20. ధర్మరాజు పరీక్షిన్మహారాజునకుఁ బట్టంబుఁ గట్టి మహాప్రస్థానంబున కరుగుట
సీ. కలవర్తనంబునఁ గ్రౌర్య హింసాసత్య దంభ కౌటిల్యా ద్యధర్మచయము
పురముల గృహముల భూములఁ దనలోనఁ దలపోసి కరిపురమున
మనుమని రాకవై మనుమని దీవించి సింధుతోయ కణాభిషిక్తుఁ జేసి
యనిరుద్ధ నందనుండైన వజ్రనిఁ దెచ్చె మథురఁ బట్టముగట్టి మమతఁ బాసి
ఆ. కరలఁ దురగములన గంకణాదికముల, మంత్రిజనుల బుధుల మానవతుల
నఖిలమై ధనము నభిమన్యుసుతునకు, నప్పగించి బుద్ధి నాశ్రయించి .(382)
వ. విరక్తండైన ధర్మనందనుండు ప్రాజాపత్య మనియెడి యిష్టి గావించి, యగ్నుల నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును నిర్దశితాశేష్ బంధనుండు నై, సకలేంద్రియంబుల మానసంబున నణంచి, ప్రాణాధీన వృత్తియగు మానసంబును బ్రాణమందుఁ, బ్రాణము నపానమునందు, నుత్సర్గ సహితంబైన యపానము మృత్యువందును, మృత్యువును బంచభూతములకు నైక్యంబైన దేహంబునందును, దేహము గుణత్రయము నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోప హేతువగు నవిద్యను జీవిని యందును, జీవుండైన తన్నునవ్యయంబైన బ్రహ్మ మందును లయింపం జేసి, బహి రంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును నై యున్మత్తపిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున . (383)
క. చిత్తంబున బ్రహ్మము నా, వృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనా
యత్తలు దొల్లి వెలింగెడి, యుత్తర దిశ కేగె నిర్మ లోద్యోగమునన్. (384)
సీ. అంత నాతని తమ్ము లనిన పుత్రాదులు గలిరాకచేఁ బాపకర్మ లగుచుఁ
బరియించు ప్రజల సంచారంబు లీక్షించి యఖిల ధర్మంబుల నాచరించి
వైకుంఠ చరణాబ్జ వర్తత హృదయులై తద్భక్త నిర్మలత్వమును జెంది
విషయ యుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక నిర్ధూత కల్మష నిపుణ మతులు
తే. బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్మ, లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు
ముఖ్య నారాయణ స్థానమునకుఁ జనిరి, విగతరజ మైన యాత్మల విప్రవర్య ! (385)
వ. అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోద దండధరుం డగుటంజేసి నిజాధాకార స్థానంబునకుల జనియె ద్రుపదరాజ పుత్రియు పతులవలన ననపేక్షితయై వాసుదేవునందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె. ఇట్లు, (386)
క. పాండవ కృష్ణుల యానము, పాండురమతి నెవ్వఁడైన బలికిన విన్నన్
ఖండిత భవుఁడై హరిదా, సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా ! (387)
== అధ్యాయము-16 ==
వ. అంత నటం బరీక్షి త్కుమారుండు జాతకర్మవిదులైన భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవతుండై, ధరణీపాలనంబు సేయుచు, నుత్తరుని పుత్రిక నిరాపతియను మత్తకాశినిం బెండ్లియాడి, జనమేజయ ప్రముఖులైన నలువురు కొడుకుల నుత్పాదించి, గంగాతటంబునఁ గృపాచార్యుండు గురువై యుండ, యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షింపుచు, భూరి దక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయకాలంబున గోమిథునంబుఁ దన్నుచుబ్బ శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండు నగు కలిం బట్టి నిగ్రహించె. అని చెప్పిన శౌనకుండు పొరాణికున కిట్లనియె. (388)