమాధి చిత్తుఁడై

వీడఁడు లోనిచూడ్కులను, విష్ణుని దక్కఁ బరప్రపంచముం

జూడఁడు మద్గురుండు ఫణిఁ జుట్టఁగనేటికి ? రాచవానికిన్ . (464)


ఉ. పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ, ధనంబు లేమియుం

దేము, నవంచనంబులుగ దీవెన లిచ్చుచు వేసరింపఁగా

రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ జెల్లరే !

పామును, వైవఁగాఁదగునె ? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్ .(465)


క. పుడమిఁగల జనులు వొగడఁగఁ. గుడుతురు గట్టుదురుకాక కువలయపతులై

యడవుల నిడుమలఁ బడియెడి, బడుగుల మెడ నిడఁగ దగునె ? పన్నగశవమున్ .(466)


క. భగవంతుఁడు గోవిందుఁడు, జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ

దగువరులు లేమి దుర్జను, లెగసి మహాధునుల నేఁచెద రకటా ! (467)


క. బాలకులార ! ధరిత్రీ. పాలకు శపియింతు ననుచు బలువిడిని విలో

లాలకుఁడగు మునికుంకర, బాలకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్ . (468)


వ. ఇట్లు రోషించి కౌశికిఇనదికిం జని కలోపస్పర్శనంబు సేసి . (469)


ఉ. ఓడక వింటికోపున మృతోరగముం గొనివచ్చి మాఱు మా

టాడకయున్న మజ్జనకు సంసతలంబునఁ బెట్టి దుర్మద

క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిననైనఁ జచ్చుఁబో

యేడవనాఁడ తక్షక ఫణీంద్ర విషానల హేతిసంహతిన్ . (470)


వ. అని శమీకమహామునికుమారుండైన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుఁ జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండై న తండ్రిం జూచి . (471)


క. ఇయ్యెడ నీ కంఠమునకు, నియ్యురగశవంబు దెచ్చి యిటు చేర్చిన యా

యయ్య నిఁక నేమి సేయుదు ? నెయ్యంబులు లేవు సుమ్ము నపులకుఁ దండ్రీ ! (472)


శా. ప్రారంభంబున వేఁటవచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై

నేరం బేముయు లేదు సర్పశవను న్నేఁడుగ్రుఁడై వైచినాఁ

డీరీతిన్న్ ఫణి క్రమ్మఱన్ బ్రతుకునో ! హంసించునో ! కోఱలన్

రారే ! తాపసులార ! దీనిఁ దివరే ! రక్షింపరే ! మ్రొక్కెదన్ . (473)


వ. అని సర్పంబుఁ దిగిచు నేర్పులేక యెలుంగెత్తి విలపించుచున్న కుమారకు రోదన ధ్వని విని, యాంగిరసుఁడైన శమీకుండు సమాధిఁ జాలించి, మెల్లన గన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు వీక్షించి తీసి పాఱవైచి కుమారకుం జూచి . (474)


క. ఏకీడు నాచరింపము, లోకులకున్ మనము సర్వలోక సములమున్

శోకింపనేల ? పుత్రక ! కాకోదర మేల వచ్చె ? గంఠంబునకున్ . (475)


వ. అని యడిగిన తండ్రికిఁ గిడుకు రాకువచ్చి సర్పంబు వైచుటయుందాను శపించుటయును వినిపించినఁ దండ్రి కొడుకు వలన సంతసింపక యిట్లనియె . (476)


క. బెట్టిదమగు శాపమునకు, దట్టపు ద్రోహంబు గాదు ధరణీకాంతుం

గట్టా ! యేల శపించితి ?, పట్టీ ! తక్షక విషాగ్ని పాలగు మనుచున్. (477)


ఆ. తల్లికడులోన దగ్ధుఁడై క్రమ్మఱఁ, గమలనాభు కరుణవ్ గలిగిఁనాడు

బలిమి గలిగి ప్రజలఁ బాలింపుచున్నాఁడు, దిట్ట వడుగ ! రాజుఁ దిట్టఁ దగునె ?


ఉ. కాపరిలేని గొఱ్ఱియలకై వడిఁ గంటక చోరకోటిచే

నేపఱియున్న దీ భువన మీశుఁడు కృష్ణుఁడు లేమి నిట్టిచో

భూ పరిపాలనంబు సమముద్ధి నితమ్ డొనరింపఁ జెల్లరే !

యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగనేల ? బాలకా ! (479)


సీ. పాపంబు నీ చేతఁ బ్రాపించె మన కింక రాజు నశించిన రాజ్యమణ్దు

బలవంతఁ డగవాఁడు బలహీను పశు దార హయ సువర్ణాదుల వపహరించు

జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు లతిశయిల్లు

వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు

ఆ. నంతమీఁద లోక లర్థ కామంబులఁ , దగిలి సంచరింప ధరణి నెల్ల

వర్ణ సంకరములు వచ్చును మర్కట, సారమేయ కులము మేరఁ బుత్ర ! (480)


ఉ. భారతవంశజుం బరమభాగవతున్ హయమేధయాజి నా

చారపరున్ మహానయ విశారదు రాజకులైకభుఉషణున్

నీరము గోరి నేఁడు మన నేలకువచ్చిన భక్తి నర్థిస

త్కారము శెసి పంపఁ జనుఁ గాక ! శపింపఁగ నీకు ధర్మమే ! (481)


క. భూపతికి నిరపరాధమ, శాపము దా నిచ్చె బుద్ధిచాపలమున మా

పాపఁడు మీఁ డొనరించిన, పాపము దొలఁగించు కృష్ణ ! పరమేశ ! హరీ ! (482)


క. పొడిచినఁ దిట్టినఁ గిట్టినఁ బడుచుందురు గాని పరమ భాగవతులు దా

రొడఁబడరు మాఱు సేయఁగఁ గొడుకా ! విభుఁ డెగ్గుసేయఁ గోరఁడు నీకున్ . (483)


క. చలఁగరు కలఁగరు సాధులు, మిశితములై పరులవలన మేలుం గీడున్

నె;అకొనిననైన నాత్మకు, నొలయవు సుఖ దుఃఖ చయము లుగ్రము లగుచున్.(484)


వ. అని యిట్లు శమీక మహామునీంద్రుండు కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొందుచుండె. (485)


                                                           అధ్యాయము---19


వ. అంత* (శమీక ప్రేషితుం డగు శిష్యుని వలన ) నా మునికుమారకు శాపంబు విని యా యభిమన్యు పుత్రుండు ( కామ క్రోధాది విషయాసక్తుఁడగు ) తనకు ( తక్షక విషాగ్ని ) విర క్తిబీజం బగు ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున. (486)


                                                              "సమాప్తము"